sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

నవమోzధ్యాయః - దేవతలు బాల గణపతిని సందర్శించుకొనుట

నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఇట్లనెను.

హారౌ తిరోహితే శర్వాణీ దుర్గా శంకరస్తదా | బ్రాహ్మణాన్వేషణం కృత్వా బభ్రామ పరితో

మునే || 1

వృద్ధబ్రాహ్మణవేషముననున్న శ్రీమహావిష్ణువు అంతర్ధానము చెందగా

పార్వతీపరమేశ్వరులు ఆతురతో ఆ బ్రాహ్మణునికై చుట్టుముట్టు వెదకసారిగి.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను.

అయే విప్రేంద్రాతివృద్ధ క్వ గతోzసి క్షుధాzతురః | హే తాత దర్శనం దేహి ప్రాణాన్వై రక్ష మే విభో || 2

శివ శీఘ్రం సముత్తిష్ఠ బ్రాహ్మణాన్వేషణం కురు | క్షణమున్మనసోరేష గతః ప్రత్యక్షమావయోః || 3

అగృహీత్వా గృహాత్పూజాం గృహిణోzతిథిరీశ్వర | యది యాతిక్షుధార్తశ్చ తస్య కిం జీవనం వినా || 4

పితరస్తన్న గృహ్ణంతి పిండదానం చ తర్పణం | తస్యాzహుతిం న గృహ్ణాతి వహ్నిః పుష్పం జలం సురాః || 5

హవ్యం పుష్పం జలం ద్రవ్యమశుచేశ్చ సురాసమం | అమేధ్యసదృశః పిండః స్పర్శనం పుణ్యనాశనం || 6

ఓ వృద్ధబ్రాహ్మణుడా! ఆకలిగొన్న నీవు ఎచ్చటికిపోతివి. ఓతండ్రీ!నీవొక్కసారి కనిపించి నా ప్రాణములను నిలుపుము.

ఓ శంకరా! త్వరగా లేచి ఆబ్రాహ్మణుడెచ్చటనున్నాడో వెదుకుము. ఒక్కక్షణము మనము పరాకుననుండగా అతడు మాయమయ్యెను. నాఇంటికి వచ్చిన అతిథి నేనిచ్చు అతిథిపూజను గైకొనకపోయెను. అతిథి ఆకలితో వెళ్ళిపోయినచో ఆ ఇంటియజమానిచేసిన తర్పణమును, పిండప్రదానమును పితృదేవతలు స్వీకరింపరు. అట్లే ఆ యజమాని ఇచ్చు ఆహుతులను, పుష్పములను, జలమును దేవతలు పరిగ్రహింపరు. అవి సురతో సమానముగా దేవతలకు కన్పించును. ఆ యజమాని పితృదేవతలకు పెట్టు పిండము అమేధ్యముతో సామనమగును. ఆతనిని స్పృశించినచో పాపము కలుగును. అని పలికెను.

ఏతస్మన్నంతరే తత్ర వాగ్బభూవాశరీరిణీ | కైవల్యయుక్తాసా దుర్గా తాం శుశ్రావ శుచాతురా || 7

శాంతా భవ జగన్మాతస్స్వసుతం పశ్య మందిరే | కృష్ణం గోలోకనాథం తం పరిపూర్ణతమం పరం || 8

సుపుణ్యకవ్రతతరోః ఫలరూపం సనాతనం | యత్తేజోయోగినః శశ్వత్‌ ధ్యాయంతి సతతం ముదా || 9

ధ్యాయంతి వైష్ణవా దేవా బ్రహ్మవిష్ణుశివాదయః | యస్య పూజ్యస్య సర్వాగ్రే కల్పే కల్పే చ పూజనం || 10

యస్య స్మరణమాత్రేణ సర్వవిఘ్నో వినశ్యతి | పుణ్యరాశి స్వరూపం చ స్వసుతం పశ్య మందిరే || 11

కల్పే కల్పే ధ్యాయసి యం జ్యోతీరూపం సనాతనం | పశ్య త్వం ముక్తిదం పుత్రం భక్తానుగ్రహ విగ్రహం || 12

తవ వాంఛాపూర్ణబీజం తపః కల్పతరోః ఫలం | సుందరం స్వసుతం పశ్య కోటికందర్పనిందకం || 13

నాయం విప్పః క్షుధార్తశ్చ విప్రరూపీ జనార్దనః | కిం వా విలాపం కురుషే క్వ వా వృద్ధః క్వ చాతిథిః |

సరస్వతీత్యేవముక్త్వా విరరామ చ నారద || 14

ఈ విధముగా పార్వతీదేవి బాధపడుచున్న సమయమున పార్వతీదేవికి ఒక అశరీరవాణి ఇట్లు వినిపించినది.

