Naa Ramanasrma Jeevitham    Chapters   

25. జొన్న పేలాలు

1940 నుంచీ నేను జొన్ననూకతోనే అన్నం వండి తింటున్నాను. భగవన్‌ సన్నిధికి వచ్చిన వెనుక ఒకటి రెండు సార్లు ఆ జొన్నలే పేలాలుగా వేయించి మధ్యాహ్నం రెండు గంటలవేళ భగవాన్‌ సన్నిధికి తీసుకొని వెళ్ళితే ఆ పేలాలలో ఉప్పూ, కారమూ కలిపించి, తాము తీసుకొని అందరికీ పంచి పెట్టించారు. భగవాన్‌, భాగానే వున్నది గదా అని అప్పుడప్పుడు తీసుకొని వెళ్ళుతూ వచ్చాను, భగవానది గమనించి "ఇదంతా ఎందుకు పెట్టుకుంటావు? ఇది మహాసముద్రం. ఎన్ని తెచ్చినా చాలవు. ఏదో ఒకసారైతే సరేగాని అదేపనా?" అని చల్లగా మందలించారు. సరే పోనిమ్మని కొంతకాలం తీసుకొని వెళ్ళనే లేదు. ఒక సంవత్సరానంతరం కొత్తగా జొన్నలు వచ్చినవి. అవి ఒకనాటి మధ్యాహ్నం పేలాలు వేయించి చాటలో పోస్తూ వుంటే అది భగవన్‌ విశ్రాంతి సమయం గనుక వెంటరత్నం నా బసకు వచ్చాడు. (అప్పుడాతను భగవాన్‌ సేవలో వున్నాడు.) మల్లెపూవులవలె ఉన్న ఆ పేలాలు అతను చూచి "అబ్బ! ఎంత బాగున్నవి. భగవన్‌ కివి ఎంతో యిష్టం" అన్నాడు "నిజమే. తీసుకొని వస్తామనే వేయిస్తున్నాను. భగవాన్‌ కోపగించుకుంటా రేమోనని శంకగా వున్నది"! అన్నాను. "తెచ్చి చాలా రోజులైంది గదా? ఫరావాలేదు లెండి" అన్నా డతను. నీవు కొంచెం తీసుకోవయ్యా అంటే, "అబ్బ! భగవాన్‌ తీసుకుంటెగాని నేను తీసుకోను" అన్నాడు నాకూ నోట్లో వేసుకొనేందుకు బుద్ధి పుట్టలేదు. ఒక పెద్ద చేతి క్యారియర్‌లో ఆ వేలాలు నింపుకొని రెండు గంటలకే భగవాన్‌ సన్నిద్ధికి వెళ్ళి అవి సమర్పించాను. భగవాన్‌ నవ్వుతూ "మళ్ళీ తెచ్చావూ?" అన్నారు. నే నెంతో స్వతంత్రంగా "తెచ్చి సంవత్సరం దాటింది, జొన్నలు కొత్తగా వచ్చినవి. వేయించి చాటలో పోస్తే మల్లెపూవులవలె వున్నవి. భగవాన్‌ వద్దకు తీసుకొని వెళ్ళితే బాగుండునని అనుకుంటూ వుండగా వెంకటరత్నం వచ్చాడు. 'ఇవి భగవాన్‌ కెంతో ఇష్టమమ్మా' అన్నాడు, ఇద్దరికీ నోట్లో వేసుకునేందుకు బుద్ధి పుట్టలేదు. భగవాన్‌ ఏమన్నా సరేనని తెచ్చాను" అన్నాను. "ఓహో! ఇద్దరూ కూడబలుక్కున్నారన్నమాట" అన్నారు భగవాన్‌. "ఆమె ముందే తీసుకొని రావాలని అనుకుంటున్నది" అన్నాడు రత్నం. నేనూ ఆ మాట అందుకొని "దీనికయ్యే ఖర్చు రెండణాలు గూడా లేదు. సంవత్సరాని కొక్కసారి ఈ మాత్రం సేవకు అవకాశం ఇవ్వకుంటే ఎల్లా?" అని ప్రార్థనా పూర్వకంగా అన్నాను. భగవాన్‌ హృదయం వెన్నవలెకరగి పోయింది. "అది సరి, దాని కేమి? ఇవి నాకు చాలా ఇష్టమే, నీవు కష్టపడటం ఎందుకని అన్నానే గాని ఇష్టంలేక కాదు, కొండమీద వుండగా అన్ని రకాల ధాన్యాలూ తిన్నా నేను. ఇవి చాలా రుచికరమూ, ఆరోగ్యకరమూను. నవనాగరకత గల వారంతా అయ్యో! స్వామికి వేమిటి? లడ్డూ జిలేబీ తేవాలనుకుంటారు గాని వీటికున్న రుచి వాటి కుండదు" అని సెలవిచ్చి ఆ పేలాలలో వేరుసెనగ పప్పూ; ఉప్పూ కారమూ వేసి, నెయ్యితో కలిపించి అందరికీ పంచిపెట్టించి తామున్నూ కుచేలుని అటుకులు తిన్న కృష్ణుని వలె ఎంతో ఆప్యాయంగా తిన్నారు భగవాన్‌.

మరొకసారి ఇదే విధంగా పేలాలు తీసుకొని వెళ్ళితే "ఎప్పుడూ ఇక్కడ ఉన్నట్లుంటావే. ఇవన్నీ చేసే దెప్పుడు?" అన్నారు భ##గేవాన్‌, "మధ్యాహ్నం భోజనం అయిన వెనుక" అన్నా నేను. భగవాన్‌ వెంకటరత్నం వైపు చూస్తూ "ప్రొద్దునా ఏడింటికే వస్తుంది గదా? వంట ఎప్పుడు చేసుకుంటుంది?" అన్నారు. "తెల్లవారుజామున మూడింటికి లేస్తుంది. ఏడింటి లోపల అన్నీ చేసేసి వస్తుంది" అన్నాడు వెంకటతర్నం. "సరిపోయింది. మరి వ్రాత వనో?" అన్నారు భగవాన్‌. నే నందుకొని "అదా! సాయంత్రం ఇక్కడి నుంచి వెళ్ళిన వెనుక అల్పాహారం ఏదో తీసుకొని పడుకుంటాను. ఒక్క నిద్రపోతే చాలును. పదకొండు, పన్నెండు మధ్యన కొట్టినట్లు మెలకువ వస్తుంది. ఒంటిగల వరకూ వ్రాసుకొని మళ్ళీ కొంచెం వ్రాలితే ఒక్క కునుకు పట్టి మూడింటికి మెలకువ వస్తుంది. ఆ నిద్ర చాలదూ?" అన్నాను. మా కాంపౌండులోనే వుంటున్న సూరమ్మగారు వెంటనే "ఏమో ఎప్పుడు చూచినా లైటు వెలుగుతునే వుంటుంది. ఏం నిద్రపోతుందో ఏమో" నన్నది భగవాన్‌ "ఊ-ఊ" అంటూ తలవూపి మౌనం వహించారు.

Naa Ramanasrma Jeevitham    Chapters