Mahayogama    Chapters   

ఓమ్‌

మహాయోగము

6. జీవుడు

- * -

మనస్సునూ, మనస్సువల్ల దానిలో గోచరించే యింద్రియ విషయాలను యింతవరకూ పిరశీలించాం. ఇంక చర్చించవలసినవి జీవుడూ ఈశ్వరుడూ. జీవునిగూర్చి మొదట యోచిస్తాం.

గతచన్న జీవితంలో జీవుని గూర్చి ఏవోకొన్ని భావనలను సేకరించాము. వాని కాధారములన్నవేమో చూడవలె. మనలో ఎక్కువమంది జీవుడున్నాడని నమ్ముతారు. బాహ్యజగత్తుగా తీరిన యింద్రియ విషయాలను చూచేవాడూ మనసులో పొదలిన తలపులను తలచేవాడూ అతడే. బహుజన నిశ్చయం ఏమంటే, జీవుడొక డున్నాడు; అతడే ఆత్మ. అది ఒక్క దేహానికీ దానితోడి మనస్సుకూ చెందింది గనుక పరిమితం. 'నేను' అన్నపుడు మనమూహించేది ఈ జీవాత్మనే. మనం, అంటే యీ జీవాత్మలం, దిక్కాల కారణాదుల నియతులకు లోగి బద్ధులమైనాము. ఈజీవాత్మకు ముక్తి సాధ్యమని కొందఱు. కాని 'ముక్తి' యంటే వారందరొకే విధంగా ఊహింపకపోవచ్చును జీవాత్మ తానైకోరకున్నా తనకర్మ వశతవల్ల పరంపరయా తనువు లెన్నిటినో తాల్చుతుంది. ప్రతి మతస్థుల్లోనూ పాతుకొని యున్న నమ్మకం ఈజీవాత్మల కన్నిటికీ ఈశ్వరుడు భిన్నుడు, విశిష్టుడని. ముక్తి కలగగానే ఈ వైశిష్ట్యం అంతరిస్తుందని కొందరు: ఇతరుల అభిప్రాయం ఈవైశిష్ట్యం శాశ్వతమని, అంటే జీవేశ్వర భేదం సంతతముండేదని. ఈ తెగవారు కాలదేశాల, ఇతర ప్రపంచాల యాధార్థ్యాన్ని శంకించరు.

వీరందరూ మనస్సే ఆత్మ యంటారు. ఈ ధారణ ప్రకటంగాక అనభిజ్ఞంగా ఉంటుంది. వారిలో చాలమంది ఆత్మ మనస్సుకు వేరుగా ఉందని తమకు తెలియునంటారు. కానిపైకి అనకపోయినా, లోలోన ఆత్మయేదో సవిశేష మనస్సన్నట్లు దానికి మనోధర్మాల నెన్నింటినో అంటగట్టుతారు.

ఈ నమ్మికతోడి వారి తాత్పర్యం భ్రాంతి కాకుంటే, ఆత్మయొక శరీరి, అంటే వ్యక్తి, కావలె ఆత్మ నధికరించిన ప్రశ్నలన్నిటినీ మూసలో కరగిపోస్తే మిగిలే దొకేప్రశ్న : ఆత్మ వ్యక్తియా, అంటే శరీరియా, యని. వ్యక్తి కానిపక్షంలో, వారిప్రకారం ఆత్మలేదు : ప్రపంచాన్ని చూచువాడూ, కర్మఫలములచే బాధితుడుగాని తోషి తుడుగాని ఉండగాదు.

వ్యక్తిత్వం నిజమోకాదో మహర్షి రచనల్లో స్పష్టంగా కనవచ్చు. ''జడశరీరము 'నేను' అనదు. సత్తైన చిత్తు జనించదు. నడుమ, దేహపరిమాణముగ 'నేను' ఒకటి పుట్టును. ఇదియె చిజ్జడ గ్రంధి, బంధము, జీవుడు, సూక్ష్మశరీరము, అహంకారము, సంసారము. మనస్సు మొదలగునవి యని తెలియుము.'' 1

సత్తైన చిత్తు కాలాతీతం గనుక అది గతించదు, జనించదని మహర్షి యన్నారు. భూమితో పోలిస్తే అది సూర్యునివలె అచలం. మనం చూచే సూర్యోదయాస్తమయాలు భూభ్రమణంవల్ల అట్లు కనుపించేవే. రవిలాగే సత్యం సదా భాసిస్తుంది. అహమిక యొక్క క్రుంగు

______________

1) చూ. అనబంధము. 'క' శ్లో. 29 : ఉ. న 24

పొంగులను దానియందారోపిస్తాం. అహమిక విరళము, అది లేచి పడుతుంటుంది. అహంభావనను వివేషించి వ్యక్తికి వేరు ఆత్మలేదు. అదిజాగ్రత్‌ స్వప్నాల్లో వెలిగి సుప్తిలో అడగారుతుంది. కాబట్టి జీవాత్మ సత్‌ స్వరూపముతో ఒకటిగాదు. అది జడ తనువూగాదు. మరి అదియేమి? అదియొక అభూత సత్వం, మనః కల్పన, పరస్పర మత్యంత విషమాలైన చిజ్జడముల సాంకర్యంవల్ల జనించిన అసంగత జీవం, 'జీవాత్మ'గా పేర్కొనబడేది. 'నేను ఇట్టి వాడను, అట్టి వాడ' నంటూ పొట మరించేది. చిత్కాంతి సంపర్కాన అది చేతనంగా అగుపిస్తుంది. కాని అదే కాలంలో దానిని జడతనువుకు వేరుగా గుర్తింపగాదు. సూటిగా విరుద్ధాలైన దేహాత్మల మేళనాన్ని చిజ్జడ గ్రంధి యున్నారు. అందువల్లనే యీజీవాత్మ అహంతగా 'నేనీదేహమ'ననే రూపుతో వ్యక్తమౌతుంది. ఇట్లాత్మగా ఎన్నిన యీదేహం సర్వదా భౌతిక కాయంగానే ఉండనక్కఱలేదు. ఒక్కొక్కప్పుడు తనువుకన్న సూక్ష్మమైన మనస్సు కావచ్చు. ఆకాస్తసేపూ ఆత్మత మనస్సుకు పరిమితమై యుంటుంది.

