Siva Maha Puranam-3    Chapters   

అథ నవమో%ధ్యయః

భైరవ లీల

నందీశ్వర ఉవాచ |

సనత్కుమార సర్వజ్ఞ భైరవీమపరాం కథామ్‌ | శృణు ప్రీత్యా మహాదోష సంహర్త్రీం భక్తి వర్ధినీమ్‌ || 1

తత్సాన్నిధ్యం భైరవో%పి కాలో%భూత్కాలకాలనః | స దేవదేవవాక్యేన బిభ్రత్కాపాలికం వ్రతమ్‌ || 2

కపాల పాణిర్విశ్వాత్మా చచార భువనత్రయమ్‌ | నా త్యాక్షీ చ్చాపి తం దేవం బ్రహ్మ హత్యాపి దారుణా || 3

ప్రతితీర్థం భ్రమన్‌ వాపి విముక్తో బ్రహ్మహత్యయా | అతః కామారిమహిమా సర్వో%పి హ్యవగమ్యతామ్‌ || 4

ప్రమథైస్సేవ్యమానో%పి హ్యేకదా విహరన్‌ హరః | కాపాలికో య¸° సై#్వరీ నారాయణ నికేతనమ్‌ || 5

అథాయాంతం మహాకాలం త్రినేత్రం సర్పకుండలమ్‌ | మహాదేవాంశసంభూతం పూర్ణాకారం చ భైరవమ్‌ || 6

పపాత దండవద్భూమౌ తం దృష్ట్వా గరుడధ్వజః | దేవాశ్చ మునయశ్చైవ దేవ నార్యస్సమంతతః || 7

అథ విష్ణుం ప్రణమ్యైనం ప్రయాతః కమలాపతిః | శిరస్యంజలిమాధాయ తుష్టావ వివిధైస్త్సవైః || 8

సానందో%థ హరిః ప్రాహ ప్రసన్నాత్మా మహామునే | క్షీరోద మథనోద్భూతాం పద్మాం పద్మాలయాం ముదా || 9

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓయీ సనత్కుమారా! సర్వజ్ఞా ! భైరవుని మరియొక గాథను ప్రీతితో వినుము. ఈ గాథ మహాపాపములను పోగొట్టి, భక్తిని వర్ధిల్ల జేయును (1). కాలునకు కాలుడు అగు భైరవుడు దేవదేవుడగు శివుని వాక్యముచే కాపాలికవ్రతమును అనుష్ఠించుచూ శివుని సన్నిధిలో చాల కాలమును గడిపెను (2). జగత్స్వరూపుడగు భైరవుడు కపాలమును చేతియందు ధరించి ముల్లోకములయందు తిరుగాడెను. దారుణమగు బ్రహ్మహత్య ఆ దేవుని కూడ విడిచిపెట్టలేదు (3). తీర్థములన్నియు తిరుగాడిన పిదప శివుని పట్టణములో బ్రహ్మహత్య ఆయనను విడిచిపెట్టెను. దీనిని బట్టి మన్మథ శత్రువగు శివుని మహిమను అందరు తెలియవచ్చును (4). శివస్వరూపుడగు ఆ భైరవుడు ప్రమథగణములచే సేవింపబడువాడే అయిననూ, ఒకనాడు యథేచ్ఛగా విహరించుచూ కపాలధారియై నారాయణుని నివాసమునకు వెళ్లెను (5). కాలునకు కాలుడు, ముక్కంటి, సర్పములే కుండలములుగా గలవాడు, మహాదేవుని పూర్ణమగు అంశతో జన్మించినవాడు అగు భైరవుడు వచ్చుచుండుటను (6) గాంచి, గరుడధ్వజుడగు విష్ణువు, దేవతలు, మునులు మరియు దేవతాస్త్రీలు అన్ని వైపులనుండియు సాష్టాంగ ప్రణామములనాచరించిరి (7). అపుడు లక్ష్మీపతియగు విష్ణువు భైరవునకు ప్రణమిల్లి శిరస్సుపై అంజలి ఘటించి అనేకస్తోత్రములతో స్తుతించెను (8). ఓ మహర్షీ ! అపుడు ఆనందముతో నిండి ప్రసన్నముగా నున్న మనస్సు గల విష్ణువు క్షీరసాగర మథనమునందు జన్మించిన, పద్మము ఆసనముగా గల లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆనందముతో నిట్లు పలికెను (9).

విష్ణురువాచ |

ప్రియే పశ్యాబ్జనయనే ధన్యాసి సుభ##గే%నఘే | ధన్యో%హం దేవి సుశ్రోణి యత్పశ్యావో జగత్పతిమ్‌ || 10

అయం ధాతా విధాతా చ లోకానాం ప్రభురీశ్వరః | అనాదిశ్శరణశ్శాంతః పురః షడ్వింశసంమితః || 11

సర్వజ్ఞస్సర్వయోగీశస్సర్వభూతైకనాయకః | సర్వభూతాంతరాత్మాయం సర్వేషాం సర్వదస్సదా || 12

యే వినిద్రా వినిశ్శ్వాసాశ్శాంతా ధ్యానపరాయణాః | ధియా పశ్యంతి హృదయే సో%యం పద్మే సమీక్షతామ్‌ || 13

యం విదుర్వేదతత్త్వజ్ఞా యోగినో యతమానసాః | అరూపో రూపవాన్‌ భూత్వా సో%యమాయాతి సర్వగః || 14

అహో విచిత్రం దేవస్య చేష్టితం పరమేష్ఠినః | యస్యాఖ్యాం బ్రువతో నిత్యం న దేహస్సో%పి దేహభృత్‌ || 15

తం దృష్ట్వా న పునర్జన్మ లభ్యతే మానవైర్భువి | సో%యామాయాతి భగవాన్‌ త్య్రంబకశ్శశిభూషణః || 16

విష్ణువు ఇట్లు పలికెను-

ఓ ప్రియురాలా! పద్మముల వంటి కన్నులు గలదానా! సుందరీ! పుణ్యాత్మురాలా! నీవు ధన్యురాలవు. ఓ దేవీ! సుందరీ! నేను కూడ ధన్యుడను. ఏలయన, మనము జగన్నాథుని చూచుచున్నాము (10). ఈ ఈశ్వరుడే సృష్టికర్త, కర్మఫలదాత, ముల్లోకములకు ప్రభువు, ఆది లేనివాడు, రక్షకుడు, శాంతస్వభావుడు, మరియు ఇరవై ఆరు తత్త్వములకు (10 ఇంద్రియములు+స్థూలసూక్ష్మ భూతములు, 10+ మనోబుద్ధ్యహం కారములు+ జీవపురుషులు+అదృష్టము=26) ఆయన అథిష్ఠానము (11). ఈయన సర్వప్రాణులలో అంతరాత్మయై వెలుగొందును. సర్వులకు సర్వకాలములయందు సర్వమును ఇచ్చునది ఈయనయే (12). ఓ లక్ష్మీ! యోగులు నిద్రను జయించి శ్వాసను నిరోధించి మనస్సును ఏకాగ్రము చేసి ధ్యాననిమగ్నులై బుద్ధితో హృదయమునందు ఏ పరమేశ్వరుని దర్శించెదరో, అట్టి ఈశ్వరుడు ఎదుట నున్నాడు. చూడుము (13). వేదముల సారమునెరింగి మనస్సును నియంత్రించిన యోగులు మాత్రమే ఏ ఈశ్వరుని తెలియగల్గుదురో, అట్టి నిరాకారుడు, సర్వవ్యాపకుడు అగు ఈశ్వరుడు దేహధారియై మన ఎదుటకు వచ్చుచున్నాడు (14). దేవదేవుడగు ఈశ్వరుని చేష్టలు ఆశ్చర్యకరములు సుమా! ఎవని నామమును కీర్తించినచో జన్మరాహిత్యము కలుగునో, అట్టివాడు దేహమును ధరించియున్నాడు (15). ఈయనను దర్శించిన మానవులు మరల భూమిపై జన్మించరు. అట్టి భగవానుడు, ముక్కంటియగు చంద్రశేఖరుడు మన ఎదుటకు వచ్చుచున్నాడు (16).

పుండరీక దలాయామే ధన్యే మే%ద్య విలోచనే | యద్దృశ్యతే మహాదేవో హ్యాభ్యాం లక్ష్మి మహేశ్వరః || 17

ధిక్‌ ధిక్‌ పదం తు దేవానాం పరం దృష్ట్వా న శంకరమ్‌ | లభ్యతే యత్ర నిర్వాణం సర్వదుఃఖాంతకృత్తు యత్‌ || 18

దేవత్వా దశుభం కించిద్దేవలోకే న విద్యతే | దృష్ట్వాపి సర్వేదేవేశం యన్ముక్తిం న లభామహే || 19

ఏవముక్త్వా హృషీకేశస్సంప్రహృష్టతనూరుహః | ప్రణిపత్య మహాదేవ మిదమాహ వృషధ్వజమ్‌ || 20

కిమిదం దేవదేవేన సర్వజ్ఞేన త్వయా విభో | క్రియతే జగతాం ధాత్రా సర్వపాపహరావ్యయ || 21

క్రీడేయం తవ దేవేశ త్రిలోచన మహామతే | కిం కారణం విరూపాక్ష చేష్టితం తే స్మరార్దన || 22

కిమర్థం భగవాన్‌ శంభో భిక్షాం చరసి శక్తిప | సంశయో మే జగన్నాథ ఏషత్రైలో క్యరాజ్యద || 23

ఓ లక్ష్మీ! మనమిద్దరము ఈనాడు మహేశ్వరుడగు మహాదేవుని గనినాము. పద్మ పత్రములవలె విశాలమగు నా కన్నులీనాడు ధన్యమైనవి (17). పరమాత్మయగు శంకరుని దర్శనముచే సర్వదుఃఖములను నశింపజేయు మోక్షము లభించును. అట్టి మోక్షము నీయజాలని దేవపదవులకు నిందయగు గాక! (18) దేవలోకములో దేవపదవిని పొందుటకంటె అధికమగు అశుభము మరియొకటి లేదు. ఏలయన, మేమందరము దేవదేవుని దర్శించియూ ముక్తిని పొందలేకున్నాము (19). ఇంద్రియాధిపతి యగు విష్టువు ఆనందముతో గగుర్పాటు గలవాడై ఇట్లు పలికి వృషభధ్వజుడగు మహాదేవునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను (20). హే విభూ! పాపములనన్నిటినీ హరించువాడా! వినాశము లేనివాడా! జగత్స్రష్టవు, దేవదేవుడవు, సర్వజ్ఞుడవు అగు నీవు ఈ పనిని ఏల చేయుచున్నావు? (21) ఓ దేవదేవా! ముక్కంటి! నీవు మహాబుద్ధిశాలివి. ఇది నీకు క్రీడ. ఓ బేసి కన్నువాడా! మన్మథనాశకా! నీవిట్లు చేయుటకు కారణమేమి? (22) హే భగవాన్‌! శంభో! శక్తి నాథా ! నీవు భిక్షాటనమును చేయుటకు కారణమేమి? ఓ జగన్నాథా ! ముల్లోకములపై ఆధిపత్యమును ఇచ్చిన నీవు ఈ సంశయమును దీర్చుము (23).

నందీశ్వర ఉవాచ |

ఏవముక్తస్తత శ్శంభుర్విష్ణునా భైరవో హరః | ప్రత్యువాచా ద్భుతో%తిస్స విష్ణుం విహసన్‌ ప్రభుః || 24

నందీశ్వరుడిట్లు పలికెను-

విష్ణువు ఇట్లు పలుకగా, భైరవరూపములో నున్నవాడు, పాపములను హరించువాడు, అద్భుతమగు లీలలు గలవాడు అగు శంభుప్రభుడు నవ్వి విష్ణువునకు ఇట్లు బదులిడెను (24).

భైరవ ఉవాచ |

బ్రహ్మణస్తు శిరశ్ఛిన్నమంగుల్యాగ్ర నఖేన హ | తదఘం ప్రతిహంతుంహి చరామ్యేతద్ర్వతం శుభమ్‌ || 25

భైరవుడిట్లు పలికెను-

బ్రహ్మయొక్క శిరస్సును వ్రేలిగోటితో దునిమియుంటిని. ఆ పాపమును పోగొట్టు కొనుటకై ఈ శుభవ్రతము నాచరించున్నాను (25).

నందీశ్వర ఉవాచ |

ఏవముక్తో మహేశేన భైరవేణ రమాపతిః | స్మృత్వా కించిన్నత శిరాః పునరేవమజిజ్ఞపత్‌ || 26

నందీశ్వరుడిట్లు పలికెను-

భైరవరూపములో నున్న మహేశ్వరుడిట్లు పలుకగా లక్ష్మీపతి ఆ వృత్తాంతమును స్మరించి కొద్దిగా తలను వంచుకొని, మరల ఇట్లు విన్నవించెను (26).

విష్ణురువాచ |

యథేచ్ఛసి తథా క్రీడ సర్వవిఘ్నోపనోదక | మాయయా మాం మహాదేవ నాచ్ఛాదయితుమర్హసి || 27

నా భీకమలకోశాత్తు కోటిశః కమలాసనాః | కల్పే కల్పే పురా హ్యాసన్‌ సత్యం యోగ జలాద్విభో || 28

త్యజ మాయా మిమాం దేవ దుస్తరామకృతాత్మభిః | బ్రహ్మాదయో మహాదేవ మాయయా తవ మోహితాః || 29

యథావదను గచ్ఛామి చేష్టితం తే శివాపతే | తవైవాను గ్రహాచ్ఛంభో సర్వేశ్వర సతాం గతే || 30

సంహారకాలే సంప్రాప్తే సదేవాన్‌ నిఖిలాన్మునీన్‌ | లోకాన్‌ వర్ణాశ్రమవతో హరిష్యసి యదా హర || 31

తదా కృతే మహాదేవ పాపం బ్రహ్మవధాదికమ్‌ | పారతంత్ర్యం న తే శంభో సై#్వరం క్రీడత్యతో భవాన్‌ || 32

అర్ఘీశ బ్రహ్మణో హ్యస్థ్నాం తస్రక్కంఠే తవ భాసతే | తథాద్యనుగతా శంభో బ్రహ్మహత్యా తవానఘ || 33

విష్ణువు ఇట్లు పలికెను-

విఘ్నముల నన్నిటినీ పొగొట్టే ఓ మహాదేవా! నీకు ఎట్లు అభీష్టమైనచో, అటులనే క్రీడించుము. నన్ను నీ మాయతో కప్పివేయదగదు (27). ఓ విభూ! నా నాభిలోని పద్మము యొక్క కోశమునుండి ప్రతికల్పమునందు ఎందరో బ్రహ్మలుపూర్వము యోగబలముచే పుట్టియుండిరి. ఇది సత్యము (28). ఓ దేవా! మనోనియంత్రణ లేనివారు దాట శక్యము కాని నీ ఈ మాయను విడిచిపెట్టుము. ఓ మహాదేవా ! నీ మాయచే బ్రహ్మాదులు మిహితులగుచున్నారు (29). ఓ పార్వతీపతీ! శంభూ! సర్వేశ్వరా! సత్పురుషులకు శరణమైనవాడా! నీ అనుగ్రహముచేతనే నీ లీలలను నేను యథాతథముగా తెలియగల్గుచున్నాను (30). ఓ హరా ! సంహారకాలము రాగానే నీవు దేవతలతో సర్వమహర్షులతో, వర్ణాశ్రమములతో గూడియున్న ఈ లోకములను ఉపసంహరించెదవు (31). నీవు బ్రహ్మ శిరస్సును నరుకుట అను పాపమును లోకక్షేమముకొరకు మాత్రమే చేసి యుంటివి. హే శంభూ! నీకు పరాధీనత లేదు. కావుననే నీవు యథేచ్ఛగా క్రీడించుచున్నావు (32). వేదవిహితములగు ఆహుతులకు ప్రభువైన శంకరా! నీ కంఠములో ఆస్థికల మాల ప్రకాశించుచున్నది. ఓ శంభూ! పాపరహితా! నిన్ను బ్రహ్మహత్య ఈ నాటికీ అనుసరించుచునే యున్నది (33).

కృత్వాపి సుమహత్పాపం యస్త్వాం స్మరతి మానవః | ఆధారం జగతామీశ తస్య పాపం విలీయతే || 34

యథా తమో న తిష్ఠేత సన్నిధావంశుమాలినః | తథైవ తవ యో భక్తః పాపం తస్య వ్రజేత్‌ క్షయమ్‌ || 35

యశ్చింతయతి పుణ్యాత్మా తవ పాదాంబుజద్వయమ్‌ | బ్రహ్మహత్యాకృతమపి పాపం తస్య వ్రజేత్‌ క్షయమ్‌ || 36

తవ నామానురక్తా వాగ్యస్య పుంసో జగత్పతే | అప్యద్రికూటతులితం నైనస్తమను బాధతే || 37

పరమాత్మన్‌ పరం ధామ స్వేచ్ఛా భిధృతవిగ్రహ | కుతూహలం తవేశేదం కృపణాధీనతేశ్వర || 38

అద్య ధన్యో%స్మి దేవేశ యన్న పశ్యంతి యోగినః | పశ్యామి తం జగన్మూర్తిం పరమేశ్వరమవ్యయమ్‌ || 39

అద్య మే పరమో లాభస్త్వద్య మే మంగలం పరమ్‌ | తం దృష్ట్వా మృత తృప్తస్య తృణం స్వర్గా పవర్గకమ్‌ || 40

ఇత్థం వదతి గోవిందే విమలా పద్మయా తయా | మనోరథవతీ నామ భిక్షాపాత్రే సమర్పితా || 41

భిక్షాటనాయ దేవో%పి నిరగాత్పరయా ముదా | అన్యత్రాపి మహాదేవో భైరవశ్చాత్త విగ్రహః || 42

దృష్ట్వానుయాయినీం తాం తు సమాహూయ జనార్దనః | సంప్రార్థయ ద్బ్రహ్మహత్యాం విముంచ త్వం త్రిశూలినమ్‌ || 43

మహా పాపమును చేసిన మానవుడైననూ జగత్తులకు ఆధారమగు నిన్ను స్మరించినచో ఆ పాపములు నశించి పోవును. ఓ ఈశా! (34) సూర్యుని సన్నిధిలో చీకటి ఉండలేదు. అటులనే నీ భక్తుని పాపము వినాశమును పొందును (35). ఏ పుణ్యాత్ముడు నీ పాద పద్మములను స్యరించునో, వాని బ్రహ్మ హత్యా పాపమైననూ నశించును (36). ఓ జగత్ప్రభూ! ఏ పురుషుని వాక్కు నీ నామమునందు రుచిని కలిగియుండునో, వానిని పర్వత శిఖరమువంటి పెద్ద పాపమైననూ భాధించలేదు (37). ఓ పరమాత్మా! పరంధామా! స్వేచ్ఛచే దేహమును ధరించిన వాడా! ఈశ్వరా! ఈశా! నీవు ఇట్టి దైన్యమునకు అధీనుడవగుట కేవలము కుతూహలము కొరకు మాత్రమే (38). ఓ దేవదేవా! పరమేశ్వరుడు, జగత్స్వరూపుడు, అవ్యయుడు అగు నిన్ను యోగులు కనజాలరు. అట్టి నిన్ను చూచి నేను ధన్యుడనైతిని (39). ఈనాడు నాకు సర్వోత్కృష్టమగు లాభము మరియు మంగళము కలిగినవి. నిన్ను చూచుట అనే అమృతముతో తృప్తిని చెందిన వానికి స్వర్గముగాని, మోక్షము గాని గడ్డి పోచతో సమానమగును (40). గోవిందుడిట్లు పలుకగా, ఆ లక్ష్మీదేవి భిక్షాపాత్రలో మనోరథనతి అనే స్వచ్ఛమగు మణిని (?) సమర్పించెను (41). భైరవరూపమును దాల్చిన దేవదేవుడగు ఆ మహాదేవుడు కూడ మహానందముతో భిక్షాటన కొరకు మరియొక స్థానమునకు వెడలెను (42). ఆయనను వెంటాడుచున్న ఆ బ్రహ్మ హత్యను వెనుకకు పిలిచి జనార్దనుడు 'నీవు త్రిశూలియగు శివుని విడిచి పెట్టుము' అని ప్రార్థించెను (43).

బ్రహ్మహత్యోవాచ |

అనేనాపి మిషేణాహం సంసేవ్యాముం వృషధ్వజమ్‌ | ఆత్మానం పావయిష్యామి త్వపునర్భవదర్శనమ్‌ || 44

బ్రహ్మహత్యఇట్లు పలికెను-

నేను ఈ వ్యాజముతో ఈ వృషభధ్వజుని చక్కగా సేవించి నన్ను పవిత్రము చేసుకొని పునర్జన్మ లేని మోక్షమును పొందెదను (44).

నందీశ్వర ఉవాచ |

సా తత్యా జ న తత్పార్శ్వం హ్మహృతాపి మురారిణా | తమూచే%థ హరిం శంభుస్స్మేరాస్యో భైరవో వచః || 45

నందీశ్వరుడిట్లు పలికెను-

మురారిచెప్పిననూ ఆమె ఆతని సమీపమునుండి తొలగిపోలేదు. అపుడు భైరవుడగు శంభుడు చిరునవ్వుతో విష్ణువును ఉద్దేశించి ఇట్లు పలికెను (45).

భైరవ ఉవాచ |

త్వద్వాక్‌ పీయూష పానేన తృప్తో%స్మి బహు మానద | స్వభావో%యం హి సాధూనాం యత్త్వం వదసి మాపతే || 46

వరం వృణీష్వ గోవింద వరదో%స్మి తవానఘ | అగ్రణీర్మమ భక్తానాం త్వం హరే నిర్వికారవాన్‌ || 47

నో మాద్యంతి తథా భైక్ష్యై ర్భిక్షవో%ప్యతి సంస్కృతైః | యథా మానసుధాపానైర్నను భిక్షాటన జ్వరాః || 48

భైరవుడిట్లు పలికెను-

అభిమానమును కాపాడే హే లక్ష్మీపతీ! అమృతతుల్యములగు నీ వచనములను విని సంతుష్టుడనైతిని. నీవు మాటలాడు తీరు సాధుస్వభావమై యున్నది (46). ఓ గోవిందా! వరమును కోరుకొనుము. ఓయీ అనఘా! నీకు వరమునిచ్చెదను. ఓ హరీ! వికారములు లేని నీవు నా భక్తులలో అగ్రగణ్యుడవు (47). భిక్షాటనము చేసి అలసిన సాధువులు ఆదరపూర్వకవచనములచే ఎట్టి సంతృప్తిని పొందెదరో, అట్టి సంతృప్తిని పరమమధురమగు భక్ష్యములతోగూడిన భిక్షాన్నము ఈయజాలదు (48).

నందీశ్వర ఉవాచ |

ఇత్యకర్ణ్య వచశ్శంభోర్భైరవస్య పరాత్మనః | సుప్రసన్నతరో భూత్వా సమవోచన్మహేశ్వరమ్‌ || 49

నందీశ్వరుడిట్లు పలికెను-

భైరవస్వరూపములోనున్న పరమాత్మయగు శంభుని ఈ మాటను విని, విష్ణువు మరింత ప్రసన్నుడై, మహేశ్వరునితో నిట్లనెను (49).

విష్ణురువాచ|

ఏష ఏవ వరశ్ల్మాఘ్యె యదహం దేవతాధిపమ్‌ | పశ్యామి త్వాం దేవదేవ మనోవాణీ పథాతిగమ్‌ || 50

అదభ్రేయం సుధా దృష్టిరనయా మే మహోత్సవః | అయత్ననిధిలాభో%యం వీక్షణం హరతే సతామ్‌ || 51

అవియోగో%స్తు మే దేవ త్వదం ఘ్రియుగలేనవై | ఏష ఏవ వరశ్శంభో నాన్యం కంచిద్వృణ వరమ్‌ || 52

విష్ణువు ఇట్లు పలికెను-

ఓ దేవదేవా! దేవతలకు ప్రభువు, దేవదేవుడు, మనస్సునకు వాక్కులకు అందని జ్ఞానమార్గములో నుండువాడు అగు నిన్ను నేను చూడగల్గుచున్నాను. ఇదియే కొనియాడదగిన వరము (50). ఈ నీ శ్రేష్ఠదర్శనము నాకు అమృతతుల్యము. నిన్ను చూచుటయే నాకు పెద్ద పండుగ. ఓ హరా! సత్పురుషులకు నీ దర్శనము ప్రయత్నము లేకుండగా నిధి లభించుట వంటిది (51). ఓ దేవా! నాకు నీ పాదపద్మములనుండి వియోగము కలుగకుండు గాక! ఓ శంభో! నేను కోరే వరమిదియే. నాకు మరియొక వరముతో పని లేదు (52).

శ్రీ బైరవ ఉవాచ |

ఏవం భవతు తే తాత యత్త్వయోక్తం మహామతే | సర్వేషామపి దేవానాం వరదస్త్వం భవిష్యసి || 53

శ్రీ భైరవుడిట్లు పలికెను-

వత్సా! నీవు మహాబుద్ధిశాలివి. నీవు కోరిన విధముగానే సర్వము సంపన్నమగును గాక! నీవుదేవతలందరిలో కూడా వరములనిచ్చువాడవు కాగలవు (53).

నందీశ్వర ఉవాచ |

అనుగృహ్యేతి దైత్యారిం కేంద్రాద్రి భువనే చరమ్‌ | భేజే విముక్త నగరీం నామ్మా వారాణసీం పురీమ్‌ || 54

క్షేత్రే ప్రవిష్టమాత్రే%థ భైరవే భీషణాకృతౌ | హా హేత్యుక్త్వా బ్రహ్మహత్యా పాతాలం చావిశత్తదా || 55

కపాలం బ్రహ్మణస్సద్యో భైరవస్య కరాంబుజాత్‌ | పపాత భువి తత్తీర్థ మ భుత్కాపాలమోచనమ్‌ || 56

కపాలం బ్రహ్మణో రుద్రస్సర్వేషామేవ పశ్యతామ్‌ | హస్తాత్పతంతమాలోక్య ననర్త పరయా ముదా || 57

విధేః కపాలం నాముంచత్క రమత్యంతదుస్సహమ్‌ | పరస్య భ్రమతః క్వాపి తత్కాశ్యాం క్షణతో%పతత్‌ || 58

శూలినో బ్రహ్మణో హత్యా నాపైతి స్మ చ యా క్వచిత్‌ | సా కాశ్యాం క్షణతో నష్టా తస్మాత్సేవ్యా హి కాశికా || 59

కపాలమోచనం కాశ్యాం యస్స్మరే త్తీర్థముత్తమమ్‌ | ఇహాన్యత్రాపి యత్పాపం క్షిప్రం తస్య ప్రణశ్యతి || 60

నందీశ్వరుడిట్లు పలికెను-

ఈ విధముగా భైరవుడు భూమికి కేంద్రమగు మేరుపర్వతమునందు మరియొక వైకుఠము నందు ఉండే, రాక్షస విరోధియగు విష్ణువును అనుగ్రహించి వారాణసి యని ప్రసిద్ది గాంచిన ముక్తి దాయకమగు నగరమును చేరెను (54). భయంకరాకారుడగు భైరవుడా క్షేత్రములో అడుగు పెట్టగానే, బ్రహ్మహత్య హాహాకారమును చేయుచూ పాతాళములో ప్రవేశించెను (55). భైరవుని పద్మమువంటి చేతినుండి బ్రహ్మయొక్క కపాలము వెంటనే క్రింద బడెను. ఆ స్థానము కాపాలమోచనమనే తీర్థము ఆయెను (56). రుద్రుడు (భైరవుడు) తన చేతినుండి బ్రహ్మయొక్క కపాలము నేల బడుటను గాంచి పరమానందముతో అందరు చూచుచుండగా నాట్యమును చేసెను (57). బ్రహ్మ యొక్క కపాలము పరమాత్మయగు భైరవుని చేతిని ఆయన ఇతరత్రా పరిభ్రమించినంతవరకు విడిచిపెట్టలేదు. మిక్కిలి దుస్సహమగు ఆ కపాలము కాశీలో క్షణకాలములో నశించెను. కావున కాశీనగరమును సేవించవలెను (59). ఎవడైతే కాశీలో కపాలమోచనమనే ఉత్తమ తీర్థమును స్మరించునో వాడు సర్వపాపములనుండి శీఘ్రమే విముక్తుడై ఇహపరములలో సుఖమును పొందును (60).

ఆగత్య తీర్థప్రవరే స్నానం కృత్వా విధానతః | తర్పయిత్వా పితౄన్‌ దేవాన్‌ ముచ్యతే బ్రహ్మహత్యయా || 61

కపాలమోచనం తీర్థం పురస్కృత్వా తు భైరవః | తత్రైవ తస్థౌ భక్తానాం భక్షయన్నఘ సంతతిమ్‌ || 62

కృష్ణాష్టమ్యాం తు మార్గస్య మాసస్య పరమేశ్వరః ఆ విర్బభూవ సల్లీలో భైరవాత్మా సతాం ప్రియః || 63

మార్గశీర్షా సితాష్టమ్యాం కాలభైరవసన్నిధౌ | ఉపోష్య జాగరాం కుర్వన్‌ మహాపాపైః ప్రముచ్యతే || 64

అన్యత్రాపి నరోభక్త్యా తద్ర్వతం యః కరిష్యతి | స జాగరం మహాపాపైర్ముక్తో యాస్యతి సద్గతిమ్‌ || 65

అనేక జన్మ నియుతైర్యత్‌ కృతం జంతుభిస్త్వఘమ్‌ | తత్సర్వం విలయం యాతి కాలభైరవదర్శనాత్‌ || 66

కాలభైరవభక్తానాం పాతకాని కరోతి యః | స మూఢో దుఃఖితో భూత్వా పునర్దుర్గతి మాప్నుయాత్‌ || 67

మానవుడు ఈ శ్రేష్ఠమగు తీర్థమునకు వచ్చి విధి విధానముగా స్నానమును చేసి పితృదేవతలకు తర్పణములనిచ్చినచో, బ్రహ్మహత్యాపాపమునుండి విముక్తుడగును (61). భైరవుడు కపాలమోచన తీర్థమునకెదురుగా అచటనే ఉండి భక్తుల పాపసందోహములను నశింపజేసెను (62). సత్పురుషులకు ప్రియమైనవాడు, గొప్ప లీలలు గలవాడునగు పరమేశ్వరుడు మార్గశీర్షమాసములో కృష్ణపక్షాష్టమినాడు భైరవరూపముతో ఆవిర్భవించెను (63). మార్గశీర్షకృష్ణాష్టమి నాడు కాలభైరవుని సన్నిధిలో ఉపవసించి జాగరమును చేయు వ్యక్తి మహాపాపములనుండి విముక్తుడగును (64). ఇతరస్థలములయందైననూ జాగరముతో సహా ఈ వ్రతముననుష్ఠించు మానవుడు మహాపాపములనుండి విముక్తుడై పుణ్యలోకములను పొందుడు (65). కాలభైరవదర్శనము వలన అనేక జన్మలనుండి సంచితమైన పాపములనుండి జీవులు పూర్తిగా విముక్తిని పొందెదరు (66). కాలభైరవుని భక్తులయెడ పాపమునాచరించు మూర్ఖుడు దుఃఖమును పొందుటయే గాక నరకమును కూడ అనుభవించును (67).

విశ్వేశ్వరే%పి యే భక్తా నోభక్తాః కాలభైరవే | తే లభంతే మహాదుఃఖం కాశ్యాం చైవ విశేషతః || 68

వారాణస్యాముషిత్వా యో భైరవం న భ##జేన్నరః | తస్య పాపాని వర్ధంతే శుక్లపక్షే యథా శశీ || 68

కాలరాజం న యః కాశ్యాం ప్రతి భూతాష్టమీకుజమ్‌ | భ##జేత్తస్య క్షయం పుణ్యం కృష్ణపక్షే యథా శశీ || 70

శ్రుత్వాఖ్యానమిదం పుణ్యం బ్రహ్మహత్యాపనోదకమ్‌ | భైరవోత్పత్తి సంజ్ఞం చ సర్వపాపైః ప్రముచ్యతే || 71

బంధనాగారసంస్థో%పి ప్రాప్తో%పి విపదం పరామ్‌ | ప్రాదుర్భావం భైరవస్య శ్రుత్వా ముచ్యేత సంకటాత్‌ || 72

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్ర సంహితాయాం భైరవలీలావర్ణనం నామ నవమో%ధ్యాయః(9).

విశ్వేశ్వరుని యందు భక్తి ఉండియూ, కాలభైరవుని యందు భక్తి లేనిచో, అట్టివారు కాశీలో విశేషించి మహాదుఃఖమును పొందెదరు (68). వారాణసి యందు నివసించు చుండియూ ఏ మానవుడు కాలభైరవుని సేవించడో, వాని పాపములు శుక్లపక్షచంద్రుని వలె వృద్ధిని పొందును (69). ఎవడైతే కాశీలో కృష్ణ పక్షాష్టమీ బుధవారమునాడు కాలభైరవుని సేవించడో, వాని పుణ్యము కృష్ణపక్షచంద్రుని వలె క్షీణించును (70). భైరవుని పుట్టుక, ఆతనికి బ్రహ్మహత్యనుండి విముక్తి అను ఈ పవిత్రమగు వృత్తాంతమును విన్న మానవుడు పాపములన్నింటినుండియు విముక్తిని పొందును (71). కారాగారములో బంధింపబడినవాడు గాని, గొప్ప ఆపదను పొందినవాడు గాని భైరవవిర్భావ వృత్తాంతమును విన్నచో ఆ కష్టమునుండి విముక్తుడగును (72).

శ్రీ శివమహాపురాణములోని శతరుద్ర సంహితయందు భైరవ లీలావర్ణనమనే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).

Siva Maha Puranam-3    Chapters