Naa Ramanasrma Jeevitham    Chapters   

42 సమరసం

15-7-49 వ తేది ఉదయాన వదినె నేనూ ఏమీ తోచక ఏడున్నరకే ఆశ్రమానికి వెళ్ళాం. భగవా& స్తిమితంగా కూర్చుని వున్నారు. సేవకులలో ఒకరైన సత్యానంద స్వామి తప్ప వేరెవ్వరూ లేరు. నమస్కరించి లేస్తూనే ''ఎట్లా గున్నది'' అన్నది వదినె. ''ఏమీ లేదు. ఆ కట్టులో కొంచెం మంటపుట్టే ఆకులపాలేవో వేసి కట్టారు. ఆ ఘాటుకు శరీరం తట్టుకోలేక అట్లా జరిగింది. వేరే ఏమీ లేదు. అది అప్పుడే తీసివేశారు. ఇవాళ అస లది ఆపుచేస్తారట'' అన్నారు భగవా&.

ఆ నాటినుండే ఘాటైనదేదీ కలపకుండా కట్టుకట్టటం ప్రారంభించాడు తాత . అందువల్ల వణుకు రావటం లేదుగాని జ్వరం వుంటూనే వచ్చింది. పుండు చీముపట్టి వుంటుందనీ, పెన్సిలిన్‌ ఇంజెక్షన్‌లు ఇస్తూ పుండు కడిగి కట్టుకట్టకుంటే బాధ ఎక్కువౌతుందనీ అనంతనారాయణరావూ శంకరరావూ ఇత్యాది డాక్టర్లు భయపడసాగారు. ఈ స్థితిలో ఆకొత్త హాలు తూర్పుద్వారంవద్ద గుమ్మం ఎత్తుగా వుండటం వల్ల భగవా& ఎక్కేందుకూ దిగేందుకూ కష్టమయింది. ''ఆ గడప తీసేస్తే సరిపోతుం''దని డాక్టర్లంటే ''వారంత కష్టపడి కట్టించుకుంటే మన నిమిత్తం చెడగొట్టటం ఎందుకు?'' అని సమ్మతించలేదు భగవా&. ''పోనీ ఉత్తరద్వారాన వెళ్ళవచ్చు'' నంటే ''కూర్చున్న ఆడవారినందరినీ లేవమనాలి. వారి కెందుకా వుపద్రవ''మని అందుకూ ఆమోదించలేదు. ఏతావాతా ఒక్కటి మాత్రం అంగీకరించారు. ఏమంటే, భగవానుకు కొంతకాలం నుండీ రాత్రివేళల లఘశంకకు చాలాసార్లు వెళ్ళవలసి వస్తున్నదట. వెళ్ళినప్పుడల్లా ఈ గడపలు దాటటం కష్టమని సేవకులు గోలపెడితే కొత్త హాలుకు పక్కనే తూర్పువైపుగా కట్టిన మరుగుదొడ్డికి ముందున్న ఆ చిన్నగదిలో పడుకుంటూ వున్నారట భగవాన్‌. ఇప్పుడు మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో గూడా అక్కడే వుండటానికి సమ్మతించారు. దర్శనవేళల్లో మాత్రమే కొత్త హాలులో కూర్చుంటున్నారంతే.

ఈ స్థితిలో భగవా& ఆహారం నిమిత్తం భోజనశాల కన్నూ రావటం కష్టమయింది. ''ఈ మెట్లన్నీ ఎక్కి ఇట్లావస్తే చాలా శ్రమ కలుగుతుంది. సోఫా వద్దకే తెచ్చి పెట్టే ఏర్పాటు చేస్తా'' మని డాక్టర్లూ భక్తులూ ప్రార్థిస్తే ''అందరినీ విడిచిపెట్టి నే నెట్లా తినేదీ? నా నిమిత్తం గదా అంతా వస్తారు?'' అని ఎంతో విచారించి ''ఇప్పుడు గనుక భోజనశాలకు రావటం విడిచిపెట్టానా మరెప్పుడూ రాను సుమా'' అనిన్నీ సెలవిచ్చారట భగవాన్‌. అయినప్పటికీ ఆ మెట్లెక్కే సమయంలో ఆ శరీరం పడే బాధ చూడలేక భక్తులంగా కలిసి కొత్త హాలులోనే శ్రీవారికి భోజనం ఏర్పాటు చేశారు. భోజనశాలలో గంట కొట్టగానే విద్యార్థులలో ఒకడైన కె. కృష్ణమూర్తి (ఇప్పుడు భగవాన్‌ సమాధికి పూజచేసే వాడన్నమాట.) భగవాన్‌ ఉన్న కొత్త హాలుకే భోజనం తెచ్చేవాడు. భగవాన్‌ ఏం తినేవారో ఏం లేదో.

1944 లో శ్రీవారి శరీరానికి పచ్చకామెర్లు వచ్చి నప్పుడు వారం పదిరోజులు వరిపేలాలే ఆహారంగా పుచ్చుకున్నారు. అప్పుడవి తినేందుకు ''భోజనశాలకు వెళ్ళటం ప్రయాస; హాల్లోనే తినవలసిందని'' భక్తులు ప్రార్థిస్తే రెండు రోజులు అట్లా తిన్నారో లేదో ''ఈ తినేది అందరితోపాటు అక్కడే కూర్చుని తింటా'' నని పట్టు పట్టారు భగవాన్‌. ''వరిపేలాలే గదా ఎక్కడ తింటే యేమి? '' అన్నారు భక్తులు. భగవా& సమ్మతించక ''అందుకు మాత్రం చాటెందుకు? చాటుగా ఏం తింటున్నారో అని అనుకునేందుకా? చాలు చాలు'' అని భోజనశాలకే వెళ్ళారు భగవా&. ఈలాంటి సమరసభావ సంపన్నునకు విడిగా పెట్టితే వంట పడుతుందా అని అంతా అనుకున్నారు.

Naa Ramanasrma Jeevitham    Chapters