Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Siva Maha Puranam-3    Chapters   

అథ చతుర్థో%ధ్యాయః

శివ మాయా ప్రభావము

మునయ ఊచుః |

తాత తాత మహాభాగ ధన్యస్త్వం హి మహామతే | అద్భుతేయం కథా శంభోః శ్రావితా పరభక్తిదా || 1

పునర్బ్రూహి కథాం శంభోర్వ్యాసప్రశ్నానుసారతః | సర్వజ్ఞస్త్వం వ్యాసశిష్యశ్శివతత్త్వవిచక్షణః || 2

మునులు ఇట్లు పలికిరి -

ఓ తండ్రీ! మహాత్మా! మహాబుద్ధిశాలివి అగు నీవు ధన్యుడవు. శంభునిపై గొప్ప భక్తిని కలిగించే ఈ అద్భుతమగు కథను చెప్పితివి (1). వ్యాసుని ప్రశ్నకు అనురూపముగా మరల ఆ గాథను చెప్పుము. వ్యాసశిష్యుడవగు నీవు సర్వజ్ఞుడవు మరియు శివతత్త్వములో విద్వాంసుడవు (2).

సూత ఉవాచ |

ఏవమేవ గురుర్వ్యాసః పృష్టవాన్మే%జసంభవమ్‌ | సనత్కుమారం సర్వజ్ఞం శివభక్తం మునీశ్వరమ్‌ || 3

సూతుడు ఇట్లు పలికెను-

బ్రహ్మపుత్రుడు, సర్వజ్ఞుడు, శివభక్తుడు అగు సనత్కుమార మహర్షిని నాకు గురవగు వ్యాసుడు ఇటులనే ప్రశ్నించెను (3).

వ్యాస ఉవాచ |

సనత్కుమార సర్వజ్ఞ శ్రావితేయం శుభా కథా | శంకరస్య మహేశస్య నానాలీలావిహారిణః || 4

పునర్బ్రూహి మహాదేవమహిమానం విశేషతః | శ్రద్ధా చ మహతీ శ్రోతుం మమ తాత ప్రవర్ధతే || 5

మహిమ్నా యేన శంభోస్తు యే యే లోకే విమోహితాః | మాయయా జ్ఞానమావృత్య నానాలీలావిహారిణః || 6

వ్యాసుడు ఇట్లు పలికెను-

సర్వజ్ఞుడవగు ఓ సనత్కుమారా ! మహేశ్వరుడు, అనేకలీలలతో విహరించువాడు నగు శంకరుని ఈ శుభగాథను నీవు వినిపించితివి (4). మహాదేవుని మహిమను విశేషించి మరల చెప్పుము. ఓ తండ్రీ! మాయచే అనేకలీలలను నెరపు శంభుని మహిమచే లోకములో ఏయే జనులు మాయచే కప్పివేయబడిన జ్ఞానము గలవారై మోహమును పొందినారు అనే విషయమును వినాలనే శ్రద్ధ అధికముగా నున్నది (5, 6)

సనత్కుమార ఉవాచ |

శృణు వ్యాస మహాబుధ్ధే శాంకరీం సుఖదాం కథామ్‌ | యస్యాః శ్రవణమాత్రేణ శివే భక్తిః ప్రజాయతే || 7

శివస్సర్వేశ్వరో దేవస్సర్వాత్మా సర్వదర్శనః | మహిమ్నా తస్య సర్వం హి వ్యాప్తం చ సకలం జగత్‌ || 8

శివసై#్యవ పరా మూర్తిర్ర్బహ్మవిష్ణ్వీశ్వరాత్మికా | సర్వభూతాత్మభూతాఖ్యా త్రిలింగాలింగరూపిణీ|| 9

దేవానాం యోనయశ్చాష్టౌ మానుషో నవమీ చ యా | తిరశ్చాం యోనయః పంచ భవంత్యేవం చతుర్దశ || 10

భూతా వా వర్తమానా వా భవిష్యాశ్చైవ సర్వశః | శివాత్సర్వే ప్రవర్తంతే లీయంతే వృద్ధిమాగతాః || 11

బ్రహ్మేంద్రోపేంద్రచంద్రాణాం దేవదానవభోగినామ్‌ | గంధర్వాణాం మనుష్యాణామన్యేషాం వాపి సర్వశః || 12