'నేను దేహమ'నన్న భావన మూలస్థానీయ మైనది. తలపు లన్నిటికీ అదిసూత్ర ప్రాయం. అందుచేతనే అహాన్ని మనస్సు నుండి వేరెంచలేము. నిజానికి అహంయొక్క విస్తృత రూపమే మనస్సు అందుకే మహర్షి మనస్సునూ సూక్ష్మతనువునూ, అహంత కభిన్నమైన కైతవ జీవాత్మ సమములన్నారు. త్రిప్పి చెప్పవలెనంటే జీవాత్మ తను మనములకభిన్నమే.

ఇట ఆత్మయనిపించుకొంటున్నది అహంకారమే అది రెండు విషమాంశముల కలయికవల్ల కలిగింది. ఆ అంశములు రెండూ వేర్వేరు ఒకటి కొకటి విశిష్టమూ. అవి నిజంగా కలయనే కలయవు. ఆరెంటిలో నొకటి దేహం, మానసిక కల్పన గనుక అస్థిరం. రెండు భాగాలు యధార్థాలైతే సంయోగం వీలవుతుంది. ఆ రెంటి మేళనం, మహర్షి యన్నట్లు, బ్రహ్మచారి నిద్రించి కలలో వివాహమాడినట్లు వరుడు సిద్ధమే. కాని వధువు మిథ్య. నిద్ర లేచిన బ్రహ్మచారి పూర్వమెట్లో అట్లే యిప్పుడూ బ్రహ్మచారిగనే మిగిలియుంటాడు. ఈ రీతిగా స్వరూప స్థితి - అదే సత్‌ - నిజంగా పరిమితం కాలేదు. అయ్యది యధార్థంగా జీవుడు గానీ, కుఱుచ జీవాత్మగానీ కాలేదు. దేహం మెడలో ఆత్మయే మంగళసూత్రమూ కట్టబెట్టలేదు. కాబట్టి వ్యక్తి యాత్మకు నిజంగా ఉనికిలేదు. దానికి సంబంధించిన ప్రశ్నలకర్థంలేదు. అట్టిది ఉన్నదను కోటమే అనాలోచితం. ఉన్నదొకేయొక ఆత్మ. అది కాలాతీత మైన శుద్ధజ్ఞానం. అయితే, దానిని జ్ఞానయుతమనక జ్ఞానమని యేల వర్ణించారు? ఇది తరువాత వివరిస్తాను: ఆరెండు వర్ణనలలో గల వ్యత్యాస ప్రాధాన్యం అప్పుడు తెలియవస్తుంది.

అహమిక కపట సత్వం, దానికి మనస్సు వేరుకాదు. కనుక అజ్ఞానము బంధము; మొదలైన మనః కల్పితాలన్నీ, అవి నియమితం చేసిన మోదశోకాల బ్రదుకూ, అహమికనుండి పొడమినవే, అయధార్థతను పంచుకొన్నవే. అజ్ఞానంగూడ అయధార్థమెట్లో తరువాత వివరించబడియున్నది.

నిష్పక్షపాత దృష్టికి పై బోధ సరియనుట స్పష్టమే. జీవితాను భవసర్వాన్ని అతినిశిత విమర్శ పాల్పఱచినా అహమికవినా వేరుగ నొక జీవాత్మ కలదనుట కెట్టి యాధారమూ కనరాదు. ఆరంభంలోనే మనం గుర్తించినట్లు ఆహమిక మూలాజ్ఞాన సంతానమే. ఇచట దానిని రెండు భిన్న తత్వముల సంశ్లేషవలని కృత్రిమ సత్వంగా చూపుటైంది. పరిమితమైన యీ బ్రదుకునకు జీవాత్మయనే అయధార్థం పునాది. అందువల్లనే జీవితం కల్పనా కాపట్యములతో, నిరాశా నిస్పృహలతో నిండియుంటుంది ఈ బోధ నాదరించటం కష్టమే కాని అదియే మన సనాతన దర్శనములు వేలార్చిన ఆధారసత్యం.

ఈ సిద్ధాంతాన్ని అంగీకరించకుంటే పురాతన దర్శనాల అర్ధ గ్రహణం సరిగా సాధ్యపడదు. వ్యక్తి భావన నిలుపుకొన్నంత వరకూ ఆధ్యాత్మవిచారాలన్నీ వ్యర్థాలే. భావన నిలుపుకొన్నంత వరకూ ఆధ్యాత్మ విచారాలన్నీ వ్యర్థాలే. అవి మూలాజ్ఞానం నుండి మనలను విడివడనీయవు. దీనినే విస్పష్టార్థముగ శంకరులు వచించినారు. ఎంత వరకు మనః కల్పితమైన బుద్ధ్యుపాధి సంబంధమాత్మకుండునో అంత వరెకు దానికి జీవత్వ సంసారిత్వములు తప్పవు. బుద్ధ్యుపాధి పరికల్పించిన వ్యతిరేక స్వరూపానికి వేరుగా జీవుడన్నమాటె తలెత్తదు. వేదాంతార్థ నిరూపణలో నిత్యముక్త స్వరూపుడు సర్వజ్ఞుడునగు ఈశ్వరున కన్యుని మరొక్కని సచేతనుని స్వయంస్థితుని కనుగొనం. ద్రష్ట, శ్రోత, మంత, విజ్ఞాత, అతడుగాక అన్యుడెవ్వడూ లేడు. 'తత్త్వమసి', 'అహం బ్రహ్మాస్మి' మొదలుగా శ్రుతిశతములు ఘోషిస్తున్నవి. అవి మను ప్రమాణములు. 2

జీవితంలోని మన అనుభవాల కన్నిటికీ ఒకేయొక జన్మస్థానం అహమిక. అవి అట్లుండుట అహమిక వల్లనే. రోజూ మనం అనేవే - 'నేను ఫలానా', 'నేను కర్తను', 'నేను సుఖంగా ఉన్నాను', 'నేను దుఃఖాకులుణ్ణి' - యిలోగే ప్రతి తలపులోనూ ఈ 'నేనున్నాను' కనుపిస్తుంది ఏ అపవాదమూ లేక తలపు లన్నిటా సామ్యము ఈ 'నేనున్నాను' అది లేక యేతలపూ మొలకెత్తదు. కాని యీ 'నేను న్నాను' మనోధర్మంగాదని మహర్షీ ఉపనిషత్తులూ ప్రకటంగా చెప్పుతున్నవి. పెద్దలీ 'నేనున్నాను' ను ఆత్మ ప్రకాశమన్నారు. ఆత్మ అనంతమూ, అపరిచ్ఛిన్నమూ, అది అందరూ అనుకొనే స్వల్పవిషయమైన, జీవాత్మ గాదు. ఈ జీవాత్మ పరిమితం, అపూర్ణం, మోదశోక చక్రానికి కట్టువడింది. అహమికలోని సత్యాంశాన్ని అందలి అయధార్థభాగం నుండి వేర్పరచలేకయీ బాధ, ఈ అహమికను దాని

_____________

2. సూత్రాభాష్యము, రెండవ ప్రకరణము, పాద iff, సూత్రము 30.

వెలిమేలిమని చూచి నిజమైన ఆత్మగా గ్రహించి నందున్నే స్వస్వరూపం దుర్భోధమవుతున్నది.

గౌతమ బుద్ధుల బోధసారం సరిగా యిదే. ఆత్మ అమరమా అని యొక రడిగారు. ''ఏ ఆత్మ మృతికి తర్వాతా మిగుల వలెనని యింత వ్యగ్రుడవౌతున్నువో అది మిథ్య, ఇప్పుడూ లేదు'', అని వారి సమాధానం. నిజంగా లేని జీవాత్మ ఉన్న దనుకొని యీ ప్రశ్న. అది నారాధారం. బుద్ధులకు సద్వస్తువును నిరాకరించుతలపే లేదు. అడిగి నతడు వారి యుత్తరాన్ని సరిగా అర్థం చేసుకోలేదు; బుద్ధులు ఆత్మ అభావ మన్నారనుకొన్నాడు. అతడింకొక ప్రశ్ననూ అడిగి యుండవలసింది: ''సత్యాత్మ ఒకటి ఉంటే, దాని స్వభావస్థితియొట్టిది?'' యని, అతడట్లడుగకనే వెళ్ళిపోయాడు. వానికి బోధకం కలిగించక, వానికి ఉన్న విశ్వాసం గూడ సడలించానే అని బుద్ధుడు విచారించాడు. మనం గమనించ వలసిందేమంటే ప్రశ్నల ప్రాతి పదిక తధ్యం కాన పుడు, వానికి ముక్త సరిగా 'అవును', 'కాదు' అన్న బదులుచాలదు. ఎటైనా సమాదానం సరిపడదు.

జీవాత్మ మిథ్య గనుక ప్రపంచాన్ని చూచేవారు ఉండుట కవకాశం లేదు. ఇది విడ్డూరంగా తోచవచ్చు కాని అట్లుండ నక్కఱ లేదు. ద్రష్టదృశ్యములు వేర్పరుపలేము. కర్రకు సహజమైన రెండు చివరల్లాగానే చూడబడునదీ చూపరీ, దృశ్యమూ ద్రష్టా వాని నను సంధించే దృక్కూ ఈ త్రిపుటిలో ప్రముఖాంశ చపు, చిత్ర్పకాశం వల్లనే సాధ్యం. ఆ వెలుగులోనే చూపరీ దృశ్యమూ రెండూవ్యక్తమౌతాయి. జగద్దృశ్యాన్ని కాదని ద్రష్టను మాత్రమే తధ్యమనడం సమర్థనీయం గాదు. ఏ యర్థంలోగాని, ఏ యవధుల్లోగాని దృశ్యం మిథ్యయైతే అదే అర్థంలో అవే అవధుల్లో ద్రష్టకూడ మిథ్యయే. దృశ్య జగత్తులో చూపరి అంగమే. జాగ్రత్‌ స్వప్నాలు రెండింటా ద్రష్టాదృశ్యములకు సమవాయ సంబంధం; అవి అగపడటం, అడగి పోవటం, రెండూ ఒక పరి జరిగేవే.

జీవాత్మగా వ్యవహృతమైన అహమిక కృత్రియ మంటూ మహర్షి యొక దృష్టాంతం యిచ్చారు. పెండ్లి సందర్భంలో ఇరు పక్షాలకూ క్రొత్తయైన అనాహూతు డొకడు వరునికి సన్నిహిత మిత్రుడనంటూ వచ్చి చేరాడు. మొదట పిల్లవైపువారు నిమ్మి అర్హసత్కారాలతో అతన్ని ఆదరించారు. కొంత సమయం గడిచాకవారి కనుమానం గలిగి అయనెవరో ఏ హోదాలో వచ్చారో విచారణ మొదలయింది. రెండు పక్షాలవారు పరస్పరం సంప్రదించుకొన్నారు. ఆ ధూర్తుడిది గమనించాడు ఇక తామసిస్తే తన బండారం బయట పడి బడి తెపూజ తప్పదని అక్కడ నుండి చల్లగా జారుకున్నాడు. కథ లోని ఆ వంచకుని వలెనే అహమిక. అది అచ్చమాత్మ కాదు, దేహమూ కాదు. విచారం ఆరంభంగాక పూర్వం శుద్ధాత్మవలెనే సమాదృత మౌతుంది. కాని ఆత్మవిచారం మొదలై నిష్ఠగా సాగితే జాడ తెలియకుండా సమసి పోతుంది. ఇదే మహర్షి వాక్కులో; -

''రూపమును బట్టుకొని పుట్టును, రూపమును బట్టి నిలుచును. రూపమును బట్టి భుజించి వృద్ధిజెందును. రూపమును విడిచిరూపమును దాల్చును. వెదకగ వదలి పరుగెత్తును ఆరూపములేని అహంకార పిశాచము''.3

ఈ బోధను మనం శ్రద్ధగా అవగతం చేసుకోవలె. సుప్తిలో అహమిక లేదు, జాగ్రత్‌ స్వప్నాల్లోనే గాని. ఈ రెండవస్థల్లొనూ ''నేనీ దేహా''న్నంటూ, ఒక దేహము ఉపాధిగా వ్యక్తమౌతుంది. అంటే దేహాన్ని చూడటమూ. అదేకాలంలో 'ఈ దేహంనే' నన్న

______________

3, చూ. అనుబంధం 'క', శ్లో 30 : ఉ. న. 35

భావనా సంభవిస్తాయి. ఆ దేహాన్ని ఆత్మగా, ఆత్మావాసంగా, సమకాలమువేయైన యితర శరీరాలూఐ విషయాలూ అనాత్మలుగా ఎన్నుటైనది. మళ్ళీ నిద్రపైకొన్నపుడు, తనువూ అహమూ రెండూ, వానితోబాటు ప్రపంచమూ అదృశ్యమౌతాయి తన కల్పనలే అయిన అసంఖ్యాక దేహాల్లో ఒక్క దానికి సత్‌ స్వరూపాన్ని పరిమితం జేసే అజ్ఞానమే అహమిక. దాని సృష్టియేయైన యీ ప్రపంచం రెండుగా, ఆత్మగా అనాత్మగా భాగింపబడింది. ఆత్మభాగం చాల స్వల్పం, అనాత్మభాగం విరివి హెచ్చు, దీనినుండి పుట్టుకొచ్చినవే బంధమునకు కీలకాలైన 'నేను' 'నాది' యన్న కవలలు.

ఆత్మ భావనను కేవలం దేహానికి పరిమితం జేసిన దోషం ఈ బంధం. అహమికే లేకుంటే యీ బంధముండదని స్పష్టమే. ఈ పద్ధతిలో ఋషీ బోధను మన్ని చడం సులువౌతుంది. స్వస్వరూపమెప్పుడూ ముక్తమే. ఒకప్పుడది బంధానికీ అజ్ఞానానికీ వశ##మైతేగదా, విమోచన అవసరం? మహర్షికి తానుపూర్ణమూశుద్ధమూ నైన సద్వస్తువున కన్యుడనన్న భావనేలేదు: బంధమెఱుకేలేదు. ఎన్నడైన బంధముల నుంటిననుకొనుటకు తాను కాలాన్ని అధిగమించెను గదా. వేరుతల పులన్నిటివలెనే బద్ధుడనన్న తలపుగూడ. కాని యీ తలపునకు కొంత ప్రయోజనముంది. అది బుద్ధిమంతులకు విచారమార్గానికి చేర వేస్తుంది. ఆత్మాన్వేషణావసరంలో బంధ అభావం విదితమౌతుంది. కాని బంధం అహంభావనలో అంతర్వర్తియే గనుక, అహమిక మిగిలి నంతకాలం అదీ ఉంటుంది. దీని ఫలితం విచిత్రం; అహమిక తానే బంధాల్లో చిక్కి బాధితమౌతుంది. ఇట్లు అహమిక సర్వదాముక్తి లాభవంచితమే. బంధము బంధమునుండి విడివడుట ఎట్లు? అట్టిస్థితిలో మిగిలి యుండగలది పూర్ణ సత్యమొక్కటే. అహమిక యదార్థం కాదు. వ్యక్తిత్వనాశం లేకముక్తిలాభ మాసించే వారికి ఆశాభంగం తప్పదు. వ్యక్తిత్వముంచుకుంటూనే వారార్జింపదలకొన్న పుణ్యలో కాలు, జగత్తువలె మిథ్యలే.

బంధం వలెనే అజ్ఞానంగూడ, రెండూ అహమికకు సమములే. అహమికను కాదని వానికి వేరు ఉనికి యేలేదు.

సర్వార్ధాల జీవితాన్ని చుట్టబెట్టిన చెట్టలన్నింటికీ మూల మీ యహంభావనే. సాధకులలో చాల మందికి అహమిక ప్రాణపదం, అదే తామని భ్రమించి దాన్ని వదలుకో నిచ్చగించరు. దాన్ని వర్జించి సుఖ పడేకన్న దాన్ని కట్టుకొని కడగండ్లపాలవడమే వారికిష్టం. నిజం కాని యీయాత్మ అమరమనీ, ముక్తిలోనూ మిగులుననీ నమ్మి అది ప్రాతిపదికగా ప్రశ్నలను కుప్పిస్తాడు. కాని పైబోధ అగవతమైన వారికి ఏ ప్రశ్నలూ తలసూపవు.

అట్టి ప్రశ్నల్లో మచ్చుకొకటి. వేదాంతబోధల్లో ''తత్త్వమసి'' యొక మహావాక్యం. ప్రాత కాలంలో ఈ బోధను గూఢంగా ఉంచి నిశిత పరీక్షలకాగిన అర్హ శిష్యులకే ఉపదేశించేవారు. ఆవిధంగా యిట్టి బోధకుచేసే అపార్థ విపరీతార్థాల బెడద తప్పేది. కాని యీ రోజుల్లో వేదాంత గ్రంథాలు అందరి కందుబాటులో ఉన్నవి; అనిష్టార్ధాలే మెండైనవి. బోధస్థాయి హెచ్చేకొద్దీ, దాని దుష్ర్పయోగావ కాశాలు హెచ్చి ఫలితాలు దూష్యాలైనవి. అనర్హులు గ్రంధాలు చదువుతారు. వారి దృష్టిలో దోష బహుళ##మైన అహమికే అనంతమూ, సర్వశక్తీ, ధర్మాధర్మాల కతీతమునూ. వారిని సరిదిద్దటం సాధ్యంకాదు. సాధకుల్లో కొంతమేల్తరమువారు వ్యక్తిత్వ అభావం ఎట్లు సత్యమో తెలియక తికమక పడుతారు. వారికీ మహావాక్యార్థం జీవాత్మ ఈశ్వరుడనో, ఎదోసర్వోత్తమమనో స్ఫురిస్తుంది. వారికి పై బోధ సందిగ్ధార్థమే. వారి కర్థమైన ఫక్కిలో అది అను పన్నమేగాక ఈశ్వర నిందకం గూడా. అయినా వారితీరు కొంత సమంజస మన వచ్చు. బోధను విపరీతార్థంగా గ్రహించే వారికన్న వారెన్ని రెట్లో సన్మార్గులు. వివరమెఱిగిన విద్యార్థికి ప్రకృతి సిద్థంగానే దోషమేదో కలదని స్ఫురిస్తుంది. వానికి సందియములు కలుగుతవి, వాని ప్రశ్నలు కేవలం సంశయాపనోదనకే.

అట్టి సాధకుడు మమర్షి నడిగినాడు. 'నేను నిత్యుడను, పూర్ణుడను అయితే అజ్ఞాని నట్లైనా' నని. దానికి మహర్షి ప్రతివచనమిట్లు - 'ఎవరా అజ్ఞాని? సద్వస్తువు అజ్ఞానినని మొఱలిడదు. అట్లు చేసేది నీలోని అహమిక. ప్రశ్మనడిగేదీ అదే. ఆత్మ ప్రశ్నించదు. అహము ఇటు తనువు కాదు, అటు సద్వస్తువూ కాదు; ఆ రెంటి నడుమా ఒక వ్యతిరేక స్వరూపం. నిద్రలో అహమిక లేదు; అపుడు నీకు అపూర్ణుడని అజ్ఞుడవనీ భావన లేదు. అహమిక యాధార్థ్యం ఎంతలో వివేచింవచి సత్యాత్మను విలోకిస్తే అజ్ఞానం లేదని తెలుస్తుంది. అంటే, ఆత్మదర నముతో అహమిక నాశమవుతుంది దానితోసహా నీవు మొఱవెట్టిన్శ అజ్ఞానం సమసిపోతుంది.

''తత్వమసి'' మహా వాక్యానికి సరియైన వ్యాఖ్యానం, మహర్షి యొసగినది, 'గురు రమణ వచన మాల' లో పొందు పరిచియుంది. ''నీవు వపువు కావు, ఇంద్రియములు కావు, చేతస్సు కావు, ప్రాణమవు కావు, అహంతవూ కావు. వాని యన్నింట గల యభిమానమ నేప్రమాదాన్ని4 బాపికొని, ఆత్మవిచారంచేత మనస్సు పూర్తిగా హృదయంలో లీనమై, జగత్తు అంతర్హితమైనపుడు ''తత్త్వమసి'' వాక్యార్థం శుద్ధాహంస్ఫురణ 'నేనున్నాను'గ భాసిస్తుంది5.

_________________

4. క్రైస్తవ సిద్ధాంతంలోని 'Original sin' 'ప్రమాద'మని శంకరులు. అది అహం భావనకు వేరుకాదన్నారు మహర్షి.

5. చూ. అనుబంధం 'చ', శ్లో, 153, 54.

ప్రసంగవశంగా ఒకమాట. ధర్మోన్మాదాన్ని అసహిష్ణు తనుదంభ మాత్సర్యపూర్ణ వివాదాలను రేపే విశ్వాసోద్ధతికి కారణం సాక్షాత్తు అహమికే. మతధర్మి వాని సహజన్మియైన అప్రత్యయివలె అహంతావిష్ఠుడు. అవిశ్వాసి ఉదాసీనుడేగాని అప్రియవాది కాదు. కాని మతధర్మిగతి వేరు. అతనికి మనశ్శాంతి ఉండటం అరుదు. ఇతర మతావలంబు లెందరో! వారిని చూస్తూ సహించేదెలాగ? వారందరూ ఏక మతావలంబులు కాగల కాలానికై అతడాతురంగా ఎదురుచూస్తాడు. కాని ఆ ఏకమతం తన మతానికి భిన్న మౌనేమో అన్న తలపు నైన అతడుభరించలేడు. వారు అన్యమతస్థులయ్యే కన్న మత విహీనులైనామేలే. ఇట్టివాడు వానివిశ్వాసం గాఢమయ్యే కొద్దీ పరమతావలంబులయెడ తఱచు అసహిష్ణువూ, అప్రియుడూ, అవుతాడు. వానికి రాజ్యాధికారం చేజిక్కెనా, యితర మతస్థులను రాచి రంపాన బెట్టగలడు మతవిశ్వాసం అహమికకు ప్రతికూలం కాదుగా, అందువల్ల.

మత ధర్మికి ఒరులను తన మతంలో చేర్చుకోనే ఆస్థసద్ధర్మా చరణమని నమ్మకం. అది సద్ధర్మం కాదు వ్యసనం. దానికి అహమిక ప్రోత్సాహకారణం. అతడు ''ఈ ధర్మం యదార్థమూ శుభప్రదమూ అనిపిస్తున్నది; శ్రేష్టతర మింకొకటి లభించిందాకా దీనిని అనుసరిస్తాను'' అని అనుకొనడు. దానికి ప్రతిగా ''ఈ ధర్మంనాది. కాబట్టి అది యొక్కటే నిం. దాన్ని మన్నించటం ఇతరులందరి విధి'' - ఇట్లుంటుంది వానిధోరణి, ధర్మమునందిట్టి ఆసక్తి, దృప్తి. అందుచేతనే పరమత ఖండనంలో మాత్సర్యం దూషణ యెక్కువ. ఇతర మతాల ఉనికియే వానికి గిట్టదు. 'శాస్త్రసంగతం నా ధర్మం, పరస్తవనం విధర్మం'' - వాని మనస్థితి అట్టిది. అందువల్ల అతడు స్వధర్ముల్లోనే వీసమంత భేదాభిప్రాయం గలవారిని ద్వేషించి నంతగా ఏ మతంలోనూ ప్రత్యయమేలేని వారిని సర్వధా పరధర్ములను యేవగించడు.

దీనినే మహర్షి ప్రస్తావించారు; ''ఎప్పుడును ఎవ్వరికిని స్వభావ మైయుండు వస్తువును స్వస్ధానమగు హృదయమందెఱింగి ఆ స్థితి యందు నిలుకడ జెందక, 'ఉన్నది' 'లేదు', 'రూపము', 'అరూపము', 'ఏకము', 'ద్వయము', 'రెండునూగాదూ' అని జగడము వేయుటయె (వాదించుటయె) మాయాదోషము (జ్ఞానహీనత).'' 6

తేలిందే మంటే మహర్షికి స్వకీయమంటూ ఏమతపక్షమూ లేదు. కారణం ఆయన కహంతలేమియే. విశ్వాసియైనా అవిశ్వాసి యైనా అహంతావాదులను రెండు పక్షాలుగా విభజించవచ్చు. జీవ, ఇంద్రియవిషయ, ఈశ్వర - ఈ త్రితయాంతరితమైన జగద్దృశ్యం మార్పుజెందుతుంటుంది. కాని దాని కాస్తరంగా సద్వస్తు వున్నదనే వారొకవర్గం; లేదనే వారింకొకవర్గం, పూర్వవర్గంలో అంతర్విభాగాలు కొల్లలు, సత్‌ స్వభావ నిరూపణలో వారికన్ని భేదాలు. ప్రధాన భేద ములనే పేర్కొనంటాను. అసలు రూపస్వభావానిపై (Reality of form) భిన్న, విరుద్ధ భావనలు మొదటిది. ఆది కారణానికి ఆకృతి గలదని కొందఱు. అట్లు కాదనే వారు సహజంగానే ఉంటారు. ఆ కారణము ఏకమని కొందరు, బహుళమని యితరులూ, ఆదికారణం ఏకమే; జగత్తు దానియందలి దృశ్యం; ఆవిధంగా అది ఉపాదాన కారణము నిమిత్తకారణము రెండునూ అని వేరు కొందఱు. కానేకాదని తక్కొరులు; వారికి ఆది కారణం దైవం. అతడు ఆత్మలన్నింటికీ సదా విశిష్టంగానే ఉంటాడు. ఇంకనూ కొందఱికి దైవమూ ఆత్మా భిన్నమూ కావు, అభిన్నమూకావు. రెంటికి ఏకత భావించే వారిని వీరిలో వారు గనే వ్యవహరించారు. ఎందుకంటే ఆ బోధ నిజమే అయినా, అది మతవిధి (Dogma) గా భజించుటకు గాదు, సద్వస్తువుయొక్క సాక్షాదనుభవాన్ని ప్రోత్సహించుటకే. ఆ అనుభూతికై విచారసాధననొల్లని

____________

6. చూ. అనుబంధం 'క', శ్లో 39 : ఉ. న. 34.

వారు పైవారికన్న మెఱుగేమీ కాదు. అందరూ అహమికకువశులో అహమికతో తృప్తులో. నిజానికి ఆత్మానుభూతియొక్కటే నిజం, దాన్ని గూర్చిన ప్రత్యయాలుగావు. అట్లయ్యేటైతే అవి యోచనావిషయాలు కావలసి వస్తుంది. వైదిక వాఙ్మయోత్పన్నమైనా అధ్యయన మాత్రతత్త్వవిజ్ఞానం, సాధకుల యితర మతవిధులవలె అజ్ఞాన జనితమే.

మహర్షి తెల్పినట్లు మత సిద్ధాంతాలు మానసికాలు; మనస్సు నధిగమించినది సద్వస్తువు. ఏ సిద్ధాంతమూ సద్వస్తువునకు యదార్థ వర్ణనంగాదు. సత్యంసిద్ధాంతాల్లోనూలేదు, వానిని కీర్తించే గ్రంధాలల్లోనూ లేదు. విశ్వాసి అహమిక యే, దాని స్వభావం సత్యగోపనమో విరూపకరణమో. 'నేను విశ్వసిస్తా'నంటాడు విశ్వాసి. ''ఓ యీ, విశ్వాసీ! ఆ 'నేను' స్వరూపమేమో విచారించు. అప్పుడు తెలుస్తుంది సత్యం మనస్సు కవ్వలిదనీ, అందువల్ల ఏ సిద్ధాంతంలోనూ ఇమిడేది కాదనీ'' అని మహర్షి ఆదేశం.

విషయభావ జగత్తులలోని అనేకత్వానికి ప్రధాన బీజం అహంత. ప్రపంచం మానసికమన్న ప్రఖ్యాపనకిది తర్కసిద్ధమైన వ్యాప్తి. అహమికకు వేరుగా మనస్సుకు ఉనికియే లేదు; కనుక మనస్సూ ప్రపంచమూ రెండూ అహమికయే. మహర్షి అన్నదిదే: ''అహంకారము కలదనిన అఖిలమును కలదు; అది లేదనిన అఖిలమునూ లేదు. కనుక అహమే యఖిలమునగును. కావున ఇది యెదియని వెదకుటయే సకల మును వదలుట అని తెలియుము8.

పై యర్ధాన్ని పూర్వప్రకరణంలో నుపదేశించినదానితో కలిపి పరిశీలింపవలె. అచట మహర్షి అనేకాత్మత అజ్ఞాన గోచరమని, విచారంవల్ల అహంత నశించుటతో ఆ బాహుళ్యము అదృశ్యమౌ

_____________

8. చూ. అనుబంధం 'క' శ్లో, 31 : ఉ. న. 26

నన్నారు. తాత్పర్యమిది; ఈ ప్రపంచం వ్యక్తుల, విషయాల, తలపుల తోడిది. ఇది అహం లోనిది, అహమున కన్యం కానిది. అట్టి యీ ప్రపంచ సకలమూ, మోక్షస్థితిలో, లేనిదే.

ఇది యుపనిషత్సంప్రదాయంతో చక్కగా అతుకుతుంది. మాండూక్యం ఉపనిషద్బ్రహ్మమును ''నిష్ప్రపంచ, ఆనంద, శాంత, భేద రహిత'' మన్నది. ఉపనిషద్దర్శనాలన్నీ అంత సుస్పష్టంగానే నాహం స్థితిని భేద శూన్యముగ వర్ణించినవి. ''ఇచట నానాత్వములే'' దని కాఠకోపనిషత్తు.9 భేద భావములు నిజమన్న భ్రమలో చిక్కువడకుమని సత్యాన్వేషికి హెచ్చరికలు ఎన్నో! అట్లు భ్రమించినవానికి మృతిపలు మార్లన్నారు.10 తాను సద్వస్తువునకు వేరని యెన్ను వానికి భయము తప్పదట.11 దేనిని గాని బ్రహ్మమున కన్యమని భావించుట అతనిని వంచింప సమర్థము.12

మోక్షసిద్ధితో జగత్తు గోచరింపమానునని మమర్షి గూడ వచించారు. ''సకల వేదాంత సిద్ధాంత సారమును సంగ్రహించి చెప్పెదను వినుము, 'నేను' (అహంత) జచ్చి, తాను (సత్యమేకము) వెలుగగ, తానే (శుద్ధచిత్తు) మిగిలియుండు వస్తువు.''13

___________

9. 'నేహ నానాస్తి కించన'. 4వ వల్లు, I

10. మృత్యోస్సమృత్యుమాప్నోతి య ఇహనానేవ పశ్యతి' - కాఠక vi. 2

11. యదాహ్యేవైష ఏతస్మిన్నుదర మంతరం కురుతే | అధ తస్య భయం భవతి ii తైత్తిరీయ - I vii I

12. బ్రహ్మాతం పరదాద్యో7న్యత్రాత్మనో బ్రహ్మవేద |........

సర్వంతం పరాదాద్యో7న్యత్రాత్మన సర్వం వేద | బృహదారణ్యక, iv, v, 7

13. చూ. అనుబంధం ''క'' శ్లో. 86 : సూక్తిసుధ. 40.ఔ

గీతయందును యిట్లే, ప్రపంచమిప్పుడును లేదని యున్నది. ''సర్వభూతములును నాయందున్నవి; నేను వానియందు లేను; నిజానికి అవి నాయందులేవు; దివ్యమగు నామాయ అట్టిది.'' 14

అహంభావన మిగులునంతవరకూ జగత్తు గోచరించుట తప్పదు. అదే తిరుగవేస్తే, జగత్తు గోచరించినంత కాలమూ దేహాత్మ భ్రాంతిజేసి ఆత్మకవధి గల్పించటం మానలేము. ప్రపందచం అదిగానిజ మనిమిథ్యను పాలించేవారికిది మరీకష్టం. ఈసందర్భంగా దేహమాత్మ యనుకొనేవానికీ, మనస్సు నాత్మగా భావించే వానికీ తేడాలేదు ఈ రెండవ వాడు మొదటివాని వలెనే చాలవరకూ దేహమాత్మ యనుకొనేవాడే. అందుచేత నే పాశ్చాత్యులు చనిపోయినతడు ప్రేతను విడిచాడంటారు (Give up the ghost) కాని దేహాన్ని విసర్జిస్తున్నాడనరు. వారికి దేహాత్మా భ్రాంతి లేకుంటే వదలుతున్నది దేహాన్ని అనవలెగదా?

అహమిక తానే అజ్ఞానం, సకలపాపాలకూ బాధలకూపుట్టువు. అయినా ఆత్మవిచారంలో దానికెంతో ప్రాధాన్యముంది. స్వభావస్థితిని కనుగొనే కీలకం అందేయుంది. దీనిని ఆత్మవిచార వివరణా క్రమంలో చూడగలం. అదీగాక ఆత్మనిరూపణకు ప్రమాణమదే. ఈ యంశాలను మహర్షి విశదం చేశారు : ''నేనని యీ దేహము పలుకదు. నిద్ర యందు గూడ 'నేనులే' ననియెవ్వరును జెప్పుటలేదు. 'నే' నొకటి పుట్టిన వెనుక నిఖిలమును బుట్టును. ఈ నేను ఎక్కడ బుట్టును అని సూక్ష్మ బుద్ధిచేత శోధింపుము.''15

తానీ ఉపాధి - దేహంగాని, మనస్సుగాని - కాదన్నగుర్తింపు స్వస్వరూపాను సంధానంలోనే కారణం రెండువిధాలు. దేహండము

____________

14. మత్‌ స్థాని సర్వభూతాని, నభాహ్యం తేష్వవస్థితః

నచమ స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరమ్‌.'' గీతxi. 4, 5

15. చూ. అనుబంధం 'క' శ్లో 23 : ఉ. న. 23

అగుటచే అది అవధిగలదైనా, లేనిదైనా, ఆత్మమాత్రం కాదు. ఆత్మకు - అదేదిగానీ - ఉపాధిలేకే స్వయంస్థితియుంది. నిద్రలో అది యట్లేయని మనకెఱుకే. కాని నిద్రలో ఆత్మ అభావం సాధ్యమని ఊహింపనైనాలేము. అట్లూహించడానికి నాగరకత ముదిరి యుండవలె. ఈ విషయంగా వారి చిత్త సంభ్రాంతిని అట్టి ఒకరితో మహర్షి విస్తరంగా చర్చించి యున్నారు. దాని నికపై యుదహరిస్తాను. మన ఉనికికి అహమే సాక్షి. మనం అహంకాదు : అహమెందుత్పన్న మోఅది. దానిని వెదక డానికి అహమిక మూలం వెదకవలె. దానిని కనుగోవడమే సంభవిస్తే అపుడు మనకు తెలిసేది ఆత్మమాత్రమే కాదు. జగద్దృశ్యాని కాధారమైన సత్యంసైతమని శ్రుతు లంటాయి. అది అట్లే; ఆత్మ సత్యములు అభిన్నములు కదా?

స్పష్టంగా ఈ చతుర ధూర్తుడు అహంతయే. సైతాన్‌ అన్నా అహ్రిమాన్‌ అన్నా నిజంగా అదే. అదే నరునికీ దైవానికీ ఏక మాత్ర శత్రువు; సుజ్ఞానవైరి, హత్యావృతముల నిర్మాణ దక్షుడు. అచ్చమైన ఆనందాన్ని అంటే శాంతిని నిరంతరంగా హతమార్చే విశ్వఘాతుకుడు. (Cosmic Macheth), స్వస్వరూప పదాన్ని వంచనతో ఆక్రమించిన మాయావి. అందుచేత జీసస్‌ పలికిన అంతస్స్వా రాజ్యంలో అంటే మనదైన మోక్షంలో ప్రవేశింప ననర్హుడు.

ఓగు సర్వమూ అహంత, బాగుసర్వమూ నాహంత యన్నారు మహర్షి. జీవికను పెనగొనే చెడుగులన్నీ అజ్ఞానమేయైన అహమిక నుండి బయలు వెడలినవే. శ్రద్ధమై అలవరచుకో దగ్గ మంచి సర్వమూ నిరహంతకు చెందిందే.

అహమికకుగాక చావులూ మరి పుట్టువులూ లేవు. మరల మరల చావుపట్టువుల విషమ వలయాన్ని దృఢీకరించేది మూలా జ్ఞానమైన అహమికే. అహమికే ఆసలు చావు. బ్రదుకే తానైన సత్యాన్ని నిరాకరించటం వేరేమౌతుంది? దానిని పదవీచ్యుతి మాత్రం కాదు, సర్వనాశ##మే చేయవలె. అది మిగులునంత కాలమూ భద్రత సున్న.

ఋషిబోధల అవగాహనకు అహమిక చాలపలుచబారవలె, అని మహర్షి బోధలవల్ల తెలుస్తున్నది. గురువును నిర్ణయించుకొన్న పిదప, వారిసన్నిధినే చిరకాలముండి, శ్రద్ధగా శుశ్రూషిస్తూ వారికి పూర్ణశరణాగతుడైతే, ఆ తరువాతనే గురువు శిష్యునికి నిగూఢార్థమగు ''తత్త్వమసి'' మహావాక్యము నుపదేశిస్తారని నానుడి. దాని అంత స్సత్యాన్ని మహర్షి ఇట్లు వివరించారు : ''ఇచ్చట శరణాగతికి సరియైన అర్థం వ్యక్తిత్వమగు అహంభావనను పూర్ణంగా వినష్టం చేయటం. శిష్యుని ఉపదేశార్హ తా నిర్ణయంలో ఇది త్రోయరాని విది. స్వార్పణ యిట్టిది కాకుంటే, అతడుపదేశాన్ని అపార్థం చేసుకోవటం తప్పదు. ఉన్నంతలో అహమిక అవధుల్లోనే అతడు ఉగ్రనిష్ఠకు ధర్మోన్మాద విజృంభణకు వశుడయ్యే అవకాశమున్నది. ఆపైన అతడే మహేశుడంటే, యికవాడేమి తలపెట్టడు? వానికి బోధసరియైన రీతిగా అర్ధమే కాదు. మహేశుడు వానికి జీవుడుగా, అహమికగానే స్ఫురిస్తుంటాడు. అహమిక అసలు లేనిది గనుక బోధకు నిర్దిష్టార్థం ఇది కానే కాదు.''

ఉపదిష్టార్థ నిరూఢి యిట్లు. జీవత్మ తానుగా సత్యం కాక పోయినా, దానిలో సత్యాంశ కొంత ఉంది. అది స్వభావస్థితినుండి ప్రసరించే చిత్కాంతి. అది మనకు ''అహంస్ఫూర్తి''గా అనుభూత మౌతుంది. ఈ చిత్కాంతి ఈవునిది కాదు; అది సత్యానికి ఆత్మకు చెందినది. కాబట్టి జీవుడు దానిని సత్యాత్మకే తిరిగి అర్పణం చేయవలె. ఆ అర్పణం పూర్ణమైతే, శేషించేది ఆత్మయొక్కటే. ఈ రీతిగా వ్యక్తిత్వంపోతే అది మంచికే. ఈ వ్యక్తిత్వ నష్టం సామాన్యంగాదు. అది నష్టాల్లో కెల్ల మహీయమైనది: జీవియే నష్టుడౌతున్నాడు. కాబట్టి సాధ్యాతిసాధ్యమైన లాభ##మే - ఆత్మలాభం. ఈ శరణాగతి ఫలాన్ని ఉపనిషత్తులిట్లు నుతించాయి : 'నదులు ప్రవమించి సముద్రము చేరి నామరూపములను కోల్పోవురీతిగా ఋషియు నామరూపముల వనలముక్తుడై దివ్యుడగుపురుషుని పరాత్పరుని పొందుచున్నాడు.''16

అహమిక మిధ్యయనే సత్యాన్ని ఆవల ఉంచినా, ఋషి పోగొట్టుకొన్నది గణితమందలి శూన్యాన్నే; కాని ఆర్జించినది నిస్సీమ మగు సత్యాన్ని. ఆరుణాచలస్తుతిలో మహర్షి ''ఓయీ, అరుణాచలా! పరలాభమవగు నిన్నొసగి బదులుగా ఇహానికి పరానికి గూడ కొఱగాని నన్నుకట్టుకొని ఏమి బావుకొంటివయ్యా.''17 అని అడిగినారు.

ఆత్మకైన యీ శరణాగతి అంతిమమూ, పూర్ణమూ అగుటకు వేరు ప్రకరణంలో సూచించిన స్వస్వరూపవిచారం అనుసంధించవలె. భక్తిలో పరాయణం వరణాగతి కనుక ముముక్షువు స్వస్వరూపాన్న త్యంతం భక్తి సేయవలె. ఈ భక్తి పండిననాడు విచారమార్గ మందడుగిడి తత్పరతమైసాగి సఫలుడై ఆత్మసాక్షాత్కార మందుకోగలడు.

- * -

______________

16. యధానద్యః సముద్రేవస్తం గచ్చన్తి నామరూపే విహాయ | తథా విద్వా9 నామరూపా ద్విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యమ్‌ || ముండకోపనిషత్‌ iii, 8

17. అక్షరమణమాల, 9వె.

Mahayogama    Chapters