Siva Maha Puranam-3    Chapters   

అథ తృతీయో%ధ్యాయః

శివభక్తి మాహాత్మ్య వర్ణనము

సనత్కుమార ఉవాచ |

ఏతచ్ఛ్రుత్వా వచస్తస్య సో%బ్రవీత్తం మహామునిమ్‌ | విస్మయం పరమం గత్వోపమన్యుం శాంతమానసమ్‌ || 1

సనత్కుమారుడు ఇట్లుపలికెను-

శాంతమైన మనస్సు గల ఆ ఉపమన్యుమహర్షి యొక్క ఈ మాటలను విని ఆ శ్రీ కృష్ణుడు అత్యాశ్చర్యమును పొందినవాడై ఆయనతో నిట్లనెను (1).

వాసుదేవ ఉవాచ |

ధన్యస్త్వమపి విప్రేంద్ర కస్త్వాం స్తోతుమలం కృతీ | యస్య దేవాదిదేవస్తే సాన్నిధ్యం కురుతు శ్రమే || 2

దర్శనం మునిశార్దూల దద్యాత్స భగవాన్‌ శివః | అపి తావన్మమాప్యేవం ప్రసాదం వా కరోత్వసౌ || 3

శ్రీకృష్ణుడు ఇట్లుపలికెను-

ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! నీవు ధన్యుడవు, కృతార్థుడవు. దేవతలకు ఆదిదేవుడగు శివుడు నీ ఆశ్రమములో నివసించుచున్నాడు. అట్టి నిన్ను పొగడుటకు ఎవనికి శక్యమగును? (2) ఓ మహర్షీ! ఆ శివభగవానుడు నాకు కూడ అదే విధముగా దర్శనమునిచ్చునా? నాపై అనుగ్రహమును చూపునా? (3)

ఉపమన్యురువాచ |

అచిరేణౖవ కాలేన మహాదేవం న సంశయః | తసై#్యవ కృపయా త్వం వై ద్రక్ష్యసే పురుషోత్తమ || 4

షోడశే మాసి సువరాన్‌ ప్రాప్స్యసి త్వం మహేశ్వరాత్‌ | సపత్నీకాత్కథం నో దాస్యతే దేవో వరాన్‌ హరే || 5

పూజ్యో%సి దైవతైస్సర్వైః శ్లాఘనీయస్సదా గుణౖః | జాప్యం తే%హం ప్రవక్ష్యామి శ్రద్ధధానాయ చాచ్యుత || 6

తేన జపప్రభావేణ సత్యం ద్రక్ష్యసి శంకరమ్‌ | ఆత్మతుల్యబలం పుత్రం లభిష్యసి మహేశ్వరాత్‌ || 7

జపో నమశ్శివాయేతి మంత్రరాజమిమం హరే | సర్వకామప్రదం దివ్యం భుక్తిముక్తిప్రదాయకమ్‌ || 8

ఉపమన్యుడు ఇట్లు పలికెను-

ఓ పురుషోత్తమా! నీవు నిస్సందేహముగా తొందరలోనే ఆ మహాదేవుని అనుగ్రహముచే మాత్రమే ఆయనను దర్శించగలవు (4). ఓ హరీ! నీవు పార్వతీసమేతుడగు మహేశ్వరునినుండి పదునారవ మాసమునందు మంచి వరములను పొందగలవు. ఆ దేవుడు వరములను ఏల ఈయడు? (5) సద్గుణములచే కొనియాడదగిన నీవు సర్వదా సర్వదేవతలకు పూజనీయుడవగుచున్నావు. ఓ అచ్యుతా! శ్రద్ధావంతుడవగు నీకు జపించదగిన మంత్రమును నేను ఉపదేశించెదను (6). నీవు ఆ మంత్రజపప్రభావముచే శంకరుని నిశ్చయముగా దర్శించగలవు. నీవు మహేశ్వరుని అనుగ్రహముచే నీతో సమానమగు బలము గల పుత్రుని పొందగలవు (7). ఓ శ్రీహరీ ! మంత్రములలో గొప్పది, కోర్కెలనన్నిటినీ ఈడేర్చునది, దివ్యమైనది, భుక్తిని మరియు ముక్తిని ఇచ్చునది అగు నమశ్శివాయ అను మంత్రమును జపించుము (8).

సనత్కుమార ఉవాచ|

ఏవం కథయతస్తస్య మహాదేవాశ్రితాః కథాః | దినాన్యష్ఠౌ ప్రయాతాని ముహూర్తమివ తాపస || 9

నవమే తు దినే ప్రాప్తే మునినా స చ దీక్షితః | మంత్రమధ్యాపితం శార్వమాథర్వశిరసం మహత్‌ || 10

జటీ ముండీ చ సద్యో%సౌ బభూవ సుసమాహితః | పాదాంగుష్ఠోద్ధతతనుస్తేపే చోర్ధ్వభుజస్తథా || 11

సంప్రాప్తే షోడశే మాసి సంతుష్టః పరమేశ్వరః | పార్వత్యా సహితశ్శంభుర్దదౌ కృష్ణాయ దర్శనమ్‌ || 12

పార్వత్యా సహితం దేవం త్రినేత్రం చంద్రశేఖరమ్‌ | బ్రహ్మాద్యైః స్తూయామానం తు పూజితం సిద్ధకోటిభిః || 13

దివ్యమాల్యాంబరధరం భక్తినమ్రైస్సురాసురైః | ప్రణతం చ విశేషేణ నానాభూషణ భూషితమ్‌ || 14

సర్వాశ్చర్యమయం కాంతం మహేశమజమవ్యయమ్‌ | నానాగణాన్వితం తుష్టం పుత్రాభ్యాం సంయుతం ప్రభుమ్‌ || 15

శ్రీకృష్ణః ప్రాంజలిర్దృష్ట్వా విస్మయోత్ఫుల్లలోచనః | ఈదృశం శంకరం ప్రీతః ప్రణనామ మహోత్సవః || 16

నానావిధైః స్తుతిపదైర్వాఙ్మ యేనార్చయత్తదా | సహస్రనామ్నా దేవేశం తుష్టావ నతకంధరః || 17

తతో దేవాస్సగంధర్వా విద్యాధరమహోరగాః | ముముచుఃపుష్పవృష్టిం చ సాధువాదాన్మనో%నుగాన్‌ || 18

పార్వతాశ్చ ముఖం దృష్ట్వా భగవాన్‌ భక్తవత్సలః | ఉవాచ కేశవం తుష్టో రుద్రశ్చాథ బిడౌజసా || 19

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! ఈ విధముగా ఆయన మహాదేవునకు సంబంధించిన గాథలను చెప్పుచుండగా ఎనిమిది రోజులు ముహూర్తకాలము వలె గడచినవి (9). తొమ్మిదవ నాడు ఆ మహర్షి శ్రీకృష్ణునకు దీక్షను ఇచ్చి అథర్వవేదముయొక్క ఉపనిషత్తులోని శంకర మంత్రమును ఉపదేశించెను (10). జటలను కలిగియున్న శ్రీకృష్ణుడు వెంటనే మండనము చేయించుకొని కాలి బొటనవ్రేలిపై శరీరముయొక్క బరువును నిలిపి చేతులను పైకెత్తి మనస్సును సమాహితము చేసి తపస్సును చేసెను (11). ఈ విధముగా పదునారు మాసములు గడువగా, సంతసిల్లిన పరమేశ్వరుడు పార్వతితో కలిసి శ్రీకృష్ణునకు దర్శనమునిచ్చెను (12). పార్వతితో కూడియున్నవాడు, చంద్రుడు శిరోభూషణముగా గలవాడు, బ్రహ్మాదులచే కొనియాడబడుచున్నవాడు, కోట్లమంది సిద్ధులచే పూజింపబడుచున్నవాడు, దివ్యమగు వస్త్రములను మరియు మాలను దాల్చినవాడు, భక్తులైన దేవతలచే మరియు రాక్షసులచే నమస్కరింపబడుచున్నవాడు, విశేషించి అనేకభూషణములను ధరించి యున్నవాడు, సర్వవిధముల ఆశ్చర్యములకు నిధానమైనవాడు, సుందరమైనవాడు, మహేశ్వరుడు, పుట్టుక లేనివాడు, అనేకగణములతో మరియు పుత్రులతో గూడి ఆనందముగా నున్నవాడు, సర్వసమర్థుడు అగు ముక్కంటి దైవమును చూచి (13-15), శ్రీకృష్ణుడు ఆశ్చర్యముతో విప్పారిన నేత్రములు గలవాడై అట్టి శంకరునకు మహోత్సాహముతో ప్రీతితో చేతులను జోడించి నమస్కరించెను (16). అపుడు ఆయన తలను వంచి అనేకరకముల స్తోత్రములతో స్తుతించి మరియు సహస్రనామములను పఠించి ఆ దేవదేవునకు వాగ్రూపమైన అర్చనను చేసెను (17). అపుడు దేవతలు, గంధర్వులు, విద్యాధరులు మరియు పన్నగులు పుష్పవృష్టిని కురిపించి తమ మనస్సునకు నచ్చిన సాధువచనములను పలికిరి (18). భక్తవత్సలుడగు రుద్రభగవానుడు పార్వతికేసి చూచి సంతోషించి తన తేజస్సు సర్వత్రా వ్యాపించుచుండగా, అపుడు కేశవునితో నిట్లనెను (19).

మహాదేవ ఉవాచ |

కృష్ణం జానామి భక్తం త్వాం మయి నిత్యం దృఢవ్రతమ్‌ | వృణీష్వ త్వం వరాన్మత్తః పుణ్యాంసై#్త్రలోక్యదుర్లభాన్‌ || 20

మహాదేవుడు ఇట్లు పలికెను-

నీవు నాయందు నిత్యము భక్తి గల మరియు దృఢమగు వ్రతము గల శ్రీకృష్ణుడవని నాకు తెలియును. నీవు నానుండి పవిత్రమైన, ముల్లోకములలో దుర్లభ##మైన వరములను కోరుకొనుము (20).

సనత్కుమార ఉవాచ |

తస్య తద్వచనం శ్రుత్వా కృష్ణః ప్రాంజలిరాదరాత్‌ | ప్రాహ సర్వేశ్వరం శంభుం సుప్రణమ్య పునః పునః || 21

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

సర్వేశ్వరుడగు శంభుని ఆ మాటను విని శ్రీకృష్ణుడు పలుమార్లు ఆయనకు ఆదరముతో చేతులను జోడించి చక్కగా నమస్కరించి ఇట్లు పలికెను (21).

కృష్ణ ఉవాచ |

దేవదేవ మహాదేవ యాచే%హం హ్యుత్తమాన్వరాన్‌ | త్వత్తోష్టప్రమితాన్నాథ త్వయోద్దిష్టాన్మహేశ్వర || 22

తవ ధర్మే మతిర్నిత్యం యశశ్చాప్రచలం మహత్‌ | త్వత్సామీప్యం స్థిరా భక్తిస్త్వయి నిత్యం మమాస్త్వితి || 23

పుత్రాణి చ దశాద్యానాం పుత్రాణాం మమ సంతు వై | వధ్యాశ్చ రిపవస్సర్వే సంగ్రామే బలదర్పితాః || 24

అపమానో భ##వేన్నైవ క్వచిన్మే శత్రుతః ప్రభో | యోగినామపి సర్వేషాం భ##వేయమితి వల్లభః || 25

ఇత్యష్టౌ సువరాన్దేహి దేవదేవ నమో%స్తు తే | సర్వేశ్వరస్త్వమేవాసి మత్ర్పభుశ్చ విశేషతః || 26

శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను-

ఓ దేవదేవా! మహాదేవా ! నాథా ! మహేశ్వరా! నేను నీనుండి నీవు సూచించిన విధముగా ఎనిమిది ఉత్తమమగు వరములను కోరుచున్నాను (22). నిత్యము నీ ధర్మమునందు బుద్ధి నిలుచుట, అచలమైన గొప్ప కీర్తి, స్థిరమైన నీ సన్నిధి, నాకు నీయందు నిత్యభక్తి కలుగుగాక! (23) నా మొదటి కుమారులకు ఒక్కొక్కరికి పదిమంది పుత్రులు కలిగెదరు గాక! బలముచే గర్వించియున్న శత్రువులు అందరు సంగ్రామములో వధింపబడుదురు గాక! (24) ఓ ప్రభూ! నాకు ఎక్కడైననూ శత్రువుల వలన అవమానము కలుగకుండు గాక! నేను యోగులందరికి ప్రియుడను అగుదును గాక! (25) ఓ దేవదేవా! నాకు ఈ ఎనిమిది మంచి వరములనిమ్ము. నీకు నమస్కారమగు గాక! నీవు సర్వేశ్వరుడవు. విశేషించి నాకు ప్రభుడవు నీవే (26).

సనత్కుమార ఉవాచ |

తస్య తద్వచనం శ్రుత్వా తమాహ భగవాన్‌ భవః | సర్వం భవిష్యతీత్యేవం పునస్స ప్రాహ శూలధృక్‌ || 27

సాంబో నామ మహావీర్యః పుత్రస్తే భవితా బలీ | ఘోరసంవర్తాకాదిత్యశ్శప్తో మునిభిరేవ చ || 28

మానుషో భవితాసీతి స తే పుత్రో భవిష్యతి | యద్యచ్చ ప్రార్థితం కించిత్తత్సర్వం చ లభస్వ వై || 29

ఏవం లబ్ధ్వా వరాన్‌ సర్వాన్‌ శ్రీకృష్ణః పరమేశ్వరాత్‌ | నానావిధాభిర్బహ్వీభిః స్తుతిభిస్సమతోషయత్‌ || 30

తమాహాథ శివా తుష్టా పార్వతీ భక్తవత్సలా | వాసుదేవం మహాత్మానం శంభుభక్తం తపస్వినమ్‌ || 31

సనత్కుమారుడు ఇట్లుపలికెను-

శూలధారియగు శంభుభగవానుడు అతని ఆ మాటలను విని, సర్వము అటులనే కాగలదని పలికి మరల ఇట్లు పలికెను (27). నీకు మహాపరాక్రమశాలి, బలవంతుడు అగు సాంబుడనే పుత్రుడు కలుగగలడు. ఆతడు పూర్వజన్మలో భయంకరుడగు ప్రళయకాలమునందలి ఆదిత్యుడు. మునులు ఆతనిని మనుష్యుడవు కమ్మని శపించియున్నారు. అతడు నీకు పుత్రుడు కాగలడు. నీవు కోరిన వరములన్నింటినీ పొందగలవు (28, 29). శ్రీకృష్ణుడు ఈ విధముగా పరమేశ్వరునినుండి వరములనన్నింటినీ పొంది, అనేకరకములైన బహుస్తోత్రములతో ఆయనను సంతోషపెట్టెను (30). అపుడు భక్తులయందు అనురాగము గలది, శివుని పత్నియగు పార్వతి సంతోషించి మహాత్ముడు, శంభుభక్తుడు, తపశ్శాలి అగు ఆ శ్రీకృష్ణునితో నిట్లనెను (31).

పార్వత్యువాచ |

వాసుదేవ మహాబుద్ధే కృష్ణ తుష్టాస్మి తే%నఘ | గృహాణ మత్తశ్చ వరాన్‌ మనోజ్ఞాన్‌ భువి దుర్లభాన్‌ || 32

పార్వతి ఇట్లు పలికెను-

ఓ వాసుదేవా! శ్రీకృష్ణా! నీవు మహాబుద్ధిశాలివి మరియు పుణ్యాత్ముడవు. నేను నీ విషయములో సంతోషమును పొందితిని. నీవు నానుండి కూడ మనస్సునకు నచ్చినవి, భూలోకములో పొంద శక్యము కానివి అగు వరములను స్వీకరించుము (32).

సనత్కుమార ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్యాః పార్వత్యాస్స యదూద్వహః | ఉవాచ సుప్రసన్నాత్మా భక్తియుక్తేన చేతసా || 33

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

యదువంశ##శ్రేష్ఠుడగు ఆ శ్రీకృష్ణుడు పార్వతీదేవియొక్క ఈ మాటలను విని మిక్కిలి ప్రసన్నమైన హృదయము గలవాడై భక్తితో నిండిన మనస్సుతో ఇట్లు పలికెను (33).

శ్రీకృష్ణ ఉవాచ |

దేవి త్వం పరితుష్టాసి చేద్దదాసి వరాన్‌ హి మే | తపసానేన సత్యేన బ్రాహ్మణాన్‌ ప్రతి మా స్మ భూత్‌ || 34

ద్వేషః కదాచిద్భద్రం తు పూజయేయం ద్విజాన్‌ సదా | తుష్టౌ చ మాతాపితరౌ భ##వేతాం మమ సర్వదా || 35

సర్వభూతేష్వానుకూల్యం భ##జేయం యత్ర తత్రగః | కేలే ప్రసూతిరుచితా మమాస్తు తవ దర్శనాత్‌ || 36

తర్పయేయం సురేంద్రాదీన్‌ దేవాన్‌ యజ్ఞశ##తేన తు | యతీనామతిథీనాం చ సహస్రాణ్యథ సర్వదా || 37

భోజయేయం సదా గేహే శ్రద్ధాపూతం తు భోజనమ్‌ | బాంధవైస్సహ ప్రీతిస్తు నిత్యమస్తు సునిర్వృతిః || 38

దేవి భార్యాసహస్రాణాం భ##వేయం ప్రాణవల్లభః | అక్షీణా కామ్యతా తాసు ప్రసాదాత్తవ శాంకరి || 39

ఆసాం చ పితరో లోకే భ##వేయుస్సత్యవాదినః | ఇత్యాద్యాస్సువరాస్సంతు ప్రసాదాత్తవ పార్వతి || 40

శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను-

ఓ దేవీ! నా సత్యవ్రతముచే మరియు ఈ తపస్సుచే నీవు సంతోషించినచో, నాకు ఈ వరములనిమ్ము. నాకు బ్రాహ్మణులపై ఎన్నడైననూ ద్వేషము కలుగకుండుగాక! మంగళకరమగు బ్రాహ్మణపూజను నేను సర్వదా చేసెదను గాక! నా తల్లి దండ్రులు సర్వకాలములలో సంతోషముగా నుందురు గాక! (34, 35) నేను ఎచ్చటనున్ననూ సర్వప్రాణులయందు అనురాగమును కలిగియుందును గాక! నీ దర్శనభాగ్యముచే నా కులములో యోగ్యమగు సంతానము కలుగుగాక ! (36) నేను వంద యజ్ఞములను చేసి ఇంద్రుడు మొదలగు దేవతలను సంతోషపెట్టెదను గాక! నేను ఇంటిలో సర్వదా వేల సంఖ్యలో యతులకు మరియు అతిథులకు శ్రద్ధచే పవిత్రమైన భోజనమును సమర్పించెదను గాక! (37, 38) ఓ దేవీ! నేను వేల సంఖ్యలో భార్యలకు ప్రియమగు భర్తను అగుదును గాక! ఓ శంకరగృహిణీ ! నాకు వారియందు నీ అనుగ్రహముచే క్షీణించని అనురాగము కలుగుగాక! (39) వారి తల్లిదండ్రులు లోకములో సత్యవాక్యములను పలుకువారు అగుదురు గాక! ఓ పార్వతీ! నీ అనుగ్రహముచే నాకు ఇటువంటి మంచి వరములు లభించుగాక! (40).

సనత్కుమార ఉవాచ |

తస్య తద్వచనం శ్రుత్వా దేవీ తం చాహ విస్మితా | ఏవమస్త్వితి భద్రం తే శాశ్వతీ సర్వకామదా || 41

తస్మింస్తాంశ్చ వరాన్‌ దత్త్వా పార్వతీపరమేశ్వరౌ | తత్రైవాంతశ్చ దధతుః కృత్వా కృష్ణస్య సత్కృపామ్‌ || 42

కృష్ణః కృతార్థమాత్మానమమన్యత మునీశ్వర | ఉపమన్యోర్మునేరాశు ప్రాపాశ్రమమనుత్తమమ్‌ || 43

ప్రణమ్య శిరసా తత్ర తం మునిం కేశిహా తతః | తథా వృత్తం చ తసై#్మ తత్సమాచష్టోపమన్యవే || 44

స చ తం ప్రాహ కో%న్యస్స్యాచ్ఛర్వాద్దేవాజ్జనార్దన | మహాదానపతిర్లోకే క్రోధే వాతీవ దుస్సహః || 45

జ్ఞానే తపసి వా శౌర్యే స్థైర్యే వాపద్భ్య ఏవ చ | శృణు శంభోస్తు గోవింద దేవైశ్వర్యం మహాయశాః || 46

తచ్ఛ్రుత్వా శ్రద్ధయా యుక్తో% భవచ్ఛంభోస్తు భక్తిమాన్‌ | పప్రచ్ఛ శివమాహాత్మ్యం స తం ప్రాహ మునీశ్వరః || 47

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

ఆతని ఆ మాటలను విని శాశ్వతురాలు, కోర్కెలనన్నింటినీ ఈడేర్చునది అగు పార్వతీ దేవి మిక్కిలి ఆశ్చర్యమును పొంది, అటులనే అగుగాక! నీకు మంగళమగుగాక ! అని పలికెను (41). పార్వతీపరమేశ్వరులు ఆ శ్రీకృష్ణునకు ఆ వరములనిచ్చి మంచి దయను చూపి అచటనే అంతర్ధానము చెందిరి (42). ఓ మహర్షీ! శ్రీకృష్ణుడు తాను కృతార్థుడనైతినని తలపోసి వెంటనే సర్వోత్తమమగు ఉపమన్యు మహర్షియొక్క ఆశ్రమము చేరుకొనెను (43). కేశియను రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణుడు ఆ ఉపమన్యుమహర్షికి తల వంచి నమస్కరించి తరువాత ఆ జరిగిన వృత్తాంతమును చెప్పెను (44). అపుడు ఆ మహర్షి ఆయనతో నిట్లనెను : ఓ జనార్దనా ! లోకములో శివుని మించి గొపప వరములనీయగలవాడు గాని, కోపములో సహింప శక్యము కానివాడు గాని మరియొకరు ఎవరు గలరు? (45) గొప్ప కీర్తి గల ఓ గోవిందా! జ్ఞానములో, తపస్సులో, శౌర్యములో మరియు స్థైర్యములో శివుని మించినవారు ఎవరు గలరు? ఆపదలనుండి రక్షించే శివుని దివ్యమగు ఈశ్వరత్వమును గురించి శ్రవణము చేయుము (46). ఆ మాటను విని ఆయన శంభుని యందు భక్తి గలవాడై శ్రద్ధతో గూడి శివుని మాహాత్మ్యమును చెప్పుడని కోరగా, ఆ మహర్షి ఆయనతో నిట్లనెను (47).

ఉపమన్యురువాచ |

భగవాన్‌ శంకరః పూర్వం బ్రహ్మలోకే మహాత్మనా | స్తుతో నామసహస్రేణ దండినా బ్రహ్మయోగినా || 48

సాంఖ్యాః పఠంతి తద్గీతం విస్తీర్ణం చ నిఘంటువత్‌ | దుర్‌జ్ఞానం మానుషాణాం తు స్తోత్రం తత్సర్వకామదమ్‌ || 49

స్మరన్నిత్యం శంకరం త్వం గచ్ఛ కృష్ణ గృహం సుఖీ | భవిష్యసి సదా తాత శివభక్తగణాగ్రణీ || 50

పూర్వము బ్రహ్మలోకములో మహాత్ముడు, సమాహితచిత్తుడు అగు బ్రహ్మయోగి దండమును పట్టుకొని శంకరభగవానుని సహస్రనామములతో స్తుతించెను (48). నిఘంటువు వలె విస్తారమగు ఆ గీతరూపములో నున్న స్తోత్రమును సాంఖ్యశాస్త్రపండితులు పఠించెదరు. కోర్కెలనన్నింటినీ ఈడేర్చే ఆ స్తోత్రమును తెలియుటలో మనుష్యులకు క్లేశము గలదు (49). ఓ శ్రీకృష్ణా! నీవు సర్వదా శివుని స్మరిస్తూ సుఖముగా ఇంటికి వెళ్లుము. ఓ వత్సా! నీవు సర్వదాశివభక్తులలో అగ్రేసరుడవు కాగలవు (50).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్తస్తం నమస్కృత్య వాసుదేవో మునీశ్వరమ్‌ | మనసా సంస్మరన్‌ శంభు కేశవో ద్వారకాం య¸° || 51

ఏవం కృష్ణస్సమారాధ్య శంకరం లోకశంకరమ్‌ | కృతార్థో% భూన్మునిశ్రేష్ఠ సర్వాజేయో % భవత్తథా || 52

తథా దాశరథీ రామశ్శివమారాధ్య భక్తితః | కృతార్థో% భూన్మునిశ్రేష్ఠ విజయీ సర్వతో%భవత్‌ || 53

తపస్తప్త్వాతివిపులం పురా రామో గిరౌ మునే | శివాద్ధనుశ్శరం చాపం జ్ఞానం వై పరముత్తమమ్‌ || 54

రావణం సగణం హత్వా సేతుం బద్ధ్వాంభసాం నిధౌ | సీతాం ప్రాప్య గృహం యాతో బుభుజే నిఖిలాం మహీమ్‌ || 55

తథా చ భార్గవో రామో హ్యారాధ్య తపసా విభుమ్‌ | నిరీక్ష్య దుఃఖితశ్శర్వాత్పితరం క్షత్రియైర్హతమ్‌ || 56

తీక్‌ష్ణం స పరశుం లేభే నిర్దదాహ చ తేన తాన్‌ | త్రిస్సప్తకృత్వః క్షత్రాంశ్చ ప్రసన్నాత్పరమేశ్వరాత్‌ || 57

అజేయశ్చామరశ్చైవ సో%ద్యాపి తపసాం నిధిః | లింగార్చనరతో నిత్యం దృశ్యతే సిద్ధచారణౖః || 58

మహేంద్రపర్వతే రామః స్థితస్తపసి తిష్ఠతి | కల్పాంతే పునరేవాసావృషిస్థానమవాప్స్యతి || 59

అసితస్యానుజః పూర్వం పీడయా కృతవాంస్తవః | మూలగ్రాహేణ విశ్వస్య దేవలో నామ తాపసః || 60

ఆ మహర్షీ ఇట్లు పలుకగా, వసుదేవకుమారుడగు కేశవుడు ఆయనకు నమస్కరించి మనస్సులో శివుని స్మరిస్తూ ద్వారకకు వెళ్లెను (51). ఓ మహర్షీ! ఈ విధముగా శ్రీకృష్ణుడు లోకములకు మంగళములను కలిగించే శంకరుని ఆరాధించి కృతార్థుడాయెను. మరియు ఆయనను శత్రువులు జయించలేక పోయిరి (52). ఓ మహర్షీ! దశరథకుమారుడగు శ్రీరాముడు కూడ ఇదే విధముగా శివుని భక్తితో ఆరాధించి కృతార్థుడగుటయే గాక, సర్వత్రా విజయమును పొందెను (53). ఓ మునీ! పూర్వము శ్రీరాముడు కొండపై కఠినమైన తపస్సును చేసి శివుని నుండి ధనస్సును, బాణమును, అస్త్రమును మరియు సర్వోత్తమమగు జ్ఞానమును బడసెను (54). ఆయన సముద్రముపై సేతువును నిర్మించి రావణుని పరివారముతో సహా సంహరించి సీతను పొంది ఇంటికి వెళ్లి చక్రవర్తి ఆయెను (55). అదే విధముగా భార్గవరాముడు తన తండ్రి క్షత్రియులచే సంహరింపబడుటను గాంచి దుఃఖించి సర్వేశ్వరుడగు శంకరుని తపస్సుచే ఆరాధించి (56), ప్రసన్నుడైన ఆ పరమేశ్వరునినుండి వాడియైన గండ్రగొడ్డలిని సంపాదించి, దానితో ఇరువది ఒక్క పర్యాయములు ఆ క్షత్రియులను సంహరించెను (57). తపోనిధి, పరాజయమును ఎరుగని వాడు, మృత్యువు లేనివాడు అగు ఆ మహర్షి ఈనాటికీ నిత్యము లింగార్చనయందు నిమగ్నుడై యుండగా సిద్ధులకు మరియు చారణులకు కనబడుచున్నాడు (58). ఆ పరశురాముడు మహేంద్రపర్వతముపై నుండి తపస్సును చేయుచున్నాడు. ఆయన కల్పము పూర్తి అయిన పిదప మరల ఋషిస్థానమును బడయగలడు (59). అసితుని సోదరుడగు దేవలమహర్షి పూర్వము జగత్తును మూలములో పట్టుకొని పీడించుచూ (?) తపస్సును చేసెను (60).

పురందరేణ శప్తస్తు తపస్వీ యశ్చ సుస్థిరమ్‌ | అధర్మ్యం ధర్మమలభల్లింగమారాధ్య కామదమ్‌ || 61

చాక్షుషస్య మనోః పుత్రో మృగో% భూత్తు మరుస్థలే | వసిష్ఠశాపాద్గృత్సమదో దండకారణ్య ఏకలః || 62

హృదయే సంస్మరన్‌ భక్త్యా ప్రణవేన యుతం శివమ్‌ | తస్మాన్మృత్యుముఖాకారో గణో మృగముఖో% భవత్‌ || 63

అజరామరతాం నీతస్తీర్త్వా శాపం పునశ్చ సః | శంకరేణ కృతః ప్రీత్యా నిత్యం లంబోదరానుగః || 64

గార్గ్యాయ ప్రదదౌ శర్వో మోక్షం చ భువి దుర్లభమ్‌ | కామచారీ మహాక్షేత్రం కాలజ్ఞానం మహర్ధిమత్‌ || 65

చతుష్పాదం సరస్వత్యాః పారగత్వం చ శాశ్వతమ్‌ | న తుల్యం చ సహస్రం తు పుత్రాణాం ప్రదదౌ శివః || 66

వేదవ్యాసం తు యోగీంద్రం పుత్రం తుష్టః పికానధృక్‌ | పరాశరాయ చ దదౌ జరామృత్యువివర్జితమ్‌ || 67

మాండవ్యశ్శంకరేణౖవ జీవం దత్త్వా విసర్జితః | వర్షాణాం దశ లక్షాణి శూలాగ్రాదవరోపితః || 68

దరిద్రో బ్రాహ్మణః కశ్చిన్నిక్షిప్య గురువేశ్మని | పుత్రం తు గాలవం యశ్చ పూర్వమాసీద్గృహాశ్రమీ || 69

ఆ తపశ్శాలిని ఇంద్రుడు శపించగా, ఆయన గొప్ప స్థైర్యము గలవాడై కోర్కెలను తీర్చే లింగమును ఆరాధించి అధర్మమును అతిక్రమించి ధర్మమును పొందెను (61). చాక్షుషమనువుయొక్క కుమారుడగు గృత్సమదుడు వసిష్టుని శాపముచే లేడియై దండకారణ్యములోని ఎడారిలో ఒంటరిగా తిరుగాడెను (62). ఆయన హృదయములో శివుని స్మరిస్తూ భక్తితో ఓంకారమును జపించి మరణించిన తరువాత లేడి ముఖము గల గణము ఆయెను (63). శంకరుడు ఆయనకు శాపనివృత్తిని చేసి మరల జరామరణములు లేనట్లు అనుగ్రహించి ప్రేమతో విఘ్నేశ్వరునకు నిత్య -అనుచరునిగా చేసెను (64). శివుడు గర్గపుత్రునకు భూలోకదుర్లభ##మైన మోక్షమును, మహాక్షేత్రములను సంచరించుటకై యథేచ్ఛాసంచారశక్తిని, గొప్ప ఐశ్వర్యమునిచ్చే కాలజ్ఞానమును (65), సరస్వతీస్వరూపమగు నాలుగు వేదములలో సర్వదా నిష్ణాతుడై ఉండే శక్తిని, సాటిలేని వేయిమంది పుత్రులను ఇచ్చెను (66). పినాకధారియగు శివుడు పరాశరునిపై ప్రసన్నుడై యోగిశ్రేష్ఠుడు, జరామరణములు లేనివాడు అగు వేదవ్యాసుని పుత్రునిగా అనుగ్రహించెను (67). శంకరుడు శూలముపై కొరత వేయబడి యున్న మాండవ్యుని దానిపై నుండి విడిపించి పది లక్షల సంవత్సరముల ఆయుర్దాయమునిచ్చి పంపించెను (68). పూర్వము గృహస్థాశ్రమమునందున్న ఒక దరిద్రబ్రాహ్మణుడు గురువుగారి ఇంటిలో తన పుత్రుడగు గాలవుని ఉంచెను (69).

గుప్తో వా మునిశాలాయాం భిక్షురాయాతి తద్గృహమ్‌ | భార్యామువాచ యః కశ్చిదవశ్యం నిర్ధనో యతః || 70

స తు వాచ్యో భవత్యా చ న దృశ్యంతి ఇతి ప్రియః | అతిథేరాగతస్యాపి కిం దాస్యామి గృహే వసన్‌ || 71

కదాచిదతిథిః కశ్చిత్‌ క్షుత్తృషాక్షామతర్షితః | తామువాచ స భర్తా తే క్వగతశ్చేతి తం చ సా || 72

ప్రాహ భర్తా మదీయస్తు సాంప్రతం న చ దృశ్యతే | స ఋషిస్తమువాచేదం జ్ఞాత్వా దివ్యేన చక్షుషా || 73

గృహస్థితః ప్రతిచ్ఛన్నస్తత్రైవ స మృతో ద్విజః | విశ్వామిత్రాభ్యనుజ్ఞాతస్తత్పుత్రో గాలవస్తథా || 74

గృహమాగత్య మాతుస్స శ్రుత్వా శాపం సుదారుణమ్‌ | ఆరాధ్య శంకరం దేవం పూజాం కృత్వా తు శాంభవీమ్‌ || 75

గృహాదసౌ వినిష్క్రాంతస్సంస్మరన్‌ శంకరం హృదా | అథ తం తనయం దృష్ట్వా పితా తం ప్రాహ సాంజలిమ్‌ || 76

మహాదేవప్రసాదాచ్చ కృతకృత్యో%స్మి కృత్యతః | ధనవాన్‌ పుత్రవాంశ్చైవ మృతో% హం జీవితః పునః || 77

ఇతి వః కథితమశేషం నాహం శక్తస్సమాసతో వ్యాసాత్‌ | వక్తుం శంభోశ్చ గుణాన్‌ శేషస్యాపి న ముఖాని స్యుః || 78

ఇతి శ్రీ శివమహాపురాణ ఉమాసంహితాయం శివభక్తిమాహాత్మ్య వర్ణనం నామ తృతీయో%ధ్యాయః (3).

ఆ బ్రాహ్మణుడు మునిపల్లెలో రహస్యముగా జీవిస్తూ ఆ గృహమునకు భిక్షకొరకు వచ్చుచుండెను. ఆ యజమాని భార్యతో నిట్లనెను: ఆతడు నిశ్చయముగా దరిద్రుడై యుండును (70). ఆతనితో నా భర్త కానవచ్చుట లేదనియు, ఒంటరిగా ఇంటిలోనున్న నేను ఇంటికి వచ్చిన అతిథికి ఏమి ఈయగలను అనియు చెప్పుము (71). ఒకనాడు ఒక అతిథి ఆకలి దప్పికలతో నీరసించి యున్నవాడై ఆమెతో, నీ భర్త ఎక్కడకు వెళ్లినాడు? అని ప్రశ్నించగా, ఆమె ఆతనితో నా భర్త ఇప్పుడు కానవచ్చుట లేదని చెప్పెను. అపుడా మహర్షి దివ్యదృష్టిచే సర్వమును తెలుసుకొని ఆమెతో నీ భర్త ఇంటిలోననే దాగియున్నాడని పలికెను. ఆ బ్రాహ్మణుడు అచటనే మరణించెను. వారి కుమారుడగు గాలవుడు విశ్వామిత్రుని వద్ద సెలవు తీసుకొని (72-74), ఇంటికి వచ్చి తల్లినుండి ఆ అతిదారుణమగు శాపమును గురించి విని శంకరదేవుని ఆరాధించి పార్వతికి పూజను చేసి (75), హృదయములో శంకరుని స్మరిస్తూ ఆతడు ఇంటినుండి బయటకు వెళ్లెను. అపుడు ఆతని తండ్రి బ్రతికి వచ్చి ఆ భిక్షుకుని మరియు తన పుత్రుని చూచి ఇట్లనెను (76). మహాదేవుని అనుగ్రహముచే కృతార్థుడనైతిని. నేను ధనమును, పుత్రుని పొందితిని. మరణించిన నేను మరల బ్రతికితిని (77). ఈ విధముగా మీకు శంకరుని గుణములను చెప్పితిని. వాటిని సంగ్రహముగా గాని విస్తారముగా గాని పూర్తిగా చేప్పే సామర్థ్యము నాకు లేదు. ఆ విధముగా చెప్పుటకు శేషుని ముఖములు కూడ చాలవు (78).

శ్రీ శివమహాపురాణములో ఉమాసంహితయందు శివభక్తిమాహాత్మ్య వర్ణనమనే మూడవ అధ్యాయము ముగిసినది (3).

Siva Maha Puranam-3    Chapters    s