Siva Maha Puranam-3    Chapters   

అథ త్రింశో%ధ్యాయః

నాగేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్యము

సూత ఉవాచ|

కదాచిత్సేవకస్తస్య రాక్షసస్య దురాత్మనః | తదగ్రే సుందరం రూపం శంకరస్య దదర్శ హ || 1

తసై#్మ నివేదితం రాజ్ఞే రాక్షసానాం యథార్థకమ్‌ | సర్వం తచ్చరితం తేన సకౌతుకమథాద్భుతమ్‌ || 2

రాజాపి తత్ర చాగత్య రాక్షసానాం స దారుకః | విహ్వలస్సబలశ్శీఘ్రం పర్యపృచ్ఛచ్చ తం శివమ్‌ || 3

సూతుడు ఇట్లు పలికెను-

ఒకనాడు దుష్టుడగు ఆ దారుకాసురుని సేవకుడు ఆ సుప్రియుని ఎదుట శంకరుని సుందరరూపమును చూచెను (1). వాడు ఆ రాక్షసరాజునకు కుతూహలముతో ఆ అద్భుతవృత్తాంతమునంతనూ ఉన్నది ఉన్నట్లుగా విన్నవించెను (2). రాక్షసరాజు, బలశాలి అగు ఆ దారుకుడు భయపడి వెంటనే అక్కడకు వచ్చి ఆ శివునిగూర్చి ఇట్లు ప్రశ్నించెను (3).

దారుక ఉవాచ |

కిం ధ్యాయసి హి వైశ్య త్వం సత్యం వద మమాగ్రతః | ఏవం సతి న మృత్యుస్తే మమ వాక్యం న చాన్యథా || 4

దారుకుడు ఇట్లు పలికెను-

ఓ వైశ్యా! దేనిని ధ్యానించుచున్నావు? నా యెదుట సత్యమును పలుకుము. నీవు సత్యమును పలికినచో, నీకు మృత్యువు తప్పిపోవును. నా మాట పొల్లుపోదు (4).

సూత ఉవాచ |

తేనోక్తం చ న జానామి తచ్ఛ్రుత్వా కుపితస్స వై | రాక్షసాన్‌ ప్రేరయామాస హన్యతాం రాక్షసా అయమ్‌ || 5

తదుక్తాస్తే తదా హంతుం నానాయుధధరా గతాః | ద్రుతం తం వైశ్యశార్దూలం శంకరాసక్తచేతసమ్‌ || 6

తానాగతాంస్తదా దృష్ట్వా భయవిత్రస్తలోచనః | శివం సస్మార సుప్రీత్యా తన్నామాని జగౌ ముహుః || 7

సూతుడు ఇట్లు పలికెను-

నాకు తెలియదని ఆయన చెప్పెను. ఆ మాటను విని వాడు కోపించి, ఓ రాక్షసులారా! వీనిని సంహరించుడని రాక్షసులను ప్రేరేపించెను (5). వాడు అట్లు ఆజ్ఞాపించగనే వారు వివిధరకముల ఆయుధములను ధరించి శంకరునియందు లగ్నమైన మనస్సుగల ఆ వైశ్యశ్రేష్ఠుని సంహరించుటకై వెళ్లిరి (6). అప్పుడు వారు తనమీదకు వచ్చుచుండగా చూచిన ఆ వైశ్యుని కళ్లలో తీవ్రమగు భయము కావనచ్చెను. ఆయన పరమప్రీతితో శివుని నామములను పలుమార్లు ఉచ్చరించుచూ శివుని స్మరించెను (7).

వైశ్యపతిరువాచ |

పాహి శంకర దేవేశ పాహి శంభో శివేతి చ | దుష్టాదస్మాత్త్రిలోకేశ ఖలహన్‌ భక్తవత్సల || 8

సర్వస్వం చ భవానద్య మమ దేవ త్వమేవ హి | త్వదధీనస్త్వదీయో%హం త్వత్ర్పా ణస్సర్వదా ప్రభో || 9

ఆ వైశ్యప్రభువు ఇట్లు పలికెను-

ఓ శంకరా! దేవదేవా! రక్షించుము. ఓ శంభో! శివా! ఓ త్రిలోకాధిపతీ! దుష్టసంహారకా! భక్తవత్సలా! ఈ దుష్టుని బారినుండి రక్షించుము (8). ఓ దేవా! ఈనాడు నా సర్వస్వము నీవే. నీ ఆధీనములోనున్న నేను నీవాడను. ఓ ప్రభూ! నా ప్రాణములు సర్వదా నీ చేతిలోనున్నవి (9).

సూత ఉవాచ |

ఇతి సంప్రార్థితశ్శంభుర్వివరాన్నిర్గతస్తదా | భవనేనోత్తమేనాథ చతుర్ద్వారయుతేన చ || 10

మధ్యే జ్యోతిస్స్వరూపం చ శివరూపం తదద్భుతమ్‌ | పరివారసమాయుక్తం దృష్ట్వా చాపూజయత్సవై || 11

పూజితశ్చ తదా శంభుః ప్రసన్నో హ్యభవత్స్వయమ్‌ | అస్త్రం పాశుపతం నామ దత్త్వా రాక్షసపుంగవాన్‌ || 12

జఘాన సోపకరణాంస్తాన్‌ సర్వాన్‌ సగణాన్‌ ద్రుతమ్‌ | అరక్షచ్చ స్వభక్తం వై దుష్టహా స హి శంకరః || 13

సర్వాంస్తాంశ్చ తదా హత్వా వరం ప్రాదాద్వనస్య చ | అత్యద్భుతకరశ్శంభుస్స్వలీలాత్తసువిగ్రహః || 14

అస్మిన్‌ వనే సదా వర్ణధర్మా వై సంభవంతు చ | బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం హి తథైవ చ || 15

భవంత్వత్ర మునిశ్రేష్ఠాస్తామసా న కదాచన | శివధర్మప్రవక్తారశ్శివధర్మప్రవర్తకాః || 16

ఏతస్మిన్‌ సమయే సా వై రాక్షసీ దారుకాహ్వయా | దేవ్యాః స్తుతిం చకారాసౌ పార్వత్యా దీనమానసా || 17

ప్రసన్నా చ తదా దేవీ కిం కరోమీత్యువాచ హి | సాప్యువాచ పునస్తత్ర వంశో మే రక్ష్యతాం త్వయా || 18

రక్షయిష్యామి తే వంశం సత్యం చ కథ్యతే మయా | ఇత్యుక్త్వా చ శివేనైవ విగ్రహం సా చకార హ || 19

శివో%పి కుపితాం దేవీం దృష్ట్వా వరవశః ప్రభుః | ప్రత్యువాచేతి సుప్రీత్యా యథేచ్ఛసి తథా కురు || 20

ఇతి శ్రుత్వా వచస్తస్య స్వపతేశ్శంకరస్య వై | సుప్రసన్నా విహస్యాశు పార్వతీ వాక్యమబ్రవీత్‌ || 21

సూతుడు ఇట్లు పలికెను-

ఈ విధముగా ప్రార్థించబడిన శంభుడు అప్పుడు నాలుగు ద్వారములతో కూడియున్న ఉత్తమమగు భవనముతో సహా వివరమునుండి బయటకు వచ్చెను (10). మధ్యలో జ్యోతిస్స్వరూపముతోనున్నది, పరివారముతో కూడియున్నది అగు ఆ అద్భుతమైన శివరూపమును చూచి ఆతడు పూజించెను (11). అపుడు పూజించబడిన ఆ శంభుడు ప్రసన్నుడై పాశుపతాస్త్ర మును ఇచ్చి స్వయముగా ఆయుధములతో మరియు గణములతో కూడియున్న రాక్షసవీరులను అందరినీ వెనువెంటనే సంహరించెను. దుష్టులను సంహరించు ఆ శంకరుడు తన భక్తుని రక్షించెను (12, 13). అత్యద్భుతమగు లీలలను నెరపువాడు, యథేచ్చగా స్వీకరింపబడిన సుందరదేహము గలవాడు అగు శంభుడు అప్పుడు వారినందరినీ సంహరించి ఆ వనమునకు వరమును ఇచ్చెను (14). ఈ వనములో సర్వదా బ్రాహ్మణ క్షత్రియవైశ్య శూద్రుల వర్ణధర్మములు ప్రవర్తిల్లుగాక! (15). ఇచ్చటి మహర్షులు ఎన్నడైననూ తమోగుణప్రధానులు కాకుందురు గాక! వారు శివధర్మమును తాము పాటించి ఇతరులకు బోధించువారు అగుదురు గాక! (16). ఈ సమయములో ఆ దారుక అనే పేరుగల రాక్షసి దీనమనస్కురాలై పార్వతీదేవిని స్తుతించెను (17). అపుడా దేవి ప్రసన్నురాలై, ఏమి చేయవలెను? అని ప్రశ్నించగా, నీవు నా వంశమును రక్షించవలెనని ఆమె బదులిడెను (18). నేను నీ వంశమును రక్షించెదను. నేను సత్యమును పలుకుచున్నాను అని పలికి ఆమె సాక్షాత్తు శివునితో విరోధమునకు ఒడిగట్టెను (19). వరమునకు వశ##మై ఉండే శివప్రభువు కూడ కోపముతోనున్న ఆ దేవిని చూచి పరమప్రీతితో నీకు తోచినట్లు చేయముని బదులు చెప్పెను (20). తన భర్తయగు శంకరుని మాటను విని పార్వతి మిక్కిలి ప్రస్నురాలై నవ్వి వెంటనే ఇట్లనెను (21).

పార్వత్యువాచ |

భవదీయం వచస్తథ్యం యుగాంతే సంభవిష్యతి | తావచ్చ తామసీ సృష్టిర్భవత్వితి మతిర్మమ || 22

అన్యథా ప్రలయస్స్యాద్వై సత్యం మే వ్యాహృతం శివ | ప్రమాణీక్రియతాం నాథ త్వదీయాస్మి త్వదాశ్రయా || 23

ఇయం చ దారుకా దేవీ రాక్షసీ శక్తికా మమ | బలిష్ఠా రాక్షసీనాం చ రక్షోరాజ్యం ప్రశాస్తు చ || 24

ఇమా రాక్షసపత్న్యస్తు ప్రసవిష్యంతి పుత్రకాన్‌ | తే సర్వే మిలితాశ్చైవ వనే వాసాయ మే మతాః || 25

పార్వతి ఇట్లు పలికెను-

మీ వచనము ఈ యుగముయొక్క అవసానమునందు యథార్థము కాగలదు. అంతవరకు తమోగుణ ప్రధానమగు సృష్టి కూడ ఉండవలెనని నా అభిప్రాయము (22). ఓ శివా! అట్లు గానిచో, ప్రలయము వచ్చును. నేను సత్యమును పలుకుచున్నాను. ఓ నాథా! నా వచనములకు నీవు ప్రామాణ్యమును కలిగించుము. నేను నిన్ను ఆశ్రయించుకొనియున్న నీ దానను (23). ఈ దారుకాదేవియను రాక్షసి నా శక్తి. రాక్షసస్త్రీలలో అత్యధికబలవంతురాలగు ఈమె రాక్షసరాజ్యమును పరిపాలించుగాక! (24). ఈ రాక్షసుల భార్యలు పుత్రులను ప్రసవించగలరు. వారందరు కలిసి వనములో నివసించవలెనని నా అభిమతము (25).

సూత ఉవాచ |

ఇత్యేవం వచనం శ్రుత్వా పార్వత్యాస్స్వస్త్రియాః ప్రభుః | ప్రసన్నమానసో భూత్వా శంకరో వాక్యమబ్రవీత్‌ || 26

సూతుడు ఇట్లు పలికెను-

తన భార్యయగు పార్వతియొక్క ఈ వచనమును విని శంకరప్రభుడు ప్రసన్నమైన మనస్సు గలవాడై ఇట్లు పలికెను (26).

శంకర ఉవాచ |

ఇతి బ్రవీషి త్వం వై చేచ్ఛృణు మద్వచనం ప్రియే | స్థాస్యమ్యస్మిన్‌ వనే ప్రీత్యా భక్తానాం పాలనాయ చ || 27

అత్ర మే వర్ణధర్మస్థో దర్శనం ప్రీతిసంయుతమ్‌| కరిష్యతి చ యో వై స చక్రవర్తీ భవిష్యతి || 28

అన్యథా కలిపర్యాయే సత్యస్యాదౌ నృపేశ్వరః | మహాసేనసుతో యో వై వీరసేనేతి విశ్రుతః || 29

స మే భక్త్యాతివిక్రాంతో దర్శనం మే కరిష్యతి | దర్శనం మే స కృత్వైవ చక్రవర్తీ భవిష్యతి || 30

శంకరుడు ఇట్లు పలికెను-

నీవు ఇట్లు పలుకుచున్నావు కదా! ఓ ప్రియురాలా! అట్లైనచో, నా మాటను వినుము. నేను భక్తులను రక్షించుటకొరకై ప్రీతి పూర్వకముగా ఈ వనములో స్థిరముగా నుండెదను (27) ఎవడైతే వర్ణ ధర్మమునందు వున్నవాడై నన్ను ఇక్కడ ప్రీతిపూర్వకముగా దర్శించునో, వాడు చక్రవర్తి కాగలడు (28). లేదా, కలియుగము పూర్తి అయిన తరువాత సత్యయుగము యొక్క ఆరంభములో వీరసేనుడని ప్రఖ్యాతిని చెందిన మహాసేనుని కుమారుడు అగు ఒక మహారాజు పెద్ద సైన్యముతో గూడి భక్తితో నన్ను దర్శించగలడు. ఆయన నన్ను దర్శించుటతోడనే చక్రవర్తి కాగలడు (29, 30).

సూత ఉవాచ |

ఇత్యేవం దంపతీ తౌ చ కృత్వా హాస్యం పరస్పరమ్‌ | స్థితౌ తత్ర స్వయం సాక్షాన్మహత్త్వకారకౌ ద్విజాః || 31

జ్యోతిర్లింగస్వరూపో హి నామ్నా నాగేశ్వరశ్శివః | నాగేశ్వరీ శివా దేవీ బభూవ చ సతాం ప్రి¸° || 32

సూతుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా! గొప్పదనమును కలిగించే ఆ దంపతులిద్దరు ఈ విధముగా ఒకరితోనొకరు పరిహాసమాడి, అచట స్వయముగా ప్రతిష్ఠితులైరి (31). శివుడు నాగేశ్వరుడనే, జ్యోతిర్లింగస్వరూపుడుగను, పార్వతీదేవి నాగేశ్వరిగను వెలసి సత్పురుషులకు ప్రీతిని కలిగించిరి (32).

ఋషయ ఊచుః |

వీరసేనః కథం తత్ర యాస్యతే దారుకావనే | కథమర్చిష్యతి శివం త్వం తద్వద మహామతే || 33

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ మహాబుద్ధిశాలీ! వీరసేనుడు ఆ దారుకావనమునకు ఏ విధముగా వెళ్లబోవుచున్నాడు? శివుని ఎట్లు అర్చించబోవుచున్నాడు? నీవు ఆ విషయమును చెప్పుము (33).

సూత ఉవాచ |

నిషధే సుందరే దేశే క్షత్రియాణాం కులే చ సః | మహాసేననుతో వీరసేనశ్చైవ శివప్రియః || 34

పార్థివేశార్చనం కృత్వా తపః పరమదుష్కరమ్‌ | చకార వీరసేనో వై వర్షాణాం ద్వాదశావధిః || 35

తతః ప్రసన్నో దేవేశః ప్రత్యక్షం ప్రాహ శంకరః | కాష్ఠస్య మత్స్యికాం కృత్వా త్రపుధాతువిలేపనామ్‌ || 36

విధాయ యోగమాయాం చ దాస్యామి వీరసేనక | తాం గృహీత్వా ప్రవిశ్యైతం నృభిస్సహ వ్రజాధునా || 37

తతస్త్వం తత్ర గత్వా చ వివరే చ కృతా మయా | ప్రవిశ్య చ తదా పూజాం కృత్వా నాగేశ్వరస్య చ || 38

తతః పాశుపతం ప్రాప్య హత్వా చ రాక్షసీముఖాన్‌ | మయి దృష్టే తదా కించిన్న్యూనం తే న భవిష్యతి || 39

పార్వత్యాశ్చ బలం చైవ సంపూర్ణం వై భవిష్యతి | అన్యే చ వ్లుెచ్ఛరూపా యే భవిష్యంతి వనే శుభాః || 40

సూతుడు ఇట్లు పలికెను-

నిషధమనే సుందరదేశమునందు క్షత్రియుల కులములో మహాసేనుడను వానికి వీరసేనుడు అనే శివునకు ప్రీతిపాత్రుడైన పుత్రుడు గలడు (34). వీరసేనుడు పార్థవలింగపూజను చేసి పన్నెండు సంవత్సరములు మిక్కిలి దుస్సాధ్యమైన తపస్సును చేసెను (35). అప్పుడు దేవదేవుడగు శంకరుడు ప్రసన్నుడై సాక్షాత్కరించి ఇట్లు పలికెను : కర్రతో చేపను బోలిన పడవను చేసి దానికి సీసము అనే లోహముతో పూతను వేయుము (36). ఓ వీరసేనా! నేను యోగమాయను నిర్మించి ఇచ్చెదను. ఆ యోగమాయను తీసుకొని నీ మనుష్యులతో గూడి దానిలోనికి ప్రవేశించుము (37). తరువాత నీవు పశ్చిమసముద్రములోని ద్వీపమునకు వెళ్లి నేను చేసిన బిలముగుండా ప్రవేశించి అప్పుడు నాగేశ్వరుని పూజించుము (38). తరువాత పాశుపతాస్త్ర మును పొంది ఆ రాక్షసి మొదలగు వారిని సంహరించి నన్ను మరల దర్శించుము. నీకు సర్వము సుసంపన్నము కాగలదు (39). పార్వతి యొక్క బలము కూడ సంపూర్ణము కాగలదు. ఆ వనమునందు ఉండే ఇతరవ్లుెచ్ఛులు కూడ శుభకర్మ పరాయణులు కాగలరు (40).

సూత ఉవాచ |

ఇత్యుక్త్వా శంకరస్తత్ర వీరసేనం హి దుఃఖహా | కృత్వా కృపాం చ మహతీం తత్రైవాంతర్దధే ప్రభుః || 41

ఇతి దత్తవరస్సో%పి శివేన పరమాత్మనా | శక్తస్సర్వం తదా కర్తుం సంబభూవ న సంశయః || 42

ఏవం నాగేశ్వరో దేవ ఉత్పన్నో జ్యోతిషాం పతిః | లింగరూపస్త్రి లోకస్య సర్వకామప్రదస్సదా || 43

ఏతద్యశ్శృణుయాన్నిత్యం నాగేశోద్భవమాదరాత్‌ | సర్వాన్‌ కామానియాద్ధీమాన్మహాపాతకనాశనాన్‌ || 44

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం నాగేశ్వరజ్యోతిర్లింగోద్భవ మాహాత్మ్యవర్ణనం నామ త్రింశో%ధ్యాయః (30).

సూతుడు ఇట్లు పలికెను -

దుఃఖములను పోగొట్టే శంకరప్రభుడు వీరసేనునితో అక్కడ ఇట్లు పలికి గొప్ప దయను చూపి అక్కడనే అంతర్ధానము జెందెను (41). శివపరమాత్మచే ఈ విధముగా ఈయబడిన వరములు గల ఆ వీరసేనుడు అప్పుడు ఆ సర్వమును చేయగలిగినాడనుటలో సందేహము లేదు (42). ముల్లోకములకు సర్వదా సర్వకామనలను ఇచ్చే పరమేశ్వరుడు ఈ విధముగా జ్యోతిర్లింగములలో శ్రేష్ఠమగు నాగేశ్వర రూపములో ఆవిర్భవించెను (43). ఎవడైతే ఈ నాగేశ్వరావిర్భావమును సాదరముగా నిత్యము వినునో, ఆ బుద్ధిమంతుడు మహాపాపములన్నింటినుండియు విముక్తిని పొంది సకలకామనలను పొందును (44).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్రసంహితయందు నాగేశ్వర జ్యోతిర్లింగ

మాహాత్మ్యవర్ణనమనే ముప్పదియవ అధ్యాయము ముగిసినది (30).

Siva Maha Puranam-3    Chapters