Sri suktha Rahasyardha pradeepika    Chapters   

శ్రీః

శ్రీగణశ శారదాభ్యాంనమః

అభిమతోక్తి.

సరసిజనిలయే సరోజహస్తే

ధవళతరాంశుకగంధమాల్యశోభే |

భగవతి హారివల్లభే మనోజ్ఞే

త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్‌ ||

శ్రీ వ్యాసభగవానునిచే వేదము నాల్గుగా విభజింపఁబడియె. అందు యజుస్సునఁ గర్మప్రయోగరూపమంత్రము లును, ఋక్సామాధర్వములందు స్తుతిరూప మంత్రములును విశేషించి కలవు. మహాసౌర శ్రీసూక్త పురుష సూక్తాది స్తుతిరూప మంత్రములు ఋగ్వేదమందలివే.

వేదము స్వరప్రధానము, స్వరాపరాధరహితముగ నర్ధ జ్ఞానముతో నధ్యయనము చేసినపుడా వేదమంత్రములు ఫలప్రదములు, ఇహపరసుఖములకై మనుజుఁడేమి చేయవలయునో దాని వేదము విధించుచున్నదైనను దాని యర్థజ్ఞానము మివుల నావశ్యకము.

వేదార్థము నెఱుంగుటకుఁ బరికరముగా యాస్కముని రచిత నిఘంటువు నాధారము చేసికొనియే శ్రీ విద్యారణ్య మహీధరాచార్యాదులు భాష్యములు వ్రాసిరి.

''అలౌకికోపాయబోధకత్వం వేదత్వం'' లౌకికము గాని వస్తువును దెలుపు నుపాయములను దెలియఁజెప్పుటే వేదము నకు వేదత్వము. విద్‌ ధాతుజన్యము వేదము. తొల్లి బ్రహ్మ వలన జ్ఞానరూపముగానే ఋషులకు గోచరింప వారా జ్ఞానమునే తమ భాషలో లోకమునఁ బ్రకటించిరని పెద్దల యభిప్రాయము.

వేదము కర్మజ్ఞాన కాండములను బోధించును. కర్మ యజ్ఞము జ్ఞానయజ్ఞము అని దేవపూజ ద్వివిధము. వాని వివరణమునే తాంత్రిక భాషలో బహిర్యాగము, అంతర్యాగము ననిరి.

వేదభాష్యకారులు చాలమట్టు కర్మయజ్ఞ పరముగానే వ్యాఖ్యానించిరి. శ్రీ విద్యారణ్యులు శాక్తదీక్షాపరులును జిచ్ఛక్త్యుపాసనపరులయ్యు వేదభాష్యమును గర్మపరముగఁ జేయుచుఁ బలుతావుల జ్ఞానయజ్ఞ పరకమైన యర్థములను సూచించిరి.

అనేకము లుపనిషత్తులు పాసన బోధకములే; తద్వివరణములే; సాధకు లుపాస్తిబలముగలిగి, ప్రాణాయామ పరిశ్రమము చేసి భావసిద్ధి నొందియున్నచో వేద పురాణభాగ ముల కనేకములకు జ్ఞానపరసమన్వయము చేసికొనఁగలరు. సిద్ధుల నొందగలరు. కృష్ణ యజస్సునందలి ''ఇషేత్వోర్జేత్వా'' - మొదలు ''యమానస్య పశూన్పాహి'' యను దానితో నంతమగు ననువాదమునకుఁ గర్మపరముగాను జ్ఞానపరము గాను శ్రీవిద్యారణ్యులు వ్రాసిన భాష్యతాత్పర్యముల నరసి నపు డది మనకుఁ దెలియును.

ఇపుడు ఆయుర్వేదోపాధ్యాయ, వైద్యవాచస్పతీత్యా ద్యుపాధియుతులును, విద్వత్కవులును, శ్రీసౌందర్యలహరీ, దేవీ పంచస్తవీ, మహాసౌరమంత్రపాఠ జీవానందన నాటకాద్యనేక గ్రంథానువక్తలును, బహుగ్రథకర్తలును, శ్రీ శ్రియానంద నాథేతిదీక్షానామధరులు నగు బ్రహ్మశ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మగారు శ్రీ సూక్తమునకుఁ దామువ్రాసిన ప్రకటరహస్యా ర్థములుగల గ్రంథమును నాకుఁ బంపిరి. కడముట్ట జదివితిని.

ఈ మంత్రములకు శ్రీ విద్యారణ్య పృథ్వీధరాచార్యాదులు భాష్యములువ్రాసిరైన బాహ్యయాగపరమును, స్తుతి ప్రార్థనరూపమునైన యర్థమునే వ్రాయుచు నాడాడ జ్ఞానపరార్థమును సూచిచి విడిచిరి.

ఈ మంత్రముల రహస్యార్థము రహోయాగాభ్యాసము గల వారలకే కాని సామాన్యులకుఁ దెలియదు. శ్రీ మహా సౌరమంత్రపాఠమున కాంధ్ర పద్యానువాదముచేసిన శ్రీ శర్మ గారు ఇపుడీ శ్రీసూక్తఋక్కులకుఁ గర్మయజ్ఞ పరముగఁ బ్రకటార్థమును, జ్ఞానయజ్ఞ పరముగ రహస్యార్థమును దమ బుద్ధికుశలతచే స్వానుభవసిద్ధవిషయములను బలుతావుల ననే కార్థములతో సమకూర్చి గద్యముగా వివరించి యాంధ్రలోక మునకును అందు ముఖ్యముగా శ్రీవిద్యోపాసకులకు నందించు టానందావహమును మహోపకారకము నైయున్నది. ఆంతరో పాసనము జ్ఞానయజ్ఞము నన నెట్టిదో యెఱుఁగక కేవల బాహ్యార్చనముతోనే యుపాసనాపరుల మనుకొను వారల కీ గ్రంథము చేయూఁతనిడి తరణోపాయ దర్శకమనుట స్తవముకాదు ఇమ్మాట వీరిందుఁ బొందుపఱచిన ''శ్రద్ధాళుపాఠకులకు నివేదనము'' అను నుపోద్ఘాత వాక్యములను బూర్తిగాఁ జదివెడి వారికి సువిదతమగును.

మన శర్మగారి యధ్యాపకత్వము, కవితాసక్తి, ఆయుర్వేద పాండితి, ఆధ్యాత్మిక దృష్టి, శ్రీవిద్యాశిక్షణము, పూర్ణాభిషిక్త తపోమూలక సాహంభావసిద్ధి, ఔదార్యోపకారాది గుణగణ విశేషములను గూర్చి, వీ రనువదించిన ''మహాసౌరమంత్ర పాఠానువాదమును'' నా చేసిన యనుశీలనమున విపులముగా వివరించితిని గాన నిందది పునరుక్తియగునని విడిచి, నాకుఁ దోచినంతగా నీ గ్రంథమునందలి విశేషములను గొన్నింటిని వ్రాయుచున్నాఁడ.

వీరు చేసిన శ్రీసూక్త శబ్దనిర్వచనమే వీరి సునిశిత విమర్శబుద్ధిని అనుభవసిద్ధిని సామర్థ్యమును దెలుపును.

ఇందు వీరి సంధ్యావందన, శ్రీసూక్త, సౌభాగ్యవిద్యా హృదయ సమన్వయము పండితోపాసకుల హృదయము నాకర్షింపక పోదు.

