Siva Maha Puranam-3    Chapters   

అథ చత్వారింశో%ధ్యాయః

శివరాత్రి మహాత్మ్యము

ఋషయ ఉవాచ

సూత తేవ చనం శ్రుత్వా పరానందం వయం గతాః | విస్తరాత్కథయ ప్రీత్య తదేవ వ్రతముత్తమ్‌ |

కృతం పురా తు కేనేహ సూతైతద్వ్ర తముత్తమమ్‌ | కృత్వాప్యజ్ఞానతశ్చైవ ప్రాప్తం కి ఫలముత్తతమ్‌ |

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ సూతా! నీవచనములను వినిన మాకు పరమానందము కలుగుచున్నది. ఆ ఉత్తమమగు వ్రతమునే ప్రీతితో విస్తరముగా చెప్పుము(1). ఓ సూతా! ఈ ఉత్తమమగు వ్రతము పూర్వము ఈ లోకములో ఎవరిచే చేయబడినది? అజ్ఞానముతో చేసిన వారికి కూడ ఎట్టి ఉత్తమఫలము లభించినది? (2)

సూత ఉవాచ |

శ్రూయతామృషయస్సర్వే కథయామి పురాతనమ్‌ | ఇతిహాసం నిషాదస్య సర్వపాపప్రణాశనమ్‌ || 3

పురా కశ్చిద్వనే భిల్లో నామ్నా హ్యాసీద్గురుద్రుహః | కుటుంబీ బలవాన్‌ క్రూరః క్రూరకర్మపరాయణః || 4

నిరంతరం వనే గత్వా మృగాన్‌ హంతి స్మ నిత్యశః | చౌర్యం చ వివిధం తత్ర కరోతి స్మ వనే వసన్‌ || 5

బాల్యాదారభ్య తేనేహ కృతం కించిచ్ఛుభం న హి | మహాన్‌ కాలో వ్యతీయాయ వనే తస్య దురాత్మనః || 6

కదాచిచ్ఛివరాత్రిశ్చ ప్రాప్తాసీత్తత్ర శోభనా | న దురాత్మా స్మ జానాతి మహద్వనవినాశకృత్‌ || 7

ఏతస్మిన్‌ సమయే భిల్లో మాత్రా పిత్రా స్త్రి యా తథా| ప్రార్థితశ్చ క్షుధావిష్టైర్భక్ష్యం దేహి వనేచర || 8

ఇతి సంప్రార్థితస్సో%పి ధనురాదాయ సత్వరమ్‌ | జగామ మృగహింసార్థం బభ్రామ సకలం వనమ్‌ || 9

సూతుడు ఇట్లు పలికెను-

ఓ ఋషులారా! సర్వపాపములను పోగొట్టే పురాతనమైన నిషాదుని గాథను చెప్పుచున్నాను. మీరు అందరు వినుడు (3). పూర్వము అడవిలో గురుద్రుహుడు అనే పేరు గలవాడు, కుటుంబీకుడు, బలవంతుడు, క్రూరుడు, క్రూరకర్మలను చేయుటలో నిష్ణాతుడు అగు ఒక కిరాతుడు ఉండెడివాడు (4). ఆతడు నిత్యము అడవికి వెళ్లి ఎడతెరపి లేకుండగా మృగములను సంహరిస్తూ వివిధచౌర్యములను చేయుచూ అడవిలో నివసించెడివాడు (5). బాల్యమునుండియు వానిచే శుభకర్మ ఏదియు చేయబడలేదు. ఆ దుష్టుడు అడవిలో నివసించుచుండగా చిరకాలము గడిచెను (6). ఒకనాడు పరమశోభనమగు శివరాత్రి సంప్రాప్తమయ్యెను. వనములో పెద్ద వినాశమును చేసిన ఆ దుర్బుద్ధికి ఆ సంగతి తెలియదు (7). అదే సమయములో ఆ భిల్లుని తల్లి, తండ్రి మరియు భార్య ఆకలిగొన్నవారై, ఓ వనేచరా! ఆహారమునిమ్ము అని ప్రార్థించిరి (8). ఈ విధముగా ప్రార్థించబడిన ఆ భిల్లుడు వెంటనే ధనస్సును తీసుకొని మృగమును సంహరించుటకై వనమంతయు తిరుగాడెను (9).

దైవయోగాత్తదా తేన న ప్రాప్తం కించిదేవ హి | అస్తం ప్రాప్తస్త దా సూర్యస్స వై దుఃఖముపాగతః || 10

కిం కర్తవ్యం క్వ గంతవ్యం న ప్రాప్తం మే%ద్య కించన | బాలాశ్చ యే గృహే తేషాం కిం పిత్రోశ్చ భవిష్యతి || 11

మదీయం వై కలత్రం చ తస్యాః కించిద్భవిష్యతి | కించిద్గృహీత్వా హి మయా గంతవ్యం నాన్యథా భ##వేత్‌ || 12

ఇత్థం విచార్య స వ్యాధో జలాశయసమీపగః | జలావతరణం యత్ర తత్ర గత్వా స్వయం స్థితః || 13

అవశ్యమత్ర కశ్చిద్వై జీవశ్చైవాగమిష్యతి | తం హత్వా స్వగృహం ప్రీత్యా యాస్యామి కృతకార్యకః || 14

ఇతి మత్వా స వై వృక్షమేకం బిల్వేతిసంజ్ఞకమ్‌ | సమారుహ్య స్థితస్తత్ర జలమాదాయ భిల్లకః || 15

కదా యాస్యతి కశ్చిద్వై కదా హన్యామహం పునః | ఇతి బుద్ధిం సమాస్థాయ స్థితో%సౌ క్షుత్తృషాన్వితః || 16

కాని దైవఘటనచే వానికి ఏదియు ఆ సమయములో లభించలేదు. ఇంతలో సూర్యుడు అస్తమించగా, అతడు దుఃఖమును పొందెను (10). ఏమి చేయవలెను? ఎచ్చటకు పోవలెను? ఈనాడు నాకు ఏమియు దొరకలేదు. ఇంటిలోని పిల్లలకు మరియు తల్లిదండ్రులకు ఏమగును? (11) నా భార్యకు ఏమగును? నేను ఏదో ఒకదానిని తీసుకొనియే ఇంటికి వెళ్లదగును. లేనిచో, కుదరదు (12). ఆ కిరాతుడు ఇట్లు ఆలోచించి జలాశయసమీపమునకు వెళ్లి నీటిలో జంతువులు దిగే స్థలమువద్ద కాపు వేసెను (13). ఇచ్చటకు ఏదో ఒక జంతువు తప్పనిసరిగా వచ్చున. దానిని చంపి కృతకృత్యుడనై ప్రీతితో స్వగృహమునకు వెళ్లగలను (14). ఇట్లు తలపోసి ఆ కిరాతుడు నీటిని తీసుకొని మారేడు చెట్టు పైకి ఎక్కి అచట వేచియుండెను (15). ఏదో ఒక జంతువు ఎప్పుడు వచ్చునో గదా! నేను దానిని ఎప్పుడు సంహరించెదనో? అని ఆలోచిస్తూ, ఆకలిదప్పికలతో బాధపడుతూ అచటనే ఉండెను (16).

తద్రాత్రౌ ప్రథమే యామే మృగీ త్వేకా సమాగతా | తృషార్తా చకితా సా చ ప్రోత్ఫాలం కుర్వతీ తదా || 17

తాం దృష్ట్వా చ తదా తేన తద్వధార్ధమథో శరః | సంహృష్టేన ద్రుతం విష్ణో ధనుషి స్వే హి సందధే || 18

ఇత్యేవం కుర్వతస్తస్య జలం బిల్వదలాని చ | పతితాని హ్యధస్తత్ర శివలింగమభూత్తతః || 19

యామస్య ప్రథమసై#్యవ పూజా జాతా శివస్య చ | తన్మహిమ్నా హి తసై#్యవ పాతకం గలితం తదా || 20

తత్రత్యం చైవ తచ్ఛబ్దం శ్రుత్వా సా హరిణీ భియా | వ్యాధం దృష్ట్వా వ్యాకులా హి వచనం చేదమబ్రవీత్‌ || 21

ఆ రాత్రి మొదటి యామములో ఒక ఆడు లేడి దప్పికతో బాధపడుతూ భయముతో ఎగురుతూ వచ్చెను (17). ఓ విష్ణూ! దానిని చూచి వాడు సంతోషించి వెంటనే దానిని చంపుటకై బాణమును ధనస్సులో సంధించెను (18). ఆతడు ఆ ప్రయత్నములోనుండగా క్రిందకు నీరు మరియు మారేడు పత్రి పడెను. అచట ఒక శివలింగము ఉండెను (19). ఆ విధముగా శివుని ప్రథమయామపూజ సంపన్నమయ్యెను. దాని మహిమచే వాని పాతకము వెంటనే తొలగిపోయెను (20). ఆ సమయములో వచ్చిన శబ్దమును విని ఆ లేడి భయపడి కిరాతుని చూచి కంగారుపడి ఇట్లు పలికెను (21).

మృగ్యువాచ |

కిం కర్తుమిచ్ఛసి వ్యాధ సత్యం వద మమాగ్రతః | తచ్ఛ్రుత్వా హరిణీవాక్యం వ్యాధో వచనమబ్రవీత్‌ || 22

లేడి ఇట్లు పలికెను-

ఓ కిరాతా! నీవు ఏమి చేయగోరుచున్నావు? నా యెదుట సత్యమును పలుకుము. లేడియొక్క ఈ వచనమును విని కిరాతుడు ఇట్లు పలికెను (22).

వ్యాధ ఉవాచ |

కుటుంబ క్షుధితం మే%ద్య హత్వా త్వాం తర్పయామ్యహమ్‌ |

దారుణం తద్వచశ్శ్రుత్వా దృష్ట్వా తం దుర్ధరం ఖలమ్‌ || 23

కిం కరోమి క్వ గచ్ఛామి హ్యుపాయం రచయామ్యహమ్‌ | ఇత్థం విచార్య సా తత్ర వచనం చేదమబ్రవీత్‌ || 24

కిరాతుడు ఇట్లు పలికెను--

నా కుటుంబము ఆకలి గొనియున్నది. నిన్ను చంపి నేను వారిని తృప్తిపరచెదను. లేడి వాని ఈ దారుణమగు వచనమును విని, నివారించ శక్యముగాని ఆ దుష్టుని గాంచెను (23). నేనేమి చేయుదును? ఎక్కడకు పోయెదను? నేను ఒక ఉపాయమును పన్నెదను. ఈ విధముగా ఆలోచించి, ఆ లేడి అప్పుడు ఇట్లు పలికెను (24).

మృగ్యువాచ |

మన్మాంసేన సుఖం తే స్యాద్దేహస్యానర్థకారిణః | అధికం కిం మహత్పుణ్యం ధన్యాహం నాత్ర సంశయః || 25

ఉపకారకరసై#్యవ యత్పుణ్యం జాయతే త్విహ | తత్పుణ్యం శక్యతే నైవ వక్తుం వర్షశ##తైరపి || 26

పరం తు శిశవో మే%ద్య వర్తంతే స్వాశ్రమే%ఖిలాః | భగిన్యై తాన్‌ సమర్ప్యైవ ప్రాయాస్యే స్వామినే%థవా || 27

న మే మిథ్యావచస్త్వం హి విజానీహి వనేచర | ఆయాస్యేహం పునశ్చేహ సమీపం తే న సంశయః || 28

స్థితా సత్యేన ధరణీ సత్యేనైవ చ వారిధిః | సత్యేన జలధారాశ్చ సత్యే సర్వం ప్రతిష్ఠితమ్‌ || 29

లేడి ఇట్లు పలికెను-

నా మాంసముచే నీకు సుఖము కలుగుటకంటే అనర్థములను కలుగజేయు ఈ దేహమునకు అధికమగు గొప్ప పుణ్యము మరియేది గలదు? నేను ధన్యురాలను. సందేహము లేదు (25). ఈ లోకములో ఉపకారమును చేయువానికి లభించు పుణ్యముయొక్క గొప్పదనమును వర్ణించుటకు వంద సంవత్సరములైననూ చాలదు (26). కాని నాకు పిల్లలు గలరు. వారు అందరు ఇచటనే ఆశ్రమములో నున్నారు. వారిని నా చెల్లెలికి గాని, లేదా నా భర్తకు గాని అప్పజెప్పి మరలి వచ్చెదను (27). నా మాట అసత్యము కాదు. ఓ కిరాతా! ఈ సత్యమునెరుంగుము. నేను మరల ఇచట నీ సమీపమునకు వచ్చెదను. సందేహము వలదు (28). ఈ భూమి సత్యముపై ఆధారపడియున్నది. సముద్రము సత్యము వలననే చెలియలికట్ట లోపల నిలచియున్నది. సత్యము వలననే నీరు ప్రవహించుచున్నది. సర్వము సత్యము నందు ఆశ్రయమును కలిగియున్నది (29).

సూత ఉవాచ |

ఇత్యుక్తో%పి తయా వ్యాధో న మేనే తద్వచో యదా | తదా సువిస్మితా భీతా వచనం సాబ్రవీత్పునః || 30

సూతుడు ఇట్లు పలికెను-

ఆ లేడి ఇట్లు పలికిననూ, ఆ కిరాతుడు అంగీకరించలేదు. అపుడామె చాల భయమును మరియు విస్మయమును పొంది మరల ఇట్లు పలికెను (30).

మృగ్యువాచ |

శృణు వ్యాధ ప్రవక్ష్యామి శపథం హి కరోమ్యహమ్‌ | ఆగచ్ఛేయం యథా తే న సమీపం స్వగృహాద్గతా || 31

బ్రాహ్మణో వేదవిక్రేతా సంధ్యాహీనస్త్రికాలకమ్‌ | స్త్రి యస్స్వస్వామినో హ్యాజ్ఞాం సముల్లంఘ్య క్రియాన్వితాః || 32

కృతఘ్నే చైవ యత్పావం తత్పాపం విముఖే హరే | ద్రోహిణశ్చైవ యత్పాపం తత్పాపం ధర్మలంఘనే || 33

విశ్వాసఘాతకే తచ్చ తథా వై ఛలకర్తరి | తేన పాపేన లింపామి యద్యహం నాగమే పునః || 34

ఇత్యాద్యనేకశపథాన్మృగీ కృత్వా స్థితా తదా | తదా వ్యాధస్స విశ్వస్య గచ్ఛేతి గృహమబ్రవీత్‌ || 35

మృగీ హృష్టా జలం పీత్వా గతా స్వాశ్రమమండలమ్‌ | తావచ్చ ప్రథమో యామస్తస్య నిద్రాం నివా గతః || 36

తదీయా భగినీ యా వై మృగీ చ పరిభావితా | తస్యా మార్గం విచిన్వంతీ హ్యాజగామ జలార్థినీ || 37

లేడి ఇట్లు పలికెను-

ఓ కిరాతా! నా వచనమును వినుము. నేను శపథమును చేయుచున్నాను. నేను నా ఇంటికి వెళ్లి నీ సమీపమునకు రాని పక్షములో (31). మూడు కాలములయందు సంధ్యావందనమును వీడి వేదమును అమ్ముకొని బ్రతికే బ్రాహ్మణుడు, తమ భర్తల మాటను కాదని వ్యవహరించే స్త్రీలు, చేసిన ఉపకారమును మరచువాడు, శివునియందు భక్తి లేనివాడు, ద్రోహమును చేయువాడు, ధర్మమును ఉల్లంఘించువాడు, విశ్వాసఘాతకుడు మరియు మోసగాడు ఏ పాపమున పొందెదరో, నేను ఆ పాపమును పొందెదను (32-34). ఆ లేడి ఈ విధముగా అనేకశపథములను చేసి నిలబడెను. అపుడా కిరాతునకు విశ్వాసము కుదిరి ఇంటికి వెళ్లుమని పలికెను (35). ఆ లేడి ఆనందముతో నీటిని త్రాగి తన నివాసస్థానమునకు వెళ్లెను. ఇంతలో వానికి మొదటి యామము రాత్రి నిద్ర లేకుండగనే గడచిపోయెను (36). ఆ లేడి యొక్క చెల్లెలు కూడ దానిని గానక దుఃఖించి దానికొరకై వెదకుచూ నీటిని త్రాగుటకొరకై అచటకు వచ్చెను (37).

తాం దృష్ట్వా చ స్వయం భిల్లో%కార్షీద్బాణస్య కర్షణమ్‌ | పూర్వవజ్జలపత్రాణి పతితాని శివోపరి || 38

యామస్య చ ద్వితీయస్య తేన శంభోర్మహాత్మనః | పూజా జాతా ప్రసంగేన వ్యాధస్య సుఖదాయినీ || 39

మృగీ సా ప్రాహ తం దృష్ట్వా కిం కరోషి వనేచర | పూర్వవత్కథితం తేన తచ్ఛ్రుత్వాహ మృగీ పునః || 40

ఆ లేడిని చూచిన వెంటనే భిల్లుడు బాణమును ఎక్కుపెట్టెను. ఇంతకుముందువలెనే ఇప్పుడు కూడ శివునిపై నీరు మరియు మారేడు పత్రి పడెను (38). దానివలన ఆ కిరాతునకు అనుకోకుండగా సమస్తదుఃఖములనిచ్చే శంభుపరమాత్మయొక్క ద్వితీయయామ పూజ సంపన్నమయ్యెను (39). ఆ లేడి కిరాతుని చూచి, ఓ కిరాతా! నీవు ఏమి చేయుచున్నావు? అని ప్రశ్నించగా, ఆతడు పూర్వమునందు వలెనే బదులు చెప్పెను. ఆ మాటను విని ఆ లేడి మరల ఇట్లు పలికెను (40).

