Sri suktha Rahasyardha pradeepika    Chapters   

శ్రీ మాత్రేనమః.

ఈం హ్రీం నమః

ఉపాసనా రహస్యము

పంచాయతనో పాసనమని మనముచేయు నారాధనము నందు వివిధనామములతో నొప్పు శివవిష్ణ్వాదుల పూజయు, వివిధ దేవతోపాసనముగాక యేకేశ్వరోపాసనమే. ఆ యీశ్వరునే 'ఇస్లాం' మతస్థులు 'అల్లాహ్‌' అనియు, క్రైస్తవులు 'జుహోవా' యనియుఁ బేర్కొని యారాధించుచున్నారు. తఱచి చూచినచో భగవంతుని పారమ్యమహిమాదులను దెల్పు నామములును రూపములును ఉపాసనా సౌకర్యార్ధము కల్పింపఁబడినవే. ఇది సిద్ధాంతము.

శక్తిశక్తి మంతుల కభేదమన్నది మఱియొక సిద్ధాంతము. ఈ లోకమున సర్వప్రపంచమూలములైన రెండు వస్తువులే ముఖ్యములనియు, అవె బ్రహ్మము మాయ యను పేళ్ళ ననియుఁ దక్కినదంతయు వాని మాఱురూపే యనియుఁ జెప్పుచోటఁదగవులేదు. 'మాయాంతు ప్రకృతిం విద్యాన్మాయినంతు మహేశ్వరమ్‌! తయోర్విభూతి లేశోవై జగదేత్‌ చ్చరాచరమ్‌||' (శ్వేత-శ్రుతి). మాయయే ప్రకృతి, అనఁగా బ్రహ్మశక్తి. అది కలవాఁడే మాయి, అనఁగా శక్తిమంతుఁడు. అన్నింటిని మీఱిన (సర్వమతీత్య లలతీతి లలితా) యమానుషమైన యన్నిఁటనున్న యీరెండిటి సర్వలలిత సామర్థ్య మందలి రవ్వంతయే యీ స్థావర జంగమ రూపమంతయు నగుచున్నది. శక్తియ శక్తిమంతుఁడునని రెండు శక్తులుగాఁ జెప్పఁబడుచున్నవి. ఆ శక్తిమంతుని శక్తులే యీ జగద్రూపము. మాయ యను పేరుగల యీ శక్తియే మూలప్రకృతి. సత్త్వ-రజ-స్తమస్సు లనెడి దాని గుణముల (అవస్థల) యందు హెచ్చుదగ్గులులేని స్థితియందే యది మూలప్రకృతి, ప్రధానము, అవ్యక్తము ననఁబడును, సృష్టిస్థతిలయ తిరోధానానుగ్రహము లనెడి ప్రకృష్టకృతులైదు నామెవి కావుటనే 'ప్రకృతి' యనఁబడును. 'పంచకృత్యపరాయణా' -నామస్మృతి. ప్రకృతి కారణము, వికృతి కార్యము (జగత్తు). 'శ్రీగురుః సర్వకారణ భూతాశక్తిః' (శ్రుతి).

ఇపుడు శక్తి శక్తిమంతులు వేఱుకాదని తెలియవలయును. బ్రహ్మమాయలు నెలయు వెన్నెలయువలె నొక్కటియై యున్నవే. శక్తిమంతుని. రూపముకంటె శక్తి వేఱు కాదు. వని తాదాత్మ్యము (అదియే యిదయై యుండుట) నిత్యము. అనఁగా నొకప్పుడిటులైయుండి యొకప్పుడు కాకుండుట యన్నది లేకుంటయే. కనుకనే బ్రహ్మశక్తి నుపాసించు క్రమమున (సంద్యాదేవి నుపాసించు క్రమమున) గాయత్రీ నామకయైన యామె తత్త్వపారమ్యముం దెలుపుటకే తాదాత్మ్యము నుగ్గడించుటకే 'అక్షరం బ్రహ్మసమ్మితమ్‌' అనిరి. అవస్థాన -అనుష్ఠాన-అధిష్ఠాన-నామ-రూపములందు బ్రహ్మముతో సమానయనుట.