శ్రీసూక్త మంత్రప్రకటార్థము సాధారణముగ సాహితీ పరులకు సుఖగోచరమే. రహస్యార్థవివరణమున వ్యక్తమగు వీరి కౌశలము నెన్న, వీరెన్నాళ్ళనుండియో యుపాసనప్రక్రియ మంత్రార్థమననముతోఁ బ్రాణాయామాభ్యాసముతో, షట్చక్ర చిచ్ఛక్త్యుపాసనానుభవసిద్ధితో సాగించుచున్నటులు తోఁచును. గానఁ బరోపాసన కాంక్షగల సాధకలోకమున కీ గ్రంథము బహూపకారమనుట సత్యదూరముకాదు.

వీరి పుణ్యపరిపాకముతో శ్రీ గురుకటాక్షము సంపూర్ణ ప్రసారము గల్గుటనే యిట్టి యనుభవసిద్ధి యయ్యెను. వీరి వయస్సు సం|| 67 లు. అయిన వీరి కాయదార్ఢ్యము ముదా వహము. వీరి శాంభవ దీక్షాదాతలు శ్రీశ్రీ విద్యానంద నాథాపరనాములు బ్రహ్మశ్రీ లక్ష్మీదత్తద్వివేదిగారు. శిష్యుని కంటె రెండేండ్లు చిన్న. ''వృద్ధాఃశిష్యా గురుర్యువా'' యను శ్రీదక్షిణాస్యస్తుతిని దలఁపించుచున్నారు. శ్రీ శర్మగారు స్వగురువులను గృతిరత్నమైన శ్రీదేవీపంచస్తవికిఁ బతిగాఁజేసి యవర్ణ తాసిద్ధి నొందిరి. అందలి ''కృతిసమర్పణము'' అను భాగమును జదివినచో నీ గురుశిష్యుల తత్త్వము కొంత మన కవగతమగును. శ్రీశర్మగారు శ్రీవిద్యయందిట్టి యుత్తీర్ణత ననతి కాలములో నొందఁగలిగిన గౌరవమంతయుఁ దపోధనులగు వారి గురువులదే.

ఇందు ''హిరణ్యవర్ణాం హరిణీం'' అను ప్రథమ ఋగవతారికావివరణమే చాల నాధారభూతమై యున్నది.

''జాతవేదోమ ఆవహ'' అనుచోటి వీరి వివరణ సమర్థనము సమంజసము. శ్రీసూక్తము నచ్చుపొత్తములందును బెక్కింట వ్రాతప్రతులందును బెక్కండ్ర స్వాధ్యాయపరుల ముఖమునను ''జాతవేదోమమావహ'' యను పాఠము సైతము గనఁబడును వినఁబడును. మే ఆవహ=మ ఆవహ=నా కొఱకుఁ బిలువుము. మమ+ఆవహ=నాకుఁ బిలువుము. అను రెండును నంగీకృతములే. అర్షములం దెన్నింటనో, కావ్యములదెన్నింటనో చతుర్ధ్యర్థమున షష్ఠీ ప్రయోగము లున్నది.

శ్రీ శర్మగారీచోట నింతటితోఁ దృప్తి నొందక ''మమావహ'' పాఠ్యవ్యవహారమునకుఁ జక్కని గతి చింతించిరి. ప్రతి ఋక్కునందును, శ్రీ-సా-మా-ఈ మున్నగు లక్ష్మీబీజము గాన వచ్చుచున్నది గాన నీ ప్రథమ మంత్రమునందును ''మ'' యను రమాబీజము ద్వితీయాంతముగాఁ జేర్చి ''మమ్‌+ఆవహ'' మమావహ యనుటయే యట్టి పాఠమునకుఁ గారణ మని సమర్థించుట కాదనరానిది.

మూడవదాన ''రథమధ్యాం-హస్తినాద ప్రబోధినీం'' అనువాని రహస్యార్థముం జూచినపుడు వీరి నాదోపాసనాను భవమును గుండలిన్యుపాసనానుభవమును దేటపడకుండవు.

