Siva Maha Puranam-3    Chapters   

అథ అష్టావింశో%ధ్యాయః

వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్యము

సూత ఉవాచ |

రావణో రాక్షసశ్రేష్ఠో మానీ మానపరాయణః | ఆరరాధ హరం భక్త్యా కైలాసే పర్వతోత్తమే || 1

ఆరాధితః కియత్కాలం న ప్రసన్నో హరో యదా | తదా చాన్యత్తపశ్చక్రే ప్రసాదార్థం శివస్య సః || 2

నతశ్చాయం హిమవతస్సిద్ధిస్థానస్య వై గిరేః | పౌలస్త్యో రావణశ్శ్రీ మాన్‌ దక్షిణ వృక్షఖండకే || 3

భూమౌ గర్తవరం కృత్వా తత్రాగ్నిం స్థాప్య స ద్విజాః | తత్సన్నిధౌ శివం స్థాప్య హవనం స చకార హ || 4

గ్రీష్మే పంచాగ్నిమధ్యస్థో వర్షాసు స్థండిలేశయః | శీతే జలాంతరస్థో హి త్రిధా చక్రే తపశ్చ సః || 5

చకారైవం బహుతపో న ప్రసన్నస్తదాపి హి | పరమాత్మా మహేశానో దురారాధ్యో దురాత్మభిః || 6

తతశ్శిరాంసి ఛిత్వా చ పూజనం శంకరస్య వై | ప్రారబ్ధం దైత్యపతినా రావణన మహాత్మనా || 7

ఏకైకం చ శిరశ్ఛిన్నం విధినా శివపూజనే | ఏవం సత్క్ర మతస్తేన చ్ఛిన్నాని నవ వై యదా || 8

ఏకస్మిన్నవశిష్టే తు ప్రసన్నశ్శంకరస్తదా | ఆవిర్బభూవ తత్రై వ సంతుష్టో భక్తవత్సలః || 9

శిరాంసి పూర్వవత్కృత్వా నీరుజాని తథా ప్రభుః | మనోరథం దదౌ తస్మాదతులం బలముత్తమమ్‌ || 10

ప్రసాదం తస్య సంప్రాప్య రావణస్స చ రాక్షసః | ప్రత్యువాచ శివం శంభుం నతస్కంధః కృతాంజలిః || 11

సూతుడు ఇట్లు పలికెను-

గర్విష్ఠి, అభిమానధనుడు, రాక్షసులలో శ్రేష్ఠమైనవాడు అగు రావణుడు పర్వతరాజమగు కైలాసమునందు శివుని భక్తితో ఆరాధించెను (1). కొంతకాలము ఆరాధించిననూ శివుడు ప్రసన్నుడు కాలేదు. అపుడు ఆతడు శివుని అనుగ్రహముకొరకై మరియొక విధమైన తపస్సును చేసెను (2). ఓ బ్రాహ్మణులారా! సిద్ధిస్థానమనదగిన హిమవత్పర్వతముయొక్క దక్షిణభాగమునందు గుబురైన చెట్ల మధ్యలో పులస్త్యుని కుమారుడు, శోభాయుక్తుడు అగు ఆ రావణుడు శివునకు నమస్కరించి, భూమిలో లోతైన గోతిని తీసి దానియందు అగ్నిని స్థాపించి దాని సమీపములో శివుని ప్రతిష్ఠించి హోమమును చేసెను (3, 4). వేసవికాలమునందు ఐదు అగ్నుల మధ్యలోనున్నవాడై, వర్షాకాలమునందు నేలపై పరుండి, శీతకాలములో నీటిలోపల ఉండి ఈ విధముగా ఆతడు మూడు విధముల తపస్సును చేసెను (5). ఈ విధముగా అధికమగు తపస్సును చేసిననూ శివుడు ప్రసన్నుడు కాలేదు. పరమాత్మయగు మహేశ్వరుని దుర్మార్గులు ఆరాధించుట చాల కఠినము (6). తరువాత రాక్షసాధిపుడు, మహాత్ముడు అగు రావణుడు శిరస్సులను నరికి శంకరుని ఆరాధించుటను మొదలిడెను (7). వరుసగా ఒక్కొక్క తలను నరికి యథావిధిగా ఆతడు శివుని పూజిస్తూ, క్రమముగా తొమ్మిది తలలను ఛేదించునప్పటికి (8), ఇంక ఒక తల మాత్రమే మిగిలియుండగా, అప్పుడు భక్తవత్సలుడగు శంకరుడు ప్రసన్నుడై మిక్కిలి సంతోషించి అక్కడనే ప్రత్యక్షమయ్యెను (9). ఆ ప్రభుడు ఆతనికి నొప్పి లేని విధముగా తలలను పూర్వమువలెనే అనుగ్రహించి, ఆతనికి సాటిలేని ఉత్తమబలమును ఇచ్చి కోరికను తీర్చెను (10). మంగళస్వరూపుడగు ఆ శంభుని అనుగ్రహమును పొంది ఆ రావణాసురుడు చేతులను జోడించి తలను వంచి ప్రణమిల్లి ఇట్లు పలికెను (11).