కావున బ్రహ్మమునకు ముఖ్యమంత్రమైన ప్రణవమెటులో (ఓమ్‌) తచ్ఛక్తియైన మాయయొక్క ముఖ్య మంత్రము మాయాబీజమును (హ్రీం) అట్టులే. అదె తై|| శ్రుతి 'హ్రీశ్చతే లక్ష్మీశ్చపత్నౌ'-అని యెలుఁగెత్తి పలుకుచున్నది. బృ, ఆ. శ్రుతియు 'ఇంద్రో మాయాభిః పురురూప ఈయవే| యుక్తాహ్యస్య హరయః శతాదశేత్యయం హైహరయః' ఇంద్రుఁడు (పరమేశ్వరుడు) తన మాయలచే (శక్తులచే) ననేకరూపముల నొందుచున్నాఁడు. అని బహువచనముచే (ఇచ్ఛాజ్ఞానక్రియా రూపశక్తులు మూఁడుగాన) 'హరయః' అని, శక్తియను నర్థమిచ్చు హరి 'హ్రీం' అనుదాని బహువచనమును గొనయాడినది. హ్రీ యనుదాని రూపాంతరమే హరి.

ఇంతేకాదు. సామవేదమునందును మాయాబీజము రేఫము (రకారము) తోడి యతుకు లేకయే హ్రస్వమైన ఇకారముతోనే యుగ్గడింపఁబడినది. 'పృథ్వీహింకార ఆదిత్యో హింకారో ద్యౌర్హింకారః. పురోవాతో హింకారః' అని రేఫము లేకయే, ఇకారముతోనే పల్కరింపఁబడి సర్వమును శక్తిస్వరూపమే యని స్తుతింపఁబడినది.

ఇదె భువనేశ్వర సంహితయందు 'సామసు ప్రథమా భక్తి ర్హింకారో మే మనుః స్మృతః| హ్రస్వేకారయుతం తత్తుమాయాబీజం ప్రచక్షతే' సామమంత్రములందు సాటిలేని రచనమైన హింకారమే నాకు నచ్చనిమంత్రము. హ్రస్వమైన ఇకారముతో నున్నయదె మాయా (హ్రీం) బీజమును నొక్కి చెప్పుచున్నది. దేవ్యథర్వ శీర్షమందును ''వియదీకార సంయుక్తం వీతిహోత్ర సమన్వితమ్‌| అర్థేందు లసితం దేవ్యా బీజం సర్వార్థ సాధకం || ఏకమేవాక్షరం మంత్రం యతయ శ్శుద్ధ చేతసః ధ్యాయంతి పరమానంద మయా జ్ఞానాంబు రాశయః |'' వియత్‌ - హకారము, ఈకారముతోను, వీతి హోత్ర = రకారముతోను, చంద్రుడు = బిందువుతోను, గూడంగానైన హ్రీం అను మాయాబీజము చతుర్విధ పురుషార్థముల నీయఁగలది. జ్ఞానసముద్రులును, నిర్మలులును, నియత చిత్తులైన వారలు, ఆయేకాక్షరమంత్రమునే ధ్యానించి పరమానంద స్వరూపులగుచున్నారు (ముక్తులగుచున్నారు), అని కొనియాడఁబడినది.

కావున బ్రహ్మనామములైన ధ్రువము, తారము, ప్రణవము మున్నగునవి బ్రహ్మవాచకమైన ఓంకారమునకుఁ జెల్లునటులే మాయాబీజ నామములైన శక్తి, మాయా, హృల్లేఖా మున్నగునవి బ్రహ్మశక్తి వాచకమైన హ్రీంకారమునకుఁజెల్లును. మాలినీ, శివల్లరీ, శక్తి, కళా, మాయా, వాణీ, మూర్తి, బీజశక్తి, కుండలినీ యను పదములు హ్రీంకార వాచకములు.

బ్రహ్మమునకును బ్రహ్మశక్తికిని వేఱుపాటు లేమిచే బ్రహ్మమును దెల్పు ఓంకారము బ్రహ్మశక్తినిం జెల్లును అటులే మాయాబీజమైన హ్రీంకారము మాయాబ్రహ్మములకు రెంటికినిం జెల్లును. 'హ్రీంకార ఉభయాత్మకః' అని బ్రహ్మాణ్డపురాణము. శ్రీ శంకర గురుపాదులునుం దమ ప్రపంచసారతంత్రమున-'తదా తాం తారమిత్యాహు రోమా త్మేతి బహుశ్రుతాః| తామేవ శక్తిం బ్రువతే హరీ మాత్మేతి చాపరే ||'' 'ఆ హ్రీంకారమునే వేదవిదులు ఓం అనియు, తారమనియు, ఆత్మయనియు వ్యవహరింపఁగా మఱి కొందఱు శక్తియనియు, 'హరీం' అనియు, ఆత్మయనియు, దానినే చెప్పుచున్నారు-' అని యుగ్గడించినారు.

ఇటుల ఓం హ్రీం అను శ్రేష్ఠమంత్రములచేఁజెప్పఁబడు శబలబ్రహ్మరూపమే (శక్తివిశిష్‌ బ్రహ్మరూపమే) తాంత్రికులనోర 'బిందువు' అను మాటతో వెలయుచున్నది. అదె 'శారదాతిలకమందు'- 'ఆసీచ్ఛక్తిస్తతో నాదో నాదా ర్బిందు సముద్భవః|' అని శక్తి యుత బ్రహ్మమే బిందుపదముచేఁ జెప్పఁబడెను. శ్రీ శకంరగురువులును భువనేశ్వరీ స్తుతియందు' 'నమస్తే నమస్తేశి బిందుస్వరూపే' అని పరాశక్తిని బిందు నామములతోనే పిలిచి మ్రొక్కిరి.

ప్రణవమంత్రమునకు శివుఁడు (బ్రహ్మము) దేవతయని ప్రణోత్పత్తి ప్రకరణమందును, రుద్రుఁడు దేవతయని గోపథ బ్రాహ్మణమునందును జెప్పఁబడఁగా మాయాబీజ (హ్రీం) మంత్రమునకు భువనేశ్వరి దేవతయని యెన్నఁబడినది. పై ప్రమాణముల ననేకములను బట్టి శక్తిశక్తిమంతుల భేదము లేదని నిష్కృష్టార్థము కదా!

ఈయర్థమందలి తత్త్వమే మన శక్తి శక్తిమంతుల కభేదమనియు, భగవశ్ఛక్తి నారాధించుట భగవంతు నారాధించుటే యనియు, ఆ శక్తిని మాతృభావముతో నుపాసించుట క్షిప్రఫలప్రదమనియు గాయత్రీ సావిత్రీ సరస్వతీత్యాది నామములతో వెలయు నాశక్తి సమష్టికుండలినీ రూపముగాను, పిండమందు వ్యష్టికుండలినీ రూపముగాను వెలయుచున్నదనియు, ఆధ్యాత్మిక మార్గమందు సాధకునకుఁ బెంపు కుండలినీశక్తి సేనతోడిదే యనియు, అదియే మహాత్రిపురసుందరి యనియు, నిశ్చయింపఁబడిన యుపనిషత్తాంత్రిక మతమే.

పిండమందుఁ బ్రసుప్తగతినందు నాకుండలిని జాగరితను జేయుట కెన్ని యుపాయములున్నను, సద్గురువువలన శక్తి పాతదీక్ష నందుటయే సులభమార్గము.

ప్రత్యేకోపాసనమందును శక్తిపాత మనునది (కుండలినీ జాగృతి) సిద్ధిచుటకు శిష్యుని చెవిలో నొక మంత్రము వేయఁబడును. ఆమంత్రములు శిష్యుని చెవిలోఁ బడునపుడే గురువు నుండి శిష్యునితో నొక యనిర్వాచ్యమైన యాధ్యాత్మికశక్తి బీజమును గొనిపోయి నాటును. (వివరమునకు 'శక్తిపాతము' అను నాగ్రంథము చూచునది) కావుననే హృదయక్షేత్రమందు నాటఁబడి యంకురించి యుద్దిష్ట దేవతా స్వరూప వృక్షముగాఁ బరిణమించును. అదె విష్ణుమంత్రమయినచో విష్ణురూపము గాను, లక్ష్మీమంత్ర మయినచో లక్ష్మీరూపముగాను బరిణమించు, నిటులే యెఱుంగునది.

ఇపుడు గురువు, ఆధ్యాత్మికశక్తి, మంత్రము నను త్రికము పరస్పరసంబంధి యని తేలినది. కావున నీ యేకత్వ మేనాఁడును నిరాకరింపరానిదనియు, ఒక్క పరమేశ్వరుని మూఁడుభావములే యీత్రయమనియు సాధకులేనాఁడును మఱువరాదు.