ఇటులే వీరు 5, 6, 10, 12 మంత్రములందు సమర్థించిన గుప్తార్థములును, బలుతావుల వీరిచ్చిన నానార్థములును హృదయంగమములు సంభావనీయములు నను నిమ్మాటలతో నేనాఁగి పాఠకుల సద్విమర్శకే యిఁక విడుచుచున్నాను.

''ఫలస్తుతిరూప విశేషజ్ఞానము'' అనుచోట, బాహ్యపూజ నిషిద్ధమును, దాదాత్మ్యానుసంధానదూరమునను శ్రీశర్మ గారి మాటలు, లోకమున బహుళముగా నంగీకృతమై యాచరణమందున్న శ్రీచక్రరూపప్రతీకోపాసనమందును, గర్మ యజ్ఞము నెడను దృణీకారభావమును జూపుచు భేదబుద్ధి జనకములని బహిర్యాగరతులు నొచ్చుకొనఁబనిలేదు. ఏలన, ఈ గ్రంథరచనోద్దేశము, సాధకులు పరోపాసనాభిముఖులై బ్రహ్మభావసిద్ధి నొందవలయుననియే గాన ''బాహ్యపూజా ప్రకర్తవ్యా గురువాక్యానుసారతః | అంతర్యాగాత్మికాపూజా సర్వపూజోత్తమా మతా | బహిఃపూజావిధాతవ్యా యావద్‌ జ్ఞానం న జాయతే||'' యనెడి వామకేశ్వర తంత్రాది వాక్యములను బట్టి, జ్ఞానోత్పత్తియై, రహస్యార్థవివరణమందలి, యుత్కృష్టాభ్యాససిద్ధియు, నధికారసిద్ధియు నైనప్పటిమాటగాఁ బరోపాసనకుఁ బ్రోత్సహించు సత్యార్థమే కాని వేఱొండుకాడు. ఏలన వీరి మొదటి ''నివేదన'' మందే, సూక్ష్యోపానమం దాఱితేఱినపుడు - మొదలు - ఇదియే హేతువు'' అన్నంత వఱకైన వాక్యములందు బహిరంతర్యాగములు రెండును గర్తవ్యములే యని వ్రాసిన మాటలే నాయూహమున కుపబలములు. గాన సాధక పుంగవులు భేదభావమునొందక సంపూర్ణాధికారలాభసిద్ధిదృష్టితో శ్రీసూక్తరహస్యార్థముల నెఱింగి దహరోపాస్తిమార్గమును గ్రహింతురు కాక.

శ్రీ శర్మగారు తమ మహాసౌరపాఠానువాదమందువలె నీ మంత్రములను స్వరచిహ్నములతో నచ్చొత్తించి తుదను జేర్పించుటయు, ఫలస్తుతి రూపములగు ''ఆనందఃకర్దమశ్చైవే'' త్యాది శ్లోకములకును దెనుఁగువ్యాఖ్య వ్రాసియుండిన నెంతో యుపకారము.

శ్రీవారిట్లే శ్రీదేవీపారమ్యమహిమ బోధకములును, ఆంతరోపాసన మార్గదర్శకములును నగు గ్రంథముల ననువదించియుఁ దమ ''అమ్మతో ముచ్చటలు'' వలె స్వతంత్రరచన చేసియు లోకమం దాసక్తికత పెంపొందించి దాము తరించి యితరులఁ దరింపఁజేయను శ్రీపరదేవత మన గ్రంథకర్త గారికిఁ బూర్ణాయురారోగ్యైశ్వర్యాదుల నిడి తోడై పెనుచుఁగాత మని యీ జగదంబను బ్రార్థించుచున్నాఁడను.

''లోకాస్సమస్తాస్సుఖినోభవంతు'' ఓం తత్సత్‌.

అరసవెల్లి. ఇట్లు విద్యాభాస్కర,

17-2-53. ఇప్పిలి వేంకటరామశర్మ.

-*-

Sri suktha Rahasyardha pradeepika    Chapters