Naa Ramanasrma Jeevitham    Chapters   

34. ఎట్లాగన్నా పోనీ

17-3-49 తేదీన కుంభాభిషేకమయింది. ఆ మర్నాడే భగవాన్‌ చేతిమీద పుండున్న స్థలంలో ఎక్కువగా గోకటం, తడవటం చూచి మళ్ళీ యేమి మునిగిందో యేమోనని మా వదినె నేనూ అనుకున్నాం. 21 న మా వాళ్ళు పట్నం వెళ్ళిన వెనుక గూడా అంతగా నేను గమనించలేదు. 22 వ తేదీ ఉదయాన నమస్కరించి లేస్తుంటే మళ్ళీ ఎదుక్కొని వచ్చిన గడ్డ నల్లగా నా కంట బడ్డది. ''అయ్యో! మళ్ళీ ఎదిగిందే?'' అన్నాను. వెంకటరత్నం తానూ చూచా నన్నాడు. భగవాన్‌ అదొక విధంగా ''అవును. ఎదిగింది. పట్నంనుంచి పెద్ద డాక్టర్లు వస్తారట. మళ్ళీ కోస్తారో యేమో'' అన్నాడు.

ఆ విధం చూచి నా మనస్సు చివుక్కుమన్నది. ''మళ్ళీ కోత యెందుకు? భగవానే ఏదైనా చెప్పి చేయించుకోరాదా? పచ్చకామెర్లు వచ్చినప్పుడు భగవాన్‌ అష్టాంగహృదయం చూచి చెప్పిన మందుతోనే గదా కడకు నయమైంది.'' అన్నాను. ''ఏమో. డాక్టర్లు ఆపరేషన్‌ ఆపరేషన్‌ అంటారు. ఏం జెప్పేదీ?'' అన్నారు భగవాన్‌. ''ఒకసారి అయింది గదా?'' అన్నాను. ''అవును. అయింది. మళ్ళీ అంతకన్న పెద్దదిగా ఎదుక్కో వచ్చింది. మళ్ళీ కోస్తారేమో'' అన్నారు భగవాన్‌. ''మళ్ళీ అంతకన్న పెద్దదిగా ఎదిగిందే. ఏం లాభం?'' అన్నాను. ''ఊ. ఊ, ఎదిగింది' అన్నారు భగవాన్‌. ''ఛటకా వైద్యం ఏదైనా చేసి చూడరాదా?'' అన్నాను. ''అవును. చేయవచ్చును. కాని వారంతా కోస్తామనే అంటారు. ఏం జేస్తాం?'' అన్నారు భగవా&. ''ఒకసారి మా యింట్లో ఒక పిల్లకు ఇట్లాగే ఒక కురుపుకు ఆపరేషన్‌ చేస్తే మళ్ళీ ఎదిగింది. తిరిగి ఆపరేషనంటే ఇష్టపడక ఆచంట లక్ష్మీపతిగారికి చూపాం. ఆయన అత్తిపాలవత్తి వేయిస్తే తగ్గింది. అట్లాగే ఇదిన్నీ ఏ ఆకులో పాలో వేస్తే తగ్గుతుందేమో చూచి తగ్గకుంటే ఆపరేషన్‌ చేయవచ్చునే. భగవానుకు తెలియని మూలికలు ఏమున్నవి? ఏదో ఒకటి ఉపయోగించి చూడరాదా? ఈ విషయం నే నెందుకు చెప్పడమని ఇంతవరకూ వూరుకున్నాను. మళ్ళీ ఆపరేషన్‌ అంటే భయంగా వున్నదే'' అన్నాను.

భగవా నందుకొని ''అవును, అత్తిపాలువైస్తేమంచిదే, మంచి విషయం ఎవరు చెపితే యేమి? అక్కడికి (ఆఫీసుకు) పోయి చెప్పుకోండి. డాక్టర్లింకా పదిరోజులకు గాని రారాట. ఈ లోపల వేసి చూద్దాం'' అన్నారు. ''ఈ ఛటకాలతో తగ్గుతుందా?'' అన్నారోక సేవకులు. ''తగ్గకేమి. కొండమీద వుండగా అమ్మ ఇటువంటి గడ్డలను ఆకులతో పాలతో ఎందరికో నయం చేసింది.'' అన్నారు భగవాన్‌. నేనుగా ఆఫీసులో అడగటానికి జంకి ముందు డాక్టర్ల నడిగాను. ''ఏమో మీ యిష్టం. ఆ వైద్యాలన్నీ మాకు తెలియవు. వైద్య ముఖతః వేసేట్టుంటే వేయించండి'' అన్నారు వారు. ఆ రోజుల్లో ఆఫీసు వారికి తెలియకుండా భగవానునకు ఏ మందూ వాడరాదన్న నిబంధన వున్నందువల్ల ఆఫీసువారిని అడుగుమని కృష్ణభిక్షువుతో చెప్పి ఇంటికి వచ్చాను.

ఆ భిక్షువు ఆఫీసువారి నడిగితే ''భగవాన్నడి ఎట్లా అనుమతి స్తే అట్లా చేయం'' డన్నారట వారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు కృష్ణభిక్షువు భగవాన్‌తో ఈ విషయం మనవి చేస్తూ వుంటే గి. నరసింగరావు ఏదో ఆయుర్వేద వైద్యులిచ్చిన మందుపట్టీలు తెచ్చి ''ఈ పట్టీలు అంతకంటె బాగా పనిచేస్తవి. వేసి చూద్దాం'' అన్నా రట. భగవాన్‌ ఏదీ వద్దనరు గదా. భిక్షువున్నూ మాట్లాడలేదట. సరే, ఆ పట్టీ వేశారు. ఈ విషయం నాకు తెలియక రెండున్నరకే వెళ్ళాను. భగవాన్‌ నన్ను చూస్తూనే ''నాగమ్మ ఆఫీసులో చెప్పమన్నదనీ, నేను చెప్పాననీ మధ్యాహ్నం కృష్టయ్య వచ్చి చెప్పాడు. ఇంతలోనే నరసింగరావు 'అంతకంటె మా పట్టీలు మంచి' వని తెచ్చి వేశాడు. ఇదుగో చూడండి'' అని పట్టీ చూపారు. ''ఏదైనా సరే. ఆపరేష& లేకుండా తగ్గితే చాలును'' అన్నాను. ''ఊ. ఏమో. చూద్దాం లే'' అన్నారు భగవాన్‌.

పది రోజులకు గాని రారన్న డాక్టర్లు 24-3-49 వ తేది కే వస్తారని 23 వ తేదీన ఉత్తరం వచ్చిందట. భగవాన్‌ నావైపు చూచి ''డాక్టర్లు రేపే వస్తారట. ఏం జేస్తామంటారో యేమో'' అన్నారు. ''ముందు ఆయుర్వేదం చూచి తగ్గకుంటే ఆపరేష& చేయవచ్చును. ఆపరేష& చేస్తే ఆయుర్వేదం చూచేందుకు లేదుగదా. ఛటకాలు కాకుంటే వైద్యముఖతః ఆయుర్వేదం చూడవచ్చును. అన్నయ్యకు వ్రాస్తే లక్ష్మీపతిగారిని తీసుకొని వస్తాడే?'' అన్నాను దీనంగా, ''అదంతా యెందుకు. ఆకులో పాలో వేస్తే చాలును'' అన్నారు భగవాన్‌. ''అవును. అదే నేనూ అంటున్నాను. బగవానుకు తెలియని మూలికలు ఏమున్నవి. ఏదో ఒకటి భగవానే చెప్పి చేయించుకుంటె పోదా? ఆ డాక్టర్లంతా నే చెపితే వింటారా? ఏం జేయను'' అన్నాను. ''పోనీ పది రోజులు మా ముందువేసి చూస్తామని నేనే చెప్పి చూస్తానులే'' అని నన్ను ఓదార్చారు భగవాన్‌.

24 వ తేదీన యస్‌. దొరసామయ్యరూ రాఘవాచారీ మొదలైన డాక్టర్లూ వచ్చి వెళ్ళిపోయారు. వారు వెళ్ళటం చూచి ఏమయిందో నన్న ఆత్రంతో రెండున్నరకే భగవాన్‌ సన్నిధికి వెళ్ళాను. భగవాన్‌ వేసటగా వున్నట్లున్నారు. నన్ను చూస్తూనే ''డాక్టర్లు వచ్చి చూచి ఆపరేష& చేయటానికే నిశ్చియించుకొని వెళ్ళారు. వచ్చే ఆదివారమే కోస్తారట'' అన్నారు భగవాన్‌. నాకు ఏమీ తోచక ''పదిరోజులు మన మందు చూద్దామంటిరే'' అన్నాను. ''అవును. నేను చెప్పాను. నాగమ్మ అత్తిపాలు వేద్దామని అంటున్నది. పదిరోజులు వేసిచూద్దాం. తగ్గకుంటే ఆపరేషన్‌ చేయవచ్చని. ముందు సరేనని ఒప్పుకున్నారు. వెనక ఆఫీసులోకి వెళ్ళి అంతా యోచన చేసి గుంపుగా వచ్చి 'ఆగేందుకు వీల్లేదు. వెంటనే ఆపరేష& చేయాలని సర్వాధికారితో చెప్పాం. వారు ఒప్పుకున్నారు. అందువల్ల చేస్తాం' అన్నారు. నేనేం జేసేది? పోనీ ఎట్లా గన్నా పోనీ, అంతా కలసి తీర్మానించుకొనివచ్చి చేస్తామంటే మనమేం చేయగలం? చెప్చపి చూచాం, కాదన్నారు. సరే వారి యిష్టం. ఎట్లాగన్నా కానీ'' అన్నారు భగవాన్‌.

ఆ మాటలు విన్నకొద్దీ నా భయం అధికమయింది. ''నేనే చెప్పి చూద్దామంటే ఎవరూ వినరనే గదా భగవాన్‌తో మనవి చేసుకున్నది. భగవానే ఏదైనా వేసుకొని నయం చేసుకుంటానంటే పోయేది గదా. ఆపరేషనుకు ఎందుకు ఒప్పుకున్నారు? భగవా?& సమ్మతించకుంటే వాళ్ళేం జేస్తారు? ఎట్లాగన్నా పోనీ అంటే ఎట్లా? ఆఫీసుకు వెళ్ళి చెపుదునా పోనీ?'' అంటూ కంట నీరు నించాను. భగవాన్‌ జాలిగా చూస్తూ ''ఇప్పుడు మనం చెపితే వాళ్ళు ఒప్పుకోరు గాని ఈ సారికి పోనీ, మళ్ళీ వస్తే మనం చూచుకుందాం'' అన్నారు ఛట్టున. ఈసారి మొదలంటా తీసివేస్తాం. ఇక మళ్ళీ రాదని పెద్ద డాక్టర్లంటూవుంటే ''మళ్ళీ వస్తేమనం చూచుకుందాం'' అన్నమాట ఆ నోట వచ్చిందేమా? అని అంతా ఆందోళన పడ్డామేగాని భగవదాజ్ఞ నతిక్రమించి ఆఫీసులో ఎవరమూ చెప్పలేకపోయాం.

Naa Ramanasrma Jeevitham    Chapters