Mahayogama    Chapters   

ఓమ్‌

మహాయోగము

భక్తి

ఇంతవరకూ మనం ఋషుల స్వస్వానుభవ ప్రమాణాలను పరిశీలించాము. వారివలన ఋజువూ, సద్యోముక్తిదమూ, అయిన సాధనం ఆత్మవిచారమని గ్రహించాము. ఆమార్గంలో విషయప్రపంచంనుండి మనస్సును విముఖంచేసి హృదంతరాభిముఖం చేయవలె అది అంత సులభం కాదు. స్థూల సూక్ష్మ విషయరాగాలూ, అనుక్షణమూ ఎడతెఱపిలేక ముసరుకొనే నిద్రాణాలు తీవ్రప్రవృత్తూలూనైన తలపులూ బలవంతంగా ప్రపంచంవైపే దిగలాగేశక్తులూ మనస్సులో నిండి యుంటవి. ఈ మానసిక కలుషాలను వాసనలన్నారు. వ్యంజనాలు గ్రుమ్మరించిన పాత్రలో వానివాసనలవలె ఎన్నోజన్మలుగ సంతరించిన బహువిషయ గాఢసంసక్తులు మనస్సులో మొదలుతవి గనుక వానిని వాసన లన్నారు. ఈవాసనలు కొందరిలో హెచ్చు, కొందరిలో తక్కువగా ఉంటవి. అందుచేతనే సాధకునికీ సాధకునికీ చాల అంతరం ఉంటుంది. సాధకులు నాల్గు తెఱగులంటూ మహర్షి వారిని తుపాకి మందుతో ఎండిన బొగ్గుతో, వంటచెఱకుతో పచ్చితడికట్టెలతో పోల్చినారు. మొదటి వారికి నిప్పురవ్వవలె ఒక్కమాట చాలు, వారిఅజ్ఞానం భస్మీపటలమౌతుంది. రెండవవారికి కొంత ఉపదేశమూ, స్వప్రయత్నమూకావలె మూడవవారికి చిరకాలాధ్యయనం, శిక్షణ, సాధనా అవసరం ఇర నాల్గవవవారిని వారివారి పరిణతి కనురూపాలైన అభ్యాసాలతో సాధనల కర్హులుగా చేయవలసివస్తుంది. ఆవిధంగా శిష్యుల్లో చాల మందికి ఆత్మవిచారం చిరకాలం అధ్యవసిస్తేగాని తుదకు నఫలురం కాగలమన్న విశ్వాసనం కలుగదు. అందుకే పలువురుసాధకుల వైఫల్యభయంతో తమప్రయత్నం విరమించుకొంటారు. అట్లు గానీక వారిని మెల్లగా నైనా స్థిరంగా గమ్యాన్ని దరియజేసే ఉపాయమేదైన ఉన్నదాఅంటే అట్టివారు దైవభక్తిని పెంపొందిచుకోవటమే మార్గం.

ఇక సిద్ధజనుల (siants) మాట. అశ్రేణివారు మార్గదర్శకు లుగా యోగులకన్న ఎంతోమేలు; వారి ననుసరించటం భద్రం కూడా, వారివల్లతెలియవచ్చేజ్ఞానం శుద్ధంగాదు, సాపేక్షమే వారిలో అధిక సంఖ్యాకుల సంకుచిత భావాలను, అశిష్టోక్తులను, ఉపదేశరీతులను ఆమోదించకున్నా వారిపద్ధతి ఎట్టులో ఎన్నడో నాహంస్థితికి చేర్చగలది గనుక మహర్షి వారినాదరిస్తారు. వారిలో ఎన్నోధార్మికశాఖలు, తమతమ శాఖాధర్మాలను దాటిపోగల భావవైశాల్యం వారలో అరుదు. పాక్షికదృష్టి అద్యాత్మికోన్నతికొక గుదిబండ అందువల్ల మహర్షి శిష్యుల్లో భక్తిమార్గంవారు ఆ సిద్ధజనుల్లోని అభిమాన్యులను వివేచనతో నిరూపించి పాక్షిక సిద్ధాంతాలలో చిక్కుపడక జాగ్రత్త పడవలె. మహర్షి శిష్యులకర్హమగురీతిగా, యీ విశ్వాసాలను, మూర్ఖపుపట్టుగా గాక, తాత్కాలికాలుగా ఎన్నటం ముఖ్యం. ఏలంటే యీ విశ్వాసాలన్నీ తుదకుఆత్మానుభూత్యగ్నిలో హుతమయ్యెవే. సిద్ధజను ల్లోని ఋషితుల్యులవాక్కులమాత్రం గ్రహించి యితరాలను వర్జించవలె. వానిలోనూ ఋషులు మన్నించిన అద్వైతసిద్ధాంతానుసారి బోధలనే ఎన్ని అవగతం చేసుకోవడం మంచిది.

ఈసిద్దజనుల బోధసారాన్ని మహర్షియే తెల్చియున్నారు. సత్యానికి నామరూపాలు తొడిగి వ్యక్తిత్వమిచ్చి, దాని నారాధ్యదైవమని నమ్మడం మనశ్శుద్దికి యుక్తమూ అవశ్యకంగూడా, నామ రూపాలేవిచ్చినా సరేగాని వానిలోనే యొక్కటినో అదొక్కటే పూజ్యమని ప్రతిపాదించటం లఘుచేతస్సును తెల్పుతుంది. అలా చేయరాదు. ఇంతకూ గమ్యం భక్తునికీ ఆత్మవిచారకునికీ ఒకటే యని మహర్షి భక్తి జ్ఞానములను సమన్వయించారు.

భగవద్గీత తొమ్మిదో అధ్యాయంలో చెప్పియున్నట్లు, భక్తి దుర్మార్గచరులను చక్కజేస్తుంది. అతిశీఘ్రంగా వారుసజ్జనులై చివరకు నిశ్చల నిత్యశాంతి పదమైన నాహంస్థితి నందుకొంటారు. కాని నియమంగా శుద్ధమనస్కులూ, సన్మార్గులూ ఈక్వరభక్తి చేత ఆకర్షితులౌతారు. భక్తిలో అంతర్లీనంగా అహములేమి. కొన్నిపాళ్ళుంటుటంది. నిరహంస్థితి ప్రమాణానికనురూపంగా సత్ప్రవర్తనా ఉంటుంది. అందుచేత నడవడికను బాగుపఱచుకోవడంలో శ్రద్ధజూపవలె. ఇది అందరికీ అవసరమే. ఆత్మవిచారకులకూ భక్తులకూ గూడా

మనిషివలెనే వానివర్తన. దాన్నే తిరగవేసిచెప్పితే. మనిషి వర్తనకాలక్రమేణ వానిని తనమేరకు సరిద్దిద్దుతుంది. అంటే మతివలెనే గతి; గతి సకాశంగా క్రమంగా మతిమారుతుంది. స్వనియతాచారా విచారాలవల్ల మానవుని వ్యక్తిత్వం అవ్యక్తస్థితి నందుకోగలదు. అందుకే నిశ్శ్రేయ మాకాంక్షించేవాని వర్తన నియతం కావలె. సత్యమెఱుగువాడు అథర్మవర్జనం , ఇంద్రియనిగ్రహం , స్థిత ప్రజ్ఞతలను పూర్ణముగ సాధించియుంటాడు. సత్యమూ సఛ్ఛీలమూ తత్త్వతః ఒకటే. గీత గూడ యీనియమాన్ని దృడంగా విధిస్తుంది. సాధకునికి దైవీసంపద పుష్కలంగా ఉండుటవసరం: లేకపోతే గమ్యం

---------------------------------------

1. అపిచేత్‌ సుదురాచారో భజతేమాం అనన్యభాక్‌ :

సాధురేవ సమంతవ్యః సమ్యగ్వ్యవసితోహిసః

క్షిప్రంభవతి ధర్మాత్మాశాశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి 30-31

చేరలేడు ఆసంపదలోనివే - బీరాహిత్యం, మనశ్శుద్ధి, ధ్యానం వితరణం, మనశ్శరీరేంద్రియ నిగ్రహం, సద్విషయాదరం, స్యత్యఆర్జనముల్లో మక్కువ, అహింస, క్షమ, ఒరులతప్పులెన్నమి, భూతదయ, నర్లోభం, మార్దవం, అధర్మభయం, అచాంచల్యం - ముక్తసరిగ చెప్పవలెనంటే, సచ్చీలం, పైపేర్కొన్న సద్గుణాలు హృత్‌ స్థితాత్మనుండి ప్రసరించేసౌరభాలు. అవన్నీ అవ్యక్తస్థితికి దోహదాలే. వానికి చెందినవారే మనుజులు అవి మనుజులకు చెందవు. శీలసంపత్తి మనల నావేశించవలెననగాని, అది మన వంశంలోనిది గాదు.

అన్ని మతాలు సచ్ఛీలాన్ని సంభావిస్తాయి. దుశ్శీలుడు గొప్పగణితశాస్త్రజ్ఞడో, భౌతిక శాస్త్రవిదుడో కావచ్చు. కాని ప్రపంచాతీతవస్తువునందు భక్తి, అభినివేశం ఒక్క శీలవంతునికే శుద్ధమానసునికే చెల్లుతుంది, దుష్టాచరణం అహంకారంవల్లనే; ఇతర మతస్థులేమను కొన్నా అహము లేమిమనగమ్యం కనుక చెడుగుచేయవలెనన్న కండూతిని ఎట్లైనా తెలగించవలె. బౌద్ధులకు వారి 'అష్టశీలము', క్రైస్తవులకు ''శైలోపరి ఉపదేశము''(sermon on the Mount) ఉన్నవి. ఏమతానికైనా పదింట తొమ్మిదిపాళ్ళు వినయశీలములే. అవే పెంపొందితే నిరహంస్థితి లభ్యమయ్యేఅశుభదినం ఉదయిస్తుందని నమ్మవచ్చు.

భక్తిశీలం మనుజుల్లో యిప్పటికే ఉంది. దాన్ని సంస్కరించి యోగ్యవిషయాభిముఖం చేయవలసియుంది. అవి అయుక్తవిషయాలైతే దానిని భక్తియనక సక్తిలేక సంగమంటారు: సద్వస్తు సదా శయాలైతే భక్తి యంటారు. సామాన్యునికి ఒక వ్యక్తి యెడల భక్తియుండటం సహజమే. ఆ వ్యక్తి ఉత్తముడైతే ఆ భక్తిశోభిస్తుంది ఇది ఆధారంగా ఋషులూ మహాపురుషులూ అరుదైనవానిని అత్యతిశాయి మహిమని మనదృష్టికందించారు. అతనినే దైవమన్నారు. ఆ దైవసంపర్కమెట్లు గల్గినా ఎట్టిదైనా అతనికి భక్తులంగాక తప్పదు.

(భక్తి శీలం బలవంతాన వచ్చేదికాదు: అది అయత్న సిద్ధ సహజం ఈశ్వరుడు తన్నుప్రేమించుమని ఎవ్వరినీ నిర్భంధించడు. భగవంతుని మనం ప్రేమించడం , అతన్ని ప్రేమించకపోవడం చేతాగాక, అతనియందలి ప్రేమచే ఆ కృష్టులమయ్యె భాగ్యమే ఉంటే స్వయంగానే ఆ ప్రవృత్తికి పశులంగావడం మేలు. ఇంతకాలంగా ఇతరేతర విపర్యయప్ర వృత్తులెన్నింటికో పశులం గాలేదా? పురాణప్రసిద్ధుడగు ప్రహ్లాదడు ఇట్లు ప్రార్థించినాడట. భగవంతునెడల భక్తిమాత్రం చాలదు. అది శుద్ధంగా నిష్కామంగా ఉండవలె. భక్తి ఏ ప్రయోజనాన్ని అర్ధించేదిగాకూడదు. అర్ధించుటకే అయితే అది సరియైన దైవభక్తికాదు.

దీని కభ్యంతరం పలుకవచ్చు: "జగజ్జీవేశ్వరులు ఒక త్రిపుటి ఆ త్రిపుటిని మిధ్యయంటిరి. అప్పటికి ఈశ్వరుడూ మిధ్యయే. మరి భక్తికి తావలమేది?'' దీనికి పూర్వపక్షం ఈశ్వర అభావాన్ని ప్రతిపాదించే ఆ వాదంలో లీనంగా ఉంది. దీనిలో రెండేపక్షాలు.త్రిపుటి లోని ప్రత్యంగమూ తధ్యమన్నా కావలె. మిధ్యయన్నా కావలె. కుక్కుటోపమ దీన్ని విశదం చేసింది. జగజ్జీవుల నసత్యములుగాగ్రహిస్తే త్రిపుటి యంతా అసత్యమే. ఆ వాదమంగీకరింపని, అవగతం కాని వానిస్థితి వేరు. అదేవాదం, అదే సాదృశ్యప్రకారం అతనికి ఈశ్వరుడు ఈశ్వరుడగానిజం మరిభక్తికి లక్ష్యం లేకేమైంది? వాని యహంత నశించిందాకా అదియట్లే. అదీగాక, ఈశ్వరుడు అసలు అబద్ధమని ఎవ్వరూ అననూలేదు. అతనిస్వరూపస్థితిలో అతడు వ్యక్తి కాడు హృద్గుహాంతరంలోని సత్యాత్మ.

''సుఖదములని విషయములందజ్జులతగుదమువలె

నీవలని నాభక్తి గాఢాతిగాఢ మగుగాక''

ఈ విషయాన్నే మహర్షి యిట్లు వివరించారు : " విభక్తి గలంత వరకే భక్తి ; వియోగ మున్నంతకే యోగ (ఐక్య) మార్గావసరం. ద్వంద్వం అంటే ద్వైతంకలంత కాలమూ దైవమూ భక్తుడూ తప్పరు. సత్యాన్వేషణలోకూడ మూలమందు కొననంత పర్యంతం ద్వైత ముంటుంది. అలాగే భక్తి లోనూ, ఈశ్వరసాయుజ్యంతో ద్వైతం నశిస్తుంది. ఇప్పుడూ అతడు వస్తుతః వేరుకాడు. ఆత్మ తనలో తాను దలచిన తలంపే ఈశ్వరుడు. ఆకారణంగా బ్రహ్మమూ ఆత్మా ఏకమే. దైవమందు భక్తి సల్పుమనగానే కిమ్మనక అందుకు పూనుకుండే అదిబాగే. కాలక్రమాన వాడనుకొనకనే దైవంతో ఐక్మవుతాడు. అట్టి వాడే పరిపక్వబుద్ధి.2 మరియొకతీరు వాడు ఎదురుతిరిగి 'ఇదో మేమిర్వురము - దైవమూ, నేనూ. దూరాన దైవాన్ని తెలుసుకొనక పూర్వం, సన్నిహతంగా ఉన్న నన్ను తెలుసుకొనిస్తే మంచి"దంటారు. అట్టివానిమార్గం ఆత్మవిచారం. నిజంగా భక్తీ, విచారము అంటే జ్ఞానమూ, ఒకటే." మరోసమయంలో మహర్షి "దైవం నీయంతే నిజ"మన్నారు.

అందుచేత ఋషులు చెప్పిన పారమార్థిక సత్యమైన దైవ స్వరూపస్థితికీ, భక్తి ప్రయోజనానికైన దైవవ్యక్తిత్వానికీ పరస్పరం వైరుధ్యం లేదు. తొలితొలిదశల్లో భక్తుడు అన్యాపేక్ష భూమిల్లోనే వసిస్తాడు గదా ?

అయినాదైవం హృదంతరంలోని సద్వస్తువు గనుక మనం 'అనుగ్రహ' మని భావించే దానిమూలం ఆ ఆత్మయే; ఆ మటుకు, దైవాన్ని సద్వస్తువుగా నమ్మేవాళ్ళకూ, అదితెలియని వాళ్ళకూగూడా సమమే. అనుగ్రహం అంతరార్థమేమి, అది క్రియకు వచ్చేదెట్లన్నది

-----------------------------------------

2. అట్టివానిని అతివిస్తరములూ క్లిష్టములూనైన సిద్ధాంతరాద్థాంతాలలో తాను నిరతమూ శాశ్వతంగా ఆత్మకు భిన్నుడననే మూర్ఖునిగా ఎన్నరాదు.

ముఖ్యం, ఇంచుమించు అన్ని మతాల్లోను యీ "అనుగ్రహ" భావన కెంతో ప్రాధాన్యమున్నది. అనుగ్రహం లభించనిదీ విమోచనం అసాధ్యం. జీవుల శక్తియుక్తులకు ఒకమితియున్నది. అవధియున్న వారి సకలసామర్ధ్యమూ అనవధికమైన అర్థాన్ని ఫలింపజేయటం కానిపని. తనకు నాహంస్థితి ప్రాపిస్తే భక్తుడది దైవానుగ్రహంగా భావిస్తాడు ; సత్యశక్తియే ఎన్నడైనా అసత్యాన్ని నిగ్రహిస్తుందని గ్రహించటం దీనిపరమార్థం.

ఒకడు దైవాన్ని నమ్మడు. కాని యింతవరకూ నిర్దేశించిన తత్త్వవిచారం చేసిచేసి తుదకు ఋషులు బోధించిన నిరహంస్థితి ప్రాప్తవ్యమనే నిర్ణయించుకొంటాడు. కాని వానికిగల మనోదౌర్బల్యాలు, అవ్యవస్థలూ అడ్డుతగల్తవి. అటు పిదప వానికి దైవంలో గురికుదిరి, ఆయన అనుగ్రహంవల్ల నిరహంస్థితిని పొందేందుకై దైవభక్తి సేయుటకు ఆరంభించవచ్చు. గ్రహించవలసిందేమంటే, ఆత్మ విచారానిక శక్తుడనుకొనేవానికి దైవమందు భక్తయావేశం అత్యంత ముపకరిస్తుంది. ఆ విషయం భక్తి పరిణామంలో స్వార్పణ దశను చర్చించేప్పుడు విస్పష్టమౌతుంది.

ఆరంభదశలో భక్తిద్వైతభావనగనే ఉంటుంది. భక్తుని దృష్టికి దైవమొక వ్యక్తి, తనకు విశిష్టమైన వాడు. ఆకారణంగా అద్వైతులు దాన్ని చిన్నచూపు చూస్తారు. ఋషులిందు కొప్పు కొనరు. మహర్షి నొకరు అడిగారు : నిరాకారునిగా దైవాన్ని ధ్యానించలేకున్నాను. సాకారునిగానెన్నటం ఆయన్నున్నూనపఱచటం. నేనే జేయను?" మహర్షి ఎదురన్నారు : " ఈవిధిగా హెచ్చులోచ్చులు నిన్నుచూడమన్నదెవరు ? దైవాన్ని నీవు సాకారునిగా, వ్యక్తిగా ధ్యానిస్తే అదే నిన్ను తప్పక గమ్మం చేరుస్తుంది." వ్యక్తిత్వం రూపాకృతియని మనమెఱిగిందే.

అద్వైత విషయకమైన పరోక్షజ్ఞానం భక్తికవరోధం కాదుసరి కదా, దాని కితోధికంగా దోహదం చేస్తుంది. అద్వైతమందు నిశ్చయ బుద్ధిగల వారిలో పరమభక్తులెందరో యున్నారు దైవ - ఆత్మల ఏకతను అనుభవ పూర్వకంగా ఎఱిగిన మహాత్ములెందఱో ! అందువల్ల వారికి గల దైవభక్తి ఏ మాత్రమూ సడలలేదు; పైపెచ్చు గాఢ తరమయింది. ఇన్నాళ్ళూ అహంతాపరమాత్మలు రెంటా విభక్తమైన వారిప్రేమ, అవి అభిన్నమని తెలియుటతో ఏకధారగా ఆఒకటిపైననే ప్రవహించింది. దైవం వ్యక్తి అనే రీతుల్లో అతన్ని ఎన్నో ఋక్కుల్లో గీతాల్లో పాడినారు. వానిలో వసై#్త్వక్యాన్ని కొనియాడినవీఉన్నవి. అంటే వ్యవహారంలో జ్ఞానానికి భక్తికి ప్రాతికూల్యం లేదన్నమాట. పారమార్థికంగా ఏకత ; సాపేక్షమైతే భక్తి.

అద్వైతి దైవాన్ని పూర్ణంగా ప్రేమిస్తాడు ; ద్వైతిప్రేమ అంశ భాగమే. ఉపనిషత్తులనేట్లు, ఎవనికైనా ప్రియాతిప్రియం తానే, దేన్ని కోరినా, దానికొరకై కాదు, తనకొరకే. రెంటిని వేరుగా రెండుగా భావిస్తే, ప్రమేను రెంటా పంచవలె. రెండూ ఒకటే అయినపుడు, ప్రేమ అవిభక్తం అందుకే మహర్షీ భగవద్గీతాకూడా ఋషులే పరమ భక్తులంటారు. భగవన్నుతుల్లో కెల్లా అత్యంతప్రశస్త మైనది. ఆయనకది ఆపాదించనైతే, ఆయన్ను అతిశయంగా తనియించేది, సర్వసృష్టికర్తయన్న మన్ననగాదు, హృదంతరాత్మగా ఎల్లరికీ ప్రియతముడని, దైవాన్ని సాపేక్షంగా, మాయాపక్షంగా భావిస్తేనే, ఆయన గొప్పలు పాడుకొనడం ; ఆత్మస్థితిలో బ్రహ్మము మాయాతీరమూ, పరమార్థమూ.

అద్వైతాన్ని నమ్మినవానిదైవం ఆహంతానాశకుడు. ఈనిజాన్నే మహర్షి తమ 'అరుణాచలపదికం' చివరిపద్యంలో వర్ణించారు : "బహుళా ర్తిమయమైన బ్రదుకుకు విసివి, తనువుదొరగుటకై ఉపాయాలు నెమకేవారికి ఒక్క పరమౌషధం తెల్పుతాను. అదిచాల అరుదైనది. దాన్ని ఏకాస్తసేవించినా ప్రాణంపోదు, నిజము : కాని అహంకారం సర్వనాశమౌతుంది. ఆ ఔషధమే అరుణాచలము."3

ఇకలోక వ్యవహారంలోని భక్తిని గూర్చి సవిశేషంగా పరిశీలిస్తాము.

నిస్సంకల్పంగానే మనస్సు దైవాభిముఖంకావడం భక్తి. అది దైవచింతనలో సుఖమబ్బినప్పుడే సంభవం. ఈసుఖం ఒక్కొక్కపుడు తన్మయత్వం (హర్షోన్మత్తత) కావచ్చు. తరువాత దాని స్మృతి ఆ భక్తిని సాంద్రంచేసి ప్రాప్యానికి హృదయాన్ని దృఢంగా కట్టివేయ వచ్చు. అట్టి భక్త్యున్మాది మనస్సు సామాన్యజనానికి సంతోషదాయకాలైన ఇంద్రియవిషయాలనుండి క్రమంగా విముఖమై, అతడు భక్తుడౌతాడు. అతడాపైన ప్రహ్లాదునివలె దైవాన్ని ప్రార్థించే దొకటే, తనభక్తిని అధికాధికం చేయమని. ఆమహానుభావాల్లో చాలమందికి భక్తి ప్రాప్యమే అవుతుంది. వారిదృష్టిలో దైవం చాల సులువుగానే మోక్షమిస్తాడు; కానితనప్రత్యేకానుగ్రహపాత్రులకేగాని భక్తిని ప్రసాదించడు.

భక్తియొక విధమైన ఆవేశం. అనుభవం, దానిలో తరతమాలున్నాయి. క్రుంగు పొంగులున్నాయి. ఒక భక్తఋషి యన్నారు :- ఋషి భక్తి గంగా స్రవంతివలె ప్రసన్న గంభీరం. యమునవలె నదిదుడుకులదిగాదు అందుకే కవిగాని ఋషి కనుపించడు. తరతరాలుగా వారు మనకందించిన కవితాసంపత్తి యపారం. కవిత

--------------------------------------------------------------------------

3. పై 'పదికం' లోని భావాలకు సంస్కృతానువాదమీ క్రిందిది :-

ముక్తాస్థా ఇహ జీవనే బతవ పుస్త్యాగాయ సజ్జానరా ః

అస్త్యేకం భువి భేషజం నిరుపమం యద్ధ్యాన మాత్రాత్సకృత్‌ |

ప్రాణానామవియోజనేన నియతం హన్యాన్మృషాజీవకం

తజ్జానీహ్యరుణాచలాఖ్య మమృతం సచ్చిత్‌ స్వరూపం శివమ్‌ ||

సాక్రామికం దానివలన ముగ్ధులైన భక్తులయ్యేవారెందరో ! కేవలము కవిలోన నిసర్గమైన ఉన్మాదం భక్త్యున్మాదం కావడానికెంతో కాలం పట్టదు. కవితయే వారి కన్నపొనాలవుతుంది. నామోచ్ఛారణ మాత్రాన వారు తదావేశ వివశులౌతారు.

భక్తి సర్వమూ సమఫలాన్నీయదు. శ్రీకృష్ణచైతన్యులు వ్రాశాడనే యీ క్రిందిపద్యంలో చెప్పినట్లు "గడ్డిపరకకన్నా నమ్రాతినమ్రత తరువును మించిన యోర్పు, ఎన్నడూ ఒకరు మెప్పును గోరమి, పరులయెడ సదామాన్యత - ఇట్టి గుణవంతుడే దైవనామము గొననర్హుడు."*

నిసర్గంగానే కవియైనందున, ఆజాతికి సహజాలైన గుణావగుణాలు రెండూ భక్తుని కుంటాయి. అతనిది సర్వత్ర అతియే : అట్లే అతడు రసస్ఫురమావేశానికి వశుడౌ తాడు ఈ పద్ధతిలో అతడతిమాత్రంగా విదగ్ధుడయ్యే అవకాశముంది. అదెట్లో తెలియదు గాని, తత్త్వ చింతకుని కన్న భక్తుడే ఎక్కడ దృష్టశాలి ; వానికన్నా దైవానికి దాపై బోధయోగ్యమైన పరిపక్వత నందుకొంటాడు. భక్తిలో ప్రారంభకునికీ పరిపాకికీ చాల అంతరం ఉంది. పక్వస్థితిలోని వాడు తొలిదశలోని వానివలె వికటమూ సంకుచితమూ అయిన భాషా ప్రవర్తనలను అధిగమిస్తాడు. కాని వీనిలో హెచ్చులొచ్చుల నెంచడం విశ్వాసికి దుస్సాధ్యం. నిజం చెప్పవస్తే, భక్తి ప్రధానాలైన మతాలు అపక్వ భక్తుల లోపాలతో నిండియుంటవి. పక్వబుద్ధుల సహజాన బోధను మూర్ఖ విశ్వాసి విపరీత వ్యాఖ్యలతో నెట్టివేస్తుంటాడు. మతాలు విరూపాలయిన జనుల్లో స్నేహార్థం పెంచక విభేదాలనే అధికం జేసిగతి యిదే. ఋషికి అహమిక అసలుండదు, కాని వారికి 'విలక్షణంగా సిద్ధ

----------------------------------

* తృణాదపి సునీచేన, తరోరపి సహిష్ణునా

అమానినా మానదేన, కీర్తనీయః సదాహరిః||

జనుల్లో పూర్తినాశంగాకుండా కొంతమిగిలే ఉంటుంది. సిద్ధజనునికి మనస్సున్నది అతడొక విశిష్ట ధర్మావలంబి. ఋషిక వేవీ లేవు. సిద్ధ జనుడు తన ధర్మం పేరిట అన్యమతస్థులను హింసింపగలడు : ఋషి అట్లు చేయనేరడు. సిద్ధజనుడు దైవానుగ్రహం కోల్పోయి , పతితుడై, మోక్షలబ్ధికి దూరం కావచ్చు. అంటే ఋషి సిద్ధజనుడుగాఉండడని ఉండరాదనీ కాదు : ఉన్న వాళ్ళూ ఉన్నారు, ఉండగలరు గూడా. సిద్ధ జనుడూ, ఋషివలెనే, ఆర్జవంతో మూఢవిశ్వాసాల బారిపడక పోవచ్చు.

నిజానికి భక్తునికి విస్పష్టమైన విశిష్టమైన ఏ ధర్మముతోనూ పని లేదు. ఏ మతవిశ్వాసానికీ అతడు బుద్ధుడు కాకపోవడమే అందరికీ శ్రేయం. మనస్సుకు సంస్కారం హెచ్చెకొద్దీ, యీ విశ్వాసాలు అప్పటప్పటికి మరక తప్పదు. ఆ విశిష్ట ధర్మం కొంతసడలింపులకూ పొడిగింపులకూ అనువిచ్చేదైతే ఏ హానీ ఉండదు. కాని భక్తులట్టి ధర్మాన్ని కల్పించలేరు. ఆ పని ఋషులకే సాధ్యం. ఏలంటే భక్తి కవితా శీలంగలది, గద్యానికి ఉపక్రమిస్తే కలుగగల అనర్థాలకు మేర ఉండదు.

ఋషులు, సిద్ధజనులు కాగలరు. కాని యీ వీరు ఋషులు కాగల్లటం దుస్సాధం. ఏలంటే ఋషులదైన నిరహంస్థితికి సర్వోన్నతీ సర్వశోభనములూ ఉపపన్నములే. అహంకృతి మిగుల్చుకొన్నవారు విధిగా అపూర్ణులే.

కొందరికి భక్తియేదో అవ్యక్త ప్రణయాను భూతిగా పరిణత మవుతుంది. ఆస్థితికీ నిరహంస్థితికి భేదం అట్టే కనిపించదు. ఇదిమనకుభక్తి కవితావాఙ్మయం. శ్రీరామకృష్ణపరమహంసనుగూర్చిన వాఙ్మయమూ స్పష్టం చేస్తాయి. పరిపాకియైన సిద్ధజనునికీ ఋషికీగల వ్యత్యాసమత్యల్పమని ధ్వనింపజేస్తూ మహర్షి రచించారు :"ఎల్లరి హృత్‌ కోటరములలో వెలుగు శుద్ధచిత్‌, అదే ఆత్మ. దానియనురాగము వలన మది కరగి హృదిలోలోన చొరబారినపుడు జ్ఞాన చక్షువువిప్పారి సత్యాత్మ సాక్షాత్కరించును",4 ఆ ప్రేమనిండారి పూర్ణమైనపుడు మహా పురుషుడు ఋషి¸°తాడు.

భక్తుల మనః పరిణితినిబట్టి భక్తి సేయు విధానాలు మారుతవి, మహర్షీ, పురాతన వాఙ్మయమూ, భక్తిలో విలక్షణాలుగ రెండు రీతులను పేర్కొన్నారు. చిట్టచివరకు దైవమే ఆత్మా అనుభూతమౌ తుందంటే పామరుని బుద్ధికదియందదు. దైవభక్తియంటే తాము దైవానికి భిన్నులం, దైవానికధీనులం, ఆయన సర్వేశ్వరుడు, ఆయన్ను శ్రద్ధగా సేవించుకుంటే ఆయన అనుగ్రహం పొందగలం - ఇది వారి భావన. వారి దృష్టిలో దైవం నరాకృతియే. కనుక ఆయన పురుషోత్తముడు. వీరువారనక ఎల్లరికీ తాను ప్రభుడు గనుక వారు సద్గుణాలల వఱచుకొని పరస్పరం మేలెంచి మేలు చేయవలెననేది దైవేచ్ఛ. ఈ భక్తిలో స్వార్థముంది. భక్తుడు వ్యక్తిగతంగా ఫలమాసిస్తాడు. తన వ్యక్తిత్వం సంతతమనేదానిలో వాని కేశంకా లేదు. ఇట్టి భక్తి వలన అహంత జీవితం దీర్ఘ తరమౌతుంది.

భక్తి పరిపాకం జెందినతడు దైవానికి నరాకృతి కైతవమని నిజం కాజాలదని గ్రహిస్తాడు. పైకి వేరుగా కనుపించినా తనకెలాగో అభిన్నుడనితలపోయనారంభిస్తాడు. పైదే అయినయీవిభేదము అమోఘమయిన ఆయన అనుగ్రహం వల్ల కరిగిపోతుంది. అందుకు భయపడవలసింది లేదు. తనవ్యక్తిత్వం నిల్పుకోవలెనన్న ఆస్థ వానికప్పటికే పోయిందిగనుక, నిరహంస్థితి దాపులకు సత్వరమే చేరుతాడు. ఆ అనుప్రవాహాన్నడ్డేది అహంతేగనుక అది యడగి పోవడంతో దైవాను గ్రహమూ అతని కనుకూలంగా అధికమౌతుంది.

---------------------------------------

4. అరుణాచల స్తుతింపంచకము ప.1

భక్తుడు దైవంతో వ్యక్తిగత సంబంధం కోరుతాడు. ఆయన తనకు గోచరమౌతుండవలెనని, తాము పరస్పరం పలుకరించుకొంటూ ఉండవలెనని, మరెన్నెన్నో ఆశలు. వానిలో యోకొన్ని యో ఫలించనూవచ్చు అప్పుడతడు పొంగిపోతాడు. కాని ఆదృశ్యాలు మఱుగుతవి. అతడెంతో క్రుంగిపోతాడు. ఆదృశ్యాలన్నీ ఆభాసాలు, మనః కల్పితాలన్నారు మహర్షి. అందుకే అవి నిలువవు. అహంతాంశం అల్పాల్పమున్నా దైవస్వరూప దర్శనం దుర్లభమన్నారు దైవాన్ని స్వభావస్థితిలో చూడటం నిరహంస్థితిలో సుప్రతిష్ఠుడు కావటమే. ఇట్లు పరమగమ్య సందర్భంగా భక్తునికీ ఆత్మ విచారాకునికీ ఏభేదము లేదు. సద్వస్తువునుండి పిలుపు సత్యప్రేమికొకరీతిగా, నిశ్ర్శేయః కాముడగు భక్తునికి మరొక రీతిగా అందుతుంది. భేదమంతమాత్రమే. తమ వ్యక్తిత్వాన్ని సదా నిల్పుకొనగోరే తత్త్వవేత్తలకిది నచ్చదు. అది పొరబడుటేయని, భగవద్వశంగా పూర్ణ శరణాగతి యెట్టిదో వివరిస్తూ మహర్షి సూచించారు.

ఆత్మవిచారంతో సాధకుడు చేరే గమ్యాన్ని భక్తుడు శరణాగతితో సాధిస్తాడు : ఇది అనుగ్రహంకల్గించే బోధవల్లనే అనుగ్రహం జీవులను ఆత్మాభిముఖంగా ఆకర్షించే దైవశక్తి. జీవుడు లఘు విషయమనీ, ఉన్నదీ ప్రాప్యమూ కేవలం దైవమేననీ భక్తుడు క్రమంగా తెలిసికొంటాడు : అందుకై సర్వమూ త్యాజ్యమని గుర్తిస్తాడు. అట్టి తెలికిడి వానిని శరణాగతికి సుముఖుణ్ణి చేస్తుంది.

'అనుగ్రహ' మన్నపదం ఆధ్యాత్మిక పరిభాషలోనిది కాదు. కాని అది వాస్తవమూ అర్థసాధకమూ అయిన దానికి పర్యాయం. దాని తాత్పర్యం దైవం ఇప్పుడూ సత్యమేయని, దుర్జేయమైన దారుల్లో కేవలం సత్యమే జయిస్తుందనీ. కాని భక్తుడు "అనుగ్రహానికి" వేరు పర్యాయపదం సూచించలేదు.

అనుగ్రహంలో మూడుదశలున్నవన్నారు. తొలిదశలోపరాయణమగు సత్యం, దైవం. అతడు అతి దూరగుడు, అనుపగమ్యుడు. భక్తి సాధకుని రెండవదశకు చేరుస్తుంది. అప్పుడతనికి దైవం గురరూపేణ దగ్గరౌతాడు. గురువు స్వస్వరూపాన్ని ఎఱుక పరచే ఋషి. ఆ పిదప దైవభక్తి స్థానే గురువు నెడల శ్రద్ధాశుశ్రూషలు కుదురు కొంటాయి. గురుభక్తి యతన్ని అనుగ్రహ పరాయణ స్థానానికి, అంటే నాహం స్థితియందాత్మానుభూతికి కొనిపోతుంది. అదే అనుగ్రహంలో మూడవదైన చివరిదశ.

అనుగ్రహం నిరాటంకంగా ప్రసరించడానికి స్వార్పణ విధాయకం. అది అంశంగాకాదు, పూర్ణమూ కావచ్చు. ఏదయినా నాహంస్థితికి ఉన్ముఖంగానే. కొంతకు కొంత అది నాహంస్థితి సమకూర్చగల నిశ్శ్రేయాన్ని రుచిచూపుతుంది మహర్షి చెప్పేట్లు, శరణాగతుడు గతంలోని తనమంచిచెడుగుల గూర్చి వెత పడనక్కఱలేదు. వానిఫలాలు వానినే విధంగానూ బాధించవు. అనుగ్రహం వాని పెంపణచి అతని కనుకూలంగానే తీరుస్తుంది. అనుగ్రహంయొక్క సకలకర్తవ్యమూ, కోశాలనొక్కొక్కటిని నివర్తించి ఏకాత్మ ప్రకాశాన్ని వెలివఱచటమే.

అనుగ్రహం ప్రత్యేకమూ, విశేషమూ కాదు. అది సర్వగతం. ప్రపంచంలోని సర్వశుభాలకు ప్రాపుఅదే. ఎల్లరికీ అందులో పాలు ఉంది. అహంతజోక్యం కలిగించుకొని దాని కార్యాన్ని కొంచె పఱుస్తుంది. స్వార్పణవల్ల ఆ జోక్యం క్రమంగా తగ్గిపోయి, అనుగ్రహం అధికాధికంగా ఫలకారి యవుతుంది.

అనుగ్రహానికి అర్హతయేమని అడిగితే మహర్షి యిట్లన్నారు : "అనుగ్రహంలేకనే యిట్లు ప్రశ్నిస్తున్నావా ? ఆదిమధ్యాంతాల్లోనూ అనుగ్రహమే . ఆత్మ అదే. అజ్ఞానంవల్ల అది ఎక్కడో బయటనుంచి రావలసిందని ఎదురుచూస్తాము."

శరణాగతి స్వరూపాన్ని మహర్షి వర్ణించారు :" నీమూలమునకు నిన్నర్పించు కొనడ మొకటే కర్తవ్యము. అది దైవమని వెలినుండి వచ్చునని ఆకులపడకు. నీమూలము నీలోనిదే. శరణాగతి దానికే. దానిని వెదకవలె. ఆ అన్వేషణా పరత వల్లనే దానిలో లీనమౌతావు. మూలమెక్కడ అన్న ప్రశ్న ఆ మూలము భిన్నమనుకున్నపుడే. అహంత దానిమూలములో లీనమైతే అహంత లేదు, జీవాత్మ లేదు. అంటే విచారకునికీ ఆత్మకూ ఏకతసిద్ధించింది. ఆపైన స్వార్పణ ఎక్కడిది ? ఎవరికి ? అర్పించుట కేమున్నది ? ఈ వ్యక్తిత్వనష్టమే - నిజంగా వ్యక్తిత్వమిప్పుడు లేదు - భక్తి, ప్రజ్ఞ, విచారమూ.

"వైష్ణవ భక్తుడు నమ్మాళ్వరు పాడినారు : ' స్వస్వరూపము తెలియక, నేను నాదియన్న భ్రమలో చిక్కుపడ్డాను, కాని నన్ను నేనెఱిగిన పిదప నేను, నాదిగూడా నీవేయని ఎఱుగ గల్గినాను'. కాబట్టి నిక్కమైన భక్తి తన్ను సరిగా తెలుసుకొనడం. ఇది వైష్ణవ ధర్మంతో సరిగా అతుకుతున్నది. కాని వారి సాంప్రదాయిక విశ్వాసంవేరు విధంగా ఉన్నది : 'జీవాత్మలు దైవమునకుపాధులు. అవి శుద్ధమై, ఆ పైన శరణాగతికావలె. తర్వాత వారా దేవలోకానికి పోయి ఆయనతోకూడి ఆనందిస్తారు. జీవాత్మ తానే దైవమయ్యే టైతే ఆనందించు టెక్కడిది ? తానే చక్కెర అయితే చక్కెరను రుచిచూచేదేవిధంగా ?' అని వారి వాదం. అందువల్ల వారు దైవానికి వేరుగనే ఉండి ఆనందించ గోరుతారు. కాని వారనే ఆ శుద్ధి అహంతానాశ##మే. చక్కెరవలె దైవము జడమా ? శరణాగతి యధార్థమూ పూర్ణమూ అయితే భేదభావన ఏవిధమైనదైనా ఎట్లు సాధ్యమవుతుంది?"5

"అంతలోగాలేదు. వారావైకుంఠంలో హరికి వేరుగనే ఉండి

----------------------------------------------------------------

5. వైష్ణవుల యీ చక్కెర ఉపమ అసంబద్దమని నిరూపితము.

ఆయన్ను సేవించి పూజిస్తారట. సేవ యన్నమాత్రానికే దైవం మోసపోతాడా ? వీరిసేవనాయన ఆదరిస్తాడా ? శుద్ధ చిన్మూర్తి ఆయన 'నాకు వేరుగా మీరెవ'రని తెగనాడడా ?"

["వారంటారు: 'శరణాగతి తర్వాత వ్యక్తి యొక్క ఆత్మ మిగిలి దైవానికి తనువౌతుంది. ఆ ఆత్మ -తనువుకు దైవమే ఆత్మ. వ్యక్తి ఆత్మను జీవాత్మయనీ దైవముయొక్క ఆత్మను పరమాత్మ యనీ పేర్కొన్నారు', ఆత్మకూ ఆత్మ యుండునా ? ఆత్మలెన్నియని ? అసలు ఆత్మస్వరూపమేమి ? దేహమూ మనస్సూ ఆది అనాత్మ విషయాలన్నీ నిరాకృతములైన పిదప మిగిలి వెలిగేదాయొక్కటే ఆత్మ. ఆ సరణిలో అపనీతమయ్యే ప్రతిదీ అనాత్మయే. అటుకాదు, ఆ మిగిలేది అణీయాత్మగ ఆ అణీయాత్మకు దైవమాత్మయనేటైతే, అనాత్మ నిరాకరణము తుదిచూడక మధ్యంతరంగా ఆపినావన్నమాట.అది తుదిదాకా సాగించే ఉంటే అణీయాత్మ నిక్కమైన ఆత్మకాదనీ, కేవలమూ మహీయమే సత్యాత్మయనీ తెల్ల మయ్యేది. అనాత్మ పనయం పూర్తికాగా శేషించినదే ఆత్మ. వారు చేబట్టినది సద్వస్తువు కాక మరేదో అనుట స్పష్టమే.

ఈ అవ్యవస్థ అంతా ఆత్మపదానికి నానార్థములున్నందువల్ల నే. ఆత్మయంటే స్వస్వరూపము, దేహము, ఇంద్రియములు, ప్రాణము, మనస్సు, ఊహ (Fancy) కైతవమైన స్వల్పాత్మ, సత్యాత్మ. అందువల్ల స్వల్పాత్మను సత్యాత్మకు తనువుగా వర్ణించుట సంభవమే. కాని గీతాశ్లోకంలో దైవం తన్ను 'సర్వభూతాంతరాత్మ' యన్నట్లున్నది. అందఱలోని యాత్మయే తనన్నాడుగాని ఆత్మల్లో ఆత్మననలేదు.

నిన్ను నీవు నీమూలానికి భిన్నుడవనుకోవటమే ఒక చౌర్యము : ఆ విధంగా దైవీయాన్ని నీస్వామ్యం చేసుకోచూస్తున్నావు. శుద్ధుడవై పిదపగూడ దైవంతో వేరుగానుంటూనే, ఆయనతోకూడ ఆనందమనుభవింపజూడటం అప్పటమైన బందిపోటు. దైవానికిదంతా తెలియదా ?

పిండితార్థమేమంటే, వ్యక్తిగా తన వైశిష్ట్యాన్ని నిల్పుకో యత్నించేవాడు యదార్థంగా శరణాగతిచేయలేడు. అతని స్వార్పణమెంత గరీయమైనా, అది నియతమే.

శరణాగతి యధార్థ స్వరూపాన్ని తెలిసే ప్రక్రియ నొకటి మహర్షి ఒక కుఱ్ఱవానికి సూచించారు. అతనికి మనస్సు చెడి 'అస్తవ్యస్తంగా'ఉన్నాడు. అతనికి దైవం ప్రత్యక్షమై తానాత్మార్పణం చేసుకుంటే మహదభ్యుదయములు వాగ్దానం చేసినాడట. తన భాగం తాను చేశాడట కాని దైవమే మాటనిల్పుకోలేదు. మహర్షిని 'నిలదీసి' అతడడిగినాడు :'నాకు దైవాన్ని చూపు. వానితలను నేనైనా తఱిగివేయవలె, నాతల నతడైనా తఱిగివేయవలె' మహర్షి ఒక పరిచారకుని పిలిచి తాము రచించిన ఒకదానికి తమదేయైన వ్యాఖ్యను చదువమంటూ, అన్నారు : "ఆత్మార్పణం నిజమే అయితే, దైవ చర్యలను విమర్శించేందుకు మీదుమిగిలియున్న దెవరు ?" ఆ కుఱ్ఱవానికి తెలిసివచ్చింది తప్పు తనదే యని ఒప్పుకొని శాంతంగా నిష్క్రమించాడు. శరణాగతి నియతమూ, సవ్యాజమూ కారాదు. అది యిచ్చిపుచ్చుకొనే వ్యాపారం కాదు.

ఆత్మార్పణ యంటే అందరూ అనుకొనేది తన్ను భగవంతునిక కాన్కగా యిచ్చుకోవడమని. అది సరిగాదు" దైవానికి ఆత్మనివేదనం చెల్లవు. వినాయకునికి అందులోంచే కాస్త గిల్లి నైవేద్యం చేయటం గాదు. బ్రహ్మమునకు వేరుగా వ్యక్తి - ఆత్మలేదు". పరమాత్మ కన్యంగా జీవునికి ప్రత్యేకంగా ఆత్మను భావించడం చౌర్యమనటంలో సందేహం లేదు. అది ఒక పరిగాక నిరతమూ సాగించే తస్కరణం . ఈ దొంగతనం ఆగవలె. భక్తుడు తనకు ప్రత్యేకం ఉనికి లేదని యెఱిగిన తోడనే అది నిలిచిపోతుంది.

లోక వ్యవహారంలో ఆత్మనివేదనా ఫలాన్ని మహర్షి వేరొక భంగిగాకూడ వర్ణించారు :"భగవంతుడు భూబారమును వహింప, దాని నాభాసజీవుడు వహించుట గోపురవాహిబింబమునుబోలు పరి హాస్యమే యగును. బహుభారవాహియగు బండిలో బోవువాడు తన భారమును ఆ బండినుంచక తలమీదబెట్టుకొని కష్టపడుట యెవరి దోషము ?" ఇందు రెండు ఉపమల జెప్పియున్నారు. మొదటిదానిలో ఆ బాసజీవునికి (వ్యక్తి - ఆత్మ) స్వతఃచైతన్యం లేనందున అతడు జీవిత భారాన్ని నిజముగ వహింపడనీ, సర్వంభరుడు కేవలమాదైవమేయనీ. రెండవ ఉపమలో దైవానుగ్రహానికి తన్నర్పించుకొననివాడు నిరంత వ్యధలపాలౌతాడని. శరణాగతిలో మనస్సుంచిన భక్తుడు నర్వ్యాకులుడై, యిప్పుడూ ఎప్పుడూ సుఖముంటాడు.

- * -

-----------------------------------

6. చూ. అనుబంధం '' శ్లో. 111.

7. చూ. అనుబంధం '' శ్లో . 63 : సూక్తిసుధ, 17.

Mahayogama    Chapters