రావణ ఉవాచ |

ప్రసన్నో భవ దేవేశ లంకాం చ త్వాం నయామ్యహమ్‌ | సఫలం కురు మే కామం త్వామహం శరణం గతః || 12

ఓ దేవదేవా! ప్రసన్నుడవు కమ్ము. నేను నిన్ను లంకకు గొనిపోవుచున్నాను. నా కోర్కెను సఫలము చేయుము. నేను నిన్ను శరణు పొందుచున్నాను (12).

సూత ఉవాచ|

ఇత్యుక్తశ్చ తదా తేన శంభుర్వై రావణన సః | ప్రత్యువాచ విచేతస్కస్సంకటం పరమం గతః || 13

సూతుడు ఇట్లు పలికెను-

ఆ రావణుడు అపుడు అట్లు పలుకగా, శంభుడు పెద్ద సంకటములో పడెను. ఆయన మనస్సులో ఉత్సాహము లేకుండెను. ఆయన ఇట్లు బదులిడెను (13).

శివ ఉవాచ |

శ్రూయతాం రాక్షసశ్రేష్ఠ వచో మే సారవత్తయా | నీయతాం స్వగృహే మే హి సద్భక్త్యా లింగముత్తమమ్‌ || 14

భూమౌ లింగం యదా త్వం చ స్థాపయిష్యసి తత్ర వై | స్థాస్యత్యత్ర న సందేహో యథేచ్ఛసి తథా కురు || 15

శివుడు ఇట్లు పలికెను-

ఓ రాక్షసశ్రేష్ఠా! నేను సారవంతమైన వచనమును చెప్పుచున్నాను. కావున సావధానముగా వినుము. ఉత్తమమగు శివలింగమును సద్భక్తితో నీ ఇంటికి తీసుకొని వెళ్లుము (14). కాని నీవు ఎప్పుడైననూ లింగమును నేలపై ఉంచినచో, అది నిశ్చితముగా అక్కడనే స్థిరముగా నుండగలదు. కావున, నీకు నచ్చిన విధముగా చేయుము (15).

సూత ఉవాచ |

ఇత్యుక్తశ్శంభునా తేన రావణో రాక్షసేశ్వరః | తథేతి తత్సమాదాయ జగామ భవనం నిజమ్‌ || 16

ఆసీన్మూత్రోత్సర్గకామో మార్గే హి శివమాయయా | తత్‌ స్తంభితుం న శక్తో%భూత్పౌలస్త్యో రావణః ప్రభుః || 17

దృష్ట్వైకం తత్ర వై గోపం ప్రార్థ్వ లింగం దదౌ చ తత్‌ | ముహూర్తకే హ్యతిక్రాంతే గోపో%భూద్వికలస్తదా || 18

భూమౌ సంస్థాపయామాస తద్భారేణాతిపీడితః | తత్రై వ తత్‌ స్థితం లింగం వజ్రసారసముద్భవమ్‌ |

సర్వకామప్రదం చైవ దర్శనాత్పాపహారకమ్‌ || 19

వైద్యనాథేశ్వరం నామ్నా తల్లింగమభవన్మునే | ప్రసిద్ధం త్రిషు లోకేషు భుక్తిముక్తిప్రదం సతామ్‌ || 20

జ్యోతిర్లింగమిదం శ్రేష్ఠం దర్శనాత్పూజనాదపి | సర్వపాపహరం దివ్యం భక్తివర్ధనముత్తమమ్‌ || 21

తస్మింల్లింగే స్థితే తత్ర సర్వలోకహితాయ వై | రావణస్స్వగృహం గత్వా వరం ప్రాప్య మహోత్తమమ్‌ |

ప్రియాయై సర్వమాచఖ్యౌ సుఖేనాతి మహాసురః || 22

తచ్ఛ్రుత్వా సకలా దేవాశ్శక్రాద్యా మునయస్తథా | పరస్పరం సమామంత్ర్య శివాసక్తధియో% మలాః || 23

తస్మిన్‌ కాలే సురాస్సర్వే హరిబ్రహ్మదయో మునే | ఆజగ్ముస్తత్ర సుప్రీత్యా పూజాం చక్రుర్విశేషతః || 24

ప్రత్యక్షం తం తదా దృష్ట్వా ప్రతిష్ఠాప్య చ తే సురాః | వైద్యనాథేతి సంప్రోచ్య నత్వా నుత్వా దివం యయుః || 25

సూతుడు ఇట్లు పలికెను-

శంభుడు ఈ విధముగా పలుకగా, రాక్షసేశ్వరుడగు రావణుడు సరే యని పలికి దానిని తీసుకొని తన గృహమునకు వెళ్లెను (16). రావణప్రభువునకు మార్గమధ్యములో శివుని మాయాప్రభావముచే మూత్రవిసర్జనము ఆవశ్యకమయ్యెను. ఆతడు దానిని ఆపుకొనలేకపోయెను (17). అచట ఆతడు ఒక గోపాలకుని చూచి, వానిని ప్రార్థించి లింగమును వానికి అప్పజెప్పెను. ఒక ముహూర్త కాలము గడచెను. ఆ గోపాలకుడు కంగారు పడజొచ్చెను (18). ఆతడు ఆ బరువును తట్టుకొనలేక ఆ లింగమును నేలపై పెట్టెను. దృఢమగు వజ్రమునుండి పుట్టిన లింగము అచటనే స్థిరముగా ఉండి పోయెను. దర్శించువారి పాపములను పోగొట్టే ఆ లింగము కోర్కెలనన్నిటినీ ఈడేర్చును (19). ఓ మహర్షీ! ఆ లింగము ముల్లోకములలో వైద్యనాథేశ్వరుడను పేర ప్రసిద్ధిని గాంచి సత్పురుషులకు భుక్తిని మరియు ముక్తిని ఇచ్చుచున్నది (20). దర్శించి పూజించువారల సర్వపాపములను పోగొట్టునది, దివ్యమైనది, భక్తిని పెంపొందింపజేయునది, ఉత్తమమైనది అగు ఈ జ్యోతిర్లింగము సర్వశ్రేష్ఠమైనది (21). ఆ లింగము సర్వలోకముల క్షేమముకొరకై అక్కడనే స్థిరముగా నుండెను. రాక్షసేశ్వరుడగు రావణుడు మహోత్కృష్టమగు వరమును పొంది తన ఇంటికి వెళ్లి ఆ వృత్తాంతము నంతనూ తన ప్రియురాలికి చెప్పి మహాభోగములననుభవించెను (22). ఓ మహర్షీ! ఆ విషయమును విని విష్ణువు, బ్రహ్మ మరియు ఇంద్రుడు మొదలగు సకలదేవతలు మరియు మునులు శివుని యందు లగ్నమైన పవిత్రమగు అంతః కరణము గలవారై ఒకరితోనొకరు సంప్రదించుకొని ఆ సమయములో అచటకు వచ్చి మహానందముతో విశేషపూజను చేసిరి (23, 24). ఆ దేవతలు ప్రత్యక్షముగా ఆ భగవానుని దర్శించి ఆ లింగమును అచట ప్రతిష్ఠించి వైద్యనాథుడనిపేరు పెట్టి నమస్కరించి స్తుతించి స్వర్గము నకు వెళ్లిరి (25).

ఋషయ ఊచుః |

తస్మింల్లింగే స్థితే తత్ర రావణ చ గృహం గతే | కిం చరిత్రమభూత్తాత తతస్తద్వద విస్తరాత్‌ || 26

ఋషులు ఇట్లు పలికిరి -

ఓ తండ్రీ! ఆ లింగము అచట స్థిరమై రావణుడు తన ఇంటికి వెళ్లిన తరువాత ఏమి వృత్తాంతము జరిగెను? దానిని వివరముగా చెప్పుము (26).

సూత ఉవాచ|

రావణో%పి గృహం గత్వా వరం ప్రాప్య మహోత్తమమ్‌ | ప్రియాయై సర్వమాచఖ్యౌ ముమోదాతి మహాసురః || 27

రావణుడు కూడా సర్వోత్కృష్టమగు వరమును పొంది ఇంటికి వెళ్లెను. ఆ మహారాక్షసుడు ఆ వృత్తాంతమునంతనూ తన ప్రియురాలికి చెప్పి, అతిశయించిన ఆనందమును పొందెను (27).

