Sri Devi Bagavatham-2    Chapters   

అథ చతుర్వింశోధ్యాయః.

నారద ఉవాచ : నారాయణశ్చ భాగవా న్వీర్యాధానం చకారహ | తులస్యాం కేనరూపేణ తన్మేవ్యాఖ్యాతుమర్హసి. 1

శ్రీనారాయణ ఉవాచ : నారాయణశ్చ భగవా న్దేవానాం సాధనేషు చ |

శంఖచూడస్య కవచం గృహీత్వా విష్ణుమాయయా. 2

పునర్విధాయ తద్రూపం జగామ తత్సతీ గృహమ్‌ | పాతివ్రత్యస్య నాశేన శంఖచూడ జిఘాంసయా. 3

దుందుభిం వాదయామాస తులసీ ద్వారసన్నిధౌ | జయశబ్దం చ తద్ద్వారే బోధయామాస సుందరీమ్‌. 4

తచ్ర్చుత్వా చ రవం సాధ్వీ పరమా నందసంయుతా | రాజమార్గే గవాక్షేణ దదర్శ పరమాదరాత్‌. 5

బ్రాహ్మణభ్యో ధనం దత్వాకారయామాస మంగళమ్‌ | వందిభ్యో భిక్షుకేభ్య శ్చ వాచి భ్య శ్చ ధనం దదౌ. 6

అవరుహ్య రథాద్దేవో దేవ్యా శ్చ భవనం య¸° | అమూల్య రత్ననిర్మాణం సుందరం సుమనోహరమ్‌. 7

దృష్ట్వా చ పురతః కాంతం సాతంకాంతం ముదాన్వితా | తత్పాదం క్షాలయామాస ననామచ రురోద చ. 8

రత్న సింహాసనే రమ్యే వాసయామాస కాముకీ | తాంబూలం చ దదౌ తసై#్మ కర్పూరాది సువాసితమ్‌. 9

అద్య మే సఫలం జన్మ జీవనం చ బభూవ హ | రేణ గతం చ ప్రాణశం పశ్యంత్యా శ్చ పునర్గృహే. 10

సస్మితా సకటాక్షం చ సకామా పులకాంకితా | పప్రచ్చ రణవృత్తాంతం కాంతం మధురయా గిరా. 11

తులస్యువాచ : అసంఖ్య విశ్వసంహార్త్రా సార్ద మాజౌ తవ ప్రభో |

కథం బభూవ విజయ స్తన్మే బ్రూహి కృపానిధే. 12

ఇరువదినాల్గవ అధ్యాయము

శక్తి ప్రాదుర్బావము - తులస్యుపాఖ్యానము

నారదు డిట్లనియెను : నారాయణ భగవానుడు తులసియం దేరూపమున వీర్యము నిల్పెనో తెల్పుటకు నీవే సమర్థుడవు. నాకు తెలుపుము. శ్రీనారాయణు డిట్లనెను: దేవతల కార్యసాధనముకొఱకు శ్రీహరి తన విష్ణు మాయవలన శంఖచూడుని కవచము గ్రహించెను. శంఖచూడుని చంపు తలంపుతో శ్రీహరి శంఖచూడుని రూపు దాత్చి తులసి పాతివ్రత్యమును చెఱుప నేగెను. తులసి యింటి ముంగిటకేగి శ్రీహరి దుందుభి ధ్వనులుచేసి యామెను ప్రబోధించుటకు జయజయకారములు చేసెను. జయజయధ్వానములు విని తులసి గవాక్షములనుండి రాజనీథులవైపు నుత్సాహముతో తిలకించెను. ఆమె బ్రాహ్మణులకు ధనము లిచ్చి శుభములు జరిపించెను. బిచ్చగాండ్రకును వందిమాగధులకును ధనరాసులొసంగెను. దేవుడు రథముదిగి సుందరత్న నిర్మితమైన దేవి మందిరములోని కరిగెను. తులసి తన ముందున్న తన ప్రియుని గాంచి యానందాశ్రులతో నతని పాద ములు కడిగి నమస్కరించెను. ఆమె తన పతి నందాల రతనాల పీఠముపై కూర్చుండబెట్టి యతనికి కప్పురపు కమ్మవలపు తాంబూల మందించెను. నా జన్మము నేడు గదా ధన్యమైనది; నా బ్రతుకు సార్థకమైనది; రణమున కేగిన నా భర్తను తిరిగి చూచుచున్నానని తులసి యనెను. ఆమె మేనెల్ల నంతలో పులకించెను; చిర్నగవులు తొల్కరించెను. తియ్యని పల్కులతో కాంతుని యుద్ధ వృత్తాంత మంతయు నీ రీతిగ నడుగసాగెను. ఓ ప్రభూ ! కృపానిధీ ! సకల విశ్వ సంహారకుడగు రుద్రునితో నీ వెటుల పోరి గెల్చితివి ! నాకు తెలుపుము.

తులసీ వచనం శ్రుత్వా ప్రహస్య కమలాపతిః | శంఖచూడస్య రూపేణ తామువా చామృతం వచః. 13

శ్రీభగవానువాచ : ఆవయోః సమరః కాంతే పూర్ణమబ్దం బభూవ హ |

నాశో బభూవ సర్వేషాం దానవానాంచ కామిని. 14

ప్రీతిం చ కారయామాస బ్రహ్మాచ స్వయ మావయోః | దేవానా మధికార శ్చ ప్రదత్తో బ్రహ్మణా೭೭ జ్ఞయా.

మయా೭೭గతం స్వభవనం శివలోకం శివో గతః | ఇత్యుక్త్వా జగతాం నాధః శయనం చ చకారహ. 16

రమే రమాపతి స్తత్ర రమయా సహ నారద | సా సాధ్వీ సుఖసంభోగా దాకర్షణ వ్యతిక్రమాత్‌. 17

సర్వం వితర్కయామాస కస్త్వ మే వేత్యువాచ సా | తులస్యువాచ :

కోవాత్వం వద మాయేశ భుక్తాహం మాయయా త్వయా. 18

దూరీకృతం మత్సతీత్వం యదత స్త్వాం శపామహే | తులసీవచనం శ్రుత్వా హరిః శాపభ##యేన చ. 19

దధార లీలయా బ్రహ్మన్సుమూర్తిం సుమనోహరమ్‌ | దదర్శ పురతో దేవీ దేవదేవం సనాతనమ్‌. 20

నవీన నీరదశ్యామం శరత్పంకజలోచనమ్‌ | కోటికందర్పలీలాభం రత్న భూషణభూషితమ్‌. 21

ఈషద్దాస్య ప్రసన్నాస్యం శోభితం పీతవాసనమ్‌ | తం దృష్ట్వా కామినీ కామం మూర్చాం సంప్రాప లీలయా. 22

పునశ్చ చేతనాం ప్రాప్య పునః సా తమువాచ హ | హేనాధ తే దయా నాస్తి పాషాణ సదృశస్యచ. 23

ఛలేన ధర్మభంగేన మమ స్వామీ త్వయాహతః | పాషాణహృదయస్త్వం హి దయాహీనో యతః ప్రభో. 24

తులసి మాటలు విని శంఖచూడుని రూపున నున్న హరి యమృత వాక్కులతో నామె కిట్లు పలికెను. ఓ కామినీ ! మా యిర్వురి యుద్ధ మొక వత్సరము సాగెను. అందు దానవు లెల్లరు నీల్గిరి. అపుడు బ్రహ్మ వచ్చి మా యిర్వురికి నచ్చచెప్పెను. బ్రహ్మ పసువున నేను దేవతల రాజ్యము దేవతల కిచ్చి వేసితిని. శివుడు తన యింటికి తా నేగెను. నే నిట్లు నా యింటికి వచ్చితిని. అని జగన్నాధుడు వలపుపూల పాన్పుపై పవ్వళించెను. నారదా! అపుడు రమాపతి తులసీ రమణితో నానంద సంగమమున దగిలియుండెను. ఆమెయు నతనితో మునుపటి కన్న మిక్కుటమైన రతిసౌఖ్య మనుభవించెను. ఆమె బల మెంతగ తగ్గినను పురుషబలము తగ్గకుండెను. ఇతడు నా పతికాడని నిశ్చయించుకొని యామె నీ వెవడవని యతని నడిగెను. తులసి యట్లనెను: ఓ మాయావతీ ! నీ వెవడవు? నన్ను నీ మాయచే వంచించి యను భవించితివి! నీవు నా సతీత్వమును భగ్న మొనరించితివి. కనున నిన్ను నేను శపింతును. తులసి మాటలు వినగనే హరికి శాపభయము గలిగెను. హరి యపుడు లీలతో తన దివ్యమంగళ విగ్రహమును తులసికి చూపెను. తులసి తన ముందు దేవ దేవుడగు సనాతనుని గాంచెను. అతడు ఘనాఘనసుందరుడు; కరుణారసమందిరుడు; శారద కమలలోచనుడు; నవకోటి మన్మథమన్మథుడు; రత్న భూషణభూషితుడు. చిర్నగవులు చిందించు ప్రసన్నవదనుడు పుట్టుపుట్టముదాల్పు నగు శ్రీహరిని తిలకించి తులసి మూర్చ మునింగెను. ఆమె వెంటనే తెలివొంది హరి కిట్లనియెను : తులసి యట్లనెను: ఓ నాథా ! నీకు దయ లేదు; నీ హృదయము పాషాణు వంటిది. ప్రభూ ! నీవు మోసముతో ధర్మముపాసి నా పతిని చంపించితివి. నీది దయలేని రాతిగుండియ.

తస్మా త్పాషాణరూప స్త్వం భ##వే దేవ భవాధునా | యే వదంతి చ సాధుం త్వాం తే భ్రాంతా హి న సంశయః.

భక్తో వినాపరాధేన పరార్థం చ కథం హతః | భృశం రురోద శోకార్తా విలలాప ముహుర్ముహుః. 26

తత శ్చ కరుణాం తృష్ట్వా కరుణారససాగరః | నయేన తాం బోధయితు మువాచ కమలాపతిః. 27

భగవానువాచ : తపస్త్వయా కృతం భ##ద్రే మదర్థే భారతే చిరమ్‌ |

త్వ దర్థే శంఖచూడ శ్చ చకార సుచిరం తపః. 28

కృత్వా త్వాం కామినీం సోపి విజహార చ తత్షణాత్‌ | అధునా దాతుముచితం తవైవ తపసః ఫలమ్‌. 29

ఇదం శరీరం త్యక్త్వా చ దివ్యదేహం విధాయ చ | రామే రమ మయా సార్దం త్వం రమాసదృశీ భవ. 30

ఇయం తను ర్నదీరూపా గండకీతి చ విశ్రుతా | పూతా సుపుణ్యదా నౄణాం పుణ్య భవతు భారతే. 31

తవ కేశసమూహ శ్చ పుణ్యవృక్షో భవిష్యతి | తులసీ కేశసంభూతా తులసీతి చ విశ్రుతా. 32

త్రిషు లోకేషు పుష్పాణాం పత్రాణాం దేవపూజనే | ప్రధానరూపా తులసీ భవిష్యతి వరాననే. 33

స్వర్గే మర్త్యే చ పాతాళే గోలోకే మమసన్నిధౌ | భవ త్వం తులసీ వృక్షవరా పుష్పేషు సుందరీ. 34

గోలోకే విరజా తీరే రాసే బృందావనే వనే | భాండీరే చంపకవనే రమ్యే చందన కాననే. 35

మాధవీ కేతకీ కుందమాలికా మాలతీ వనే | వాస స్తేత్రైవ భవతు పుణ్యస్థానేషు పుణ్యదః. 36

కనుక నీవిపుడు పాషాణము గమ్ము ; నిన్ను సాధువుగ దలచువా రేమియును తెలియనివారు; ఏ యపరాధ మెఱుగని నీ భక్తుని నీ వేల చంపితివి ? అని తులసి మాటిమాటికి గొల్లున నేడ్చెను. ఆమె శోకముపాపి యామెను ప్రబోధించుటకు కరుణారసమందిరు డగు కమలాకాంతుడు శ్రీభగవాను డామె కిట్లనెను. ఓ కల్యాణీ ! పూర్వము నీవు నన్ను గూర్చి పెక్కేండ్లు తపించితివి. శంఖచూడుడు కూడ నీ కొఱకు తప మొనరించెను. అతడు తన తపఃఫలముగ నిన్ను భార్యగ పొందెను. ఇపుడు నీ తపఃఫలము నీకు చెందవలయును గదా ! నీ వీ తనువు విడిచి దివ్యదేహము దాల్చి లక్ష్మికి సాటిదానవై నాతోడ సుఖము లొందుము. నీ యీ శరీరము పవిత్ర భారతదేశమునందు గండకీనదీ రూపమున పుణ్యుములు గురియు చుండును. నీ కేశపాశములు పవిత్రమైన వృక్షము గాగలదు. తులసి కేశములనుండి పుట్టుటవలన నా వృక్షము తులసియను పేర వాసి గాంచును. ఓ వరాననా! దేవపూజల కెల్ల పత్రపుష్బములలో తులసికే యెక్కడుగ ప్రాధాన్య ముండును. సుందరీ! స్వర్గ మర్త్యపాతాళములందును గోలోకమందును నా సన్నిధియందును పూలలో శ్రేష్ఠమైన వృక్షము నీవే యగుదువు. గోలోకమందలి విరజానదీ తీరమందున రాసమండలమునందు బృందావనమందు భాండీరమున చంపకవనమున చందనకాననము లందును మాధవి-మాలతి-కుంద-మాలిక మున్నగు వనముల పుణ్యస్థలములం దెల్ల నీవు తప్పకయుందువు.

తులసీ తరు మూలేషు పుణ్యదేశేషు పుణ్యదమ్‌ | అధిష్ఠానం చ తీర్థానాం సర్వేషాం చ భవిష్యతి. 37

తత్రైవ సర్వ దేవానాం సమధిష్ఠాన మేవ చ | తులసీ పత్ర పతన ప్రాప్తయే చ వరాననే. 38

స స్నాతః సర్వ తీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షితః | తులసీ పత్రతోయేన యోభిషేకం సమాచరేత్‌. 39

సుధా ఘట సహస్రాణాం యూతుష్టి స్తు భ##వేద్దరేః | సా చ తుష్టిర్బవేన్నూనం తులసీపత్రదానతః. 40

గవామయుతదానేన యత్పలం తత్పలం భ##వేత్‌ | తులసి పత్ర దానేన తత్పలం కార్తికే సతి. 41

తులసీపత్ర తోయం చ మృత్యుకాలే చ యోలభేత్‌ | ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకే మహీయతే. 42

నిత్యం యస్తులసీతోయం భుంక్తే భక్త్యా చ మానవః | లక్షాశ్వమేధజం పుణ్యం సంప్రాప్నోతి స మానవః. 43

తులసీం స్వకరే కృత్వా ధృత్వాదేహే చ మానవః | ప్రాణాం స్త్యజతి తీర్థేషు విష్ణులోకం సగచ్చతి. 44

తులసీకాష్ఠ నిర్మాణమాలాం గృహ్ణాతి యోనరః | పదే పదేశ్వమేధస్య లభ##తే నిశ్చితం ఫలమ్‌. 45

తులసీం స్వకరే కృత్వా స్వీకారం యో నరక్షతి | స యాతి కాలసూత్రం చ యావచ్చంద్రదివాకరౌ. 46

కరోతి మిథ్యాశపథం తులస్యా యోత్ర మానవః | సయాతి కుంభీపాకం చ యావదింద్రా శ్చతుర్దశ. 47

తులసీతోయ కణికాం మృత్యు కాలేచ యోలభేత్‌ | రత్నయానం సమారుహ్య వైకుంఠే ప్రాప్యతే ధ్రువమ్‌. 48

తులసీవృక్ష మూలమునందు పుణ్యప్రదములలో కెల్ల పుణ్యప్రదములగు తీర్థములు నివాసమై యుండును. తులసిచెట్టు క్రింద నెల్ల దేవతలు వసింతురు. తులసిపత్ర మొక్కటియైన తలపై పడిన చాలు. అపుడు సకల తీర్థముల స్నానఫలము గల్గును. సర్వయజ్ఞముల దీక్షాఫలము తులసీపత్ర జలముతో నభిషేకము చేయుట వలన గల్గును. వేయి యమృత కలశములతో శ్రీహరిని సంతోషరఱచిన ఫల మొక్క తులసీపత్రము దానము చేసిన గల్గును. పదివేలు యావులు దానము చేసిన నెంత ఫలము గల్గునో కార్తిక మాసమున నొక్క తులసీపత్రదానమున ననంతఫలము గల్గును. తులసీపత్ర జలమును మరణకాలమున త్రాగువాడు సకల పాపములనుండి ముక్తుడై విష్ణులోకము జేరగలడు. ప్రతిదినమును తులసీజలమును త్రాగు మానవుడు లక్ష యశ్వమేధములు చేసిన పుణ్యము బొందును. తులసిని చేతిలోగాని దేహముగాని ధరించి ప్రాణములను తీర్థములందు వదలినవాడు విష్ణులోక మేగగలడు. తులసి పూసల జపమాలను ధరించువాని కడుగడుగున నమ్మకముగ నశ్వమేధఫలము లభించును. తులసిని చేతబూని చేసిన ప్రతిన నెఱవేర్చనివాడు సూర్యచంద్రు లున్నంతకాలము కాలసూత్రమున గూలును. తులసిని చేతబూని కూటసాక్ష్యము చెప్పువాడు పదనల్గు రింద్రులకాలము దనుక కుంభీపాక నరక మున గూలును. మరణకాలమున తులసిజల మొక బిందువైన త్రాగినవాడు రత్నవిమాన మెక్కి తప్పక వైకుంఠ వేగగలడు.

పూర్ణిమాయా మామాయాం చ ద్వాదశ్యాం రవిసంక్రమే |

తైలాభ్యంగం చ కృత్వా చ మధ్యాహ్నే నిశి సంధ్యయోః. 49

అశౌచే శుచికాలే యే రాత్రివాసోన్వితా నరాః | తులసీం యే విచిన్వంతి తే ఛిందంతి హరేః శిరః. 50

త్రిరాత్రం తులసీపత్రం శుద్ధం పర్యుషితం సతి | శ్రాద్ధే ప్రతేచ దానే చ ప్రతిష్ఠాయాం సురార్చనే. 51

భూగతం తోయపతితం యద్దత్తం విష్ణవే సతి | శుద్దం చ తులసీపత్రం క్షాళనా దన్య కర్మణి. 52

వృక్షాధిష్ఠాతృ దేవీయా గోలోకే నిరామయే | కృష్ణేన సార్దం నిత్యం చ నిత్యం క్రీడాం కరిష్యతి. 53

నద్యధిష్ఠాతృదేవీ యా భారతే చ సుపుణ్యదా | లవణోదస్య సా పత్నీ మదంశస్య భవిష్యతి. 54

త్వం చ స్వయం మహా సాధ్వీ వైకుంఠే మమ సన్నిధౌ | రమానమాచ రామా చ భవిష్యసి నసంశయః. 55

అహం చశైలరూపేణ గండకీతీర సన్నిధౌ | అధిష్ఠానం కరిష్యామి భారతే తప శాపతః. 56

కోటి సంఖ్యా స్తత్ర కీటా సీక్షదంష్ట్రా వరాయుధైః | తచ్చిలాకుహరే చక్రం కరిష్యంతి మదీయకమ్‌. 57

