Siva Maha Puranam-3    Chapters   

అథ త్రయోదశో%ధ్యాయః

పురాణ మహిమ

సనత్కుమార ఉవాచ |

తపస్తపతి యో%రణ్య వన్యమూలఫలాశనః | యో%ధీతే ఋచమేకాం హి ఫలం స్యాత్తత్సమం మునే || 1

శ్రుతేరధ్యమనాత్పుణ్యం యదాప్నోతి ద్విజోత్తమః | తదధ్యాపనతశ్చాపి ద్విగుణం ఫలమశ్నుతే || 2

జగద్యథా నిరాలోకం జాయతే%శశిభాస్కరమ్‌ | వినా తథా పురాణం హ్యధ్యేయమస్మాన్మునే సదా || 3

తప్యమానం సదాజ్ఞానాన్నిరయే యో%పి శాస్త్రతః | సంభోధయతి లోకం తం తస్మాత్పూజ్యః పురాణగః || 4

సర్వేషాం చైవ పాత్రాణాం మధ్యే శ్రేష్ఠః పురాణవిత్‌ | పతనాత్త్రాయతే యస్మాత్తస్మాత్పాత్రముదాహృతమ్‌ || 5

మర్త్యబుద్ధిర్న కర్తవ్యా పురాణజ్ఞే కదాచన | పురాణజ్ఞస్సర్వవేత్తా బ్రహ్మా విష్ణుర్హరో గురుః || 6

ధనం ధాన్యం హిరణ్యం చ వాసాంసి వివిధాని చ | దేయంపురాణవిజ్ఞాయ పరత్రేహ చ శర్మణ || 7

యో దదాతి మహాప్రీత్యా పురాణాజ్ఞాయ సజ్జనః | పాత్రాయ శుభవస్తూని స యాతి పరమాం గతిమ్‌ || 8

మహీం గాం వా స్యందనాంశ్చ గజానశ్వాంశ్చ శోభనాన్‌ | యః ప్రయచ్ఛతి పాత్రాయ తస్య పుణ్యఫలం శృణు || 9

అక్షయాన్‌ సర్వకామాంశ్చ పరత్రేహ చ జన్మని | అశ్వమేధసుఖస్యాపి స ఫలం లభ##తే పుమాన్‌ || 10

సనత్కమారుడు ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! ఎవడు అరణ్యములో కందమూలఫలములను భక్షిస్తూ తపస్సును చేయునో, ఎవడు ఒక ఋక్కు(వేదమంత్రము)ను పఠించునో, వారిద్దరి ఫలము సమానము (1). బ్రాహ్మణోత్తముడు వేదాధ్యయనముచే ఎట్టి ఫలమును పొందునో, అంతకు రెట్టింపు ఫలమును వేదమును బోధించి పొందును (2). ఓ మునీ! సూర్యచంద్రులు లేనిచో జగత్తు అంధకారమగును. పురాణములు లేనిచో, అదే విధముగా అగును. కావున వాటిని సర్వదా అధ్యయము చేయవలెను (3). అజ్ఞానముచే సర్వకాలములో నరకమువంటిసంసారములోతాపమును పొందుచున్న మానవునకు పురాణవేత్త శాస్త్రమును బోధించును. కావున, పురాణజ్ఞాని పూజించవలెను (4). దానమునిచ్చుటకు, యోగ్యులగు వ్యక్తులు (పాత్రులు) అందరిలో పురాణవేత్త శ్రేష్ఠుడు. పతనము (అధోగతి) నుండి రక్షించువాడు పాత్రుడు అనబడును (5). పురాణవేత్త సాధారణ మానవుడు అని ఎన్నటికీ తలంచరాదు. పురాణవేత్త సర్వమును తెలిసినవాడు, బ్రహ్మవిష్ణుమహేశ్వరస్వరూపుడు మరియు గురువు (6). ఇహపరలోకములలో సుఖమును గోరు మానవుడు పురాణవేత్తకు ధనధాన్యములను, బంగారమును, వివిధములగు వస్త్రములను ఈయవలెను (7). ఏ సత్పురుషుడు పాత్రుడగు పురాణజ్ఞునకు గొప్ప ప్రీతితో శుభవస్తువులను దానమునిచ్చునో, వాడు పరమగతిని పొందును (8). ఎవడైతే పాత్రుడగు వ్యక్తికి భూమి, గోవు, వాహనములు, ఏనుగులు మరియు అందమైన గుర్రములు అను వాటిని దానముచేయునో, వాని పుణ్యఫలమును వినుము (9). అట్టి మానవుడు ఈ జన్మయందు మాత్రమేగాక, పరలోకములో కూడ అక్షయఫలమును పొందును ఆతనికోరికలు అన్నియు తీరును. ఆతడు అశ్వమేధయజ్ఞముయొక్క ఫలమును కూడ పొందును (10).

మహీం దదాతి యస్తసై#్మ కృష్టాం ఫలవతీం శుభామ్‌ | స తారయతివై వంశ్యాన్‌ దశ పూర్వాన్‌ దశాపరాన్‌ || 11

ఇహ భుక్త్వాఖిలాన్‌ కామానంతే దివ్యశరీరన్‌ | విమానేన చ దివ్యేన శివలోకం స గచ్ఛతి|| 12

న యజ్ఞైస్తుష్టిమాయాంతి దేవాః ప్రోక్షణకైరపి| బలిభిః పుష్పపూజాభిర్యథా పుస్తకావాచనైః ||13

శంభోరాయతనే యస్తు కారయేద్ధర్మ పుస్తకమ్‌ | విష్టోరర్కస్య కస్యాపి శృణు తస్యాపి తత్ఫలమ్‌|| 14

రాజసూయాశ్వమేధానం ఫలమాప్నోతి మానవః | సూర్యలోకం చ భిత్త్వాశు బ్రహ్మలోకం స గచ్ఛతి|| 15

స్థిత్వా కల్పశతాన్యత్ర రాజా భవతి భూతలే | భుంక్తే నిష్కంటకం బోగాన్నాత్ర కార్యా విచారణా|| 16

అశ్వమేధసహస్రస్య యత్ఫలం సముదాహృతమ్‌ | తత్ఫలం సమవాప్నోతి దేవాగ్రే యో జపం చరేత్‌ ||17

ఇతిహాసపురాణాభ్యాం శంభోరాయతనే శుభే| నాన్యత్ర్పీతికరం శంభోస్తథేన్యేషాం దివౌకసామ్‌ || 18

తస్మాత్సర్వప్రయత్నేన కార్యం పుస్తకవాచనమ్‌ | తథాస్య శ్రవణం ప్రేవ్ణూ సర్వకామఫలప్రదమ్‌ ||19

పురాణశ్రవణాచ్ఛంభోర్నిష్పాపో జాయతే నరః | భుక్త్వా భోగాన్‌ సువిపులాన్‌ శివలోకమవాప్నుయాత్‌ || 20

ఎవడైతే పురాణజ్ఞునకు దున్ని పంటతో నున్న మంచి భూమిని ఇచ్చునో, వాడు తన వంశములో పది ముందు తరములను మరియు పది తరువాత తరములను తరింపజేయును(11). ఆతడు ఇహలోకములో సకలభోగములను అనుభవించి మరణించిన తరవాత దివ్యమగు శరీరమును దాల్చి దివ్యమగు విమానముపై శివలోకమునకు వెళ్లును(12). పురాణప్రవచనములచే దేవతలు ఏవిధముగా సంతోషించెదరో, ఆ తీరున పశు యాగములచే గాని, నైవేద్యములచే గాని, పుష్పములతో చేయు పూజచే గాని సంతోషించరు(13). ఎవడైతే శివుని ఆలయములో గాని, విష్ణ్వాలయములో గాని, లేదా ఇతరదేవతల ఆలయములలో గాని ధర్మపుస్తకము యొక్క ప్రవచనము చేయించునో, వానికి లభించే పుణ్యఫలమును గురించి వినుము(14). అట్టి మానవుడు రాజసూయ-అశ్వమేధముల ఫలమును పొంది సూర్యమండలమును భేదించుకొని బ్రహ్మలోకమును పొందును(15). అతడు అచట వందకల్పములు ఉండి భూమిపై రాజు గా జన్మించి ఆటంకములు లేని భోగములను అనుభవించును. ఈ విషయములో సంశయము లేదు(16). ఎవడైతే పరమేశ్వరుని సన్నిధిలో జపమును చేయునో, వాడు వేయి అశ్వమేధయాగముల ఫలమును పొందును(17). శివునకు మరియు ఇతరదేవతలకు శుభకరమగు శివాలయములో ఇతిహాసపురాణముల ప్రవచనముల కంటె ప్రియమైనది మరియొకటి లేదు(18). కావున, పూర్ణప్రయత్నమును చేసి పురాణప్రవచనమును చేయవలెను. దానిని ప్రేమతో వినువారికి కామనలన్నియు సిద్ధించును(19). శివపురాణమును శ్రవణము చేయు మానవుడు పాపవిముక్తుడై విస్తారమగు భోగముననుభవించి శివలోకమును పొందును(20).

రాజసూయేన యత్పుణ్యమగ్నిష్టోమశ##తేన చ | తత్పుణ్యం లభ##తే శంభోః కథాశ్రవణమాత్రతః || 21

సర్వతీర్థావగాహేన గవాం కోటిప్రదానతః| తత్‌ఫలం లభ##తే శంభోః కథాశ్రవణతో మునే||22

యేశృణ్వంతి కథాం శంభోస్సదా భువనపావనీమ్‌| తే మనుష్యాన మంతవ్యా రుద్రా ఏవ న సంశయః|| 23

శృణ్వతాం శివసత్కీర్తిం సతాం కీర్తయతాం చ తామ్‌ | పదాంబుజరజాం స్యేవ తీర్థాని మునయో విధుః24

గంతుం నిఃశ్రేయసం స్థానం యే%భివాంఛంతి దేహినః | కథాం పౌరాణికీం శైవీం భక్త్వా శృణ్వంతు తే సదా|| 25

కథాం పౌరాణీకీం శ్రోతుం యద్యశక్తస్సదా భ##వేత్‌ | నియతాత్మా ప్రతిదినం శృణుయాద్వా ముహూర్తకమ్‌ || 26

యది ప్రతిదినం శ్రోతుమశక్తో మానవో భ##వేత్‌ | పుణ్యమాసాదిషు మునే శృణుయాచ్ఛాంకరీం కథామ్‌ || 27

శైవీం కథాం హి శృణ్వానః పురుషో హి మునీశ్వర | స నిస్తరతి సంసారం దగ్ధ్వా కర్మమహాటవీమ్‌ || 28

కథాం శైవీం మూహూర్తం వా తదర్ధం వా క్షణం చ వా | యే శృణ్వంతి నరా భక్త్యా న తేషాం దుర్గతిర్భవేత్‌ || 29

యత్పుణ్యం సర్వదానేషు సర్వయజ్ఞేషు వా మునే | శంభోః పురాణశ్రవణాత్తత్ఫలం నిశ్చయం భ##వేత్‌ || 30

రాజసూయయాగమును మరియు వంద అగ్నిష్టోమములను చేసినచో ఏ పుణ్యము లభించునో, ఆ పుణ్యము శివుని కథను విన్నంత మాత్రాన లభించును (21). ఓ మునీ! సర్వతీర్ధములలో స్నానము చేయుట వలన మరియు కోటి గోవులను దానము చేయుట వలన ఏ పుణ్యము లభించునో, ఆ పుణ్యము శివుని కథను వినుట వలన లభించును (22). ఎవరైతే లోకములను పవిత్రము చేయు శివగాథను వినెదరో, వారు రుద్రస్వరూపులే వారిని సామాన్యమానవులని తలంచరాదు. ఈ విషయములో సందేహము లేదు (23). శివుని పవిత్రమగు కీర్తిని వింటూ దానిని కీర్తించే సత్పురుషుల పాదపద్మముల నుండి రాలే ధూళికణములే తీర్థములని మహర్షులు చెప్పుచున్నారు (24). ఏమానవులు మోక్షము అనే పరమపదమును పొందగోరుచున్నారో, వారు సర్వదా శివపురాణగాథలను భక్తితో వినెదరు గాక (25). సర్వకాలములలో పురాణగాథను వినే శక్తి లేనిచో, ప్రతిదినము గంట సేపు స్థిరచిత్తముతో వినవలెను (26). ఓ మునీ! ప్రతిదినము వినే శక్తి లేని మానవుడు పుణ్యమాసము మొదలగు సందర్భములలో శంకరుని గాథను వినవలెను (27). ఓ మహర్షీ! శివగాథను వినే మానవుడు కర్మ అనే పెద్ద అడవిని దహించి సంసారమును అతిక్రమించును (28). ఏ మానవులైతే శివగాథను గంట గాని, అరగంట గాని, లేదా క్షణకాలమైననూ భక్తితో వినెదరో, వారికి దుర్గతి లేదు (29). ఓ మునీ! సర్వదానములచే మరియు సర్వయజ్ఞములచే ఏ పుణ్యము లభించునో, ఆ పుణ్యఫలము శంకరుని పురాణమును వినుట వలన నిశ్చయముగా కలుగును (30).

విశేషతః కలౌ వ్యాస పురాణశ్రవణాదృతే | పరో ధర్మో న పుంసాం హిముక్తిధ్యానపరః స్మృతః || 31

పురాణశ్రవణం శంభోర్నామసంకీర్తనం తథా | కల్పద్రుమఫలం రమ్యం మనుష్యాణాం న సంశయః || 32

కలౌ దుర్మేధసాం పుంసాం ధర్మాచారోజ్ఝి తాత్మనామ్‌ | హితాయ విదధే శంభుః పురాణాఖ్యం సుధారసమ్‌ || 33

ఏకో%జరామరస్స్యాద్వై పిబన్నేవామృతం పుమాన్‌ | శంభోః కథామృతాపానాత్కులమేవాజరామరమ్‌ || 34

యా గతిః పుణ్యశీలానాం యజ్వనాం చ తపస్వినామ్‌ | సా గతిస్సహసా తాత పురాణశ్రవణాత్ఖలు || 35

జ్ఞానావాప్తిర్యదా న స్యాద్యోగశాస్త్రాణి యత్నతః | అధ్యేతవ్యాని పౌరాణం శాస్త్రం శ్రోతవ్యమేవ చ || 36

పాపం సంక్షీయతే నిత్యం ధర్మశ్చైవ వివర్ధతే | పురాణశ్రవణాత్‌ జ్ఞానీ న సంసారం ప్రపద్యతే || 37

అత ఏవ పురాణాని శ్రోతవ్యాని ప్రయత్నతః | ధర్మార్థకామలాభాయ మోక్షమార్గప్తయే తథా || 38

యజ్ఞైర్దానైస్తపోభిస్తు యత్ఫలం తీర్థసేవయా | తత్ఫలం సమావాప్నోతి పురాణశ్రవణాన్నరః || 39

న భ##వేయుః పురాణాని ధర్మమార్గేక్షణాని తు | యద్యత్ర యద్వ్రతీ స్థాతా చాత్ర పారత్రకీం కథామ్‌ || 40

షట్త్రింశతిపురాణానాం మధ్యే%ప్యేకం శృణోతి యః | పఠేద్వా భక్తియుక్తస్తు స ముక్తో నాత్ర సంశయః || 41

అన్యో న దృష్టస్సుఖదో హి మార్గః పురాణమార్గో హి సదా వరిష్ఠః |

శాస్త్రం వినా సర్వమిదం న భాతి సూర్యేణ హీనా ఇవ జీవలోకాః || 42

ఇతి శ్రీశివమహాపురాణ ఉమాసంహితాయాం పురాణమాహాత్మ్య వర్ణనం నామ త్రయోదశో%ధ్యాయః (13).

ఓ వ్యాసా! విశేషించి కలియుగములో ధ్యానమును కుదిర్చి ముక్తిని ఇచ్చే ధర్మము పురాణశ్రవణము కంటే గొప్పది మరియొకటి లేదు (31). శివపురాణశ్రవణము మరియు నామసంకీర్తన అనునవి మానవులకు సుందరమగు ఫలములనిచ్చే కల్పవృక్షము వంటివి. సంశయము వలదు (32). కలియుగములో దుష్టబుద్ధి గలవారై ధర్మమును మరియు ఆచారమును విడిచిపెట్టి స్వభావము గల మానవులు క్షేమము కొరకై శివుడు పురాణము అనే అమృతరసమును ఏర్పాటు చేసెను (33). పురుషుడు అమృతమును పానము చేసినచో, తాను ఒక్కడు మాత్రమే అమరుడగను. కాని శివగాథ అనే అమృతమును పానము చేయుట వలన వంశము జరామరణములనుండి విముక్తిని పొందును (34). ఓ కుమారా! పుణ్యాత్ములై యజ్ఞములను మరియు తపస్సును చేసిన వారికి ఏ గతి లభించునో, అదే గతి పురాణశ్రవణము వలన శీఘ్రముగా కలుగును (35). జ్ఞానము లభించినంత వరకు, ప్రయత్నపూర్వకముగా యోగశాస్త్రములను అధ్యయనము చేయవలెను. పురాణమును మరియు శాస్త్రమును శ్రవణము చేయవలెను (36). నిత్యము పురాణమును వినే మానవునకు పాపము క్షీణించి ధర్మము వర్ధిల్లి జ్ఞానము ఉదయించి సంసారమునుండి విముక్తి కలుగును (37). కావుననే, ధర్మార్థకామములు సిద్ధించుటకు, మరియు మోక్షమార్గము లభించుటకు ప్రయత్నపూర్వకముగా పురాణములను వినవలెను (38). మానవుడు యజ్ఞములచే, దానములచే, తపస్సులచే, మరియు తీర్థాటనమచే ఏ ఫలమును పొందునో, అదే ఫలమును పురాణశ్రవణముచే పొందును (39). పురాణములు ధర్మమార్గమును చూపే నేత్రములు. ఈ లోకములో అవి లేనిచో, వ్రతముల ననుష్ఠించువాడు గాని, పరలోకప్రసంగము గాని ఉండెడిది గాదు (40). ఎవడైతే ముప్పది ఆరు పురాణములలో ఏ ఒక్కదానినైననూ భక్తితో కూడినవాడై వినునో, లేదా పఠించునో, వాడు ముక్తుడగుననుటలో సందేహము లేదు (41). సుఖమునిచ్చే మార్గము మరియొకటి లేదు. సర్వకాలములలో పురాణమార్గమే శ్రేష్ఠమైనది. సూర్యుడు లేని ప్రాణి వర్గము వలె శాస్త్రము లేనిచో ఈ సర్వముయొక్క తత్త్వము ప్రకాశించదు (42).

శ్రీశివమహాపురాణములోని ఉమాసంహితయందు పురాణమహిమను వర్ణించే పదమూడవ

అధ్యాయము ముగిసినది (13).

Siva Maha Puranam-3    Chapters