తచ్ఛ్రుత్వా సకలం దేవాశ్శక్రాద్యా మునయస్తథా | పరస్పరం సమూచుస్తే సముద్విగ్నా మునీశ్వరాః || 28

ఓ మహర్షులారా! ఆ వృత్తాంతమును విని ఆ ఇంద్రాది దేవతలు మరియు మునులు చాల కంగారు పడి పరస్పరము ఇట్లు సంప్రదించుకొనిరి (28).

దేవాదయ ఊచుః |

రావణో%యం దురాత్మా హి దేవద్రోహీ ఖలః కుధీః | శివాద్వరం చ సంప్రాప్య దుఃఖం దాస్యతి నో%పి సః || 29

కిం కుర్మః క్వ చ గచ్ఛామః కిం భవిష్యతి వా పునః | దుష్టశ్చ దక్షతాం ప్రాప్తః కిం కిం నో సాధయిష్యతి || 30

ఇతి దుఃఖసమాపన్నాశ్శక్రాద్యా మునయస్సురాః | నారదం చ సమాహూయ పప్రచ్ఛుర్వికలాస్తదా || 31

దేవతలు మొదలగు వారు ఇట్లు పలికిరి-

దేవతలకు ద్రోహమును తలపెట్టువాడు, దుష్టుడు, దుర్బుద్ధి, దుర్మార్గుడు అగు ఈ రావణుడు శివునినుండి వరమును సంపాదించినాడు. వీడు మనకు దుఃఖమును కలిగించగలడు (29). ఏమి చేయుదము? ఎచ్చటకు పోయెదము? ఏమి కానున్నది? సామర్థ్యమును పొందిన ఈ దుష్టుడు మనలను ఏయే కష్టములకు గురిచేయనున్నాడో! (30) ఈ విధముగా దుఃఖముతో నిండిన మనస్సులుగల ఇంద్రాది దేవతలు మరియు మునులు కంగారుపడి అప్పుడు నారదుని ఆహ్వానించి ఇట్లు ప్రశ్నించిరి (31).

దేవా ఊచుః |

సర్వం కార్యం సమర్థో%సి కర్తుం త్వం మునిసత్తమ | ఉపాయం కురు దేవర్షే దేవానాం దుఃఖనాశ##నే || 32

రావణో%యం మహాదుష్టః కిం కిం నైవ కరిష్యతి | క్వ యాస్యామో వయం చాత్ర దుష్టేనాపీడితా వయమ్‌ || 33

దేవతలు ఇట్లు పలికిరి-

ఓ మహర్షీ! నీవు సర్వకార్యములను చక్కబెట్టగల సమర్థుడవు. ఓ దేవర్షీ! దేవతల దుఃఖమును పోగొట్టే ఉపాయమును చేయుము (32). మహాదుర్మార్గుడగు ఈ రావణుడు చేయజాలని అకార్యము ఏమి గలదు? ఇప్పుడు ఇచట ఉన్న మేము ఆ దుష్టునిచే పీడించబడి ఎచ్చటకు పోగలము? (33)

నారద ఉవాచ |

దుఃఖం త్యజత భో దేవా యుక్తిం కృత్వా చ యామ్యహమ్‌ | దేవకార్యం కరిష్యామి కృపయా శంకరస్య వై || 34

నారదుడు ఇట్లు పలికెను-

ఓ దేవతలారా! దుఃఖమును విడిచి పెట్టుడు. నేను యుక్తిని పన్ని వెళ్లెదను. శంకరుని అనుగ్రహముచే దేవకార్యమును చక్కబెట్టగలను (34).

సూత ఉవాచ |

ఇత్యుక్త్వా స తు దేవర్షిరగమద్రావణాలయమ్‌ | సత్కారం సమనుప్రాప్య ప్రీత్యోవాచాఖిలం చ తత్‌ || 35

సూతుడు ఇట్లు పలికెను-

ఆ దేవర్షి ఇట్లు పలికి రావణుని గృహమునకు వెళ్లెను. ఆయన అచట సమస్తసత్కారములను పొంది ఆనందముతోనిట్లనెను (35).

నారద ఉవాచ |

రాక్షసోత్తమ ధన్యస్త్వం శైవవర్యస్తపోమనాః | త్వాం దృష్ట్వా చ మనో మే%ద్య ప్రసన్నమతి రావణ || 36

స్వవృత్తం బ్రూహ్యశేషేణ శివారాధనసంభవమ్‌ | ఇతి వృష్టస్తదా తేన రావణో వాక్యమబ్రవీత్‌ || 37

నారదుడు ఇట్లు పలికెను-

ఓ రాక్షసశ్రేష్ఠా! శివభక్తాగ్రగణ్యుడవు, తపస్సునందు గొప్ప శ్రద్ధ గలవాడవు అగు నీవు ధన్యుడవు. ఓ రావణా! ఈనాడు నిన్ను చూచి నా మనస్సు అతిశయించిన ప్రసన్నతను పొందుచున్నది (36). నీవు శివుని ఆరాధించినావు. దాని ఫలమును మరియు నీయొక్క ఇతరవృత్తాంతమును సమగ్రముగా చెప్పుము అని నారదుడు అడుగగా, అప్పుడు రావణుడు ఇట్లు పలికెను (37).

రావణ ఉవాచ |

గత్వా మయా తు కైలాసే తపోర్థం చ మహామునే | తత్రై వ బహుకాలం వై తపస్తప్తం సుదారుణమ్‌ || 38

యదా న శంకరస్తుష్టస్తతశ్చ పరివర్తితమ్‌ | ఆగత్య వృక్షఖండే వై పునస్తప్తం మయా మునే || 39

గ్రీష్మే పంచాగ్నిమధ్యే తు వర్షాసు స్థండిలేశయః | శీతే జలాంతరస్థో హి కృతం చైవ త్రిధా తపః || 40

ఏవం మయా కృతం తత్ర తపోత్యుగ్రం మునీశ్వర | తథాపి శంకరో మహ్యం న ప్రసన్నో%భవన్మనాక్‌ || 41

తదా మయా తు క్రుద్ధేన భూమౌ గర్తం విధాయ చ | తత్రాగ్నిం సమాధాయ పార్థివం చ ప్రకల్ప్యచ || 42

గంధైశ్చ చందనైశ్చైవ ధూపైశ్చ వివిధైస్తథా | నైవేద్యైః పూజితశ్శంభురారార్తికవిధానతః || 43

ప్రణిపాతైః స్తవైః పుణ్యౖస్తోషితశ్శంకరో మయా | గీతైర్నృత్యైశ్చ వాద్యైశ్చ ముఖాంగులిసమర్పణౖః || 44

రావణుడు ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! నేను తపస్సును చేయుటకొరకై కైలాసమునకు వెళ్లి అచటనే చిరకాలము అత్యంతదారుణమైన తపస్సును చేసితిని (38). ఓ మునీ! కాని శంకరుడు ప్రసన్నుడు కాలేదు. అప్పుడు నేను స్థలమును మార్చి హిమాలయమునందు దట్టమగు వృక్షములు గల స్థానమునకు వచ్చి అచట మరల తపస్సును చేసితిని (39). వేసవికాలమునందు ఐదు అగ్నుల మధ్యయందు, వర్షాకాలమునందు నేలపైన, శీతకాలమునందు నీటిలోపల ఉండి, ఈ విధముగా మూడు రకముల తపస్సును చేసితిని (40). ఓ మహర్షీ! ఈ విధముగా నేను అచట మిక్కిలి ఉగ్రమైన తపస్సును చేసితిని. కాని శంకరుడు నాపై లేశ##మైనను ప్రసన్నుడు కాలేదు (41). నేను అప్పుడు కోపించి నేలలో గోతిని చేసి దానియందు అగ్నిని స్థాపించి పార్థివలింగమును నిర్మించి (42), చందనగంధములు, వివిధధూపములు మరియు నైవేద్యములతో శంభుని దీపములను నిరంతరముగా హారతినిస్తూ ఆరాధించితిని (43). నమస్కారములు, పుణ్యస్తోత్రములు, పాటలు, నాట్యములు, వాద్యములు మరియు నోటియందు వ్రేళ్లను ఉంచి వివిధముద్రలను ప్రదర్శించుట అనే ఉపచారములతో శంకరుని సంతోషపెట్టితిని (44).

