Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page

ఈశ్వరావతార ప్రమాణాలు

దేవీసహస్రనామాలతో విశేషించి లలితాసహస్రనామాలతో మనం శుక్రవారమునాడు అంబికను అర్చిస్తూ ఉంటాము. ఎన్నో సహస్రనామావళులు ఉన్నాయి. అన్నిటిలోను లలితా సహస్రం దొడ్డది. దీనిని కేవలం పారాయణమే చేసినా మనకు విశేషమైన ఆనందం కలుగుతుంది. స్తోత్రంలోనైనా నామావళిలోనైనా ఒకమారు చెప్పిన పదం పునరుక్తం కాకూడదు. లలితాసహస్రనామాలలో పునరుక్తి ఎచ్చటా కన్పించదు. లలితా సహస్రనామముల ఘనత సంస్కృతజ్ఞానం కలవారు చక్కగా గ్రహించగలరు.

ఈ సహస్రనామావళికి భాస్కరరాయలు అనేవారొకరు భాష్యం వ్రాసేరు. ఆయనకు దేవియందు పరమభక్తి. 'భాస్కరానందనాథులు' అన్నది వారికి గురువులు అనుగ్రహించిన దీక్షానామధేయం. లలితా సహస్రనామములకు తాను వ్రాసిన భాష్యానికి వారు 'సౌభాగ్యభాస్కరం' అని పేరు పెట్టేరు. శ్రీ విద్యయొక్క ఉపాసనా మార్గాలలో వారికి తెలియనిది లేదు. శ్రీ విద్యావిషయంలో వారుసర్వజ్ఞులు. మంత్రశాస్త్రానికి సంబంధించి యీనాడు మనకు లభించే వానిలో అనేకం వారు వ్రాసినవే.

ఈ భాస్కరులు మహారాష్ట్రదేశంలో ఉండేవారు. ఆయన ఒకప్పుడు దక్షిణదేశానికి రాగా వారి గొప్పదనాన్ని గుర్తించి తంజాపూరు మహారాజు వారికి కావేరీతీరంలో ఒక గ్రామం యిచ్చి ఆదరించేరు. ఆ గ్రామం పేరు భాస్కరరాజపురం. నేటికి కావేరీ ఉత్తరతీరంలో ఆ గ్రామంలో ఉంది. దానికి ఎదురుగా కావేరీ దక్షిణతీరంలో 'తిరువాలంగాడు' అనే గ్రామం ఉన్నది. ఈ తిరువాలంగాడు గ్రామానికి మదరాసుకు సమీపంలోని తిరువాలంగాడు గ్రామానికీ పోలిక లున్నాయి.

మదరాసుకు సమీపంలో తిరువాలంగాడు పరమశివుడు ఊర్థ్వతాండవం చేసిన పుణ్యస్థలం. అచటివారే కావేరీ దక్షిణతీరానికి వచ్చి తిరువాలంగాడు గ్రామం ఏర్పరచుకొని ఆ పుణ్యస్థలంలో ఉన్న శివమూర్తివంటి మూర్తితోడనే ఒక ఆలయాన్ని కూడా నిర్మించేరు.

భాస్కరరాజపురంలోనూ, దానికెదురుగా ఉన్న తిరువాలంగాడు గ్రామంలోనూ ఎందరో బాగా చదువుకొన్న విద్యాంసులున్నారు. ఈ రెండు గ్రామాలవారు పరస్పరం బంధువులు, జ్ఞాతులు కూడా అయి ఉన్నారు.

భాస్కరరాయలవారు చాలా గంభీరమైన స్వభావం కలవారు మంత్రశాస్త్రానికి వారు ప్రమాణభూతులు. తాము చేసే పని అందరకు ఆనందం కలిగించేదిగా ఉండాలనియు, అందుకు సౌభాగ్యభాస్కరభాష్యం వ్రాసితిమనియు వారు చెప్పుకొన్నారు. మనదేశంలో గంగ, సింధు, బ్రహ్మపుత్ర మొదలగు నదులు ఉన్నాయికదా! వీనిలో బ్రహ్మపుత్రానది పేరు శాస్త్రగ్రంథాలలో కనిపించదు. కాని భాస్కరరాయలవారు దానిని ఇలా వర్ణించరు.

ఆప్రాచః కామరూపాద్‌ ద్రుహిణసుతనదప్లావితా దాప్రతీచో

గాంధారా త్సింధుసాంద్రాద్‌ రఘువరచరితా దాచసేతో రవాచః|

ఆకేదారాదుదీచః తుహినగహనతః సన్తి విద్వత్సమాజా

యే యే తానేష యత్నః సుఖయతు సమజాన్‌ కశ్చమత్కర్తుమీష్టే||

- లలితాసహస్రనామ భాష్యపీఠిక.

'కామరూపం' అంటే నేటి 'అస్సాం', దానిని గూర్చి చెపుతూ 'బ్రహ్మపుత్ర ప్రవహించే కామరూపం' అని పేర్కొన్నారు వారు. తూర్పు కామరూపదేశమూ, పశ్చిమాన సింధునది, దక్షిణదిశయందు సేతువు, ఉత్తరదిక్కునందు హిమవంతము- వీనికి మధ్యలో ఉన్న విద్వాంసుల కందఱకు నా యీ భాష్యరచనాయత్నం ఆనందాయకమగుగాక! సమాజము దీనివలన తృప్తి నొందుగాక! అని వ్రాసినారు.

అట్టి ఆ భాస్కరరాయలవారు ఆచార్యులవారిని స్తుతిస్తూ వ్రాసిన (ఉట్టంకించిన) శ్లోకాలు ఎన్నో లలితాసహస్రనామభాష్యంలో ఉన్నాయి. వానిలో 'శ్రీ శంకరాచార్యస్తోత్రం' అనేది ఒకటి.

శ్రీ శంకరాచార్యుల వారి చరిత్ర శంకరవిజయ గ్రంథాలలోనే కాదు, పతంజలి విజయంలోను, ఇతిహాసపురాణాలైన శివరహస్య - బ్రహ్మాండపురాణములలోను వస్తుందని వెనుక చెప్పబడింది. శ్రీ విద్యాతాత్పర్యాన్ని, మంత్రశాస్త్రరహస్యాలను వ్రాసిన మహనీయులు శ్రీభాస్కరరాయలవారు స్వయంగా 'శంకరాచార్యస్తోత్రం' రచించుటయే కాక ఆచార్యులవారి కథాకథనంతో నిండిన ఒక గ్రంథాన్ని కూడా పేర్కొన్నారు. అది 'విష్ణుధర్మోత్తరం'.

'విష్ణుధర్మోత్తరం విష్ణు పురాణానికి పరిశిష్టగ్రంథం.' మూడు వేదాలలోని ఋక్కులయొక్క సారార్థం ఈ గ్రంథంలో ఉంది. ఈ విషయం అంతా పుష్కరుడనే పేరుగల యక్షుడు శ్రీ రామచంద్రునకు ఉపదేశం చేసినట్లు యిందు కనిపిస్తుంది. శ్రీరామచంద్రునకు పుష్కరుడు ఇలా కర్మకాండను ఉపదేశిస్తే జ్ఞానకాండను వశిష్ఠలవారు ఉపదేశిం చేసేరు. ఋక్కుల అర్థాలను తెలుపుతూ ఉంది గనుక విష్ణుధర్మోత్తరం వేదభాష్యమే అవుతుంది.

శ్రీరామం ప్రతిపుష్కరాభిధ మహాయక్షేణ వేదత్రయ

వ్యాఖ్యానావసరే విశిష్యకథితం శ్రీ విష్ణుధర్మోతేరే!

ఏతాం ధేను ముపహ్వయామి సుదుఘా మిత్యుద్గతం శంకరా

చార్యం శిష్యచతుష్టయేనసహితం వందే గురూణాం గురు||

- లలితా సహస్రనామ భాష్యపీఠిక.

తన దూడకు పాలీయడానికై పరువెత్తి వచ్చే గోవువలె, అద్వైతం వెనుకబడి పోయినపుడు తిరిగి అద్వైతతత్త్వం లోకానికి ఉపదేశించుటకై పరమశివుడు పుడమిపై అవతరిస్తాడని-విష్ణుధర్మోత్తరంలో ఉన్నట్లు భాస్కరరాయలవారు వ్రాసేరు. ఆ భాస్కరులు-

వరే ష్వతీతేషు శ##కేషు షట్సు తిష్యేవతీర్ణం భువి శంకరార్యాం|

శిషై#్య శ్చతుర్భి స్సహితం శివాది పారంపరీకావధి మానమామః ||

అని ప్రత్యేకంగా చెప్పినారు. భాస్కరులు చెప్పిన విష్ణుధర్మోత్తర ప్రసంగం చాలా గౌరవం కలది.

శ్రీరాముల వారికి యక్షుడు వేదఋక్కుల అర్థాలు ఉపదేశిస్తూ-'పరమశివుడు నలుగురు శిష్యులతో ఆచార్యులకు ఆచార్యులై అవతరించ నున్నారని'-చెప్పినట్లు భాస్కరరాయలవారు వ్రాసేరు.

'శ్రీరుద్రము' వేదంలో ఒకభాగం. ఇది చాలా ప్రశస్తమైనది. అందరూ దానిని నిత్యం పారాయణం చేయాలి. పదకొండుసార్లు పారాయణం చేయడంలో విశేషం ఉంది. దానిని ఏకాదశరుద్రపారాయణం అంటారు. మొదట రుద్రపారాయణము, అటుమీదట అభిషేకము, ఆ తరువాత పూజ - ఇది క్రమం. శ్రీ రుద్రమునే 121 సార్లు పారాయణం చేస్తే దానిని 'రుద్రైకాదశీయం' అంటారు. మళయాళ##దేశంలో జన్మ నక్షత్రమునాడు 'రుద్రైకాదశీయం' చేసి ఆ తీర్థాన్ని శిరసుపై చల్లుకొంటారు. రుద్రైకాదశీయం పదకొండు సార్లు ఆచరిస్తే దానికి 'మహారుద్రం' అని పేరు. పదకొండు మహారుద్రాలు అతిరుద్రం అనబడుతుంది. రుద్రపారాయణం సన్యాసులకుకూడ విధింపబడింది.

స్వశాఖో పనిషద్గీతా విష్ణోర్నా మసహస్రకం|

శ్రీరుద్రం పౌరుషం సూక్తం నిత్య మావర్తయే ద్యతిః||

యతి మొదట తన పూర్వాశ్రమశాఖకు సంబంధించిన ఉపనిషత్తును పారాయణం చేయాలి. పిమ్మట గీతా పారాయణం.

''భగవద్గీతా కించి దధీతా గంగాజలలవ కణికాపీతా'' భగవద్గీత కొంచెం చదివినా చాలు. ఆ తరువాత యతి విష్ణుసహస్రనామపారాయణం చేయాలి. పిమ్మట రుద్రపారాయణము, పురుషసూక్తము పారాయణం చేయాలి. ఇలా యతి నిత్యమూ వీనిని అవృత్తి చేయాలి. రుద్రజపం వల్ల పంచమహాపాపాలు నివారింపబడతాయి.

పదులనాలుగు విద్యలలో ముఖ్యమైనది వేదము. మిగిలిన విద్యలన్నీ దానికి అంగాలు. ఆ వేదములలో ముఖ్యమైనవి మూడు. ఆ మూడింటిలో మధ్యది యజుర్వేదము. యజుర్వేదము ఏడు కాండలు కలది. ఆ ఏడు కాండలలో మధ్యదైన నాల్గవకాండలో శ్రీరుద్రం ఉన్నది. శ్రీరుద్రం యొక్క మధ్యభాగంలో పంచాక్షరి ఉంది. పంచాక్షరముల మధ్యలో 'శివ' అనే రెండక్షరాలు ఉన్నాయి. ఆలయంలో లింగం ఉన్నట్లు 'శివ' అనే రెండక్షరాలు సకలవిద్యలకు మధ్యగతములై విరాజిల్లుతున్నాయి.

విద్యాసు శ్రుతి రుత్కృష్టా, రుద్రైకాదశినీ శ్రుతౌ|

తత్ర పంచాక్షరీ తస్యాం, శివ ఇత్యక్షరద్వయమ్‌ ||

సమస్తానికి జీవకళగా ఈ రెండక్షరాలూ ఉన్నాయి. ఈ అక్షరాలు శ్రీరుద్రంలో వస్తాయి. ఆ శ్రీరుద్రంలోనే ఆచార్యుల వారు కూడా ఉన్నారు.

రుద్రంలో పరమశివునకు ఎన్నోనామాలు ఉన్నాయి. 'దొంగలలో కెల్ల గజదొంగ ఆయన' అని అందు స్తుతింపబడింది. నిషంగిణ ఇషుధిమతే తస్కరాణాం పతయేనమోనమః.

ఆ పరమశివుడు లేనిచోటు ఏదీలేదు. 'నీవే కపర్దివి నీవే వ్యుప్తకేశుడవు' ......... నమః కపర్దినే చవ్యుప్త కేశాయ చ-అని స్తుతి. కపర్దములు కలవాడు కపర్ది. అనగా జటలు కలవాడు. 'వ్యుప్తకేశుడు' అనగా ముండితశిరస్కుడు. క్షవరము చేసికొన్న శిరస్సు కలవాడు. పరమ శివుడు జటాధారిగా మనకు తెలియును. దక్షిణామూర్తి రూపంలో కూడా ఆయన కపర్దియే. మరి ఆయన వ్యుప్త కేశుడైన దెచ్చోట?

భాష్యకారులు దీనిని శోధించేరు. కపర్ది అనేది పరమ శివుని విశేషమైన నామం. దానికి వెంటనే వచ్చిన 'వ్యుప్తకేశుడు' అనే నామంకూడా విశేషమైనదే. అయితే దీనికి అర్థం ఎలా కుదర్పాలి?

ఇతిహాసపురాణాభ్యాం వేదం సముపబృంహయేత్‌ |

బిభే త్యల్ప శ్రుతాద్వేదో మామయం ప్రతరిష్యతి ||

ఇతిహాస పురాణములను పరిశీలించియే వేదార్థం తెలుసుకోవాలి. ఇతిహాసపురాణాల పరిజ్ఞానం లేకుండా ఎవడైనా వేదానికి అర్థం చెప్పడానికి పూనుకొంటే వానిని చూచి వేదాలు వణకిపోవునట. ఎందుకెంటే వీడు అల్పజ్ఞుడైనందున వేదార్థాలను తన అల్పమైన ఎరికలోనికి తెచ్చి ముడిపెడతాడు.

భాష్యకారులు ఇతిహాస పురాణాలను పరిశీలించేరు. 'చతుర్భి స్సహశిషై#్యమ్త శంకరో2వతరిష్యతి'- అని వాయుపురాణంలో ఈశ్వరుడు నల్గురు శిష్యులతో సహా గురువుగా అవతరించగలరని అర్థం తెలిసిపోయింది. వారు భాష్యంలో ఈ అర్థమునే ఎత్తిచూపుతూ 'వ్యుప్తకేశులు' అనగా శంకరాచార్యులే అని తీర్మానించేరు.

వ్యాకుర్వన్‌ వ్యాససూత్రార్థం శ్రుతేరర్థం యథోచివాన్‌ |

శ్రుతే న్యాయః సఏవార్థః శంకరః సవితాననా ||

- సౌరపురాణము.

అని సూర్యుడే ఆచార్యులుగ అవతరించినటులు వ్రాయబడింది. నారదపురాణం 'సూర్యుడే పరమాత్మ' అని చెపుతూ ఉన్నది. కనుక 'శంకరాచార్యులు పరమాత్మయే' అనీ సౌరపురాణం చెప్పినటులు అయింది.

కరిష్యత్యవతారాణి శంకరో నీలలోహితః |

శ్రౌతస్మార్త ప్రతిష్ఠార్థం భూతానాం హితకామ్యయా||

అని 'శివరహస్యము' చెపుతూ ఉన్నది. శ్రీ రుద్రమునందు పంచాక్షరికి ముందుగానే ఆచార్యుల పేరు ఉన్నది. శంకర స్వరూపము మొదట చెప్పబడి శివస్వరూపమైన పంచాక్షరి తరువాత చెప్పబడినది. అందుచే 'పంచాక్షరి' ఆచార్యుల నుండి తెలిసికొనవలెనని సూచింపబడినట్లు అయింది. అచ్చట మొదట 'శంభువు' అనియు, తరువాత 'శంకర' అనియు దానికి తరువాత పంచాక్షరియు ఉన్నాయి. గురువు నాశ్రయించియే శివరూపము తెలిసికోనాలి. శివునికంటే గురుడే ఉత్తముడు.

శివేరుష్టే గురుస్త్రాతా గురౌ రుష్టేన కశ్చన |

- రుద్రయామళము.

శివాపచారమును గురువు తొలగించగలడు, కాని గురునకు చేయబడిన అపచారమును దొలగించుట కెవ్వడును సమర్థుడు కాడు. అందుచేతనే ఎల్లకార్యములు 'శ్రీగురుభ్యోనమః' అని చెప్పి ఆరంభించాలి. ఈ కారణం చేతనే శ్రీ రుద్రంలో 'నమః శంకరాయ చ' అన్న తరువాత పంచాక్షరి చెప్పబడినది.

మాధవీయ శంకరవిజయంలో

అజ్ఞానాం తర్గహన పతితా నాత్మ విద్యోపదేశైః

త్రాతుం లోకాన్‌ భవదశిఖాతప పాపచ్యమానాన్‌ |

ముక్త్యాం మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతీ

శంభో ర్మూర్తి శ్చరతి భువనే శంకరాచార్యరూపా ||

ఆచార్యుల అంటే అందరకూ ఆనందమే. ఆయన పరమశివమూర్తియే. వటవృక్షం క్రింద ఆయన దక్షిణామూర్తియై మహామౌనంతో కనులైనా తెరువకుండా కూర్చున్నారు. కలికాలంలో అలా ఉండి ప్రయోజనంలేదు. ఏమంటే మిగిలిన యుగాలలో అసురసంహారానికి విష్ణువు ఆయుధసహితుడై అవతరించేవాడు. ఇపుడు అసురులు ప్రత్యేకంగా లేరు. వారంతా మన బుద్ధివృత్తులుగ మారి ఉన్నారు. త్రేతాయుగంలో విశ్వామిత్రుడు యజ్ఞంచేస్తూ ఉంటే దానిని పాడుచేయడానికి మారీచసుబాహులు వచ్చేరు. కాని వారు ఆయన బుద్ధిలోనే ప్రవేశించుటజరిగితే ఆ విశ్వామిత్రుడు యజ్ఞమే ఆరంభించేవాడు కాదు. ఇపుడు అసురులంతా మనబుద్ధులలో దూరి కూర్చున్నందున అన్ని అసురాకారాలూ మనమే చేస్తున్నాము.

అందుచే మౌనం విడిచి వటవృక్షం నుండి శంభువు బయలుదేరేడు. దక్షిణామూర్తిగా వారి మౌనం అనంతం. ఆచార్యులగా వారి వాదం అనంతం. వారు భాష్యాలు వ్రాసేరు, స్తోత్రాలు సృష్టించేరు.

శంభువే శ్రీశంకరాచార్యులు. 'శం' అనగా నిత్యసుఖము. శంభువు 'శం' నకు (నిత్యసుఖమునకు) ఉత్పత్తిస్థానం. వట్టి ఉత్పత్తిస్థానం అయితే చాలదు. ఆ సుఖాన్ని చేతులారా అందరకూ పంచిపెట్టాలి. దానికి శ్రమపడాలి. కాని ఇలా శ్రమపడి నిత్యసుఖాన్ని పంచిపెట్టినా మాకు అక్కఱలేదు అనే వారు చాలామంది ఉన్నారన్నది వేరుమాట. కాగా ఆయన కేవలం శంభువై కూర్చుంటే ప్రయోజనం లేదు. అందుచే శంకరు లయ్యేరు.

''నమః శంభ##వే చ మయో భ##వే చ నమఃశంకరాయ చ మయస్కరాయ

చ నమః శివాయ చ శివతరాయ చ''

- రుద్రము.

శంభువే దక్షిణామూర్తి అటుపైన శంకరులనైన ఆచార్యులు. దాని తరువాత పంచాక్షరము. ఇది క్రమము. ఈ క్రమము పొందికైనది.

ఈవిధంగా ఋగ్వేదమంత్రములోను, విష్ణుధర్మోత్తరంలోను, భాస్కరుల వాక్కులోను, శ్రీరుద్రములో రెండు స్థానములలోను శ్రీ శంకరాచార్యులవారి అవతారప్రశంస చేయబడింది.


Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page