Naa Ramanasrma Jeevitham    Chapters   

15. లేఖల ముద్రణ యత్నం

శివరామశాస్త్రిగారి రెండవ ఉత్తరం కాపీ చేసి అన్నయ్యకు పంపాను గదా. అది చూచి అన్నయ్య ఎంతో ఉత్సాహంతో ''ఇదిన్నీ అన్నయ్యకు పంపు'' అని భగవాన్‌ సెలవిచ్చిన మాటయే భగవదాజ్ఞగా భావించి వెంటనే ''ముద్రణ కయ్యే ఖర్చులన్నీ భరిస్తాననీ, లేఖలు పుస్తక రూపంగా ప్రకటించవలసిందనీ'' ఆశ్రమానికి వ్రాశారు. ఆశ్రమం వారనుమతించిన వెనుక దానికైన వ్యయప్రయాస లన్నీ భరించి, శ్రీభగవానుని వ్యయవర్ష జయంతి కుసుమార్చన గా 1947 లో ప్రథమ భాగంలో ఆశ్రమ ప్రకటనగా వెలువడు నట్లు చేశారు. ఆ ప్రథమ భాగంలో ప్రదక్షిణతత్వం మొదలైన వెన్నో విషయాలు నున్నద్దేశించి ఉపదేశించిన వేవున్నవి. కారణాంతరాలవల్ల అనుకున్న రీతిగా ఆ ప్రథమ భాగం వ్యయవర్ష జయంతికి ప్రెస్సువారు అందించలేక పోయినారు. ఈ లోపల భగవా& సన్నిధిలో కొన్ని విచిత్ర సంఘటనలు జరిగినవి.

