Sri Devi Bagavatham-2    Chapters   

అథ చత్వారింశోధ్యాయః.

శ్రీ దేవ్యువాచ: ప్రాత రుత్దాయ శిరసి సంస్మరే త్పద్మ ముజ్జ్వలమ్‌ | కర్పూరాభం స్మరేత్తత్ర శ్రీగురుం నిజరూపిణమ్‌. 1

సుప్రసన్నం లసద్బూషాభూషితం శక్తిసంయుతమ్‌ | నమస్కృత్య తతో దేవీం కుండలీం సంస్మరే ద్బుధః. 2

ప్రకాశమామాం ప్రథమే ప్రయాణ ప్రతి ప్రయాణప్యమృతాయమానామ్‌ |

అంతఃపదవ్యా మను సంచరంతీ మానందరూపా మబలాం ప్రపద్యే. 3

ధ్యాత్వైవం తచ్చిఖామధ్యే సచ్చిదానందపూపిణీమ్‌ | మాంధ్యాయే రధ శౌబాదిక్రియాః సర్వాః సమాపయేత్‌. 4

అగ్నిహోత్రం తతో హూత్వా మత్ప్రీత్యర్దం ద్విజోత్తమః | హోమాంతే స్వాసనేస్థిత్వా పూజాసంకల్ప మాచరేత్‌. 5

భూతశుద్దిం పురా కృత్వా మాతృ కాన్యాస మేవచ | హృల్లేఖామాతృకా న్యాసం నిత్యమేవ సమాచరేత్‌. 6

మూలాధారే హకారం చ హృదయే చ రకారకమ్‌ | భ్రూమధ్యే తద్వ దీకారం హ్రీంకారం మస్తకేన్యసేత్‌. 7

తత్త న్నంత్రోదితా నన్యా న్న్యాసాన్సర్వాన్సమనాచరేత్‌ | కల్పయేత్‌ స్వాత్మనో దేహే పీఠం ధర్మాదిభిః పునః.8

తతో ధ్యాయేన్మహా దేవీం ప్రాణాయామైర్విజృంభితే | హృదంభోజే మమ సాధనే పంచ ప్రేతాసనే బుధః.9

బ్రహ్మావిష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః ఏతే పంచ మహాప్రేతాః పాదమూలే మమ స్థితాః. 10

పంచభూతాత్మకాహ్యేతే పంచావస్దాత్మకా అపి | అహంత్వవ్యక్త చిద్రూపా తదతీతాస్మి సర్వథా. 11

తతో విష్టరతాం యాతాః శక్తితంత్రేషు సర్వదా | ధ్యాత్వైవం మానసై ర్బోగైః పూజయేన్మాం జపేదపి. 12

జపం సమర్ప్య శ్రీ దేవ్యై తతోర్ఘ్యస్దాపనం చరేత్‌ | పాత్రాసాదనకం కృత్వా పూజాద్రవ్యాణి శోధయేత్‌. 13

జలేన తేన మనునా చాస్త్రమంత్రేణ దేశికః | దిగ్బంధం చ పురా కృత్యా గురూన్నత్వా తతఃపరమ్‌. 14

తదనుజ్ఞాం సమాదాయ బహ్యాపీఠే తతఃపరమ్‌ | హృదిస్దాం భావితాం మూర్తిం మమ దివ్యాణ మనోహరమ్‌.15

నలువదవ అధ్యాయము-శ్రీదేవి గీతలు

శ్రీదేవి యిట్లనెను: సాధకుడు ప్రొద్దుప్రొద్దుననే మేల్కాంచి తన బ్రహ్మరంధ్రమున కర్పూరవర్ణముగల దివ్య సహస్రారకమలమందు స్వాత్మరూపుజగు గురుదేవుని సంస్మరించవలయును. గురుదేవుడు లసద్‌భూషలుదాల్చి సకల విచిత్ర శక్తులు గల్గియుండును. అతనికి మ్రొక్కి పిదప బుధుడు కండలినీదేవిని మది తలంపవలయును. కుండనీశక్తి బ్రహ్మరంధ్రము జేరునపుడు చైతన్య కాంతి పుంజములు విరజిమ్ముచు క్రిందికి దిగునపుడమృతస్వరూపిణి యగుచు సుషుమ్నా మార్గమున సంచరించునపుడు బ్రహ్మానంద రసస్వరూపమున చెన్నుదలిర్చును. అట్టి పరాశక్తిని శరణు వేడుచున్నాను. అని మూలాధారమందలి చైతన్యజ్యోతితో వెలగొందుచున్న సత్యజ్ఞానానంతరూపిణి నగు నన్నే ధ్యానింపవలయును. అటుపిమ్మట శౌచాది నిత్యకృత్యములు తీర్చుకొనవలయును. తర్వాత బ్రహ్మణుడు నన్నుద్దేశించి నా ప్రీతికై యగ్నికారయము జరిపి పిదప సఖాసనమున గూర్చిండి నా పుజకు సంకల్పించవలయును. తొలుత భూతశుద్ద జేసి తర్వాత మాయబీజమగు హ్రీంకారముతో మాతృకాన్యాస మొనర్పవలయును. మూలాధార మందు ''హ'' కారమును హృదయమున రేఫమును కన్బొమల నడుమ ''ఈ'' కారమును శిరమున హ్రీంకారమును న్యాస మొనర్పవలయును. పిదప నితర మంత్రములకు చెప్పబడిన న్యాసములను సైతము చేయవలయును. తన దేహమందే ధర్మాదులతో పీఠపూజ సలుపవలయును. పిదప ప్రాణయామమువలన హృదయ కమలము విప్పారును. ఆది నా నివాసస్థానము. అచట పంచ ప్రేతాసనముపై శోభిల్లు మహాదేవినగు నన్ను ధ్యానింపవలయును. బ్రహ్మ-విష్ణు-రుద్రుడు-ఈశ్వరుడు-సదాశివుడు అను వీరిని పంచప్రేతము లందురు. వీరు నా పాదమూలమున నిత్యము వినసింతురు. వీరు భూమి-నీరు-తేజము-వాయువు-గగనమను పంచభూతములతోను జాగ్రత్త-స్వప్నము-సుషుప్తి-తురీ యము-అతీతమను పంచావస్థలతోను గూడి యుందురు. అవ్యక్త చిద్రూపిణి నగు నేను వీరి కధిపతిని. సర్వాతిశాయినిని. వీరైదుగురును నాకాసనములై యుండుటగూర్చి శక్తితంత్రములందు వెల్లడింపబడెను. ఈ విధముగ నన్నే ధ్యానించి మానసోపచారములతో నన్నే పూజింపవలయును. జపింవలయుదు. జనఫలము దేవి కర్పించి యర్ఘ్య పాత్రాదుల నాసాదించుకోని పూజాద్రవ్యములు శుద్ది చేయవలయును. ''హ్రీం'' లేక ''ఫట్‌'' అను మంత్రమున మంత్రించిన జలముతో శుద్ది చేయవలయును. మొదట దిగ్బంధ మొనరించి పిదప గురువందనము చేసి గురు నానతి బడసిన పిదప మొదట హృదయమున భావించిన దివ్యమంగళ విగ్రహమువంటి విగ్రహము నా వాహనము చేయవలయును.

ఆవాహయేత్తతఃపీఠే ప్రాణస్దాపనవిద్యయా | ఆసనావాహనేచార్ఘ్య పాద్యాద్యాచమనం తథా. 16

స్నానం వాసోద్వయం చైవ భూషణాని చ సర్వశః | గంధపుష్పం యథా యోగ్యం దత్వా దేవ్యై స్వభక్తితః. 17

యంత్రస్దానా మావృతీనాం పూజనం సమ్యగాచరేత్‌ | ప్రతివార మశక్తానాంశుక్రవారో నియమ్యతే. 18

మూలదేవీ ఫ్రభారూపాః స్మర్తవ్యా అంగదేవతాః | తత్ప్రభాపటలవ్యాప్తం త్రైలోక్యం చ చింతయేత్‌. 19

పునరావృత్తి సహితాం మూలదేవీం చ పూజయేత్‌ | గంధాదిభిః సుగందైస్తు తధా పుషై#్పఃసువాసితైః. 20

నై వేద్యైస్తర్పణౖశ్చైవ తాంబూలైర్దక్షిణాదిభిః | తోషయే న్మాం త్వత్కృతేన నామ్నాం సాహస్రకేణచ. 21

కవచేనచ సూక్తేనాహం రుద్రేభిరితి ప్రభో | దేవ్యథర్వశిరో మంత్రైర్‌ హృల్లేఖో పనిషద్బవైః. 22

మహావిద్యా మహామంత్రై స్తోషయేన్మాం ముహూర్మహుః క్షమాపయే జ్జగద్దాత్రీం ప్రేమార్ద్రహృదయోనరః. 23

పులకాంకిత సర్వాంగై ర్బాష్పరుద్దాక్షినిఃస్వనః | నృత్యాగీతాదిఘోపేణ తోషయేన్మాం ముహూర్మహుః. 24

వేదపారాయణౖశ్చైవ పురాణౖః సకలైరపి | ప్రతిపాద్యా యతోహం వైతస్మాతై స్తోషయేచ్చ మామ్‌. 25

నిజం సర్వస్వమపి మే సదేహం నిత్యశోర్పయేత్‌ | నిత్యహోమం తతః కుర్యా ద్బ్రాహ్మణాంశ్చ సువాసినీః. 26

వటుకాన్పామరానన్యా న్దేవీబుద్ధ్యాతు భోజయేత్‌ |నత్వా పునః స్వహృదయే వ్యుత్క్రమేణ వివర్జయేత్‌. 27

సర్వం హృల్లేఖయా కుర్యా త్పూజనం మమ సువ్రత | హృల్లేఖా సర్వమంత్రాణాం నాయికా పరమాస్మృతా. 28

హృల్లేఖా దర్పణ నిత్యం మహం తత్ప్రతిబింబితా | తస్మాత్‌ హృల్లేఖాయా దత్తం సర్వమంత్రైః సమర్పితమ్‌. 29

గురుం సంపూజ్య భూషాద్యైః కృతకృత్యత్వ మావహేత్‌ | య ఏవం పుజయే ద్దేవీం శ్రీమద్బువన సుందరీమ్‌.

ఇట్లు ప్రాణప్రతిష్టా మంత్రముతో న వాహనము చేసిన పిదప శ్రద్ధాభక్తులతో శ్రీరాజరాజేశ్వరి కాసనము ఆర్ఘ్య పాద్యములు ఆచమనము నై వేద్య తాంబూలము దేవి కర్పించవలయును. తదుపరి శ్రీచ్రకమందున్న యావరణ దేవతలను చక్కగ పూజింపవలయును. ఇట్లు ప్రతిదినము చేయజాలనిచో ఒక శుక్రవారము నాడైన చేయవలయును. ఈ యంగ దేవత లను శ్రీ యాదిదేవి విరజిమ్ముచున్న కాంతిపుంజములుగ నెంచవలయును. పిమ్మట పువరానృత్తిగల మూలదేవిని సుగంధ కుంకుమాదులచే బూజింపవలయును. తావులు వెదజల్లు పూలర్పించవలయును. నన్ను తరువాత నైవేద్యతర్పణతాంబూల దక్షిణలతో తనుపవలయును. నగేశా! తర్వాత నీవు రచించిన దేవిసహస్ర నామములతో నన్ను సంతోషపెట్టవలయును. నన్ను తంత్రోక్తమగు కవచముతోను అహంరుద్రేభిః అను దేవిసుక్తముతోను హ్రీంకారోపనిషచ్చులోని థర్వశిమంత్రములోను శ్రీమహావిద్యలోని మహామంత్రములతోను మాటిమాటికి సంతోషపఱచవలయును. పిదప భక్తిరసమునపులకిత హృదయుడై జగదంబను తప్పిదములను క్షమింపుమని వేడుకొనవలయును. తర్వాత తన శరీరములోని యణువణువు ప్రేమరసమున గగుర్పాటొదవ నానందభాష్పములతో డగ్గుత్తికతో నృత్యగీతవాద్యములతో దేవిని ప్రసన్నురాలిని చేయవలయును. ఓ వేదపారాయణములందును సకల పురాణములందును నేనే ప్రతిపాద్యను. అందువలన వేదపారాణముచేసి నన్నానందపఱచవలయును. బ్రహ్మణులనుముత్తైదు వలను పడుగులను కన్యకలనునితంపామర జనమును శ్రీవిగబావించి వారికితుష్టిగ భోజనము పెట్టవలయును. పిదప దేనిని యెడదలో నమస్కరించి సంహరముద్రతో దేవి కుద్వాసనము తెప్పవలయును. ఓ సువ్రతా! హ్రీంకార మెల్ల మంత్రములకు నాయకమణి వంటిది. కనుకనట్టి హ్రీంకారముతోనే పూజావిధాన మంతయును జరుపవలయును. నేను హ్రీంకార మనెడు నద్దమందు నిత్యము ప్రతిబించుచుందును. కనుక హ్రీంకారమున సమర్పించిన దంతయునుసర్వమంత్రములతో నర్పించిన దానితో సాటియుగును. పిదప తన గురుని వస్త్రాదులతో పూజించి తన్ను తాను. ధన్యునిగ తలంచుకొనవలయును. ఎవడీ విధముగ శ్రీభువనేశ్వరీ దేవిని సంపూజించునో-

సతస్య దుర్లభం కించి త్కదాచిక్క్వచి దస్తిహి | దేహాంతే తు మణి ద్వీపం మమ యాత్యేవ సర్వథా. 31

జ్ఞేయో దేవీస్వరూపో సౌ దేవా నిత్యం సమంతితమ్‌ | ఇతి తే కథితం రాజ న్మహాదేవ్యాః ప్రపూజనమ్‌. 32

విమృశ్యైత దశేషేణా వ్యధికారాను రూపతః | కురుమే పూజనం తేన కృతార్థస్త్వం భవిష్యసి. 33

ఇందతు గీతాశాస్త్రం మే మాశిష్యాయవదేత్క్వచిత్‌ | నాభక్తాయ ప్రదాతవ్యం నధూర్తాయచ దుర్హృదే. 34

ఏతత్ప్రకాశనం మాతు రుద్ఘాటన మరోజయోః | తస్మా దవశ్యం యత్నేనగోపనీయం మిదం సదా. 35

దేయం భక్తాయశిష్యాయ జ్యేష్ఠపుత్రాయచైనహి | సుశీలాయ సువేషాయ దేవీభక్తి యుతాయచ. 36

శ్రాద్దకాలే పఠే దేత ద్బ్రాహ్మణానాం సమీపతః | తృర్తా స్తత్పితరః సర్వే ప్రయాంతి పరమం పదమ్‌. 37

వ్యాసః: ఇత్యుక్త్వా సా భగవతీ తత్రైవాంతరధీయత | దేవాశ్చ ముదీతాః సర్వే దేవీదర్శనతోభవన్‌. 38

తతో హిమాలయే జజ్ఞే దేవీ హైమవతీ తూ సా| యా గౌరితి ప్రసిద్దా సీ ద్దత్తాసా శంకరాయ చ. 39

తతః స్కందఃసమూద్బూతస్తారకస్తేన పాతితః | సముద్రమంథనే పూర్వం రత్నా న్యాసుర్న రాదివ. 40

తత్ర దేవైఃస్తుతా దేవీ లక్ష్మీ ప్రాప్త్యర్థ మాదరత్‌ | తేషా మనుగ్రహార్థాయ నిర్గతా తు రమా తతః. 41

వైకుంఠాయ సురైర్దత్తా తేన తస్య శమోభవత్‌ | ఇతి తే కథి తం రాజన్దేవీ మాహాత్మ్య ముత్తమమ్‌. 42

గౌరీలక్ష్మ్యోః సముత్పత్తి విషయం సర్వకామదమ్‌ | నవాచ్యం త్వే త దన్యసై#్మ రహస్యం కథితం యతః. 43

గీతా రహస్య భూతేయం గోపనీయ ప్రయత్నతః | సర్వముక్తం సమాసేన య. త్పృష్టం తత్త్వయానఘ. 44

పవిత్రం పావనం దివ్యం కిం భూయః శ్రోతుమిచ్చసి.

ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణష్టాదశసాహస్య్రాం సంహితాయాం సప్తమస్కంధే

దేవిగీతాయాం చత్వారింశోధ్యాయః. శ్రీరస్తు స్కంధశ్చాయం సమాప్తః.

ఖశరద్వ్యశ్వి(2250) పద్యై స్తు ద్వైపాయన ముఖచ్యుతైః శ్రీమద్బాగత స్యాస్యసప్తమస్కంధ ఈరితః.

అతని కెప్పుడు నెచ్చట నేదియును సాధ్యము కానిది లేదు. అతడు శరీరము వదలిన పిమ్మట నా మణిద్వీపమును తప్పక చేరుకొనగలడు ఇట్టి నాపరమ భక్తుని దేవీ స్వరూపునిగా నెఱుంగవలయును. ఇతని కెల్ల దేవతలును నమస్కరింతురు. ఓరాజా! ఈ విధముగ నీకు శ్రీదేవీ పూజా విధానమంతయును వివరించితిని. ఇదంతయును తెలిసికొని నీ శక్తికి తగినట్లుగ నన్ను పూజింపుము. దానిచే నీవు ధన్య భాగ్యుడవగుదువు. ఈ దివ్య దేవీ గీతాశాస్త్రమును దేవీ భక్తుడు శిష్యుడు గాని వానికిని ధూర్తుడు దుష్టుడునైన వానికి నెప్పుడును చెప్పరాదు. ఈ దేవీ గీతలను ప్రకటించుట తన తల్లి స్తనములను బైటికి చూపుటవంటిది. కనుక దేవిగీతలను యత్నముతో సతము రహస్యముగ నుంచవలయుము. దీనిని దేవీభక్తుడు-వినీతశిష్యుడు-పెద్దకొడుకు-సుశీలుడు-సువ్రతుడు-నగు వానికే చెప్పవలయును. దీనిని ప్రత్యేకముగ దేవి పలికి యచ్చోట నంతర్దానమొందెను. శ్రీదేవీ దర్శన భాగ్యమున నెల్ల దేవతలు నానంద భరితులైరి. హైమనతీదేవి హిమాలయునకు పుత్రికగ జన్మించి గౌరి యనబరగెను. ఆమెను శంకరున కిచ్చి వివాబము జరిపిరి. పిదప వారికి షణ్ముఖుడు జన్మించి తారకాసురుని దునుమాడెను, జనమేజ. రాజా!మున్ను సముద్ర మథనము వేళ పెక్కు రత్నములుద్బవించెను, అమరులు లక్ష్మీప్రాప్తికి స్తోత్రము చేయగ లక్ష్మీదేవి సంతుష్టయై సాగరమందుద్బవించెను. దేవతలు లక్ష్మీదేవిని విష్ణునకొసంగిరి. అంత నామె సంతుష్ఠి జెందెను. రాజా!ఈవిధముగ నత్యత్తమమైన దేవీ మాహాత్మ్యము వివరింపబడినది. ఈ శ్రీగౌరీలక్ష్ముల యవతార కథ సర్వకామము లీడేర్చను. ఇది మిక్కిలి రహస్యమైనది. దీని నితరులకు చెప్పరాదు. ఈ శ్రీ దేవీగీతను రహస్యముగ పాడుము. ఓ యనఘా! నీవడిగిన దంతయును పవిత్రము పావనము దివ్యమునైనది. దీనిని వినిన తర్వాత నీవేమి వినదలతువో తెలుపుము.

గమనిక:

క్ష(1) స్కం-7;, అ-35; శ్లో-23; ద్వాదశాంతము-నుదుటిపై అంచునుండి పైకి సాధకుని చేతివ్రేళకొలతతొ పండ్రెండు అడ్డువ్రేళ్లపై భాగమునకు సరియగు దూరమును ద్వాదశాంతము అందురు.

(2) స్కం-7; అ-36; శ్లో-29-30; దధ్యజ్‌ అను నతడు ఆథర్వణమంత్ర సంప్రదాయ ఋషులలోనివాడు.

అతడు ఇంద్రుని తనకు బ్రహ్మ విద్య వుపదేశింపుమని ప్రార్ధించెను. ఇంద్రుడు దధ్యజ్‌ అథర్వణునకు బ్రహ్మ విద్యనుపదేశించెను. కాని దీనిని నీవు ఇతరులకు ఉపదేశించినచో వెంటనే నీతల ఖండితునని ఇంద్రుడు అతనితో అనెను. తరువాత కొంతకాలమునకు అశ్వినిదేవతలు ఇరువురును దధ్యజ్‌ ఆథర్వణుని కడకు వెళ్లి తమకు బ్రహ్మ విద్య నుపదేశింపుమని అతనిని ప్రార్దింతిరి. నేను మీకది యుపదేశించినచో ఇంద్రుడు నా శిరము ఖండించునని అతడు వారితో ననెను. అపుడు అశ్వినిదేవత లామునితో ఇట్లనిరి: మేము నీ తలను ఖండించి దానిని మఱియొకచోట దాచెదము. గుఱ్ఱపుతలను నీమెడకు కతికింతుము. ఆశిరస్సుతో మాకు బ్రహ్మవిద్య నుపదేశింపుము. ఇంద్రుడు అది తెలిసి వచ్చి ఆ తలను ఖండించును. తరువాత మరల మేము నీవాస్తవ శిరస్సు నీ కతికింతుము. అనంతరము నీవు నీ వాస్తవశిరస్సుతోనే మాకు బ్రహ్మవిద్యను కడముట్ట ఉదేశింపవచ్చును. ఇట్లు ఇంద్రుని ప్రతిజ్ఞయు మా పనియునెరవేరును అనిరి. అందువలకు దధ్యజ్‌ ఆథర్వణుడు అంగీకరించెను. తరువాత అంతయు ఇట్లే జరిగెను. అను కథ వేదముల యందు ప్రసిద్దమైయున్నది. అని నీలకంఠపండితులు వ్రాసినారు.

(3) స్కం-7; అ-37; శ్లో-13; స్షార్టి ముక్తి ర్నామ దేవ్యాః పురసమీపే పురాంతరం నిర్మాయ సేవాం కుర్వాణస్య అవస్దితిః శ్రీదేవి వసించు పురమునకు సమీపమున మరియొక పురమును నిర్మించుకొని దానియందు తాను నివసించుచు శ్రీదేవి సేవను చేయుచుండు సాధకుని సిథతి స్షార్టి ముక్తి. అని లక్ష్మీధర పండితులు చెప్పినారు-పరిష్కర్త.

ఇది శ్రీదేవి భాగవత మహాపురాణ మందలి సప్తమ స్కంధమున దేవీగీత యందు నలువదవ యధ్యాయము.

శ్రీరస్తు. సప్తమ స్కంధము సమాప్తము.

శ్రీ వేదవ్యాసుల ముఖ కమలము నుండి వెలువడివన శ్రీ దేవిభాగవత మందు రెండువేలరెండు వందల యేబది శ్లోకములు గల సప్తము సఖంధము సమాప్తము.

Sri Devi Bagavatham-2    Chapters