Mahayogama    Chapters   

ఓమ్‌

మహాయోగము

೫. జగత్తు

- * -

ఆత్మసత్యాన్ని కనుగొని తీరవలెనన్న నిశ్చయంతో అన్వేషణ నాపులేక సాగిస్తే ఆ సత్యం సాక్షాత్కరిస్తుంది, వెలితలపులేవీ చెనక కుంటే మనస్సాపని చేయగలదు. విక్షేపంలేని మనస్సు ఆత్మసాధనకు యుక్తమైన ఉపకరణం. అరుణాచలర్షి పరంగా మనస్సట్టి ఉపకరణ మైంది. విచారం నుండి మరల్చే యోచనాధార కాధారమైన వాంఛా సక్తులు దానిని కలుషితం జేయలేదు. అట్టి ఆ మహర్షికి జగత్తును గూర్చి వాదోపవాదాల ప్రసక్తియేమి? ఆయన అన్నారు: 'జగత్తు సత్యము కాదు, అది మిథ్యాదృశ్యము. లోకము జ్ఞానము కాదు, జగము సుఖము కాదు అని పలికి లాభ##మేమి? జగద్దృష్టి తొలంగితన్ను దా నెఱింగి యొకటి రెండును మాని 'నేను' లేని స్థితి సర్వ సమ్మతము.1

ఇచట మహర్షి ఏ స్వల్పమో పొరబడినట్లనిపిస్తుంది. ప్రపంచ మన్న వైముఖ్యం కూర్చే 'నాహం స్థితి' మనమందరమూ సమ్మతించేదే అయితే ప్రపంచమేమైతే మనకేం? కాని అహంత లేని స్థితిని గూర్చివినిన

________________

1. చూ. అనుబంధం 'క', 'శ్లో. 8: ఉ. న. 3

వారే క్రొద్దియో! ఆ స్థితి నభిలషించేవారు అంతకూ తక్కువే. మరి అందరూ దాన్ని భజించేవారే అనడంలో మహర్షి భావమేమి?

అందుకు వారి వివరణం సాంప్రదాయిక బోధలతో పూర్ణముగ మేళవిస్తున్నది. నిజమే, నిరహంకార స్థితిని అందరూ తెలిసే వాంఛించడంలేదు. తమకు తెలియకున్నా వారు కాంక్షించేదదే అట్లుకాకుంటే అదే స్థితికేనయైన కలలెఱుగని గాఢనిద్రను వారంతగా ప్రేమించరు. గాఢ సుప్తి ''నాహంత'' అంత ఉత్తమంగాదు. సుప్తి సుఖదమే; కాని ఆ సౌఖ్యం 'నాహం స్థితి'' సౌఖ్యానికి దరిదాపులకురాదు కాని రెండు అంశాలో ఆ స్థితులు రెండూ సరిగా సమమే - వాక్కు, అహంకారములు లేకుండుటలో. సుప్తిలోని నిరహంత పూర్ణమేల కాదో తరువాత వివరిస్తాను. దానిలో అహంకారంలేదు. కనుకనే అది అవాక్కు అయింది. ఆ కారణంగా సుఖి కాగల్గింది. అదియే కొంచెమో అసంపూర్ణంకావచ్చు; కాని నిద్రాసక్తుడు తనకు నాహం స్థితియం దాసక్తి లేదనగా వినము. మనం యధార్థంగా కోరేదేమో మనకు తెలిసే ఉంటే ప్రపంచ విషయ చర్చతో పనేలేదు. మన మాదరించవలసింది ఆత్మనేగాని, అనాత్మనుగాదు. కత్తిరించిన జుట్టు కుప్పను చెత్తతొట్టిలో పారమేయక పరీక్షించే మంగలివలె అనాత్మ విషయంగా మనకెందుకీ తెలివి తక్కువ పరిశీలన?2

అనాత్మ విషయ శోదనలు వృధలూ హానికరాలూ, వానివల్ల ప్రధానమైన ఆత్మవిచారం వెనుకబడుతుంది. అవి ప్రపంచ నైజాన్ని సరిగా వివరించవచ్చు. కాని అంతటనైనా ఆత్మాన్వేషణకు పూనుకొనకపోతే ఆవిలంబం, విలంబమే.

కొందరికి ఆత్మసాధనలో శ్రద్ధాభక్తులున్నవి. కాని విచారంలో వారి మనస్సు పరిపరి విధాల బోతుంది. అట్టివారికి ఇందలి చర్చకోర

__________________

2. చూ. అనుబంధం, 'చ', శ్లో. 212

తగిందీ, ఉపయోగకరమూనూ. వారు సంసారబంధం నుంచి విడుమరనెంతైనా కోరుతారు. కాని సాధనావసరాల్లో, ఎన్నరాని తలపులతో వారి మనస్సులు నిండి, ఆత్మవిచారం కుంటుపడుతుంది.

మనః ప్రవృత్తి సహజంగానే ప్రపంచాభిముఖం; ఆత్మాభిముకం కాదు. దాని నెట్లో ప్రపంచం నుండి తిరిగి, అంతర్ముఖమూ, ఆత్మ లగ్నమూ చేసినా, అది కట్టు త్రెంచుకొని ఎట్లో ప్రపంచంలోనికే చేర బారుతుంది.

మనంగా వాటిని కోరము, కాని ఆ తలపులు మనస్సులో చొరబారుతవే అదేమి? జగం తధ్యమని నమ్ముతాం గనుక, అని ఋషులంటారు.

తన రచనల్లో ఒక చోట రమణులు ఈ జగం నిజమన్న నమ్మకం లేకపోతే ఆత్మసాక్షాత్కారమెంత సులభమయ్యేదో అని వాకొన్నారు.3 మహర్షి అనేట్లు సర్వాదా ఆత్మేయే అయ్యుండిన్నీ ఆత్మతో ఏకం కావలెనన్న యీ మన యత్నం4 వింతలకూ వింతగదా? అది లక్ష్యంగా మన యీ శ్రమలన్నీ తలపోసి, నవ్వుకొనేరోజు రానే వస్తుంది. కాని ఆ నవ్వులనాడు సిద్ధించెననుకొన్న సత్‌, ఇప్పుడూ ఉన్నదే. మనం ఆత్మ కానక్కఱలేదు; ఆత్మయే మనం.

ఈ నమ్మకానికి ఆత్మవిచారంతో జోలి యిట్లు : మనంసత్‌ గా గ్రహించిన ప్రతి యోచనకూ మనస్సులో ప్రవేశించే అర్హత ఉంది. ఆ హక్కు త్రోసిపుచ్చరానిది. ఒకరి యిష్టానిష్టాలకు లోనయ్యేది కాదు అదీగాక, మనం ప్రపంచం సత్యమని భావిస్తున్నాం. అది సత్యమే, కాని మనమనుకొనే అర్థంలోగాదు. ఈ అయధార్థ భావనను

3. చూ. అనుబంధం 'చ', శ్లో 4.

4. చూ. అనుబంధం 'చ', శ్లో 96.

త్యజించనంతదాకా ఆత్మసాధన అసాధ్యమే చేస్తున్నాం ఆత్మను మఱుగుపెట్టేది యీ జగమే.

అదెట్లు? ప్రపంచాని కాధార సత్యమాత్మయేయని ఋషులున్నారు. త్రాడును పామని భ్రమించినపుడు పాము త్రాటిని మఱుగిడినట్లు, జగత్తు ఆత్మను మాటుపఱుస్తుంది. ఉన్న సత్యమేకము : మన అజ్ఞానంవల్ల అది జగత్తుగా తోస్తుంది. ఆ అజ్ఞానావరణ దాటినపుడు అది ఉన్న రూపున ఆత్మగా భాసిస్తుంది. నామరూపకాల దేశాలచేత అవిఛ్చిన్నమై అనేకంగా అగపడే యీ ప్రపంచం, ఆత్మానుభూతి యప్పుడుకేవల మాత్మగా అభేద్య సత్యంగా, నామరూపరహితంగా, దిక్కాలాద్యనవచ్ఛిన్నంగా, అవికార్యంగా తెలియనౌతుంది. పై చూపులు లోస్వరూపాన్ని కప్పుననడం రూఢమే. త్రాటిని పామని భ్రమించినంతకాలం త్రాడు త్రాడుగా రూపుగొనదు. సర్పఆరోపం, రజ్జు సత్యాన్ని పూర్తిగా దాచేస్తుంది. ఆత్మను ప్రపంచంగా భావించినంతకాలం, ఆత్మ ఆత్మగా భాసించదు. ప్రపంచారోపం ఆత్మను పూర్తిగా మఱిగిస్తుంది; ఆరోపాన్ని వదల్చునంత దాకా స్థితియదే. అది అయధార్థమని మనం తెలిసికొన్నంతవరకూ ప్రపంచారోపం వదలదు. ఈ రీతిగానే రజ్జును పాముగా చూచే వానికి రజ్జువు లేనట్లే, ప్రపంచాన్ని సత్యంగా భావించేవానికి ఆ సత్యం - అదే ఆత్మ - అమూలకమైనట్లే. ఆ కారణంగా సత్య మొకటున్నదని దృఢంగా నమ్మినా, అట్టివాడు నాస్తికుడే.

ఇట్లు మన యీ కల్ల నమ్మకంవల్ల మన సంపత్తిలో - అది సంపత్తి అనవీలుంటే - అతి ప్రియమూ, మకుటాయమానమూ, పరమమూ, ఆనందమయమూనైన ఆత్మ, అప్పటప్పకి మనకు దక్కకుండా పోతున్నది. అంతకు మించిన నష్టం మరేముంటుంది?

కాని ఆత్మభావన మనకు నైసర్గికం, విశ్వాని కవ్వలి యే సత్యాన్నీ ఊహించలేక యీ ప్రపంచలోనే ఒక ఆత్మను కల్పిస్తున్నాం. దేహాత్మ భావనలవల్లనే యిది సంభవిస్తున్నది. కాని మనకు దేహాలు రెండున్నవి - శారీరకంస్థూల దేహమూ, మానసికం సూక్ష్మదేహమూ, అందుచేత వానిలో నేయొకటినో, లేక ఆ రెంటినో ఆత్మగా గ్రహింపక తప్పదు. ఈ రెండూ అజ్ఞానానకి దారులే నిజమైన ఆత్మ దేహమూగాదు, మనస్సూగాదు. అజ్ఞానానికి వశులమై మనో దేహాల కతీతమైన ఆత్మను ఊహించుటకునూ ఆశక్తులమౌతున్నాము. కాబట్టి ప్రపంచాన్ని ప్రపంచంగానే తథ్యమనుకోవడం మానకుంటే, యధార్థమూ ఋషులు చెప్పినదీ అయిన ఆత్మ మనకు సిద్ధించదు ఆత్మ విచారావసరాల్లో జగత్తూ శరీరాల గూర్చిన తలపేరానంత మనశ్శుద్ధీ, చిత్తైకతా అరుదు; కనుక అంతవరకూ మూలావిద్య తోలగడానికి జగత్తు సత్యమనే భావనను పూర్తిగా విడనాడవలె. అందువల్ల మనం యీ జగత్తును గూర్చి ఋషుల వివరణలెల్ల శ్రద్ధగా విని, వారిబోధలు సత్యములని తాత్కాలికంగానైనా మన్నించవలె.

అరుణాచలర్షి చెప్పేట్లు జగత్తు సత్యమూ, మిథ్యా గూడ. ఇందు వచోవ్యాఘాతమేమీ లేదన్నారు. ఒక అర్థంలో అది నిజం: మరొకటకల్ల. అది నిజమెట్లంటే ప్రపంచంగా మనకు కనుపించేది ఆత్మసత్యం యొక్క అంశ##మే గనుక. ప్రపంచ మాత్రంగా భావిస్తే అది సత్యాభాసం, ఆ విధంగి మిథ్య. సత్యానికి వేరుగా జగానకి నిలుకడ యెక్కడిది? అది ప్రపంచంగా కనుపించిన మాత్రాన సత్యం బాధితంగాదు : అది ప్రపంచమెన్నడూ కాలేదు. త్రాడు నిజంగానే పాము కాలేదుగా?

ప్రపంచం ప్రపంచ మాత్రంగా మిథ్యయే. కాని అంతా మిథ్య గాదు. ఏలంటే ఆ ఆభాస దృశ్యం వెనుక, యధార్థమైన ఆత్మకొంతకు కొంత దాగియుంది. అంటే జగదంతరితమైన ఆత్మ తానున్న రూపున కన్పించదు. దీనినే క్లుప్తముగా మాయావాదమంటారు. జగత్తు మాయ, అళీకమైన సత్యాభాసం, ఉన్న దానిని వేరొక రూపున కన్పింపజేసే గుహ్య శక్తియని మాయను నిర్వచింప వచ్చును.

ఈ మాయావాదం అతి తీవ్ర వివర్శకు గురియైంది. ఇది ఉపనిషత్తులలో లేదనీ. పిదప కాలం వారిచే ప్రక్షిప్తమై శ్రీ శంకర భగవత్పాదుల ఆమోదమందినదనీ ప్రతిపాదన. మనకు ప్రమాణము అరుణాచల మహర్షి ప్రవచనం యీ చర్చకు చరమవాక్యం.

విషయాలు పూ చూపలురూపుల నుండవన్నది మన మెఱింగిందీ ఒప్పుకొనేది కూడా. మాయావాద సారమూ అదే. నేటి విజ్ఞాన శాస్త్రాలు ముఖ్యంగా పదార్థ విజ్ఞానశాస్త్రం పదార్థముల మూలతత్త్వమదేయని సమర్ధిస్తున్నవి. సత్యం ఏకము, అచ్ఛేద్యము, అవికార్యము, అమలినము, అరూపము, దిక్కాలాద్యనవచ్ఛిన్నము. అట్టి దానిని మనం అనేకంగా, అగణ్యశకలితంగా. మార్పుజెందేదిగా, భయలోభ దుఃఖముకగ్గమయ్యేదిగా, పరిమిత దేశకాల రూపంగా చిత్రిస్తున్నాం. క్లిష్టపద బంధముతోడి యీ కథనాన్ని దిఙ్మాత్రంగా మాయావాద మన్నారు. ఈ వాదాన్ని అంగీకరించే వేదాంత సంప్రదాయం అద్వైతం.

ఈ వాదం అసలు గిట్టనివారు దీన్ని ఒప్పుకొనే పనిలేదు. ఇది కేవలం అవిద్యను బంధకారణమని గుర్తించి, దానిని వదల్చుకో కాంక్షించేవారికే, వారి దృష్టికోణం వేరు; ఇతరులకు వలెగాదు. వారి కొసగే బోధ సైతం వేరగుట సహజమే.

మన సంప్రదాయంలో ఏ పొంతమూ అగపడని రెండు సిద్ధాంతాలున్నవి:- 1) సత్యం ప్రపంచాని కుపాదాన కారనం 2) ఆ సత్యం ద్వంద్వాలన్నిటికీ అతీతమై, వేనిచేతనూ బాధితంగాదు. ఈ రెంటినీ మాయావాదం సమన్వయపరుస్తుంది. అదీ దాని ప్రయోజనం సత్యం యధార్థంగానే బహు రూపాలలవరచుకొన్నదని దృఢంగా నిశ్చయించు కున్నవారు యీ వాదాన్ని అంగీకరించే పనిలేదు. వారి ఆధ్యాత్మిక పురోగతికి మన సనాతన సంప్రదాయమూ ఋషులూ వేరు మార్గాల నిర్దేశించియే యున్నారు. కాదు కూడదు మా మార్గమే సరియనేట్లైతే వారి యెడల ఋషులకెట్టి విరసమూ లేదు. కాని అజ్ఞానాన్ని అధిగమించడానికి ఈ వాదాన్ని అంగీకరించక తప్పదు ఏలంటే, ప్రపంచం ప్రపంచంగా తథ్యమైతే, అవి కార్యమైన సత్యానికి తావేది? అదిలేక ముక్తి యెక్కటిది?

ఈ గతిగా జగద్విషయక బోధ ద్వివిధం (two - fold), ఈ దృశ్య ప్రపంచానికి మూలసత్యం ఆత్మయేయని నిర్వచించేదొక భాగం. దీన్ని తరువాతి భాగం నుంచి జాగ్రత్తగా వేరుచేయవలె. ఆ పిదపది, ప్రపంచం ప్రపంచమాత్రంగా నిజం కాదంటుంది. ఈ ప్రాతిపదిక మనకెంతో అవసరం. ప్రపంచం అదిగా సత్యమనే వాదానికిది విఱుగుడు. కాని ఆ మొదటి భాగం అర్థం చేసుకోవడం సులభంగాదు. జగత్తుపరంగా అది పూర్తి నిజం కాకపోయినా జగత్తు మిథ్యయనే విశ్వాసం అలవరచుకొనడం ఋషుల శ్లాఘిస్తారు బోధను పూర్ణంగా అవగాహన చేసుకోలేనివారు జగన్మిధ్యాత్వాన్ని నమ్మగలిగితే సరియైన దారిలోనున్నట్లే.

జగత్తుకల్ల అనుకోవడం క్షేమం; గత్యంతరం జగత్తు అదిగా నిజమని ఒప్పుకోవటం గనుక, ప్రశ్న ఏదైనా దానికి జమాధానం అటూ ఇటూగాక మధ్యంతరంగా నిలిచి పోవడాన్ని మనస్సు సామాన్యంగా సహించదు. ఏదైనా సరే, ఇదమిత్థం తేల్చుకొంటేనేతృప్తి.

ప్రపంచం తద్రూపేణ కల్లయనుటకు ఉపవత్తులు ఎన్నో యిచ్చి యున్నారు. వాని నిందు పరిశీలిస్తాము.

మొదటిది మన యనుభవానికి కూకటి వేరైన ఆవిద్య, మహర్షి నొకరడిగారు-- ''ఎల్ల వేళలా, ఎన్నో విధాల నాకు తెలియవస్తున్న యీ జగత్తు నిజంకాదనే వాదాన్ని ఒప్పుకోవడ మెట్లు?'' దానికి మహర్షి యన్నారు : ''ఈ ప్రపంచం నిమని నిరూపింపజూస్తావు. కాని నిన్ను నీవెఱుగక తన్ను దెలియ యత్నించే నిన్ను జూచి ఆ ప్రపంచమే నవ్వుతున్నది.'' మనల్ను మనం సరిగా ఎఱుగమని గ్రహిస్తే ఆ పిదప ప్రపంచాన్ని సరిగా ఎఱుగుదుమని నటించగలమా! ఈ వాదాన్ని మహర్షి యిట్లు వివరించారు. ''ఎఱిగెడు తనను ఎఱుగక యితరము నెఱుగుట యజ్ఞానమేగాని జ్ఞానమగునా? జ్ఞాన ఇతరముల కాధారమైన తనను ఎఱింగినచో జ్ఞానాజ్ఞానములు నశించును.''5

ఈ వాదబలం పూర్తిగా గ్రహించినవారికి, ఇతర చర్చలనవసరం, లోకవిషయక విజ్ఞాన సర్వానకి ఏకైక మూలం అవిద్యయని తెలిసినంతనే, ప్రపంచం ప్రపంచ మాత్రంగా కల్లయని తానుగా స్పష్టమవుతుంది. ఆ లోగా దీని గూర్చిన విశేష చర్చ ఉపకరించవచ్చు.

ప్రపంచం తానుగా నిజం అనడానికి నమ్మదగ్గ ఆధారాలేవీ లేవు. అట్లని త్రోసివేస్తే నిజమని నిరూపించే భారాన్ని అట్లనేవారిపై మోపుతున్నామని ఆక్షేపణ రావచ్చు. నిరూపించవలసిన బాధ్యత ఉన్నదనే వారికేగాని, లేదనేవారికేం పట్టింది? ముక్తసరిగా ఆ ఒక్క మాటతో వారు తృప్తిపడవచ్చు. ఆ నిబంధన న్యాయశాస్త్రం ఒప్పేదే. తత్త్వ శాస్త్ర నియమాలు మరొక విధంగా ఏల ఉండవలె? ఆ నియమానికి కారణమిది. లేని దానిని నిరూపించవీలుగాదు. ఉన్నదని నిర్దేశించిన దేనినైనా ప్రమాణీకరించనేవలె. తన ఆరోపణను నిరూపించుటకు నిర్దోషమైన సాక్ష్యం సమకూర్చని నాడు ఆరోపణ వీగిపోయి ప్రతిపక్షం నెగ్గినట్లే. కాబట్టి జగత్తు జగత్తుగానే నిజమనే వారిపైన్నే దాన్ని ధృవపరచే బాధ్యత మోపడం సరియే. వారు సంకలించిన సాక్ష్యాన్ని పరీక్షించి చూద్దాం. అది ఏదైనా నిశ్చాయకం కాకపోతే వారి వాదన నిరాధారమని నిర్ణయం.

5. చూ. అనుబంధం 'క', శ్లో 16 : ఉ. న. 11

ఎలాగూ ఋషి వచన ప్రమాణం మనకుండనే ఉంది. కాని ప్రస్తుతం దాని నపేక్షించనవసరం లేదు.

చర్చ నారంభించక పూర్వం సత్యనిర్ణయానికి ప్రమాణం ఏర్పఱచుకొని దాన్ని కఠినంగా అనుష్ఠిస్తాము. సత్యానికి కొలమానం జనర సామాన్యం వాడుకలోనిదిగాదు : వారిది మూలాజ్ఞాన పరికరం, మన తెలివులనంతా మలినపఱచేది. కాబట్టి సత్యమప్రమాణంగా ఋషులు మన్నించేదే మనకూ అనుసరణీయం. దాని నిర్వచనమిట్లు - అని కారమూ, అవిరళమూనైనదే సత్యం, అంటే కాలదేశములచేత బాధిత మైన దేదీ నిజం కాజాలదు. సత్యానికి ఈ కొలమానం చిరకాలం నుంచీ పరంపరంగా ఉపయుక్తమౌతున్నదే. దానినే భగవద్గీత (అధ్యాయం 11, 16). 'నానతో విద్యతే భావో, నాభావో విద్యతే సతః' అన్నది. ఉనికి అసత్యానికీ, లేమిసత్యానకీ చెందినవి కావు. సత్యానికీ దృశ్యానికీ భేద మెన్నడంలో ఛాందోగ్యోపనిషత్తు ఈ నికషాన్నే గ్రహించింది వేద శాస్త్రసంప్రదాయార్థ ప్రకాశనంలో కడు దిట్టయని శంకరులంతవారు కొనియాడిన గౌడపాదాచార్యులు సత్య పరీక్ష నిట్లు విధించారు. ''ఆదావంతౌచ యన్నాస్తి వర్తమానే7పి తత్తథా'' (మాండూక్యకారిక II, 7) - ఆద్యంతాలు లేనిది ఇప్పుడూ అట్లే. పై రెండు ఉద్ధరణలూ సూచించేదొకటే. ఏ విషయమైనా ఎన్నడేని ఉన్నట్లగపడ్డ మాత్రాన అది నిజం కాబోదు; నిజంగా ఉనికి గలది లేకుండుటలేదు, అని కదా గీత. గౌడపాదలు ఈ సూత్రాన్ని అన్వయించి తాత్పర్యం తెలిపారు - ఏ విషయమైనా ఎప్పుడుగాని క్రొత్తగా కనుపించ నారంభించి, తర్వాత అంతరించెనా అది సర్వదా లేనిదే.

అవికారమూ అవిరళమూనైన ఉనికి సత్యస్వభావం. సాతత్యం (సంతతమూ ఉండుట) కాలాది ప్రత్యయపరిధులను దాటుటను సూచిస్తుంది. సత్యం కాలదేశాలకు లోగదు: కార్యకారణ రూపేణ దేని తోనూ కలియదు. ఋషులనేట్లు, ఈ నిర్వచనం తాత్త్వికపరిభాషకు పూర్ణంగా అతికి ఉన్నది.

కార్యకారణ సంబంధాని కందకుండటం ముఖ్యం. అంటే మార్పు జెందమి సత్యానికి విడదీయరాని లక్షణమని దీని అంతరార్థం ఉండతగ్గతీరే అది. మార్పు నిజమే అయితే అది తత్పూర్వమున్నది కాదుగా. మార్పునకు లోనయ్యేది సత్యమెట్లునూ కాదు. కాలదేశాలచేత కట్టు వడ్డ విషయాలు విభజించ వీలచ్చేవి: వానికి మార్పు తప్పనిసరి. ఉదాహరణకు, మృత్తిక. దాన్ని ఎన్నిశకలాలైనా చేయవచ్చు., ఎన్ని రూపులైనా దిద్దవచ్చు. కాబట్టి అది సత్యం కాదు ఇట్లు అవిభాజ్యత సత్యానకి మరొక లక్షణం. దీని అన్వయమెట్లో తరువాత చూస్తాం.

సత్యం అన్యాపేక్ష లేక స్వయంగా నిలుకడగలది. తన ఉనికికి ఇతరాలంబనాలు కావలసి వస్తే అది సత్యంకాదు కాబట్టి మట్టి కలప లోహం ఇత్యాదులతో చేసిన విషయజాతం విథ్యలే. ఆ విషయాలతో పోలిస్తే వాని కుపాదానాలైన పదార్థాలు సత్యాలే. అందుచేతనే మన శాస్త్రాలూ, ఋషులూ జగన్మిధ్యాత్వం నిరూపించేపట్ల జగత్తును విషయజాతంగానూ, దాని కుపాదానాలను జగత్తుకు మూలకారణమైన సత్యంగాను బహుళంగా ఉపమిస్తారు.

ఉదాహరణకు, మట్టికుండ, కుండకు స్వయం స్థితిలేదు. దాని అస్తిత్వం మట్టి నుండి సంక్రమించింది. అందుచేత మన శాస్త్రాలు అది కుండయనడం సంకేతం, జనరూఢియేగాని, నిజానికది వట్టి మన్నే కుండగాకమున్ను అది మన్నే; పగిలిన పిదపా మన్నే. ఇప్పుడూ అంతే గాని రూపనామాలు దాన్ని కుండగా వ్యవహరిస్తాయి. కుంభాకారం తాత్కాలికం గనుక, కుండ కుండగా మిథ్య, కాని మన్నుగా తథ్య మనవచ్చును. అయినా మన్నుగా దాని యాధార్థ్యం సాపేక్షమే: అది విభాజ్యమూ, వికార్యమూ, కాలదేశ పరిమితులచేత అవిరళమూ గనుక, అలాగే తథ్యంగా పైకి కనుపించే జగత్తు గూడా. అది ప్రపంచం, వ్యావహీరికంగానే. దానకి, సత్యాపేక్షలేక స్వయం స్థితి లేదు. కాబట్టి ప్రపంచంగా మిథ్య; కాని ఆత్మగా అది సదా సత్యమే. అట్లయినా, పోలికలు బోధను పరిమితం చేయరాదు. ఇందు జీవ భూతమైన భేదమొకటుంది. సత్యానకి మార్పు అంటూ ఉన్నదా?

మూడు సాదృశ్యాల సాయంతో జగన్మిధ్యాత్వాన్ని తెలియ వచ్చన్నారు మహర్షి. (i) రజ్జు సర్పభ్రాంతి (ii) మరుమరీచిక (iii) స్వప్నము. ఈ మూడూ అవశ్యమే: మూటినీ కలిపే సమీక్షించవలె. మనం అన్వేషించే సత్యం సర్వాతిశాయి. ఏ ఒక్క సాదృశ్యమూ దాన్ని పూర్ణంగా వివరించదు. 6

రజ్జు సర్వోపమ ప్రయోజనం పరికించాం. త్రాడును సర్వమని భ్రమించాం, త్రాడని తెలియగనే సర్పం కనుపించటం మానింది. ప్రపంచ విషయమట్లుగాదు. అది ఆభాసమని తెలిసిన పిదపా, ప్రపంచం కనుపిస్తూనే ఉంది. మహర్షి బోధలవిని పూర్ణంననగా విశ్వసించామన్న ఒకరి యనుమానమిది. దీనకి సరియైన సమాధానమొకటే. పరోక్ష జ్ఞానం ఎంత అధికంగా ఉన్నా దృశ్య ప్రపంచం మాసిపోదు. అందుకు సాక్షాత్‌ స్వాత్మానుభూతి అవసరం. ఈ వివరణకిది తరుణం కాదని, మహర్షి మనగ్రహణ కనుకూలంగా మరియొక తుల్యరూపాన్ని ఉదాహరించారు - మరు మరీచిక, కేవలం కల్పితమని ఎఱుకపడ్డ తర్వాతా కనిపిస్తూనే ఉండేది. పాములాగే ఎండమావిగూడ ఆభాసమే. కాని అక్కడ నీరులేదని తెలిసినా ఎండమావి చూపట్టుతూనే ఉంటుంది. కాబట్టి ఆభాసస్థితి కొనసాగినంతమాత్రాన అది సత్యమైపోదు. కాని

_______________

6. పోలికలు నిర్ధారకాలు కావు. ఏ ఋషీ సాదృశ్యం చూపి దేన్నీ నిశ్చయిస్తున్నానను కొనడు. ఋషుల బోధలు, వారు ఋషులు గనుకే, ప్రామాణికాలు. వారుపమలను వాడటం అర్ధసౌలభ్యానికే.

శిష్యునికింకొక సంశయం. మృగతృష్ణ విలక్షనమైనది. ఎండమావిలో నీరు ఆభాసమని ఒప్పుకోవలసిందే. నిజం ఎఱిగిన తర్వాతకూడ దాని జాడ గోజరిస్తున్నా అది భ్రాంతియే, దప్పి తీర్చుకొనేందుకు కచట నీరు లభించదుగనుక, ప్రపంచస్థితివేరు. అది తీర్చే ప్రయోజనాలెన్నో! ఈ సంశయాన్ని అపవారించటానికై మహర్షి స్వప్నానుభవం గుర్తుకు తెస్తారు. కలలో కనుపించేవీ ఉపయోగించేవే. కలలోని ఆకలిని కలలో తిన్న ఆహారం తృప్తి చేయదా? ఈ సందర్భంగా స్వప్నావస్థకన్న జాగ్రత్‌ ఏ విధంగానూ మెఱుగుకాదు. జాగ్రదవస్థలోని అక్కఱలను తీర్చటానికి అందలి విషయాలెంత సంమర్థాలో, కలలోని అవసరాలు తీర్చడానికి కలలోని విషయాలూ అంతసమర్థాలే. మెలకువలో సుష్టుగా భోజనంచేసి పరున్నతడు, కలలో ఆకలితో అలమటిస్తాడు. స్వప్నంలో కుత్తుకబంటిగా స్వప్న భోజనం చేసినతడు లేవగానే ఆకలోయని అల్లాడి పోతాడు. గాఢ సుషుప్తునికి పై రెండూఅయధార్థాలే, స్వప్నోపమ నేర్పేదిది. ఏ విషయమేని అక్కఱకు ఉపయోగిస్తున్నట్లుండనూవచ్చు, అది భ్రాంతీకావచ్చు, నిజానికి అక్కరాతృప్తి రెండూ సరిసమానం అబద్ధాలే.

సత్యనిర్ణయానికి ఋషలు నిబంధించిన పరీక్షలో అది నెగ్గలేదు గనుక ప్రపంచం తదూపేణ నిజం కాదు.

అజ్ఞానమనే ఊబిలో నుంచి ఎట్టెట్లో తప్పిబయటపడ నెంచే సత్యాన్వేషిని ఈ బోధ ఉద్ధరిస్తుంది. కాని ఆ బోధను కాదనే మతాలు చాలా ఉన్నవి. ప్రతి మతానికీ వేర్వేరు విశ్వాసాలు, సిద్ధాంతాలు. అన్నీ కొంచెం హెచ్చుతగ్గుగా మన బంధనాలను బలపరిచే అజ్ఞాన వటువులే. అందుచేత ఆయామతానుయాయులు పై బోధను మన్నించలేరు. పై పెచ్చు దాన్ని పూర్వపక్షం చేయజూస్తారు. కాని అలాచేయడంలోసత్యపరీక్షకు ఋషులిడిన కొలమానాలు వారికి అడ్డువస్తాయి. వానిని తప్పుకోవటానికి వారు రెందువిధాల యత్నించారు. మొదటిది, ఋషినిర్ణీత మానమును నిరాకరించటం, కాని ఆ మానం సరియైనదన్నగిలి ఉన్నదేమో, ఆ మానప్రకారంగాకూడ ప్రపంచం సత్యమే అని వాదిస్తారు. అప్పటికీ వారియహం తృప్తి జెందక సత్యంలో తరతమాలు కల్పిస్తారు. దీన్ని అతాత్త్వికమూ, కృత్రిమమూనని ఋషులు గర్హించారు.

మనుజ సహజమైన దౌర్బల్యాన్ని గుర్తించి ఋషులు తమ నియమకాల నొకింత సడలించారు. జగత్తు పారమార్థిక దృష్ట్వా విధ్యయే, కాని వ్యావహారికంగా, మన మనస్సుల్లో అజ్ఞానం విభుతల వెలయించినంతకాలం, అది సత్యసమమని సరిపెట్టారు.

అటుపైన, ఋషులన్న, పై మతాలవారి కే ఆయాసమూ అక్కఱ లేదు. మనస్సోదేహమో, ఆత్మయేయని నమ్మేవారికి ప్రపంచంసత్యం కాదని పై బోధకర్ధం కాదు. వారికిది అజ్ఞానమన్న తలపూ దాన్ని వదల్చుకో నాతురతా రెండూ లేవు. మనలో నొక తెగవారున్నారు. వారికి తామజ్ఞానులమన్న స్పృహయేలేదు. ఇక దానిని పోద్రోయండని వారికి బోధించియేం? ఇతరులు తమ అజ్ఞానాన్ని గుర్తించి తప్పు కొని వెలికి రావలెనని శ్రద్ధగా శ్రమించేవారు. మన శాస్త్రవాఙ్మయం ఆ యిరు తెగల వారికై బోధనను రెండు తరగతులుగా తీర్చియుంది. మన సనాతన దర్శనాల్లోని యీ వైశిష్ట్యం ఇతర మతాల వారెఱుగరు అది గుర్తిస్తే వారికి న్యూనత తప్పదని వారికి కంటగింపు, వారందరూ సత్యమని నమ్ముతున్న జగత్తును మిధ్యయని త్రోసిపుచ్చడమేమని గుఱ్ఱు, అందుచేత వారు ఆర్షానుయాయులతో తగవులు పెంచుతారు. కాని మనకు వారియెడల ఎట్టివైమనస్యమూ లేదు. ఋషులు నిర్దేశించారు, ప్రపంచం తధ్యమన్న నమ్మకం వారికుంటే ఉండనీ, ఆ నమ్మకంతో ప్రపంచలో - అది యున్నంతలోనే - పొందగల్గినంతలాభమూరాబట్టుకోనీ, అందుకు మన అభ్యంతర మేమీ లేదు, కలలు నిజములని తమ్మునమ్మజేసుకున్న స్వాప్నికులువారు, మేలు కొననే యిచ్చగింపరు. ఋషుల ప్రబోధం రీత్యా, మనకీ ప్రపంచమొకకల; దానినుండి మెలకువకై మన తహతహ.

ప్రపంచానకి స్వయంగా అస్తిత్వం లేదని మహర్షి యిట్లు వివరించారు. ''లోకము, జ్ఞానము ఇవి యేకముగబుట్టి నశించిననుజ్ఞానము చేతనే లోకము వెలుగును. లోకజ్ఞానములకు భవలయ(పుట్టు నశించు) స్థానమై భవలయములు లేక వెలుగు పరిపూర్ణమైనదియే ఆవస్తువు''7

ఇది పూర్వం తెల్పినదాన్నే జ్ఞప్తిచేస్తున్నది. కాని దాని ప్రాముఖ్యం మనకింతవరకూ గుర్తురాలేదు. మనస్సుపుట్టగనే, అంత వరకూ నిద్రలో లయమూ మాయమూ అయ్యుండిన జగత్తుగోచరించ మొదలిడుతుంది. మనస్సు ప్రవృత్తమైనంత కాలం, అది సాగు తూనే ఉంటుంది. మనస్సు నిద్రలో లయమైనపుడు అదీఅడగిపోతుంది మళ్ళీ అది మనకగపడటం, మెలకువతోబాటు మనస్సు మరల ప్రవృత్తమైన తోడనే. నిద్రలో మనస్సులేదు. జగత్తు గోచరించలేదేమంటే, మనస్సూ జగత్తూ రెండూ మిధ్యలేగనుక అవి అవిరళంగా కన్పించక పోవడమేగాదు; ఎందు వాని జన్మలయములో ఆ సత్యానికి వేరుగా వానకి నిలకడలేదు. ఋషుల కొలమానం ఆదరించి వర్తింపచేస్తే, అవి సత్యాలు కాదనటం స్పష్టమే.

మనస్సూ జ్ఞానేంద్రియాలూ నిద్రలోలేనందున ప్రపంచం అగపడదేకాని మరోగతి కాదని వాదింపవచ్చు. దీనికి సమాధానం సులభ##మే. నిద్రలో మనస్సులేదు నిజమే, కాని మనం అక్కడ ఉన్నాముగా, జగం నిజమయితే దానిని మనకు కన్పించ నీయనిది అక్కడే ముంది? మనస్సూ జ్ఞానేంద్రియాలూ నిద్రలోలేమి జగమగోచరమ

_____________________

7) చూ. అనుబంధం, 'క' శ్లో 12 : ఉ. న. 7, ఇందు ''జ్ఞానము'', విషయజ్ఞానము.

య్యేందుకు కారణం కాదు. యదార్థాన్ని పరికించటానికై సత్యాత్మ కే ఉపకరణమూ అక్కఱ లేదు. శాస్త్రాలు ఆత్మను జ్ఞానచక్షువని వర్ణించాయి. దేన్ని గ్రహించడానికైనా మనస్సుకు ఇంద్రియాలకూ ఆధారమదే. సత్యమును తెలిసే దాని శక్తికి క్షతి యెన్నడూ కలుగదని శ్రుతులన్నవి. నిద్రలో జగం కన్పించని కారణం, అచట జగత్తు లేమియే.

దీనినే మహర్షి మరియొకవిధంగా వివరించారు జగత్తు దేహానికి అస్యంగాదు; దేహం మనస్సు కన్యంగా విద్యమానంగాదు; మనస్సు చిదభిన్నము; చిత్తుసత్తుకు వేరుగాదు: అది నిర్వికారమూ నిత్యమూఅయిన శాంతి.8

''మనోదేహాలు రెంటికీ జన్మలయము లెటనో అది సత్యమన్నారు కాని అసత్యమున్నదని ఏమినిశ్చయం?'' అని ప్రశ్న. 'ఈ విధ్యల జంట పుట్టు చావులకు మూలసత్య మొకటి ఉండవలె'నని సమాధానము.

ఈ బోధనంగీకరించడంలో ఒక బాధఉంది. ప్రపంచం మనకు వెలిగానుందనీ, మనం దేహమనీ, కాకుంటే మనస్సనీ, తలపోయటం మునకలవాటైంది. జగత్తుతో పోలిస్తే మనస్సతి సూక్ష్మంగదా, ఇంత విశాల విశ్వం దానిలో ఎట్లిముడగలదో ఊహించనైన సాధ్యంకాదు. ఈ సంకటం, కాలదేశాలు యదార్థాలన్న భావనతో కలసి క్లిష్టమైంది. కాలదేశాలు జగద్దృశ్యంతో విడదాయరానివి. వాని అవధుల్లోనే ప్రపంచం కనుపిస్తుంది. నిద్రలోనో నిరహంకారస్థితలోనో ప్రపంచం అగోచరమైనపుడు కాలదేశాలు మిగిలి యుండవు.

ఈ సంశయ నివారణం తేలికే. ఆమన యూహాలు ఆధారం

________________

8) చూ. అనుబంధం. 'చ' శ్లో. 19.

లేనివి. మూలజ్ఞానం అజ్ఞానాలనుండి పొడుచుకొని వచ్చిన కలుపు మొక్కలు పెకల్చివేయ తగ్గవి.

జగత్తు మనకు బాహ్యమైంది. ఇంద్రియాలు గుర్తించిన విషయజాతంతో నిబిడమైంది. అదివాస్తవిక సత్యం. (Objective Reality.) తల పులన్నీ స్వకీయాలు స్వాశ్రమాలు Subjective) గనుక నిజాలు కావని ఒక వాదం.

వాస్తవం నిష్పాక్షిక మనుకోవటం అమూలకం, కృత్రిమమని ఋషులు వచించారు ప్రపంచం కేవలం మానసికమే. ఈ వాదాన్ని అరుణాచలర్షి ఇట్లు వివరించారు: ''లోకము (శతాబ్ది) పంచ విషయాత్మకము వేరుకాదు. ఆ పంచవిషయములు జ్ఞానాది పంచేంద్రియ గోచరములు. ఆ పంచేద్రియముల మూలముగ ఒక మనస్సేలోకమును ఎఱుంగుటచేత లోకము మనస్సే యగును మనస్సు లేక లోకము కలదా? చెప్పుము''9

ఇచట మహర్షి మన దృష్టికి తెచ్చినది అన్ని శ్రేణుల తాత్త్వికులూ సమ్మతించిందే ఈ సందర్భంలో జర్మన్‌ తాత్త్వికుడు ఇమ్మాన్యుయల్‌ కాంట్‌ పేరు చెప్పుకోవలె, అతడు విపులీకరించినట్లు, మనం గుర్తిస్తున్నది సదసత్యంశయానకి తావిచ్చిన ప్రపంచమునుగాదు. అనవరతమూ మార్పు జెందుతూన్న శబ్దస్పర్శరూపరసగంధాది సముదాయాన్ని. బాహ్యమంటూ ఒకటి ఉంటే, ఈ గుణము (Senaation's) లచ్చటివిగావు. లోనివే, అంటే మనస్సులోనివే అనుటను నిరాకరించరాదు. వేదాంతస్పృహలేని విజ్ఞానశాస్త్రవేత్తలతో సహా అందరూ దీన్ని ధారాళంగా ఆమోదిస్తారు. అవి మనస్సులో పోవడమే తలపులు. వాని తోడ్తోనే విషయాత్మకమైన బాహ్యమొకటున్నదన్న భావన. అదే యీ గుణముల (Sensations) జన్మకారణం. గుర్తించవలసిం

____________________

9) చూ. అనబంధం. 'క' శ్లో, 11 : ఉ. న. 6.

దేమంటే అచ్చంగా యిదే విధమైన ప్రతీతి కలల్లోగూడ జనిస్తుంది. కలలు సమసిందాకా సుదృఢమూ శక్తి సంపన్నంగా ఉంటుంది. జగత్తువాస్తవిక సత్యమని ఘోషించేవారు ఈ గుణాలు నిజంగా బాహ్యవిషయ జాతాలని నిరాపేక్షంగా నిరూపించవలసిఉంది. ఆ బాధ్యతవారిది. వారివాదం వీగిపోయేదని ఋషులుచెప్పిన కారణాల వల్ల తెలుస్తూనే ఉంది.

వారువివరిస్తారు : జగత్తుసత్యమే. ఏ కొందరో నిదురగూరి చూడలేని మాత్రాన అది కల్ల కాబోదు, కొందరు నిద్రిస్తే ఇతరులు మేలుకొనిలేరా, వారు ప్రపంచాన్ని చూడరా? కాబట్టి ఒకరు కాకుంటే మరొకరు ప్రపంచాన్ని చదా చూస్తూనే ఉన్నారు. ఇట్లు విశిష్ట వ్యక్తులని వారూహించిన అందరి జాగ్రదవస్థలనూకలిపి, కూడి, జగత్తు అవిరళంగానే గోచరిస్తున్నదని సాధిస్తారు. జగత్‌ సత్యంనిరూపితమని వారి నమ్మిక. ఒకడు నిద్రనుండిలేస్తాడు; నిద్రలో తాను ప్రపంచాన్ని చూడలేదని జ్ఞప్తికి వస్తుంది: తాను నిద్రిస్తున్నపుడు జగత్తు ఉన్నదో లేదో అని సంశయం. అయితేనేం, అపుడు మేలుకొని యున్న యిరుగుపొరుగుల నడిగితే చాలు, ఆమధ్యంతరంలో ప్రపంచం అగపడుతునే ఉన్నదని తెలిసిపోతుంది.

ఈ సాక్ష్యాం నిశ్చాయకంగాదు: అసలది సాక్ష్యమేగాదు. ఒక నిద్రితుని విషయం పరిశీలిస్తాం. మేలుకోగనే వాడు తన నిద్రవలేళలో ప్రపంచం సాగుతూనే ఉందో లేదో ఎదురులేని సాక్ష్యంతో నిర్ధరింపగోరినాడనుకుందాం. తన నిద్రలో కాలమొకటి యున్నదనీ, కాబట్టి అది నిజమనికూడా నమ్మినాడనుకుందాం. ఇంతకూ వాడనేదేమి? వానితోపాటు నిద్రించని వారిమాట సాక్ష్యంగా పాటించమనేనా? కాని మనం శంకిస్తున్నది ప్రపంచయధార్ధ్యాన్ని. అతని ఆ సాక్షులు ప్రపంచంలోని వారుకారా? తాను మేల్కోగానే కనుపించిన ప్రపంచం సత్యమాయని శంక. ఆ సంశయం యీ సాక్షులకూ వర్తించదా? ఒక అపవాదితో మహర్షియన్నట్లు, నిద్రలో అతడా సాక్షుల నెఱుగడుగదా? ప్రపంచయాధార్ధ్యంలాగే వీరి యాదార్ధ్యమూ సంశయాస్పదమే. ఇక ఆ సంశయం తీరేదెలాగు? ఆ నిద్రలేచినతడు ఆ సాక్షుల నిలకడను నమ్మటానకి అన్యాపేక్షలేని సాక్ష్యంవలదా? అట్టి సాక్ష్యం వెలికి రాలేదు. వారిని తాను చూస్తున్న మాత్రకే వారు నిజమని నమ్మవలె. తాను నిదురించక పూర్వం వారిని చూచి యున్నారనుట అప్రస్తుతం : అట్లే జగత్తునూ చూచియుండలేదా? ఇది సిద్ధ సాధనను (Begging the questions), నాజూకుగా నిర్వహించటమే, ఈ యత్నం జగన్మిధ్వాత్వాన్ని అపాస్తంచేయదు. దృఢతరం చేస్తుంది. అంతకునూ బలవత్తర నిరూపణం వేరేమి?

జగత్తు కనుపించటం వరకు అందరికీ సమానమే. అందుచేత అది వాస్తవిక సత్యమని మరొక వాదం. ఇదీ అనుమానించతగ్గదే. జగత్తును గూర్చిన అభిప్రాయాలెన్నెన్నో, వాని వైవిధ్యమెంతలో అందరెఱిగిందే మాటవరసకు వారి యభిప్రాయాలు మేళగిస్తాయనుకుందాం : అయినా, మహర్షి యన్నట్లు, యీ వాదం ద్రష్టల్లో విభిన్నత నాపాదించిన దోషంచేత గ్రాహ్యంకాదు. ''చూపరుల సమ్మతి'' కలరూపు ఏమంటే వారందిరలోనూ చూచువాడొక్కడే. కాబట్టి ఆ సామ్యం అదిపత్యమగుటవల్ల కాదు. వారి వాదానికి కాళ్ళులేవు.

నిజమిది. మనస్సు తన్ను తానెంతగానో వంచించుకోగలదు. తన ప్రవృత్తులకనుగుణంగా 'బాహ్య' మనే ఉపాధిని, దానితోనే ఒక కైతవ ప్రపంచాన్ని సృజించి, ఆప్రపంచాన్ని బాహ్యంలో ప్రక్షేపిస్తుంది. ఈసృష్టీ ప్రక్షేపాలు ఎట్టి యిచ్ఛా సంకల్ప సరణినీ గావు. అందుకే బాహ్య విషయజగత్తుల ఉనికిని మనస్సు శంకించదు. మనస్సు తానైకోరి సంకల్పించియుంటే యీ జగత్తు ఎంతో సుఖవంతంగా తీరేది. అట్లు కానికారణం ఆసృష్టి బుద్ధి పూర్వకం కానందున్నే. ఇది కలల్లో విశదమౌతుంది. అచట మనస్సు ఒక స్వాప్నిక ప్రపంచాన్ని సృజించుకొంటుంది; కాని అది జాగ్రత్‌ ప్రపంచానికన్న ఎక్కువ సుఖాన్నీయదు : సరికదా, అదివ క్షుద్రంగా, భయంకర దృశ్యాలతో నిండి నరకాన్ని పోలినా పోలవచ్చు.

మనస్సు ఆత్మవంచనా సమర్థం. తానైజగత్తును కల్పించి, ఆ జగత్తు చేతనే మోసపోవడం సామాన్యానుభవమే. అసామర్ధ్యమే కలల కారణమని మనకు తెలుసు. కలసాగినసేవు అస్వప్న జగత్తు సత్యం గానే తోస్తుంది; కాని కలలో గన్నది నిజమాయని నిద్రితుడనుమానించి పరిశీలిస్తే వారు కనుగొనేది తాను కలగంటున్నానని కాదు, తాను పూర్తిగా మేలుకొన్నానని, ఎవరుగాని కలగంటున్న సమయంలో తానుకలగంటున్నానని తలపోయడం పృకృతి సహజం గాదు.

కాని యిదే ప్రవృత్తి జాగ్రదవస్థలో గూడ కనవస్తుంది. తన పృథక్కరణ సామర్థ్యం వల్ల మనస్సు దేనికనుకొంటే దానికి, కలల్లో వలెనే, తానే మోసపోయేంతగా, సత్యపుమైపూత ఇవ్వవచ్చు. గాఢచింతన, దానిఫలితంగా మనః కల్పిత మూర్తుల వైశద్యాలబట్టి, సత్యభావన బహురీతుల నుంటుంది. సురచిత నాటకాన్ని రంగస్థలం పైన నిపుణంగా ప్రదర్శించినపుడు, కాసేపే అయితేనేం, మనం చూచేది సత్యమేనని భ్రమిస్తాం ఒకసాహితీరససిద్ధుని నవల చదివేప్పుడూ అలాగే జరుగుతుంది. ఈ రెంటనూ, పాత్రలకూ ఘటనలకూ అస్తిత్వం లేదు. కాని అవి రేపే రసావేశం ఇంతంత గాదు కళాకారుల కౌశలమూ, చూచువారల ఊహశక్తి మేళవించి సత్యభ్రాంతిని కల్గిస్తాయి. పాత్రధారి నైపుణ్యం సరియైన స్థాయి కాకుంటే మన అనుభవము సమ్మోహమూ పలుచనై, దుర్బలము లూనై, మనకేపాటి సత్యభ్రమా కల్గదు. అది పనిగా పరిపోషించింది కాకుంటే, కళాభినివేశంలో ఏజీవీ ఏకళాకురునికీ తీసిపోదు. అతడెప్పటి వాడైనా, ఎట్టివాడైనాసరే.

ప్రాయంలోవారికన్న పిల్లలకే యీ శక్తి హెచ్చని సామాన్యంగా అనుకుంటాం. మనలోనూ ఆశక్తి ఉంది, కాని గుర్తించం. బడిచదువులూ జీవన బాధ్యతలూ మన భావావనలను చదునుచేసి, ఇతరుల మనః కల్పనలతో మన మనః కల్పనలను కలిపి పోతపోసినట్లు ఒకే రీతిగా తీరుస్తవి. మంచి పుస్తకం చదివి ముగించి అవల పెట్టినపుడు, నాటకంలో యవనక దిగజార్చినపుడు సుఖ స్వప్నాంతంలో మేలుకొన్నపుడు. మన ఆభావావరణం వెఱ్ఱియని ప్రతిమారూ మన కెఱుకే. ఈ మాయ తెరతీయనంత వరకూ మోసపోతిమన్న తలపే రాకుండటం సహజమే. అది తోలగడానికి ప్రత్యక్షంగా స్వస్వరూపానుభూతి వినావేరు మార్గమే లేదు. విశిష్టమైన నాహంస్థితినీ మన అజ్ఞాన జీవితంలోని అవస్థాత్రయాన్నీ పోల్చినపుడు, సాపేక్షమూ బంధయుతమునైన ఈ కల్ల నుండి మేల్కనుటే ఆ యనుభూతియని గ్రహించగలం.

ప్రపంచం అదిగా సత్యం కాఆలదనటానకి మహర్షి మరికొన్ని ప్రమాణాలిచ్చియున్నారు. ప్రపంచ గోచరతకు ప్రాణస్థానం వైశష్ట్య విభిన్నతలు, విశిష్టముల లోనివి కాలదేశాలు, అవి నిరపేక్షములూ, వాస్వీకములూ, (Objective) నైన సత్యము లనదానికేమేని ఆధారలున్నవా? అట్టి తార్కాణ లేనివాడు ప్రపంచం తద్రూపంగా సత్య మనడం హాస్యాస్పదం.

కాంట్‌ 10 మొదలు పాశ్చాత్య తత్త్వజ్ఞులు కాలదేశాలూ కార్యకారణాలూ మనః కల్పితాలన్న సిద్ధాంతంతో పరిచయ మున్న వారే.

_______________

10. తాత్త్వికమైన సాపేక్ష సిద్ధాంతాన్ని కాంట్‌ తార్కికంగా సమర్ధించాడనవచ్చును. ఈ సిద్ధాంతం క్రొత్తకాదు. వేదాంతతత్త్వారంభ##మే దానితో.

ఐన్‌స్టీన్‌ సాపేక్ష సూత్రాన్ని ప్రతిపాదించారు. తదాదిగా పెనుపారిన పదార్థ విజ్ఞానం దీనిని ధృవీకరిస్తుంది. దానికి నీబలవత్తరం కాలదేశ యధార్ధ్యానికి ప్రతికూలంగా రమణర్షి ప్రకటించిన హేతువు. దానిని క్రమంగా తరువాత పరిశీలిస్తాం.

ఐన్‌స్టీన్‌ ప్రకారం కాలదేశాలు రెండు విశిష్ట సత్యములు కావు వానిని - ''కాల-దేశ'' మని ఒకటిగనే ఎన్నవలె. అవి రెండు విషయములు గావు. కాని యీ ''కాల-దేశము'' ప్రత్యక్షానుభూతి కెన్నడూ అందదు. అది విజ్ఞాన శాస్త్రజ్ఞుల అనుమానం (Hypothetical entity) ఆ అనుమానం వారు వివిధ దృగ్విషయాలనవగాహన చేసుకొనుటకో, చేసుకొంటి మనుకొనుటకో పనికివస్తుంది. ఏ సాధారణునకీ గణితజ్ఞ - పదార్థ విజ్ఞాని కాని యెవ్వనికి గానీ యీ 'కాల-దేశ' భావన అర్థమయ్యేదికాదు. అది గణితంలో రెండు అంశాలు సమానాలని సూచించే భావనా మాత్రమే. (An abstraction represented by a mathematical equation) '' 11

కాలదేశాలు 'కాల-దేశ' భావనలో ఉప్పతిల్లే భ్రమలని విజ్ఞానశాస్త్రజ్ఞలు నిరూపించారు. కాని యీ క్రొత్తభావన పరిపుష్టం కావడానికి ఇంద్రియజ్ఞానాధారం గూడ చిక్కదు.

కాలంగాని దేశంగాని కల్లలని మహర్షి నిశ్చయం. వారన్నారు. "మనుము లేక కాలమేది, దేశ##మేది? మనము దేహమనినచో కాల దేశములకు లోబడగలము మనము దేహమా? మనము ఇప్పుడూ

________________

11. దీన్ని సాపేక్ష సిద్ధాంతమన్నారు. ఈ మాటకు కాలదేశములు స్వయం స్థితాలు కావని తప్ప వేరుగా సమంజసమైన అర్థంలేదు. పరాస్పరా పేక్షతో జంటగానే ఉనికి, కాలదేశాలు మానసికాలన్న అద్వైత బోధనీ సిద్ధాంతము బలపరుస్తున్నది.

అప్పుడూ ఎప్పుడూ నొకరము. ఇక్కడ అక్కడ ఎక్కడా ఏకమే. కనుక కాలదేశములు లేని మనమే యున్నారము.'' 12

కాలదేశాలు మానసికాలైన యూహలు, అహంవృత్తి జనించిన పిదపనే వాని పుట్టువు. సుషుప్తిలో అవిలేవు. మెలకువ తోడనే 'నేనీ దేహ' మంటు అహంవృత్తి మొలకెత్తుతుంది. కాల దేశాలనుకల్పించి శరీరంలో, జగత్తులో నిక్షేపిస్తుంది నిద్రలో అహంవృత్తి అణగగానే ఇవీయుడిగి పోతవి. అహం కరణాపేక్ష లేక కాలదేశాలు నిలువవు. అహంవృత్తి మనోవృత్తులు సమక్రియలే. అవిధంగా కాలదేశాలు మానసికాలు, వానిచేత బాధితునమని అనుభవం తెల్పునే, అంటే అది దేహాత్మభావననెలక్కొల్పిన భ్రమయని మహర్షి నిరాకరించారు. దేహమే కాలదేశాల లోనిది. అటయితే మనమెవరం? మన యధార్థ స్వరూపమేమి? మహర్షి వచించినట్లు మనమీ దేహం కాము, మనస్సూ కాము: ''నేనున్నా ను'' అన్న స్ఫురణ; అది నిత్యం అవికార్యం, తెరలు తెరలుగా వచ్చే తలుపులన్నిటిలోనూ ఏక సూత్రంగా వర్తింస్తుంది. ప్రతి తలపులోనూ ఈ ''నేనున్నాను'' కద్దు. ''నేను యువకుడను, నేను పెద్దను, నేను వృద్ధుణ్ణి, నేను పురుషుడను, నేను బాగున్నాను, నేను జబ్బు పడ్డాను, నేను సుఖంగా ఉన్నాను. నేను దుఃఖితుణ్ణి. నేను పాపిని'' - ఈయన్ని తలపులలోను ''నేను'' సర్వదా ప్రసక్తమే. దాని నైజం ఎన్నడూ మారదు.

సర్వసాధారణంగా 'నే'నంనటే ఈ దేహమను కుంటున్నాము. అందువల్ల దేహంతో పాటు అదీమారినట్లనిపిస్తుంది. ఈ అస్తవ్యస్తమే అహంవృత్తికి కారణం. దానిలో, దానితో కాలదేశాలు పొదసూపుతవి. కాని వానిచే యదార్థమైన తలపు కాదు. అచ్చమైన ''నేను''బాధితం కాదు. ఈ 'నేను' మానసికమైన తలపుకాదు. అచ్చమైన "నేను" అదే అది దేశ మానసికమైన తలపు కాదు అచ్చమైన ''నేన'' అదే అది దేశ

_____________________

12. చూ. అనుబంధం 'క', శ్లో. 21 : ఉ.న.16.

కాలాతీతము. మనలో దొరలే భిన్నభిన్నభావాలన్నీ నిరాకరించి శుద్ధ మైన 'నేను'ను, అంటే, 'ఆత్మ'ను ప్రత్యేకించవలె. అట్లు చేసినపుడు, మహర్షి అన్నట్లు ఆత్మకు కాలదేశాద్యవధులు లేవని తెలియగలం అహం కారనాశాన్ని యీ కాలదేశాలు మిగులవు గనుక అవి కల్లలు. మనం రూఢంగా హృద్గతం చేసుకోవలసిందిది - అహం వృత్తి లేని దశలో మిగిలియున్నదే సత్యము.

ఈ యోచనలు కొందరిని నమ్మించవుకాని సమ్మూఢచేతసులను చేస్తాయి.కాలదేశాలు, వానిని నింపే జగత్తు, దృగ్విషయక సత్యాలనీ, వానిని కల్పించే మనస్సునకు, వేరుగా, ఉనికిగలవనీ నమ్మడానికి ప్రస్ఫుటాధారము లేవీ లేవని ఎంతమంతబుద్ధికైనా విదితం కాక తప్పదు.

కాలదేశాలకు అవధులు లేవని భావన. అట్లు భావించక ఉండలేము.కాని అవి అనవధులనడానికి కెట్టి ఆదారము లేదు. కలలో కాల దేశాలు రెండూ ఉన్నవి. కలకు మొదలుంది. మనం చూచేదీసత్యమే అయితే అక్కడి కక్కడే మన స్వప్న సమయానికాది ఉందని మనకు తెలియవలె. కాని మనకది తెలియదు. మనం లేచినప్పుడుగాని ఆ కల కల్లయని తెలిసుకోలేము. ఈ అంశంలో కలకాలానికి జగత్‌ కాలానికి గుర్తింపతగ్గ భేదమేమీలేదు.

కాలం నిజంగా లేదుగనుక భూతభవిష్యత్తులు లేవు; వర్తమాన మూలేదు. జగత్‌ సృష్టియంటూ ఏమీ లేదు. కాలప్రసక్తి యున్న దెల్ల అయదార్థమే. అందుచేత మనకు పూర్వజన్మలు లేవు. పునర్జన్మలూ ఉండవు. ఇప్పుడూ పుట్టిలేము. చావనూబోము. కృతకర్మలులేవు. ఫలానుభవమూ లేదు. ఇప్పుడూ కర్మలొనర్చుటలు లేవు. భావిలో వాని ఫలములనుభవించుటలూ ఉండవు. ప్రారబ్ధ సంచిత ఆగాములు లేవు. ఇది ఋషి జనానుభూతమైన అచ్ఛమూ పరమమూనైన సత్యం. కాని ఇది అన్యాపేక్షాలైన పామరజన విశ్వాసాలను బాధించదు.

దేశమూ భ్రమయే. బాహ్మాంతరభిదలేక జగత్తు దృగ్విషయక సత్యంగాదు. దేశము లేక ఆ బేధము లేదు, జగత్తూ లేదు. మనవి అనుకొని దొంతరలుగ పేర్చుకొన్న పరిధులన్నీ భ్రాంతులే.

బాహ్యంలేదుగనుక అందులోని జడవిషయాలూ, సచేతన జీవులూ ఉండరు. జగత్‌ సత్యానికైన ఉపపత్తుల్లో అధికాంశం దేశవాసం గల వ్యక్తుల అనేకత్వాన్ని పరిగ్రహించినవే. ఈ అనేకత్వం అహం భావన నుండి పొటమరించిందే. చూపరి అహం భావన వాని దేహావధియేగనుక ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క వ్యక్తిగా పలువురనతడు ఊహించక తప్పదు. 'నీవు' 'అతడు' అనే భావనలిట్లు పుట్టి నవే అవి అజ్ఞాన జనితాలే.

దీనినే మహర్షి ఇట్లు పొందుపరిచారు. 'నేను' అను నుత్తమ పురుషము ఉండనిట్లైన 'నీవు' 'వాడు' అను మధ్యమ ప్రథమ పురుష ములును ఉండును. ఉత్తమ పురుష తత్త్వమును ఎఱుంగుటచేత 'నేను' లేకపోగా అవియులేక, యేకమై వెలుగు నదియే తనస్వభావ స్థితి యగును''13

మహర్షి యీ రచయిత దృష్టికి దెచ్చిన విష్ణుపురాణోపాఖ్యాన మొకటి ఈ విచారణను విశదీకరిస్తుంది. ఋభు మహర్షి తన శిష్యుడు నిదాఘునికి బోధించిన గాథ అది. ఋభువులు మారువేషంతో శిష్యుని వెదకుతూ అతని పుట్టినూరికి వెళ్ళారు. శిష్యుడు గురుని గుర్తింపలేదు; ఎవరో గ్రామ్యుడు దేశాటనం చేస్తున్నాడనుకొన్నాడు. సమయానికి రాజుగారి ఊరేగింపు ఆదారినే రా తటస్థించింది. అదేమిటన్నఋషితో నిదాఘుని సంవాదమిట్లు సాగింది :-

___________________

13 చూ, అనుబంధం 'క' శ్లో. 19 ; ఉ. న. 14.

నిదా : అది ఈ యూరి రాజుగారి ఊరేగింపుటుత్సవం.

ఋ : రాజెవరు?

నిదా : అడుగో, ఆ ఏనుగుపై కూర్చొని.

ఋ : వారిలో రాజెవరు? ఏనుగేది?

నిదా : పైనున్నతడు రాఉ. అతని క్రిందనున్నది ఏనుగు.

ఋ : నాకర్థంకాలేదు. దయచేసి మరికొంత స్పష్టంగా చెప్పగలవా?

నిదాఘుని కాశ్చర్యమైంది. ఎంత గ్రామ్యుడైనా ఇంతటి మందబుద్ధియుండునా, అని. వాని కర్థమయ్యే వరుస ఇదేనని నిదాఘుడు మహర్షి భుజముపై నెక్కి అన్నాడు -

నిదా : ఇటుచూడు నేను పై నున్నాను, రాజులాగా : నీవు క్రింద ఉన్నావు, ఏనుగులాగా.

ఋ : నీవన్నట్లు నీవు రాజువలెపైనుండి, నేను ఏనుగువలె క్రింద నుంటే, నాకిది విశదం చెయ్యి - ఆ 'నేను' 'నీవుల' కర్థమేమి?

నిదాఘుడు ఆతురంగా క్రిందకి దుమికి ఋభుల పాదములపై బడి ''స్వామీ, నిశ్చయంగా మీరు నా సద్గురు ఋభులు. ఇతరు లెవ్వరూ నిగూఢమైన అద్వైత సత్యాన్ని ఇంత సునిశ్చతంగా ఎఱిగి యుండరు'' అని ప్రస్తుతించాడు. ఋభులు నిదాఘునికి కావశ్యకమైన బోధమదియే యని పలికి వెడలిపోయినారు. నిదాఘునికి స్వభావస్థితి యాదార్థ్య మిట్లుపదేశించుటయైనది. ఒక్కొక్క అడుగే నడిపించి చివరి మెట్టుగా తెలిసినదిది : జీవులలో భేదమెన్నడం వెఱ్ఱి : ఉన్న సద్వస్తు వొకటే వ్యక్తిత్వ, ఆత్మ బాహుళ్యములు భ్రాంతులు, అజ్ఞానమైన దేహాత్మ భావన నుండి జనించినవి. ఈ అజ్ఞానమే భేదభావసర్వానికే కైక మూలం. పై కధలోని శిష్యుడు తన్ను ఒక దేహంగా, గురుని మరియొక దేహంగా సమపెట్టినాడుగనుక వానికి అథ ఊర్థ్వములు నిజములైనవి. పైన క్రిందనున్నవి దేహాలు, ఆత్మకాదు. ఆత్మ భేదాతీతం.

బాహ్మాంతరాల వేర్పాటు అథ ఊర్థ్వములు సాటిదే. ఆ వేర్పాటు లేక ప్రపంచమే లేదు.

ఈ అజ్ఞానం వల్లనే మనస్సును దేహంలో ఎదోమూల మెదడు లో ఉన్న అల్పాల్పమైనదిగా ఎంచుతున్నాము. అలీకమైన యీ విశ్వాసం కారణంగా అంత విస్తృత విశ్వం ఇంతియే మనస్సులో యిముడునని నమ్మలేకున్నాం. అట్టినమ్మకం నవ్వులచేటనీ భావిస్తున్నాం. మహర్షి దీనిని సత్యానికి విపరీతమన్నారు. విస్తృతమైనది మనస్సు, జగత్తుకాదు ''జ్ఞాత జ్ఞేయానికధికుడు, ద్రష్ట దృశ్యానికన్న గొప్ప'' తెలియవచ్చినది, తెలిసినవానిలోనిది : చూడనైనది చూపరి లోనిది : విపులాకాశం మనస్సులోనిది, వెలిదిగాదు. మనస్సు సర్వ గతము; దానికి బాహ్యంలేదు పైకి వెలుపలిదిగాతోచేయీ గగనంలో అంతరితమైన అనంతవిశ్వమూ భక్త జనార్చితులగు ప్రముఖ దైవములూ14, వారివాలోకములూ, సర్వమూ మనస్సులోనివే.15 భక్తునికి భిన్నుడైన దైవం ఆనుషంగిక సత్యం. పరదైవము సద్వస్తువే. అందు అర్చితుడూ అర్చకుడూనొకరే. వారిని వ్యష్టీకరించే మనస్సక్కడలేదు. ఈ ఆకృతులు అరూపమైన ఏకమునకు మనస్సు కల్పించిన విగ్రహాలు. ఇట్లు మనస్సు తలచేప్రతివిషయమూ, చూచితి

14. దైవముఖ అని బహువచనం - వేర్వేరు శాఖల భక్తులు పూజించే వివిధదేవతా కృతులను సూచిస్తుంది. దేవతలన్నప్పుడు అది క్రైస్తవుల ఏంజల్స్‌వంటి స్వర్గవాసుల నిర్దేశిస్తుంది. ఈ దేవతల స్వర్గానికి విలక్షణమైన దైవలోకములు.

15. యన్మనసామనుతే యేనాహుర్మనోమతమ్‌ |

తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదిదముపాసతే || - కేనోపనిషద్‌ 1, 6.

ననుకొనేదేహమూ, ఇంద్రియవిషయములూ, (Objects of sense) వేరు వ్యక్తులుగా భావించే ఉపాధులూ, స్వర్గనర కాది ఇతర లోకములూ విశ్వములూ - సకలమూ అంతస్సులోనేగాని బాహిరంగా కాదు. కేవలం దేహాన్నే ఆత్మగా, ఇతరమెల్ల అనాత్మగా పరిగ్రహించిన ఆ మొదటి తప్పిదమే యిన్ని మూఢవిశ్వాసాల కున్నూ మూలం. ఈ అ%్‌ఞాన కారణంగానే, ఈ విశ్వాసాన్ని గాని, దీనివలనే అజ్ఞానజాలైన మరేవిగాని సరియా కాదా పరీక్షించతలనైనా తలచము. దేహాత్మ భ్రాంతివల్ల స్వరూపస్థితిజ్ఞాన వంచితులమౌతున్నామని ఒక్కపరి తెలిసికొంటిమా, ప్రపంచం వాస్తవిక (Objective)సత్యం కాదన్న బోధను నిరభ్యంతరంగా అంగీకరించవచ్చు.

ప్రపంచం పంచవిషయకమగుటచే మహర్షి అది సత్యం కాదన్నారు. ఈ పంచ విషయాలలో ముఖ్యంగా పరిశీలింపతగిందిరూపం. రూపజ్ఞానం లేకపోతే మూలాజ్ఞానమైన అహంవృత్తికి మన మనువర్తులంగాము. అహం ఏదేనొక రూపాన్ని (దేహాన్ని) ఒడిసిపట్టి ఉద్భవిస్తుంది. ఆరూపాన్ని స్వస్వరూపంగా మభ్యపెట్టి స్వస్వభావాన్ని పరిమితం చేస్తుంది. అందుచేతనే మహర్షి రూప యధార్ధ్యాన్ని ప్రత్యేకంగా చర్చించారు. ''తాను రూపమైనట్లైన జగత్‌ ఈశ్వరులును అట్లే కావచ్చును. తాను రూపము కాని యెడల వాని రూపమునెవ్వరెట్లు చూడగలరు? కన్ను లేక కనబడుట కలదా? తానే కన్ను, అది యో తుది లేని కన్ను''16 అది చిన్మయము, నిరుపాధికము, నిష్ర్పపంచము.

దానికి వారిదే వివరణం - ''చూచెడిది చర్మచక్షువై తే కనబడేవి స్థూలరూపాలే. సులోచనముల సాయముతో తత్పూర్వ మగపడని విషయములు, వివిధ రూపములవి కనవచ్చును. మనస్సేకన్నయి

____________

16.చూ. అనుబంధం, 'క' శ్లో. 9 : ఉ. న. 4.

నచో సూక్ష్మవిషయము లగపడగలవు. ఆ రీతిగా చూచే కన్ను, చూడబడిన విషయములు స్వభావతః సమములే; అంటే కన్నే ఆకృతి అయినచో దానికి సకల మాకృతులేకానవచ్చును. కాని చర్మ చక్షువుగాని మనస్సుగాని స్వయం దృక్కులు గావు నిజమైన కన్ను. ఆత్మయే. ఆత్మ అరూపము, శుద్ధము, అనంతచిత్‌ సద్వస్తువు. అది యెట్టిరూపములనూ చూడదు'' రూపముల సృష్టించునది దృష్టియే.

ఇట్లు రూపముల గోచరించటం మూలాజ్ఞానమైన అహంవృత్తి వల్లనే అని తెలుస్తున్నది.

జగత్తు వాస్తవిక సత్యమనలేము. కాని తప్పనిసరియైన యీ నిశ్చయాన్ని తప్పించుకతిరుగువారికై మహర్షి స్వస్నానుభూతుల నుదాహరించారు. ఇంతకు పూర్వమే, ప్రయోజనము సత్యనిరూపకంగాదని స్వప్నములు తెలుపునన్నాము. బాహ్యతావాస్తవికతలు సైతం భ్రాంతులు కాగలవని ఎఱుగవలసి యున్నది. ఇచ్చట గూడ కల లుపకారములవుతవి. సరిగా జాగ్రత్తులోవలెనే కలలలోనూ మనం బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నామని, అందువేర్వేరు కాలదేశాల్లో విస్తరించిన విషయాలు కలవని పూర్తిగానమ్ముతున్నాము స్వప్న ప్రపంచం సత్యమనుకొనుటకు దాని బాహ్యతే కారణం. ఆ నమ్మకం కలసాగి నంతసేపూ నిలుస్తుంది. ఆసమయంలో ఆ స్వప్న ప్రపంచం మనకు వెలిగానున్నదా, అది నిజమేనా అన్న శంకయేరాదు. అందులో ఏవేవో అసాధారణ ఘటనలు - మనం ఎగురుతున్నట్లు, మృతుడు మరలజీవించి నట్లు - తలసూపినపుడు అది కలయేమోనన్న శంక అధవా కలిగినా అది ఎలాగో సరిపడిపోయి, ఆకల నిజమే అని మనం మేల్కొన్న దాకా భావిస్తాం. అసలాకల సాగటానికి అది నిమన్న మన నమ్మకమే ఆధారం. ఈ సత్యాభాసం. కల కలంతకాలం నిర్భంధంగా ఉంటుంది. మెలకువకు పిదపే అది కలయనీ, ఏ బాహ్యజగత్తూ, అందులేకున్నా మానసికంగా దాని ఆభాసం అది బాహ్యమనీ సత్యమనీ భ్రమింప జేసేంత ప్రస్ఫుటంగా ఉండినదనీ కనుగొంటాము.

ఇందు వారొక వ్యత్యాసం జూపవచ్చు. కలనుండి మేల్కొంటాం. గనుక అది కల్లయనగలము. కాని మన జాగ్రదనుభూతికి మేర లేదు. అది కల్ల యని కన్గొనుట కవకాశ##మేలేదు. కాని ఋషులదృష్టిలో ఈ జాగ్రత్తూ ఒక స్వప్నమే. దీనినుండీ మేల్కొనుట ఉన్నది: ఆ తరుణంలో యీస్వప్నమూ తుది జెందుతుంది. ఈ యంశం తరువాత, వ్యక్తి అనుభవంలోని అవస్థాత్రయంతో కలిపి చర్చిస్తాం. మనకు ప్రస్తుతము సత్యాభాసకు మూలమైన బహిర్భ్రాంతి, ఇది యొప్పని వారు స్వప్నసమయంలో స్వప్ననైమెఱిగే అమోఘ ప్రక్రియను దేన్నైనా తెలుపవలసిఉంది. అట్టి దేదన్నా ఉంటే, జాగ్రత్‌ స్వప్ననైజాన్ని గుర్తింపననువౌతుంది. కలలోగాని, మెలకువలోగాని, జగత్తు నవల ఉంచి దాన్ని చూచేవానిని చూడయత్నిస్తే, ఆజగత్తూ ఆచూపరీ ఇర్వురూ అదృశ్యంకాగా ఆత్మయొక్కటే మిగులుతుంది.

పైవిచారణలవల్ల ఋషుల ననువర్తించటం సులువౌతుంది. వారు ప్రపంచం దృగ్విషయక సత్యంకాదు, దానికి స్వయ మస్తిత్వం లేదంటారు. అట్టి నిలకడగలది ఒక్కటే - స్వభావస్థితి అది వేరొక ప్రకరణంలో విస్తరిస్తాము.

ప్రపంచం మనస్సే, వేరుకాదు. కాబట్టి జగత్తు యాధార్థ్యం మనస్సు యాధార్థ్యంపై ఆధారపడుతుంది. జాగ్రత్తు స్వప్నములు రెంటనూ జగత్తును కల్పించిన యీ మనస్సు తాను నిజమాయని పరిశీలించవలసియున్నది.

మహర్షి వచించినట్లు మనస్సు విరళం, సిద్ధమైన జగత్తుతో అది ఉదయిస్తుంది, దానితో అస్తమిస్తుంది గాఢసుప్తిలో మనస్సు లేదు, జగత్తులేదు సత్యనిశ్చయానికి ఋషులు విధించిన ప్రామాణ్యరీత్యా మనస్సు అయధార్థం.

మహర్షి మనస్సును చిత్‌ మీదుగా గదలిపోయే తలపుల ప్రవాహమన్నారు తలపులన్నిటిలో ప్రప్రధమము 'నేనీ దేహమ'నని. ఇది తప్పు; కానినిజమనే గ్రహించడంవల్ల ఇతరతలపులు పెరుగ వీలయింది. మనస్సు మూలాజ్ఞానం నుండి పొడమిందే: కనుక అది సత్యం కాదు.

మనము మనస్సు కాము; మనస్సు స్వస్వరూపము కాదు. ఇంత వరకు స్పష్టమే. నిద్రలో మనస్సు నిలువదు, కాని మన ఉనికి సాగుతూనే ఉంది. అదీగాక ఆత్మస్థితి జాగ్రత్‌ స్వప్నసుషుప్తులనే యీ మూడవస్థలకూ అవ్వలిది.

ఏమి చెప్పినగాని ప్రపంచం సత్యమనే వితండవాది రేచే ప్రత్యుపపత్తులన్నీటినీ యిక్కడ ఏకరువుపెట్టి నిరాకరించలేదు. నిజానికి అహంవర్తి చేసే ఆక్షేపాల కంతూపొంతూ ఉండదు. అభ్యంతరా లెన్నటంలో మనస్సు విసువు విరామ మెఱుగదని చూచే ఉన్నాము. ఇట్టులో మరేవిధంగానో విశృంఖలమైన మనస్సు క్లేశ##పెట్టితే దానితో వ్యవహరించే విధానం మహర్షి తెలిపియేయున్నారు.

ఈ చర్చకు సారాంశమిట్లు - సత్యాత్మగా మన స్వభావస్థితిని తిరిగి రాబట్టుకొనవలెనంటే జగత్తు నిజమన్న మూఢవిశ్వాసాన్ని పోద్రోయవలె. అట్లంటే దానికి సర్వదా విరుద్ధమైన జగన్మిధ్యావాదానికి బద్ధులం కానక్కఱలేదు. రెంట నొకటి అవలంబించ నేవలసివస్తే జగన్మిధ్యాత్మనే చేపట్టుతాం, వెనుక వివరించినట్లది అచ్చంగా అట్లే కాకున్నా. అద్వైత దర్శన గ్రంధాలన్నీ, సాధ్యమయ్యేటైతే, మధ్యే మార్గాన్న వలంబించమన్నవి. జగత్సత్యాసత్యతలను నిర్వచింప గాదు. ఆధ్యాత్మికంగా అదేసరి, అదిఋషి ప్రోక్తం గూడా. మూలాజ్ఞానం మరిలేవకుండా సర్వనాశంచేస్తేనే నిజమెఱుగ నేనని తెలిసి, ఈజగత్తూను దాన్ని గూర్చిన తలపులన్నిటినీ అవల నెట్టవచ్చును. మూలాజ్ఞాననాశం, ఋషులు బోధించిన మార్గానబోయి ఆత్మసాక్షాత్కార మందిన తర్వాతనే అలా చేయలేనప్పుడు, ఈ ప్రపంచం మనసై#్వర చిత్తం కల్పించుకొన్న విభ్రమంగా మాటామాటికి స్మరిస్తూ మనలను బిగియ గట్టిన మూలాజ్ఞానపు పిడికిలిని కొంతకుకొంత సడలించు కోవలే. ఈ విభ్రమాయుత జగత్తు లూయీకెరోల్‌ గ్రంధం 'ఏలిస్‌ ఇన్‌ వండర్‌ లాండ్‌' లోవలె ఉండగలదు. అక్కడ కధానాయిక తానుకాంచిన వింతవిశ్వాన్ని తుదివరకూ సత్యంగానే విశ్వసించింది. ఆపై ఆమెకది యేదో కైతవ దృశ్యమని - అందు తనకు గోచరిస్తున్న పురుషులు స్త్రీలు జంతువులు సర్వమూ పేకముక్క లోనివని తెలియవచ్చింది. అట్లే ముక్తునికి ఈ ఘనవిశ్వం తలపులపేక.

ఋషులు వారి వారి క్రొత్త మార్గం దేన్నీ ఒరులపై రుద్ద తల పెట్టరని జ్ఞప్తి యుంచుకోడం మంచిది. ఆత్మవిచారాని కాతంకాలైన వాసనల బారినుండి తమ శిష్యుల విమోచనమే వారి ఆశంస.

ఈ ప్రకరణాల్లో ప్రతిపాదించే విధానం, - ప్రపంచం తలపుల మూలయని తాత్కాలికంగానైన సమ్మతించి ప్రపంచం నుండి మనస్సును పరాజ్ముఖం చేసేందుకు ఉద్దేశించింది. పాశ్చాత్య తత్త్వజ్ఞులు బెర్క్‌లీ జగత్తును చూచినది ఇంచుమించు యీలాగే. అందు చేత యీ విధానాన్ని ''ఆత్మాశ్రయ ఆదర్శన వాదము Subjective Idealism అన్నారు. కాని మన ఆదర్శనం (అట్లు పేర్కొనడం సముచితమైతే) ఆత్మవిచారాని కొక సాధనం. ఆత్మసాక్షాత్కారమొంద ననుత్సాహులు దాన్ని స్వీకరించపనిలేదు. బెర్క్‌లీ వాదానికి మన వాదానికీ కొంత భేదం ముంది. అది ఋషుల విలక్షణ బోధలో నొక యంగం, ఆభాసకు మూలాధారంగా నిర్గుణమూ సత్యమూనైన ఆత్మ కలదని ఆబోధ, దానికై ప్రాపణీయ సాధానల్లోకెల్లా ఋషిప్రోక్త విధానమే ఉత్తమోత్తమమని వాదులాటయులేదు. పద్ధతుల బాగోగులు సాధకుని పరిణతినిబట్టియే గాని సర్వసాధారణంగా ఉండవు. ఈ పద్ధతి అనుకూలించనివారు భక్తిమార్గం మవలంబించ వచ్చును. వారికి ప్రపంచం సత్యమే; వారి సద్వస్తువు దైవము, ఆప్రపంచానికి ఉపాదాన కారణం, నిమిత్త కారణంకూడా. ఇందు ఏ విప్రతిపత్తీలేదు, బోధ బోధితునికి తగియుండవలెనని మహర్షి పలుమారు లనియున్నారు.

Mahayogama    Chapters