Bharatiya Samskruthi    Chapters   

విన్నపము

మానవులు సుఖ సంతోషములతో నీతి నియమములతో థర్మ బద్ధముగ నిహపర సాధనాత్మకముగ జీవితము జరుపుకొనుట విధి. ఇందు తగిన ధర్మ సాధనాన్వేషణాదులవసరము. థర్మమున నెరుంగదగు నెడ వేదములలోని ధర్మములరీతిని నెరింగి మెలంగుట యుక్తము, సమస్త ధర్మములు వేదములనుండియే శాస్త్రకారులు గుర్తించి యెరింగి వివరించి యున్నారు. కనుకనే ''వేదోఖిలోదర్మమూల''మ్మనియు ''వేదాఏవమూల ప్రమాణం దర్మాదర్మయోః'' అని ఆపస్తంబాది మహర్షులు వివరించియున్నారు.

కనుకనే ఆదిశంకర భవానులు ''వేదోనిత్యమధియతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం'' అని నిత్యము వేదభ్యాసము చేయుచుండదగినదనియు నందు నివరించినట్టి కర్మలను అనుష్ఠింపదగినదనియు వచించియున్నారు.

వేదములలో వచించిన కర్మమార్గముల నెరుంగుటకై ఆశ్వలాయన ఆపస్తంబాది మహర్షుల కల్పసూత్రములు బోధాయనాదుల కల్పసూత్రములు గలవు, ఆపస్తంబ సూత్రమునకు సంబంధించినవారు ఆపస్తంబ కల్పసూత్రములలో చెప్పిన రీతిని, వివాహోపనయనాది నలువదినాల్గు సంస్కారముల నాచరించుచుందురు. యీ సంస్కారముల ప్రాముఖ్యమును ఆచరించుటచేగల్గు ఫలములను ఆచరించు విధానములను ఆచరించనివలన యేర్పడు ప్రత్యవాయములను నేటివారికి తెలుగు భాషలో వివరించిన బాగుండునని కార్వేటినగరమున శ్రీశ్రీశ్రీ కాంచీ కామకోటి పీఠాధీశులు జగద్గురువర్యుల సందర్శనానికై నేను వెళ్ళియుండనందుచేరిన పెద్దలు కొందరు సూచించిరి. వారిలో బ్ర||శ్రీ కల్లూరు సుబ్రహ్మణ్య దీక్షితులవారు బ్ర|| శ్రీ కల్లూరు వీరభద్రశాస్త్రిగారు ముఖ్యులు పెద్దలు సూచనమేరకు నేనీకార్యమును చేపట్టినా యెరింగినమేరకు ''భారతీయ సంస్కృతి'' పేర మొదటి భాగములో కొన్ని సంస్కారాదులనుగూర్చి వివరించి వ్రాయ గడంగితిని. ఇందలి గుణదోషములను పెద్దలు పరిశీలించి, లోపాలోపములను తేలియజేసిన మరొక ముద్రణమున సవరించుకొన గలవాడను.

యీ రచన లోకమునకు తోడ్పడినచో చేసినకృషి సార్థకమగునని భావన. నాకు యీ సంస్కారముల పైన ప్రీతిమెండు యధాశక్తిని వీనిని యధాశాస్త్రీయముగ నాచరించుచు, నితరులను, నాచంపజేయవలయుననెడి సంకల్పమే నా యీ రచనకు మూలమని మనవి. శ్రీ శ్రీ శ్రీ జగద్గురువర్యులు కాంచీ కామకోటి పీఠాధిశ్వరులు చంద్రశేఖరేంద్రస్వామి వారి సందర్శన భాగ్యము (జూలై 72) కార్వేటి నగరమున గల్గుటయు, నాతరిని వచ్చి నన్ను ప్రోత్సహించిన పెద్దల ప్రోత్సాహము నా యీ రచనకు ఆధారము.

మఱియు మా వంశీయులు ఆహితాగ్నులు వేద శాస్త్రవేత్తలు, శ్రౌతస్మార్తనిత్య కర్మానుష్ఠాన దీక్షాపరులు. వారి చలువవలన నా వంశమున జనించిన పూజాఫలము నా కృషికి ఆలంబనము, ఆ పెద్దల వంశాను క్రమణికము నిందు పొందుబరచితిని. వారిని స్మరించుటయు నా విధిగాస నిందు చేర్చితిని. విజ్ఞులెల్లరు పరిశీలించి. అవసరమైన వివరణలు సూచింతురుగాకయని మనవి.

ప్రొద్దుటూరు,

1-5-73. - షడ్దర్శనం సోమసుందరశర్మ.

Bharatiya Samskruthi    Chapters