భగవంతుఁడే గురుని భౌతికశరీర ముందుండును. ఆతని యాత్మశక్తియే శిష్యపిండకుండలినిని జాగరితను జేసి, మంత్ర బీజ రూపము నొంది శిష్యునందు సంక్రమించును. ఆ మంత్రమునందు మూర్తీభవించిన యాత్మశక్తియే శిష్యుని హృదయ క్షేత్రమున మొలకెత్తి యుద్దిష్ట దేవతా స్వరూపము నొంది జపకాలమున మూలాధారాది చక్రములందు న్యసింపఁబడు మంత్రాక్షరోచ్చార క్రమమున నాయాచోట్ల నగు స్పందనము లనెడి దోహదములచేత విచిత్ర శక్తివంతమై యుద్దిష్ట దేవతా స్వరూపము నొంది యాధ్యాత్మిక వికాసమును, దైవశక్తులను విజృంభింపఁ జేయును.

ఈవిధముగా గురునందు గురుస్వరూపముగా భగవంతుఁడే యవతరించును, గావున భగవంతుఁడే శక్తిగాను, మంత్రము గాను, ఉద్దిష్ట దైవతముగాను గురుఁడుగాను ఉపాసకునిహృదయ మందుండును. గురువు తనయందు దేవతై%్‌%్‌యము నెటులు నిశ్చయించునో, యటులే శిష్యుఁడు నేకత్వ నిశ్చయమునకు రావలెను; వచ్చును. అయినను శిష్యుడు బ్రహ్మాత్మైక్యజ్ఞానము నొందినననుగురుశరీరమందు దైవభావమును వీడరాదు. గురు దైవతములందు భిన్నత నెటులెన్నరాదో యటులే మంత్ర దైవతములకును, బ్రహ్మ బ్రహ్మశక్తులకును, మూర్తిదైవతములకును భిన్నత నెన్నరాదు. గాన గురుమంత్రమూర్తి శక్తులనునవి గురుశరీర వాగాత్మశక్తులందు వెలయునను నారము ముఖ్యము.

గురువు మంత్రముద్వారా తన యాధ్యాత్మికశక్తిని శిష్యునందు సంక్రమింపఁజేయును. మూలాధారము ప్రసుప్తకుంలినీ స్థానము గనుక నుపదిష్ట మంత్రము తిన్నగా నచటనేస్పందమును గలిగించి, కుండలినిని మేలుకొల్పి క్రియాపతినిగాఁ జేయును.

మూలాధారమే స్వయంభూలింగ నిలయము. అది తన శక్తులను జెదరనీయకయే యుండి కుండలిని. మేల్కొని క్రియావతి కాఁగానే శక్తిప్రాసారము పలుముఖములఁ జేయించును. అపుడామె తన నిలయమునకు మీ దిదైన స్వాధిష్ఠాన మునకుఁబోవును. అది కారణముగానే యాచోటు స్వ+అధిష్ఠానమని సార్థకత నొదెను. గావున మూలాధార స్వయం భూలింగమే మంత్రము; దాని శక్తియే క్రియావతియైన కుండలిని. తన సృజనశక్తి ప్రవాహులకు అన్యోన్యాభిముఖ్యము గల్గించి చేర్చుటయే దాని ప్రథమకృత్యము. అపుడా జాగరిత కుండలిని మానవుని హృదయమున నుద్దిష్ట దేవతాస్వరూపము నొందును. ఇదియే సాధకునందు మొట్టమొదటి దివ్యవికాసము. అయినను మానుషమునుండి దివ్యమున కిది నడిమిమెట్టే కాని తుదిమెట్టుకానది తెలియవలయును.

సాధకుని తీవ్రభక్తి సత్ప్రవర్తనములచే నిది యింకను బయికెక్కి, పవిత్రీకరణ కేంద్రమయిన విశుద్ధచక్రమును జేరును. అచట నది మఱల వాగ్రూపమునొంది తన తొల్లింటి మంత్రబీజాకారము నొదును ఈ విశుద్ధచక్రమునందే కుండలినీ దేవి పవిత్రప్రకాశరూపమునఁ గాననై లోనుండి వచ్చుఆజ్ఞలను అందుకొని సాధకున కంద జేయుటకుఁజూచును గాని యింకను నాజ్ఞాలోనే యుండును. అనఁగాఁబైనున్న దివ్యాధికారి (శివుని) యాజ్ఞలకై వేచుకొని యుండును. గనుకనే యాఱవదియైన భ్రూమధ్యగీతచక్రమునకు 'అజ్ఞాచక్ర'మని పేరు వచ్చెను. ఈ చక్రముదిగువ నందుకొన్న వార్తలింకను నిస్సందిగ్థములు కాకపోవుటచే అదిదాటిని తరువాత నిశ్శంకము లగును. గావుననే అజ్ఞాచక్రము ఋతంధరా ప్రజ్ఞాస్థానము, అనఁగా సత్యభరితమైన జ్ఞానస్థానము.