మృగ్యువాచ |

ధన్యాహం శ్రూయతాం వ్యాధ సఫలం దేహధారణమ్‌ | అనిత్యేన శరీరేణ హ్యుపకారో భవిష్యతి || 41

పరం తు మమ బాలాశ్చ గృహే తిష్ఠంతి చార్భకాః | భ##ర్త్రే తాంశ్చ సమర్వ్యైవ హ్యాగమిష్యామ్యహం పునః || 42

లేడి ఇట్లు పలికెను-

ఓ కిరాతా! నేను ధన్యురాలను. వినుము. నేను దేహమును ధరించుట సఫలమైనది. అనిత్యమగు ఈ శరీరముతో పరోపకారము సిద్ధించనున్నది (41). కాని, నా చిన్న పిల్లలు ఇంటివద్ద ఉన్నారు. వారిని నా భర్తకు అప్పగించి నేను మరలి వచ్చెదను (42).

వ్యాధ ఉవాచ |

త్వయా చోక్తం న మన్యేహం హన్మి త్వాం నాత్ర సంశయః | తచ్ఛ్రత్వా హరిణీ ప్రాహ శపథం కుర్వతీ హరే || 43

కిరాతుడు ఇట్లు పలికెను-

నేను నీ మాటను అంగీకరించుట లేదు. నిన్ను నేను సంహరించుట నిశ్చయము. సందేహము లేదు. ఓ విష్ణూ! ఆ మాటను విని ఆ లేడి శపథమును చేయుచూ ఇట్లు పలికెను (43).

మృగ్యువాచ |

శృణు వ్యాధ ప్రవక్ష్యామి నాగచ్ఛేయం పునర్యది | వాచా విచలితో యస్తు సుకృతం తేన హారితమ్‌ || 44

పరిణీతాం స్త్రియం హిత్వా గచ్ఛత్యన్యాం చ యః పుమాన్‌ | వేదధర్మం సముల్లంఘ్య కల్పితేన చ యో వ్రజేత్‌ || 45

విష్ణుభక్తిసమాయుక్తశ్శివనిందాం కరోతి యః | పిత్రోః క్షయాహమాసాద్య శూన్యం చైవాక్రమేదిహ || 46

కృత్వా చ పరితాపం హి కరోతి వచనం పునః | తేన పాపేన లింపామి నాగచ్ఛేయం పునర్యది || 47

లేడి ఇట్లు పలికెను-

ఓ కిరాతా! నేను చెప్పుమాటను వినుము. నేను తిరిగి రానిచో, నేను నీకు ఇచ్చిన మాటను తప్పిన కారణముగా నా పుణ్యమును నీవు లాగు కొనెదవు (44). వివాహమాడిన భార్యను విడచి మరియొక స్త్రీ యొక్క పొందును కోరే వ్యక్తి. వేదధర్మమును విడచి కల్పితధర్మమువెంట బడువాడు (45), విష్ణువును ఆరాధిస్తూ శివుని నిందించు వాడు, శూన్యతిథినాడు తల్లిదండ్రుల క్షయాహకర్మను చేయువాడు, దుఃఖమును కలిగించి ఆపై పరుషముగా మాటలాడువాడు ఏ పాపమును పొందెదరో, నేను తిరిగి రానిచో అట్టి పాపమును పొందెదను (46, 47).

సూత ఉవాచ |

ఇత్యుక్తశ్చ తయా వ్యాధో గచ్ఛేత్యాహ మృగీం చ సః | సా మృగీ జలం పీత్వా హృష్టాగచ్ఛత్స్వమాశ్రమమ్‌ || 48

తావద్ద్వితీయో యామో వై తస్య నిద్రాం వినా గతః | ఏతస్మిన్‌ సమయే తత్ర ప్రాప్తే యామే తృతీయకే || 49

జ్ఞాత్వా విలంబం చకితస్తదన్వేషణతత్పరః | తద్యామే మృగమద్రాక్షీజ్జలమార్గగతం తతః || 50

పుష్టం మృగం చ తం దృష్ట్వా హృష్టో వనచరస్సవై | శరం ధనుషి సంధాయ హంతుం తం హి ప్రచక్రమే || 51

తదైవం కుర్వతస్తస్య బిల్వపత్రాణి కానిచిత్‌ | తత్ర్పారబ్ధ వశాద్విష్ణో పతితాని శివోపరి || 52

తేన తృతీయయామస్య తద్రాత్రౌ తస్య భాగ్యతః | పూజా జాతా శివసై#్యవ కృపాలుత్వం ప్రదర్శితమ్‌ || 53

శ్రుత్వా తత్ర చ తం శబ్దం కిం కరోషీతి ప్రాహ సః | కుటుంబార్థమహం హన్మి త్వాం వ్యాధశ్చేతి సోబ్రవీత్‌ || 54

తచ్ఛ్రుత్వా వ్యాధవచనం హరిణో హృష్టమానసః | ద్రుతమేవ చ తం వ్యాధం వచనం చేదమబ్రవీత్‌ || 55

ఆ లేడి ఇట్లు పలుకగా కిరాతుడు దానితో ఇంటికి పొమ్మని పలికెను. ఆ లేడి ఆనందించి నీటిని త్రాగి తన ఇంటికి వెళ్లెను (48). ఇంతలో వానికి నిద్ర లేకుండగనే రెండవ యామము కూడ గడచి, మూడవ యామము ఆరంభమయ్యెను (49). ఆ కిరాతుడు ఆలస్యమగుచున్నదని తలచి మృగము వెదకే కంగారులోనుండెను. మూడవ యామములో నీటికొరకై వెళ్లచున్న ఒక లేడి వాని కంట బడెను (50). బలిసి ఉన్న ఆ మృగమును చూచి ఆ కిరాతుడు సంతసించి బాణమును ధనస్సునకు సంధించి దానిని కొట్టుటకు సిద్ధపడుచుండెను (51). ఆతడు ఆ ప్రయత్నములోనుండగా వాని పూర్వ పుణ్యవిశేషముచే కొన్ని మారేడు పత్రములు శివునిపై పడెను (52). వాని భాగ్యముచే ఆ రాత్రి ఆ విధముగా వానికి మూడవ యామపూజ కూడ సంపన్నమయ్యెను. దీనిలో శివుని దయాగుణము ప్రకటమయ్యెను (53). అక్కడ ఆ శబ్దమును విని 'నీవు ఏమి చేయుచున్నావు?' అని ఆ మృగము ప్రశ్నించగా, నేను కుటుంబపోషణ కొరకై నిన్ను సంహరించబోవుచున్నానని ఆ కిరాతుడు పలికెను (54). ఆ కిరాతుని వచనమును విని మృగము సంతోషముతో నిండిన మనస్సు గలదై వెంటనే ఆ కిరాతునితో ఇట్లు పలికెను (55).

హరిణ ఉవాచ |

ధన్యోహంపుష్టిమానద్య భవత్తృప్తిర్భవిష్యతి | యస్యాంగం నోపకారార్థం తస్య సర్వం వృథా గతమ్‌ || 56

యో వై సామర్థ్యయుక్తశ్చ నోపకారం కరోతి వై | తత్సామర్థ్యం భ##వేద్వ్యర్థం పరత్ర నరకం వ్రజేత్‌ || 57

పరం తు బాలకాన్‌ స్వాంశ్చ సమర్ప్య జననీం శిశూన్‌ | ఆశ్వాస్యాప్యథ తాన్‌ సర్వానాగమిష్యామ్యహం పునః || 58

ఇత్యుక్తస్తేన స వ్యాధో విస్మితోతీవ చేతసి | మనాక్‌ శుద్ధమనా నష్టపాపపుంజో వచో%బ్రవీత్‌ || 59

లేడి ఇట్లు పలికెను-

నేను ధన్యుడను. నా బలిసిన శరీరముతో మీకు తృప్తి కలుగగలదు. ఎవని దేహము పరోపకారము కొరకు వినియోగించబడదో, వానికి సర్వము వ్యర్థమైనట్లే (56). ఎవడైతే సామర్థ్యము ఉన్ననూ పరోపకారమును చేయడో, వాని సామర్థ్యము వ్యర్థమగుటయే గాక, వాడు మరణించిన తరువాత నరకమును పొందును (57). కాని నేను నా చిన్న పిల్లలను తల్లికి అప్పగించి వారిని అందరినీ ఓదార్చి మరలి వచ్చెదను (58). ఆ మృగము ఇట్లు పలుకగా, ఆ కిరాతుడు మనస్సులో చాల ఆశ్చర్యమును పొందెను. ఆతని పాపసమూహము నశించి మనస్సు కొంతవరకు శుద్ధమై ఉండెను. ఆతడు ఇట్లు పలికెను (59).

వ్యాధ ఉవాచ |

యే యే సమాగతాశ్చాత్ర తే తే సర్వే త్వయా యథా | కథయిత్వా గతా హ్యత్ర నాయాంత్యద్యాపి వంచకాః || 60

త్వం చాపి సంకటే ప్రాప్తే వ్యలీకం చ గమిష్యసి | మమ సంజీవనం చాద్య భవిష్యతి కథం మృగ || 61

కిరాతుడు ఇట్లు పలికెను-

ఇక్కడకు వచ్చిన మృగములన్నియు నీవు చెప్పిన విధముగనే చెప్పి వెళ్లినవి. ఆ మృగములు నన్ను మోసగించినవి. అవి ఇంతవరకు తిరిగి రాలేదు (60). నీవు కూడ కష్టము రాగానే మోసము చేయుటకు యత్నించుచున్నావు. ఓ మృగమా! నేను ఎట్లు బ్రదుకవలెను? (61).

మృగ ఉవాచ |

శృణు వ్యాధ ప్రవక్ష్యామి నానృతం విద్యతే మయి | సత్యేన సర్వం బ్రహ్మాండం తిష్ఠత్యేవ చరాచరమ్‌ || 62

యస్య వాణీ వ్యలీకా హి తత్పుణ్యం గలితం క్షణాత్‌ | తథాపి శృణు వై సత్యాం ప్రతిజ్ఞాం మమ భిల్లక || 63

సంధ్యాయాం మైథనే ఘస్రే శివరాత్ర్యాం చ భోజనే | కూటసాక్ష్యే న్యాసహారే సంధ్యాహీనే ద్విజే తథా || 64

శివహీనం ముఖం యస్య నోపకర్తా క్షమో%పి సన్‌ | పర్వణీ శ్రీఫలసై#్యవ త్రోటనే%భక్ష్యభక్షణ || 65

అసంపూజ్య శివ భస్మరహిత శ్చాన్నభుక్‌ చ యః | ఏతేషాం పాతకం మే స్యాన్నాగచ్ఛేయం పునర్యది || 66

మృగము ఇట్లు పలికెను-

ఓ కిరాతా! నేను చెప్పు మాటను వినుము. నాయందు అసత్యములేదు. స్థావర జంగమాత్మకమగు ఈ బ్రహ్మాండమంతయు సత్యమునందు ప్రతిష్ఠితమై యున్నది (62). అసత్యమును పలుకువాని పుణ్యము క్షణకాలములో వినష్టమగును. ఓ కిరాతా! అయిననూ, నేను చేయు సత్యప్రతిజ్ఞను వినుము (63). సంధ్యాకాలములో మైథునమునాచరించినవాడు, శివరాత్రినాడు భుజించినవాడు, అసత్యసాక్ష్యమును పలికినవాడు, దాచి పెట్టమని ఇచ్చిన సొమ్మును అపహరించినవాడు, సంధ్యావందనము లేని బ్రాహ్మణుడు (64). శివనామమునుచ్చరించని నోరు గలవాడు, సమర్థుడై ఉండియు ఉపకారమును చేయనివాడు, పర్వదినమునాడు కొబ్బరికాయను పగులగొట్టినవాడు?, (లేదా, కొబ్బరికాయను, ముచిక వద్ద త్రుంచిన వాడు), తినకూడని పదార్థమును తిన్నవాడు, శివుని పూజించకుండగా మరియు భస్మను ధరించకుండగా భోజనమును చేయువాడు అను వారి పాపములు, నేను తిరిగి రానిచో, నాకు సంక్రమించుగాక! (65, 66)

శివ ఉవాచ|

ఇతి శ్రుత్వా వచస్తస్య గచ్ఛ శీఘ్రం సమావ్రజ | స వ్యాధేనైవముక్తస్తు జలం పీత్వా గతో మృగః || 67

తే సర్వే మిలితాస్తత్ర స్వాశ్రమే కృతసుప్రణాః | వృత్తాంతం చైవ తత్సర్వం శ్రుత్వా సమ్యక్‌ పరస్పరమ్‌ || 68

గంతవ్యం నిశ్చయేనేతి సత్యపాశేన యంత్రితాః | ఆశ్వాస్య బాలకా స్తత్ర గంతుమత్కంఠితాస్తదా || 69

మృగీ జ్యేష్ఠా చ యా తత్ర స్వామినం వాక్యమబ్రవీత్‌ | త్వాం వినా బాలకా హ్యత్ర కథం స్థాస్యంతి వై మృగ || 70

ప్రథమం తు మయా తత్ర ప్రతిజ్ఞా చ కృతా ప్రభో | తస్మాన్మయా చ గంతవ్యం భవద్భ్యాం స్థీయతామిహ || 71

ఇతి తద్వచనం శ్రుత్వా కనిష్ఠా వాక్యమబ్రవీత్‌ | అహం త్వత్సేవికా చాద్య గచ్ఛామి స్థీయతాం త్వయా || 72

తచ్ఛ్రుత్వా చ మృగః ప్రాహ గమ్యతే తత్రవై మయా | భవత్యౌ తిష్ఠతాం చాత్ర మాతృతశ్శిశురక్షణమ్‌ || 73

తత్స్వామివచనం శ్రుత్వా మేనాతే తన్న ధర్మతః | ప్రోచుః ప్రీత్యా స్వభర్తారం వైధవ్యే జీవితం చ ధిక్‌ || 74

బాలానాశ్వాస్య తాంస్తత్ర సమర్ప్య సహవాసినః | గతాస్తే సర్వ ఏవాశు యత్రాస్తే వ్యాధసత్తమః ||75

తే బాలా అపి సర్వేవై విలోక్యానుసమాగతాః | ఏతేషాం యా గతిస్స్యాద్వై హ్యస్మాకం సా భవత్వితి || 76

శివుడు ఇట్లు పలికెను -

దాని ఈ మాటను విని ఆ కిరాతుడు, సరే, తొందరగా వెళ్లి తిరిగి రమ్ము అని పలికెను. అది ఆ మాటను విని నీటిని త్రాగి వెళ్లెను (67). ఈ విధముగా గొప్ప శపథములను చేసి వెళ్లిన ఆ మృగములన్నియు తమ నివాసములో కలుసుకొని, ఒకరినుండి మరియొకరు ఆ వృత్తాంతమునంతను వినినవి (68). అవి సత్యము అనే పాశముచే బంధింపబడినవై తప్పనిసరిగా వెళ్లవలెనని నిశ్చయించుకొని ఇంటిలోని బాలకులను ఓదార్చి వెళ్లుటకు తొందర పడుచుండెను (69). ఆడు లేళ్ళలో పెద్దది తన భర్తతో ఇట్లు పలికెను: ఓ మృగమా! నీవు లేనిచో ఈ బాలకులు ఇచట ఎట్లు ఉండగలరు? (70) ఓ ప్రభూ! ముందుగా నేను ప్రతిజ్ఞను చేసితిని. కావున నేను అచటకు వెళ్లవలయును. మీరు ఇచటనే ఉండుడు (71). దాని ఆ మాటను విని చిన్నదగు రెండవ ఆడు లేడి ఇట్లు పలికెను: నేను నీ సేవకురాలను. ఇప్పుడు నేను వెళ్లుచున్నాను. మీరిద్దరు ఇక్కడనే ఉండుడు (72). ఆ మాటలను విని మగ లేడి ఇట్లు పలికెను: నేను వెళ్లుచున్నాను. మీరిద్దరు ఇక్కడనే ఉండుడు. పిల్లలను రక్షించుట తల్లికి కర్తవ్యము (73). తమ భర్తయొక్క ఆ వచనమును ఆ హరిణములు ధర్మబద్ధములని తలంచలేదు. అవి తమ భర్తతో ప్రేమపూర్వకముగా ఇట్లు పలికినవి: వైధవ్య జీవితమునకు నింద యగుగాక! (74) అవి అన్నియు కూడ పిల్లలను ఓదార్చి వారిని తమ తోటివారికి అప్పజెప్పి ఆ కిరాతశ్రేష్ఠుడు ఉన్న స్థలమునకు శీఘ్రముగా వెళ్లినవి (75). వీరికి లభించు గతియే మాకు కూడ లభించుగాక! అని తలంచి ఆ పిల్లలన్నియు ఆ మృగములు వెళ్లుచుండుటను గాంచి తాము కూడ వాటి వెనుకనే వెళ్లినవి (76).

తాన్‌ దృష్ట్వా హర్షితో వ్యాధో బాణం ధనుషి సందధే | పునశ్చ జలపత్రాణి పతితాని శివోపరి || 77

తేన జాతా చతుర్థస్య పూజాయామస్య వై శుభా | తస్య పాపం తదా సర్వం భస్మసాదభవత్‌ క్షణాత్‌ || 78

మృగీ మృగీ మృగశ్చోచుశ్శీఘ్రం వై వ్యాధసత్తమ | అస్మాకం సార్థకం దేహం కురు త్వం హి కృపాం కురు || 79

ఇతి తేషాం వచశ్శ్రుత్వా వ్యాధో విస్మయమాగతః | శివపూజాప్రభావేణ జ్ఞానం దుర్లభమాప్తవాన్‌ || 80

ఏతే ధన్యా మృగాశ్చైవ జ్ఞానహీనాస్సుసంమతాః | స్వీయేనైవ శరీరేణ పరోపకరణ రతాః || 81

మానుష్యం జన్మ సంప్రాప్య సాధితం కిం మయాధునా | పరకాయం చ సంపీడ్య శరీరం పోషితం మయా || 82

కుటుంబం పోషితం నిత్యం కృత్వా పాపాన్యనేకశః | ఏవం పాపాని హా కృత్వా కా గతిర్మే భవిష్యతి || 83

కిరాతుడు ఆ మృగములను చూచి చాల ఆనందంచి బాణమును ధనస్సుపై ఎక్కుపెట్టెను. మరల నీరు మరియు పత్రములు శివునిపై పడెను (77). ఈ విధముగా శుభకరమగు నాల్గవ యామపూజ కూడ సంపన్నమయ్యెను. అప్పుడు వెంటనే వాని పాపములు అన్నియు క్షణములో బూడిద అయ్యెను (78). రెండు స్త్రీ మృగములు, ఒక పురుషమృగము వెంటనే ఇట్లు పలికినవి: ఓ కిరాతోత్తమా! నీవు మాయందు దయను చేసి శీఘ్రమే మా దేహములను సార్థకము చేయుము (79). వాటియొక్క ఈ వచనమును విని ఆ కిరాతుడు ఆశ్చర్యపోయెను. శివుని పూజించిన ప్రభావముచే ఆతనికి దుర్లభమగు జ్ఞానము లభించెను (80). జ్ఞానము లేనివి అని సర్వులు భావించే ఈ మృగములు తమ శరీరమును అర్పించి పరోపకారమును చేయటయందు నిష్ఠ కలిగి ధన్యములైనవి (81). నేను మనుష్యజన్మను పొంది ఏమి సాధించితిని? ఇతరప్రాణులను సంహరించి వాటి దేహములతో నేను పొట్ట పోసుకొంటిని (82). నిత్యము అనేకపాపములను చేసి కుటుంబమును పోషించితిని. అయ్యో! ఈ విధముగా పాపములను చేసిన నాకు ఏమి గతి పట్టనున్నదో! (83)

కాం వా గతిం గమిష్యామి పాతకం జన్మతః కృతమ్‌ | ఇదానీం చింతయామ్యేవం ధిక్‌ ధిక్‌ చ జీవనం మమ || 84

ఇతి జ్ఞానం సమాపన్నో బాణం సంహారయంస్తదా | గమ్యతాం చ మృగశ్రేష్ఠా ధన్యాః స్థ ఇతి చాబ్రవీత్‌ || 85

ఇత్యుక్తే చ తదా తేన ప్రసన్నశ్శంకరస్తదా | పూజితం చ స్వరూపం హి దర్శయామాస సంమతమ్‌ || 86

సంస్పృశ్య కృపయా శంభుస్తం వ్యాధం ప్రీతితో%బ్రవీత్‌ | వరం బ్రూహి ప్రసన్నో%స్మి వ్రతేనానేన భిల్లక || 87

వ్యాధో%పి శివరూపం చ దృష్ట్వా ముక్తో %భవత్‌ క్షణాత్‌ | పపాత శివపాదాగ్రే సర్వం ప్రాప్తమితి బ్రువన్‌ || 88

శివో%పి సుప్రసన్నాత్మా నామ దత్త్వా గుహేతి చ | విలోక్యం తం కృపాదృష్ట్యా తసై#్మ దివ్యాన్‌ వరానదాత్‌ || 89

శృణు వ్యాధాద్య భోగాంస్త్వం భుంక్ష్వ దివ్యాన్‌ యథేప్సితాన్‌ | రాజధానీం సమాశ్రిత్య శృంగబేరపురే పరామ్‌ || 90

అనపాయా వంశవృద్ధిః శ్లాఘనీయస్సురైరపి | గృహే రామస్తవ వ్యాధ సమాయాస్యతి నిశ్చితమ్‌ || 91

కరిష్యతి త్వయా మైత్రీం మద్భక్తస్నేహకారకః | మత్సేవాసక్తచేతాస్త్వం ముక్తిం యాస్యసి దుర్లభమ్‌ || 92

ఏతస్మిన్నంతరే తే తు కృత్వా శంకరదర్శనమ్‌ | సర్వే ప్రణమ్య సన్ముక్తిం మృగయోనేః ప్రపేదిరే || 93

పుట్టిన నాటినుండియు పాపములను చేసిన నేను ఏ గతిని పొందెదనో! ఇప్పుడు ఈ విధముగా ఆలోచించుచున్నాను. నా జీవితమునకు పలుమార్లు నిందయగుగాక! (84) ఆతడు ఈ విధమగు జ్ఞానమును పొందినవాడై బాణమును ఉపసంహరించెను. ఓ శ్రేష్ఠమృగములారా! మీరు ధన్యులు, వెళ్లుడు అని ఆతడు పలికెను (85). ఆతడు ఇట్లు పలుకగానే శంకరుడు ప్రసన్నుడై వానిచే పూజింపబడినది మరియు సర్వులకు అభీష్టమైనది అగు తన రూపమును చూపించెను (86). శంభుడు ప్రీతిపూర్వకముగా ఆ కిరాతుని దయతో స్పృశించి ఇట్లు పలికెను: ఓ కిరాతా! నీ ఈ వ్రతముచే నేను ప్రసన్నుడనైతిని. వరమును కోరుకొనుము (87). ఆ కిరాతుడు శివుని రూపమును చూచి క్షణములో ముక్తుడు ఆయెను. నాకు సర్వము లభించినది అని పలికి ఆతడు శివుని పాదములపై పడెను (88). శివుడు కూడా మిక్కిలి ప్రసన్నుడై గుహుడు అని ఆతనికి పేరు పెట్టి ఆతనిని దయాదృష్టితో చూచి దివ్యవరములనిచ్చెను (89). ఓ వ్యాధా! వినుము. ఈ జన్మలో నీవు అభీష్టములైన దివ్యభోగములను అనుభవించుము. శ్రేష్ఠమగు శృంగబేరిపురము నీకు రాజధాని కాగలదు (90). దేవతలచేత కూడ కొనియాడదగిన నీ వంశము ఆపదలేమియు లేకుండగా వృద్ధిని పొందగలదు. ఓ కిరాతా! శ్రీరాముడు నిశ్చయముగా నీ గృహమునకు రాగలడు (91). నా భక్తులతో స్నేహమును నెరపు ఆ శ్రీరాముడు నీతో మైత్రిని చేయగలడు. నా సేవయందు ఆసక్తమైన మనస్సు గల నీవు దుర్లభమగు ముక్తిని పొందగలవు (92). ఇదే సమయములో ఆ మృగములు అన్నియు శంకరుని దర్శించి ప్రణమిల్లి మృగజన్మనుండి విముక్తిని పొందినవి (93).

విమానం చ సమారుహ్య దివ్యదేహా గతాస్తదా | శివదర్శనమాత్రేణ శాపాన్ముక్తా దివం గతాః || 94

వ్యాధేశ్వర శ్శివో జాతః పర్వతే హ్యర్బుదాచలే | దర్శనాత్‌ పూజానాత్సద్యో భుక్తిముక్తిప్రదాయకః || 95

వ్యాధో%పి తద్దినాన్నూనం భోగాన్‌ స సురసత్తమ | భుక్త్వా రామకృపాం ప్రాప్య శివసాయుజ్యమాప్తవాన్‌ || 96

అజ్ఞానాత్స వ్రతం చైతత్కృత్వా సాయుజ్యమాప్తవాన్‌ | కిం పునర్భక్తిసంపన్నా యాంతి తన్మయతాం శుభామ్‌ || 97

విచార్య సర్వశాస్త్రాణి ధర్మాంశ్చైవాప్యనేకశః | శివరాత్రివ్రతమిదం సర్వోత్కృష్టం ప్రకీర్తితమ్‌ || 98

వ్రతాని వివిధాన్యత్ర తీర్థాని వివిధాని చ | దానాని చ విచిత్రాణి మఖాశ్చ వివిధాస్తథా || 99

తపాంసి వివిధాన్యేవ జాపాశ్చైవాప్యనేకశః | నైతేన సమతాం యాంతి శివరాత్రవ్రతేన చ || 100

తస్మాచ్ఛుభతరం చైతత్కర్తవ్యం హితమీప్సుభిః | శివరాత్రివ్రతం దివ్యం భుక్తిముక్తిప్రదం సదా || 101

ఏతత్సర్వం సమాఖ్యాతం శివరాత్రివ్రతం శుభమ్‌ | వ్రతరాజేతి విఖ్యాతం కిమన్యచ్ఛ్రోతుమిచ్ఛసి || 102

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం శివరాత్రివ్రతమాహాత్మ్య వర్ణనం నామ చత్వారింశో%ధ్యాయః (40).

అపుడా మృగములు శివుని దర్శనమాత్రముచే శాపమునుండి విముక్తిని పొంది దివ్యదేహమును దాల్చి విమానమునధిరోహించి స్వర్గమును చేరినవి (94). అర్బుదపర్వతమునందు శివుడు వ్యాధేశ్వరుడను పేర వెలసెను. ఆయనను దర్శించి పూజించు వారలకు ఆయన శీఘ్రముగా భుక్తిని మరియు ముక్తిని ఇచ్చును (95). ఓ సురశ్రేష్ఠా! ఆ వ్యాధుడు కూడ ఆ నాటినుండియు భోగములననుభవించి శ్రీరాముని కృపకు పాత్రుడై శివుని సాయుజ్యమును పొందెను (96). ఆతడు తెలియకుండగనే వ్రతమునాచరించి సాయుజ్యమును పొందగా, భక్తితో కూడియున్నవారు శుభకరమగు ఈశ్వరైక్యమును పొందెదరని చెప్ప బనియేమి? (97) సర్వశాస్త్ర ములను మరియు అనేకధర్మములను పరిశీలించి ఈ శివరాత్రి వ్రతము సర్వశ్రేష్ఠమైనదని గొప్పగా కీర్తించబడి నది (98). వివిధవ్రతములు, అనేకతీర్థములు, రకరకముల దానములు, వివిధయజ్ఞములు (99), వివిధతపస్సులు, అనేక జపములు ఈ శివరాత్రి వ్రతముతో సమానము కావు (100). కావున హితమును కోరు మానవులు మిక్కిలి శుభకరమైనది, దివ్యమైనది, భుక్తిని మరియు ముక్తిని ఇచ్చునది అగు ఈ శివరాత్రివ్రతమును సర్వదా చేయుచుండవలెను (101), శుభకరమైనది, వ్రతరాజమని పేరుగాంచినది అగు ఈ శివరాత్రి వ్రతమును సమగ్రముగా చెప్పితిని. నీవు ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? (102)

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్రసంహితయందు శివరాత్రివ్రతమాహాత్మ్య వర్ణనమనే నలుబదియవ అధ్యాయము ముగిసినది (40).

Siva Maha Puranam-3    Chapters