15. విచిత్ర సంఘటనలు

1946 సెప్టెంబరు ఒకటవ తేదీన జరిగిన భగవా& స్వర్ణోత్సవ వైభవమంతా లేఖల ప్రథమ భాగంలో వ్రాసే వున్నాను. అప్పుడు విల్లింగ్‌ టన్‌ సినిమా ప్రొప్రయిటరూ, రమణ భక్తుడూ అయిన ఫ్రేంజీ భగవానుకు సినిమా చూపాలని మూడు ఫిల్ములు ఇక్కడకు తీసుకొని వచ్చాడు. ఇక్కడ నివాసంగా ఉంటున్న తలియార్‌ ఖాను మొదలైన భక్తులు కొంద రందుకు సహకారులుగా నిలిచారు. ఉత్సవానంతరము వరుసగా మూడు రోజులు డైనింగు (భోజన) హాలులో రాత్రి భోజనానంతరం ఆ ఫిల్ములు చూపే ఏర్పాట్లు జరిగినవి. ఆశ్రమమంతా ఒకటే కోలాహలం. నన్నూ రమ్మన్నారు. నాకు సినిమాలకు పోనన్న నియమం వున్నది. రా నన్నాను. ''భగవానే చూడగా నీకేమి?'' అన్నారు. ''భగవాన్‌ స్థితి వేరు, నా స్థితి వేరు. వారు సర్వం బ్రహ్మ మయంగా చూచే మహానుభావులు. వారి దృష్టి అఖండ గంగా ప్రవాహం. ఆ ప్రవాహంలో ఏది పడ్డా కొట్టుకొని పోతుంది. వారు సిద్ధపురుషులు గనుక విధి నిషేధములు వారి కేమీ లేవు గాని సాధకుల కిది సరిపడదు. రాను.'' అన్నాను. నా వంటి సాధకులు కొందరు వెళ్ళకున్నా మొత్తంమీద ఆ ఫిల్ములు మూడూ జనమంతా చూశారు. ఆ మూడు రోజుల కోలాహలంలో మన కేమీ ప్రమేయం లేనందువల్ల సావకాశంగా స్వర్ణోత్సవ వైభవమంతా మూడు లేఖలుగా వ్రాసి ముగించాను. ఆ సందడి తగ్గగానే భగవాన్‌ సన్నిధిలో అవి చదివి సరిచేసుకుంటూ వుంటే భగవాన్‌ సమీపంలో వుండే రాజగోపాలయ్యరు విని ''సినిమా విషయం రాయలేదేమి?'' అన్నాడు. ''ఉత్సవానంతరం జరిగింది గదా అది?'' అన్నా నేను. భగవాన్‌ ఏమీ మాట్లాడలేదు. రాజగోపాలయ్యరు ఆ సాయంత్రం నా బసకు వచ్చి ''ఆ స్వరోత్సవ వైభవం లేఖల్లో సినిమా విషయం గూడా వ్రాస్తే బాగుండునని భగవాన్‌ గూడా అంటున్నా'' రన్నాడు. ఋష్యాశ్రమంలో సినిమాలేమా? అని గుంజాటనగా ఉన్న నాకు అది ఘనంగా వ్రాయాలంటె కలం సాగలేదు. భగవాన్‌ గూడా వ్రాస్తే బాగుండు నంటున్నారన్నారే వారు. లోకమే సినిమా రంగంగా చూచే మహానుభావులకు ఇది ఒక ఘనమా? ఒకవేళ భగవదాజ్ఞ యే అయితే వ్రాయక తప్పదుగదా? ఏం జేయాలి అన్న యోచనలు కలతపెట్టినవి. సద్విషయంగా ఎల్లా సమర్థించాలో భగవాన్నే అడిగి తెలుసుకుందామని మరుదినం ఉదయాన త్వరగా వెళ్ళి రాజగోపాల్‌ లేని సమయంలో శ్రీవారిని సమీపించి నిలిచాను. ''ఏమీ? అన్నట్లు చూచారు భగవా&. ''స్వర్ణోత్సవ వైభవంలో సినిమాల విషయం గూడా చేర్చాలంటె అది సద్విషయంగా సమర్థించాలి గదా? నాకేమీ కుదరటం లేదే'' అన్నాను. ''పోనీ కుదరకుంటె మానేసెయ్యి.'' అన్నారు భగవాన్‌. ''అది కాదు. ఎలా వ్రాసి సమర్థించాలో భగవాన్‌ కొంచెం సూచిస్తె'' అన్నాను. ''నాకేం తెలుస్తుంది. కుదిరితే వ్రాయి; లేకుంటె లేదు'' అన్నారు భగవాన్‌. ''దాన్లో చేరిస్తె బాగుంటుందని భగవాన్‌ సెలవిచ్చారట గదూ?'' అన్నాను. ''సరిపోయింది. అది చేరిస్తె బాగుండునని వా రన్నారు. అయితే పోయి చెప్పుకో మన్నాను. అంతే. నేనేమీ చేర్చాలని అనలేదే'' అన్నారు భగవాన్‌. నా గుండె కుదుట పడ్డది. అంతేగదా? భగవదాజ్ఞ కాదుగదా? అంటూ నా స్థానానికి వచ్చేశాను. కడకు సినిమా విషయం చేర్చకుండానే నవోదయకు పంపాం. భగవానుని నే నడగటం, వారు బదులీయటం అప్పటికి మా యిద్దరిలోనే వుండిపోయింది.

ఆ వెనుక విల్లింగ్టను వారూ, ఇక్కడి వారిలో కొందరూ కలిసి 15 రోజులు వరుసగా ఆశ్రమంలో సినిమా చూపే ఏర్పాటుతో ఫిల్ములు తెచ్చారు. భగవాన్‌ అందుకు సమ్మతించినట్లే సమీపవర్తిగావున్న భక్తుని ప్రచారం. నాకా పట్టరాని సంకటం. ఆశ్రమంలో సినిమా లేమీ అన్న చింతనమే కాకుండా భగవా నందుకు ఇష్టపడ్డారన్న ప్రచారం ప్రాణసంకటంగా తోచింది. వీళ్ళేదో పదేపదే అడిగితే సరే నని అన్నా రేమోగాని ఇష్టపడి వుండరని నా నమ్మిక. భగవాన్‌ సమ్మతించారనే చిన్నస్వామికి చెప్పారు. వారేం జేస్తారు పాపం? సర్వాధికారి సమ్మతించారని భగవానుకున్నూ చెప్పి వుంటారు. ఈ రహస్య భేదనం ఎల్లాగవుతుందా అని నా ఆరాటం. సాధకులగు భక్తులు కొందరితో సంప్రదించాను. వారూ సంకట పడ్డారు. భగవాన్‌ సన్నిధిలో మొరపెట్టండన్నాను. ''సమయం చూచి మనవిచేద్దాం'' అన్నారు వారు.

రెండు రోజులు సినిమా చూపేసరికి ఆశ్రమమంతా అల్లకల్లోలమయింది. టవునులోని అల్లరిమూకను లోపలికి రానీయలేదని వాళ్ళు డైనింగు (భోజన)హాలు పైకి రాళ్ళు రువ్వారు. అంతటితో ఆశ్రమ నిర్వాహకులతో కొందరు ఈ సినిమాలు మాన్పించక తప్పదని సర్వాధికారితో చెప్పారు. వారు ఫిల్మువారితో ఇక ఆపవలసిందంటె, 15 ఫిల్ములు మోసి తెచ్చామే. మీ సమ్మతితోనే తెచ్చాము గదా? చూపుతామంటారు వారు; కూడదంటారు వీరు. ఉభయులకూ వివాదం బయలుదేరింది. నాల్గవనాటి మధ్యాహ్నం 3 గంటల వేళ భగవాన్‌ హాలుకు ఉత్తర వైపునవున్న మైదానంలో ఈ వివాదం జరుగుతుంటే రాజగోపాలయ్యరు అదంతా విని వచ్చి భగవాన్‌తో మనవి చేస్తూ వుండగా మురగనా రందు కొని ''అవును. ఋష్యాశ్రమంలో సినిమాలంటె హాస్యాస్పదంగా వుండదా? భగవాన్‌ కంటె ఏది చూచినా బాధకం లేదు గాని సాధకుల కిది బాధకం గాదా? ఆపకుంటె వీలు లేదు'' అన్నారు. భగవా నందుకొని ''ఆ-అదే-అదే. అసలు ముందే ఈ సినిమా లెందుకఱ్ఱా. వద్దు. అన్నా నేను. 'కాదు, భగవానుకు చూపాలి' అని తెచ్చారు. సరే, పోనీ, ఏదో సరదా పడుతున్నారు గదా అని చూస్తే మళ్ళీ 15 రోజుల కవి తెస్తామన్నారు. వద్దయ్యా! ఎందుకీ గొడవంతాను అన్నాను. 'మా కందరికీ చూడాలని వున్నది. సర్వాధికారితో చెప్పాము. వారు సమ్మతించారు. తెస్తాం' అన్నారు. అయితే మీ యిష్టం అన్నాను. ఒకసారి చెపితే వింటే గదూ? చూడండి ఇప్పుడు ఎంత గొడవవుతోందో?'' అన్నారు భగవాన్‌.

నా కదె సందయింది. మురగనారు నుద్దేశించి ''అన్నా! చూచారా? ఇందుకే స్వర్ణోత్సవ వైభవం లేఖల్లో సినిమాల విషయం వ్రాయుమంటె నా కలం నడవనే లేదు.'' అన్నాను. వెంటనే భగవా నందుకొని మురగనారుతో ''అవునవును. అప్పుడు దాన్ని వ్రాయుమని వీరంతా తొందరించారు. 'ఇది సద్విషయంగా సమర్థించి వ్రాయాలే? ఎల్లాగో తెలియటం లేదే?' అని న న్నడిగింది. నీ కిష్టమైతే వ్రాయి, లేకుంటే మానేసెయ్యి అన్నా నేను. ఇది యేమి ఘనతరకార్యమని కడకది వ్రాయనే లేదు'' అన్నారు. ఆ భగవద్వాణివల్ల అన్ని రహస్యాలు భేదింపబడ్డవి గదా! రహస్యభేదన మయిందని నా కెంతో సంతోషం కలిగింది. సర్వాధికారికి ఈ సమాచారమంతా తెలిసి వెంటనే సినిమాలు ఆపుచేయవలసిందని గట్టిగా శాసించారు. మర్నాడే ఆశ్రమమంతా ప్రశాంతమయింది.

ఇంచుమించు ఆ రోజుల్లోనే ఆంధ్రదేశంనుంచి ఒక యువతి వచ్చి కొన్నాళ్ళున్న దిక్కడ. హిందీ బాగా మాట్లాడేది. చక్కని కంఠం. మధురంగా పాడేది. అందరూ భగవాన్‌ మీద పాటలూ, పద్యాలూ పాడుతూ వుంటే ఆమెకూ సరదా కలిగి, అంధ్రదేశంలో ఆరితేరిన పెద్దలూ, పండితులూ వ్రాసిన తత్త్వాలూ, యడ్ల రామదాసుగారి కీర్తనలూ, ఇంకా ఏవో అవీ, యివీ రామ అన్న చోట రమణ అని పెట్టి భగవాన్‌ సన్నిధిలో పాడుతూ వచ్చింది. మంచి అర్థపుష్టిగల కీర్తన లగుటవల్లనూ, కంఠమాధుర్యంవల్ల నూ అందరికీ ఆనందంగా వుండేది. రామ అన్న చోట రమణ అని పాడుతున్నట్లు భగవాన్‌ గమనిస్తునే వున్నారు. నాకూ తెలిసినా ఏదో భక్తిగా పాడుతున్నది మంచిదే గదా అని వింటూ వూరుకున్నాను. సయ్యదు మొదలైన మహమ్మదీయ భక్తులూ పార్శీవారు పాటలు విని భగవాన్‌ మీద వ్రాసినవే నను కొని ''ఎవరు వ్రాసినవమ్మా ఈ పాటలు?'' అని ఆమె నడిగితే ''నేనే వ్రాశా'' నని అన్న దట. వారంతా చాలా సంతోషించి అవి ఇంగ్లీషులో తర్జుమా చేయించుకుటాం. వ్రాసి యివ్వమంటె ఆమె వ్రాసి యిచ్చిందట. వారు ఆ కాగితం శ్రీవారికి చూపి ''ఇవి ఆమె వ్రాసిన పాటలు. ఇంగ్లీషులోకి తర్జుమా చేయించగోర్తాము'' అని విజ్ఞాపన చేసుకున్నారు. భగవా& ఏమీ విమర్శించక మునగాల వెంకట్రామయ్యగారు రాగానేవారికి చూపి ''అదుగో, వారు తర్జుమా చేయగలరు. వారి నడగండి'' అని చెప్పి, వెంకట్రామయ్యగారితో ''వీ రేదో తర్జుమా కావాలంటున్నారు. చూడండి'' అని చెప్పి కాగితా లిచ్చి పలక్కుండా వూరుకున్నారు.

ఆ వెంకట్రామయ్యగారికి రెండు మూడు తరానుండీ తమిళ దేశంలోనే నివాసం కావటంవల్ల తెలుగులో పాండిత్యం అంతగా లేదు. శ్లేష పదాలతో నిండివున్న ఈ పాటలు ఇంగ్లీషులో అనువదించాలంటె సామాన్యమా? అందువల్ల కొన్ని పదాలకు భగవాన్నే అర్థం అడుగుతూ వారు తికమిక పడుతూ వుండటం చూచి భగవాన్‌ సేవకులలో ఒకరు వెంకట్రామయ్యగారి అనుయాయులలో ఒకరిని చూచి ''ఇవన్నీ భగవానునే అడిగి శ్రమ కలిగించకపోతే, నాగమ్మ నడగరాదా?'' అన్నారు. భగవాన్‌ బయటికి వెళ్ళినసమయంలో వారు నన్ను సమీపించి ఆ పాటల అర్థం కొంచెం తేలికగా చెప్పగలవా? అన్నారు. ''దానికేమి చెప్ప వచ్చును గాని అస లవి భగవానుని గుఱించి వ్రాసిన వని తర్జుమా చేస్తున్నారా? లేక ఏవైనా సరే అనా?'' అన్నాను. ''భగవానుని గుఱించి వ్రాసినవనే ఇంత గొడవాను'' అన్నారు వారు. ''అవిపెద్ద లెవరో వ్రాసిన తత్త్వాలూ, యడ్ల రామదాసుగారి కీర్తనలూను. రామ అన్నచోట రమణ అని పాడుతున్నది. అంతే''అన్నాను.''అల్లాగా? సరి సరి.''అంటూ వారు చక్కాపోయి భగవాన్‌ రాగానే పై సమాచార మంతా చెప్పారు. భగవాన్‌ చిరునవ్వుతో ''ఓహో! అల్లాగా! ఆ అర్థగాంభీర్యం చూచి ఎవరో పెద్దలు వ్రాసి వుంటారని అప్పుడే అనుకున్నాను. రామ అన్న చోట రమణ అని పెట్టిందన్నమాట. పోనీలెండయ్యా, రామ అన్నా రమణ అన్నా ఒకటే గదా? గణం గూడా సరిపోయింది. (రామ-సూర్య గణం రమణ సగణం. ఇదీ సూర్యగణమే గనుక సరిపోయిందన్నమాట.) ఏం? తర్జుమా చేస్తారా?''అన్నారు. వారంతా పని తప్పిందే చాలునని పలక్కుండా వూరుకున్నారు.

భగవాన్‌ వారిని చూచి ''ఇదుగో! పూర్వం పెరుమాళ్ళుస్వామి కూడా ఇల్లాగే చేశారు. నేను కొండ దిగివచ్చిన కొత్తలో వారు టవున్‌లో వుండి నిత్యం మధ్యాహ్నం రెండు గంటలకు తినేందు కేదో తీసుకొని ఇక్కడికి వచ్చే వారు. ఒకనాడు ఒక కాగితం మీద ఒక పద్యం వ్రాసి తెచ్చారు. 'మీరేనా వ్రాసింది?' అంటె 'ఔ' నన్నారు. పద్యం చూస్తే చాలా బాగున్నది. అప్పుడు మురగనారిక్కడ వ్రాత పని చూచేవారు. ఆ కాగితం వారి కిచ్చి నోటు బుక్కులో కాపీ చేయండి అన్నాను. వారు చాలా బాగున్నదని ప్రశంసించి కాపీ చేశారు. మళ్ళీ నాల్గు రోజులయిన వెనుక మరొక పద్యం తెచ్చారు. అదీ అంతా ప్రశంసించారు. ఇంకేం? పెరుమాళ్ళుస్వామి పొంగిపోయి నాల్గు రోజుల కొకసారిగా ఒక్కొక్క పద్యం వ్రాసి తెచ్చేవారు, ఎప్పుడైనా ఆలస్యం చేస్తే 'మళ్ళీ ఏమీ వ్రాయలేదా?'' నే నడిగేదాన్ని. 'ఆ. యేమీ వ్రాయలేదు' అని మళ్ళీ ఒకటి తెచ్చే వారు. ఇల్లా తొమ్మిది పద్యాలు వచ్చినవి. పదవ పద్యం తెచ్చి నప్పుడు నాకు ఈ పద్యా లెక్కడో చూచి నట్లనిపించి మురగనారుతో రామలింగస్వామి వ్రాసిన తిరువరుళ్‌ పావు తీసుకోరండన్నాను. వా రది తెస్తే విప్పి చూడగానే రామపదికం కంట పడ్డది. ఈ పది పద్యాలూ ఆ రామపదికమే. రామ అన్నచోట రమణ అని పెట్టి కొంచెం పంక్తులు మార్చి కాపీ చేసి తెచ్చారన్న మాట. మురగనారు కదంతా చూపాను. వారంతటితో కాపీ చేయటంమాని హాల్లో అందరికి ఈ విషయం చెపితే అంతా నవ్వారు. పెరుమాళ్ళుస్వామి చిన్నబుచ్చుకొని కూర్చున్నారు పాపం. ఏం జేస్తారు? ఇక్కడికి రాగానే అందరికీ ఏదో వ్రాయాలనీ, పాడాలనీ బుద్ధి పుడుతుంది. కవిత్వం తెలిసిన వారు ఏదో వ్రాస్తారు. తెలియని వారు ఇదే విధంగా రామ అన్నచోట రమణ అని పెట్టి వ్రాస్తారు. తప్పే మున్నదయ్యా? రామ, రమణ అంతా ఒకటే గదా? అని సెలవిచ్చారు భగవా&.

1947 జనవరిలో అచ్చయి వచ్చిన తిరుచ్చుళితమిళ్‌ పురాణానికి త్యాగి అనే పత్రికలో సమీక్ష ప్రకటిస్తూ తిరుచ్చుళి అన్తాదిలోని వెణ్పా పద్యాలు మూడు అందులో వ్రాసి అర్థం వివరించటం. అది నేను చదవాలని తీసుకున్నప్పుడు భగవానుకూ నాకూ జరిగిన ప్రసంగం, ఆ సందర్భంలో నేను శ్రీవారిని తెలుగులో వేణ్పా వ్రాయుమని ప్రార్థించటం, ఎల్లాగో నా ప్రార్థన ననుసరించి భగవా& ''ఏకాత్మ పంచకం'' వ్రాయటం జరిగింది. ఆ పద్యాలు వ్రాయుడని నేను ప్రార్థించి నప్పుడే భగవా& ''మీ వాళ్ళు తప్పులున్నవి. దిద్దా లంటారు. నే నెందుకు వ్రాయటం?'' అని చాలా సార్లంటే, నేను దిద్దనీయను. ఋషివాక్కు దిద్దరాదని చెపుతాను అని నేను చాలా దూరం ప్రార్థిస్తే ఎట్లాగో వ్రాశారు భగవా&. 1947 ఫిబ్రవరిలో నన్నమాట.

ఆ పద్యాలు చూపగానే సరిగా లేవనీ, దిద్దాలనీ ఇక్కడున్న తెలుగువారిలో ఒక రిద్దరు నాతో అన్నారు. నేనందుకు ఏ మాత్రం సమ్మతించక వేలూరి శివరామశాస్త్రిగారికి ఈ సమాచారం జాబులో వ్రాస్తూ ఆ పద్యాలున్నూ వ్రాసి పంపాను. వారు జవాబిస్తూ ''ఋషివాక్కు వేదమే. దానిని దిద్దరాదు. పదచ్ఛందాదు లెప్పుడూ వారిని పరివేష్టించే వుంటవి గనుక తప్పనేది రానే రాదు. అదేగాక -

తనలో తనువుండ తాను జడమౌ

తనువందున్నట్లు తలచు మనుజుడు

చిత్రములో నున్నది చిత్రమున

కాధారవస్త్రమని యెంచువాడు.

అనే పదాలను ప్రయోగించి వ్రాసిన మహానుభావులు వారు. అది తమిళ్‌ ఛందస్సు ననుసరించి వ్రాసినది గాని తెలుగు ననుసరించి వ్రాసినది కాదు గదా? ఆ ఛందస్సు గూడా తెలుగులో వారినే వ్రాయుమని ప్రార్థించుట మంచిదిగాని దిద్దుట సరికాదు'' అని వ్రాశారు. ఆ వుత్తరం చూపినా ఇక్కడున్న వారికి నచ్చలేదు. భగవాన్‌ దగ్గరకు వెళ్ళి ''ఇక్కడ ఈ సవరణ కావాలి, అక్కడ ఆ పదం మారిస్తే బాగుంటుంది. ఇది జాతీయంకాదు'' అని వీ రడిగితే ''సరే మీ యిష్టం'' అన్నారట భగవాన్‌. సాయంత్రం నేను వెళ్ళగానే ''అదుగో నన్ను వ్రాయుమన్నావే. దిద్దాలంటున్నారు మీ వాళ్లు. ఇందుకే గదా నేను వ్రాయననేది?'' అన్నారు భగవాన్‌. నా కెంతో కష్టం తోచింది. వద్దంటే వీళ్ళువినరు. భగవాన్‌ ఒప్పుకున్నారంటారు పైగా. ఇక లాభం లేదని అట్టే జనం లేనప్పుడు శ్రీవారిని సమీపించి ''నే నెంత చెప్పినా వాళ్ళు వినటం లేదే? ఎల్లా'' గన్నాను. ''పోనీ దిద్దితే నీకేమి?'' అన్నారు భగవాన్‌, అది నన్ను పరీక్షించుటకేనని గ్రహించి ''నే నందుకు సమ్మతించను. నాకా ఇక్కడ సపో ర్టెవ్వరూ లేరు. ఎల్లాగైనా దిద్దుబాట్లు లేకుండా వచ్చేలాగున భగవాన్‌ అనుగ్రహించాలి'' అని ప్రార్థించాను.

వాళ్ళు దిద్దుబాట్లతోనే అచ్చుకు పంపారు. ఆ ప్రూఫు వచ్చేసరికి చింతా దీక్షితులుగారూ, గుఱ్ఱం సుబ్బరామయ్య గారూ ఇంకా అయిదారుగురు ఆంధ్రులు హాల్లో సమావేశ మైనారు. ఆ నాడు నే నెందుకో ఇంట్లోనే వుండిపోయినాను. భగవాన్‌ ఆప్రూఫు ఆ ఆంధ్రుల ముందుచి ''వారు దిద్దాలని దిద్ది పంపారు. నాగమ్మ దిద్దరా దంటుంది. ఇదిగో ప్రూఫు వచ్చింది. మీ యిష్టం. ఏం చేసుకుంటారో''నని వారికిచ్చారు. వారంతా ఏకగ్రీవంగా ''భగవాన్‌ వ్రాసింది దిద్దరా'' దని తీర్మానించి భగవాన్‌ వ్రాసిన ఒరిజనలు చూచి ప్రూఫు సరిచేసి పంపారు. కడకు నా కోర్కె ననుసరించి భగవాన్‌ కృపవల్ల దిద్దుబాట్లు లేకుండానే అచ్చయి వచ్చింది.

ఆ వెనుక శివరామశాస్త్రిగారు సూచించినట్లుగా ఆ ఛందస్సు తెలుగులో మార్చి మా భాషకొక నూతన మైన అలంకారమును ప్రసాదించవలసిందని నేను ప్రార్థించగా భగవాన్‌ చిరునవ్వుతో ''నాయన (గణపతి శాస్త్రి) వుండగా సంస్కృతంలో వేణ్పా వ్రాయాలని ప్రయత్నించారు. కాని కుదరలేదు. తెలుగులో నరసింగరావూ వ్రాయాలని చూచాడు. అదీ సరిగా రాలేదు. మనమే వ్రాసి ఉండవచ్చును. ఏమో ఎందుకని ఊరుకున్నాను. నీ పట్టుదలవల్ల ఇదంతా వచ్చింది'' అన్నారు భగవాన్‌. ''అలాగే ఛందస్సు గూడా కావా'' లన్నాను. భగవాన్‌ దయామూర్తి గనుక ఛందస్సు వ్రాసి యిచ్చారు. అది దిగువన పొందుపరుస్తున్నాను.

Naa Ramanasrma Jeevitham    Chapters