Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటముప్పదియవ అధ్యాయము - వానప్రస్థాశ్రమ కథనము

రామః- పురాధర్మాణి ప్రోక్తాని బ్రహ్మచారి గృహస్థయోః | కర్మాణ్యుక్తానిచ బ్రూహిః శిష్టమప్యాశ్రమ ద్వయమ్‌ ||

ఇంతకుమున్ను బ్రహ్మచారి గృహస్థాశ్రమ ధర్మములు తెలుపబడినవి. ఇపుడింక మిగిలిన రెండాశ్రమముల ధర్మములను అనతిమ్మన పుష్కరుండు రామున కిట్లనియె.

గృహస్థ ధర్మా నాశ్రిత్య కామ్యాని సురసత్తమ | కర్మాణి తాని మే బ్రూహి శిష్టాన్య ప్యాశ్రమ ద్వయే ||

పుష్కరః- సుఖం గృహాశ్రమే స్థిత్వా విథవత్‌ స్నాతకోద్విజః | వనేవసేత్తునియతోయధావద్విజితేంద్రియః ||

గృహస్థస్తు యదా వశ్యేద్వలీ పలిత మాత్మనః | అపత్యసై#్యవ చాపత్యం తదారణ్యం సమాశ్రయేత్‌ ||

సంత్యజ్య గ్రామ్య మహారం సర్వం చైవ పరిచ్ఛదమ్‌ | పుత్రేషు భార్యాం నిక్షిప్య వనం గచ్ఛేత్స హైవవా ||

అగ్నిహోత్రం సమాదాయ గృహ్యం చాగ్నిం పరిచ్ఛదమ్‌ | గ్రామా దరణ్యం నిఃసృత్య నివసే ద్వితేంద్రియః ||

విద్యాస్నాతకుడైనద్విజుడు గృహస్థాశ్రమమందు విధివిధానముగ సుఖముగ వర్తించి నయమివంతుడై యింద్రియములంగెలిచి వనమందు వసింప వలెను. గృహస్తు తల నెరిసి యొడలు ముడుతలు పడుట గని సంతానమునకు సంతానమునకు(మనుమలు) గల్గుట చూచి యరణ్యముం జేరవలెను. నానారుచులతో గూడిన గ్రామ్మాహారారమును వదలి ఇల్లువాకిలి మంచము కంచము మొదలగు నెల్లసామగ్రిని వదలి భార్యను కొడుకులకు నప్పగించి లేదా భార్యతోనైన నడవి కేగవలెను. గృహ్యాగ్ని గొని గ్రామము నుండి వెడలి అరణ్యములో జితేంద్రియుడై వసింపవలెను.

మున్యనైర్వివిధైర్మేధ్యైః శాక మూల ఫలేన వా | సర్వానేవ మహా యజ్ఞాన్‌ నిర్వపేద్విధి పూర్వకమ్‌ |

వసీత చర్మ చీరం వా సాయం స్నాయాత్‌ ప్రగే తధా | జటాశ్చ బిభృయా న్నిత్యం శ్మశ్రులోమ నఖాం స్తథా ||

మేథ్యములు (పవిత్రములు) అయిన పలురకాల మునుల యన్నములతో దుంపలు కాయలు పండ్లు ఆకులతో యధా విధిగ సర్వ మహాయజ్ఞములు (పంచ యజ్ఞములు దేవయజ్ఞము ఋషియజ్ఞము బ్రహ్మయజ్ఞము పితృయజ్ఞము మనుష్యయజ్ఞము) నిర్వహింపవలెను. చర్మముగాని చీర (నారచీర) గాని ధరింపవలెను. ఉషఃకాలములో, సాయంకాలమందు స్నానము సేయవలెను. జడలు శ్మశ్రువులు గడ్డము మీసము గొళ్ళు బెంచుకొన వలెను.

యద్యచ్చ స్యాత్తతో దద్యా ద్బలిం భిక్షాం చ శక్తితః | సమూలఫల భిక్షాభి రర్చయే దాశ్రమాగతాన్‌ ||

స్వాథ్యాయా నిత్య యుక్తస్యాద్దాంతో మైత్రః సమాహితః | దాతా నిత్య మనాదాతా సర్వభూతానుకంపకః ||

వైతానికం చ జుహుయా దగ్నిహోత్రం యధావిధి | దర్శయన్‌ స్కందయన్‌ పర్వ, పౌర్ణమాసీం చ యోగతః ||

ఋక్షేష్ట్యా గ్రయణం చైవ చాతుర్మాస్యాని చాహరేత్‌ | ఉత్తరాయణం చక్రమశో దక్షిణాయన మేవ చ ||

వాసన్తైశ్శార దైర్మేధ్యైర్మున్యన్నై స్సుసమాహృతైః ః పులోడా శాంశ్చరూం శ్ఛైవ విధివన్నిర్వపేత్‌ పృథక్‌ ||

దేవతాభ్యస్తు తద్ధుత్వా వన్యం మేధ్యతరం హవిః | శేష మాత్మనియుంజీత లవణంచ స్వయంకృతమ్‌ ||

స్థలజోరక శాకాని పుష్పమూల ఫలాని చ | మధ్య వృక్షోద్భవా న్యద్యాత్‌ స్నేహాంశ్చ ఫలసంయుతాన్‌ ||

ఏది లభించిన దానితో బలి (కాకబలి మొదలయినవి) భిక్షము (సన్యాసులు మొదలగు వారికి) యధాశక్తి నీయవలెను దుంపలు పండ్లు మున్నగువానితో ఆశ్రమమునకు వచ్చిన అతిథి-అభ్యాగతులను తృప్తి పఱుపవలెను. నిత్యస్వాధ్యాయ (వేద) పరుడై దాంతుడై (అంతరింద్రయ బహిరింద్రియ నిగ్రహము కలవాడై) మైత్రః=సర్వభూతములందునుమైత్రి పాటించుచు మనస్సు నిలిపి కొని (యోగమూని) దాతయై తానే దానములు పట్టక సర్వభూతదయగొని వైతానికాగ్ని హోమము నిత్యమును జేయవలెను. (వైతానిక మనగా యజ్ఞ సంబంధియైనది.) పర్వ=అమావాస్యను దర్మయన్‌=హవిస్సును జూపించుచు, జార్చుచు సౌర్ణమాసీంచ=పూర్ణిమనాడు హోమము సేయవలెను. నక్షత్రేష్టిని ఆగ్రయణమును=నవసస్యేష్టిని (క్రొత్తపంటను)రాగానే చేయునది. చాతుర్మాస్యేష్టులను ఉత్తరాయణ దక్షిణాయనములందు గావిపవలసిన హొమాది కర్మకలాపమును నిర్వర్తించుచు. వసంత ఋతువులో శరద్దృతువలో పవిత్రమయిన పదార్థములతో పురోశములను, చరువులను యధావిధిగ హోమము సేయవలెను. దేవతల కొఱకు వన్యమైన (వనమునందలి) వ్రీహిధాన్యమును మిక్కిలి మేధ్యమును (హోమ శిష్టమును) స్వయముగా సమకూర్చకొన్న (తనకు తాను సమకూర్చుకొన్న) ఉప్పనివస్తువు తినవలెను. ప్రాశనచేయవలెను. మెట్టను నీటను బుట్టిన ఆకుకూరలను పువ్వులు పండ్లను దుంపలను చెట్టు నడుమ కాసెడి పనసపండు మొదలయిన వానిని పండ్లతోడి స్నేహములను=నూనెలను తానాహారముగ గైకొనవలెను.

వర్జయేన్మధు మాంసాని భౌమాని కవకాని చ | భూస్తృణం శిగ్రు కంచైవ భల్లాతక ఫలాని చ ||

త్యజే దాశ్వయుజే మాసి మున్యన్నం పూర్వసంచితమ్‌ | జీర్నానిచైవ వసాంసి పుష్పమూల ఫలానిచ ||

నఫాలకృష్ణ మశ్నీయి దుత్సృష్టమపి కే నచిత్‌ | న గ్రామజాత మన్నంచ పుష్పాణిచ ఫలానిచ ||

మధు(కల్లు), మాంసము, భౌమములగు=భూసంబంధములైన కవకములను=పుట్టగొడుగులను. భూస్తృణము=గొడుగు గడ్డి, శిగ్రుకం=మునుగకాయను, భల్లాతకం=జీడిమామిడి పండ్లను వర్జింపవలెను. ఆశ్వయుజ మాసమందు మున్ను సేకరించి కొన్న మున్యన్నమును వదలవలెను. చినిగిని వస్త్రములను వాడిన పువ్వులను, నిలువయున్న దుంపలు, పండ్లను విడువవలెను. నాగలితో దున్ని పండిచిన పంటను, ఎవ్వనిచేతనో విసర్జింప బడిన దానిని, గ్రామ ప్రాంతములందు పండిన పంటయన్నమును, పూలు పండ్లను దినరాదు.

అగ్నిపక్వాశనో వాష్యాత్‌ కాలపక్వ భుగేవా | ఆశ్మ విద్ధో భ##వేద్వాపి దంతోలూఖలిక స్తధా ||

సద్యః ప్రక్షాలికో వాస్యాన్మాస సంచయికోపి వా | షణ్మాస నిచయో వాస్యాత్‌ సమానిచమ ఏవ వా ||

నక్తం వాన్నం సమశ్నీయా ద్దివా చాహృత్య శక్తితః | చతుర్థకాలికో వాస్యాత్స్యాద్వా చాష్టమ కాలికః ||

చాంద్రాయణ విధానైర్వాపి శుక్లే కృష్ణేచ వర్తయేత్‌ | పక్షాన్తయో ర్వాస్యశ్నీయా ద్యవాగూం క్వధితాం సకృత్‌ ||

పుష్పమూల ఫలై ర్వాపి కేవలై ర్వర్తయే త్సదా | | కాల పక్వైః స్వయం శీర్ణైర్వైఖానస పరిస్థితః ||

భూమౌ విపరివర్తేత తిష్ఠేద్వాప్రపదై ర్దినమ్‌ | స్థానాసనాభ్యాం విహరేత్‌ సవనేషూవయ న్నవః ||

అగ్ని పక్వమైన దానిని. కాలపక్వమైన దానిని, రాతితో చితుకగొట్టిన దానిని తినవలెను. దంతములే ఱోలుగా నుపయోగించు వాడుగా (దంతోలూఖలికః) నుండవలెను. దంతములతోగొరికి తినవలెను. ఱోలులో దంచినది పనికిరాదన్నమాట. సద్యః ప్రక్షాలికః=అప్పటికప్పుడు కడిగికొని తినువాడు మానసంచయకః = నెలకు సమకూర్చుకొన్నవాడు షణ్మాసనిచయః= ఆఱుమాసముల కొకసారి సమకూర్చుకొన్నవాడు సమానిచయః= ఏడాదికొకసారే కూర్చుకొన్నవాడునై యుండవలెను. నక్తః = రాత్రియో పగలో శక్తి ననుసరించి తినవలెను. ఇరుపూటల నాహారము సేయరాదు. చతుర్ధ కాలికుండు = నాల్గవకాలమున భుజించువాడు. అష్టమకాలికుడు = ఎనిమిదవ కాలమున భుజించు వాడుగాని కావలెను. శుక్లకృష్ణ పక్షములందు చాంద్రాయణ వ్రత విధానము ననుసరింప వలెను. పక్షాంతములందు పూర్ణిమ అమావాస్యలందు ఒక్క పర్యాయము బాగుగా కాచబడిన యవాగువును = గంజిని త్రాగవలెను. పండ్లు దుంపలు పూలు మాత్రము తినియైన యుండవలెను. కాలపక్వములు = తమంత పండిన తమంత రాలిన యాకులుందిని వైఖానస మార్గమందుండవలెను. (వైఖానసమనగా --వాన ప్రస్థాశ్రమ పద్ధతి.) రోజంత భూమిమీద దొర్లి పండుకొన వలెను. లేక పదాగ్రమున కాలి మును వ్రేళ్ళ మీద నిలబడవలెను. ప్రాతర్మధ్యాహ్న సాయంసవనములందు తిరుగుచు గాని కూర్చుండుచుగాని యుండవలెను.

గ్రీష్మే పంచ తపాస్తుస్యా ద్వర్షాస్వాసార భాగ్భవేత్‌ | ఆర్ద్రవాసాస్తు హేమంతే క్రమశోవర్ధయం స్తవః ||

ఉపస్పృశం స్త్రిషవణం పితౄన్‌ దేవాంశ్చ తర్పయేత్‌ | తపశ్చరం శ్చోగ్రతరం శోషయేద్దేహ మాత్మనః ||

గ్రీష్మర్తువలో పంచతపస్వియై=పంచాగ్ని మధ్యనుండి తపము చేయువాడై, వర్షరుతువులో నేలపైనుండి వర్షము తనపై పడునట్లుండి, హేమంతమందు తడిబట్టదాల్చియు క్రమముగా తపస్సు బెంపొందింపవలెను. మూడుపూటల, మూడుకాలములస్నానము సేయుచు దేవ పితృ తర్పణము సేయుచు నుగ్రతపము చేయుచు తన శరీరమును శోషింపజేయవలెను.

అగ్నీ నాత్మని వైతానాన్‌ సమారోప్య యధావిధి | అనగ్ని రనికేతశ్చ మునిర్మూల ఫలాశనః ||

ఆ పపన్న ః సుఖార్థేషు బ్రహ్మచారీ ధరాశ్రయః | శరణషు సమశ్చైవ వృక్ష మూల నికేతనః ||

యజ్ఞాగ్నులను దనయందు యధావిధిగ (శాస్త్రోక్త రీతిగ) ఆరోపించికోని ఆనగ్నియై అనికేతుడై (నిలువనీడగొనక) మౌనియై దుంపలు పండ్లు దినుచు విషయసుఖములకు దేవులాడక బ్రహ్మచర్యవ్రతియై నేలమీద పండికొన్నపుడు నే ఇంటిలోనున్న నేకరూపియై (హెచ్చుదగ్గులు గణింపక) చెట్టుమొదలు నాశ్రయించి యుండవలెను.

తాపసేష్వేవ విప్రేషు యాత్రికం భైక్ష మాహరేత్‌ | గృహమధ్యేషు చాన్యేషు ద్విజేషు వనవాసిషు ||

గ్రామా దాహృత్య నాశ్నీయాదష్టౌ గ్రాసాన్వనే వసన్‌ | వివిధా శ్చోపనిషదోహ్మాత్మ సంశుద్దయే శ్రుతీః||

ఋషిభి ద్భ్రాహ్మణౖశ్చైవ గృహస్థైరేవ సేవితః | విద్యా తపోభివృద్ధ్యర్థం శరీరస్యచ శుద్ధయే ||

అపరాజితాం వాస్థాయ వ్రజేధ్దిశ మజిహ్మగః | అనిపాతా చ్ఛరీరస్య యుక్తోవార్యనిలాశనః ||

త్యక్త్వా తనుం సమ్య గధోదితస్య విధే రధైకస్య వనే నివాసీ |

ప్రాప్నోతి లోకం స వితామహస్య త్యక్త్వా భయం నాత్ర విచారమస్తి ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే వానప్రస్థాశ్రమకధనం నామ త్రింశత్యుత్తర శతతమోధ్యాయః ||

తపస్వులైన విప్రుల యిండ్లనుండి శరీర యాత్రాసంబంధమైన భైక్షముంగొని తినవలెను. మరి యితరులు ఉత్తమపవిత్ర గృహస్థులనుండియు వనవాసులనుండియుంగూడ భిక్షగొనవచ్చును. గ్రామమునుండి భిక్షతెచ్చికొని స్వీకరింపరాదు. ఎనిమిది ముద్దలు మాత్రము తినవలెను. వివిధములైన బ్రహ్మ విషయికములైన యుపరనిషత్తులను పఠింపవలెను. శ్రుతులను ఋషులు బ్రాహ్మణులు గృహస్థులచేత సేవించబడవలెను. అందువలన విద్యా తపస్సు పెంపొందించుట, శారీరశుద్దియు కలుగును. ఈశాన్యదిశగా అవలంబించి నేరుగా శరీరపాతము దాక నీరు, గాలి భక్షణము సేయుచు యుక్తుడై (యోగియై) చెప్పిన విధిని యాచరణలోచక్కగా బెట్టిన వాన వ్రస్థుడు శరీరమువిడిచి శరీరముతోపాటు భయముగూడా విడిచి బ్రహ్మలోకమును బొందును. ఇందుసందియము లేదు.

ఇది శ్రీష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయ ఖండమున వానప్రస్థాశ్రమకధనమను నూటముప్పదియవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters