Sri Devi Bagavatham-2    Chapters   

అథ త్రయోదశోధ్యాయః.

నారదఉవాచః కలేః పంచ సహస్రాబ్దే సమతీతే సురేశ్వర | క్వగతా సా మహాభాగ తన్మే వ్యాఖ్యాతు మర్హసి. 1

నారాయణ ఉవాచః భారతం భారతీ శాపా త్సమాగత్యేశ్వరేచ్చయా | జగామ తత్ర వైకుంఠే శాపాంతతే పున రేవ సా. 2

భారతీ భారతం త్యక్త్వా తజ్జగామ హారేః పదం | పద్మావతీ చ శాపాంతే గంగా సా చైవ నారధ. 3

గంగా సరస్వతీ లక్ష్మీశ్చైతాస్తిస్రః ప్రియా హరేః | తులసీసహితా బ్రహ్మం శ్చతస్రః కీర్తితాః శ్రుతౌ. 4

నారద ఉవాచః కేనో పాయోన సా దేవీ విష్ణుపాదా బ్జ సంభవా | బ్రహ్మకమండలుస్ధా చ శ్రుతా శివప్రియాచసా. 5

బభూవ సా మునిశ్రేష్ఠ గంగా నారాయణ ప్రియా | అహో కేన ప్రకరేణ తన్మే వ్యాఖ్యాతు మర్హసి. 6

శ్రీనారాయణ ఉవాచః పురా బభూన గోలోకే సా గంగా ద్రవరూపిణీ | రాధా కృష్ణాంగసంభూతా తదంశా తత్స్వరూపిణీ. 7

ద్రవాధిష్ఠాతృ దేవీ య రూపేణా ప్రతిమా భువి | నవ ¸°వన సంపన్నా సర్వభరణ భూషితా. 8

శరన్మ ధ్యాహ్న పద్మాస్యా సస్మితా సుమనోహరా | తప్తకాంచన వర్ణాభా శరచ్చంద్ర సమప్రభా. 9

స్నిగ్ధ ప్రభా7తి సుస్నిగ్ధా శుద్ధ సత్త్వస్వరూపిణీ | సుపీన కఠినశ్రోణీ సునితంబ యుగంబరా. 10

పీనోన్నతం సుకఠినం స్తనయుగ్మం సువర్తులమ్‌ | సుచారునేత్రయుగళం సుకటాక్షం సు వక్రిమమ్‌. 11

వక్రిమం కబరీభారం మాలతీ మాల్య సంయుతమ్‌ | సిందూరబిందు లలితం సార్ధం చందన బిందుభిః. 12

కస్తూరీ పత్రీకాయుక్తం గండయుగ్మం మనోరమమ్‌ | బంధూక కసుమాకార మధరోష్ఠం చ సుందరమ్‌. 13

పదుమూడవ అధ్యాయము

గంగ వైకుంఠమున కేగుట

నారదుడిట్లనెను: సురేశ్వరా! కలియుగములో నైదువేల సంవత్సరములు గడచిన మీదట గంగ యెచటి కేగునో తెల్పుట కీవె చాలుదువు. నారాయణు డిట్లనెను: భారతి శాపమున నీశ్వరునా దేశమున భారత దేశమునకు గంగవచ్చి మరల శాపము తీరగవైకుంఠము చేరెను. సరస్వతియును భారతమువదిలి హరపదము చేరెను. పద్మావతియును గంగయును శాపము తీరగవైకుంఠము చేరిరి. హరికి గంగ సరస్వతి లక్ష్మి ముగ్గురు ప్రియురాండ్రు. వీరితో తులసియును చేరి హరికి నల్గురు భార్యలని వేదములు కీర్తించెను. నారదుడిట్లనెను: గంగాదేవీ యేయుపాయమున విష్ణుపాదముల బుట్టెనో ఎట్లు బ్రహ్మ కమండలువున ందుండెను? శివునకుభార్య యెటులయ్యెను? ఓ మునివర్యా గంగ నారాయణునికి ప్రియురా లెట్లయ్యెను? వీనికి కారణము వ్యాఖ్యానించుటకు నీవు తగినవాడవు. శ్రీ నారయణు డిట్లనెను: పూర్వము గోలోకమంద గంగ ద్రవరూపమున నుండెను. గంగ రాధా కృష్ణుల శరీరములనుండి పుట్టెను. ఆమె వారి యంశగలది. వారి స్వరూపముగలది. గంగ ద్రవమున కధిష్టాన దేవి. ఆమె రూపమున సాటిలేనిది. నవ¸°వనము గలది. సకలాభరణ భూషితురాలు. శరత్కాల మందలి పట్టపగలు వికసించిన పద్మమువలె నామె ముఖ మొప్పుచున్నది. అందాలు గ్రుమ్మరించు చిర్నగవులు గలది. పుటము పెట్టిన బంగారమువంటి మేనికాంతి గలది. సుకుమార కాంతులతో తళతళ లాడునది. ఎతైన లావైన గట్టి గుండ్రని స్తనములు గలది. విశాలమైన కన్నులు కటాక్షములు కురియునట్లున్నవి. ముంగురులు వంకరలు తిరిగి యున్నవి. మాలతీ మాలల తావులు విరజిమ్ము చున్నవి. ఆమె నెన్నాసట చందన బిందువుపైని సిందూర తిలకము కళ కళలాడు చున్నది. చెక్కిళ్లపై నందమైన మకరికా పత్రములు కస్తూరితో నిర్మించబడినవి. పెదవులు బంధూక సమమువలె నందమైనవి.

పక్వదాడిమభీజాభ దంతపంక్తి సముజ్జ్వలం | వాససీ వహ్ని శుద్దే చ నీవీయుక్తే చ బిభ్రతీ. 14

సా సకామా కృష్ణపార్శ్వే సమువాస సులజ్జితా | వాససా ముఖ మాచ్చాద్య లోచనాభ్యాం విభోర్ముఖమ్‌. 15

నిమేషరహితాభ్యాం చ పిబంతీ సతతం ముదా | ప్రపుల్లవదనా హర్షా న్నవ సంగమ లాలసా. 16

మూర్చితా ప్రభురూపేణ పులకాంకిత విగ్రహా | ఏతస్మిన్నంతరే తత్ర విద్యమానా చ రాధికా. 17

గోరీత్రింశత్కోటి యుక్తా చంద్రకోటి సమప్రభా | కోపేనారక్త పద్మాస్యా రక్త పంకజలోచనా. 18

పీత చంపక వర్ణాభా గజేంద్ర మందగామినీ | అమూల్య రత్న నిర్మాణ నానాభూషణ భూషిచా. 19

అమూల్య రత్న ఖచిత మమూల్యం వహ్ని శౌ చకమ్‌ | పీతవస్త్రస్య యుగళం నీవీ యుక్తం చ భిభ్రతీ. 20

స్థలపద్మ ప్రభాముష్టం కోమలం చ సురంజితమ్‌ | కృష్ణ దత్తార్ఘ్య సంయుక్తం విన్యస్యంతీ పదాంబుజమ్‌. 21

రత్నేం ద్రసారనిర్మాణ విమానా దవరూహ్య సా | సేవ్యమానా చ ఋషిభిః శ్వేత చామర వాయునా. 22

కస్తూరీ బిందుభిర్యుక్తం చందనేన సమన్వితమ్‌ | దీప్త దీప ప్రభాకారం సిందూరబిందుశోభితమ్‌. 23

దధీతీ భాలమధ్యే చ సీమన్తాధః స్థలోజ్జ్వలే | పారిజాతప్రసూనానాం మాలా యుక్తం సువంక్రిమమ్‌. 24

సుచారు కబరీభారం కంపయంతీ సుకంపితా | సుచారురాగ సంయుక్త మోష్ఠం కంపయతీ రుషా. 25

గత్యోవాస కృష్ణ పార్శ్వే రత్నసింహాసనే శుభే | సఖీనాం చ సమూహైశ్చ పరిపూర్ణా విభోః ప్రియా. 26

తాం దృష్ట్వా చసముత్తస్థౌ కృష్ణః సాదర పూర్వకమ్‌ | సంభాష్య మధురాలాపైః సస్మిత శ్చ ససంభ్రమః. 27

పల్లు దానిమ్మగింజలు పేర్చినట్టులున్నవి. అగ్నిపవిత్రమైన వస్త్రము నడుమునదాల్చినది. ఈ విధముగ గంగ సిగ్గుతో సకామయై కృష్ణుని చెంగట నిలుచుండెను. ప్రియుని ముఖమును విప్పారిన కన్నులతో చూడసాగెను. ఆమె కనుఱప్ప వాల్చని చూపులలో కామవాంఛ తొంగిచూడగ సంతోషముతో వికసించిన మోముతో ప్రియుని ముఖకమలములోవి యమృతము గ్రోలుచున్నట్లుండెను. గంగ తన్మయత్వముతో ప్రభుని రూపసంపదకు పులకించెను. అంతలో నచటికి రాధిక యేగుదెంచెను. రాధ కోటి చంద్రులకాంతులనందమైనది. ముప్పదికోట్ల గోపికలామెను చేరియుండిరి. ఎఱ్ఱకమలము బోలుకన్నులతో కోపమున నెఱ్ఱగ నున్న పద్మమువలె నామె ముఖముండెను; ఆమెపచ్చని చంపకము వంటి శోభగలది. మెల్లని గజగమనముగలది ఆమూల్యమైన రత్నములతో చేసిన పెక్కుసొమ్ములు దాల్చినది. విలువైన రతనాలు పొదిగిన యగ్నిశుద్ధమైన పట్టువస్త్రములు నడుమున దాల్చినది. మెట్టతామరల కాంతిని మించి కోమలమై రాగరంజితమై కృష్ణుడొసగిన యర్ఘ్యమునుబొందియున్న యామె పదకమలములు మెల్లమెల్లగ నడుగులు సాగించుచున్నవి. ఆమె రత్ననిర్మతమైన విమానమునుండి దిగెను. ఋషులు తమ చేతులలోని చామరములతో నామెకు వీచుచుండిరి. వెలుగుచున్న దీపకాంతి వలె నుదుటసిందూరబిందువొప్పుచుండెను. దానికి పాటు చందనము కస్తూరితిలకము కాంతులీనుచున్నవి. కస్తూరితిలకము నెన్నొసట సీమంతము క్రింద మెఱయు చున్నది. ఆమె మందారసుమమాలికలు దాల్చియున్నది. ఆమెతలపై కొప్పు పూలతావులచే నొప్పుగనున్నది. ఆమె మేను కంపించెను. పెదవులదరెను. కోపమెక్కువయ్యెను. ఇట్లురాధ కృష్ణుని చెంతకేగి రత్నసింహాసనముపై కూర్చుండెను. చెలి కత్తియ లామెచుట్టుచేరి యామెను కొల్చుచుండిరి. ఆమెనుచూచి కృష్ణుడు గౌరవముతో లేచినిలుచుండెను. కృష్ణుడామెతో నవ్వుచు తియ్యని మాటలతో తొట్రుపడుచు పల్కరించెను.

ప్రణము రతిసంత్రస్తా గోపా నమ్రాత్మ కంధరాః | తుష్టువుస్తే చ భక్తా చ తుష్టావ పరమేశ్వరః. 28

ఉత్థాయ గంగా సహసా స్తుతిం బహు చకార సా | కుశలం పరిపప్రచ్చ భీతా7తివినయేన చ. 29

నమ్రభాగస్థితా త్రస్తా శుష్కకంఠోష్ఠతాలుకా | ధ్యానేన శరణాయత్తా శ్రీకృష్ణ చరణాంబుజే. 30

తాం హృత్పద్మస్థితాం కృష్ణో భీతాయై చాభయం దదౌ | బభూవ స్థిర చిత్తా సా సర్వేశ్వరవరేణ చ. 31

ఊర్ధ్వం సింహాసనస్థాం చరాధాం గంగా దదర్శసా | సుస్నిగ్ధాం సుఖదృశ్యాం చ జ్వలంతీం బ్రహ్మతేజసా. 32

అసంఖ్య బ్రహ్మణః కర్త్రీ మాదిసృష్టేః సనాతనీమ్‌ | సదాద్వాదశవర్షీయాం కన్యా7భిన¸°వనామ్‌. 33

విశ్వబృందే నిరుపమాం రూపేణ చ గుణన చ | శాంతాం కాంతా మనం తాం తామాద్యంతరహితాం సతీమ్‌. 34

శుభాంసుభ ద్రాం సుభగాం స్వామిసౌ భాగ్య సంయుతామ్‌ | సౌందర్యసుదంరీం శ్రేష్ఠాం పర్వాసు సుందరీషు చ. 35

కృష్ణార్ధాంగాం కృష్ణసమాం తేజసా వయసా త్విషా | పూజి తాంచ మహాలక్ష్మీం లక్ష్మ్యా లక్ష్మీ శ్వరేణ చ. 36

ప్రచ్ఛాద్యమానాం ప్రభయా సభామీశస్య సుప్రభామ్‌ | సఖీ దత్తం చ తాంబూలం భుక్తవంతీం చ దుర్లభమ్‌. 37

అజన్యాం సర్వజననీం ధన్యాం మాన్యాం చ మాని నీమ్‌ | కృష్ణప్రాణాధి దేవీం చ ప్రాణప్రియతమాం రమామ్‌. 38

దృష్ట్వా రాకేశ్వరీం తృప్తిం నజగామ సురేశ్వరీ | నిమేషరహితాభ్యాం చ లోచనాభ్యాం పపౌచతామ్‌. 39

ఏతస్మి న్నంతరే రాధా జగదీశమువాచ సా | వాచా మధురయా శాంతా వినీతా సస్మితా మునే. 40

రాధోవాచ : కేయం ప్రాణశ కల్యాణీ సస్మితా త్వన్ము ఖాంబుజమ్‌ | పశ్యం తీ సస్మితం పార్శ్వే సకామా వక్రలోచనా. 41

అపుడు గోపికలెల్లరును భక్తిభావములు గలుగగ చేతులు జోడించి తలలువంచి యామెనునుతించిరి. పరమేశ్వరుడు కూడ రాధను సన్నుతించెను. ఆ సమయమున గంగయును వణకుచు లేచి పలుచేతులరాధను స్తుతించెను. వినయభయ ములతో కుశలమడిగెను. గంగపెదవులు చిక్కిళ్ళు కంఠమును భయమువలన నెండిపోగ నామె శ్రీకృష్ణుని పదకమలములు ధ్యానించి శరణుచొచ్చెను. అంతకృష్ణుడామెను తన హృదయమునకు హత్తుకొని భయము పాపి యభయమొసంగెను. సర్వేశ్వ రుని వరమున కామెచిత్తము కుదుటపడెను. ఎత్తైన బంగరు గద్దియపై కూరుచున్న రాధను గంగ దర్శించెను. రాధ బ్రహ్మతేజముతో వెల్గుచు సుఖముగ చూడదగి యందముగ నుండెను. ఆమె యనంతబ్రహ్మలను సృష్టించగలది. తొలి సృష్టికిమూలము. సనాతని. ఎల్లప్పుడును పండ్రెండేడుల నవ¸°వనముగల కన్యకామణి. విశ్వమందంతటనామెను రూపమును గుణమున బోలినవారులేరు. ఆమెశాంత అనంత కాంత సతి అద్యంతరహిత సుభద్ర సుభగ శుభాంగి ప్రియుని సౌభాగ్యము కలది అందాల కందని యందాలరాశి. సుందరులలో సుందరీమణికృష్ణుని యర్ధాంగి, వయస్సులో తేజస్సులో కృష్ణునితో సమానమైనది సత్త్వ మూర్తి. కృష్ణుడామెను లక్ష్మితో గూడ పూజించెను. ఆమె కృష్ణుని బోలి దివ్యకాంతులతో దేవసభను మహోజ్జ్వలముగ వెలిగిం చెను. తన చెలియలందిచ్చు తాంబూలము సేవించుచుండెను. ఆమెపుట్టుకలేని దైనను నెల్లరకు జన్మలిచ్చుదేవి. ధన్య మాన్య మానినిరమ కృష్ణుని ప్రాణాధిష్ఠానదేవి ప్రాణప్రియతమ. అట్టిరాకేశ్వరి యగురాధను సురేశ్వరియగు గంగ ఱప్పవాల్చక చూచిచూచితనివి చెంద లేదు. ఓయినారదా! అదేసమయమున రాధ తియ్యని శాంతవినీతవాక్కులతో నవ్వు జగదీశునితో నిట్లుపలికెను. రాధయిట్లనెను: ఓ ప్రాణశా! ఈకల్యాణియెవరు ? నీముఖకమలము చూచి చిర్నగవులు చిందించుచున్నది. నీచెంతచేరి యేదోకోరికతో వంకరచూపులు చూచుచున్నది.

మూర్ఛాం ప్రాప్నోతి రూపేణ పులకాంకిత విగ్రహా | వస్త్రేణ ముఖ మాచ్ఛాద్య నీరీక్షంతీ పునః పునః. 42

త్వం చాపి తాంసంనీరీక్ష్య సకామః సస్మితః సదా | మయి జీవతి గోలోకే భూతా దుర్వృత్తిరీదృశీ. 43

త్వ మేవచైవందుర్వృత్తం వారం వారం కరోషి చ | క్షమాం కరోమి ప్రేవ్ణూ చ స్త్రీ జాతిః స్నిగ్ధ మానసా. 44

సంగృ హ్య మాంప్రియా మిష్టాం గోలోకాపిద్గచ్ఛ లంపట | అన్యథా నహి తే భద్రం భవిష్యతి వ్రజేశ్వర. 45

దృష్టస్త్వం విరజాయుక్తో మయా చందన కాననే | క్షమా కృతా మయా పూర్వం సఖీనాం వచనాదహో. 46

త్వయా ముచ్ఛబ్ద మాత్రేణ తిరోధానం కృతం పురా | దేహం తత్యాజ విరజా నదీరూపా బభూవసా. 47

కోటి యోజన విస్తీర్ణా తతో దైర్ఘ్యే చతుర్గుణా | అద్యాపి విద్యమానాసా తవ సత్కీర్తిరూపిణీ. 48

గృహం మయిగ తాయాం చ పునర్గత్వా తదంతికే | ఉచ్చై రురోద విరజే విరజే చేతి చ సంస్మరన్‌. 49

తదా తోయా త్సముత్థాయ సా యోగా త్సిద్ధయోగినీ | సాలంకారా మూర్తిమతీ దదౌ తుభ్యం చ దర్శనమ్‌. 50

తత స్తాం చ సమాక్షిప్య వీర్యాధానం కృతం త్వయా | తతో బభూవు స్తస్యాం చ సముద్రాః సప్త ఏవచ. 51

దృష్ట స్త్వం శోభయా గోప్యాయుక్తశ్చంపకకాననే | సద్యో ముచ్ఛబ్ద మాత్రేణ తిరోధానం కృతం త్వయా. 52

శోభా దేహం పరిత్య జ్య జగామ చంద్ర మండలే | తతస్తస్యాః శరీరం చ స్నిగ్ధం తేజో బభూవహ. 53

సంవిభజ్య త్వయా దత్తం హృదయేన విదూయతా | రత్నాయ కించి త్స్వ ర్ణాయ కించిన్మణి వరాయ చ. 54

కించి త్ర్సీణాం ముఖా బ్జేభ్యః కించి ద్రాజ్ఞేన కించన | కించి త్కిసల యేభ్య శ్చ పుష్పేభ్య శ్చాపి కించన.

నా యీ సుందరరూపమునకు మేను పులకలెత్త మూర్ఛిల్లుచు తన మేలి ముసుగు మాటున నిన్నే మాటిమాటికి తమకమునిండార చూచుచున్నది. నీవు నవ్వులు రువ్వుచు సైగలతో కామము వెలిపుచ్చుచు నామెను చూచుచున్నావు. ఈ గోలోకమున నేనుండగ నిట్టి చెడువృత్తి జరుగుటయా! నీవే మాటిమాటి కిట్టి పై పై వ్యాపారము సాగించుచున్నావు. నేను ప్రేమచే క్షమించి వేయుచున్నాను. స్త్రీ జాతి మనసు మెత్తనిది గదా! ఓయి వ్రజనాధా! ఓయి లంపటుడా! ఈ గోలో కము వీడి వెళ్ళిపొమ్ము. నీ ప్రియురాలితోనే కులుకుచుండుము. కానిచోనీకు మంచిది గాదు. అప్పు డొకనాడు విరజయను గోపాంగనను గూడి సయ్యాటలు సాగించుట నేను కన్నులార చూచితిని. ఆనాడు నా చెలుల మాట చొప్పున నిన్ను క్షమించి వేసితిని. అపుడు నా కాలిచప్పుడు విన్న మాత్రముననే నీవు మాయమైతివి. విరజయును మేను చాలించి నదీరూప మొందెను. విరజానది నేటికి నీ కీరితికి గుర్తుగ కోటి యోజనములు వెడల్పును దానికి నాలుగు రెట్లు పొడవును గల్గి ప్రవహించుచున్నది. నే నింటి కేగిన పిదప మహానుభావుడవు నీవు మరల దానిచెంత కేగి విరాజా! ఓ విరజా! యని దానినే తల పోయుచు నెలుగెత్తి పిలిచితివి. నీవు పడు మదనతాపము చూచి యా సిద్ధయోగిని తన్నలంకరించుకొని యోగముతో నీటి నుండి వెలువడి నీకు దర్శన మిచ్చెను. అపు డా సొగసైన వలపుకత్తెను మమతనిండ నెదకు హత్తుకొని యనురాగరస మాధురి పెల్లుబుకగ మహావీరుడవు నీవామెలో వీర్య ముంచితివి. అపు డామెనుండి సప్తసముద్రము లుద్బవించెను. మఱి యొక్క మారు చంపకవనమందు ''శోభ'' యను గొల్లపడుచుతో చెలరేగిన ప్రేమబంధాల నడుమ చిక్కుకొనుట నా కన్ను లతో నేను చూచితిని. నా యలికిడి విన్నంతనే నీవు మాయమై పోతివి. శోభ తన శరీరము విడిచి చంద్రమండలము చేరెను. చంద్రునిలోని తెల్లని కాంతి యా శోభ##యే గదా ! ఆమె శరీరము తేజముగ మారెను. అపుడు నీవు వికల మనస్సుతో నా తేజమును విభాగించి కొంత రత్నములలో కొంత బంగారములో కొత మణులలో నుంచితివి. కొంత స్త్రీల ముఖకమలము లందును కొంత రాజులందును కొంత చిగురాకులందును కొంత పూలలోను నుంచితివి.

