sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

9. నవమోzధ్యాయః - సృష్టిక్రమ నిరూపణము

సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లు పలికినాడు.

అథ బ్రహ్మా స్వపుత్రాంస్తానాదిదేశ చ సృష్టయే | సృష్టిం ప్రచక్రతుస్తే సర్వే విప్రేంద్ర నారదం వినా || 1

తరువాత బ్రహ్మదేవుడు మిగిలిన పుత్రులను సృష్టి చేయమని ఆజ్ఞాపించెను. నారదుడు తప్ప మిగిలిన అతని పుత్రులు సృష్టి చేయుటకు మొదలుపెట్టిరి.

మరీచేర్మనసో జాతః కశ్యపశ్చ ప్రజాపతిః | అత్రేః నేత్రమలాచ్చంద్రః క్షీరోదే చ బభూవ హ || 2

ప్రచేతసోzపి మనసో గౌతమశ్చ బభూవహ | పులస్త్యమానసః పుత్రో మైత్రావరుణ ఏవచ || 3

మనోశ్చ శతరూపాయాం తిస్రః కన్యాః ప్రజజ్ఞిరే | ఆకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిస్తాః పతివ్రతాః || 4

ప్రియవ్రతోత్తానపాదౌ ద్వౌ చ పుత్రౌ మనోహరౌ | ఉత్తానపాదతనయో ధ్రువః పరమ ధార్మికః || 5

ఆకూతిం రుచయే ప్రాదాద్దక్షాయాథ ప్రసూతికాం | దేవహూతిం కర్దమాయ యత్పుత్రః కపిలః స్వయం || 6

ప్రసూత్యాం దక్షబీజేన షష్టికన్యాః ప్రజజ్ఞిరే | అష్టౌ ధర్మాయ స దదౌ రుద్రాయైకాదశ స్మృతాః || 7

శివాయైకాం సతీం ప్రాదాత్‌ కశ్యపాయ త్రయోదశ | సప్తవింశతి కన్యాశ్చ దక్షశ్చంద్రాయ దత్తవాన్‌ || 8

మరీచి మహర్షియొక్క మనస్సునుండి కశ్యపప్రజాపతి, అత్రిమహర్షి నేత్రమలము క్షీరసముద్రమున పడగా అందులోనుండి చంద్రుడు, ప్రచేతసుని యొక్క మనస్సునుండి గౌతమ మహర్షి, పులస్త్యుని మనస్సునుండి మైత్రావరుణుడు ఉద్భవించిరి. మనువునకు అతని భార్యమైన శతరూపయందు ముగ్గురు కన్యలు ఉద్భవించిరి. వారిపేర్లు ఆకూతి, దేవహూతి, ప్రసూతి. ఇంకను ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను ఇద్దరు కొడుకులు కలిగిరి. ఉత్తానపాదుని పుత్రుడు పరమధార్మికుడైన ధ్రువుడు. మనువు తన కూతురైన అకూతిని రుచియనువానికిచ్చెను. దక్షునికి ప్రసూతిని, కర్దమునకు దేవహూతి నొసగెను. వారిపుత్రుడు కపిలమహర్షి. దక్ష ప్రజాపతివలన 'ప్రసూతి'కి అరువది కన్యకలు పుట్టిరి. వారిలో ఎనమండుగురిని ధర్మునకు, రుద్రునకు పదకొండుమందిని, కశ్యపమహర్షికి పదముగ్గురిని, చంద్రునకు ఇరువది ఏడుమందిని, శివునకు సతియను కన్యను భార్యగా నిచ్చెను.

నామాని ధర్మపత్నీనాం మత్తో విప్ర నిశామయ | శాంతిః పుష్టిః ధృతిస్తుష్టిః క్షమా శ్రద్ధా మతిః స్మృతిః || 9

శాంతేః పుత్రశ్చ సంతోషః పుష్టేః పుత్రో మహానభూత్‌ | ధృతేర్దైర్యం చ తుష్టేశ్చ హర్షదర్పౌ సుతౌ స్మృతౌ || 10

క్షమాపుత్రః సహిష్ణుశ్చ శ్రద్ధాపుత్రశ్చ ధార్మికః | మత్తేర్‌జ్ఞానాభిధః పుత్రః స్మృతేర్జాతిస్మరోమహాన్‌ || 11

పూర్వపత్న్యాం చ మూర్త్యాం చ నరనారాయణావృషీ | బభూవురేతే ధర్మిష్ఠా ధర్మపుత్రాశ్చ శౌనక || 12

ధర్ముని భార్యల పేర్లు వరుసగా శాంతి, పుష్టి, ధృతి, తుష్టి, క్షమ, శ్రద్ధ, మతి, స్మృతి. శాంతి పుత్రుడు సంతోషుడు, పుష్టి కొడుకు మహాన్‌, ధృతికి ధైర్యుడు, తుష్టికి హర్షదర్పులనే పుత్రులు క్షమకు సహిష్ణువు, శ్రద్ధకు ధార్మికుడు, మతికి జ్ఞానుడు, స్మృతికి జాతిస్మరుడు, ధర్ముని మొదటిభార్యయైన మూర్తికి నరనారాయణులను ఋషులు ఉద్భవించిరి.

నామాని రుద్రపత్నీనాం సావధానం నిబోధ మే | కళా, కళావతీ కాష్ఠా కాళికా కలహప్రియా || 13

కందళీ, భీషణా రాస్నా ప్రయోచా భూషణా శుకీ | ఏతాసాం బహవః పుత్రా బభూవుః శివపార్షదాః || 14

సా సతీ స్వామినిందాయాం తనుం తత్యాజ యజ్ఞతః |పునర్భూత్వా శైలపుత్రీ లేభే సా శంకరం ప్రియం || 15

కళ, కళావతి, కాష్ఠా, కాళికా, కలహప్రియా, కందళీ, భీషణా, రాస్నా, ప్రమోచ, భూషణ, శుకి అనువారు ఏకాదశ రుద్రుల భార్యలు. వీరికి కలిగిన పుత్రులంతా శివునికి అనుచరులైరి.

శివుని భార్యయైనసతి తండ్రియైన దక్షుడు చేసిన యజ్ఞములో తన భర్తకు జరిగిన నిందను భరించలేక శరీరమును వదలి తరువాతి జన్మలో హిమవత్పర్వతమునకు కూతురుగా పుట్టి శంకరుని భార్యగా నయ్యెను.

కశ్యపస్య ప్రియాణాం చ నామాని శ్రుణు ధార్మిక | అదితిర్దేవమాతావై దైత్యమాతా దితిస్తథా || 16

సర్పమాతా తథా కద్రూర్వినతా పక్షిసూస్తథా | సురభిశ్చ గవాం మాతా మహిషాణాం చ నిశ్చితం || 17

సారమేయాదిజంతూనాం సరమా సూశ్చతుష్పదాం | దనుః ప్రసూర్దానవానాం అన్యాశ్చేత్యేవమాదికాః || 18

కశ్యపునికి దేవతల తల్లియైన అదితి, దైత్యులకు తల్లియైన దితి, సర్పములకు తల్లియగు కద్రువ, పక్షులకు తల్లియైన వినత, గోవులకు, మహిషములకు మాతయైన సురభి, సారమేయములు మొదలగు చతుష్పాద జంతువులకు తల్లియైన సరమ, దానవులకు తల్లియైన దనువు మొదలైన భార్యలున్నారు.

ఇంద్రశ్చ ద్వాదశాదిత్యాః ఉపేంద్రాద్యాః సురామునే | కథితాశ్చాదితేః పుత్రాః మహాబలపరాక్రమాః || 19

ఇంద్రపుత్రో జయంతశ్చ బ్రహ్మన్‌ శచ్యామజాయత | ఆదిత్యస్య సవర్ణాయాం కన్యాయాం విశ్వకర్మణః || 20

శ##నైశ్చరయమౌ పుత్రౌ కాళిందీ కన్యకా తథా | ఉపేంద్రవీర్యాత్‌ పృథ్వ్యాం తు మంగళః సమజాయత || 21

ఇంద్రుడు, ద్వాదశాదిత్యులు ఉపేంద్రుడు మొదలైన దేవతలు అదితిపుత్రులు. ఇంద్రునియొక్క కొడుకు జయంతుడు. ఇతడు శచీదేవియందు కలిగెను. ఆదిత్యునికి విశ్వకర్మకూతురైన సవర్ణయందు శని, యముడు, అనుకొడుకులు కాళింది అనుకూతురుపుట్టెను.

శౌనక ఉవాచ- శౌనకమహర్షి ఇట్లనెను-

కథం సౌతే స చోపేంద్రాన్మంగళః సమజాయత | వసుంధరాయాం బలవాంస్తన్మే వ్యాఖ్యాతుమర్హసి || 22

సూతమహర్షీ! ఉపేంద్రునకు భూమియందు బలపరాక్రమశాలియైన మంగళు డేవిధముగా పుట్టెనో నాకు చక్కగా వివరింపుము.

సౌతిరువాచ-సౌతిమహర్షి ఇట్లు చెప్పెను-

ఉపేంద్రరూపమాలోక్య కామార్తా చ వసుంధరా | విధాయ సుందరీవేషం అక్షతా ప్రౌఢ¸°వనా || 23

మలయే నిర్జనే రమ్యే చారుచందనపల్లవే | చందనోక్షితసర్వాంగం రత్నభూషణభూషితం || 24

తం సుశీలం శయానం చ శాంతం సస్మితమీప్సితం | సస్మితా తస్య తల్పే చ సహసా సముపస్థితా || 25

సురమ్యాం మాలతీమాలాం దదౌ తసై#్మ వరాననా | సుగంధి చందనం చారు కస్తూరీ కుంకుమాన్వితం || 26

ఉపేంద్రస్తన్మనో జ్ఞాత్వా కామినీ కామపీడితాం | నానాప్రకారశృంగారం చకార చ తయా సహ || 27

తదంగ సంగసంసక్తా మూర్ఛాంప్రాప సతీ తదా | మృతేవ నిద్రితేవాసౌ బీజాధానం కృతే హరౌ || 28

తాం విలగ్నాం చ సుశ్రోణీం సుఖసంభోగమూర్ఛితాం | బృహన్ముక్త నితంబాం చ సస్మితాం విపులస్మితాం || 29

క్షణం వక్షసి కృత్వాతాం తదోష్ఠం చ చుచుంబహ | విహాయ తత్ర రహసి జగామ పురుషోత్తమః || 30

ఊర్వశీ పథి గచ్ఛంతీ బోధయామాస తాం మునే | సా చ పప్రచ్ఛ వృత్తాంతం కథయామాస భూశ్చ తాం || 31

వీర్యసంవరణం కర్తుం సాచాశక్తా చదుర్బలా | ప్రవాళస్యాకరే త్రస్తా వీర్యన్యాసం చకార సా || 32

తేన ప్రవాళవర్ణశ్చ కుమారః సమపద్యత | తేజసా సూర్యసదృశో నారాయణ సుతోమహాన్‌ || 33

మంగళస్య ప్రియా మేధా తస్య ఘంటేశ్వరో మహాన్‌ | వ్రణదాతాzతితేజస్వీ విష్ణుతుల్యో బభూవ హ || 34

ఉపేంద్రుని సుందర రూపమును చూచి భూదేవి మోహించి ప్రౌఢ వయస్సుగల సుందరీ రూపమును ధరించి జనరహితమైన అందమైన చందన వృక్షములతో విరాజిల్లే మలయ పర్వత ప్రాంతమున తన సర్వావయవములపై చందనము పూసికొని మంచి రత్న భూషణములతో చిరునవ్వుతో పరుపుపై పడుకొని ఉన్న ఉపేంద్రుని సమీపించి, అతని శయ్యపై కూర్చుండి అందముగా నున్న మాలతీ మాలను ఉపేంద్రుని మెడలో వేసెను. అట్లే కస్తూరీ కుంకుమలతో నున్న చందనమును అతనికి అద్దినది. ఉపేంద్రుడు భూదేవి మనస్సును గుర్తించి అనేక విధములైన శృంగార చేష్టలు చేసెను. శ్రీహరి శరీరము తగిలి బీజావాపము జరుగగా ఆమె మూర్ఛను పొందినది. నిద్రపోయినట్లు ఆమె మైమరిచినది. ఉపేంద్రుడు సుఖసంభోగపీడిత, సస్మితయైన భూదేవిని క్షణకాలము అక్కున చేర్చుకొని ఆమెను ముద్దులాడి వెళ్ళిపోయెను.

ఆకాశమార్గములో పోతున్న ఊర్వశి మలయపర్వత ప్రాంతమున పడియున్న భూదేవిని తట్టిలేపి ఆమె వృత్తాంతమును అడిగి తెలుసుకొనెను. ఆ భూదేవి ఉపేంద్రుని వీర్యమును భరించలేక పగడాల చిప్పలో ఆ వీర్యమునుంచెను. అందువల్లనే నారాయణుని పుత్రుడైన కుజుడు తేజస్సున సూర్యునివంటివాడై పగడపు కాంతిని కల్గియుండెను.

ఆ మంగళునకు భార్యని మేధ. వారిద్దరికి మిక్కిలి తేజస్సుకలవాడు, విష్ణుమూర్తితో సమానమైన ఘంటేశ్వరుడు కలిగెను.

దితేఃహిరణ్యకశిపు హిరణ్యాక్షౌ మహాబలౌ | కన్యా చ సింహికా విప్ర సైంహికేయశ్చ తత్సుతః || 35

నిర్‌రుతిః సింహికా సా చ తేన రాహుశ్చ నైఋతః | సూకరేణ హిరణ్యాక్షోzప్యనపత్యో మృతో యువా || 36

హిరణ్యకశిపోః పుత్రః ప్రహ్లోదో వైష్ణవాగ్రణీః | విరోచనశ్చ తత్పుత్రః తత్పుత్రశ్చ బలిః స్వయం || 37

బలేః పుత్రో మహాయోగీ జ్ఞానీ శంకరకింకరః | దితేర్వంశశ్చ కథితః కద్రూవంశం నిబోధ మే || 38

దితికి హరణ్యకశిపు, హిరణ్యాక్షులను ఇద్దరు కొడుకులు, సింహిక అనుకూతురు పుట్టినది. నిర్‌ఋతి సింహికల పుత్రుడు నైఋతుడు, సైంహికేయుడు అనే పేర్లు గల రాహువు. ఇక హిరణ్యాక్షుడు ఆదివరాహ మూర్తిచేత సంతానము కలుగక ముందే చంపబడినాడు. హిరణ్యకశిపునకు వైష్ణవులలో శ్రేష్ఠుడైన ప్రహ్లుదుడు, అతనికి విరోచనుడు, విరోచనునకు బలి చక్రవర్తి, అతనికి మహాజ్ఞాని, శంకరుని సేవకుడైన మహాయోగి పుత్రుడు.

ఇది దితివంశము. కద్రూవంశమును ఇప్పుడు చెప్పుచున్నాను.

అనంతం వాసుకిం చైవ కాళీయం చ ధనంజయం | కర్కోటకం తక్షకం చ పద్మమైరావతం తథా || 39

మహాపద్మం చ శంకుం చ శంఖం సంవరణం తథా | ధృతరాష్ట్రం చ దుర్ధర్షం దుర్జయం దుర్ముఖం బలం || 40

గోక్షం గోకార్ముకం చైవ విరూపాదీంశ్చ శౌనక| న తేషాం ప్రవరాశ్చైవ యావత్యః సర్పజాతయః || 41

కన్యకా మనసా దేవీ కమలాంశసముద్భవా | తపస్వినీనాం ప్రవరా మహాతేజస్వినీ శుభా || 42

యత్పతిశ్చ జరత్కారుః నారాయణకులోద్భవః | ఆస్తికః తనయో యస్యాః విష్ణుతుల్యశ్చ తేజసా || 43

ఏతేషాం నామమాత్రేణ నాస్తి నాగభయం నృణాం | కద్రూవంశో నిగదితః వినతాయాః శృణుష్వ మే || 44

కద్రువుకు అనంతుడు, వాసుకి, కాళియుడు, ధనంజయుడు, కర్కోటకుడు, తక్షకుడు, పద్మము, ఐరావతము, మహాపద్మము, శంకు, శంఖుడు, సంవరణుడు, ధృతరాష్ట్రుడు, దుర్ధర్షుడు, దుర్జయుడు, దుర్ముఖుడు, గోక్షుడు, గోకార్ముకుడు, విరూపాక్షుడు మొదలైనవారు కొడుకులు. కూతురు మహాతపస్విని, లక్ష్మీదేవి అంశమునుండి పుట్టిన మనసాదేవి. ఈమె భర్త నారాయణుని కులమున పుట్టిన జరత్కారువు. వీరి పుత్రుడు ఆస్తీక మహాముని.

కద్రూ పుత్రుల పేర్లు విన్నంత మాత్రమున సర్పభయం తొలిగిపోతుంది. ఇక వినత యొక్క వంశమున పుట్టిన వారి పేర్లు వినుము.

వైనతేయారుణౌ పుత్రౌ విష్ణుతుల్యపరాక్రమౌ | తౌ బభూవుః క్రమేణౖవ యావత్యః పక్షిజాతయః || 45

గావశ్చమహిషాశ్చైవ సురభిప్రవరా ఇమే | సర్వే వై సారమేయాశ్చ బభూవుః సరమాసుతాః || 46

దానవాశ్చ దనోర్వంశాః అన్యాః సామాన్యజాతయః | ఉక్తః కాశ్యపవంశశ్చ చంద్రాఖ్యానం నిబోధమే || 47

వినతకు విష్ణుమూర్తితో సమానమైన తేజస్తుకల గరుత్మంతుడు, ఆరుణి అను కొడుకులు కలిగిరి. వీరివలన క్రమముగా తక్కిన పక్షిజాతులన్ని కలిగినవి.

గోవులు, మహిషములు సురభి వంశములో పుట్టినవి. సారమేయములన్నీ సరమవంశములో పుట్టినవి. దనువు యొక్క వంశములో దానవులు పుట్టినారు. ఇవి కాశ్యపవంశములో ఉన్నవారి పేర్లు. ఇక చంద్రుని సంబంధించిన కథను ఓ శౌనకమునీ! వినుము -

నామాని చంద్రపత్నీనాం సావధానం నిశామయ | అత్యపూర్వం చ చరితం పురాణషు పురాతనం || 48

అశ్వినీ భరణీ చైవ కృత్తికా రోహిణీ తథా | మృగశీర్షా తథాzర్ద్రాచ పూజ్యా సాధ్వీ పునర్వసుః || 49

పుష్యాశ్లేషా మఘా పూర్వఫల్గుణ్యుత్తరఫల్గుణీ | హస్తా చిత్రా తథా స్వాతీ విశాఖా చానురాధికా || 50

జ్యేష్ఠా మూలా తథా పూర్వాషాఢా చైవోత్తరా స్మృతా | శ్రవణా చ ధనిష్ఠా చ తథా శతభిషక్ఛుభా || 51

పూర్వాభాద్రోత్తరాభాద్రా రేవత్యంతా విధుప్రియాః | తాసాం మధ్యేచ సుభగా రోహిణీ రసికా వరా || 52

సంతతం రసభావేన చకార శశినం వశం | రోహిణ్యపగతశ్చంద్రో న యాత్యన్యాం చ కామినీం || 53

సర్వా భగిన్యః పితరం కథయామాసురాదృతాః | సపత్నీకృతసంతాపం ప్రాణనాశకరం పరం || 54

దక్షః ప్రకుపితశ్చంద్ర మశపన్మంత్ర పూర్వకం | ద్రుతం శ్వశురశాపేన యక్ష్మగ్రస్తో బభూవ సః || 55

దినే దినే యక్ష్మణా స క్షీయమాణశ్చ దుఃఖితః | వపుష్యర్ధం క్షీయమాణ శంకరం శరణం య¸° || 56

దృష్ట్యా చంద్రం శంకరశ్చ క్లేశితం శరణాగతం | కరుణాసాగరస్తసై#్మ కృపయా చాభయం దదౌ || 57

నిర్ముక్తం యక్ష్మణా కృత్వా స్వకపోలే స్థలం దదౌ | అమరో నిర్భయో భూత్వా స తస్థౌ శివశేఖరే || 58

తం శివః శేఖరే కృత్వా చ్శాభవచ్చంద్రశేఖరః | నాస్తి దేవేషు లోకేషు శివాచ్ఛరణపంజరః || 59

దక్షకన్యాః పతిం ముక్తం ధృష్ట్వా చ రురుదుః పునః | ఆజగ్ముః శరణం తాతం దక్షం తేజస్వినాం వరం || 60

ఉచ్చైశ్చ రురుదుర్గత్వా నిహత్యాంగం పునః పునః | తమూచుః కాతరం దీనాః దీననాథం విధేః సుతం || 61

చంద్రుని భార్యల పేర్లు వరుసగా అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్రా, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వఫల్గుణి, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అనువారు. వారిలో రోహిణి మిక్కిలి అందగత్తె, రసికురాలు. ఆమె తన శృంగార చేష్టలతో చంద్రుని వశము చేసికొన్నది. రోహిణి ఇంటికి వెళ్ళిన చంద్రుడు ఇతర భార్యల ఇళ్ళకు వెళ్ళేవాడు కాడు. అందువలన రోహిణి తప్ప మిగిలిన అక్కచెల్లెండ్లందరు తండ్రి దగ్గరకు వెళ్ళి చావు కంటె గొప్పదైన సవతిబాధను చెప్పుకొనిరి. అందువల్ల దక్షుడు కోపముతో చంద్రుని మంత్రపూర్వకముగా శపించెను. దక్ష శాపమునకు భయపడి పరుగెత్తిన చంద్రునికి క్షయ వ్యాధి సంప్రాప్తించెను. ఆ క్షయవ్యాధివల్ల ప్రతిదినము చంద్రుడు క్షీణించుచు దుఃఖితుడాయెను. తనయొక్క సగము శరీరము క్షీణించగా శంకరుని అతడు శరణువేడెను. శంకరుడు బాధలలో ఉండి తనను శరణుపొందిన చంద్రుని చూచి దయతో అభయమతనికి నిచ్చెను. శంకరుడాతని క్షయ రోగ ముక్తుని గావించి తనకపోలస్థలమున స్థలము నిచ్చెను. చంద్రుడు శివుని అనుగ్రహము వలన అమరుడై భయవిముక్తుడు కాగా శివుని తలపై నుండెను. ఇట్లు చంద్రుడు తలపై ఆభరణముగా ఉన్నందువలన శివుడు చంద్రశేఖరుడాయెను. సమస్త దేవతలలో, సమస్తలోకములలో శివునివలె శరణు కోరిన వారిని రక్షించువాడెవడు లేడు.

దక్షకన్యలు తమ భర్తముక్తుడాయెనని మరల ఏడ్చుచు మహాతేజస్వి, తండ్రియైన దక్షుని దగ్గరకు వెళ్ళి మాటిమాటికి రొమ్ము కొట్టుకొనుచు పెద్దగా దుఃఖించిరి. అట్లే దైన్యము కల ఆ దక్షకన్యలు దీనుల రక్షించువాడు, బ్రహ్మదేవుని పుత్రుడైన దక్షునితో ఈవిధముగా అనిరి.

దక్షకాన్య ఊచుః - దక్షకన్యలిట్లనిరి.

స్వామి సౌభాగ్యలాభాయ త్వముక్తోzస్మాభిరేవ చ | సౌభాగ్యమస్తు నస్తాత గతః స్వామీ గుణాన్వితః || 62

స్థితే చక్షుషి హే తాత దృష్టం ధ్వాంతమయం జగత్‌ | విజ్ఞాతమధునాస్త్రీణాం పతిరేవ హి లోచనం || 63

పతిరేవ గతిః స్త్రీణాం పతిః ప్రాణాశ్చ సంపదః | ధర్మార్థ కామమోక్షాణాం హేతుః సేతుర్భవార్ణవే || 64

పతిర్నారాయణః స్త్రీణాం వ్రతం ధర్మః సనాతనః | సర్వం కర్మ వృథా తాసాం స్వామినాం విముఖాశ్చ యాః || 65

స్నానం చ సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దక్షిణా | సర్వదానాని పుణ్యాని వ్రతాని నియమాశ్చ యే || 66

దేవార్చనం చానశనం సర్వాణి చ తపాంసి చ | స్వామినః పాదసేవాయాః కళాం నార్హంతి షోడశీం || 67

సర్వేషాం బాంధవానాం చ ప్రియః పుత్రశ్చ యోషితాం | సః ఏవ స్వామినోzoశశ్చ శతపుత్రాత్పరః పతిః || 68

అసద్వంశప్రసూతా యా సా ద్వేష్టి స్వామినం సదా | యస్యా మనశ్చలం దుష్టం సంతతం పరపూరుషే || 69

పతితం రోగినాం దుష్టం నిర్ధనం గుణహీనకం | యువానం చైవ వృద్ధం వా భ##జేత్తం నత్యజేత్సతీ || 70

సగుణం నిర్గుణం వాపి ద్వేష్టి యా సంత్యజేత్పతిం | పచ్యతే కాల సూత్రే సా యావచ్చంద్ర దివాకరౌ || 71

కీటైః శుకతుల్యైశ్చ భక్షితా సా దివానిశం | భుంక్తే మృతవసామాంసం పిబేన్మూత్రం చ తృష్ణయా || 72

గృధ్రః కోటి సహస్రాణి శతజన్మాని సూకరః | శ్వాపదః శతజన్మాని సాభ##వేద్బందుహా తతః || 73

తతో మానవజన్మాని లభేచ్చేత్పూర్వకర్మణః | విధవా ధనహీనా చ రోగయుక్తా భ##వేద్ధ్రువం || 74

దేహి నః కాంతదానం చ కామపూరం విధేః సుత | విధాత్రా సదృశస్త్వం చ పునః స్రష్టుం క్షమో జగత్‌ || 75

కన్యానాం వచనం శ్రుత్వా దక్షః శంకర సన్నిధిం | జగామ శంభుస్తం దృష్ట్యా సముత్థాయ ననామ సః || 76

దక్షస్తస్యాశిషం కృత్యా సమువాచ కృపాంనిధిం | తత్యాజ దుర్ధర్షో దృష్ట్యా చ ప్రణతం శివం || 77

తండ్రీ! భర్తృ సౌభాగ్యము కలిగి ఉండుడని ఇంతకుముందు నీవే మమ్ములనాశీర్వదించితివి. ఇప్పుడు మంచి గుణములు కల మా భర్త మానుండి దూరమైనాడు. కళ్ళు ఉంటేనే ప్రపంచము చీకటిగా ఉన్నది లేనిది తెలుస్తుంది. అట్లే మాకు ఇప్పుడు భర్త యొక్క ప్రాధాన్యము తెలిసినది. స్త్రీలకు భర్త కంటివంటివాడు. అతడే ఆధారము, ప్రాణములు, సంపద. ఈ సంసారమనే సముద్రములో సేతువువంటివాడు. ధార్మర్థ కామ మోక్షములను చతుర్వర్గములు పొందుటకు భర్తయే కారణము. అతడే స్త్రీలకు నారాయణుడు. వ్రతము, సనాతన ధర్మము. భర్త అంటే పడనివారికి వారు చేసిన సమస్త కర్మములు వృథా కాగలవు. సమస్త పుణ్యతీర్థములలో చేసిన స్నానములు, సమస్తయజ్ఞములలో ఇచ్చిన దక్షిణలు, సమస్త దానములు, సమస్త పుణ్యములు, సమస్త వ్రతములు, అన్ని విధములైన నియమములు, భగవదర్చన, ఉపవాసదీక్షలు, అన్ని విధములైన తపస్సులు భర్త పాదసేవయొక్క పదునారవ కళకు సమానము కావు. బంధువులందరికి ఇష్టమైనవాడు ఐన కుమారుడు భర్తయొక్క అంశస్వరూపము, అందువలన భర్త నూరుగురు పుత్రులకంటె గొప్పవాడు. మంచి కులములో పుట్టని స్త్రీ భర్తను ద్వేషించును. ఆమె మనస్సు ఎప్పుడు చంచలమై, పరపురుషుని యందు నిమగ్నమై యుండును. భర్త మంచివాడైనా, చెడ్డవాడైనా పతితుడైనా, రోగియైనా, దుష్టుడైనా, ధనహీనుడైనా, యువకుడైనా, ముసలివాడైనా పతివ్రతయైన స్త్రీ అతనిని వదలివేయదు. అటువంటి భర్తను ఏ స్త్రీ అయితే ద్వేషించునో, వదిలివేయునో ఆ స్త్రీ సూర్యచంద్రులున్నంతవరకు నరకమునుండును. అచ్చట శునకములంత ఎత్తైన కీటకములు ఆమెను రాత్రింబగళ్ళు తినుచుండును. ఆమె చనిపోయిన వారి వసను, మాంసమును తింటూ దప్పిచే మూత్రము త్రాగును. తరువాత వేయికోట్ల జన్మలు గద్దగాను, వందజన్మలు పందిగాను, వందజన్మలు పులిగాను ఆతరువాత పూర్వసుకృతమువలన మానవ జన్మనెత్తినా విధవగానో, బీదస్త్రీగానో, రోగముతో బాధపడుతూనో ఉండును.

అందువలన బ్రహ్మ దేవుని పుత్రుడైన ఓతండ్రీ! నీవు మాకామమును దీర్చు భర్తృదానమును చేయుము. నీవు బ్రహ్మదేవునివలె సృష్టించుటకు, రక్షించుటకు, మరల సృష్టించుటకు సమర్థుడవు. ఈవిధముగా తనను వేడుకొనుచున్న పుత్రికల మాటలు విని దక్షప్రజాపతి శంకరుని సన్నిధికేగెను. శంకరుడు దక్షుని చూడగానే లేచి నమస్కరించెను. దక్షుడు తనకన్నా వయస్సులో చిన్నవాడు, అల్లుడు ఐన శంకరునికి ఆశీస్సులిచ్చి, తన పూర్వకోపమును వదిలిపెట్టి తనకు నమస్కరిస్తున్న శివునితో ఈ విధముగా అనెను.

దేహి జామాతరం శంభో మదీయం ప్రాణవల్లభం | మత్సుతానాంచ ప్రాణానాం పరమేవ ప్రియం పతిం || 78

నచేద్దదాసి జామాతః మమ జామాతరం విభుం | దాస్యామి దారుణం శాపం తుభ్యం త్వం కేన ముచ్యసే || 79

దక్షస్య వచనం శ్రుత్వా తమువాచ కృపానిధిః | సుధాధికం చ వచనం బ్రహ్మాన్‌ శరణపంజరః || 80

ఓశంభూ! నాకు మిక్కిలి ప్రియమైన వాడు, నా పుత్రికలకు ప్రాణములకన్న మిన్నయైన వారి భర్త, నాఅల్లుడు ఐన చంద్రుని నాకిచ్చివేయుము, లేకపోయినచో నేను నీకు భయంకరమైన శాపము నిత్తును. ఎవరు కూడా దీనిని తప్పించలేరు. దక్షుని ఈ మాటలు కృపానిధి, శరణాగత రక్షకుడైన శంకరుడు విని అమృతముకంటె చల్లనైన మాటలు పల్కెను.

శివ ఉవాచ - శివుడిట్లు పల్కెను.

కరోషి భస్మసాచ్చేన్మాం దద్యా వా శాపమేవ చ | నాహం దాతుం సమర్థశ్చ చంద్రం చ శరణాగతం || 81

శివస్య వచనం శ్రుత్వా దక్షస్తం శప్తుముద్యతః | శివః సస్మార గోవిందం విపన్మోక్షణకారణం || 82

ఏతస్మిన్నంతరే కృష్ణో వృద్ధ బ్రాహ్మణవేషధృక్‌ | సమాయ¸° తయోర్మూలం తౌ తం చ నమతుః క్రమాత్‌ || 83

దత్వా శుభాశిషం తౌ స బ్రహ్మజ్యోతిః సనాతనః | ఉవాచ శంకరం పూర్వం పరిపూర్ణతమో ద్విజ || 84

దక్షుడా! నీవు నన్ను భస్మము చేసినా, లేక నాకు శాపము పెట్టినా శరణాగతుడైన చంద్రుని మాత్రము వదిలి పెట్టలేను. శివుని ఈ మాటలు విని దక్షుడు కోపముతో శపించబోయెను. శంకరుడప్పుడు ఆపదలనుండి తప్పించు విష్ణుమూర్తిని మనస్సులో తలచెను. అందువలన విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ వేషమున శివదక్ష ప్రజాపతుల దగ్గరికి రాగా వారిద్దరు వృద్ధ బ్రాహ్మణ వేషమున శివదక్ష ప్రజాపతుల దగ్గరికి రాగా వారిద్దరు వృద్ధ బ్రాహ్మణ వేషమున నున్న గోవిందునికి నమస్కరించిరి. విష్ణుమూర్తి వారిరువురరకు శుభాశీస్సులొసగి శంకరునితో ఈ విధముగా అనెను.

శ్రీ భగవానువాచ - భగవంతుడైన హరి ఇట్లనెను.

న చాత్మనః ప్రియః కశ్చిత్‌ శర్వ సర్వేషు బంధుషు | ఆత్మానం రక్ష దక్షాయ దేహి చంద్రం సురేశ్వర || 85

తపస్వినాం వరః శాంతః త్వమేవ వైష్ణవాగ్రణీః | సమః సర్వేషు జీవేషు హింసాక్రోధ వివర్జితః || 86

దక్షః క్రోధీ చ దుర్ధర్షః తేజస్వీ బ్రహ్మణః సుతః | శిష్టో బిభేతి దుర్ధర్షం న దుర్ధర్షశ్చ కంచన || 87

నారాయణవచశ్శ్రుత్వా హసిత్వా శంకరః స్వయం | ఉవాచ నీతిసారం చ నీతిబీజం పరాత్పరం || 88

శంకరుడా తనకంటె ప్రియమైన వస్తువు సమస్త బంధువు లయందెచ్చట కనిపించదు. అందువలన నిన్ను నీవు రక్షించుకొని చంద్రుని దక్షునికి ఇచ్చివేయుము. నీవు తపస్సు చేయువారిలో ఉత్తముడవు. శాంతుడవు, విష్ణుభక్తులలో శ్రేష్ఠుడవు. హింస, కోపము వదలి సమస్త జీవులయందు సమానముగా ఉన్న వాడవు. దక్షుడు ముక్కోపి, దుష్టుడు, తేజస్వి, బ్రహ్మయొక్క పుత్రుడు. మంచివాడు చెడ్డవానికి భయపడును కాని చెడ్డవాడు అట్లు కాదుకదా! నారాయణుని యొక్క ఈ మాటలు విని శంకరుడు నవ్వుచు నీతిసారము నీతిబీజము ఐన మాటలిట్లు పలికెను.

శంకర ఉవాచ - శంకరుడిట్లు పలికెను.

తపో దాస్యామి తేజశ్చ సర్వసిద్ధిం చ సంపదం | ప్రాణాంశ్చ న సమర్థోzహం ప్రదాతుం శరణాగతుం || 89

యో దదాతి భ##యేనైవ ప్రపన్నం శరణాగతం | తం చ ధర్మః పరిత్యజ్య యాతి శప్త్వా సుదారుణం || 90

సర్వం త్యక్తుం సమర్థోzహం న స్వధర్మం జగత్ప్రభో | యః స్వధర్మవిహీనశ్చ స చ సర్వబహిష్కృతః || 91

యశ్చధర్మం సదా రక్షేత్‌ ధర్మస్థం పరిరక్షతి | ధర్మం వేదేశ్వర త్వంచ కిం మాం బ్రూహి స్వమాయయా || 92

త్వం సర్వమాతా స్రస్టా చ హంతా చ పరిణామతః | త్వయి భక్తిర్దృఢా యస్య తస్య కస్మాద్భయం భ##వేత్‌ || 93

శంకరస్య వచః శ్రుత్వా భగవాన్‌ సర్వభావవిత్‌ | చంద్రం చంద్రాద్వినిష్కృష్య దక్షాయ ప్రదదౌ హరిః || 94

ప్రతస్థావర్ధచంద్రశ్చ నిర్వ్యాధిః శివశేఖరే | నిజగ్రాహ పరం చంద్రం విష్ణుదత్తం ప్రజాపతిః || 95

యక్ష్మగ్రస్తం చ తం దృష్ట్వా దక్షస్తుష్టావ మాధవం | పక్షే పూర్ణం క్షతం పక్షే తం చకార హరిః స్వయం || 96

కృష్ణస్తేభ్యో వరం దత్వా జగామ స్వాలయం ద్విజ | దక్షశ్చంద్రం గ్రహీత్వా చ కన్యాభ్యః ప్రదదౌ పునః || 97

చంద్రస్తాశ్చ పరిప్రాప్య విజహార దివానిశం | సమం దదర్శ తాః సర్వాః తత్ర్పభృత్యేవ కంపితః || 98

నేను నాతపఃఫలితమునిచ్చెదను. నాతేజస్సును, నాసర్వసిద్ధులను, సంపదను, చివరకు ప్రాణములనైన ఇచ్చెదను కాని శరణాగతుడైన వానిని వదలుకోలేను. ఎవరైతే భయపడి శరణాగతుడైనవానిని ఇతరులకిస్తారో వారిని ధర్మము భయంకరమైన శాపమునిచ్చి అతనిని వదిలివేయును. నేను అన్నిటిని వదులుకొందును కాని నా ధర్మమును మాత్రము వదలిపెట్టలేను. స్వధర్మమును వదలుకొనిన వాడు సర్వధర్మ బహిష్కృతుడు కాగలడు. ఎవరు తన ధర్మమును ఎల్లప్పుడు రక్షించుకొనునో అతనినది సర్వదా రక్షించును. వేదేశ్వర ! నీవు నీమాయచే నాకు ధర్మవిరుద్ధమైన దానిని చెప్పుచున్నావు. నీవు అన్నిటికి కారకుడవు. సృష్టిచేయువాడవు. 'రక్షించువాడవు. నశింపచేయువాడవు. నీపై భక్తి ఎవనికి దృఢముగానుండునో అతనికి భయమెక్కడిది. శంకరునిమాటలు సర్వభావములు తెలిసిన భగవంతుడు విని శంకరుని శిరస్సుపై నున్న చంద్రుని నుండి చంద్రుని వేరు చేసి దక్షునకు ఇచ్చివేసెను. క్షయవ్యాధి రహితుడైన చంద్రుడు శివుని శిరస్సుపై నుండెను. వ్యాధి సహితుడైన చంద్రుని విష్ణుమూర్తి ఈయగా దక్షుడు సంతోషించి అతనిని స్తుతించెను. విష్ణుమూర్తి చంద్రుడు ఒక పక్షములో క్రమముగా సంపూర్ణుడగునట్లు, ఇంకొక పక్షములో క్షీణించునట్లు చేసి వారి కందరికి వరములిచ్చి తన గోలోకమునకు తిరిగిపోయెను. దక్షప్రజాపతి హరి తనకు ఇచ్చిన చంద్రుని తీసికొని తన కూతుళ్ళకు మరల అప్పగించెను. చంద్రుడు నాటినుండి తన భార్యలందరితో కలిసి మెలిసి తిరుగుచు అందరిపై సమాన దృష్టితో ఉండెను.

ఇత్యేవం కథితం సర్వం కించిత్‌ సృష్టి క్రమం మునే | శ్రుతం చ గురువక్త్రేణ పుష్కరే ముని సంసది || 99

ఓశౌనకమహర్షీ! ఈ విధముగా నాకు గురువైన వేదవ్యాసుడు పుష్కర క్షేత్రములో నున్న మునుల సభలో నాకు చెప్పిన సృష్టి క్రమమున కొంత భాగమును నీకు చెప్పితిని

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ సౌతి శౌనక సంవాదే బ్రహ్మ ఖండే నవమోz ధ్యాయః ||

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణములో సౌతి శౌనక సంవాదమును బ్రహ్మఖండమున

తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters