Naa Ramanasrma Jeevitham    Chapters   

24. భగవాన్‌ సంకల్ప బలం

నేనే లేచి వెళ్ళితే ఏదో స్తోత్రం వచ్చిందని ఇచ్చారు భగవా&. అది చూచి కాపీ చేశాను. ఆ వెనుక సూరమ్మ గారు ''భగవాన్‌ ఏం సెలవిస్తారో ఏమో నని నీవు ఎదురు చూడాలి గాని నీ కొఱకు వా రెదురు చూడటం ఏమిటమ్మా. ఇది అపచారం గాదా?'' అని తల్లిలాగా మందలించింది. నాటినుండీ చాలా జాగ్రత్తగా వుంటూ వచ్చాను. ఆ వెనుక కొద్దిరోజులకే భగవా& కోతుల విషయమైన ప్రసంగవశంగా ''అదుగో చూడండి. ఒక్కకోతి ఇల్లా కన్ను గీటిందంటే వెంటనే కోతులన్నీ వస్తవి. అందుకే వేదాంత పరిభాషలో లక్ష్యదృష్టికి వానరదృష్టి ఉపమానంగా చెప్తారు. గురువు కన్ను గీటగానే శిష్యులు విషయం గ్రహించాలని, అట్లా చేయకుంటే ఫలం దొరుకుతుందా?'' అని సెలవిచ్చారు. పై విషయం భగవన్ముఖతః విన్న వెనుక ఇంకా జాగ్రతత్తగా వుంటూ వచ్చాను.

భగవా& సన్నిధిలో ఎవరైనా భక్తుల చరిత్రలను గుఱించీ పురాణగాథలను గుఱించీ ప్రసంగిస్తే శ్రీవారు ఆయా పుస్తకాలు తీసి చూచే వారు. అందులో విషాద ఘట్టాలు వచ్చినప్పుడు వారి శరీరం తన్మయమై కళ్ళవెంట నీరుకారి దృష్టికి అవరోధం కలిగించేది. భగవా నప్పుడు ఆ పుస్తకం సోఫామీద పడేసి ''ఇదంతా కల్పన అని తెలుసును. అయినా శరీరం ఆడుతుందే. దాని చేష్ట మానదు గదా.'' అని సెలవిచ్చే వారు. 1949 మార్చిలో ఒకనాటి సాయంత్రం రెండున్నర గంటలవేళ నేను వెళ్ళేసరికి భగవా& మళయాళ భాషలో వున్న రామాయణం చదువుకుంటూ వున్నారు. నమస్కరించి లేచి ఆ పుస్తకం ఏమిటో నని నిదానించి చూచాను. భగవానది గ్రహించి ఉత్సాహంతో ''మళయాళ భాషలో వున్న అధ్యాత్మరామాయణం, ఇదివరకు ఆంజనేయులు రావణునితో దూత వాక్యాలుగా చెప్పిన మాటలు నీకు చెప్పానే అవి దీనిలోనివే. ఇప్పుడు నేను చదవబోయే ఘట్టం తారావిలాపం'' అని సెలవిచ్చి ఆ ఘట్టం తీయగానే కుంభాభిషేకానికి వచ్చి ఇక్కడే వున్న గుఱ్ఱం సుబ్బరామయ్యగారు వచ్చి భగవా& సమీపంలో కూర్చున్నారు. భగవా& సుబ్బరామయ్యగారికి అదంతా చదివి అర్థం చెపుతూ వుంటె శ్రీవారి నేత్రాలు నీళ్ళతో నిండి కంఠం రుద్ధమైంది. ఆ విషాదమంతా ఎదుట పొడగట్టినట్లే వున్నది ఆ దృశ్యం చూచి ''భగవా& తారగానే అయిపోయినారే?'' అన్నా నేను. భగవా& కొంచెం తమాయించుకొని ''ఏం జేస్తాం. ఎదుట ఏది వుంటె అది మనమే అయిపోతాం. ప్రత్యేక వ్యక్తిత్వం వుంటేగదా? అంతా మనమేనాయే'' అని చిరునవ్వుతో సెలవిచ్చారు. ఎంత గంభీరమైన అర్థం ఆ మాటల్లో వున్నది? అని తరువాత మే మనుకున్నాం.

నేను లేఖలు వ్రాయుటకు ఆరంభించిన వెనుక ఉషః కాలంలో భగవాన్‌ సన్నిధిని జరిగే ఉపనిషత్పారాయణకు సాధారణంగా వెళ్ళేదాన్ని కాదు. ఉదయం ఏడు ఏడున్నర లోపల స్నానపానాదులు, వంట వగైరా సనులన్నీ ముగించు కొని, భగవాన్‌ అల్పాహారానంతరం కొండకు వెళ్ళి మళ్ళీ దిగి రాక ముందే, నేను ఆశ్రమం చేరుకొని శ్రీవారి రాకకు ఎదురు చూస్తూ భోజనశాల గడపలలో కూర్చునే దాన్ని. భగవాన్‌ కొండ దిగి వస్తూవుంటె అంతరిక్షంనుండి ఆదిశివుడే భూమికి దిగి వస్తున్నట్లుండేది. హాల్లో ఏ ప్రసంగాలు జరుగునో ఏమోనని సాధారణంగా ఆవేళ తప్పేదాన్ని కాదు. ఒక్కొక్కసారి చిత్రంగా, రాత్రి నేను బసకు వెళ్ళిన వెనుక ఎవరైనా స్తోత్రం వ్రాసి యిచ్చినా, తామే ఏదైనా పద్యం వ్రాసినా అది నా కివ్వాలని వేకువన వేదపారాయణకు ముందే సమీప వర్తులతో భగవాన్‌ ''ఇది నాగమ్మకు చూపాలయ్యా, ఇప్పుడు వస్తుందో రాదో. జాగ్రత్తగా వుంచండి'' అని అనే వారట. సరిగా ఆ వేళ##కే నా కెందుకో ఇవాల వేదపారాయణ విని వచ్చి వంట చేసుకుందాం అని తోచి ఆశ్రమానికి వెళ్ళటం జరిగేది. భవాన్‌ చూస్తూనే ''అరే! ఇది నీ కివ్వాలని ఇప్పుడే వీరితో అంటున్నాను. వెంటనే వచ్చావే! ని కెట్లా తెలసింది?'' అనే వారు. ''భగవానుకు సంకల్పం వస్తే రాకుండా ఎట్లా వుంటాను? ఎందుకో ఇవాళ వేదపారాయణ వినాలని బుద్ధి పుట్టింది వచ్చాను. అంతే'' అనే దాన్ని. భగవాన్‌ ''సరి సరి'' అంటూ ఆ కాగితా లేవో ఇచ్చేవారు. ఈ అనుభవం చాలామంది భక్తులకు అనేక సందర్భాలలో, అనేక రీతులుగా సంభవించినట్లు, భగవాన్‌ లోగడ సెలవిచ్చారు. ''అయ్యా, స్వామి కిది బాగా అనుభవమనిన్నీ, వారి మనస్సు ఎంత స్వచ్ఛంగా వుండేదనిన్ని'' భగవాన్‌ సెలవిచ్చిన మాటల వివరం లేఖలు ప్రథమ భాగంలో వ్రాసి వున్నాను.

1947 నవంబరు డిశంబరు ఆ ప్రాంతంలో మా చిన్నన్న డి. యస్‌. శాస్త్రిగారూ, వారి భార్యా సెలవు రోజుల్లో మద్రాసు నుంచి వచ్చి కొన్నాళ్ళున్నారు ఆశ్రమంలో. మా అన్న ఒకనాడు స్నేహితులతో కలసి స్కందాశ్రమానికి వెళ్లుతుంటే, వదినెగూడా వస్తానన్నది. ఆమె శరీరం చాలా స్థూలమూ బలహీనమూను. అందువల్ల ''నీవు రాలేవు వద్దు'' అని తానే వెళ్ళివచ్చి, ఆమె నా వద్ద వుంటానంటే వుంచి, ఆ రాత్రికే మద్రాసు వెళ్ళారు. ఆమెకు శరీరం ఎంత స్థూలమూ, బలహీనమూనో మనస్సు అంత సూక్ష్మమూ, బలమూ కలదిగా ఉండటంవల్ల ఎల్లాగైనా స్కందాశ్రమం చూచి రావాలని నాతో అన్నది. ''భగవాన్‌తో మనవి చేసిన వెనుక చూద్దాం'' అని ఆమెకు చెప్పి మరుదినం ఇద్దరం భగవాన్‌ సన్నిధికి వెళ్ళి ముందువరసగా కూర్చున్నాం. భగవా& ''అన్నయ్య వెళ్ళారా?'' అని అడిగారు. ''వెళ్ళారు. వదినె వుంటానన్నది. మళ్ళీ వచ్చి తీసుకోవెళ్ళుతానని వుంచి వెళ్ళారు'' అన్నాను. ''అది సరి. దాని కేమి? మంచి పనేగదా?'' అన్నారు భగవాన్‌. అదే సందని ''వదినెకు స్కందాశ్రమం చూడాలని వున్నది. నిన్న అన్నయ్యతో వస్తానంటె నీవు రాలేవు. వద్దని తీసుకొని వెళ్ళలేదు. ఆమెకు చూడాలని వున్నది'' అన్నా నేను. వదినె దీనంగా భగవాన్‌ వైపు చూస్తూ వూరుకున్నది. భగవాన్‌ హృదయం కరిగి, నన్నుద్దేశించి ''మీరు తీసుకోవెళ్ళితే సరిపోతుంది. వారేదో తొందరలో వెళ్ళి వుంటారు. దానికేమి? రేపు వెళ్ళవచ్చును'' అన్నారు. ''నేనే తీసుకోవెళ్ళా లనుకుంటున్నాను. ఆమె ఎక్కలే దేమోనని కొంచెం జంకుగా వున్నది'' అన్నాను. భగవాన్‌ చిరునవ్వుతో ''సరిపోయింది. నేను ఇంతకంటె ముసలి వాళ్ళను ఎందరినో ఉచ్చమల (కొండ శిఖరాలకే) తీసుకొని వెళ్ళాను. స్కందాశ్రమానికి తీసుకోవెళ్ళుట కెందుకు జంకు? 80 ఏండ్లు దాటిన ముసలమ్మలనే తీసుకొని వెళ్ళాను. ఈమెను తీసుకోవెళ్ళేందుకు కేమి? ప్రొద్దెక్కకుండా బయలుదేరి టవును వైపు మెట్లవద్దకు బండిలో వెళ్ళి, అక్కడినుంచి మెల్లిగా అన్నీ చూచుకుంటూ ఎక్కి చల్లబడేవరకు పైన వుండి, ఆ వెనుక మెల్లిగా అటే దిగివస్తే తీరిపోతుంది. చేతులో ఆహారం ఏదైనా తీసుకొని వెళ్ళితే సరి'' అని సెలవిచ్చారు. మా వదినె ముఖం సంతోషంతో నిండిపోయింది. ఆమెకు బలమూ, నాకు ధైర్యమూ ఒకేసారి వచ్చినవి.

ఆ సాయంత్రమే బండీ వగైరా ఏర్పాట్లన్నీ చేసుకొని, పండ్లూ, మరమరాలూ, సెనగపప్పూ ఇత్యాది ఆహార పదార్థాలన్నీ సేకరించుకొని, మరుదినం అల్పాహారం ముగించుకొని భగవాన్‌ సెలవుపొంది, బయలుదేరాం. చిన్న స్వాములున్నూ ఎంతో దయతో ఇడ్డెనలు పొట్లం కట్టించి, ఇద్దరు పాఠశాల విద్యార్థులను మాకు తోడిచ్చి పంపారు. అప్పుడు టి.యన్‌. వెంకటరామన్‌ టవునులో కాపురంలో వుండేవాడు. మే మిల్లా వెడుతున్నామని అక్కడ తెలిసి ఇంచుమించు మా వదినెవలెనే అశక్తురాలగు బి. లక్ష్మమ్మ, ఆమెతో మరిద్దరూ బయలుదేరి మెట్లవద్దనే మమ్మల్ని కలుసుకున్నారు. మేమంతా మెల్లిగా మెట్లెక్కుతూ విరూపాక్షగుహ మొదలైనవన్నీ చూచుకొని స్కందాశ్రమం చేరేసరికి పది దాటింది. పగలంతా మేము అక్కడే వుంటామని భగవా& హాల్లో అంటూవుంటె విని ఆశ్రమం వైపునుంచి ఎక్కి మరికొందరు భక్తులు వచ్చారు. అంతా పది పదిహేను మంది గుంపుగా కూడాం. ఒకరు చిత్రాన్నం, ఒకరు ఉఫ్మా, ఒకరు మజ్జిగ తెచ్చారు. పదకొండు దాటిన వెనుక అందరం ఆహారం తీసుకొని, మజ్జిగ త్రాగి విశ్రమించాం. అంతా సుఖంగా చేరామని భగవా& తో మనవి చేసేందుకుగాను విద్యార్థులను ముందే ఆశ్రమానికి పంపాం. ఇక అక్కడి మా సంతోషం చెప్పగలమా? మాటలూ, పాటలూ, పద్యాలూ ఒకటే కోలాహలం. ఇక్కడ మా కోలాహలం ఇల్లాగుంటే, అక్కడ హాల్లో విద్యార్థులవల్ల భగవాన్‌ ఈ సంగతంతా విని ''అక్కడ భ##లే సరదాగా ఉన్నదటయ్యా. అంతా గుంపుగా చేరారట. మనకు ఎక్కడకు పోయేందుకు లేదు. ఏం జేస్తాం? వాళ్ళు నాలుగైతే గాని బయలుదేరరు'' అని సెలవిచ్చారట.

మే మక్కడ మూడు గంటవలరకూ పాటలూ, పద్యాలతో గడిపి బొరుగులు వగైరాలన్నీ తింటూ నాలుగింటికే బయలుదేరాం. చల్లగా దిగి, లక్ష్మినిగూడా మా బండిలో ఎక్కించుకొని ఆశ్రమం చేరేసరికి వేదపారాయణ ముగిసింది ''నకర్మణా'' చెపుతూ వున్నారు. అది ముగించి వారంతా వెళ్ళగానే మేమూ వెళ్ళి నమస్కరించాం. భగవాన్‌ చూచి ''అంతా దిగి వచ్చారా? చాలా గుంపు చేరారటగదూ?'' అంటూ లక్ష్మిని చూచి ''లక్ష్మీ! నీవూ వెళ్ళావటగదూ? మంచిదయింది. సావకాశంగా వున్నా రక్కడ'' అని అక్కడి సమాచారమంతా విచారించి నాతో ''వదినె కేమీ కష్టం కలుగ లేదుగదా?'' అన్నారు భగవాన్‌. ''ఏమీ లేదు. నిదానంగా పక్కనే వుండి ఎక్కించాను. సుఖంగానే వున్నది'' అన్నాను. ''అది సరి. మంచిదయింది'' అంటూ ఇంటికి వెళ్ళేందుకు మాకు సెలవిచ్చారు భగవాన్‌. విన్నవారూ, కన్నవారూ భగవాన్‌ అనుగ్రహబలం వల్లనే ఆమె యెక్కిందిగాని మరొకటి కాదని తలపోశారు. మా అన్న ఇదంతా విని ఎంతో ఆశ్చర్యపడ్డారు.

ఆ వెనుక 1949 లో వదినె గిరిప్రదక్షిణం చేస్తా నంటే, మా అన్న అడ్డు చెప్పక భగవాన్‌తో ముందే మనవి చేసి, ఒకనాటి ఉదయాన అయిదు గంటలకే బయలు దేరి, కల్లూరి గోపాలరావుగారి కుటుంబం, ఎ.ఆర్‌. నారాయణరావుగారి కుటుంబంతో సహా తాము దంపతులిద్దరూ, మరికొందరు భక్తులూ కలిసి ప్రదక్షిణానికి వెళ్ళారు. ఎక్కడ వదినె నడవలేనంటె అక్కడే కారు ఎక్కించవచ్చునని డ్రైవరుతో కారున్నూ తీసుకొని వెళ్ళారు.

భగవాన్‌ అనుగ్రహ బలంవల్ల ఆమె కారు ఎక్కనే లేదట. అన్నయ్య వున్నారుగదా అని నేను వెళ్ళలేదు. భగవాన్‌ ప్రక్కనున్న వాళ్ళతో "వాళ్ళు ఈపాటికి గౌతమాశ్రమం వద్ద వుండవచ్చు. అక్కడికి చేరి వుంటారు, ఇక్కడికి చేరి వుంటారు" అని అంటూవుండగానే పదింటికి వాళ్ళంతా తిరిగి వచ్చారు. విశ్వనాథబ్రహ్మచారి ఆ సాయంకాలం నాకు కనుపించి "మి వదినే స్కందాశ్రమం వెళ్ళ రావటమే కాకుండా గిరిప్రదక్షిణమున్నూచేసి వచ్చిందంటే 'మూకం కరోతి వాచాలం, పంగుం లంఘయతే గిరిం' అన్న వాక్యం భగవాన్‌ సన్నిధిలో సార్థకమైనదన్నమాటే నమ్మా" అని ఆనందకరంగా మాట్లాడారు. "నిజమే, అదంతా శ్రీవారి అనుగ్రహమే" అన్నా నేను. ఇలాంటి సంగటనలు భగవాన్‌ సన్నిధిలో ఎన్నో జరిగినవి. అవి మహిమలుగా చెప్పుకొనేవి కావనీ, భగవంతునకూ, భక్తులకూ; గురువునకూ, శిష్యులకూ గల ఆంతరంగికమైన అనుబంధాన్ని సూచించే చిహ్నాలనీ నా వూహ.

Naa Ramanasrma Jeevitham    Chapters