ఏక ద్వారం చతు శ్చక్రం వనమాలా విభూషితమ్‌ | నవీననీరదాకారం లక్ష్మీనారాయణాభిధమ్‌. 58

ఏకద్వారం చతుశ్చక్రం నవీననీరదోపమమ్‌ | లక్ష్మీ జనార్దనో జ్ఞేయో రహితో వనమాలయా. 59

ద్వార ద్వయే చతుశ్చక్రం గోష్పదేన విరాజితమ్‌ | రఘునాధాభిదం జ్ఞేయం రహితో వనమాలయా. 60

అతి క్షుద్రం ద్విచక్రం చ నవీనజలదప్రభమ్‌ | త ద్వామనాభిధం జ్ఞేయం రహితం వనమాలయా. 61

పున్నమి-అమవస-ద్వాదశి-రవి సంక్రమణము-మిట్ట మధ్యాహ్నము-సంధ్యలందును తలంటు పోసికొనియును చెడు కాలము లండు చెడు చోటులందును రాత్రి యందును తులసి దళములు ద్రుంచువాడు హరి శిరమును ద్రుంచిన వాడ గును. తులసిదళము మూడుదినముల నాటి దైనను శుద్ధమైనదే యగును. శ్రాద్ధమున-వ్రతము నందు - దానమున-ప్రతిష్ఠలందును దేవతార్చన యందును నేలపడినదైనను-హరి కర్పించిన దైనను నీట కడిగిన మాత్రాన శుద్ధమగును. దాని నెల్ల పనులలో వాడవచ్చును. తలసి వృక్షాధిష్ఠానయైనదేవి; ఈమె నిరామయమైన గోలోక మందు శ్రీకృష్ణుని తోడ నిత్య క్రీడల తేలియా డును. తులసి భారతదేశమందు నద్యధిష్ఠానదేవియై-పుణ్యదాయిని మహాసాధ్వివగు నీవు స్వయముగ వైకుంఠమున నా సన్ని ధానమున లక్ష్మీ సమానురాలవుగ విలసిల్లుచుందువు. నేను నీ శాపము వలన భారతదేశము నందు గండకీ తీరమున పాషాణ మనై యుండగలను. పదునైన యాయుధముల వంటి వాడి పండ్లు గల కోట్ల కీటకములు నా శిల లందు చక్రపు గుర్తులు చేయును. ఒక ద్వారము-నాల్గు చక్రములు-వనమాలతో నీల మేఘాకారమున నలరారునది లక్ష్మీనారాయణ మనబడును. ఒక ద్వారము-నాల్గు చక్రములు గల్గి నీల మేఘాకారమున నున్నది లక్ష్మీ జనార్దనుని యెఱుంగవలయును. దీనికి వనమాల యుండదు. రెండు ద్వారాలు నాలుగు చక్రాలు అవు డెక్క గురుతుండి వనమాల గుర్తు లేనిది రఘునాథసాల గ్రామ మన బడును. వనమాల లేక రెండు చక్రములతో నల్లని మొయిళ్ళ కాంతిని గల్గి చిన్నగ నున్నది వామన మనబరగును.

అతి క్షుద్రం ద్విచక్రం చ వనమాలా విభూషితమ్‌ | విజ్ఞేయం శ్రీధర రూపం శ్రీపదం గృహిణాం సదా. 62

స్థూలం చ వర్తులాకారం రహితం వనమాలయా | ద్వి చక్రం స్పుట మత్యంతం జ్ఞేయం దామోదరాభిధమ్‌. 65

మధ్యమం వర్తులాకారం ద్వి చక్రం బాణవిక్షతమ్‌ | రణరామాభిధం జ్ఞేయం శరతూణసమన్వితమ్‌. 64

మధ్యమం సప్తచక్రం చ చ్చత్రభూషణ భూషితమ్‌ | రాజరాజేశ్వరం జ్ఞేయం రాజసంపత్ర్పదం నృణామ్‌. 65

ద్వి సప్త చక్రం స్థూలం చ నవనీరద సుప్రభమ్‌ | అనంతాఖ్యం చ విజ్ఞేయం చతుర్వర్గ ఫలప్రదమ్‌. 66

చక్రాకారం ద్విచక్రం చ సశ్రీకం జల దప్రభమ్‌ | సగోష్పదం మధ్యమం చ విజ్ఞేయం మధుసూదనమ్‌. 67

సుదర్శనం చైక చక్రం గుప్తచక్రం గదాధమ్‌ | ద్వి చక్రం హయవక్త్రాభం హయగ్రీవం ప్రకీర్తితమ్‌. 68

అతీవ విస్తృతాస్యం చ ద్వి చక్రం వికటం సతి | నారసింహం సు విజ్ఞేయం సద్యోవైరాగ్యదం నృణాన్‌. 69

ద్వి చక్రం విస్తృతాస్యం చ వనమాలా సమన్వితమ్‌ | లక్ష్మీ నృసింహం విజ్ఞేయం గృహిణాం చ సుఖప్రదమ్‌.

ద్వార దేశే ద్వి చక్రం చ సశ్రీకం చ సమం స్పుటమ్‌ | వాసుదేవంతు విజ్ఞేయం సర్వకామ ఫలప్రదమ్‌. 71

ప్రద్యుమ్నం సూక్ష్మ చక్రం చ నవీననరద ప్రభమ్‌ | సుషిర చ్చిద్ర బహుళం గృహిణాం చ సుఖప్రదమ్‌. 72

ద్వేచక్రే చైకలగ్నే చ పృష్టం యత్రతు పుష్కలమ్‌ | సంకర్షణం సువిజ్ఞేయం సుఖదం గృహిణాం సదా. 73

అనిరుద్దంతు పీతాభాం వర్తులం చాతిశోభనమ్‌ | సుఖప్రదం గృహ స్థానం ప్రవదంతి మనీషిణః. 74

వనమాల గల్గి రెండు చక్రములతో నలరు చిన్నరూపము గృహస్థులకు కలుము లిచ్చునట్టి శ్రీధరసాల గ్రామమని తెలియవలయును. లావుగ గుండ్రముగ నుండి వనమాల లేక రెండు చక్రములు గలది దామోదర నామమున తనర్చును. నడుమ వర్తుల ముగనుండి రెండు చక్రములు-బాణమును గల్గి యుండునది ధనుర్బాణములు గలదిరణరామ నామమునపేరు గాంచును. నడుమ నేడు చక్రములును ఛత్ర భూషణములును గల్గి చెన్నొందునది నరులకు రాజ్య సంపద లొసంగు రాజరాజేశ్వరసాల గ్రామము. పదునాల్గు చక్రములతో లావుగను కొంగ్రొత్త మొగిళ్ళ కాంతులీనునది పురుషార్థము లొసంగునట్టి అనంతసాల గ్రామము. చక్రాకారమున రెండు వర్తులములు శ్రీ గుర్తు ఆవు డెక్కల గుర్తు గల్గి కారు మబ్బు రంగుతో చక్రాకారముగ నున్నది మధుసూదన సాల గ్రామమనబడును. సుదర్శనము నొక గుప్తచక్రము గలది గదాధర మనబడును. రెండు చక్రములు గుఱ్ఱపు మొగము గలది హయగ్రీవ సాలగ్రామ మన ప్రసిద్ధి కెక్కును. పెద్ద నోరు రెండు చక్రములు గల్గి వికటాకారమున నొప్పునది నరులకు వైరాగ్య మొసగునట్టి నరసింహసాల గ్రామమన ప్రశక్తి గాంచును. రెండు చక్రములు వెడల్పగు నోరును వనమాల గుర్తును గలది గృహస్థులకు సుఖ మొసగునట్టి లక్ష్మీనారాయణమని యెఱుగవలయును. ద్వార ప్రదేశమున రెండు చక్రము లుండి స్పష్టముగ శ్రీ చిహ్నము లున్నచో దానిని వాసుదేవ సాలగ్రామమందుడు. క్రొత్త మేఘకాంతితో నొప్పి సూక్ష్మ రంధ్రములు సూక్ష్మ చక్రమును గల్గియున్నది గృహస్థులకు సుఖములు గల్గించు ప్రద్యుమ్నము. రెండు చక్రాలు వీవు భాగము విశాల మున్నది గృహస్థులకు సుఖ మొసగు సంకర్షణము గుండ్రముగను పసుపు రంగుగ నున్నది గృహస్థులకు సుఖములు గూర్చునట్టి అనిరుద్దసాల గ్రామమని పండితులందురు.

శాలగ్రామశిలాయత్ర తత్ర సన్నిహితో హరిః | తత్రైవ లక్ష్మీ ర్వసతీ సర్వతీర్థ సమన్వితా. 75

యానికాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ | తాని సర్వాణి నశ్యంతి సాలగ్రామశిలార్భనాత్‌. 76

ఛత్రాకారే భ##వే ద్రాజ్యం వర్తులే చ మహాశ్రయః | దుఃఖం చ శకటాకారే శూలాగ్రే మరణం ధ్రువమ్‌. 77

వికృతా స్యే చ దారిద్ర్యం పింగళే హాని రేవ చ | భగ్నచక్రే భ##వే ద్వ్యాధి ర్విదీర్ణే మరణం ధ్రువమ్‌. 78

వ్రతం దానం ప్రతిష్ఠా చ శ్రాద్దం చ దేవపూజనమ్‌ | శాలగ్రామస్య సాన్నిధ్యా త్ప్రశస్తం తద్బవేదితి. 79

స స్నాతః సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షితః | సర్వ యజ్ఞేషు తీర్థేషు ప్రణషు చ తపఃసు చ. 80

పాఠే చతుర్ణాం వేదానాం తపసాం కరణ సతి | తత్పుణ్యం లభ##తే నూనం శాలగ్రామశిలార్చనాత్‌. 81

''శాలగ్రామశిలా తోయైర్యోభిషేకం సదా చరేత్‌ | సర్వ దానేషు యత్పుణ్యం ప్రదక్షిణం భువో యథా.''

శాలగ్రామశిలాతోయం నిత్యం భుంక్తే చ యోనరః | సురేప్సితం ప్రసాదం చ లభ##తే నాత్ర సంశయః. 82

తస్య స్పర్శం చ వాంఛంతి తీర్థాని నిఖిలాని చ | జీవన్నుక్తో మహాపూతోప్యంతే యాతి హరేః పదమ్‌. 83

తత్రైవ హరిణాసార్ద మసంఖ్యం ప్రాకృతం లయమ్‌ | యాస్య త్యేవ హి దాస్యే చ నియుక్తో దాస్యకర్మణి. 84

యానికాని చ పాపాని బ్రహ్మ హత్యా సమాని చ | తం దృష్ట్వా చ పలాయంతే వైనతేయాదివోరగాః. 85

తత్పాదరజసా దేవీ సద్యః పూతా వసుంధరా | పుంసాం లక్షం తత్పితౄణాం నిస్తరేత్తస్య జన్మతః. 86

శాలగ్రామశిలాతోయం మృత్యుకాలేచయోలభేత్‌ | సర్వ పాప వినిర్ముక్తో విష్ణులోకం స గచ్చతి. 87

సాలగ్రామశిల యున్నచోట శ్రీహరి వసించును. అచ్చటనే శ్రీమహాలక్ష్మీయును సకల తీర్థములతో గూడి యుండును. శ్రీసాలగ్రామశిలను పూజించినచో బ్రహ్మహత్య మున్నగు నేయే పాపములు గలవో యవన్నియును నశించగలవు. ఛత్రాకారముగ నున్నది రాజ్యమును గుండ్రముగ నున్నది సంపదలను శకటాకారముగ నున్న సాలగ్రామము దుఃఖములను గలిగించును. శూలాగ్రముగ నున్నది మరణము గల్గించును. వికృతముఖము గలది వ్యాధిని పింగళవర్ణము గలది కీడును విదీర్ణమైనది మరణమును గల్గించును. సాలగ్రామ సన్నిధిలో జేయబడు దానవ్రతములును దేవపూజాలును ప్రతిష్ఠలును శ్రాద్ద ములును ప్రశస్తము లగును. సాలగ్రామశిల నర్చించువాడు సర్వతీర్థముల స్నాన మాడినవా డగును; సర్వయజ్ఞములందు దీక్షితు డగును; వ్రతములు తపము లొనర్చినవా డగును. నాల్గు వేదముల పారాయణ ఫలమును తపఃఫలమును మహాపుణ్యమును గలవా డగును. సాలగ్రామమును ప్రతినిత్యము జలమున నభిషేకించు వాడు సర్వదానముల పుణ్యము భూప్రదక్షిణ పుణ్యమును బడయగలడు. సాలగ్రామ తీర్థము పుచ్చుకొనువాడు దేవతల ప్రసాదమును బొందినవాడగును. అతని నెల్ల తీర్థము లును తాకగోరును; అతడే జీవన్ముక్తుడు; అతడే పరమపవిత్ర యశుడు; అతడు చివరకు హరి పరమపదము చేరుకొనును. అతడు శ్రీహరి కైంకర్యముతో హరిని గూడి పెక్కు ప్రాకృత ప్రళయములు గాంచును. బ్రహ్మహత్య మున్నగు పాతకము లన్నియు నతనిని చూచి గరుడుని చూచిన పాములవలె పలాయనము చిత్తగించును. ఓ దేవీ! అట్టి పుణ్యాత్ముని పాదరజము వలన భూమి పవిత్ర మగును. అట్టివాని పుట్టుకవలన నతలి లక్షలమంది పితరులు తరింతరు. మరణకాలమున సాలగ్రామ తీర్థము త్రాగినవాడు పాపములు పాసి విష్ణులోకము జెందగలడు.

నిర్వాణ ముక్తిం లభ##తే కర్మభోగా త్ర్పముచ్యతే | విష్ణోః పదే ప్రలీన శ్చ భవిష్యతి న సంశయః. 88

శాలగ్రామశిలాం ధృత్వా మిథ్యావాక్యం వదేత్తు యః | స యాతి కుంభీపాకే చ యావద్వై బ్రహ్మణోవయః. 89

శాలగ్రామశిలాం ధృత్వా స్వీ కారం యో న పాలయేత్‌ | స ప్రయాత్యసిపత్రం చ లక్షమన్వంతరావధి. 90

తులసీ పత్ర విచ్చేదం శాలగ్రామే కరోతి యః | తస్య జన్మాంతరే కాంతే స్త్రీ విచ్చేదో భవిష్యతి. 91

తులసీ పత్ర విచ్చేదం శంఖే యోహి కరోతి చ | భార్యాహీనో భ##వేత్సోపిరోగీ చ సప్తజన్మసు. 92

శాలగ్రామం చ తులసీం శంఖం చైకత్ర ఏవచ | యో రక్షతి మహాజ్ఞానీ స భ##వే చ్ఛ్రీ హరేః ప్రియః. 93

సకృదేవ హి యో యస్యాం వీర్యాధానం కరోతి చ | త ద్విచ్చేదే తస్య దుఃఖం భ##వే దవే పరస్పరమ్‌. 94

త్వం ప్రియా శంఖచూ డస్య చైకమన్వంతరావధి | శంఖేన సార్దం త్వద్బేదః కేవలం దుఃఖదస్తథా. 95

ఇత్యుక్త్వా శ్రీహరి స్తాం చ విరరామ చ నారద | సా చ దేహం పరిత్యజ్య దివ్యరూపం విధాయచ. 96

యథా శ్రీశ్చ తథాసాచాప్యువాస హరివక్షసి | స జగామ తయాసార్దం వైకుంఠం కమలాపతిః. 97

లక్ష్మీః సరస్వతీ గంగా తులసీ చాపి నారద | హరేః ప్రియా శ్చత స్ర శ్చ బభూవు రీశ్వరస్య చ. 98

సద్య స్త ద్దేహజాతా చ బభూవ గండకీనదీ | ఈశ్వరః సోపిశైలశ్చ తత్తీరే పుణ్యదోనృ ణామ్‌. 99

కుర్వంతి తత్ర కీటా శ్చ శిలాం బహువిధాంమునే | జలే పతంతి యా యా శ్చ ఫలదా స్చా శ్చ నిశ్చితమ్‌. 100

స్థలస్థాః పింగళా జ్ఞేయా శ్చోపతాపాద్రవేరితి | ఇత్యేవం కథితం సర్వం కిం భూయః శ్రోతు మిచ్చసి. 101

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే నారదనారాయణ సంవాదే చతుర్వింశోధ్యాయః.

అతడు నిజముగ కర్మభోగమునుండి ముక్తుడై నిర్వాణముక్తి గాంచగలడు. అతడు విష్ణుపదమున లీనుడగును. సాంగ్రామశిల చేతబూని యబద్ద మాడువాడు బ్రహ్మవయస్సు దనుక కుంభీపాకమున బాధ పడును. సాలగ్రామశిలను చేత పట్టుకొని యిచ్చిన మాటను నిలువబెట్టుకొననివాడు లక్ష మన్వంతరములవఱ కసిపత్ర మను నరకమున గూలును. సాలగ్రామము మీది నుండి తులసీ దళమును వేరుచేయువాడు మరు జన్మమున తన స్త్రీతో వియోగ మొందగలడు. శంఖముమీది నుండియు తులసీ దళమును వేరు చేయువాడు ఏడు జన్మములం దాక భార్య వియోగ మనుభవించును. తుదకు మహా రోగి యగును. కనుక సాలగ్రామమును తులసిని శంఖము నొకే చోట నుంచి వానిని గాపాడువాడు హరికి ప్రీతి పాత్రుడు గాగలడు. ఒకసారి యైనను తన వీర్య ముంచిన స్త్రీతో వియోగ మొందిన వాడెంతయో దుఃఖము పాలగును. శంఖచూడునకు నీ వొక మన్వంతరము దనుక భార్యపై యుంటివి. అతనితో వియోగము నీ కెంతయో బాధాకరముగ నుండగలదు. అని పలికి హరి విరమించగనే నారదా ! తులసియును తన తనువు వదలి దివ్యరూపము దాల్చెను. తులసియును లక్ష్మి వలె హరి పక్షమున నలరారెను. అపుడు లక్ష్మిపతి యామెతో వైకుంఠ మేగెను. ఓయి నారదా! లక్ష్మి-సరస్వతి-గంగ-తులసి యీ నల్వురును హరి కత్యంతము ప్రియమైనవారు. అపుడు తులసి తనువు నుండి గండకీ నది యుద్బవించెను. హరియును దాని తీరమున జనులకు పుణ్యము లొసగు శిలగ మారెను. ఓ మునీశా! పెక్కు కీటకములా జలమున బడిన శిలలకు రంధ్రములు చేయును. అవన్నియును తప్పక పుణ్య ఫలము లొసంగును. ఆ స్థల మందలి శిలలు సూర్య తాపము వలన పింగళ వర్ణముగ మార గలవు. ఇట్లు నీ కంతయును దెల్పితిని. ఇంకేమి వినదలతునో తెలుపుము.

ఇది శ్రీదేవీ భాగవత మహా పురాణ మందలి నవమ స్కంధమున నారద నారాయణ సంవాదమున నిరువదినాల్గవ అధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters