Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Siva Maha Puranam-3    Chapters   

అథ ఏకోనత్రింశో%ధ్యాయః

దారుకా వనములో రాక్షసుల ఉపద్రవము

అథాతస్సంప్రవక్ష్యామి నాగేశాఖ్యం పరాత్మనః | జ్యోతీరూపం యథా జాతం పరమం లింగముత్తమమ్‌ || 1

దారుకా రాక్షసీ కాచిత్పార్వతీవరదర్పితా | దారుకశ్చ పతిస్తస్యా బభూవ బలవత్తరః || 2

బహుభీ రాక్షసైస్తత్ర చకార కదనం సతామ్‌ | యజ్ఞధ్వంసం చ లోకానాం ధర్మధ్వంసం తదా కరోత్‌ || 3

పశ్చిమే సాగరే తస్య వనం సర్వసమృద్ధిమత్‌ | యోజనానాం షోడశభిర్విస్తృతం సర్వతో దిశమ్‌ || 4

దారుకా స్వవిలాసార్థం యత్ర గచ్ఛతి తద్వనమ్‌ | భూమ్యా చ తరుభిస్తత్ర సర్వోపకరణౖర్యుతమ్‌ || 5

దారుకాయై దదౌ దేవీ తద్వనస్యావలోకనమ్‌ | ప్రయాతి తద్వనం సా హి పత్యా సహ యదృచ్ఛయా || 6

తత్ర స్థిత్వా తదా సో%పి సర్వేషాం చ భయం దదౌ | దారుకో రాక్షసః పత్న్యా తయా దారుకయా సహ || 7

తే సర్వే పీడితా లోకా ఔర్వస్య శరణం యయుః | నత్వా ప్రీత్యా విశేషేణ తమూచుర్నతమస్తకాః || 8

సూతుడు ఇట్లు పలికెను-

ఈ పైన పరమాత్మయొక్క సర్వశ్రేష్ఠము, ఉత్తమము అగు నాగేశ్వరజ్యోతిర్లింగము ఆవిర్భవించిన విధానమును గురించి చెప్పెదను (1). పార్వతి ఇచ్చిన వరములచే గర్వించిన దారుక అను రాక్షసి ఒకతె ఉండెను. మహాబలశాలియగు దారుకుడు ఆమెకు భర్త (2). అతడు అనేకరాక్షసులతో గూడినవాడై సత్పురుషులతో యుద్ధమునుచేసి, యజ్ఞములను నష్టమొనర్చి, ఆ విధముగా ధర్మమును ధ్వంసమొనర్చెను (3).దారుకని వనము పశ్చిమ సముద్ర తీరమునందు అన్ని దిక్కులయందు పదునారు యోజనముల విస్తారము కలిగి ఉండెను (4). దారుక తన విలాసముకొరకై ఆ వనమునకు వెళ్లిన సమయములలో, అచటి భూమి చెట్లతో మరియు సర్వాలంకారములతో నిండియుండెను (5). ఆ వనమును పరిరక్షించే బాధ్యతను పార్వతి దారుకకు అప్పజెప్పెను. ఆమె తనకు తోచినప్పుడు భర్తతో కలిసి ఆ వనమునకు వెళ్లుచుండెను (6). ఆ దారుకాసురుడు భార్యయగు దారుకతో కలిసి ఆ వనములోనున్నవాడై సర్వులకు భయమును కలిగించెను (7). వారిచే పీడించబడిన జనులు అందరు ఔర్వుని వద్దకు వెళ్లి ఆయనకు విశేషప్రీతితో తలలను వంచి నమస్కరించి శరణు పొంది ఇట్లు పలికిరి (8).

లోకా ఊచుః |

మహర్షే శరణం దేహి నో చేద్దుష్టైశ్చ మారితాః | సర్వం కర్తుం సమర్థోసి తేజసా దీప్తిమానసి || 9

పృథ్వ్యాం న వర్తతే కశ్చిత్‌ త్వాం వినా శరణం చ నః | యామో యస్య సమీపే తు స్థిత్వా సుఖమవాప్నుమః || 10

త్వాం దృష్ట్వా రాక్షసాస్సర్వే పలాయంతి విదూరతః | త్వయి శైవం సదా తేజో విభాతి జ్వలనో యథా || 11

జనులు ఇట్లు పలికిరి-

ఓ మహర్షీ! మమ్ములను దుష్టులు హింసించుచున్నారు. మాకు శరణునిమ్ము. తేజస్సుచే ప్రకాశించే నీవు సర్వమును చేయ సమర్థుడవు (9). నీవు తక్క ఈ లోకములో మాకు మరియొక్క శరణస్థానము లేదు. నీకు దగ్గరలో ఉన్నంతవరకు మాకు సుఖము కలుగును (10). నిన్ను చూచి రాక్షసులు దూరముగా పారిపోయెదరు. నీయందు సర్వదా శివుని తేజస్సు అగ్నిహోత్రమువలె ప్రకాశించుచున్నది (11).

సూత ఉవాచ |

ఇత్యేవం ప్రార్థితో లోకైరౌర్వో హి మునిసత్తమః | శోచమానశ్శరణ్యశ్చ రక్షాయై హి వచో%బ్రవీత్‌ || 12

సూతుడు ఇట్లు పలికెను-

శరణు పొందిన వారిని రక్షించే స్వభావముగల ఔర్వమహర్షిని జనులు ఈ విధముగా ప్రార్థించగా ఆయన బాధపడి వారి రక్షణకొరకై ఇట్లనెను (12).

ఔర్వ ఉవాచ |

పృథివ్యాం యది రక్షాంసి హింస్యుర్వై ప్రాణిసస్తదా | స్వయం ప్రాణౖర్వియుజ్యేయూ రాక్షసా బలవత్తరాః || 13

యదా యజ్ఞా వి హన్యేరంస్తదా ప్రాణౖర్వియోజితాః | భవంతు రాక్షసాస్సర్వే సత్యమేతన్మయోచ్యతే || 14

ఔర్వుడు ఇట్లు పలికెను-

రాక్షసులు అధికబలశాలురే అయిననూ భూలోకములో ప్రాణులను హింసించినచో, అప్పుడు వారు తామే ప్రాణములను కోల్పోయెదరు (13). ఆ రాక్షసులు అందరు ఏ సమయములో యజ్ఞములకు హానిని కలిగించెదరో, అదే సమయములో ప్రాణములను గోల్పోయెదరు గాక! నేను సత్యమును పలుకుచున్నాను (14).

సూత ఉవాచ |

ఇత్యుక్త్వా వచనం తేభ్యస్సమాశ్వాస్య ప్రజాః పునః | తపశ్చకార వివిధమౌర్వో లోకసుఖావహః || 15

దేవాస్తదా తే విజ్ఞాయ శాపస్య కారణం హి తత్‌ | యుద్ధాయ చ సముద్యోగం చక్రుర్దేవారిభిస్సహ || 16

సర్వైశ్చైవ ప్రయత్నైశ్చ నానాయుధధరాస్సురాః | సర్వే శక్రాదయస్తత్ర యుద్ధార్థం సముపాగతాః || 17

తాన్‌ దృష్ట్వా రాక్షసాస్తత్ర విచారే తత్పరాః పునః | బభూవుస్తే%ఖిలా దుష్టా మిథో యే యత్ర సంస్థితాః || 18

సూతుడు ఇట్లు పలికెను-

లోకములకు సుఖమును కలిగించే ఔర్వమహర్షి ఆ ప్రజలతో పలికి వారిని ఓదార్చి అనేకవిధములైన తపస్సును చేసెను (15). అపుడు దేవతలు ఆ శాపకారణమును తెలుసుకొని దేవశత్రువులగు రాక్షసులతో యుద్ధమునకు పెద్ద సన్నాహమును చేసిరి (16). ఇంద్రుడు మొదలగు దేవతలందరు అనేకవిధములైన ఆయుధములను ధరించి అన్ని విధములైన ప్రయత్నములచే యుద్ధమును చేయుట కొరకై అచటకు విచ్చేసిరి (17). వారిని చూచి వివిధస్థానములలోనున్న రాక్షసులు అందరు ఒకచోట చేరి పరస్పరసమాలోచనలలో నిమగ్నులైరి (18).

రాక్షసా ఊచుః |

కిం కర్తవ్యం క్వ గంతవ్యం సంకటం సముపాగతాః | యుద్ధ్యతే మ్రియతే చైవ యుద్ధ్యతే న విహన్యతే || 19

తథైవ స్థీయతే చేద్వై భక్ష్యతే కిం పరస్పరమ్‌ | దుఃఖం హి సర్వథా జాతం క ఏవం వినివారయేత్‌ || 20

రాక్షసులు ఇట్లు పలికిరి-

మనము ఏమి చేయవలెను? ఎచటకు పోవలెను? ఆపద వచ్చి పడినది. మనము యుద్ధమును చేసి మరణించుచుండగా, వారు యుద్ధమును చేసియూ మరణించకున్నారు (19). ఈ పరిస్థితి ఇటులనే కొనసాగినచో, మనము ఒకరినొకరు తినవలెనా యేమి? అన్ని విధములుగా దుఃఖము సంప్రాప్తమైనది. దీనిని నివారించువారు ఎవరు? (20).

సూత ఉవాచ |

విచార్యేతి చ తే తత్ర దారుకాద్యాశ్చ రాక్షసాః | ఉపాయం న విజానంతో దుఃఖం ప్రాప్త్రాస్సదా హి వై || 21

దారుకా రాక్షసీ చాపి జ్ఞాత్వా దుఃఖం సమాగతమ్‌ | భవాన్యాశ్చ వరం తం చ కథయామాస సా తదా || 22

సూతుడిట్లు పలికెను-

అపుడు అచట దారుకుడు మొదలైన రాక్షసులు ఈ విధముగా విచారించి ఉపాయమును కనుగొనలేక పోయిరి. వారు అధికమగు దుఃఖమును పొందియుండిరి (21). అపుడు తమకు వచ్చిన ఆ దుఃఖమును గురించి తెలుసుకొని, దారుక అనే ఆ రాక్షసి తనకు భవాని ఇచ్చిన ఆ వరమును గురించి చెప్పెను (22).

దారుకోవాచ |

మయా హ్యారాధితా పూర్వం భవపత్నీ వరం దదౌ | వనం గచ్ఛ నిజైస్సార్ధం యత్ర గంతుం త్వమిచ్ఛసి || 23

తద్వరశ్చ మయా ప్రాప్తః కథం దుఃఖం విషహ్యతే | జలం వనం చ నీత్వా వై సుఖం స్థేయం తు రాక్షసైః || 24

దారుక ఇట్లు పలికెను-

పూర్వము నేను భవానిని ఆరాధించగా ఆమె నాకు ఒక వరమును ఇచ్చెను. నీవు నీ వారితో గూడి వనములో నీకు ఇష్టమైన ఎచ్చోటికైననూ వెళ్లవచ్చును అని ఆమె చెప్పెను (23). నేను అట్టి వరమును పొందియుంటిని. మీరు దుఃఖమును సహించుట యేల? సముద్రములోని దీవికి రాక్షసులతో గూడి వెళ్లి సుఖముగా నుండుడు (24).

సూత ఉవాచ |

తస్యాస్తద్వచనం శ్రుత్వా రాక్షస్యా హర్షమాగతాః | ఊచుస్సర్వే మిథస్తే హి రాక్షసా నిర్భయాస్తదా || 25

ధన్యేయం కృతకృత్యేయం రాజ్ఞ్యా వై జీవితాస్స్వయమ్‌ | నత్వా తసై#్య చ తత్సర్వం కథయామాసురాదరాత్‌ || 26

యది గంతుం భ##వేచ్ఛక్తిర్గమ్యతాం కిం విచారయతే | తత్ర గత్వా జలే దేవి సుఖం స్థాస్యామ నిత్యశః || 27

ఏతస్మిన్నంతరే లోకా దేవైస్సార్ధం సమాగతాః | యుద్ధాయ వివిధైర్దుఃఖైః పీడితా రాక్షసైః పురా || 28

పీడితాశ్చ తదా తస్యా భవాన్యా బలమాశ్రితాః | సమగ్రం నగరం నీత్వా జలస్థలసమన్వితమ్‌ || 29

జయ జయేతి దేవ్యాస్తు స్తుతిముచ్చార్య రాక్షసీ | తత ఉడ్డీయనం కృత్వా సపక్షో గిరిరాడ్యథా || 30

సూతుడు ఇట్లు పలికెను-

ఆ రాక్షసియొక్క ఆ వచనమును విని ఆ రాక్షసులందరు నిర్భయులై ఆనందమును పొంది అపుడు వారిలో వారు ఇట్లు చెప్పుకొనిరి (25). ఈమె ధన్యురాలు; కృతకృత్యురాలు. మనకు ఈ రాణి ప్రాణదానమును చేసినది అని పలికి వారు ఆమెకు నమస్కరించి ఆ వృత్తాంతమునంతనూ చెప్పిరి (26). వెళ్లగలిగే శక్తి ఉన్నచో వెళ్లుటయే మంచిది. ఆలోచించి ప్రయోజనమేమున్నది? ఓ దేవీ! మేము అచటకు వెళ్లి సర్వదా సుఖముననుభవిస్తూ నీటియందు నివసించెదము (27). ఇంతలో పూర్వము రాక్షసులచే వివిధదుఃఖములకు గురిచేయబడిన జనులు దేవతలతో గూడి యుద్ధముకొరకై విచ్చేసిరి (28). అప్పుడు కష్టముల పాలైన రాక్షసులు భవానియొక్క వరబలమును ఆశ్రయించిన వారై సముద్రమధ్యములో నున్న నగరమునకు తమ సామగ్రిని అంతనూ తీసుకొని వెళ్లిరి (29). ఆ రాక్షసి జయజయధ్వానములతో దేవిని స్తుతించి రెక్కలు గల పర్వతమువలె అచటనుండి ఎగిరెను (30).

సముద్రస్య చ మధ్యే సా సంస్థితా నిర్భయా తదా | సకలైః పరివారైశ్చ ముముదేతి శివానుగా || 31

తత్ర సింధౌ చ తే స్థిత్వా నగరే చ విలాసినః | రాక్షసాశ్చ సుఖం ప్రాపుర్నిర్భయాశ్చ విజహ్రిరే || 32

రాక్షసాశ్చ పృథివ్యాం వై నాజగ్ముశ్చ కదాచన | మునేశ్శాపభయాదేవ బభ్రముస్తే జలే తదా || 33

నౌషు స్థితాఞ్జనాన్నీత్వా నగరే తత్ర తాంస్తదా | చిక్షిపుర్బంధనాగారే కాంశ్చిజ్జఘ్నుస్తదా హితే || 34

యథా యథా పునః పీడాం చక్రుస్తే రాక్షసాస్తదా | తత్ర స్థితా భవాన్యాశ్చ వరదానాచ్చ నిర్భయాః || 35

యథా పూర్వం స్థలే లోకే భయం చాసీన్నిరంతరమ్‌ | తథా భయం జలే తేషామాసీన్నిత్యం మునీశ్వరాః || 36

కదాచిద్రాక్షసీ సా చ నిస్సృతా నగరాజ్జలే | రుద్ధా మార్గం స్థితా లోకపీదార్థం ధరణౌ చ హి || 37

అపుడు పార్వతియొక్క భక్తురాలగు ఆమె సమస్తపరివారములతో గూడి నిర్భయముగా సముద్రమధ్యములో నివసించెను (31). అచట సముద్రములోని నగరములో ఆ రాక్షసులు నిర్భయముగా నివసించి సుఖభోగముననుభవిస్తూ విహరింపజొచ్చిరి (32). ఆ రాక్షసులు మహర్షియొక్క శాపభయముచే ఏ నాడైననూ భూమిపైకి రాకుండిరి. వారు అచట సముద్రమధ్యములోననే సంచరించిరి (33). వారు నౌకలయందు ఉన్న జనులను ఆ నగరములోనికి గొనిపోయి కారాగారములో పారవేసెడివారు. వారిలో కొందరిని సంహరించెడివారు (34). భవానీదెవి ఇచ్చిన వరము యొక్క ప్రభావముచే నిర్భయులై అచట నివసించుచున్న ఆ రాక్షసులు మరల వీలు చిక్కిన సందర్భములలో జనులను పీడించుచుండిరి (35). ఓ మహర్షులారా! పూర్వము జనులకు భూమిపై నివసించే రాక్షసుల పీడ ఎట్లు ఉండెడిదో, ఇప్పుడు సరిగ్గా అదే విధముగా సముద్రనివాసులగు రాక్షసుల నిరంతరపీడ జనులకు తప్పలేదు (36). ఒకనాడు ఆ రాక్షసి సముద్రమునందలి నగరమునుండి బయటకు వచ్చి భూమి యందు జనులను పీడించుటకొరకై దారికి అడ్డముగా నిలబడెను (37).

ఏతస్మిన్నంతరే తత్ర నావో బహుతరాశ్శుభాః | ఆగతా బహుధా తత్ర సర్వతో లోకసంవృతాః || 38

తా నావశ్చ తదా దృష్ట్వా హర్షం సంప్రాప్య రాక్షసాః | ద్రుతం గత్వా హి తత్రస్థాన్వేగాత్సందధ్రిరే ఖలాః || 39

ఆజగ్ముర్నగరం తే చ తానాదాయ మహాబలాః | చిక్షిపుర్బంధనాగారే బధ్వా హి నిగడైర్దృఢైః || 40

బద్ధాస్తే నిగడైర్లోకాస్సంస్థితా బంధనాలయే | అతీవ దుఃఖమాజగ్ముర్భర్త్సితాస్తే ముహుర్ముహుః || 41

తేషాం మధ్యే చ యో%ధీశస్స వైశ్యస్సుప్రియాభిధః | శివప్రియశ్శుభాచారశ్శైవశ్చా సీత్సదాతనః || 42

వినా చ శివపూజాం వై న తిష్ఠతి కదాచన | సర్వథా శివధర్మా హి భస్మరుద్రాక్షభూషణః || 43

యది పూజా న జాతా చేన్న భునక్తి తదా తు సః | అతస్తత్రాపి వైశ్యో%సౌ చకార శివపూజనమ్‌ || 44

ఇంతలో అచటకు వివిధదేశములనుండి అనేకరకముల సుందరమైన నావలు అంతటా జనులతో నిండియున్నవై వచ్చుచుండెను (38). అపుడు దుష్టులగు ఆ రాక్షసులు ఆ నావలను చూచి మహానందమును పొంది వెంటనే వెళ్లి వాటిలోని జనులను బంధించిరి (39). మహాబలశాలురగు ఆ రాక్షసులు వారిని తీసుకొనివచ్చి దృఢమగు సంకెళ్లతో బంధించి నగరములోని కారాగారములో పడవేసిరి (40). సంకెళ్లతో బంధించి కారాగారములోనికి త్రోసివేయబడిన ఆ జనులు అచట వారిచే పదే పదే పీడించబడి మహాదుఃఖమును అనుభవించుచుండిరి (41). సుప్రియుడను పేరుగల వైశ్యుడు వారికి నాయకుడు. అతడు సదాచారసంపన్నుడు, శాశ్వతశివభక్తుడు మరియు శివునకు ప్రియమైనవాడు (42). సర్వవిధములుగా శివధర్మానుష్ఠాత, భస్మ మరియు రుద్రాక్షలే ఆభరణములుగా గలవాడు అగు ఆ వైశ్యుడు శివపూజ చేయని దినము ఉండెడిది కాదు (43). ఆయన పూజ చేయనిదే భోజనము చేసెడివాడు కాడు. కావున, ఆయన అచట కూడ పూజను చేసెడివాడు (44).

కారాగృహగతస్సో%పి బహూంశ్చాశిక్షయత్తదా | శివమంత్రం చ పూజాం చ పార్థివీమృషిసత్తమాః || 45

తే సర్వే చ తదా తత్ర శివపూజాం స్వకామదామ్‌ | చక్రిరే విధివత్తత్ర యథాదృష్టం యథాశ్రుతమ్‌ || 46

కేచిత్తత్ర స్థితాధ్యానే బద్ధ్వాసనమనుత్తమమ్‌ | మానసీం శివపూజాం చ కేచిచ్చక్రుర్ముదాన్వితాః || 47

తదధీశేన తత్రై వ ప్రత్యక్షం శివపూజనమ్‌ | కృతం చ పార్థివసై#్యవ విధానేన మునీశ్వరాః || 48

అన్యే చ యేన జానంతి విధానం స్మరణం పరమ్‌ | నమశ్శివాయ మంత్రేణ ధ్యాయంతశ్శంకరం స్థితాః || 49

సుప్రియో నామ యశ్చా సీద్వైశ్యవర్యశ్శివప్రియః | ధ్యాయంశ్చ మనసా తత్ర చకార శివపూజనమ్‌ || 50

యథోక్తరూపీ శంభుశ్చ ప్రత్యక్షం సర్వమాదదే | సోపి స్వయం న జానాతి గృహ్యతే న శివేన వై || 51

ఏవం చ క్రియమాణస్య వైశ్యస్య శివపూజనమ్‌ | వ్యతీయుస్తత్ర షణ్మాసా నిర్విఘ్నేన మునీశ్వరాః || 52

అతః పరం చ యజ్జాతం చరితం శశిమౌలినః | తచ్ఛృణుధ్వమృషి శ్రేష్ఠాస్సా వధానేన చేతసా || 53

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం దారుకావనరాక్షసోపద్రవ వర్ణనం నామ ఏకోనత్రింశో%ధ్యాయః (29).

ఓ మహర్షులారా! ఆయన కారాగృహమునందున్ననూ అప్పుడు అనేకులకు శివమంత్రమును మరియు పార్థివలింగపూజను నేర్పెను (45). వారందరు అపుడు అచట తాము విన్నదానికి చూచినదానికి అనురూపముగా యథావిధిగా తమ కోర్కెలను ఈడేర్చే శివపూజను చేసిరి (46). కొందరు అచట సర్వోత్కృష్టమగు ఆసనమును బంధించి ధ్యానములో నున్నవారై ఆనందముతో మానసికశివపూజను చేసిరి (47). ఓ మహర్షులారా! వారి నాయకుడు అచటనే బహిరంగముగనే శివపూజను పార్థివవిధానముచే చేయుచుండెను (48). స్మృతివిహితమైన శ్రేష్ఠవిధివిధానము తెలియని మరికొందరు నమశ్శివాయ మంత్రముతో శంకరుని స్థిరముగా ధ్యానించుచుండిరి (49). శివునకు ప్రియుడైన సుప్రియుడనే వైశ్యశ్రేష్ఠుడు మనస్సులో శివుని ధ్యానించుచూ అచట శివుని పూజించెను (50). శంభుడు పూర్వము వర్ణించబడిన రూపములో ప్రత్యక్షముగా ఆయన సమర్పించిన ఉపచారములనన్నింటినీ స్వీకరించెడివాడు. శివుడు తాను సమర్పించే ఉపచారములను స్వీకరించుచున్నాడని ఆ వైశ్యునకు తెలియక పోలేదు (51). ఓ మహర్షులారా! ఆ వైశ్యుడు ఈ విధముగా అచట నిర్విఘ్నముగా శివపూజను చేయుచుండగా ఆరు మాసములు గడచిపోయెను (52). ఓ మహర్షులారా! ఆ తరువాత జరిగిన చంద్రశేఖరుని ఆ చరితమును సావధానమనస్కులై వినుడు (53).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్రసంహితయందు దారుకావనమునందలి రాక్షసుల ఉపద్రవము వర్ణించే ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29).

Siva Maha Puranam-3    Chapters