ఓ జగన్మాతా! నీవు బాధపడవద్దు. నీ ఇంటిలోనున్న నీపుత్రుని చూడుము. అతడు సమస్తపరిపూర్ణుడు. గోలోకమునకు అధిపతియగు శ్రీకృష్ణుడు. అతడు నీవుచేసిన పుణ్యకవ్రతమను వృక్షముయొక్క ఫలితముగా నీకు లభించెను. అతడు సనాతనుడు. పరమయోగీంద్రులు తేజోరూపియగు ఆ పరమాత్మను ఎల్లప్పుడు ధ్యానింతురు. బ్రహ్మవిష్ణుశివాది దేవతలు, వైష్ణవులు ఆ పరమాత్మను ఎల్లప్పుడు ధ్యానించుచుందురు. అట్టి పరమాత్మ నీకు పుత్రుడయ్యెను.

నీ పుత్రుడు ప్రతికల్పమునందు దేవతలందరికంటె ముందుగా పూజలనందుకొనును. ఆతనిని స్మరించినంతమాత్రమున సమస్త విఘ్నములు నశించును. ఆతడు పుణ్యములన్నిటికి రాశి. సనాతనుడు. జ్యోతిస్వరూపుడైన అతనిని ప్రతికల్పములోను నీవు ధ్యానము చేయుదువు. అతడు భక్తులనెల్లప్పుడు అనుగ్రహించును. ముక్తినిచ్చును. నీతపస్సను కల్పవృక్షమునకు ఫలమువంటివాడు. ఆతడు కోటిమన్మథులకంటె సుందరమైనవాడు. అటువంటి నీ పుత్రుని ఒకసారి చూడుము.

ఇంతకుముందు అదృశ్యమైన బ్రాహ్మణుడు ఆకలిగొన్నవాడుకాదు. అతడు బ్రాహ్మణవేషముననునన జనార్దనుడు. అందువలన పార్వతీదేవి! నీవు అనవసరముగా బాధపడుచున్నావు. అతడు వృద్ధుడుకాదు. అతిథికూడకాదు అని ఆకాశవాణి పలికెను.

త్రస్తా శ్రుత్వాకాశవాణీం జగామ స్వాలయం సతీ | దదర్శ బాలం పర్యంకే శయానం సస్మితం ముదా || 15

పశ్యంతం గేహశిఖరం శతచంద్రసమప్రభం | స్వప్రభాపటలేనైవ ద్యోతయంతం మహీతలం || 16

కుర్వంతం భ్రమణం తల్పే పశ్యంతం స్వేచ్ఛయాముదా | ఉమేతి శబ్దం కుర్వంతం రుదంతం తం స్తనార్థినం || 17

దృష్ట్వా తదద్భుతం రూపం త్రస్తా శంకరసన్నిధిం | గత్వా సోవాచ గిరిశం సర్వమంగళమంగళా || 18

పార్వతీదేవి ఆకాశవాణి పల్కులను విని ఆశ్చర్యముతో తన ఇంటిలోనికి వెళ్ళి తన శయ్యపై చిరునవ్వుతోనున్న బాలుని చూచెను. ఆ బాలుడు శతచంద్రులతో సమానమైన కాంతికలవాడు. తన శరీరకాంతిచే భూమిని స్ఫురింపచేయుచున్నవాడు.అతడు శయ్యపై సంతోషముతో ఇటనటు పొర్లుచుండెను. ఆ శిశువు పాలకై ఏడ్చుచు ఉమా అని శబ్దము చేయుచుండెను. అద్భుతమైన రూపముగల ఆ శిశువును చూచి పార్వతీదేవి వెఱగుపడి తన భర్తయగు శంకరుని సన్నిధికి పోయి ఆ దేవునితో ఈవిధముగా పలికెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లనెను.

గృహమాగచ్ఛ సర్వేశ తపసాం ఫలదాయక | కల్పే కల్పే ధ్యాయసి యం తం పశ్యాగత్య మందిరం || 19

శ్రీఘ్రం పుత్రముఖం పశ్య పుణ్యబీజం మహోత్సవం | పున్నామ నరక త్రాణ కారణం భవతారణం || 20

స్నానం చ సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షణం | పుత్రసందర్శనస్యాస్య కళాం నార్హతి షోడశీం || 21

సర్వదానేన యత్పుణ్యం క్ష్మాప్రదక్షిణతశ్చ యత్‌ | పుత్రదర్శన పుణ్యస్య కలాం నార్హతి షోడశీం || 22

సర్వైస్తపోభిర్యత్పుణ్యం యదేవానశ##నైర్వ్రతైః | సత్పుత్రోద్భవపుణ్యస్య కళాం నార్హతి షోడశీం || 23

యద్విప్రభోజనైః పుణ్యం యదేవ సురసేవనైః | సత్పుత్రప్రాప్తి పుణ్యస్య కలాం నార్హతి షోడశీం || 24

ఓ మహాదేవా నీవు ఇంటిలోనికి రమ్ము. మన ఇంటిలో మన తపస్సుల ఫలితమగు పుత్రుని ముఖమును చూడుము. నీవు ప్రతికల్పమున ఎవరిని ధ్యానించుచుందువో ఆ కృష్ణుడు పుత్రరూపముననున్నాడు. పుత్రుడు పుణ్యమువలన కలుగును. పుత్‌ అను నరకమునుండి రక్షించును, సంసారమునుండి తరింపజేయును.

సమస్తపుణ్యతీర్థములందు చేసిన స్నానము, సమస్త యజ్ఞములు చేయుట అనునవి పుత్రసందర్శనమునకు పదునారవవంతైన కాజాలవు. అట్లే సమస్తదానములు చేసినందువలన కలుగు పుణ్యము, భూమి ప్రదక్షిణము చేయుటవలన కలుగు పుణ్యము, సమస్త తపస్సులు, ఉపవాసములు, వ్రతములు, బ్రాహ్మణభోజనములు, దేవతార్చనములు చేసినందువలన కలుగు పుణ్యము పుత్రుని ముఖము చూచిన దానికి పదునారవంతైన కాజాలవు అనెను.

పార్వత్యా వచనం శ్రుత్వా శివః సంహృష్టమానసః | ఆజగామ స్వభవనం క్షిప్రం వై కాంతయా సహ

దదర్శ తల్పే స్వసుతం తప్తకాంచనసన్నిభం || 25

హృదయస్థం చ యద్రూపం తదేవాతిమనోహరం | దుర్గాతల్పాత్సమాదాయ కృత్వా వక్షసి తత్సుతం

చచుంబానంద జలదౌ నిమగ్నా సేత్యువాచ తం || 26

పార్వతీదేవియొక్క మాటలను విన్న శంకరుడు సంతోషముతో తన ఇంటికి వెంటనే తనభార్యతో కలిసివచ్చెను. అచ్చట తన శయ్యపై బంగారువంటికాంతికలవాడు, తాను ప్రతిదినము ధ్యానించుకొను రూపమువలె చాలా అందమైన శిశువును చూచెను. అప్పుడు పార్వతీదేవు సంతోషముతో ఆశిశువును ఎదకు హత్తుకొని మాటిమాటికి ముద్దులు పెట్టుకొనుచు ఇట్లు పలికెను.

సంప్రాప్యామూల్యరత్నం త్వాం పూర్ణమేవ సనాతనం | యథా మనో దరిద్రస్య సహసా ప్రాప్య సద్ధనం || 27

కాంతే సుచిరమాయతే ప్రోషితే యోషితోయథ | మానసం పరిపూర్ణం చ బభూవ చ తథా మమ || 28

సుచిరం గతమాయాతమెకపుత్రా కథంసుతం | దృష్ట్వా తుష్టా యథా వత్స తథాz హమసి సాంప్రతం || 29

సద్రత్నం సుచిరం భ్రష్టం ప్రాప్య హృష్టో యథాజనః | అనావృష్టౌ సువృష్టిం చ సంప్రాప్యాహం తథా సుతం || 30

యథా సుచిరమంథానాం స్థితానాంచ నిరాశ్రయే | చక్షుస్సునిర్మలం ప్రాప్య మనఃపూర్ణం తథైవ మే || 31

దుస్తరే సాగరే ఘోరే పతితస్య చ సంకటే | అనౌకస్య ప్రాప్య నౌకాం మనఃపూర్ణం తథా మమ || 32

తృష్ణయా శుష్కకంఠానాం సుచిరాచ్చ సుశీతలం | సువాసితం జలంప్రాప్య మనఃపూర్ణం తథా మమ || 33

దావాగ్ని పతితానాం చ స్థితానాం చ నిరాశ్రయే | నిరగ్నిమాశ్రయం ప్రాప్య మనఃపూర్ణం తథామమ || 34

చిరం బుభుక్షితానాం చ వ్రతపోషణకారిణాం || 35

సదన్నం పురతోదృష్ట్వా మనఃపూర్ణం తథామమ | ఇత్యుక్త్వా పార్వతీ తత్ర క్రోడే కృత్వా స్వబాలకం || 36

ప్రీత్యా దదౌ స్తనం తసై#్మ పరమానందమానసా | క్రోడే చకార భగవాన్‌ బాలకం హృష్టమానసః || 37

చుచుంబ గండే వేదోక్తం యుయుజే చాశిషం ముదా || 38

ఓబాలకా! నీవు సర్వతః పరిపూర్ణడవు. సనాతనుడవు. అమూల్యరత్నమువంటి నిన్ను పొందినందువలన నామనస్సు పూర్తిగా సంతోషముతో నిండిపోయినది. అంతులేని ధనము దొరికిన దరిద్రునివలె, సుదూరప్రాంతములకు పోయి చాలాకాముండి తిరిగివచ్చిన భర్తను చూచిన భార్యవలె, గొప్పవిలువకల రత్నమును పోగొట్టుకొని బాధతో చాలాకాలము వెదకగా హఠాత్తుగా అది కన్పడిన సమయమున సంతోషించువాని వలె, అనావృష్టిచే బాధపడుచున్నవాడు మంచివర్షము కురిసిన సమయముననున్నట్లు, ఆశ్రయములేక గుడ్డితనముతో అల్లాడిపోవుచున్నవాడు దైవయోగమున దృష్టి కలిగిన సమయమున సంతోషపడినట్లు నా మనస్సంతయు సంతోషముతో నిండిపోయినది. అదేవిధముగా అంతులేని సముద్రమున నౌకాయానము చేయుచుండగా ఆ నౌక మునిగిపోయినప్పుడు తల్లడిల్లిపోవుచున్నవానికి వేరొక నౌక దొరికినప్పుడు కల్గు సంతోషమువలె నా మనస్సు సంతోషముతోనున్నది. అట్లే విపరీతమైన దప్పిచే బాధపడుచున్నవానికి చల్లని, సువాసనగలుగు జలము లభించినప్పుడు కలుగు సంతోషమువలె, దావాగ్నిమధ్యలో పడికొట్టుమిట్టాడుచున్నవానికి ఆ అగ్నిలోనుండి తప్పించుకొను ఆధారము దొరికినప్పుడు కలుగు సంతోషమువలె, వ్రతమును చేయుచు చాలాకాలము తిండిలేకుండ ఉన్నవానికి ఎదురుగా పంచభక్ష్యపరమాన్నములు లభించినప్పుడు కలుగు సంతోషమువలె సంతానములేక బాధపడుచున్న నాకు శిశువును చూచుటచే సంతోషము కలిగినదని పలుకుచు పార్వతీదేవి తన కుమారుని ఒడిలోనికి తీసికొని అతనికి స్తన్యమునిచ్చి సంతోషముతో అతనిని ముద్దుపెట్టుకొనుచు ఆశీస్సులనొసగెను. పరమేశ్వరుడు కూడా సంతోషముతో ఆ శిశువును ఒడిలోనికి తీసుకొని ముద్దులు పెట్టుకొని ఆశీస్సులనొసగెను.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారదనారాయణసంవాదే బాలగణశదర్మనంనామ నవమోzధ్యాయః |

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున మూడవదైన గణపతిఖండమున నారద నారాయణ మహర్షుల సంవాద సమయమున చెప్పబడిన బాలగణశదర్శనమను

తొమ్మిదవ అధ్యాయము సమాస్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters