Siva Maha Puranam-3    Chapters   

అథ పఞ్చత్రింశో%ధ్యాయః

శివసహస్రనామము

సూత ఉవాచ|

శ్రూయతామృషయ శ్శ్రేష్ఠాః కథయామి యథాశ్రుతమ్‌ | విష్ణునా ప్రార్థితో యేన సంతుష్టః పరమేశ్వరః |

తదహం కథయామ్యద్య పుణ్యం నామసహస్రకమ్‌||

సూతుడు ఇట్లు పలికెను-

ఓ మహర్షులారా! విష్ణువు ఏ స్తోత్రమును పఠించుటచే పరమేశ్వరుడు ప్రసన్నుడైనచో, అ పవిత్రమైన సమస్రనామస్తోత్రమును ఇపుడు నేను విన్నదానికి అనుగుణముగా చెప్పుచున్నాను వినుడు (1).

శ్రీ విష్ణురువాచ|

శివో హరో మృడో రుద్రః పుష్కరః పుష్పలోచనః | అర్థిగమ్యస్సదాచారశ్శర్వశ్శంభుర్మహేశ్వరః ||2

చంద్రపీడశ్చంద్రమౌలిర్విశ్వం విశ్వంభ##రేశ్వరః | వేదాంతసారసందోహః కపాలీ నీలలోహితః ||3

ధ్యానాధారో%పరిచ్ఛేద్యో గౌరీభర్తా గణశ్వరః | అష్టమూర్తిర్విశ్వమూర్తిస్త్రి వర్గస్స్వర్గసాధనః|| 4

జ్ఞానగమ్యో దృఢప్రజ్ఞో దేవదేవస్త్రిలోచనః | వామదేవో మహాదేవః పటుః పరిపృఢో దృఢః || 5

విశ్వరూపో విరూపాక్షో వాగీశశ్శుచిసత్తమః | సర్వప్రమాణసంవాదీ వృషాజ్కో వృషవాహనః || 6

ఈశః పినాకీ ఖట్వాంగీ చిత్ర వేషశ్చిరంతనః | తమోహరో మహాయోగీ గోప్తా బ్రహ్మా చ ధూర్జటిః|| 7

కాలకాలః కృత్తవాసాస్సుభగః ప్రణవాత్మకః | ఉన్నధ్రః పురుషో జుష్యో దుర్వాసాః పురశాసనః||8

శ్రీ విష్ణువు ఇట్లు పలికెను-

మంగళస్వరూపుడు, పాపములను హరించువాడు, అనుగ్రహమును వర్షించువాడు, దుఃఖమును పారద్రోలు వాడు, పోషంచువాడు, పుష్పములవంటి నేత్రములు గలవాడు, కోరికలు గలవారిచే ఆరాధింపబడువాడు, సదాచారస్వరూపుడు, ప్రాణిహింసకుడు, మంగళప్రదాత, సర్వమునకు నియంత (2). చంద్రుడు శిరోభూషణముగా గలవాడు, శిరస్సుపై చంద్రవంకను ధరించువాడు, జగత్స్వరూపుడు, జగత్తును పొషించు ఈశ్వరుడు, మూర్తీభవించిన వేదాంతప్రతిపాద్యతత్త్వము, కపాలమును ధరించువాడు, కంఠమునందు నీలవర్ణము ఇతరావయవములయందు రక్త వర్ణము గలవాడు (3). ధ్యానమునకు ఆలంబనమైన మూర్తి గలవాడు, దేశకాలవస్తుపరిచ్ఛేదములు లేనివాడు, పార్వతీపతి, గణములకు అధిపతి, భూమి- జలము- అగ్ని- వాయువు- ఆకాశము- సూర్యుడు- చంద్రుడు-సోమయాజి అనే ఎనిమిది రూపములు గలవాడు, జగద్రూపముగా భాసించువాడు, ధర్మార్థకామస్వరూపుడు, స్వర్గమునకు సాధనమైనవాడు (4). జ్ఞానముచే పొందదగినవాడు, సర్కోత్కృష్ణమైన ప్రజ్ఞ గలవాడు, దేవతలకు దేవత, ముక్కంటి, సుందరమైన దేవత, గొప్ప దేవత, సమర్థుడు నాయకుడు, ధృఢమైనవాడు (5). బేసి కన్నులవాడు, వాక్కునకు అధిపతి, పరమపవిత్రమైనవాడు, ప్రమాణములన్నింటియొక్క సమన్వయస్వరూపుడు, వృషభము చిహ్నముగా గలవాడు, వృషభము వాహనముగా గలవాడు (6). పాలకుడు, పినాకమనే ధనస్సును ధరించువాడు, ఖట్వాంగమనే ఆయుధమును ధరించువాడు, చిత్రమైన వేషము గలవాడు, శాశ్వతుడు, తమోగుణమును పొగొట్టువాడు, యోగులలోకెల్ల గొప్పవాడు , రక్షకుడు, బ్రహ్మరూపుడు, జటాభారము గలవాడు (7). మృత్యువునకు మృత్యువు, చర్మమును ధరించువాడు, సుందరమైనవాడు, ఓంకారస్వరూపుడు, సర్వోపరి ఉండువాడు, పూర్ణస్వరూపుడు, సేవించదగినవాడు, దుర్వాసమహర్షి రూపములో అవతరించినవాడు, త్రిపురాసురులను సంహరించినవాడు(8).

దివ్యాయుధస్స్కందగురుః పరమేష్ఠీ పరాత్పరః | అనాదిమధ్యనిధనో గిరీశో గిరిజాధవః || 9

కుబేరబంధుశ్శ్రీ కంఠో లోకవర్ణోత్తమో మృదుః | సమాధివేద్యః కోదండీ నీలకంఠః పరశ్వధీ || 10

విశాలాక్షో మృగవ్యాధస్సురేశస్సూర్యతాపనః | ధర్మధామ క్షమాక్షేత్రం భగవాన్‌ భగనేత్రభిత్‌ || 11

ఉగ్రః పశుపతిస్తార్‌క్ష్యః ప్రియభక్తః పరంతపః | దాతా దయాకరో దక్షః కపర్దీ కామశాసనః || 12

శ్మశాననిలయస్సూక్ష్మశ్శ్మశానస్థో మహేశ్వరః | లోకకర్తా మృగపతిర్మహాకర్తా మహౌషధిః || 13

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః | నీతిస్సునీతిశ్శుద్ధాత్మా సోమస్సోమరతస్సుఖీ || 14

సోమపో%మృతపస్సౌమ్యో మహతేజా మహాద్యుతిః | తేజోమయో%మృతమయో%న్న మయశ్చ సుధాపతిః || 15

దివ్యమగు ఆయుధములు గలవాడు, కుమారస్వామియొక్క తండ్రి, సర్వమునకు అతీతమైనవాడు, ఆదిమధ్యాంతములు లేనివాడు, కైలాసపతి పార్వతీపతి (9), కుబేరుని మిత్రుడు, కంఠమునందు విషమును దాల్చినవాడు, లోకములోని వర్ణములన్నింటిలో ఉత్తమమైన వర్ణము గలవాడు, మెత్తనివాడు, సమాధిలో తెలియబడువాడు, ధనస్సు గలవాడు, నల్లని కంఠము గలవాడు, పరశుధారి (10), నిడివి కన్నులవాడు, మృగములను సంహరించే కిరాతుడు, దేవతలకు ప్రభువు సూర్యుని నియంత్రించువాడు, ధర్మమునకు నిధానమైనవాడు, క్షమకు ఆకారమైనవాడు, షడ్గుణౖశ్వర్య సంపన్నుడు, భగుని నేత్రములను ఊడబెరకినవాడు (11), భయంకరాకారుడు, జీవులకు నియంత, గరుడుడు, భక్తులయందు ప్రీతి గలవాడు, శత్రువులను తపింపజేయువాడు, దాత, దయానిధి, సమర్థుడు, జటాజూటము గలవాడు, మన్మథుని సంహరించినవాడు (12), శ్మశాసనమునందు నివసించువాడు, ఇంద్రియములకు గోచరము కానివాడు, లోకములను సృష్టించినవాడు, మృగములకు ప్రభువు, నిరతిశయకర్త, గొప్ప మందు (13), సర్వాతీతుడు, వాక్కులకు ప్రభువు, రక్షకుడు, సనాతనుడు, మంచి నీతియే స్వరూపముగా గలవాడు, పవిత్రమగు అంతఃకరణము గలవాడు, చంద్రుడు, సోమయాగమునందు ప్రీతి గలవాడు, సుఖస్వరూపుడు (14), సోమపానమును చేయువాడు, అమృతపానము చేయువాడు, ఆహ్లాదకరుడు, గొప్ప తేజస్సు గలవాడు, గొప్ప ప్రకాశము గలవాడు, తేజస్స్వరూపుడు, అమృత స్వరూపుడు, అన్నస్వరూపుడు, అమృతమునకు ప్రభువు (15).

అజాతశత్రురాలోకసంభావ్యో హవ్యవాహనః | లోకకారో వేదకరస్సూత్రకారస్సనాతనః || 16

మహర్షిః కపిలాచార్యో విశ్వదీప్తిస్త్రిలోచనః | పినాకపాణిర్భూదేవస్స్వస్తిదస్స్వస్తికృత్సుధీః || 17

ధాతృధామా ధామకరస్సర్వగస్సర్వగోచరః | బ్రహ్మసృగ్విశ్వసృక్సర్గః కర్ణికార ప్రియః కవిః || 18

శాఖో విశాఖో గోశాఖశ్శివో భిషగనుత్తమః | గంగాప్లవోదకో భవ్యః పుష్కలః స్థపతిః స్థిరః || 19

విజితాత్మా విధేయాత్మా భూతవాహనసారథిః | సగణో గణకాయశ్చ సుకీర్తిశ్ఛిన్నసంశయః || 20

కామదేవః కామపాలో భస్మోద్ధూలితవిగ్రహః | భస్మప్రియో భస్మశాయీ కామీ కాంతః కృతాగమః || 21

సమావర్తో నివృత్తాత్మా ధర్మపుంజస్సదాశివః | అకల్మషశ్చ పుణ్యాత్మా చతుర్బాహుర్దురాసదః || 22

శత్రువు అనే ప్రసక్తి లేనివాడు, చైతన్యప్రకాశముచే తెలయదగినవాడు, అగ్నిహోత్రుడు, లోకములను సృష్టించినవాడు, వేదములను సృష్టించినవాడు, సూత్రములను సృష్టించినవాడు, శాశ్వతుడు (16), మహర్షి కపిలాచార్యునిగా అవతరించినవాడు, జగత్తును ప్రకాశింప జేయువాడు, బ్రాహ్మణస్వరూపుడు, మంగళములనిచ్చువాడు, మంగళములను సృష్టించినవాడు, జ్ఞానస్వరూపుడు (17), బ్రహ్మకు ఆశ్రయమైనవాడు, ప్రకాశమునిచ్చువాడు, సర్వవ్యాపకుడు, సర్వమునందు దర్శనమునిచ్చువాడు, బ్రహ్మను సృష్టించినవాడు, విశ్వమును సృష్టించినవాడు, సృష్టిస్వరూపుడు, కర్ణికారపుష్పములయందు ప్రీతి గలవాడు, త్రికాలజ్ఞుడు (18), కుమారస్వామి, ఆదిభిక్షువు (లేదా విశాఖఋషి), వేదశాఖా స్వరూపుడు, భవరోగమునకు సాటిలేని వైద్యుడు, గంగాజలరూపములో ప్రవహించువాడు, ఉదాత్తమైనవాడు, పూర్ణుడు, శిల్పశాస్త్రవేత్త, కూటస్థుడు (19), ఇంద్రియజయము గలవాడు, మనోనియంత్రణ గలవాడు, శరీరమనే రథమునకు బుద్ధి రూపములో సారథి అయినవాడు, గణసమేతుడు, గణములచే రక్షింపబడువాడు, పవిత్రమగు కీర్తి గలవాడు, సంశయములు లేనివాడు (20), మన్మథస్వరూపుడు, మన్మథుని పాలించినవాడు, భస్మ లేపనముతో గూడిన దేహము గలవాడు, సుందరుడు, ఆగమములను రచించినవాడు (21), సంసారచక్రమును త్రిప్పువాడు, లయము చేయబడిన మనస్సు గలవాడు, మూర్తీభవించిన ధర్మము, సర్వదా మంగళస్వరూపుడు, పాపసంసర్గము లేనివాడు, పుణ్యస్వరూపుడు, నాలుగు భుజములు గలవాడు, సమీపించ శక్యము కానివాడు (22).

దుర్లభో దుర్గమో దుర్గస్సర్వాయుధవిశారదః | అధ్యాత్మయోగనిలయస్సుతంతుస్తంతువర్ధనః || 23

శుభాంగో లోకసారంగో జగదీశో జనార్దనః | భస్మశుద్ధికరో మేరురోజస్వీ శుద్ధవిగ్రహః || 24

అసాధ్యస్సాధుసాధ్యశ్చ భృత్యమర్కటరూపధృక్‌ | హిరణ్యరేతాః పౌరాణో రిపుజీవహరో బలీ || 25

మహాహ్రదో మహాగర్తస్సిద్ధో బృందారవందితః | వ్యాఘ్రచర్మాంబరో వ్యాలీ మహాభూతో మహానిధిః || 26

అమృతో%మృతపః శ్రీమాన్‌ పాంచజన్యః ప్రభంజనః | పంచవింశతితత్త్వస్థః పారిజాతః పరాత్పరః || 27

సులభస్సువ్రతశ్శూరో వాఙ్మయైకనిధిర్నిధిః | వర్ణాశ్రమగురుర్వర్ణీ శత్రుజిచ్ఛత్రుతాపనః || 28

అరుదైనవాడు, లభింప శక్యము కానివాడు, పొంద శక్యము కానివాడు, ఆయుధములన్నింటియందు నైపుణ్యము గలవాడు, అధ్యాత్మయోగమునందు నివసించి యుండువాడు, మంచి సంతానరూపములో నుండువాడు, సంతానమును వృద్ధి చేయువాడు (23), శుభకరములగు అవయవములు గలవాడు, సర్వ జగత్తుయొక్క సారస్వరూపుడు, జగత్ర్పభువు, దుష్టజనులను శిక్షించువాడు, భస్మచే శుద్ధిని కలిగించువాడు, మేరుపర్వతస్వరూపుడు, మహాబలశాలి, పవిత్రదేహము గలవాడు (24), సాధించ శక్యము కాని వాడు, సాధుపురుషులచే సాధించబడువాడు, సేవను చేసే కోతిరూపమును దాల్చినవాడు, తేజస్సు బీజముగా గలవాడు, సనాతనుడు, శత్రువుల ప్రాణములను హరించువాడు, బలశాలి (25), సముద్రస్వరూపుడు, పెద్ద బిలము స్వరూపముగా గలవాడు, సిద్ధపురుషుడు, దేవతలచే నమస్కరింపబడువాడు, వ్యాఘ్రచర్మమును ధరించువాడు, పాములను ధరించువాడు, పంచమహాభూతస్వరూపుడు, గొప్ప నిధి (26), అమృతస్వరూపుడు, అమృతసానము చేసినవాడు, శోభాయుక్తుడు, పంచవిధజనులకు ప్రియుడు, గాలివాన రూపములో వచ్చువాడు, ఇరువది ఐదు తత్త్వములలో ఉండువాడు, పారిజాతవృక్షస్వరూపుడు (27), తేలికగా లభించువాడు, గొప్ప వ్రతనిష్ఠ గలవాడు, శూరుడు, వాజ్మయము అనే ఏకైకనిధి, నిధిస్వరూపుడు, వర్ణాశ్రమములకు గురువు, బ్రహ్మచారి, శత్రువులను జయించువాడు, శత్రువులను తపింపజేయువాడు (28).

ఆశ్రమః క్షపణః క్షామో జ్ఞానవానచలేశ్వరః | ప్రమాణభూతో దుర్‌జ్ఞేయస్సువర్ణో వాయువాహనః || 29

ధనుర్ధరో ధనుర్వేదో గుణశ్శశిగుణాకరః | సత్యస్సత్యపరో%దీనో ధర్మో గోధర్మశాసనః || 30

అనంతదృష్టిరానందో దండో దమయితా దమః | అభిచార్యో మహామాయో విశ్వకర్మా విశారదః || 31

వీతరాగో వినీతాత్మా తపస్వీ భూతభావనః | ఉన్మత్తవేషః ప్రచ్ఛన్నో జితకామో%జితప్రియః || 32

కల్యాణప్రకృతిః కల్పః సర్వలోకప్రజాపతిః | తరస్వీ తారకో ధీమాన్‌ ప్రధానః ప్రభురవ్యయః || 33

లోకపాలో%ంతర్హితాత్మా కల్పాదిః కమలేక్షణః | వేదశాస్త్రార్థతత్త్వజ్ఞో%నియమో నియతాశ్రయః |

చంద్రస్సూర్యశ్శనిః కేతుర్వరాంగో విద్రుమచ్ఛవిః || 34

భక్తివశ్యః పరం బ్రహ్మా మృగబాణార్పణో%నఘః || 35

అద్రిర ద్ర్యా లయః కాంతః పరమాత్మా జగద్గురుః | సర్వకర్మాలయస్తుష్టోమంగల్యో మంగలావృతః || 36

ఆశ్రమస్వరూపుడు, సన్న్యాసి, బక్కచిక్కినవాడు, జ్ఞాని, పర్వతాధిపతి, ప్రమాణస్వరూపుడు, తెలియ శక్యము కానివాడు, సుందరమగు రెక్కలు గలవాడు, గంధస్వరూపుడు (29), ధనుర్ధారి, ధనుర్వేదస్వరూపుడు, త్రిగుణస్వరూపుడు, చంద్రుని ఆహ్లాదకర గుణమునకు నిధానమైనవాడు, సత్యస్వరూపుడు, సత్యమునందు నిష్ఠ గలవాడు, దైన్యమునెరుంగని వాడు, ధర్మస్వరూపుడు, వేదధర్మముద్వారా శాసించువాడు (30). అనంతమగు దృష్టి గలవాడు, ఆనందఘనుడు, దండస్వరూపుడు, దండించువాడు, దయాస్వరూపుడు, సమీపించదగినవాడు, గొప్ప మాయ గలవాడు, విశ్వకర్మ నిపుణుడు (31), రాగము లేనివాడు, వినయముతో కూడిన మనస్సు గలవాడు, తపశ్శాలి, భూతములను సృష్టించువాడు, ఉన్మత్తునివలె వేషమును ధరించువాడు, దాగియుండువాడు, కామమును జయించినవాడు, ప్రీతిపాత్రులకు అపజయమును కలిగించనివాడు (32), మంగళస్వభావము గలవాడు, కల్ప స్వరూపుడు, సకలలోకములకు ప్రజాపతి, వేగము గలవాడు, రక్షించువాడు, బుద్ధిశాలి, ప్రధానస్వరూపుడు, ప్రభువు, నాశము లేనివాడు (33), లోకపాలకుడు, దాగియున్న స్వరూపము గలవాడు, కల్పాది స్వరూపుడు, కమలములవంటి కన్నులు గలవాడు, వేదశాస్త్ర ముల సారమునెరింగినవాడు, నియమములు లేనివాడు, స్థిరమగు నివాసము గలవాడు (34), చంద్రుడు సూర్యుడు శని, కేతువు, శ్రేష్ఠమగు అవయవములు గలవాడు, పగడపు కాంతి గలవాడు, భక్తిచే వశమగువాడు, పరంబ్రహ్మ, మృగముపై బాణములను ప్రయోగించినవాడు, పాపసంపర్కము లేనివాడు (35), పర్వతము, పర్వతముపై నివసించువాడు, సుందరుడు, పరమాత్మ జగత్తునకు గురువు, సర్వకర్మలకు నిలయము, సంతోషము గలవాడు, మంగళనిధానము, మంగళములచే చుట్టువారబడి ఉండువాడు (36).

మహాతపా దీర్ఘతపాః స్థవిష్ఠః స్థవిరో ధ్రువః | అహస్సంవత్సరో వ్యాప్తిః ప్రమాణం పరమం తపః || 37

సంవత్సరకరో మంత్రః ప్రత్యయస్సర్వతాపనః | అజస్సర్వేశ్వరస్సిద్ధో మహాతేజా మహాబలః || 38

యోగీ యోగ్యో మహారేతాస్సిద్ధిస్సర్వాదిరగ్రహః | వసుర్వసుమనా స్సత్యస్సర్వపాపహరో హరః || 39

సుకీర్తిశ్శోభనస్స్రగ్వీ వేదాంగో వేదవిన్మునిః | భ్రాజిష్ణుర్భోజనం భోక్తా లోకనాథో దురాధరః || 40

అమృతశ్శాశ్వతశ్శాంతో బాణహస్తః ప్రతాపవాన్‌ | కమండలు ధరో ధన్వీ హ్యవాఙ్మానసగోచరః || 41

అతీంద్రియో మహామాయస్సర్వవాసశ్చతుష్పథః | కాలయోగీ మహానాదో మహోత్సాహో మహాబలః || 42

మహాబుద్ధిర్మహావీర్యో భూతచారీ పురందరః | నిశాచరః ప్రేతచారీ మహాశక్తి ర్మహాద్యుతిః || 43

అనిర్దేశ్యవపుశ్శ్రీ మాన్‌ సర్వాచార్యమనోగతిః | బహు శ్రుతిర్మహామాయో నియతాత్మా ధ్రువో%ధ్రువః || 44

గొప్ప తపస్సు గలవాడు, దీర్ఘకాలము తపస్సును చేయువాడు, స్థూలస్వరూపుడు, ముసలివాడు, ధ్రువమండలస్వరూపుడు, పగటి కాలమునకు అధిష్ఠానమైన దేవతాస్వరూపుడు, సంవత్సరస్వరూపుడు, నిత్య సంబంధస్వరూపుడు, ప్రమాణస్వరూపుడు, శ్రేష్ఠతపస్స్వరూపుడు (37), సంవత్సరమనే కాలమును చేయు సూర్యస్వరూపుడు, మంత్రస్వరూపుడు, శ్రద్ధాస్వరూపుడు, సర్వులను తపింపజేయువాడు, పుట్టుక లేనివాడు, సర్వేశ్వరుడు, సిద్ధుడు, మహాతేజశ్శాలి, మహాబలశాలి (38), యోగీ, యోగ్యమైన వాడు, సర్వజగత్తునకు బీజము, సిద్ధిస్వరూపుడు, సర్వకారణుడు, సర్వమునకు ముందు ఉన్నవాడు, సంవత్స్వరూపుడు, కొనియాడదగిన మనస్సు గలవాడు, సత్యస్వరూపుడు, సర్వపాపములనుపోగొట్టే హరుడు (39), మంచి కీర్తి గలవాడు, శోభ గలవాడు, మాలను ధరించువాడు, వేదాంగస్వరూపుడు, వేదములను తెలిసినవాడు, ముని, ఉజ్జ్వలముగా ప్రకాశించువాడు, అన్నస్వరూపుడు, భోక్తృస్వరూపుడు, లోకములకు ప్రభువు, జయింప శక్యము కానివాడు (40), అమృతుడు, శాశ్వతుడు, శాంతుడు, బాణము చేతియందు గలవాడు, ప్రతాపము గలవాడు, కమండలమును పట్టుకున్నవాడు, ధనస్సు గలవాడు, వాక్కునకు మరియు మనస్సునకు గోచరము కానివాడు (41), ఇంద్రియములకు గోచరము కానివాడు, గొప్ప మాయ గలవాడు, సర్వమునందు నివసించువాడు, నాలుగు మార్గములు గలవాడు, కాలముతో సంబంధము గలవాడు, గొప్ప నాదము గలవాడు, గొప్ప ఉత్సాహము గలవాడు, గొప్ప బలము గలవాడు (42), గొప్ప బుద్ధి గలవాడు, గొప్ప పరాక్రమము గలవాడు, భూతములతో కలిసి సంచరించువాడు, త్రిపురములను వినాశము చేసినవాడు, రాత్రియందు సంచరించువాడు, ప్రేతములతో కలిసి తిరుగువాడు, గొప్ప శక్తి గలవాడు, గొప్ప కాంతి గలవాడు (43), ఇదమిత్థముగా నిర్దేశించ శక్యము కాని దేహము గలవాడు, శ్రీమంతుడు, అందరు అచార్యుల మనస్సులలో ధ్యానించబడువాడు, సర్వశాస్త్ర జ్ఞాన ప్రవర్తకుడు, నిత్యుడు, అనిత్యుడు (44).

తేజస్తేజోద్యుతిధరో జనకస్సర్వశాసకః | నృత్యప్రియో నృత్యనిత్యః ప్రకాశాత్మా ప్రకాశకః || 45

స్పష్టాక్షరో బుధో మంత్రస్సమానస్సారసంప్లవః | యుగాదికృద్యుగావర్తో గంభీరో వృషవాహనః || 46

ఇష్టో విశిష్ట శ్శిష్టేష్టస్సులభస్సారశోధనః | తీర్థరూపస్తీర్థనామా తీర్థదృశ్యస్తు తీర్థదః || 47

అపాం నిధిరధిష్ఠానం విజయో జయకాలవిత్‌ | ప్రతిష్ఠితః ప్రమాణజ్ఞో హిరణ్యకవచో హరిః || 48

విమోచనస్సురగణో విద్యేశో బిందుసంశ్రయః | వాతరూపో%మలోన్మాయీ వికర్తా గహనో గుహః || 49

కరణం కారణం కర్తా సర్వబంధవిమోచనః | వ్యవసాయో వ్యవస్థానః స్థానదో జగదాదిజః || 50

గురుదో లలితో%భేదో భావాత్మాత్మని సంస్థితః | వీరేశ్వరో వీరభద్రో వీరాసనవిధిర్గురుః || 51

వీరచూడామణిర్వేత్తా చిదానందో నదీధరః | ఆజ్ఞాధారస్త్రి శూలీ చ శిపివిష్టశ్శివాలయః || 52

తేజస్సులకు తేజస్సు, కాంతి గలవాడు, తండ్రి, సర్వులను శాసించువాడు, నృత్యమునందు ప్రీతి గలవాడు, నిత్యము నాట్యమును చేయువాడు, ప్రకాశస్వరూపుడు, ప్రకాశింప జేయువాడు (45), స్పష్టాక్షరస్వరూపుడు, పండితుడు, మంత్రస్వరూపుడు, సర్వసముడు, సారస్వరూపుడు, యుగాదిని చేయు వాడు, యుగచక్రమును త్రిప్పువాడు, గంభీరుడు, వృషభము వాహనముగా గలవాడు (46), ప్రీతి పాత్రుడు, గొప్పవాడు, శిష్టులయందు ప్రీతి గలవాడు, తేలికగా లభించువాడు, జీవుని సారస్వరూపమును శోధించువాడు, తీర్థస్వరూపుడు, తీర్థముల నామము గలవాడు, తీర్థములయందు దర్శింపబడువాడు, తీర్థములను ఇచ్చువాడు (47), జలనిధి, జగదధిష్ఠానము, విజయుడు, జయమును ఇచ్చే కాలము తెలిసిన వాడు, ప్రతిష్ఠించ బడినవాడు, ప్రమాణజ్ఞానము కలవాడు, తేజస్సు కవచముగా గలవాడు, విష్ణుస్వరూపుడు (48), ముక్తిని ఇచ్చువాడు, దేవతలచే సేవించబడువాడు, విద్యలకు ప్రభువు, బిందువు నందు ఉండువాడు, వాయుస్వరూపుడు, దోషవర్జితుడు, జగత్కర్త, తెలియ శక్యము కానివాడు, గుహస్వరూపుడు (49), కరణము, కారణము, కర్త బంధములన్నింటినుండి విడిపించువాడు, దృఢనిశ్చయస్వరూపుడు, సువ్యవస్థయే స్వరూపముగా గలవాడు, స్థానమునొసంగువాడు, జగత్తునకు ఆదిలో హిరణ్యగర్భరూపములో జన్మించినవాడు (50), గురువును అనుగ్రహించువాడు, లలితుడు, అభేదస్వరూపుడు, మనోవృత్తి స్వరూపుడు, హృదయగుహలో నుండువాడు, వీరులకు ప్రభువు, వీరభద్రరూపుడు, వీరాసనమునందు ఉపవిష్టుడై ఉండువాడు, గురువు (51), వీరులకు చూడామణివంటి వాడు, జ్ఞాత, చిదానందస్వరూపుడు, నదులను ధరించువాడు, అజ్ఞాచక్రమునందు ఉండువాడు, త్రిశూలము గలవాడు, కాంతిస్వరూపుడు, మంగళకరమగు నివాసము గలవాడు (52).

వాలఖిల్యో మహావీరస్తిగ్మాంశుర్బధిరః ఖగః | అభిరామస్సుశరణస్సుబ్రహ్మణ్యస్సుధాపతిః || 53

మఘవాన్‌ కౌశికో గోమాన్‌ విరామస్సర్వసాధనః | లలాటాక్షో విశ్వదేహస్సారస్సంసారచక్రభృత్‌ || 54

అమోఘదండీ మధ్యస్థో హిరణ్యో బ్రహ్మవర్చసః | పరమార్థః పరో మాయీ శంబరో వ్యాఘ్రలోచనః || 55

రుచిర్బ హురుచిర్వైద్యో వాచస్పతిరహస్పతిః | రవిర్విరోచనస్స్కందశ్శాస్తా వైవస్వతో యమః || 56

యుక్తిరున్నతకీర్తిశ్చ సానురాగః పురంజయః | కైలాసాధిపతిః కాంతస్సవితా రవిలోచనః || 57

విశ్వోత్తమో వీతభయో విశ్వభర్తా%నివారితః | నిత్యో నియతకల్యాణః పుణ్యశ్రవణకీర్తనః || 58

దూరశ్రవో విశ్వసహో ధ్యేయో దుస్స్వప్ననాశనః | ఉత్తారణో దుష్కృతిహా విజ్ఞేయో దుస్సహో%భవః || 59

అనాదిర్భూర్భువో లక్ష్మీః కిరీటీ త్రిదశాధిపః | విశ్వగోప్తా విశ్వకర్తా సువీరో రుచిరాంగదః || 60

జననో జనజన్మాదిః ప్రీతిమాన్నీతిమాన్‌ ధ్రువః | వశిష్ఠః కశ్యపో భానుర్భీమో భీమపరాక్రమః || 61

ప్రణవస్సత్పథాచారో మహాకోశో మహాధనః | జన్మాధిపో మహాదేవస్సకలాగమపారగః || 62

వాలఖిల్యమహర్షిస్వరూపుడు, మహావీరుడు, తీక్షమగు కిరణములు గలవాడు, చెవిటివాడు, పక్షి, ఆహ్లాదకరమైనవాడు, శరణు పొందదగినవాడు, సుబ్రహ్మణ్యుడు, అమృతమునకు అధీశ్వరుడు (53), ఇంద్రుడు, కౌశికుడు, సూర్యుడు, విశ్రాంతిస్థానము, సర్వమును సాధించువాడు, లలాటమునందు కన్ను గలవాడు, జగత్తు దేహముగా గలవాడు, సారస్వరూపుడు, సంసారచక్రమును ధరించువాడు (54), అమోఘమైన దండము గలవాడు, రాగద్వేషములు లేనివాడు, తేజస్స్వరూపుడు, బ్రహ్మవర్చసస్వరూపుడు, పరమార్థస్వరూపుడు, గొప్ప మాయావి, మేఘస్వరూపుడు, పెద్దపులి కన్నులు గలవాడు (55), సుందరుడు, అధికమగు ప్రకాశము గలవాడు, వైద్యుడు, బృహస్పతి, సూర్యుడు, ఆదిత్యుడు, విరోచనుడు, స్కందుడు, శాస్త, సూర్యపుత్రుడగు యముడు (56), యుక్తిస్వరూపుడు, గొప్ప కీర్తి గలవాడు, ప్రేమ గలవాడు, త్రిపురాసురసంహర్త, కైలాసాధిపతి, సుందరమైన వాడు, జగత్తునకు తండ్రి, సూర్యుడే కన్నుగా గలవాడు (57), సర్వోత్తముడు, భయము లేనివాడు, జగత్తును పోషించువాడు, నివారింప శక్యము కానివాడు, నిత్యుడు, నిశ్చితమైన మంగళము గలవాడు, శ్రవణకీర్తనములచే పుణ్యమునొసంగువాడు (58), దూరమునుండియే వినువాడు, సర్వమును సహించువాడు, ధ్యానించబడువాడు, చెడు కలలను పోగొట్టువాడు, తరింపజేయువాడు, పాపకృత్యములను నశింజేయువాడు, తెలియదగినవాడు, సహింప శక్యము కానివాడు, పుట్టుక లేనివాడు (59), కారణము లేనివాడు, భూస్వరూపుడు, భూమియందలి సంపదయే స్వరూపముగా గలవాడు, కిరీటము గలవాడు, దేవతలకు అధిపతి, జగత్తును రక్షించువాడు, జగత్తును సృష్టించువాడు, గొప్ప వీరుడు, సుందరమగు అవయవములనిచ్చువాడు (60), జన్మను ఇచ్చువాడు, జనుల జన్మకు కారణమైనవాడు, ప్రీతి గలవాడు, నీతి గలవాడు, నిత్యుడు, వశిష్ఠుడు, కశ్యపుడు, సూర్యుడు, భయంకరుడు, భయంకరమగు పరాక్రమము గలవాడు (61), ఓంకారస్వరూపుడు, సన్మార్గమునందు సంచరించువాడు, గొప్ప నిధి, గొప్ప ధనము గలవాడు, జన్మకు అధిపతి, మహాదేవుడు, సకలవేదముల సారస్వరూపుడు (62).

తత్త్వం తత్త్వవిదేకాత్మా విభుర్విష్ణువిభూషణః | ఋషిర్ర్బా హ్మణ ఐశ్వర్యజన్మమృత్యుజరాతిగః || 63

పంచయజ్ఞసముత్పత్తిర్విశ్వేశో విమలోదయః | ఆత్మయోనిరనాద్యంతో వత్సలో భక్తలోకధృక్‌ || 64

గాయత్రీవల్లభః ప్రాంశుర్విశ్వావాసః ప్రభాకరః | శిశుర్గిరిరతస్సమ్రాట్‌ సుషేణస్సురశత్రుహా || 65

అనేమిరిష్టనేమిశ్చ ముకుందో విగతజ్వరః | స్వయంజ్యోతిర్మహాజ్యోతిస్తనుజ్యోతిరచంచలః || 66

పింగలః కపిలశ్మశ్రుర్భాలనేత్రస్త్ర యీ తనుః | జ్ఞానస్కందో మహానీతిర్విశ్వోత్పత్తిరుపప్లవః || 67

భగో వివస్వానాదిత్యో గతపారో బృహస్పతిః | కల్యాణగుణనామా చ పాపహా పుణ్యదర్శనః || 68

ఉదారకీర్తిరుద్యోగీ సద్యోగీ సదసన్మయః | నక్షత్రమాలీ నాకేశస్స్వాధిష్ఠానష్షడాశ్రయః || 69

పవిత్రః పాపహారీ చ మణిపూరో నభోగతిః | హృత్పుండరీకమాసీనశ్శక్రశ్శాంతో వృషాకపిః || 70

ఉష్ణో గ్రహపతిః కృష్ణస్సమర్థో%నర్థనాశనః | అధర్మశత్రురజ్ఞేయః పురుహూతః పురుశ్రుతః || 71

బ్రహ్మగర్భో బృహద్గర్భో ధర్మధేనుర్ధనాగమః | జగద్ధితైషీ సుగతః కుమారః కుశలాగమః || 72

హిరణ్యవర్ణో జ్యోతిష్మాన్నానాభూతరతో ధ్వనిః | ఆరోగ్యో నమనాధ్యక్షో విశ్వామిత్రో ధనేశ్వరః || 73

పరమార్ధస్వరూపుడు, ఆత్మతత్త్వము తెలిసినవాడు, అద్వితీయ ఆత్మ, సర్వవ్యాపి, విష్ణువునకు అలంకారము, మహర్షి, బ్రాహ్మణుడు, ఐశ్వర్యము పుట్టుక మరణము మరియు వృద్ధాప్యము అను వాటికి అతీతుడు (63), పంచయజ్ఞములను సృష్టించినవాడు, విశ్వేశ్వరుడు, స్వచ్ఛమగు ఉదయము గలవాడు, ఆత్మయందు నివాసము ఉండువాడు, ఆద్యంతములు లేనివాడు, ప్రేమస్వరూపుడు, భక్తజనులను ధరించువాడు (64), గాయత్రియందు ప్రీతి గలవాడు, పొడుగైనవాడు, జగత్తు నివాసముగా గలవాడు, సూర్యుడు, బాలకుడు, పర్వతమునందు ప్రీతి గలవాడు, చక్రవర్తి, గొప్ప సైన్యము గలవాడు, దేవశత్రువులను సంహరించువాడు (65), పరిచ్ఛేదములు లేనివాడు, భక్తులకు మోక్షమునిచ్చువాడు, ముకుందుడు, దుఃఖము లేనివాడు, స్వయంప్రకాశస్వరూపుడు, గొప్ప తేజశ్శాలి, సూక్ష్మజ్యోతిస్స్వరూపుడు, చలనము లేనివాడు (66), పింగలవర్ణము గలవాడు, కపిలవర్ణముగల గెడ్డము గలవాడు (దుర్వాసుడు), లలాటము నందు కన్ను గలవాడు, వేదమే శరీరముగా గలవాడు, జ్ఞానమునిచ్చువాడు, గొప్ప నీతి గలవాడు, జగత్కారణుడు, జగత్సంహారకుడు (67), సంపద, సూర్యుడు, ఆదిత్యుడు, సంసారమునకు ఆవల ఉండువాడు, బృహస్పతి, మంగళకరములగు గుణములు మరియు నామములు గలవాడు, పాపములను పోగొట్టువాడు, దర్శనముచే పుణ్యమును ఇచ్చువాడు (68), మహోత్తమమగు కీర్తి గలవాడు, గొప్ప యోగము గలవాడు, పవిత్రమగు యోగము గలవాడు, కార్యకారణ స్వరూపుడు, నక్షత్రమండలస్వరూపుడు, స్వర్గాధిపతి, స్వాధిష్ఠానచక్రమునందు ఉండువాడు, షట్చక్రములయందు ఉండువాడు (69), వజ్రమువలె భయంకరమగు సంసారమునుండి రక్షించువాడు, పాపములను హరించువాడు, మణిపూరచక్రమునందు ఉండువాడు, ఆకాశమార్గమునందు సంచరించు వాడు, హృదయపద్మమునందు నివసించువాడు, ఇంద్రుడు, శాంతుడు, ధర్మస్వరూపుడు (70), ఉష్ణస్వరూపుడు, గ్రహములకు అధిపతి, శ్రీకృష్ణుడు, సమర్థుడు, అనర్థములను పోగొట్టువాడు, అధర్మమునకు శత్రువు, తెలియ శక్యము కానివాడు, యజ్ఞమునందు పదే పదే ఆహ్వానించబడువాడు, గొప్ప కీర్తి గలవాడు (71), బ్రహ్మ గర్భమునందు గలవాడు, పెద్ద గర్భము గలవాడు, ధర్మదేవత, ధనమును ఇచ్చువాడు, జగత్తునకు హితమును కోరువాడు, బుద్ధుడు, కుమారుడు, క్షేమమునకు నిధి (72), బంగరు రంగు వాడు,తేజస్స్వరూపుడు, సర్వప్రాణులయందు ప్రీతి గలవాడు, శబ్దస్వరూపుడు, ఆరోగ్య స్వరూపుడు, సంధ్యావందనాదులకు అధిష్ఠానదేవత, విశ్వామిత్రుడు, కుబేరుడు (73).

బ్రహ్మజ్యోతిర్వసుధామా మహాజ్యోతిరనుత్తమః | మాతామహో మాతరిశ్వా నభస్వాన్నాగహారధృక్‌ || 74

పులస్త్యః పులహో%గస్త్యో జాతూకర్ణ్యః పరాశరః | నిరావరణనిర్వారో వైరంచ్యో విష్టరశ్రవాః || 75

ఆత్మభూరనిరుద్ధో%త్రిర్‌ జ్ఞానమూర్తిర్మహాయశాః | లోకవీరాగ్రణీర్వీరశ్చండస్సత్యపరాక్రమః || 76

వ్యాలకల్పో మహాకల్పః కల్పవృక్షః కలాధరః | ఆలంకరిష్ణురచలో రోచిష్ణుర్విక్రమోన్నతః || 77

ఆయశ్శబ్దపతిర్వాగ్మీప్లవనశ్శిఖిసారథిః | అసంసృష్టో%తిథిశ్శత్రు ప్రమాథీ పాదపాసనః || 78

వసుశ్రవా కవ్యవాహః ప్రతప్తో విశ్వభోజనః | జప్యో జరాదిశమనో లోహితశ్చ తనూనపాత్‌ || 79

వృషదశ్వో నభో యోనిస్సుప్రతీకస్తమిస్రహా | నిదాఘస్తవనో మేఘభక్షః పరపురంజయః || 80

సుఖానిలస్సునిష్పన్నస్సురభిశ్శిశిరాత్మకః | వసంతో మాధవో గ్రీష్మో నభస్యో బీజవాహనః || 81

అంగిరా గురురాత్రేయో విమలో విశ్వపావనః | పావనః పురజిచ్ఛక్రసై#్త్రవిద్యో వరవాహనః || 82

పరబ్రహ్మ, జ్యోతిస్స్వరూపుడు, సుందరమగు ధామము గలవాడు, గొప్ప తేజస్సు గలవాడు, నిరతిశయుడు, తల్లికి తండ్రి, ఆకాశమునందు సంచరించే వాయుదేవత, పాములనే హారములుగా ధరించువాడు (74), పులస్త్యుడు, పులహుడు, అగస్త్యుడు, జాతూకర్ణ్యుడు, పరాశరుడు, ఆవరణము మరియు ఆటంకము లేనివాడు, బ్రహ్మపుత్రుడు, విస్తృతమగు కీర్తి గలవాడు (75), స్వయంభువుడు, అనిరుద్ధుడు, అత్రి, జ్ఞానస్వరూపుడు, గొప్ప కీర్తి గలవాడు, లోకములోని వీరులలో అగ్రేసరుడు, వీరుడు, భయంకరుడు, యథార్థమైన పరాక్రమము గలవాడు (76), మహాసర్పమును పోలియున్నవాడు, మహాకల్పస్వరూపుడు, కల్పవృక్షము, చంద్రుడు, అలంకరించుకునే స్వభావము కలవాడు, చలనము లేని వాడు, సుందరుడు, విక్రమముచే ఉన్నతమైనవాడు (77), కాలస్వరూపుడు, శబ్దములకు ప్రభువు, వక్త, ఎగురువాడు, అగ్ని సారథిగా గలవాడు, అసంగుడు, అతిథి, శత్రుసంహారకుడు, వృక్షమే ఆసనముగా గలవాడు (78), సుందరమగు కర్ణములు గలవాడు, పితృదేవతలకు ఈయబడే కవ్యమును వారికి సమర్పించువాడు, అత్యుష్ణస్వరూపుడు, జగత్తును భక్షించువాడు, జపించ దగినవాడు, వృద్ధాప్యము మొదలగు వాటిని పోగొట్టువాడు, ఎర్రనివాడు, అగ్నిహోత్రుడు (79), వాయువు, ఆకాశమునకు కారణము, మంచి ప్రతీకలు గలవాడు, తమస్సును పోగొట్టువాడు, గ్రీష్మఋతువు, సూర్యుడు, మేఘములను భక్షించువాడు, శత్రునగరములను జయించువాడు (80), సుఖకరుడగు వాయువు, సుందరమైన జన్మ గలవాడు, సుగంధము, శిశిరస్వరూపుడు, వసంతుడు, మాధవుడు, గ్రీష్మము, భాద్రపదము, బీజములను ప్రవర్తిల్ల జేయువాడు (81), అంగిరస్సు, గురువు, ఆత్రేయుడు, శుద్ధుడు, జగత్తును పావనము చేయువాడు, పవిత్రుడు, త్రిపురములను జయించినవాడు, ఇంద్రుడు, వేదస్వరూపుడు, శ్రేష్ఠమగు వృషభవాహనము గలవాడు (82).

మనో బుద్ధిరహంకారః క్షేత్రజ్ఞః క్షేత్రపాలకః | జమదగ్నిర్బలనిధిర్విగాలో విశ్వగాలవః || 83

అఘోరో%నుత్తరో యజ్ఞః శ్రేయో నిః శ్రేయసప్రదః | శైలో గగనకుందాభో దానవారిరరిందమః || 84

చాముండో జనకశ్చారుర్నిశ్శల్యో లోకల్యధృక్‌ | చతుర్వేదశ్చతుర్భావశ్చతురశ్చతురప్రియః || 85

ఆమ్నాయో%థ సమామ్నాయస్తీర్థదేవశివాలయః | బహురూపో మహారూపస్సర్వరూపశ్చరాచరః || 86

న్యాయనిర్ణాయకో నేయో న్యాయగమ్యో నిరంజనః | సహస్రముర్ధా దేవేంద్రస్సర్వశస్త్ర ప్రభంజనః || 87

ముండీ విరూపో వికృతో దండీ నాదీ గుణోత్తమః | పింగలాక్షో హి బహ్వక్షో నీలగ్రీవో నిరామయః || 88

సహస్రబాహుస్సర్వేశశ్శరణ్యస్సర్వలోకధృక్‌ | పద్మాసనః పరం జ్యోతిః పారంపర్యఫలప్రదః || 89

పద్మగర్భో మహాగర్భో విశ్వగర్భో విచక్షణః | పరావరజ్ఞో వరదో వరేణ్యశ్చ మహాస్వనః || 90

దేవాసురగురుర్దేవో దేవాసురనమస్కృతః | దేవాసురమహామిత్రో దేవాసురమహేశ్వరః || 91

దేవాసురేశ్వరో దివ్యో దేవాసురమహాశ్రయః | దేవదేవో%నయో%చింత్యో దేవతాత్మాత్మసంభవః || 92

సద్యో మహాసురవ్యాధో దేవసింహో దివాకరః | విబుధాగ్రచరః శ్రేష్ఠస్సర్వదేవోత్తమోత్తమః || 93

శివజ్ఞానరతః శ్రీమాన్‌ శీఖీ శ్రీపర్వతప్రియః | వజ్రహస్తస్సిద్ధఖడ్గో నరసింహనిపాతనః || 94

మనస్సు, బుద్ధి, అహంకారము, క్షేత్రమును తెలియువాడు, క్షేత్రమును పాలించువాడు, జమదగ్ని, బలమునకు నిధానము, జటలనుండి గంగను ప్రవహింపజేయువాడు, విశ్వమునకు ఆశ్రయము (83), శాంతస్వరూపుడు, నిరతిశయుడు, యజ్ఞస్వరూపుడు, మోక్షస్వరూపుడు, మోక్షమును ఇచ్చువాడు, పర్వతస్వరూపుడు, చంద్రునివలె ప్రకాశించువాడు, రాక్షసశత్రువు, శత్రువుల సంహరించువాడు (84), చాముండీ స్వరూపుడు, తండ్రి, సుందరుడు, హృదయవేదన లేనివాడు, జనులకు హృదయవేదనను కలిగించువాడు, నాల్గు వేదముల స్వరూపుడు, నాల్గు భావములు గలవాడు, నిపుణుడు, నిపుణలయందు ప్రీతి గలవాడు (85), వేదము వేదపఠనము, తీర్థములు, వాటియందలి దేవతలు, శివాలయము, అనేకరూపములు గలవాడు, పెద్ద రూపము గలవాడు, సర్వస్వరూపుడు, కదిలే మరియు కదలని ప్రాణులే స్వరూపముగా గలవాడు (86), న్యాయనిర్ణేత, భక్తులకు వశ##మై ఉండువాడు, ధర్మముచే పొందదగినవాడు, కర్మలేపము లేనివాడు, అనంతశిరస్సులు గలవాడు, దేవేంద్రుడు, ఆయుధములనన్నిటినీ భగ్నము చేయువాడు (87), ముండితశిరస్కుడు, భయంకరరూపుడు, వికృతరూపుడు దండధారి, నాదమును చేయువాడు, గుణములచే ఉత్తముడు, పింగలవర్ణముగల నేత్రములతో ప్రకాశించువాడు, అనేకనేత్రములు గలవాడు, నల్లని కంఠము గలవాడు, దోషములు లేనివాడు (88), అనంతబాహువులు గలవాడు, సర్వేశ్వరుడు, శరణు పొందదగినవాడు, లోకములనన్నిటినీ, ధరించువాడు, పద్మాసనమునందుండు వాడు, పరమప్రకాశస్వరూపుడు, పరంపరాప్రాప్తమగు ఫలములనిచ్చువాడు (89), పద్మమునందుండు వాడు, విశాలమైన గర్భము గలవాడు, గర్భమునందు విశ్వమును ధరించువాడు, జ్ఞాని, మిథ్యాసత్యములనెరింగినవాడు, వరములనిచ్చువాడు, సర్వశ్రేష్ఠుడు, పెద్ద ధ్వని గలవాడు (90), దేవతలకు మరియు రాక్షసులకు తండ్రి, ప్రకాశస్వరూపుడు, దేవతలకు మరియు రాక్షసులకు గొప్ప మిత్రుడు, వారిచే నమస్కరింపబడువాడు, వారిపై అధీశ్వరుడు (91), వారికి అందరికి గొప్ప ఆశ్రయము, దేవదేవుడు, కుటిలనీతి లేనివాడు, మనస్సునకు అందనివాడు, దేవతలకు ఆత్మస్వరూపుడు, స్వయంభువుడు (92), సద్యో జాతుడు, గొప్ప రాక్షసులను సంహరించు కిరాతుడు, దేవతలలో శ్రేష్ఠుడు, సూర్యుడు, దేవతలలో అగ్రేసరుడు, శ్రేష్ఠుడు, దేవతలందరిలో ఉత్తమోత్తముడు (93), శివజ్ఞానమునందు ప్రీతి గలవాడు, శోభాయుక్తుడు, అగ్ని, శ్రీశైలమునందు ప్రీతి గలవాడు, వజ్రము చేతియందు గలవాడు, పరాజయమునెరుంగని ఖడ్గమును ధరించువాడు, నరసింహుని పడగొట్టినవాడు (94).

బ్రహ్మ చారీ లోకచారీ ధర్మచారీ ధనాధిపః | నందీ నందీశ్వరో%నంతో నగ్నవ్రతధరశ్శుచిః || 95

లింగాధ్యక్షస్సురాధ్యక్షో యుగాధ్యక్షో యుగాపహః | స్వధామా స్వగతః స్వర్గీ స్వరస్స్వరమయస్స్వనః || 96

బాణాధ్యక్షో బీజకర్తా కర్మకృద్ధర్మసంభవః | దంభో లోభో%థ వై శంభు స్సర్వభూతమహేశ్వరః || 97

శ్మశాన నిలయ స్త్ర్యక్షస్సేతురప్రతిమాకృతిః | లోకోత్తరస్ఫుటో లోకస్త్ర్యంబకో నాగభూషణః || 98

అంధకారిర్మఖద్వేషీ విష్ణుకంధరపాతనః | హీనదోషో%క్షయగుణో దక్షారిః పూషదంతభిత్‌ || 99

పూర్ణః పూరయితా పుణ్యః సుకుమారస్సులోచనః | సన్మార్గప్రియో ధూర్తః పుణ్యకీర్తిరనామయః || 100

మనోజవస్తీర్థకరో జటిలో నియమేశ్వరః | జీవితాంతకరో నిత్యో వసురేతా వసుప్రదః || 101

సద్గతిస్సిద్ధిదస్సిద్ధిస్సజ్జాతిః ఖలకంటకః | కలాధరో మహాకాలభూతస్సత్యపరాయణః || 102

లోకలావణ్యకర్తా చ లోకోత్తరసుఖాలయః | చంద్రసంజీవవనశ్శాస్తా లోకగ్రాహో మహాధిపః || 103

బ్రహ్మచారి, లోకసంచారి, ధర్మపాలకుడు, కుబేరుడు, వృషభస్వరూపుడు, నందీశ్వరుడు, అనంతుడు, దిగంబరవ్రతమును పాలించువాడు, అగ్ని (95), లింగములకు అధిష్ఠానదేవత, దేవతలకు అధిపతి, యుగములకు అధిపతి, యుగములను ఉపసంహరిచువాడు, స్వయంప్రకాశస్వరూపుడు, ఆత్మారాముడు, స్వర్గలోకనివాసి, స్వరస్వరూపుడు, అక్షరమాతృకాస్వరూపుడు (96), బాణములకు అధిపతి, బీజశక్తిని సృష్టించువాడు, యజ్ఞాది కర్మలను చేయువాడు, ధర్మమునుండి ఉదయించువాడు, దంభస్వరూపుడు, లోభస్వరూపుడు, మంగళస్వరూపుడు, సర్వప్రాణులకు అధీశ్వరుడు (97), శ్మశానమునందు ఉండువాడు, ముక్కంటి, ధర్మవిధారకుడు, సాటిలేని ఆకారము గలవాడు, లోకములకు అతీతుడై వెలుగొందువాడు, జగత్స్వరూపుడు, ముక్కంటి, పాములు ఆభరణములుగా గలవాడు (98), అంధకుని శాసించిన వాడు, దక్షయజ్ఞవినాశకుడు, యజ్ఞ రూపుడు, విష్ణువుయొక్క మెడను నరికినవాడు, దోషరహితుడు, అనంతగుణసంపన్నుడు, దక్షశత్రువు, పూషయొక్క దంతములను ఊడబెరకినవాడు (99), పూర్ణుడు, పూరించువాడు, పవిత్రుడు, ధూర్తుడు, పవిత్రమగు కీర్తి గలవాడు, రోగరహితుడు (100), మనస్సుతో సమమైన వేగము గలవాడు, తీర్థములను నిర్మించువాడు, జటాజూటధారి, నియమములకు అధిపతి, జీవితములను అంతము చేయువాడు, నిత్యుడు, సంపదకు బీజమైనవాడు, సంపదలనిచ్చువాడు (101), సద్గతి, సిద్ధిని ఇచ్చువాడు, సిద్ధి, పవిత్రమగు జన్మ గలవాడు, దుష్టులను హింసించువాడు, చంద్రకళను ధరించువాడు, మహాకాలస్వరూపుడు, సత్యమునందు నిష్ఠ గలవాడు (102), లోకములలోని సౌందర్యమును నిర్మించువాడు, అతీంద్రియసుఖమునకు నిధానమైనవాడు, చంద్రునకు జీవితమును అనుగ్రహించినవాడు, శాస్త్ర, లోకములను ఉపసంహరించువాడు, సర్వేశ్వరేశ్వరుడు (103).

లోకబంధుర్లోకనాథః కృతజ్ఞః కృత్తిభూషితః | అనపాయో%క్షరః కాంతస్సర్వశస్త్ర భృతాం వరః || 104

తేజోమయో ద్యుతిధరో లోకమానీ ఘృణార్ణవః | శుచిస్మితః ప్రసన్నాత్మా హ్యజేయో దురతిక్రమః || 105

జ్యోతిర్మయో జగన్నాథో నిరాకారో జలేశ్వరః | తుంబవీణో మహాకాయో విశోకశ్శోకనాశనః || 106

త్రిలోకపస్త్రి లోకేశస్సర్వశుద్ధిరధోక్షజః | అవ్యక్తలక్షణో దేవో వ్యక్తో%వ్యక్తో విశాం పతిః || 107

పరశ్శివో వసుర్నాసాసారో మానధరో యమః | బ్రహ్మా విష్ణుః ప్రజాపాలో హంసో హంసగతిర్వయః || 108

వేధా విధాతా ధాతా చ స్రష్టా హర్తా చతుర్ముఖః | కైలాసశిఖరావాసీ సర్వావాసీ సదాగతిః || 109

హిరణ్యగర్భో ద్రుహిణో భూతపాలో%థ భూపతిః | సద్యోగీ యోగవిద్యోగీ వరదో బ్రాహ్మణప్రియః || 110

దేవప్రియో దేవనాథో దేవకో దేవచింతకః | విషమాక్షో విరూపాక్షో వృషదో వృషవర్ధనః || 111

నిర్మమో నిరహంకారో నిర్మోహో నిరుపద్రవః | దర్పహా దర్పదో దృప్తస్సర్వార్థపరివర్తకః || 112

సహస్రార్చిర్భూతిభూషస్స్నిగ్ధాకృతిరదక్షిణః | భూతభవ్యభవన్నాథో విభవో భూతినాశనః || 113

అర్థో%నర్థో మహాకోశః పరకార్యైకపండితః | నిష్కంటకః కృతానందో నిర్వ్యాజో వ్యాజమర్దనః || 114

సత్త్వవాన్‌ సాత్త్వికస్సత్యః కృతస్నేహః కృతాగమః | అకంపితో గుణగ్రాహీ నైకాత్మా నైకకర్మ కృత్‌ || 115

లోకులకు బంధువు, లోకములకు ప్రభువు, కృతజ్ఞుడు, గజచర్మమును అలంకరించుకున్న వాడు, దుఃఖరహితుడు, వినాశము లేనివాడు, సుందరుడు, శస్త్రధారులందరిలో శ్రేష్ఠుడు (104), తేజస్స్వరూపుడు, కాంతిని ధరించువాడు, లోకములకు పూజనీయుడు, దయాసముద్రుడు, స్వచ్ఛమైన చిరునగవు గల వాడు (105), ప్రకాశస్వరూపుడు, జగన్నాథుడు, ఆకారహీనుడు, జలాధిపతి, ఆనపబుర్రతో చేసిన వీణ గలవాడు, పెద్ద శరీరము గలవాడు, శోకము లేనివాడు, శోకమును నశింపజేయువాడు (106), ముల్లోకములను రక్షించువాడు, ముల్లోకములకు ప్రభువు, సర్వమును శుద్ధము చేయువాడు, గలవాడు, విరాట్‌ స్వరూపుడు, తెలియబడని లక్షణములు గలవాడు, ప్రకాశస్వరూపుడు, ఇంద్రియగోచరుడు, ఇంద్రియ గోచరము మానవులకు అధిపతి (107), పరంబ్రహ్మ, మంగళకరుడు, సంపత్స్వరూపుడు, నాసికకు సారమైన శ్వాసస్వరూపుడు, మానమును కాపాడువాడు, యముడు, బ్రహ్మ, విష్ణువు, ప్రజలను పాలించువాడు, హంస, హంసయొక్క గమనమువంటి గమనము గలవాడు, పక్షి (108), జ్ఞాని, కర్మఫలదాత, పోషించువాడు, సంహారకుడు, నాల్గు ముఖములు గలవాడు, కైలాసశిఖరమునందు నివసించువాడు, సర్వమునందు నివసించువాడు, సర్వదా చలనము గలవాడు (109), హిరణ్యగర్భుడు, బ్రహ్మ, భూతనాయకుడు, రాజు, గొప్ప యోగి, యోగవేత్త, యోగి, వరములనిచ్చువాడు, బ్రాహ్మణుల యందు ప్రీతి గలవాడు (110), దేవతలకు ప్రియమైనవాడు, దేవతలకు ప్రభువు, ప్రకాశించువాడు, దేవతల హితమును గోరువాడు, బేసి కన్నులవాడు, వికృతరూపముగల కన్నులు గలవాడు, ధర్మమును ఇచ్చువాడు, ధర్మమును వర్ధిల్ల జేయువాడు (111). మమకారము లేనివాడు, అహంకారము లేనివాడు, మోహము లేనివాడు, ఉపద్రవములు లేనివాడు, దర్పమును పోగొట్టువాడు, దర్పమును కలిగించు వాడు, గర్వించినవాడు, సర్వపదార్థములలోని మార్పులకు కారణమైనవాడు (112), వేయి కన్నులు గలవాడు, భస్మయే అలంకారముగా గలవాడు, సుందరమైన ఆకారము గలవాడు, సరళమగు మనస్సు గలవాడు, భూతవర్తమానభవిష్యత్కాలములకు ప్రభువు, సంపత్స్వరూపుడు, సంపదను నాశనము చేయువాడు (113), ధనము, కష్టము, గొప్ప నిధి, పరోపకారపారీణుడు, ఆటంకములు లేనివాడు, ఆనందమును కలిగించువాడు, మోసము లేనివాడు, మోసమును దండించువాడు (114), సత్త్వగుణమూర్తి, సత్పురుషుడు, సత్యస్వరూపుడు, ప్రేమను చూపువాడు, వేదకర్త, చలనము లేనివాడు, గుణమును గ్రహించువాడు, సర్వాత్మ, సర్వకర్మలను చేయువాడు (115).

సుప్రీతస్సుఖదస్సూక్ష్మస్సుకరో దక్షిణానిలః | నందిస్కందో ధరో ధుర్యః ప్రకటప్రీతివర్ధనః || 116

అపరాజితస్సర్వసహో గోవిందస్సత్త్వవాహనః | ఆధృతస్స్వధృతస్సిద్ధః పూతమూర్తిర్య శోధనః || 117

వారాహశృంగధృక్‌ శృంగీ బలవానేకనాయకః | శ్రుతిప్రకాశశ్శ్రు తిమానేకబంధురనేకధృక్‌ || 118

శ్రీవత్సలశ్శివారంభశ్శాంతభద్రస్సమో యశః | భూయశో భూషణో భూతిర్భూతికృద్భూతభావనః || 119

అకంపో భక్తికాయస్తు కాలహానిః కలావిభుః | సత్యవ్రతీ మహాత్యాగీ నిత్యశాంతిపరాయణః || 120

పరార్థవృత్తిర్వరదో విరక్తస్తు విశారదః | శుభదశ్శుభకర్తా చ శుభనామా శుభస్స్వయమ్‌ || 121

అనర్థితో గుణగ్రాహీ హ్యకర్తా కనకప్రభుః | స్వభావభద్రో మధ్యస్థశ్శత్రుఘ్నో విఘ్ననాశనః || 122

శిఖండీ కవచీ శూలీ జటి ముండీ చ కుండలీ | అమృత్యుస్సర్వదృక్‌ సింహస్తేజోరాశిర్మహామణిః || 123

అసంఖ్యేయో%ప్రమేయాత్మా వీర్యవాన్‌ వీర్యకోవిదః | వేద్యశ్చ వై వియోగాత్మా పరావరమునీశ్వరః || 124

మిక్కిలి ప్రీతి గలవాడు, సుఖమునిచ్చువాడు, సూక్ష్మమైనవాడు, తేలికగా లభించువాడు, దక్షిణవాయు స్వరూపుడు, ఆనందముతో గూడిన స్కందుడు గలవాడు, ధారకుడు, సర్వశ్రేష్ఠుడు, ప్రీతిని ప్రకటించి వర్ధిల్ల జేయువాడు (116), పరాజయమునెరుంగనివాడు, సర్వమును సహించువాడు, గోవిందుడు, సత్త్వగుణమును కలిగించువాడు, ఆధారము లేనివాడు, స్వయముగా తనకు తాను ఆధారమైనవాడు, సిద్ధుడు, పవిత్రమగు మూర్తి గలవాడు, కీర్తియే ధనముగా గలవాడు (117), వరాహముయొక్క కొమ్మును ధరించువాడు, కొమ్ము గలవాడు, బలవంతుడు, ఏకైకనాయకుడు, వేదములచే తెలియబడువాడు, వేదవేత్త, ఏకైకబంధువు, సర్వమునకు ఏకైకపాలకుడు (118), లక్ష్మియందు వాత్సల్యము గలవాడు, మంగళకరమగు ఆరంభము గలవాడు, శాంతుడు మరియు మంగళస్వరూపుడు, సముడు, కీర్తి, భూమండలమునందు కీర్తింపబడువాడు, అ లంకారము, సంపద, సంపదనిచ్చువాడు, ప్రాణులను సృష్టించువాడు (119), చలనము లేనివాడు, భక్తియే దేహముగా గలవాడు, కాలమును కబళించువాడు, కళలకు ప్రభువు, సత్యవ్రతము గలవాడు, గొప్ప త్యాగి, నిత్యము శాంతి మాత్రమే ఏకైకలక్ష్యముగా గలవాడు (120), పరోపకారముకొరకై శ్రమించువాడు, వరములనిచ్చువాడు, విరాగి, నిపుణుడు, శుభములనిచ్చువాడు, శుభములను చేయువాడు, శుభకరమగు నామము గలవాడు, స్వయముగా శుభస్వరూపుడు (121), ఇతరములచే వృద్ధిని పొందనివాడు, గుణమును గ్రహించువాడు, కర్తృత్వము లేనివాడు, బంగరు కాంతి గలవాడు, స్వభావముచేతనే మంగళుడు, మధ్యస్థుడు, శత్రువులను సంహరించువాడు, విఘ్నములను నాశనము చేయువాడు (122), శిఖ గలవాడు, కవచము గలవాడు, శూలము గలవాడు, జటలు గలవాడు, ముండితశిరస్కుడు, కుండలము గలవాడు, మృత్యురహితుడు, సర్వసాక్షి, సింహము, తేజోనిది, గొప్ప మణి (123), పరిగణించ శక్యము కాని వాడు, ఇంద్రియగోచరము కాని తత్త్వము గలవాడు, పరాక్రమశాలి, పరాక్రమపండితుడు, తెలియదగినవాడు, అసంగమగు ఆత్మస్వరూపుడు, పరాపరబ్రహ్మల నెరింగిన మహర్షుల రూపములో న్నువాడు (124).

అనుత్తమో దురాధర్షో మధురః ప్రియదర్శనః | సురేశస్స్మరణస్సర్వశ్శబ్దః ప్రతపతాం పరః || 125

కాలపక్షః కాలకాలః సుకృతీ కృతవాసుకిః | మహేష్వాసో మహీభర్తా నిష్కలంకో విశృంఖలః || 126

ద్యుమణిస్తరణిర్ధన్యస్సిద్ధిదస్సిద్ధిసాధనః | విశ్వతస్సంప్రవృత్తస్తు ప్యూఢోరస్కో మహాభుజః || 127

సర్వయోనిర్నిరాతంకో నరనారాయణప్రియః | నిర్లేపో యతిసంగాత్మా నిర్వ్యంగో వ్యంగనాశనః || 128

స్తవ్యః స్తవప్రియః స్తోతా వ్యాసమూర్తిర్నిరాకులః | నిరవద్యమయోపాయో విద్యారాశిశ్చ సత్కృతః || 129

ప్రశాంతబుద్ధిరక్షుణ్ణస్సంగ్రహో నిత్యసుందరః | వైయాఘ్రధుర్యో ధాత్రీశస్సంకల్పశ్శర్వరీపతిః || 130

పరమార్థగురుర్దత్తస్సూరిరాశ్రితవత్సలః | సోమో రసజ్ఞో రసదస్సర్వసత్త్వావలంబనః || 131

ఏవం నామ్నాం సహస్రేణ తుష్టావ హి హరం హరిః | ప్రార్థయామాస శంభుంవై పూజయామాస పంకజైః || 132

తతస్స కౌతుకీ శంభుశ్చకార చరితం ద్విజాః | మహాద్భుతం సుఖకరం తదేవ శృణుతాదరాత్‌ || 133

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం శివసహస్రనామ వర్ణనం నామ పంచత్రింశో%ధ్యాయః (35).

సర్వోత్తముడు, జయించ శక్యము కానివాడు, మధురమైనవాడు, ప్రియమును కలిగించే దర్శనము గలవాడు, దేవదేవుడు, స్మృతిరూపుడు, సర్వము తానే ఐనవాడు, శబ్దస్వరూపుడు, తపించువారిలో శ్రేష్ఠుడు (125), కాలమే రెక్కలుగా గలవాడు, కాలునకు కాలుడు, శుభకర్మలు గలవాడు, వాసుకి ఆభరణముగా గలవాడు, గొప్ప ధనస్సు గలవాడు, భూమండలమునకు ప్రభువు, దోషరహితుడు, బంధనములు లేనివాడు (126), ఆకాశములో మణివలె ప్రకాశిస్తూ భక్తులను సంసారసముద్రమునుండి తరింపజేసే నౌకవంటి సూర్యుడు, ధన్యుడు, సిద్ధిని ఇచ్చువాడు, సిద్ధికి సాధనమైన వాడు, అన్నివైపులయందు కర్మయందు నిమగ్నుడై యున్నవాడు, విశాలమైన వక్షఃస్థలము గలవాడు, పొడుగైన భుజములు గలవాడు (127), సర్వకారణుడు, భయము లేనివాడు, నరనారాయణులయందు ప్రీతి గలవాడు, ఆసక్తి లేని వాడు, యతుల సంగమునందు లభించువాడు,అంగవైకల్యము లేనివాడు, అంగవైకల్యమును పోగొట్టువాడు (128), స్తుతించదగినవాడు, స్తోత్రప్రియుడు, స్తుతించువాడు, వ్యాసునిగా అవతరించినవాడు, ఆదుర్దా లేనివాడు, దోషరహితమైన సాధనములు గలవాడు, విద్యానిధి, సత్కరించబడువాడు (129, ప్రసన్నమైన బుద్ధి గలవాడు, తెలియ శక్యము కానివాడు, సర్వసంహారకుడు, నిత్యసుందరుడు, మృగములలో వ్యాఘ్రమువలె దేవతలలో అగ్రేసరుడు, భూలోకాధిపతి, సంకల్పస్వరూపుడు, రాత్రికి అధిపతి (130), యథార్థమైన గురువు, దత్తాత్రేయుడు, విద్వాంసుడు, ఆశ్రితులయందు ప్రేమ గలవాడు, ఉమాసమేతుడు, రసజ్ఞానము గలవాడు, రసమునిచ్చువాడు, సర్వప్రాణులకు ఆలంబనమైనవాడు (131). ఈ విధమైన వేయి నామములతో విష్ణువు పాపహరుడగు శివుని స్తుతించి ప్రార్థించి పద్మములతో పూజించెను (132). ఓ బ్రాహ్మణులారా! తరువాత ఉత్సాహవంతుడగు ఆ శంభుడు ఆనందదాయకము మరియు అత్యద్భుతము అగు చరితమును చేసినాడు. మీరు దానిని శ్రద్ధతో వినుడు (133).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్రసంహితయందు శివసహస్రనామ వర్ణనమనే ముప్పది అయిదవ అధ్యాయము ముగిసినది (35).

Siva Maha Puranam-3    Chapters