కించి త్పలేభ్యః పక్వేభ్యః సస్యేభ్య శ్చాపి కించన | నృప దేవగృహేభ్య శ్చ సంస్కృతేభ్య శ్చ కించన. 56

కిచిన్నూతన పత్రేభ్యోః సస్యేభ్యశ్చాపి కించన | దృష్టస్తం ప్రభయా గోప్యా యుక్తో బృందావనే వనే. 57

సద్యో మచ్చబ్దమాత్రేణ తిరోధానం కృతం త్వయా | ప్రభాదేహం పరిత్యజ్య జగామ సూర్య మండలే. 58

తత స్తస్యాః శరీరం చ తీవ్రం తేజోబభూవ హ | సంవిభజ్య త్వయా దత్తం ప్రేవ్ణూ ప్రరుదతావురా. 59

విసృష్టం చక్షుషోః కృష్ణ లజ్జయా మద్బయేన చ | హుతాశనాయ కిం చిచ్చ యక్షేభ్యశ్చాపి కించన. 60

కిం చి త్పురుష సింహేభ్యో దేవేభ్య శ్చాపి కించన | కించి ద్విష్ణుజనేభ్యశ్చ నాగేభ్యో7పి కించన. 61

బ్రాహ్మణభ్యో మునిభ్యశ్చ తపస్విభ్యశ్చ కించన | స్త్రీభ్యః సౌభాగ్య యుక్తాభ్యో యశస్విభ్య శ్చ కించన. 62

తత్తు దత్త్వా చ సర్వేభ్యః పూర్వం ప్రరుదితంత్వయా | శాంతిగోప్యాయుత స్త్వంచ దృష్టో7సి రాసమండలే. 63

వసంతే పుష్పశయ్యాయాం మాల్యవాంశ్చందనోక్షితః | రత్నప్రదిపై ర్యుక్తంచ రత్ననిర్మాణ మందిరే. 64

రత్నభూషణ భూషాఢ్యో రత్నభూషితయా సహ | తయా దత్తం చ తాంబూలం భుక్తవాం శ్చ పురావిభో. 65

సద్యో మ చ్ఛ బ్ద మాత్రేణ తిరోధానం కృతం త్వయా | శాంతిర్దేహం పరిత్యజ్య భియా లీనా త్వయి ప్రభో. 66

తత స్తస్యాః శరీరం చ గుణశ్రేష్ఠం బభూవ హ | సంవిభజ్య త్వయా దత్తం ప్రేవ్ణూ ప్రరుదతా పురా. 67

విశ్వేతు విపినే కించి ద్బ్రహ్మణ చ మయి ప్రభో | శుద్ధ సత్త్వ స్వరూపాయై కించి ల్లక్ష్మ్యై పురా విభో. 68

కొంత తేజము పండిన పండ్లలో కొంత పైరుపచ్చలంధును కొంత రాజుల భవనములందు కొంత దేవాలయము లందునుంచితివి. కొంత తేజమును క్రొత్త లేజిగుళ్ళయందును కొంత పాలయంధు నుంచితివి. ఇంకొకసారి నీవు ప్రభయను గోపకాంతను దగిలి బృందావనమున కులుకుచుంటివి. అపుడును నా యలికిడి విన్నంతనే మరల మాయమైపోతివి. ''ప్రభ'' తన దేహము చాలించి సూర్యమండలము చేరెను. అపు డామె శరీరమునుండి దివ్యతేజము వెల్వడెను. అపు డామెతోడి కలయిక చెడినందున లోలోన బాధ పడితివి. నీ వపుడు నా భయమునకు తలవంచి నన్ను చూడకుంటివి. ప్రభ వెల్గులలో కొంత యగ్నియందు యక్షులందు కొంత ఉంచితివి. కొంత తేజము పురుషవర్యులందును కొంత ప్రకాశము దేవతలందును కొంత వైష్ణవులందును కొంత వెలుగు నాగులందు నుంచితివి. కొంత తేజము బ్రాహ్మణులందు కొంత మునులందు తాపసు లందును కొంతతేజము సౌభాగ్యవతులగు స్త్రీలయందును కొంత కీర్తిమంతులందు నుంచితివి. ఇట్లు ప్రభలోని తేజమునువారి వారికి పంచిపెట్టి యామె యెడబాటునకు నీ వెంతయో కుమిలిపోతివి. ఇంకొకసారి నీవు రాసమండలమందున ''శాంతి'' యను గొల్లపడుచును తగిలి యైమేమో చేయుచుండగ నేనే స్వయముగ చూచితిని. అది యొక రతనాల కాంతులు విర జిమ్ము మందిరము. అందొక పూలసెజ్జ. అందు నీవు పరుండి పూలమాలలు దాల్చి చందనమలందుకొని మదనగోపాలునివలె సుందరముగ నుంటివి. నీవు రత్నభూషణములు దాల్చి వెలుగుచుంటివి. అంతలో రతనాల సొమ్ముల చెలువముతో వలపులు గుబాళించు కమ్మతమ్ములమును ''శాంతి'' నీనోటికి తియ్యని పలుకులతో నందీయ సేవించితివి. అంతలో నా కాలిసవ్వడి విన్నంతనే నీవు మాయమైతివి. శాంతియును తన దేహము చాలించి నీలో లీనఅయ్యెను. ఆ శరీరపు గుణములును శ్రేష్ఠము లైనవి. నీ ప్రణయభంగమున కెంతయో వగచితివి. నీ వామె శరీరమును వేరు చేసితివి. ఆమెలోని కొంత శక్తిని విశ్వమున వనములందు బ్రహ్మయందును శుద్ధసత్త్వస్వరూపిణియగు లక్ష్మియందును నాయందు నుంచితివి.

తన్మంత్రోపాసకేభ్య శ్చ శాక్తే భ్యశ్చాపి కించన | తపస్విభ్య శ్చ ధర్మాయ ధర్మిష్ఠేభ్యశ్చ కించన. 69

మయా పూర్వం చ త్వం దృష్టో గోప్యాచ క్షమయా సహ | సువేషయుక్తో మాలావా న్గంధచందన చర్చితః. 70

రత్న భూషితయా గంధచందనోక్షితయా సహ | సుఖేన మూర్ఛిత స్తల్పే పుష్ప చందన చర్చితే. 71

శ్లిష్టో నిద్రితయా సద్యః సుఖేన నవసంగమాత్‌ | మయా ప్రబోధితా సా చభ వాంశ్చ స్మరణం కురు. 72

గృహీతం పీతవస్త్రం చ మురళీ చ మనోహరా | వనమాలా కౌస్తుభ శ్చాప్య మూల్యం రత్నకుండలమ్‌. 73

పశ్చాత్ప్ర దత్తం ప్రేవ్ణూ చ సఖీనాం వచనా దహో | లజ్జయా కృష్ణ వర్ణో7భూ ద్బవా న్పాపేనయః ప్రభో. 74

క్షమాదేహం పరిత్యజ్య లజ్జయా పృథివీం గతా | తతస్తస్యాః శరీరం చ గుణశ్రేష్ఠం బభూ వహ. 75

సంవిభజ్య త్వయా దత్తం ప్రేవ్ణూ ప్రరుదతా పునః | కించి ద్ద త్తం విష్ణవే చవైష్ణవేభ్య శ్చ కించన. 76

ధార్మికే భ్య శ్చ ధర్మాయ దుర్బ లేభ్య శ్చ కించన | తపస్విభ్యోపి దేవేభ్యః పండితే భ్య శ్చ కించన. 77

ఏతత్తే కథితం సర్వం కిం భూయః శ్రోతుమిచ్ఛసి | త్వద్గుణం చైవ బహుశో న జానామి పరం ప్రభో. 78

ఇత్యేవ ముక్త్వా సారాధా రక్తపం కజలోచనా | గంగాంవక్తుం సమారేభే నమ్రాస్యాం లజ్జితాం సతీమ్‌. 79

గంగా రహస్యం విజ్ఞాయ యోగే సిద్ధయోగినీ | తిరోభూయ సభామధ్యే స్వజలం ప్రవివేశ సా. 80

రాధా యోగేన విజ్ఞాయ సర్వత్రావస్థితాం చ తామ్‌ | పానం కర్తుం సమారేభే గండూషా త్సి ద్ధయోగినీ. 81

గంగా రహస్యం విజ్ఞాయ యోగేన సిద్ధయోగినీ | శ్రీకృష్ణచరణాంభోజే వివేశ శరణం య¸°. 82

కొంత శాంతిని నీ మంత్రోపాసకులందును కొంత శాక్తేయులందును ధర్మునందును ధర్మపరులందు నుంచితివి వేరొక తూరి నీవు ''క్షమ'' యను గోపకామినితో ననురాగములు తీగలు సాగ ప్రేమ కలాపములు సాగించితివి. నీ వపుడు పూలమాలలు దాల్చి గంధము మేననలందుకొని శృంగారరూపుడవై యుండుట నా కన్నులతో నేను చూచితిని. రత్నభూషలు దాల్చి చందనగంధములు శరీరమున కలందుకొని పూలు చందనము చల్లిన మత్తుగొల్పు పూలపాన్పుపై నీవు సుఖ ముగ కమ్మని తలపులతో సొమ్మసిల్లియుంటివి. అత్తఱి త్రుళ్ళిపడునట్టి మీ యిర్వురి యనురాగములు గట్టిగ పెనవేసుకొని యా మత్తులో నిద్రించితిరి. ఇదంతయు నేను చూచి సైచి నిన్ను మేల్కొలుపు నంతవఱకు నీవు లేవనేలేదు గదా! అపుడు నేను నీ పీతాంబరమును సుమనోహరమైన మురళిని వనమాలను కౌస్తుభమణిని రత్నకుండలములను గైకొంటిని. ఓ ప్రభూ ! నీవు చేసిన పాపమునకు తలవంచుకొంటిని. అపుడు నీవు కృష్ణవర్ణుడవైతివి. నా చెలుల మాటలు విని నేను వాని నెల్ల తిరిగి నీకే యిచ్చివేసితిని. ''క్షమ'' యును సిగ్గుచేత తనువు చాలించి భూమిలో చేరెను. ఆనాటినుండి యామె శరీర ముత్తమ గుణము లుగ మారెను. దాని విరహమునకు నీవు కుందుచు నామె సుగుణమును విభజించి కొంత విష్ణువునకు కొంత వైష్ణవులకు పంచి పెట్టితివి. కొంత ధార్మికులకు కొంత ధర్మునకు కొంత దుర్బలకు కొంత తాపసులకు వేదములకు పండితులకును పంచి పెట్టితివి. ఓ ప్రభూ! ఈ ప్రకారముగ నీ కేళీవిలాసములు నాకు తెలిపి నంతవఱకు తెల్పితిని. ఇంకేమేని వినదలుతువా? నీ గుణమహిమ లనంతములు. వానిని నే నెక్కువగ నెఱుంగజాలను. అన్ని కన్ను లెఱ్ఱజేసి రాధ పలికెను. కృష్ణుని చెంగట తలవంచుకొనియున్న గంగతో పలుకుటకు రాధ మొదలిడెను. ఆలోన సిద్ధయోగిని యగు గంగ యోగబలముతో రహస్య మంతయు నెఱింగి యంతర్ధానమంది నీరుగ మారెను. సిద్ధయోగినియగు రాధయును యోగబలమున సర్వమెఱింగి యంతట నిండిన గంగను పుక్కిటబట్ట నుంకించెను.

గోలోకే స చ వైకుంఠే బ్రహ్మలో కాదికే తథా | దదర్శ రాధా సర్వత్ర నైవగంగాం దదర్శ సా. 83

సర్వత్ర జలశూన్యం చ శుష్కపంకం చ గోలకమ్‌ | జలజంతు సమూహై శ్చ మృత దేహైః సమన్వితమ్‌. 84

బ్రహ్మ విష్ణు శివానంత ధర్మేం ద్రేందు దివా కరాః | మనవో మునయః సర్వే దేవసి ద్ధ తపస్వినః. 85

గోలోకం చ సమా జగ్ముః శుష్కకంఠోష్ట తాలుకాః | సర్వే ప్రణముర్గోవిందం సర్వేశం ప్రకృతేః పరమ్‌. 87

వరం వరేణ్యం వరదం వరిష్ఠం వరకారణమ్‌ | గోపికా గోప బృందానాం సర్వేషాం ప్రవరం ప్రభుమ్‌. 86

నిరీహం చ నిరాకారం నిర్లప్తంచ నిరాశ్రయమ్‌ | నిర్గుణం చ నిరుత్సాహం నిర్వికారం నిరంజనమ్‌. 88

స్వేచ్ఛామయం చ సాకారం భక్తానుగ్రహకారకమ్‌ | సత్త్వ స్వరూపం సత్యేశం సాక్షిరూపం సనాతనమ్‌. 89

పరం పరేశం పరమం పరమాత్మాన మీశ్వరమ్‌ | ప్రణమ్య తుష్టువుః సర్వే భక్తి నమ్రాత్మకంధరాః. 90

స గద్గదాః సాశ్రునేత్రాః పులకాంకిత విగ్రహాః | సర్వే సంస్తూయ సర్వేశం భగవంతం పరాత్పరమ్‌. 91

జ్యోతిర్మయం పరం బ్రహ్మ సర్వకారణ కారణమ్‌ | అమూల్య రత్ననిర్మాణ చిత్రసింహాసన స్థితమ్‌. 92

సేవ్యమానం చ గోపాలైః శ్వేతచామర వాయునా | గోపాలికానృత్య గీతం పశ్యంతం సస్మితం ముదా. 93

ప్రాణాధిక ప్రియతమారాధా వక్షఃస్థల స్థితమ్‌ | తయా ప్రదత్తం తాంబూలం భుక్తవంతం సువాసితమ్‌. 94

మరల సిద్ధయోగినిగంగయు నంతయు నెఱింగి యోగబలముతో శ్రీకృష్ణుని చరణకమలములు శరణుజొచ్చెను. అపుడు రాధగోలోకమున వైకుంఠమున బ్రహ్మలోకమందు నంతట కలయజూచెను. కానిగంగ కనిపించలేదు. గోలోకమం దంతటను నీరులేదు కమలములువాడిపోయెను. జలజంతువులు చచ్చిపడియుండెను. అపుడు బ్రహ్మవిష్ణుశివులు అనంతుడు ధర్ముడు సూర్యచంద్రులు మునువులు మునులు సురసిద్ధతాపసులును ఎల్లరును గోలోకముచేరిరి. వారి కంఠములు పెదవులు నెండిపోయెను. అందఱును సర్వేశుడు ప్రకృతిపరుడునగు గోవిందునికి చేతులెత్తిమ్రెక్కిరి. కృష్ణుడు వరుడువరేణ్యుడు వరదుడు వరిష్ఠుడు వరకారణుడు గోపికాగోపబృందములందు ప్రవరుడు ప్రభువు నిరీహుడునిరాకారుడు-నిర్లిప్తుడునిరా శ్రయుడునిర్గుణుడు నిర్వికారి నిరంజనుడు స్వేచ్ఛామయుడుసాకారుడుభక్తానుగ్రహకారకుడు సత్యస్వరూపుడుసత్యేశుడు సాక్షిరూపుడుసనాతనుడు పరపరేశుడుపరముడుపరమాత్మ ఈశ్వరుడునగు కృష్ణునకెల్లరును నమస్కరించి భక్తివినయములతో తలలువంచి కృష్ణస్తోత్రగానములు చేసిరి. ఇట్లువారు భక్తిభావముతో పులకిత శరీరులై గద్గద కంఠులై ఆనందాశ్రువులుగలవారై సర్వేశుడు భగవానుడుపరాత్పరుడునగు వానిని సంస్తుతించిరి. జ్యోతిర్మయుడు పరబ్రహ్మ సర్వకారణకారణుడు నగు కృష్ణుడమూల్యమైన రత్న చిత్రసింహాసనముపై కూర్చుండెను. అగోపికలు వింజామరలతో కృష్ణ పరమాత్మను సంసేవించుచుండిరి. గోపికలు నృత్యగానములు చేయుచుండిరి. కృష్ణభగవానుడీ వినోదముననుభవించు చుండెను. ప్రాణముకన్న ప్రియమైన రాధ యతని వక్షఃస్థలముపై విలసిల్లుచుండెను. ఆమెయిచ్చునట్టి యాకుమడతలు సేవించుచుండెను.

పరిపూర్ణతమం రాసే దదృశుశ్చ సురేశ్వరమ్‌ | మునయో మానవాః సిద్ధాస్తపసా చ తపస్వినః. 95

ప్రహృష్టమనసః సర్వే జగ్ముః పరమ విస్మయమ్‌ | పరస్పరం సమాలోక్య ప్రోచుస్తే చ చతుర్ముఖమ్‌. 96

నివేదితం జగన్నాధం స్వాభిప్రాయ మభీప్సితమ్‌ | బ్రహ్మ తద్వచనం శ్రుత్వా విష్ణుం కృత్వాస్వ దక్షిణ. 97

వామతో వామదేవం చ జగామ కృష్న సన్నిధిమ్‌ | పరమానందయుక్తం చ పరమానందరూపిణమ్‌. 98

సర్వం కృష్ణమయం ధాతా దదర్శరాస మండలే | సర్వం సమానవేషం చ సమానాసన సంస్థితమ్‌. 99

ద్విభుజం మురళీహస్తం వనమాలా విభూషితమ్‌ | మయూరపిచ్ఛ చూడం చ కౌస్తు భేనవిరాజితమ్‌. 100

అతీవకమనీయం చ సుందరం శాంత విగ్రహమ్‌ | గుణ భూషణ రూపేణ తేజసా వయసాత్విసా. 101

పరిపూర్ణతమం సర్వం సర్వైశ్వర్య సమన్వితమ్‌ | కిం సేవ్యం సేవకం కింవా దృష్ట్వా నిర్వక్తు మక్షమః. 102

క్షణం తేజః స్వరూపం చ రూపం తత్ర స్థితం క్షణమ్‌ | నిరాకారం చ సాకారం దదర్శ ద్వివిధం క్షణమ్‌. 103

ఏకమేవ క్షణం కృష్ణం రాధయా సహితం పరమ్‌ | ప్రత్యేకా సన సంస్థం చ తయా సార్ధం చ తత్షణమ్‌. 104

రాధారూప ధరం కృష్ణం కృష్ణరూపం కళత్రకమ్‌ | కిం స్త్రీరూపం చ పురుషం విధాతా ధ్యాతు మక్షమః. 105

హృత్ప ద్మస్థం చ శ్రీకృష్ణం ధ్యాత్వా ధ్యానేన చక్షుషా | చకార స్తవనం భక్త్యా పరిహార మనేకధా. 106

తతః స్వచక్షు రున్మీల్య పున శ్చ తదనుజ్ఞయా | దదర్శ కృష్ణమేకం చరాధావక్షః స్థల స్థితమ్‌. 107

అట్టిపరిపూర్ణ మధురరాస మండలమున మునులు మానవులు సిద్ధులు తాపసులును కన్నులపండువుగ కృష్ణుని సందర్శించిరి. అందఱును ప్రసన్నచిత్తములతో పరమాశ్చర్యమొందిరి. వారొకరినొకరు చూచుకొని బ్రహ్మతోనిట్లనిరి. తమ యభిప్రాయమును జగన్నాధునకు తెల్పుమని వారనిరి. వారి మాటలువిని బ్రహ్మ తనకుడివైపు విష్ణువును తన యెడమవైపు శివుని ఉంచుకొని కృష్ణునిసన్నిధికేగెను. పరమానందరూపుడగు కృష్ణుడును పరమానందరూపిణియగు రాధయును వారికి గనిపించిరి. బ్రహ్మ రాసమండలమంతయును కృష్ణమయముగ వెలుగుటగాంచెను. అందఱి వేషములు సమానములు ఆసనము లందున్నవారు సమానులు. అందఱును ద్విభుజులే మురళీధరులే వనమాలా విభూషితులే నెమలిపింఛము తలదాల్చినవారే కౌస్తుభవిరాజితులే అందమైనశాంత విగ్రహులే; అందుఱుమనోహరులే గుణమున సొమ్ములందురూపమున తేజమున వయసున కాంతిలో నందఱును సమానులే. అందఱును పరిపూర్ణులు సకల సమృద్ధులు: వీరిలో సేవకుడెవడో సేవింపబడు వాడెవడో తెలియుట కష్టముగనుండెను. ఒక్కక్షణములో తేజోరూపము నింకొక్క క్షణములో సగుణరూపము నిరాకారమునంతలో సాకారము రెండు విధాల కృష్ణుడొప్పసాగెను. ఒక్కక్షణములో రాధతోగూడిన కృష్ణుని మఱియొక్క క్షణములో రాధ వెంట లేని కృష్ణుని మరల రాధతోడి కృష్ణుని బ్రహ్మచూచెను. కృష్ణుడు రాధారూపమును రాధకృష్ణ రూపమును దాల్చెను. వీరిర్వు రిలో పురుషుడెవరో స్త్రీ యెవరో తెలియుట కష్టముగనుండెను. అపుడు బ్రహ్మకేమియును దోచక తన హృదయకమలముల ధ్యాననేత్రములతో కృష్ణుని దర్శించెను. బ్రహ్మ పెక్కు రీతుల భక్తితో ధ్యానించెను. పిదప కృష్ణుననుమతితో బ్రహ్మ కన్నులు తెఱచిచూడగ కృష్ణుడు కనిపించెను. అతని వక్షస్థలముపై రాధ వెలుగుచుండెను.

స్వపార్షదైః పరిభృతం గోపీమండల మండితమ్‌ | పునః ప్రణముస్తం దృష్ట్వా తుష్టువుః పరమేశ్వరమ్‌. 108

తదభిప్రాయ మాజ్ఞాయ తానువాచ రమేశ్వరః | సర్వాత్మా స చ సర్వజ్ఞః సర్వేశః సర్వభావనః. 109

శ్రీభగవాను వాచ : ఆగచ్ఛ బ్రహ్మ న్నాగ చ్ఛ కమలాపతే | ఇహాగ చ్ఛ మహాదేవ శశ్వత్కుశలమస్తువః. 110

ఆగతాహి మహాభాగా గంగానయన కారణాత్‌ | గంగా చ చరణాంభోజే భ##యేన శరణం గతా. 111

రాధే మాం పాతుమిచ్ఛంతీ దృష్ట్వా మత్సన్నిధానతః | దాస్యామీమాం చ భవతాం యూయం కురుత నిర్బయామ్‌. 112

శ్రీకృష్ణస్యవచః శ్రుత్వా సస్మితః కమలో ద్బవః | తుష్టావరాధా మారాధ్యాం శ్రీకృష్ణపరిపూజితామ్‌. 113

వక్త్రైశ్చ తుర్బిః సంస్తూయ భక్తి నమ్రాత్మ కంధరః | ధాతా చతుర్ణాం వేదానామువా చ చతురాననః. 114

చతురానన ఉవాచ : గంగా త్వ దంగ సంభూతా ప్రభోశ్చ రాసమండలే యువయో ర్దృవరూపాసా ముగ్ధయోః శంకరస్వనాత్‌. 115

కృష్ణాం శా చ త్వ దంశాచ త్వత్కన్యా సదృశీ ప్రియా | త్వ న్మం త్ర గహణం కృత్వా కరోతు తవ పూజనమ్‌. 116

భవష్యతి పతి స్త స్యావైకుంఠేశ శ్చ తుర్బుజః | భూస్థాయాః కల యా తస్యాః పతి ర్లవణ వారిధిః. 117

గోలోకస్థా చ యాగంగా సర్వత్ర స్థాతథా7ంబికే | తదంబికా త్వం దేవేశీ సర్వదా సా త్వ దాత్మజా. 118

బ్రాహ్మణోవ జనం శ్రుత్వా స్వీ చకార చ సస్మితా | బహి ర్బ భూవ సా కృష్ణ పా దాంగుష్ఠన ఖాగ్రతః. 119

తత్రైవ సత్కృతాశాంతా తస్థౌ తేషాం చ మధ్యతః | ఉవాస తోయా దుత్థాయ తదధి ష్ఠాతృదేవతా. 120

తత్తోయం బ్రహ్మణా కించిత్థ్సా పితంచ కమండలౌ | కిచిద్ధాధారశిరసి చంద్రార్ధ కృతశేఖరః. 121

గంగాయై రాధికా మంత్రం ప్రదదౌ కమలోద్బవః | తత్‌స్తోత్రం కవచం పూజాం విధానం ధ్యానమేవ చ. 122

వారి చుట్టువారి యనుచరు లుండిరి. గోపీగోపకులు వారిని సేవించుచుండిరి. ప్రత్యక్షముగ దర్శన మిచ్చిన పరమేశ్వరునిగాంచి బ్రహ్మస్తోత్రము చేసెను. అపుడు సర్వాత్మ సర్వజ్ఞుడు సర్వేశుడు సర్వభావనుడు రమేశ్వరుడు నగు కృష్ణుడు బ్రహ్మభావ మెఱిగి యిట్లనియెను. శ్రీభగవాను డిట్లనెను : ఓ బ్రహ్మా ! కమలాపతీ ! రారమ్ము. మహాదేవా ! ఇటు రమ్ము. మీకు కుశలమగుగాక! మహాత్ములారా ! మీరెల్లరును గంగకొఱ కేతెంచితిరి. గంగ భయముతో నా చరణము లందు శరణు చొచ్చినది. రాధనా సన్నిధియందున్న గంగను త్రాగి వేయదలచినది. గంగను మీ కప్పగింపజాలను. మీరు మాత్రమీమెకు రాధవలన భయము గలుగకుండునట్లు చేయుడు. అను శ్రీకృష్ణుని వచనములు విని బ్రహ్మ సంతసించెను. శ్రీకృష్ణ పూజితయగు రాధను బ్రహ్మ స్తుతించి యారాధించెను. తన నాల్గు మోములతో భక్తితో తలవంచి నాల్గు వేదములతో బ్రహ్మ సంస్తుతించెను. బ్రహ్మ యిట్లనెను : పూర్వము రాసమండలమున శంకరుని సంగీతమునకు ముగ్ధులైన రాధా కృష్ణుల యంగములనుండి గంగ యుద్బవించెను. గంగ మీ యిర్వురి యంశలవలన జన్మించుటవలన మీకు కన్య వంటిది. కాన గంగ నీ మంత్రము జపించుచు నిన్నే పూజించును. గంగకు వైకుంఠపతియగు చతుర్బుజుడు పతి గాగలడు. విష్ణు నంశముచే బుట్టిన సాగరుడు భూలోకమున గంగకు పతి గాగలడు. ఓ అంబా ! గోలోకమందు విలసిల్లుచున్న గంగ యన్ని లోకాలలో నుండుగాక ! ఓ రాధాదేవీ ! నీవు గంగకు తల్లివి. గంగ నీ కూతురు. అను బ్రహ్మవాక్కులు విని రాధ చిర్నగవుతో నంగీకరించెను. అంతలో కృష్ణుని కాలిబొటన వ్రేలినుండిగంగ యుద్బవించెను. అపుడు జలాధిష్ఠానదేవియగు గంగ జలరూపము వదలి నిజరూపము దాల్చి వారి మధ్యను శాంతముగ మర్యాదగ నుండెను. ఆ జలమును కొంత తీసికొని బ్రహ్మ తన కమంలువునం దుంచుకొనెను. శివుడు తన తలపై నిడుకొనెను. బ్రహ్మ గంగకు రాధామంత్ర ముపదేశించెను. రాధాసోత్రముకవచము పూజా విధానము ధ్యానము నుపదేశించెను.

సర్వం తత్సామవే దోక్తం పురశ్చర్యా క్రమం తథా | గంగా తామేవసం పూజ్యవైకుంఠం ప్రయ¸°సహ. 123

లక్ష్మీసరస్వతీ గంగా తులసీ విశ్వపావనీ | ఏతానారాయణసై#్యవ చతస్రో యోషితో మునే. 124

అథ తం సస్మితః కృష్ణో బ్రహ్మాణం సమువాచ సః | సర్వ కాలస్య వృత్తాంతం దుర్బోధ మవిపశ్చితమ్‌. 125

శ్రీకృష్ణః : గృహాణ గంగాం హే బ్రహ్మన్‌ హేవిష్ణో హే మహేశ్వర | శృణు కాలస్య వృత్తాంతం మత్తో బ్రహ్మన్నిశామయ. 126

యూయంచ యే7న్యే దేవాశ్చ మునయోమనవ సథా | సిద్ధా యశస్వినశ్చైవ యే యే7త్రైవ సమాగతాః. 127

ఏతే జీవంతి గోలోకే కాలచ క్ర వివర్జితే | జలప్లుతే సర్వవిశ్వం జాతం కల్పక్షయో7ధునా. 128

బ్రహ్మాద్యా యే7న్య విశ్వస్థాస్తే విలీనా7ధునా మయి | వైకుంఠం చ వినా సర్వం జలమగ్నం చ పద్మజ. 129

గత్వా సృష్టిం కురు పున ర్బ్రహ్మలోకాదికం భవమ్‌ | స్వం బ్రహ్మాం డం విరచయ పశ్చాద్గంగా ప్రయాస్యతి. 130

ఏవ మన్యేషు విశ్వేషు సృష్టౌ బ్రహ్మాదికః పునః | కరోమ్యహం పునః సృష్టిం గచ్ఛ శీఘ్రం సురైః సహ. 131

గతో బహుతరః కాలో యుష్మాకం చ చతుర్ముఖాః | గతా కతివిధాస్తే చ భవిష్యంతి చ వేధసః. 132

ఇత్యుక్త్వా రాధికానాథో జగామాంతః పురే మునే | దేవా గత్యా పునః సృష్టిం చక్రురేవ ప్రయత్నతః. 133

గోలోకే చ స్థితా గంగా వైకుంఠే శివలోకకే | బ్రహ్మలోకే స్థితా7న్యత్ర యత్రయత్ర పురః స్థితా. 134

తత్రైవసా గతా గంగా చాజ్ఞయా పరమాత్మనః | నిర్గతా విష్ణుపాదాబ్జాత్తేన విష్ణుపదీస్మృతా. 135

ఇత్యేవం కథితం బ్రహ్మన్గంగోపాఖ్యాన ముత్తమమ్‌ | సుఖదం మోక్షదం సారం కిం భూయః శ్రోతుమిచ్ఛసి. 136

ఇతి శ్రీదేశీభాగవతే మహాపురాణ నవమస్కంధే త్రయోదశో7ధ్యాయః.

సామవేదమందున్నటుల చెప్పి పురశ్చర్యావిధానముకూడ తెలిపెను. గంగ రాధను సంస్తుతించి వైకుంఠమేగెను. మునీ! ఇట్లు లక్ష్మీ సరస్వతి గంగ విశ్వపావనియగు తులసి యనునల్గురు నారాయణుని భార్యలు అటుపిమ్మట కృష్ణుడు నవ్వి మూర్ఖులకు తెలియరాని కాలవృత్తాంతమంతయును బ్రహ్మకు తెలిపెను. శ్రీకృష్ణుడిట్లనియెను. గంగా ! బ్రహ్మా ! విష్ణూ! మహేశ్వరా! మీరు నావలన కాలవృత్తాంతమును వినుడు. మీరును నితరదేవతలును మునులు మనువులు సిద్ధులు కీర్తికాయులు ఇచ్చటికేతెంచిన వారెల్లరును వీరందఱును గోలోకమున వసింపగలరు. ఇచట కాలచక్రము తన ప్రభావము చూపలేదు. ఇపుడు విశ్వమంతయును జలమయమయినది. కల్పక్షయమయినది. ఇతర బ్రహ్మాండము లందలి బ్రహ్మాదులందఱు నిపుడు నాలో లీనులయియున్నారు. ఓ బ్రహ్మా ! వైకుంఠము దప్ప మిగిలిన లోకము లన్నియును నీట మునింగెను. ఓ బ్రహ్మా ! నీవింక వెళ్ళి మరల సృష్టి కార్యము కొనసాగింపుము. నీ బ్రహ్మాండమును సృజింపుము. బ్రహ్మాండము లన్నిట గంగ వెళ్ళగలదు. ఇట్లు నే నితర బ్రహ్మాండము లందును బ్రహ్మలను సృజింపగలను. నీవు త్వరగ వెళ్ళి విశ్వరచనకు బూను కొనుము. ఇప్పటికే చాల యాలస్యమైనది. గతించిన బ్రహ్మలు తిరిగి జన్మింపగలరు. ఓ నారాదా! అని పలికి రాధా మాధవుడు తనయంతిపురము లోనికి జేరును. దేవతలును వెళ్ళి మరలసృష్టి ప్రయత్నములో మునిగియుండిరి. గంగ గోలోకము వైకుంఠ లోకము శివలోకము బ్రహ్మలోకము మున్నగు నేయే చోట్ల మునుపుండెనో మరల నాయా చోట్ల చేరెను. గంగ యాయా చోట్లకు పరమాత్ము నానతి వలన వెళ్ళెను. విష్ణు పాదము నుండి వెడలుట వలన గంగను విష్ణుపది యందురు. ఓ బ్రాహ్మణోత్తమా ! ఇట్లు నీకు పరమగు గంగోపాఖ్యానము వినిపించితిని. ఇది సుఖదము. మోక్షదము. సకలసారము. ఇంకేమి విన దలతువో తెలుపుము.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధమున పదుమూడవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters