sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

ద్వితీయోzధ్యాయః - పరబ్రహ్మ నిరూపణము

శౌనక ఉవాచ - శౌనకమహర్షి ఇట్లనెను.

కిమపూర్వం శ్రుతం సౌతే పరమాద్భుత మీప్సితం | సర్వం కథయ సంవ్యస్య బ్రహ్మఖండమనుత్తమం || 1

ఓ సౌతి మహర్షీ! అపూర్వము, అత్యద్భుతము ఉత్తమోత్తమమయిన ఆ బ్రహ్మఖండమును వివరించి పూర్తిగా చెప్పవలసినది.

సౌతిరువాచ - సౌతిమహర్షి ఇట్లు పలికెను.

వందేగురోః పాదపద్మం వ్యాసస్యామిత తేజసః | హరిం దేవాన్‌ ద్విజాన్‌ నత్వా ధర్మాన్‌ వక్ష్యే సనాతనాన్‌ || 2

యత్‌శ్రుతం వ్యాసనక్త్రేణ బ్రహ్మఖండమనుత్తమం | అజ్ఞానాంధతమోధ్వంసి జ్ఞానవర్త్మ ప్రదీపకం || 3

అత్యంత తేజస్సంపన్నుడు, నాకు గురువు ఐన వ్యాసమహర్షి పాదపంకజములను, శ్రీహరిని, ఇతరదేవతలను బ్రాహ్మణోత్తములను నమస్కరించి సనాతనములైన ధర్మములను చెప్పుదును.

మిక్కిలి శ్రేష్ఠమైనది, అజ్ఞానమనే చీకటిని నాశనముచేయునది, జ్ఞాన మార్గమును చూపించునది ఐన బ్రహ్మఖండమును నా గురుదేవులైన వ్యాసమహర్షివలన విన్నాను. దానినిప్పుడు చెప్పుదును.

జ్యోతిస్సమూహం ప్రళ##యే పురాసీత్‌ కేవలం ద్విజ | సూర్యకోటిప్రభం నిత్యం అసంఖ్యం విశ్వకారణం || 4

స్వేచ్ఛామయస్య చ విభోః తజ్జ్యోతిరుజ్వలం మహత్‌ | జ్యోతిరభ్యంతరే లోకత్రయమేవ మనోహరం || 5

తేషాముపరి గోలోకం నిత్యమీశ్వరవద్ద్విజ | త్రికోటి యోజనాయామవిస్తీర్ణం మండలాకృతి || 6

తేజఃస్వరూపం సుమహద్రత్నభూమిమయం పరం | అదృశ్యం యోగిభిఃస్వప్నే దృశ్యం గమ్యం చ వైష్ణవైః || 7

యోగేన ధృతమీశేన చాంతరిక్షస్థితం వరం | ఆధివ్యాధిజరామృత్యు శోక భీతి వివర్జితం || 8

సద్రత్న రచితాసంఖ్య మందిరైః పరిశోభితం | లయే కృష్ణయుతం సృష్టౌ గోపగోపీభి రావృతం || 9

ప్రళయ కాలమున సృష్టికారణమును, కోటిసూర్యుల కాంతితో సమానమైన కాంతికలదియు, నిత్యమైనది, అసంఖ్యాకమైన తేజః పుంజముమాత్రమే ఉండినది.

ఉజ్వలమైన ఆ జ్యోతి, స్వేచ్ఛామయుడైన పరమపురుషునిది. ఆ జ్యోతిః పుంజముమధ్య స్వర్గ, మర్త్య, పాతాళములనే మూడు లోకాలున్నాయి. ఆ ముల్లోకములపైన నాశనములేని గోలోకమున్నది. ఆ గోలోకము మూడుకోట్ల యోజన పరిమితమైనది. గుండ్రముగానున్నది. చాలా విలువకల రత్నములు పరచియున్నది. తేజః స్వరూపమైన ఆ గోలోకమును యోగులు కలలో సైతము చూడలేరు. కాని విష్ణుభక్తులకది స్పష్టముగా కనిపించును. వారు తమ అనన్యమైన భక్తివలన ఆ లోకమును పొందుతారు. అంతరిక్షములో ఉన్న ఆలోకము పరమపురుషుడైన శ్రీకృష్ణునిచే యోగశక్తివలన ధరించబడినది. ఆ లోకమున మనోవ్యథలు, వ్యాధులు, ముసలితనము, చావు, శోకము, భయము కనిపించవు. మంచిరత్నములతో కట్టబడ్డ అసంఖ్యాకమైన భవనములు ఉన్నాయి. ప్రళయకాలమున శ్రీకృష్ణుడు మాత్రముండగా, సృష్టికాలమున గోప, గోపికలతో శోభితమైయుండును.

తదధౌ దక్షిణ సవ్యే పంచాశత్కోటి యోజనాన్‌ | వైకుంఠం శివలోకం తు తత్సమం సుమనోహరం || 10

కోటియోజన విస్తీర్ణం వైకుంఠం మండలాకృతి | లయే శూన్యం చ సృష్టౌ చ లక్ష్మీనారాయణాన్వితం || 11

చతుర్భుజైః పార్షదైశ్చ జరామృత్యాది వర్జితం |

ఆ గోలోకమునకు క్రిందిభాగమున కుడి ఎడమ భాగములలో వైకుంఠము, శివలోకము ఉన్నాయి.

అందు వైకుంఠము కోటి యోజన విస్తీర్ణమై, మండలాకారమున ఉన్నది. ఆ లోకము లయ కాలమున శూన్యమైయుండును. సృష్టికాలమున నాల్గు భుజములతోనున్న సహచరులు కల లక్ష్మీ నారాయణులతో కనిపించును. అచ్చట కూడ ముసలితనము చావు, ఆధి వ్యాధులు మొదలైనవి కన్పించవు.

సవ్యే చ శివలోకం చ కోటియోజన విస్తృతం || 12

లయేశూన్యం చ సృష్టౌ చ సపార్షద శివాన్వితం |

వైకుంఠమునకు ఎడమ ప్రక్కనున్న శివలోకము కోటి యోజన పరిమితమైనది. ఆ లోకము సహితము లయకాలమున శూన్యముగానుండి, సృష్టికాలమున సహచరులతో నున్న పార్వతీపరమేశ్వరులతోనుండును.

గోలోకాzభ్యంతరే జ్యోతి రతీవ సుమనోహరం || 13

పరమాహ్లాదకం శశ్వత్పరమానందకారకం | ధ్యాయంతే యోగినః శశ్వద్యోగేన జ్ఞాన చక్షుషా || 14

తదేవానంద జనకం నిరాకారం పరాత్పరం | తత్‌జ్యోతిరంతరే రూపమతీవ సుమనోహరం || 15

నవీన నీరదశ్యామం రక్తపంకజ లోచనం | శారదీయ పార్వణందు శోభితం చామలాననం || 16

కోటికందర్పలావణ్యం లీలాధామ మనోహరం | ద్విభుజం మురళీహస్తం సస్మితం పీతవాససం || 18

శ్రీవత్సవక్షః సంభ్రాజత్కౌస్తుభేన విరాజితం | సద్రత్నసార రచిత కిరీట ముకుటోజ్వలం | 19

రత్న సింహాసనస్థం చ వనమాలా విభూషితం | తదేవ పరమం బ్రహ్మ భగవంతం సనాతనం || 20

స్వేచ్ఛామయం సర్వబీజం సర్వాధారం పరాత్పరం | కిశోర వయసం శశ్వద్గోపవేషవిధాయకం || 21

కోటి పూర్ణేందు శోభాఢ్యం భక్తానుగ్రహ కారకం | నిరీహం నిర్వికారంచ పరిపూర్ణతమం విభుం || 22

రాసమండల మధ్యస్థం శాంతం రాసేశ్వరం వరం | మాంగళ్యం మంగళార్హం చ మాంగళ్యం మంగళప్రదం || 23

పరమానందబీజం చ సత్యమక్షరమవ్యయం | సర్వసిద్ధేశ్వరం సర్వసిద్ధి రూపం చ సిద్ధిదం || 24

ప్రకృతేః పర మీశానం నిర్గుణం నిత్య విగ్రహం | ఆద్యం పురుషమవ్యక్తం పురుహూతం పురుష్టుతం || 25

సత్యం స్వతంత్రమేకంచ పరమాత్మ స్వరూపకం | ధ్యాయంతే వైష్ణవాః శాంతాః శాంతం తత్పరమాయణం || 26

గోలోకమున ఉన్న జ్యోతి మిక్కిలి మనోహరమైనది. ఆహ్లాదాన్ని, శాశ్వతమైన పరమానందాన్ని కల్గిస్తుంది. యోగులు ఎల్లప్పుడు తను యోగమువల్ల కలిగిన జ్ఞాన నేత్రము ద్వారా దానిని దర్శింతురు. ఆ జ్యోతిస్సు యొక్క మధ్య భాగమున ఉన్న రూపము చాలా అందమైనది. ఆ రూపము నూతన మేఘమువలె నల్లనై, ఎఱ్ఱని కలువలవంటి కన్నులతో, శరత్కాల పౌర్ణమినాటి చంద్రునివలె నిర్మలమైన ముఖముతో, కోటి మన్మథుల లావణ్యము కలిగి మిక్కిలి అందముగా కన్పిస్తుంది. ఇంకా అది రెండు భుజములతో ఒక చేత మురళిని పట్టుకొని, చిరునవ్వుతో కూడిన ముఖముతో, పచ్చని బట్టలతో మంచి రత్నభూషణములతో అలంకరించబడి, శరీరమునందంతటా శ్రీచందనమును పులుముకొని ముఖమున కస్తూరీ కుంకుమతోనున్న బొట్టుతో కనిపిస్తుంది. రొమ్ముపై శ్రీవత్సము, కౌస్తుభమణి ఉంటుంది. శిరస్సుపై మంచి రత్నములతో అలంకరింపబడిన కిరీటముండును. వనమాలా భూషితమై రత్నసింహాసనమున నున్న ఆ రూపమే సనాతనమైన పరబ్రహ్మగా భగవంతుడుగా కీర్తింపబడుతున్నది.

స్వేచ్ఛామయుడు, సమస్తమునకు కారణభూతమైనవాడు, సృష్టి సమస్తమునకు ఆధారభూతుడు, ఎల్లప్పుడు గోపవేషమున ఉండువాడు భక్తానుగ్రహకారకుడు కోటి పూర్ణచంద్రుల శోభకలవాడు కిశోర వయసులో ఉన్నవాడు ఆ పరబ్రహ్మ.

స్వార్థమైన కోరికలు లేనివాడు, నిర్వికారుడు, సర్వ పరిపూర్ణుడు, రాసమండల మధ్యభాగమున ఉన్నవాడు, రాసేశ్వరుడు శాంతుడు, మంగళస్వరూపుడు, మంగళప్రదుడు, పరమానందకారకుడు, సత్యస్వరూపుడు, అక్షరుడు, అన్వయుడు, సర్వసిద్ధులకు ఆధీశుడు సర్వసిద్ధిస్వరూపుడు, సమస్త సిద్ధులను ఇచ్చువాడు ఆ పరబ్రహ్మయే.

ప్రకృతికి అతీతుడు, ఈశ్వరుడు, నిర్గుణుడు, ఆదిపురుషుడు, అవ్యక్తుడు స్వతంత్రుడు అద్వితీయుడు ఐన ఆ పరమాత్మను శాంతాత్ములైన వైష్ణవులు సదా ధ్యానింతురు.

ఏవం రూపం పరం బిభ్రద్భగవానేక ఏవ సః | దిగ్భిశ్చ నభసా సార్థం శూన్యం విశ్వం దదర్శ హ || 27

ఇట్టి పరరూపమును ధరించు నా భగవంతుడు దిక్కులు ఆకాశముతో ఉన్న విశ్వమంతయు శూన్యముగా నున్నట్లు చూచెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ సౌతి శౌనక సంవాదే బ్రహ్మఖణ్డ పరబ్రహ్మనిరూపణంనామ ద్వితీయోzధ్యాయః ||

శ్రీ బ్రహ్మవైవర్తపురాణమున సౌతిశౌనక సంవాదరూపమైన బ్రహ్మఖండమున పరబ్రహ్మ నిరూపణమనే

రెండవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters