Mahayogama    Chapters   

ఓమ్‌

మహా యోగము

3. అజ్ఞానము

- * -

ఋషి యొక్కడే మన రుజలను నిదానంగా పరిశీలించి తగిన పరిహారాలను తెలుప సమర్ధుడు. మిడిమిడి జ్ఞానం, మిథ్యా జ్ఞానాలతో అల్లిబిల్లిగా చిక్కువడ్డ మన మనస్సులను సరిదిద్ద గలవాడూ ఆయనే.

ఉపదేశారంభ##మే యిట్లు - మన అలతలన్నింటికే కారణాలు వేరెక్కడో లేవు, అవి యున్నది మనలోనే. బుద్ధుడన్నాడట. ''నీవు బాధపడేది నీ వల్లనే, వేరెవరి బలవంతాన కాదు.'' అరుణాచల మహర్షి అనేదీ అదే. సృష్టి రచనాక్రమంలోనే మూలచ్ఛేదక దోషముందేమో అని యొకరిశంక. వారి నిట్లు మహర్షి మందలించారు : ''ఉన్నంతలో అది బాగుగనే ఉన్నది. తప్పు మనది. మనము సక్రమముగా ఆలోచింపము. మన తలపుల మూలములోని పుట్టు దోషమును జాడతీసి పెకల్చవలె : అప్పుడంతయూ సరిగనే ఉండును.''

దోషమూలాన్ని వెదకి నిర్మూలించట మొక్కటే పరమౌషధం. మిగతవన్నీ ఉపశమన మాత్రాలే. మనం చెప్పగలిగిందింతే. దేని మటుకది సరియైన వైద్యానికి దారితీయవచ్చు. ప్రపంచాన్ని విభజించే భిన్నమత సిద్ధాంతాల, ఆచారాల విషయమూ అంతమాత్రమే. బహుళంగా అవి మనస్సులను దుర్బలంచేసి అవశం జేస్తాయి: మోక్షం వెనుతగ్గి దూరమవుతుంది.

ఒక తెగవారున్నారు. వారి దృష్టిలో మతాల కొఱకే మనుష్యులు కాని, మతాలు మనుష్యులకై గాదు. ఏ మతమైనా సత్యసిద్ధికి సాధన మాత్రమే. ఆ అనుభూతి కలిగాక, పూర్వపు సిద్ధాంతం సరికాదని తేలవచ్చు. కాని పై తెగవారు సిద్ధాంతం తప్పని ఎప్పటికీ ఒప్పుకోరు. వారికదే పరమ సత్యం. అట్టి మూర్ఖులకన్న మనశ్శుద్ధీ, ఋజువర్తనం గల అవిశ్వాసి ఎంతోమేలు. సత్యమంటూ ఒకటి ఉంది. పరమార్థమదేగాని ఈ మతాలూ సిద్ధాంతాలతో పనేమి అనే అవిశ్వాసి, నిజానికి విశ్వాసియే. సత్యాన్ని నమ్మేవాడే భక్తుల్లోకెల్లా ఉత్తముడు. సత్యమే సర్వమూ; దాన్ని ప్రతిపాదించే సిద్ధాంతమే పరాయణము; కానిది పరిత్యాజ్యమని నమ్మనివాడు భక్తుడే కాడు. అట్టివాడు పై జెప్పిన అవిశ్వాసికి దిగదుడుపే. అతడిందు జెప్పే విచార మార్గ మవలంబిస్తాడనలేము. జీవద్గురువును దర్శించి, అర్థించి, వారుపదేశించినా, వాడు దాన్ని సక్రమంగా గ్రహింపక పోవచ్చు. ఆ కారణంగానే సద్గురువులు అడిగిన అందరికీ ఎఱుకను ఒకే విధంగా వివరించరు. తత్త్వ రహస్యాలను అపక్వ బుద్ధులకు వారు వెల్లడించరు. అరగొఱ జ్ఞానం అజ్ఞానానికన్న చేటు.1 సద్గురు నొద్ద పూర్ణోపదేశం ఆశించేవారు తమకు గల పూర్వాభిప్రాయాలను ఎదత్రోయ సిద్ధపడవలె; ఏ ఒక సిద్ధాంతానికో బద్ధుడై యుండరాదు. అట్లు బద్ధుడైయున్న విద్వాంసునికంటె, ఎక్కువ చదువకపోయినా ఏ యభిప్రాయాలూ స్థిరపడని శిష్యుడు ఎంతో మేలు.

____________________

1. చెప్పినా తెలియలేని వాడొకడు ప్రశ్నిస్తే బుద్ధుడేదో సమాధానమిచ్చారు. దానితో వానికున్న కాస్త విశ్వాసమూ అన్తవ్యస్తమయింది. ఇంకోమారు అలాటివాడే అడిగితే ఆయన మౌనంగా ఉన్నాడు. అదేలన్న శిష్యునితో ఆయన, ''వాని కే సమాధానమిచ్చినా దాన్ని వాడు విపరీతంగా గ్రహించడం నిస్సంశయం'' అన్నారు.

(4)

తెలియగోరే మనస్సుతో సద్గురు నొద్దకు పోయి ''స్వామీ, మేము వాంఛలకు భయానికీ దాసులం. ఇలా ఎందుకైనా''మని అడుగుదాం. మన 'స్వరూపం తెలియక' అంటారు. అంటే ఉన్న స్వరూపాన్ని గాక వేరే రూపాన్ని మనకారోపించుకొన్నందున, అని.

ఈ జవాబు రెండు విధాల తప్పనిపిస్తుంది. జీవిత వ్యాపారానికి స్వరూప జ్ఞానమెందుకు? ఇహం చెడ్డదే కానీయండి. దాన్ని మనం కోరేట్టు మలచుకోవడమో, కాక దాని కనువర్తించి సరిపుచ్చుకొనడమో, ఏదో ఒకటిచేసి వీలైనంత మేలు పొందవలెనని మన ఆబ. అయినప్పుడు నిజంగా మనమెవరమో తెలిసిబావుకొనేదేం ? ఇంతకూ మన మెవరమో మనకు తెలియకనా ? క్రొత్తగా తెలుసుకోవలసిందేమి ?

విజ్ఞానం విలువ మన మెఱుగుదుము. జీవితంలో మనకు తగిలేవి ఏ యే పాటివో కనుగో ప్రయత్నిస్తాం. అందరు విధిగా విజ్ఞానాన్ని గడించవలెనని నమ్ముతాం. ప్రతి జాతీ విజ్ఞానాన్ని కొండంతలు ఏర్చి పేర్చియుంచుకొంది భూగోళ, ఖగోళ, రసాయనిక, పదార్థ విజ్ఞాన, ధర్మ (Ethics), దేవతాధికరణ (Theology), సాంఘికశాస్త్రాలేగాక, దంభంగా పేరిద్ద తత్త్వ, ఆధ్యాత్మిక శాస్త్రాలు సహా. ఇదంతా జ్ఞానమేనా ? అయితే, ఇంతలంతలుగా పేరిన, పేరుతూన్న వీనితో అనుక్రమంగా మానవ సౌఖ్యం హెచ్చవద్దా ? అట్లు హెచ్చడంలేదేం ?

''ప్రకృతి శక్తులు గ్రుడ్డివి; పెరుగుతున్న యీ విజ్ఞానంవల్ల వానిని అధికాధికంగా అదుపులోకి తెచ్చుకుంటున్నాము : ఇది మన మంచికే గదా ?'' అనే వాదముంది. కాని అది సరికాదు. ప్రకృతి నధీనంలోకి తెచ్చుకొనే శక్తి, విధి వక్రించినందువల్ల, క్రొద్దిమందికే హస్తగతమైంది. వారి యీ శక్తి అధికాధికమయ్యే కొద్దీ జన బాహుళ్యం నిరాశాహతులూ అవినీతులూ అయి అధోగతి పాలౌతున్నారు. ఈ దైన్యానికి విరతి లేదు. దానివల్ల పూర్తిగా స్వార్ధపరులు కాని సజ్జనుల సౌఖ్యం గూడ విషపూరితంగాక తప్పదు. ప్రాత వైజ్ఞానికులు జోస్యం పలికారట, జీసస్‌ మరల జన్మించి ఒక వేయేండ్ల స్వయంగా పరమసౌఖ్యావహంగా పాలింపనున్నాడట. ఆ శుభ కాలం ఎంతగనో దూరమయింది. అప్పటి యిప్పటి విజ్ఞానంవల్ల మానవజాతికే తీరని మొప్పమి వచ్చే దుస్థితి దాపురించింది. ఈ విజ్ఞానం మన మంచికే ననడం దుస్సాహసం, దుర్మార్గం : నిష్కళంకమయిన పూర్ణ సౌఖ్యమాసించే వారినోట రాతగ్గదికాదు. మరొక సందేహం. అసలీ తెలివులు విద్యయేనా ? ఇట్టివానివల్ల సౌఖ్యం కలగటం కల్ల. ఈ సందేహాన్ని ఋషుల బోధలు బలపరుస్తున్నవి. ఈ విజ్ఞానం సర్వం అజ్ఞానమే అన్నంతవరకూ వెళ్ళారు అరుణాచల రమణులు.

యూనివర్సిటీలో పెద్ద చదువులు ముగించి ఒక యువకుడు మహర్షిని చూడవచ్చాడు. అతని అభిమాన పాఠ్య విషయం, సైన్సు. అతడన్నాడు ''విశ్వ పరమార్ధాన్ని శోధించే సైంటిస్టుకు అజ్ఞానమనే మొండిగోడ ఎదురౌతుంది. ఇటు పరమాణు పరిశోధనలో ఏవో నిగూఢ విషయాలూ - ఎలక్ట్రాన్స్‌, ప్రోటాన్స్‌, పాసిట్రాన్స్‌ న్యూట్రాన్స్‌ - వాని ఉనికీ, వర్తించు రీతులూ తెలియవస్తాయి. అవి యూహకేగాని జ్ఞానేంద్రియాల కందవు. ఇక సకలానికీ మూలమైన ఏకైక వస్తువు అతీంద్రియమని వేరే చెప్పవలెనా ? అటు, బృహత్పదార్థాల పరిశోధనలో పలువురు సృష్టికుపాదానకారణమనే 'నెబులే'ను (తారాధూళిని) మించినదీ లేదు. సర్వవిషయ మూలమైన కాలదేశముల రహస్యము భేదించనూ అలవిగా లేదు. దీని పరిష్కారమేమి?''

మహర్షి వివరించారు. ''ఎఱిగెడు తనను ఎఱుగక యితరము నెఱుగుట యజ్ఞానమేగాని జ్ఞానమగునా ? జ్ఞాన ఇతరముల కాధారమైన తనను ఎఱింగినచో జ్ఞానాజ్ఞానములు నశించును.''2

___________________

2. చూ. అనుబంధం'క', శ్లో 16 : ఉ.న. 11

తరతరాల విజ్ఞానాన్ని ఒక్క మాటతో తీసికట్టుగా త్రోసేయడం విడ్డూరమనిపిస్తుంది. కాని నిష్పక్షపాతబుద్ధి కదియే సరియని తెలుస్తుంది. మానవాళి సౌఖ్యం పెంపొందించని విజ్ఞానం అయధార్థమని పైన చెప్పియే యున్నాం. పైగా ఈ విషయంగా విజ్ఞులందరిలో ఏకవాక్యత లేదు. కాని వారిలో భావభేదమున్నట్లు ప్రజలందరికీ తెలియదు. తెలిసిన వారుగా చలామణి అవుతున్న వారి సంఖ్యహెచ్చు, గొంతుపెద్ద, వారికన్న నిజంగా ఎక్కువ తెలిసినవారు, వారి యభిప్రాయాలతో ఎంతభేదించినా, అల్పసంఖ్యలు, బహుళంగా మౌనంపాటించేవారున్నూ, నోరి బలం గల అరగొఱ బుద్ధులకన్నా వీరి యభిప్రాయాలే, తఱచు సరిగా ఉంటాయి. సైన్స్‌ వేరే, సైంటిస్ట్‌ వేరని జనుల భావన. మత తత్త్వ విషయాల్లోవలెనే సైన్సుల్లో గూడ భిన్నాభిప్రాయాలు సహజంగా వాని ప్రతిపాదకుల స్వభావము, తెలివితేటలను బట్టి ఉంటాయి. బెర్నార్డుషా అన్నట్టు ఒక నిరక్షర కుక్షియైన మోఱకుణ్ణి క్రైస్తవమతంలో చేర్చడం, ఆ మతాన్ని వాని స్థితికి దిగజార్చడమే. కాస్తతీర్థం చల్లి, ప్రశ్నోత్తర రూపంలోక్రైస్తవబోధ గఱపిన మాత్రాన మోఱకుడు మోఱకుడుగానే మిగిలియుండకపోడు. మనశ్శుద్ధినీ, నిర్మల బుద్ధినీ, యమ నియమాదులనూ అలవరచుకోవలె. ఇది సులభం కాదు. జనులందరూ చదువరులయ్యే పద్ధతి పరిశోధనా సమర్ధులను చాలినంతగా తీర్చలేదు. అందువల్లనే ఆధారాలు క్రొత్తలేవీ లేకున్నా, నిర్ణయాలు మాత్రం కొంగ్రొత్తలూ, పరస్పర భిన్నాలూ హెచ్చవుతాయి. పరిస్థితు లిట్టివైనపుడు, ఋషి వచనం సరియని మన్నించడమే సరి.

ఏ విషయాన్నైనా యధార్థంగా తెలుసుకోనెంచేవాడు మొదట తన్ను తాను తెలుసుకోవలెనంటారు మహర్షి. తన్నెఱుగనివాని యన్వేషణ ఆదిలోనే అయధార్థం. అతడు శోధించి తెలిసిందంతా ఆది అయధార్థంచేత దూషితమౌతుంది. ఈ దోషాలేవీ ఆత్మజ్ఞుని బాధించవు. అందుచేత జగత్తూ అందలి సమస్త విషయాలూ వాని నిజమెంతో తెలియడానికతడే సమర్థుడు. అర్హతలేని జిజ్ఞాస సరియైన జ్ఞానాన్నీయదు.

విజ్ఞాన విషయాలు విఫలం కావడానికి - కాలేదనేవారున్నా - యధార్థమైన వివరణ అదే. తన్ను తాదెలియు నవసరమే లేదని సైంటిస్ట్‌ భావన. ఇరుపక్షాలవారికీ బాహ్య విషయాల స్వరూపం నిరూపించేటప్పుడు తమ్ము గూర్చిన భావనలే కొన్నియైనా ఉండకపోవు. ఉన్న ఆ కొన్నీ దోషభూయిష్ఠాలే.

అయితే మనం మనకే తెలియదా ? తెలుసుననే నమ్ముతున్నాము. సామాన్యుడు ప్రతి యొక్కనికీ అది నిశ్చయమే. సాక్షాత్తు మహర్షియే చెప్పినా, ఆ నిశ్చయం తప్పు అనుకోసాధ్యమే గాదు. మనస్సు పక్వంగావలె, ఎంతో శుద్ధంకావలె. అంతవరకు పుట్టినది మొదలు యిప్పటిదాకా ఆ విషయమైన మన భావనలన్నీ తప్పులనీ నిజంగా మన మెవరమో మనకు తెలియదనీ ఊహించాలేము, గ్రహించాలేము. కాని ఆ భావనలు కల్ల నిజముల కలియగలుపని ఋషులంటారు.

కొందరు ముసల్మానులు - వారి మతం విగ్రహారాధనను తీవ్రంగా నిరసిస్తుంది. వారు మహర్షినే అట్లు ఒప్పించవలెనని వచ్చి వారిని ప్రశ్నింపబూనుకొన్నారు. వారిలో పెద్ద -

పృ|| దైవానికి రూపమున్నదా ?

మ|| ఉన్నదని ఎవరన్నారు ?

పృ|| రూపమే లేకుంటే విగ్రహాన్ని దైవమని పూజించటం తప్పు కాదా ?

మ|| దేవుని సంగతి అటుంచు. నీకు రూపం ఉందో లేదో, అది చెప్పు.

పృ|| చూస్తూనే ఉన్నారుగా ? నాకు రూపముంది.

మ|| అవునా ? అయితే నీవంటే మూడున్నర మూరయెత్తూ నల్లని వర్ణం పొడుగు మీసాలు గడ్డంతోటి యీ దేహమేగదూ ?

పృ|| అవును.

మ|| కలలులేని నిద్రలో గూడ అట్లే ఉన్నావా ?

పృ|| తప్పక, నిద్ర లేచాక నేనట్లే కనబడుతానుగా ?

మ|| చనిపోయిన తర్వాత గూడానా

పృ|| అవును.

మ|| అయితే తన్ను సమాధి చేయబోయే వాళ్ళతో ''వద్దు, నన్ను మీరు తీసుకోపోవద్దు; ఈ యిల్లునాది, నేనిక్కడే ఉంటా''నని ఆ దేహం వాదులాడదేం ?

అప్పటికి స్థితి గ్రహించి పృచ్ఛకుడన్నాడు :-

''నేను పొరబడ్డాను, నేను దేహాన్ని కాను. అందులోని ప్రాణాన్ని.''

మ|| ఇటు చూడు. ఇంతవరకు ఈ దేహమే నీవని దృఢంగా నమ్మావు. అది పొరయని యిప్పుడు కనుగొన్నావు. అజ్ఞానానికది ఆది. దానినుండి తప్పని సరిగా అవిద్య ప్రబలి మానవులనందరినీ ఆవహించి తన దాసులను చేసుకుంటుంది. మూల అవిద్య తొలగనంత కాలం, దైవం రూపి అయితేనేం, అరూపియైతేనేం? అది తొలగిననాడు దానితో పాటే మిగతవన్నీ వదలిపోతాయి.

ఇట్లు ఋషికి రోగనిదానం బాగా తెలుసు. భయకామనలకు దాసులం కావడం మన జబ్బు. అది స్వస్వరూపాజ్ఞానంవల్ల, దాని ఫలితమైన దేహాత్మ భావనవల్ల అని వారి నిర్ణయము.

మనలో చాలామంది పై పృచ్ఛకుని స్థితిలో వాళ్ళే. మన తలపులలో సదా మెదలేదీ, - దేని క్షేమానికై సదా మనం ఆతురులమో ఆ యీ దేహమే ఆత్మయనే భావన మనలో పాతుకొని ఉంది. పై సంవాదం అది సరికాదంటున్నది.

ఆ పృచ్ఛకుడు ఆత్మకు మృతి లేదనీ, దాన్ని దేహమనుకోటం తప్పనీ గ్రహించాడు కాని లోకాయతులూ, నాస్తికులూ ఉన్నారు; వారికి దేహానికి వేరుగా ఏ ఆత్మా లేదు. కాని మహర్షి గురువుగాగల మనకు అట్టి వాదాలు నచ్చవు. ఋషికి ప్రత్యక్షానుభవం ప్రమాణం; వారి వాక్కులు సాధికారాలు. అందుచేత అపరిణత తాత్త్వికులను వదిలేసి మహర్షినే నమ్ముకొన్నాం. వారు ''నాది అనుభవజ్ఞానం. కనుక మీరు నన్నే నమ్మితీరవలె''నని ఆదేశించరు. పైగా వారి వారికి వారి వారి యనుభవాలనే ఆధారంగా చూపి తమ బోధను సమర్థించి నచ్చజెప్పుతారు వారి పూర్ణబోధను సాకల్యంగా ఆకళించుకోవలె. అప్పుడు వారి వాదబలం తెలిసివస్తుంది. క్లుప్తంగా వారి బోధ యిది- 'జాగ్రత్‌ స్వప్న సుషుప్తులు మూడవస్థల్లోనూ, ఆత్మ నిరతంగా ఉంటుంది : దేహం ఆ మొదటి రెంటిలోనే; మూడవదానిలో నుండదు.' భౌతిక వాదతత్త్వంలో మునిగి చిక్కువడ్డ వారికిది తృప్తికరంగాదు. కాని సుషుప్తిలో దేహంలేకనే ఆత్మ ఉంటుందని వారికి గూడ తెల్లమయ్యుండవచ్చు.

మరొక్కమాట. ఆత్మస్థితి శంకింపరానిది. మనోదేహాలతో సహా యితరాలన్నిటియునికి సందేహాస్పదమే. ఈ వాదం 'జగత్తు' అన్న ప్రకరణంలో వివరించాను. అది ఎంత బలీయమో గ్రహిస్తే, ఆపైన భౌతిక వాదుల బిభీషికలు చెల్లవు

దేహమాత్మకాదని తమకు తెలియుననే భక్తులూ తాత్త్వికులు ఉన్నారు; కాజాలదని నమ్మేవారున్నారు. వారిర్వురికీ ఆత్మదేహానికి వేరు, విశిష్టమూ, కాని అందులో సుప్రతిష్ఠితులయ్యే దెట్లని ప్రశ్న. వారి దృష్టికి జీవి అతి సూక్ష్మశరీరి; వానికి శరీరం ఉపాధిమాత్రమే. ఇంటిలోవలె దానిలో కొంతకాలముండి, దాన్ని త్యజించి మరొక శరీరంలోకి బసమారుస్తాడు. ఇది యొక భ్రాంతి. దేహమాత్మకాదన్న వారి దృఢ విశ్వాసం, యీ భ్రాంతి నుంచీ వారిని కాపాడదా ? వారు పై పృచ్ఛకునంతగా తెలియనివారు కారు. పరం పరయా ఆ దృఢవిశ్వాసంలో పుట్టి పెరిగినారు. పామరునివలెగాక వివర మెఱిగినవారు, కాని క్రమేణ వారు తమ విశ్వాసాన్ని భ్రమయనుకొన్నారు. అది తర్కానికి నిలిచేదేగాని ఆచరణ కందదు. ఇతరుల్లాగే తామూ, దేహాన్ని, అది స్థూలమైనా సూక్ష్మమైనా, ఆత్మతో ముడిబెట్టుతూనే ఉన్నారు. దేహం పొట్టియైతే తామూ (తమ ఆత్మా) పొట్టి, దేహం పొడవైతే తామూ (తమ ఆత్మా) పొడుగు; దేహ ధర్మాలన్నీ ఆత్మ ధర్మాలే. ఆ రీతిగానే మనస్సునూ ఆత్మగా భావించారు. మనోధర్మాలకు ఆత్మధర్మాలు భిన్నంకావు.సాంప్రదాయకంగా నచ్చిన తమ విశ్వాసం భయకామనలవశ##మైన వారి దాస్యాన్ని ఏ విధంగానూ తగ్గించలేదు, కాని వారి ఆధిక్యతతో సరిగా వాని ముడి మరింత బిగిసింది కూడా.

ఆత్మకాని వాటితో సాటి యనుకుంటూ, అందువల్ల కలిగే బాధలన్నింటినీ భరించవలసి రావటం స్వస్వరూపానుభావం లేక తొలగి పోదని ఋషులున్నారు. దేహాన్ని ఆత్మగా పాటించడం మన యనుభవం; అలాగే నిజస్వరూపం గూడ మన యనుభవంలోనిదే కావలె.3 అజ్ఞానం మన యోచనా రీతుల్లోనే జీవించి ఉంది. చిరకాలంగా మన తలపులూ పనులూ తప్పుదారిని బడి, మన మనసుల్లో అది అంతగా పెరిగి పేరుకొన్నది. మనకు విషయాసక్తీ అనుబంధాలూ హెచ్చైనవి. మనో నిర్మాణమే అట్లు తీరికూర్చున్నది. దానితో సరిపడని ఏ క్రొత్త తలపైనా అప్పుడే పుట్టిన శిశువంత దుర్బలమై ఉండీ లేనిదిగా ఉడిగిపోతుంది. మనస్సు ఎప్పటి పుంతలే త్రొక్కుతుంది. ఎప్పటి రాగ ద్వేషాలనే పెంచుకుంటుంది. ఈ గతి యింతే. పెద్ద చదువుల తాత్త్వికుడు తాను దేహం కాదని ఎన్నడైనా ఎంచవచ్చు. కాని అంతే సులువుగా తాను మనస్సు కాదను కోలేడు ఈ రెండు రీతుల అజ్ఞానమూ అంతరించేది మనం నిజస్థితి నెఱిగిననాడు, వాదంలోగాక, ఆచరణలో దాని ననువదించిననాడు, అంటే స్వస్వరూపానుభూతి కలిగిననాడు.

ఆత్మ సాక్షాత్కారమైన వరకు తాత్త్వికుడు అజ్ఞానావరణాన్ని వై దాటలేడు. అంతదాకా దాని శక్తి ప్రబలంగా ఉంటుంది. తత్త్వపాండిత్యం ఆ చదువుల వేదాంతి స్వభావాన్నే విధంగానూ మార్చదు. మహర్షి యన్నట్లు, ''చదివియు శాంతిని బొందని వారలకన్న చదువని వారే చాల బ్రదికినవారు; పట్టుకొనుచున్న మద పిశాచము నుండి బ్రదికినారు; చలన మొందు చింతాక్లేశవాక్ల్కేశ రోగముల నుండి బ్రదికినారు వారు బ్రదికినది ఒకటినుండి కాదని యెఱుంగుము.''4 ''లిపి, అనగా విద్య నెఱింగిన, తాను పుట్టుచోటు ఎదియని యెంచి (తెలిసి) లిపిని అనగా తలవ్రాతను లేక కర్మను తొలగింపదలంపనివాడు

_____________________

3. ఆత్మా నంచే ద్విజానీయా దయ మస్మీతి పూరుషః

కిమిచ్ఛ9 కస్యకామాయ శరీరమను సంజ్వరేత్‌ || బృ. ఉ.VI, iv, 12.

('నేనతడే' యని అనుభవము వలన స్వస్వరూపజ్ఞాన మందినవాడు, ఎవని కొఱకు, దేనిని కోరి శరీరమును శోషింపజేయును ?)

4. చూ. అనుబంధం 'క' శ్లో. 82: సూక్తి సుధ, 36

(5)

లిపిని ఎఱింగి అనగా జ్ఞానము గలవాడైనను ఫలమేమి ? అట్టివారు శబ్దగ్రహణ యంత్ర (Gramaphone) తుల్యులేగాని వేఱవ్వరు? శోణశా, చెప్పుము.''5

మోక్షసాధనకు కావలసిన బోధన పుస్తకాలు సూచిస్తవి, రాస్తాలో వివిధ గ్రామాలకు మార్గం సూచించే పట్టికల లాగా. కాని మనం తెలుసుకోవలసిన ఆత్మ ఉన్నది లోన, వెలుపలగాదు. జ్ఞాన నేత్రం విప్పారడమే సంభవిస్తే, అప్పుడు ఆత్మ ప్రత్యక్షంగా, స్వయంభాసిగా వైభవోజ్జ్వలంగా కన్పిస్తుంది. కాని గ్రంథాలు కల్పించే భావన వేరు, ఆత్మ ఏదో బాహ్యవస్తువు, మనస్సు మూలంగా తెలిసి, క్రొత్తగా సాథించుకోవలసిన విషయమని.

ఆధ్యాత్మిక తాత్త్విక విచారణల్లో అవ్యవస్థ ప్రబలడానికి కారణం అవిద్యయని మహర్షి యన్నారు. జనసాధారణమైన అనుభవం ఈ అవిద్యతోడిదే. అట్టి అనుభవాన్ని ఆశ్రయించి ఉంటవి వారి మనోబుద్ధులకు గోచరించే యోచనలూ, వాదనలూ వాని సాయంతో జగజ్జీవేశ్వరుల నధికరించిన నిగూఢ సమస్యలను తృప్తికరంగా, నిశ్చాయకంగా తీర్చడం అసాధ్యం. సృష్టియని ఒకటుంటే అది ఆదిగా తాత్త్వికులూ దేవాధికరణలూ (Theologists), ఆది కారణం సృష్టిక్రమమూ, కాలదేశాలనైజం, జగత్‌ సత్యాసత్యాలు, విధిపురుషకారాల సంఘర్ష, మోక్షస్థితి యిత్యాదులపై తెగత్రెంపులులేక వాదులాడుతూనే ఉన్నారు : నిర్ణయమే తేలలేదు. ఆత్మ సాక్షాత్కారమైనదాకా క్రొత్తపండితులూ, క్రొత్త యుక్తులూ - అవి పైకి క్రొత్తలనిపించినా సరే. పూర్వపక్షం చేయగాని విర్ణయం ఏదీ ఉండబోదు. ఆత్మజ్ఞానికి అన్ని వాదాలు అంతరించినవే : ఇతరులకవి సాగుతూ ఉండేవే. ''ఎప్పుడునూ ఎవ్వరికినీ స్వభావమై యుండు వస్తువును స్వస్థానమగు

___________________

5. చూ. అనుబంధం 'క' శ్లో 81; సూక్తి సుధ, 35

హృదయమందెఱింగి ఆ స్థితియందు నిలుకడజెందక ఉన్నది, లేదు; రూపము, అరూపము; ఏకము; ద్వయము; రెండునూగాదు, అని జగడమువేయుటయె (వాదించుటయె) మాయాదోషము (జ్ఞానహీనత)''6 చేయతగింది, చేయవలసింది ఆత్మసాధన. ఈ చర్చలన్నీ ఆత్మను మనోదేహాలని భావించేవారికే.

మన బాథలన్నీ స్వస్వరూపజ్ఞానం లేకనే. నిజమైన సౌఖ్యం అనుభవించాలంటే అజ్ఞానం తొలగనేవలె. సరియైన చికిత్స, రోగ కారణాన్ని పోగొట్టడమే, ఇతరములన్నీ ఉపశమన మాత్రాలే. ఈ అజ్ఞానం అదృశ్యమయ్యేందుకు ఆత్మసాధన యొక్కటే ఉపాయం.

ఇది ఏమంత సులభం కాదు. మన ప్రయత్నానికి సాధనం మనస్సు దానిని విషయాలన్నిటి నుంచీ మరలించి ఆత్మాభిముఖం చేయవలె. కాని మనస్సు దానికి సహజములైన ప్రవృత్తులను వదలుకోసిద్ధంగా ఉండదు. బలవంతంగా మరలిస్తే, అది అక్కడ స్థిరపడక మునుపటి చోటికే చేరుతుంది. దాని నిండా అజ్ఞానజనితాలైన భావనలే. సహజంగానే అవి తమ జన్మకు కారణమైన అజ్ఞానాన్ని సంరక్షించుకొన చెలరేగుతవి, మనస్సు బ్రదుకే తమ బ్రదుకు గనుక. కాబట్టి యీ భావనలన్నిటిని నిర్మూలించక తప్పదు.

ఆద్యమైన అవిద్యకు జనించినవే గనుక ఈ భావనలన్నీ సత్యదూరాలే. సత్యోదయానికి మిధ్యాజ్ఞానం శత్రువని పెద్ద నిరూపించ నక్కఱలేదు. కాబట్టి వీనినెల్ల విమర్శించి అసందిగ్ధాలూ, నిస్సంశయాలూ కాని వానిని విసర్జించవలె. అవి విద్రోహ భావనలు, ఆత్మ విచారణను వెన్నుపోటు పొడుస్తాయి. వానిని నాశనం చేయకుంటే భద్రత చేకూరదు.

_________________

6. చూ. అనుబంధము 'క', శ్లో. 39: ఉ. న. 34

ఈ విచారణలో త్రికరణాలూ సత్యాన్నే మార్గదర్శిగా ఎన్నుకోవలె. నియతేంద్రియుడూ, శ్రద్ధాళువూ తత్పరుడూ అయినవానికే జ్ఞానం లభించునని భగవద్గీత.7 పై జెప్పిన నియమం అతిముఖ్యం జ్ఞానాన్ని అరగొరగా ప్రేమించుటేమి ? అది ప్రేమ లేకుండుటతో సమమే. సత్యంపట్ల పూర్ణప్రేమ అంటే నిష్పక్షపాత బుద్ధికి అసత్యమని తోచిందెల్లా పూర్తిగా త్యజించ సంసిద్ధం గావటమే. జగజ్జీవేశ్వరుల గూర్చి మనకెన్నో భావనలున్నవి. వానిపై ఏ యభిమానము లుంచక వానిని సునిశిత పరీక్షపాల్పఱచేశక్తీ, ఇచ్ఛా ప్రదర్శించవలె. సత్యప్రియుని లక్షణమే అది, ఇతరుల సిద్ధాంతాలను కాదని తన వానిపై ఎక్కువభిమానం చూపడు. అవి అప్పటప్పటికేనని, పరీక్ష వానిని నిరాధారాలుగా, త్యాజ్యాలుగా రూపించటం సంభవమేనని, కలతజెందక గ్రహించగలడు. తన నమ్మకాలపై నిరభిమానమే లేకుంటే అవిఅంగీకార యోగ్యాలా కావాయన్న ప్రశ్నకు తావుండదు. పరీక్ష కవి నిలువకుంటే వానిని వదలివేయడమేగాక అవి మళ్ళీ మొలకెత్తకుండా, తనపై వాని ప్రభావం నష్టమయ్యేదాకా జాగ్రత్తపడతారు. కాబట్టి మనం ఏ దోషాలూ లేని సత్యానికి. కేవల సత్యానికి కట్టువడి యుండవలె దానికై మన అభిప్రాయాలపై మక్కువపోద్రోయవలె. అప్పుడే సత్యం. మనకది లభించిన పిదప, మన హృదయాలపై ఏకాధిపత్యం నెఱపగలదు.

మనం ఆధ్యాత్మికమనేది ఇంతే, మానసికాలైన అన్ని భావనలనూ నిష్పాక్షికంగా విచారించటమే. నిజమైన ఆధ్యాత్మికం ఈ విచారమే, ఇతరం మెట్టవేదాంతం. ఈ శుష్క వేదాంతులకు తమ కాత్మజ్ఞానం లేదని తెలియదో, కాక అజ్ఞానాని కధీనతతో వారు తుష్టులో.

మనం మెచ్చిన ఆధ్యాత్మిక పధంలో గట్లూ గర్తాలూ తప్పుకుంటూ స్వస్వరూప విచారణకు అనుకూలాలైన భావనలను క్రోడీకరించుటేట్లో ఇకపై విచారింతము.

__________________

7. 'శ్రద్ధావా9 లభ##తే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః' || గీత, IV.

Mahayogama    Chapters