ఆత్మజ్ఞాన సూర్యోదయమునకు ముందటిదైన ప్రతిభ పేరి యుషఃకాంతితోఁగూడి వెలుఁగు ఋతంభరప్రజ్ఞయందే జ్ఞానమంతయు నిమిడియుండును. అదియే అన్ని మాటలను వాక్యములను జక్కఁగా వినఁబడు వాగ్థోరణిగాఁజేయును. గావున మంత్రములన్నియు మాటలవేషముతోనే (ఏభాష యందైన) వెలయుచు, అదె యుత్పత్తిస్థానముగాఁ గొని శబ్దబ్రహ్మమని చెప్పఁబడును. గనుకనే దేవుఁడే వాక్కందురు. ఆవాక్కే ఆమాటయే ఓం అని యుచ్చరింపఁబడును. పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ షరీఫ్‌ కూడ 'ఆల్‌మ్‌) అను మాటతోనే యారంభమగును. ఆ మూఁడక్షరముల(అ-ఉ-మ్‌ అనువాని) వివరణ మాగ్రంథమందు లేకున్నను, ఇస్లామ్‌ మతావలంబకులకుభ దెలియబఁడకున్నను ఆ గ్రంథాది నది యలంకరించి నది. 'ఆల్‌మ్‌' ఈనుచోటి లకారము అనుచ్చార్యమె ఖాళీస్థలముగానుండ నచ్చోటి వైదికర్షులచే 'ఉ' కారముచేఁ బూరింపఁబడినది, కావున 'ఆల్‌మ్‌' అనునదియే గ్రంథమున కుత్పత్తి స్థానము.

సెంట్‌జాన్‌ (St john) తన నింబంధనగ్రంథాదిని మొదటిపద్యములో "worb was inthe begining and word was with God and the word was God" వాక్కే మొదట నున్నది. ఆవాక్కు దేవుడితోడిది; వాక్కే దేవుఁడు; అన్నాఁడు.

ఆజ్ఞా చక్రోపరిభాగమున ఏదైవతమునకుఁ జెందిన మంత్రములైనను ఏనామములైనను ఆ (ఓమ్‌) పదమందే తుదకు లీనమైపోవును. భాషానైశాత్యమంతయు బిందువనఁబడు (అనునాసికధ్వని) సర్వోన్నత శిఖరమునఁ గేంద్రీకృత మగును. బిందువు నాదమందును, నాదము కళయందును (శక్తి సారమయమునందు) ఆనందరూపమున లీన మగును. అదె శాతశాంతి. ఈ విధముగా ఓంకారమునకు సప్తభాగములు. ఆ - ఉ - మ్‌ - బిందు - నాద - కళా - శాంతి యనునవి. నామరూపములు బిందువునందు నిల్చిపోవును. గాని నాదము నాదరూపముతోనే యుండి యితరాకారములను గోలుపోవును. (నాదే బిందు ర్విలీయతే|| 'నారాయణీ నాదరూపా నామరూప వివర్జితా'- నామస్మృతి.) కళమాత్రము కేవల శక్తియుతమై, శక్తిరూప మయి, ప్రశాంతానందముగా మాఱి ('చిత్కలానందకలికా శాంత్యతీత కలాత్మికా-నామస్మృతి.) క్రమముగా శాంత్యతీతమనెడి బుద్ధికందరాని యవస్థగా మాఱును. ఈ నాలుగువస్ఠలును సమాధ్యవస్థతోనే యంతమగును.

సాధకుని ప్రత్యేక తీవ్ర ప్రయత్నాంతమందును గ్రియా నంతమైన మనస్సు విశ్రాంతిగొనుచు, సేదదేఱుచు మఱింతి బలము నార్జించుకొనుచుండును. సామాన్యజీవయాత్రయందు దానినే మనము నిద్రయందుము. మిగుల శ్రమకరమగు ప్రయత్నమందది సహజచైతన్యమును గోల్పోయి మూర్ఛితావస్థనొందును. తీవ్రధ్యానము పిమ్మటఁ జిక్కు నవకాశమందు సమాధిస్థితిలోనికిఁబోవును.

సాధకుఁడు అజ్ఞాచక్రమునకు దిగువనగు నేచక్రమందు దానిని గేంద్రీకరించినను నిజమైన గాఢనిద్రయే యగును. ఆజ్ఞా చక్రోపరిభాగమునందైనచో నది సమాధ్యవస్థ యగును.

బిందుస్థానమున మనస్సు నామరూప సహితమైన భౌతికపదార్థమువైపు చెదరక నిల్చును. మఱికాసంత పైనైనచో నది ముడుగును. ఆయవస్థయే యర్థచంద్రుడు = సగము వెల్తురుమాత్రమే కలవాఁడనుట, మనసు చంద్రాత్మకము. అది సగము బలమును గోల్పోవును గాననే యాస్థితి కర్థచంద్రుభడనిరి. ఇంకను బైకి పోను సమాధిగా నగును. ఈ యవస్థయే నిరోధిక యనఁబడును. అటులే నాదస్థానమున రూపవినాశము పూర్తిగా నగునుగాని నాదము సాగుచుండును. అట్టి సమాద్యవస్థయే (నాదాంతము) మహానాద మనఁబడును. శక్తినామకమై కళాపదృశసమాధియే వ్యాపిక యనఁబడును. మనసుయొక్క ప్రశాంత చైతన్యావస్థయే సమాధి యనఁబడును. మనస్సంబంధము బొత్తిగా విడిపోయిన పరమ ప్రశాంతావస్థయే 'ఉన్మనీ' యనఁబడును.

ఏమతమునా రుపదేశించిన యే యుసాసనామార్గము లైనను పరిశుద్ధ చైతన్యవస్తువుతో జీవుఁడు చేరుకొనుటకే. అది యా పరమశివరూపజ్ఞానానంద సముద్రమున మనసు లయించినపుడే సాధ్యము. మానవజన్మమున కిదియే పరమావధి. దీని నెఱుంగుటే సర్వమతోద్దేశము. ఉపాసనా విధములును. ఆచారములును ఎంతయైనను భిన్నము లగుఁగాక! జీవుని గమ్య మింతే.

శ్రీమహాత్రిపురసుందరీ కృపాప్రాపక సమయాచార నిరతుఁడును. శ్రీశ్రీవిద్యా

నందగురను కరుణాలోకన ధనుండును. పుణ్యలాంగలీతీరస్థశ్రీకాకుళ నివా

సియు,శ్రీ శ్రియానందనాధాపర (ధీక్షా) నాముఁడును. శ్రీసౌందర్య

లహరీ. దేవీపంచస్తవీ. మహాసౌరమంత్రపాఠ, జీవానందననాటకా

ద్యనేక గ్రంథానువక్తయు, అరసవల్లీక్షేత్రమహాత్మ్య. జాన

కీశ్వరశతక, శ్రీబాలాంబికాశతక. అమ్మతో ముచ్చటలు,

ప్రముఖానేకాకృతిరచయితయు. శ్రీశర్మదరామాయాణ

అద్భుతోత్తరకాండాది ద్వాదశయక్షగానకర్తయు,

శార్‌ఙ్గధరత్రిశతీ, భైషజ్వరత్నావశ్యాఖ్యాయు

ర్వేద గ్రంధానువాదకుఁడును. శిశువ్యా

ధులు, పుత్త్రవతీహితోపదేశాదివైద్య

గ్రంథకర్తయు, యజుశ్శాభీయుఁ

డును, ఆపస్తంబసూత్ర హరితస

గోత్రుఁడును. ఈశ్వర సీతా

రామశాస్త్రీ కామాంబా గర్భ

జనితై కుపుత్రుండును

నగు ఈశ్వర సత్య

నారయణ శర్మ

వ్రాసిన

శ్రీసూక్తరహస్యారథ ప్రదీపిక.

ఉపాసనారహస్యము

సంపూర్ణము.

Sri suktha Rahasyardha pradeepika    Chapters