బంధుర్మిత్రమథాచార్యో రక్షన్నేతా%ర్థవాన్‌ గురుః | కల్పద్రుమో%థ వా భ్రాతా పితా మాతా శివో మతః || 13

శివస్సర్వమయః పుంసాం స్వయం వేద్యః పరాత్పరః | వక్తుం న శక్యతే యశ్చ పరం చానుపరం చ యత్‌ || 14

తన్మాయా పరమా దివ్యా సర్వత్ర వ్యాపినీ మునే | తదధీనం జగత్సర్వం సదేవాసురమానుషమ్‌ || 15

కామేన స్వసహాయేన ప్రబలేన మనోభువా | సర్వః ప్రధర్షితో వీరో విష్ణ్వాదిప్రబలో%పి హి || 16

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

మహాబుద్ధిశాలివియగు ఓ వ్యాసా! శంకరుని సుఖములనిచ్చే గాథను వినుము. దీనిని విన్నంత మాత్రాన శివునియందు భక్తి ఉదయించును (7). సర్వేశ్వరుడు, సర్వుల ఆత్మ, సర్వసాక్షియగు ఆ శివదేవుని మహిమచే ఈ సకలజగత్తు మరియు సర్వము వ్యాప్తమై యున్నది (8). బ్రహ్మవిష్ణురుద్రులు శివుని శ్రేష్ఠమగు మూర్తులు మాత్రమే. సర్వప్రాణులలోని ఆత్మ శివుడే. మూడు రూపములలో భాసించు శివుడు యథార్థముగా రూపము లేనివాడు (9). ఎనిమిది దేవయోనుగు, ఒక మనుష్యయోని మరియు పశుపక్ష్యాదుల యోనులు అయిదు వెరసి పదునాలుగు యోనులు గలవు (10). ఈ యోనులలో భూతభవిష్యద్వర్తమానకాలములలోని సర్వప్రాణులు శివుని నుండి జన్మించి శివుని యందు వృద్ధిని చెంది శివునిలో లీనమగుచున్నవి (11). బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువు, చంద్రుడు, దేవతలు, దానవులు, పన్నగులు, గంధర్వులు, మానవులు మరియు ఇతరులు అందరికీ అన్ని విధములుగా శివుడే బంధువు, స్నేహితుడు, ఆచార్యుడు, రక్షకుడు, నాయకుడు, సాఫల్యమునిచ్చే గురువు, కల్పవృక్షము, సోదరుడు, తండ్రి మరియు తల్లి అని చెప్పబడినది (12, 13). సర్వస్వరూపుడు, ప్రకృతికంటే అతీతుడు అగు శివుని మానవుడు తప్పక స్వయముగా తెలియవలెను. శివునితో సమమైన వాడు గాని, అధికుడు గాని ఉన్నాడని చెప్పుటకు శక్యము కాదు (14). ఓ మునీ! పరమదివ్యమగు శివుని మాయ సర్వమును వ్యాపించియున్నది. దేవదానవమానవులతోకూడిన జగత్తు అంతయు ఆ మాయకు ఆధీనమై యున్నది (15). లేశ##మైనను సాహాయ్యము లేనివాడు, మనస్సులో ఉదయించువాడు, మిక్కిలి బలశాలి అగు మన్మథుడు విష్ణువు మొదలగు అధికబలశాలురగు వీరులనందరినీ కూడ జయించినాడు (16).

శివమాయాప్రభావేణాభూద్ధరిః కామమోహితః | పరస్త్రీధర్షణం చక్రే బహువారం మునీశ్వర || 17

ఇంద్రస్త్రిదశపో భూత్వా గౌతమస్త్రీవిమోహితః | పాపం చకార దుష్టాత్మా శాపం ప్రాప మునేస్తదా || 18

పావకో%పి జగచ్ఛ్రేష్ఠోమోహితశ్శివమాయయా | కామాధీనః కృతో గర్వాత్తతస్తేనైవ చోద్ధృతః || 19

జగత్ర్పాణో% పి గర్వేణ మోహితశ్శివమాయయా | కామేన నిర్జితో వ్యాస చక్రే%న్యస్త్రీ రతింపురా || 20

చండరశ్మిస్తు మార్తండో మోహితశ్శివమాయయా | కామాకులో బభూవాశు దృష్ట్వాశ్వీం హయరూపధృక్‌ || 21

చంద్రశ్చ మోహితశ్శంభోర్మాయయా కామసంకులః | గురుపత్నీం జహారాథ యుతస్తేనైవ చోద్ధృతః || 22

పూర్వం తు మిత్రావరుణౌ ఘోరే తపసి సంస్థితౌ | మోహితౌ తావపి మునీ శివమాయావిమోహితౌ || 23

ఉర్వశీం తరుణీం దృష్ట్వా కాముకౌ సం బభూవతుః | మిత్రః కుంభే జహౌ రేతో వరుణో% పి తథా జలే || 24

తతః కుంభాత్సముత్పన్నో వసిష్ఠో మిత్రసంభవః | అగస్త్యో వరుణాజ్జాతో వడవాగ్నిసమద్యుతిః || 25

దక్షశ్చ మోహితశ్శంభోర్మాయయా బ్రహ్మణస్సుతః | భ్రాతృభిస్స భగిన్యాం వై భోక్తుకామో%భవత్పురా || 26

బ్రహ్మా చ బహువారం హి మోహితశ్శివమాయయా | అభవద్భోక్తుకామశ్చ స్వసుతాయాం పరాసు చ || 27

ఓ మహర్షీ! విష్ణువు శివుని మాయయొక్క ప్రభావముచే అనేకపర్యాయములు కామముచే మోహితుడై పరస్త్రీలను పీడించెను (17). దుర్బుద్ధి, దేవతలకు అధిపతి అగు ఇంద్రుడు గౌతముని భార్యచే వ్యామోహితుడై పాపమును చేసి అప్పుడు మహర్షియొక్క శాపమునకు గురి అయ్యెను (18). జగత్తులో శ్రేష్ఠుడగు అగ్ని కూడ గర్వితుడై శివమాయచే మోహితుడై కామమునకు వశుడైనాడు. తరువాత ఆయనను శివుడే ఉద్ధరించినాడు (19). ఓ వ్యాసా! జగత్తునకు ప్రాణమైన వాయువు కూడ పూర్వము గర్వించి శివమాయచే మోహితుడై కామునిచే జయింపబడి పరస్త్రీతో సంభోగించెను (20). తీక్‌ష్ణమగు కిరణములుగల సూర్యుడు శివమాయచే మోహితుడై కామునిచే ఆకులితునిగా చేయబడి ఒక ఆడగుర్రమును చూచి వెంటనే గుర్రము రూపమును దాల్చెను (21). చంద్రుడు శంభుని మాయచే మోహితుడై మన్మథవికారమునకు లోనై గురుపత్నిని అపహరించెను. అపుడు శివుడే వారిని కలిపి ఉద్ధరించెను (22). పూర్వము మిత్రావరుణులు ఘోరమగు తపస్సును చేసిరి. ఆ మునులు కూడ శివమాయచే మోహమును పొందిరి (23). వారిద్దరు యువతియగు ఊర్వశిని చూచి కామవికారమును పొందిరి. మిత్రుడు కుండయందు, వరుణుడు జలమునందు తేజస్సును త్యజించిరి (24). తరువాత వసిష్ఠుడు కుంభమునుండి పుట్టి మిత్రుని పుత్రుడైనాడు. వరుణుని పుత్రుడైన అగస్త్యుడు బడబాగ్నితో సమానమైన తేజస్సును కలిగియుండెను (25). పూర్వము బ్రహ్మపుత్రుడగు దక్షుడు సోదరులతో సహా శంభుని మాయచే మోహితుడై సోదరియందు దుర్బుద్ధిని చేసెను (26). అనేకపర్యాయములు శివుని మాయచే మోహితుడైన బ్రహ్మ తన కుమార్తెయందు మరియు ఇతర స్త్రీలయందు దుర్బుద్ధిని పొందెను (27).

చ్యవనో% పి మహాయోగీ మోహితశ్శివమాయయా | సుకన్యయా విజహ్రే స కామాసక్తో బభూవ హ || 28

కశ్యపశ్శివమాయాతో మోహితః కామసంకులః | యయాచే కన్యకాం మోహాద్ధన్వనో నృపతేః పురా || 29

గరుడశ్శాండిలీం కన్యాం నేతుకామస్సుమోహితః | విజ్ఞాతస్తు తయా సద్యో దగ్ధపక్షో బభూవ హ || 30

విభాండకో మునిర్నారీం దృష్ట్వా కామవశం గతః | ఋష్యశృంగసుతస్తస్య మృగ్యాం జాతశ్శివాజ్ఞయా || 31

గౌతమశ్చ మునిశ్శంభోర్మాయామోహితమానసః | దృష్ట్వా శారద్వతీం నగ్నాం రరామ క్షుభితస్తయా || 32

రేతస్స్కన్నం దధార స్వం ద్రోణ్యాం చైవ స తాపసః | తస్మాచ్చ కలాశాజ్జాతో ద్రోణశ్శస్త్రభృతాం వరః || 33

పరాశరో మహాయోగీ మోహితశ్శివమాయయా | మత్స్యోదర్యా చ చిక్రీడే కుమార్యా దాశకన్యయా || 34

విశ్వామిత్రో బభూవాథ మోహితశ్శివమాయయా | రేమే మేనకయా వ్యాస వనే కామవశం గతః|| 35

వసిష్ఠేన విరోధం తు కృతవాన్నష్టచేతనః | పునశ్శివప్రసాదాచ్చ బ్రాహ్మణో% భూత్స ఏవవై || 36

రావణో వైశ్రవాః కామీ బభూవ శివమాయయా | సీతాం జహ్రే కుముద్ధిస్తు మోహితో మృత్యుమాప చ || 37

బృహస్పతిర్మునివరో మోహితశ్శివమాయయా | భ్రాతృపత్న్యా వశీ రేమే భరద్వాజస్తతో%భవత్‌ || 38

ఇతి మాయప్రభావో హి శంకరస్య మహాత్మనః | వర్ణితస్తే మయా వ్యాస కిమన్యచ్ఛ్రో తుమిచ్ఛసి || 39

ఇతి శ్రీ శివమహాపురాణ ఉమాసంహితాయం శివమాయాప్రభావవర్ణనం నామ చతుర్థో%ధ్యాయః (4).

మహాయోగియగు చ్యవనుడు కూడ శివమాయచే మోహితుడై కామమునందు ఆసక్తి గలవాడై సుకన్యతో విహరించెను (28). పూర్వము కశ్యపుడు శివునిమాయచే మోహితుడై కామముచే క్షోభితుడై ధన్వమహారాజుయొక్క కుమార్తెను యాచించెను (29). మిక్కిలి మోహితుడై యున్న గరుడుడు శండిలుని కన్యను అపహరించ బూనుకొనెను. ఆమెకు విషయము తెలియగానే ఆతని రెక్కలు కాలిపోయెను (30). విభాండకమహర్షి స్త్రీని చూచి కామమునకు వశుడాయెను. అపుడు శివుని ఆజ్ఞచే అతనికి అడు లేడియందు ఋష్యశృంగుడు కుమారునిగా జన్మించెను (31). గౌతమమహర్షి శంభుని మాయచే మోహితమైన అంతఃకరణము గలవాడై నగ్నురాలైయున్న శారద్వతిని చూచి క్షోభను పొంది ఆమెతో రమించెను (32). ఆ మహర్షి స్కన్నమైన తన తేజస్సును కలశమునందు ధరించెను. ఆ కలశమునుండి ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన ద్రోణుడు జన్మించెను (33). మహాయోగియగు పరాశరుడు శివమాయచే మోహితుడై చేపనుండి పుట్టిన, కుమారి యగు దాశకన్యతో రమించెను (34). ఓ వ్యాసా! విశ్వామిత్రుడు శివమాయచే మోహితుడై కామమునకు వశుడై వనములో మేనకతో రమించెను (35). నశించిన వివేకము గల ఆతడు వసిష్ఠునితో విరోధమును చేసెను. మరల శివుని అనుగ్రహముచే ఆయనయే బ్రాహ్మణుడాయెను (36). విశ్రవసుని కుమారుడగు రావణుడు శివుని మాయచే మోహితుడై కామమునకు లొంగి దుర్బుద్ధి గలవాడై సీతను అపహరించి మృత్యువు వాత పడెను (37). మహర్షి, జితేంద్రియుడు అగు బృహస్పతి శివమాయచే మోహితుడై సోదరుని భార్యతో రమించగా భరద్వాజుడు జన్మించెను (38). ఓ వ్యాసా! ఈ విధముగా నేను మహాత్ముడగు శంకరుని మాయాప్రభావమును నీకు వర్ణించి చెప్పితిని. ఇంకనూ ఏమి వినగోరుచున్నావు ? (39)

శ్రీ శివమహాపురాణములో ఉమాసంహితయందు శివమాయాప్రభావమును వర్ణించే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).

Siva Maha Puranam-3    Chapters