ఏతైశ్చ వివిధైశ్చాన్యైరూపాయైర్భూరిభిర్మునే | శాస్త్రోక్తేన విధానేన పూజితో భగవాన్‌ హరః || 45

న తుష్టస్సమ్ముఖో జాతో యదా చ భగవాన్‌ హరః | తదాహం దుఃఖితో%భూవం తపసో%ప్రాప్య సత్ఫలమ్‌ || 46

ధిక్‌ శరీరం బలం చైవ ధిక్‌ తపఃకరణం మమ | ఇత్యుక్త్వా తు మయా తత్ర స్థాపితే%గ్నౌ హుతం బహు || 47

పునశ్చేతి విచార్యైవ త్యక్ష్యామ్యగ్నౌ నిజాం తనుమ్‌ | సం ఛిన్నాని శిరాంస్యేవ తస్మిన్‌ ప్రజ్వలితే శుచౌ || 48

సుచ్ఛిత్వైకైకశస్తాని కృత్వా శుద్ధాని సర్వశః | శంకరాయార్పితాన్యేవ నవసంఖ్యాని వై మయా || 49

యావచ్చ దశమం ఛేత్తుం ప్రారబ్ధమృషిసత్తమ | తావదావిరభూత్తత్ర జ్యోతీరూపో హరస్స్వయమ్‌ || 50

మా మేతి వ్యాహరత్‌ ప్రీత్యా ద్రుతం వై భక్తవత్సలః | ప్రసన్నశ్చ వరం బ్రూహి దదామి మనసేప్సితమ్‌ || 51

ఓ మునీ! అవియే గాక, ఇతరములగు వివిధోపచారములచే శాస్త్రోక్తవిధానమును పాటిస్తూ హరభగవానుని పూజించితిని (45). కాని హరభగవానుడు సంతోషించి దర్శనమునీయలేదు. అప్పుడు నేను తపస్సుయొక్క సత్ఫలమును పొందజాలక దుఃఖితుడనైతిని (46). నా శరీరమునకు, బలమునకు, నాచే చేయబడిన తపస్సునకు నింద యగుగాక! అని పలికి నేను అచట అగ్నిని స్థాపించి చిరకాలము హోమమును చేసితిని (47). నేను నా దేహమును అగ్నిలో పారవైచెదను. తలలను నరికి ప్రజ్వలించే అగ్నిలో హోమము చేసెదను అని మరల తలపోసి (48), తొమ్మిది తలలను క్రమముగా ఒక్కొక్కటిగా చక్కగా నరికి వాటిని అన్ని విధములుగా శుద్ధి చేసి శంకరునకు అర్పించితిని (49). ఓ మహర్షీ! నేను పదవ తలను నరకబోవుచుండగా, అప్పుడు శివుడు స్వయముగా జ్యోతిస్సు రూపములో అచట ఆవిర్భవించెను (50). భక్తవత్సలుడగు శివుడు శీఘ్రమే వద్దు, వద్దని ప్రేమతో పలుకుతూ ప్రసన్నుడై, నీ మనస్సునకు నచ్చిన వరమును కోరుకొనుమని పలికెను (51).

ఇత్యుక్తే చ తదా తేన మయా దృష్టో మహేశ్వరః | ప్రణతస్సంస్తుతశ్చైవ కరౌ బద్ధ్వా సుభక్తితః || 52

తదా వృతం మయైతచ్చ దేహి మే హ్యతులం బలమ్‌ | యది ప్రసన్నో దేవేశ దుర్లభం కిం భ##వేన్మమ || 53

శివేన పరతుష్టేన సర్వం దత్తం కృపాలునా | మహ్యం మనోభిలషితం గిరా ప్రోచ్య తథాస్త్వితి || 54

అమోఘయా సుదృష్ట్వా వై వైద్యవద్యోజితాని మే | శిరాంసి సంధయిత్వా తు దృష్టాని పరమాత్మనా || 55

ఏవం కృతే తదా తత్ర శరీరం పూర్వవన్మమ | జాతం తస్య ప్రసాదాచ్చ సర్వం ప్రాప్తం ఫలం మయా || 56

తదా చ ప్రార్థితో మే సంస్థితోసౌ వృషభధ్వజః | వైద్యనాథేశ్వరో నామ్నా ప్రసిద్ధోభూజ్జగత్త్రయే || 57

దర్శనాత్పూజనాజ్జ్యోతిర్లింగరూపో మహేశ్వరః | భుక్తిముక్తిప్రదో లోకే సర్వేషాం హితకారకః || 58

జ్యోతిర్లింగమహం తద్వై పూజయిత్వా విశేషతః | ప్రణిపత్యాగతాశ్చాత్ర విజేతుం భువనత్రయమ్‌ || 59

అపుడు ఆయన అట్లు పలుకగానే నేను మహేశ్వరుని దర్శించి చేతులను జోడించి నమస్కరించి పరమభక్తితో చక్కగా స్తుతించితిని (52). ఓ దేవదేవా! నీవు ప్రసన్నుడవైనచో నాకు దుర్లభము ఏమి ఉండును? నాకు సాటిలేని బలమునిమ్ము అని అప్పుడు నేను కోరితిని (53). దయానిధియగు శివుడు మిక్కిలి సంతోషించి అటులనే యగుగాక! అని పలికి, నా మనస్సులోని కోరికను నెరవేర్చెను (54) ఆ పరమాత్మ వైద్యునివలె నా శిరస్సులను అతికించి అమోఘమగు దయాదృష్టితో వాటిని చూచెను (55). ఆయన అట్లు చేయగానే, ఆయనయొక్క అనుగ్రహముచే నా శరీరము పూర్వమునందు వలనే దృఢముగనుండెను. నేను సమగ్రమగు ఫలమును పొందితిని (56). అప్పుడు నేను ప్రార్థించగా ఆ వృషభధ్వజుడు అచటనే స్థిరముగా నుండి, ముల్లోకములలో వైద్యనాథేశ్వరుడను పేర ప్రసిద్ధిని గాంచెను (57). లోకములోని సర్వులకు హితమును చేయు ఆ మహేశ్వరుడు జ్యోతిర్లింగ రూపమును దాల్చి, దర్శించి పూజించువారలకు భుక్తిని మరియు ముక్తిని ఇచ్చుచున్నాడు (58). నేను ఆ జ్యోతిర్లింగమును విశేషముగా పూజించి ప్రణమిల్లి ముల్లోకములను జయించుటకై ఇచటకు వచ్చియుంటిని (59).

సూత ఉవాచ |

తదీయం తద్వచశ్శ్రుత్వా దేవర్షిర్జాతసంభ్రమః | విహస్య చ మనస్యేవ రావణం నారదో%బ్రవీత్‌ || 60

సూతుడు ఇట్లు పలికెను-

దేవర్షియగు నారదుడు వాని ఆ మాటలను విని కంగారుపడి మనస్సులోపల మాత్రమే నవ్వుకొని ఆ రావణునితోనిట్లనెను (60).

నారద ఉవాచ |

శ్రూయతాం రాక్షసశ్రేష్ఠ కథయామి హితం తవ | త్వయా తదేవ కర్తవ్యం మదుక్తం నాన్యథా క్వచిత్‌ || 61

త్వయోక్తం యచ్ఛివేనైవ హితం దత్తం మమాధునా | తత్సర్వం చ త్వయా సత్యం న మంతవ్యం కదాచన || 62

అయం వై వికృతి ప్రాప్తః కిం కిం నైవ బ్రవీతి చ | సత్యం నైవ భ##వేత్తద్వై కథం జ్ఞేయం ప్రియోస్తి మే || 63

ఇతి గత్వా పునః కార్యం కురు త్వం స్వహితాయ వై | కైలాసోద్ధరణ యత్నః కర్తవ్యశ్చ త్వయా పునః || 64

యది చైవోద్ధృతశ్చాయం కైలాసో హి భవిష్యతి | తదైవ సఫలం సర్వం భవిష్యతి న సంశయః || 65

పూర్వవత్‌ స్థాపయిత్వా త్వం పునరాగచ్ఛ వై సుఖమ్‌ | నిశ్చయం పరమం గత్వా యథేచ్ఛసి తథా కురు || 66

నారదుడు ఇట్లు పలికెను-

ఓ రాక్షసరాజా! నీకు హితమును చెప్పెదను వినుము. నీవు నేను చెప్పిన విధముగా మాత్రమే చేయుము. ఏ సమయములోనైననూ దానికి భిన్నముగా చేయవలదు (61). శివుడు నేను కోరిన దానిని నాకు ఇచ్చినాడని నీవు ఇప్పుడే నాకు చెప్పితివి. అది అంతయూ సత్యమని నీవు ఎన్నటికైననూ తలంచవలదు (62). ఈ శివుడు వికారమును పొందియున్నాడు. ఆయన పలుకని పలుకులు ఏవి గలవు? ఆ పలుకులు సత్యము కానేకావు. ఈ విషయమును తెలియుట ఎట్లు? నీవు నాకు ప్రియుడవు (63). కావున నీవు మరల వెళ్లి స్వీయహితమును గోరి ఇట్లు చేయుము. నీవు కైలాసమును పైకి ఎత్తే ప్రయత్నమును చేయుము (64). నీవు కైలాసమును పైకి ఎత్తగలిగినప్పుడు మాత్రమే సర్వము సఫలము కాగలదు. దీనిలో సందేహము లేదు (65). దానిని ఎత్తిన తరువాత మరల యథాస్థానములో ఉంచి మనస్సులో నీ బలమును గురించి స్థిరమగు నిశ్చయమును పొందిన వాడవై సుఖముగా తిరిగి రమ్ము. నీకు తోచినట్లు చేయుము (66).

సూత ఉవాచ |

ఇత్యుక్తస్స హితం మేనే రావణో విధిమోహితః | సత్యం మత్వా మునేర్వాక్యం కైలాసమగమత్తదా || 67

గత్వా తత్ర సముద్ధారం చక్రే తస్య గిరేస్స చ | తత్రస్థం చైవ తత్సర్వం విపర్యస్తం పరస్పరమ్‌ || 68

గిరీశోపి తదా దృష్ట్వా కిం జాతమితి సో%బ్రవీత్‌ | గిరిజా చ తదా శంభుం ప్రత్యువాచ విహస్య తమ్‌ || 69

సూతుడు ఇట్లు పలికెను-

నారదుడు ఇట్లు పలుకగా, దైవముచే మోహితుడైయున్న రావణుడు ఆ మునియొక్క వాక్యమును సత్యమని తలచి అపుడు కైలాసమునకు వెళ్లెను (67). అచటకు వెళ్లి ఆతడు ఆ పర్వతమును పైకి ఎత్తెను. దానియందు ఉన్న సర్వపదార్థములు ఒకదానిపై మరియొకటి పడి సర్వము తల్లక్రిందులు ఆయెను (68). ఆ పరమేశ్వరుడు దానిని చూచి 'ఏమైనది?' అని పలికెను. అప్పుడు పార్వతి నవ్వి ఆయనతో నిట్లనెను (69).

గిరిజోవాచ |

సచ్ఛిష్యస్య ఫలం జాతం సమ్యగ్జాతం తు శిష్యతః | శాంతాత్మనే సువీరాయ దత్తం యదతులం బలమ్‌ || 70

పార్వతి ఇట్లు పలికెను-

మంచి శిష్యుడు ఉన్నందులకు ఫలము దక్కినది. శిష్యుడు చక్కగా చేసినాడు. ఏలయన, నీవు శాంత స్వభావముగల గొప్ప వీరుడైన శిష్యునకు సాటిలేని బలమును ఇచ్చియుంటివి (70).

సూత ఉవాచ |

గిరిజాయాశ్చ సాకూతం వచశ్శ్రుత్వా మహేశ్వరః | కృతఘ్నం రావణం మత్వా శశాప బలదర్పితమ్‌ || 71

సూతుడు ఇట్లు పలికెను-

పార్వతీదేవి వెటకారముగా పలికిన పలుకులను విని మహేశ్వరుడు, బలమును పొంది గర్వించియున్న ఆ రావణుడు కృతఘ్నుడని తలపోసి ఆతనిని శపించెను (71).

మహాదేవ ఉవాచ |

రే రే రావణ దుర్భక్త మా గర్వం వహ దుర్మతే | శీఘ్రం చ తవ హస్తానాం దర్ఫఘ్నశ్చ భ##వేదిహ || 72

మహాదేవుడు ఇట్లు పలికెను-

ఓరీ రావణా! దుష్టభక్తా! దుర్బుద్ధీ! గర్వమును పొందకుము. నీ చేతుల దర్పమును అడంచువాడు ఈ లోకములో తొందరలోనే ఉదయించగలడు (72).

సూత ఉవాచ |

ఇతి తత్ర చ యజ్జాతం నారదశ్శ్రుతవాంస్తదా | రావణో%పి ప్రసన్నాత్మా%గాత్స్వధామ యథాగతమ్‌ || 73

నిశ్చయం పరమం కృత్వా బలీ బలవిమోహితః | జగద్వశం హి కృతవాన్‌ రావణః పరదర్పహాః || 74

శివాజ్ఞయా చ ప్రాప్తేన దివ్యాస్త్రేణ మహౌజసా | రావణస్య ప్రతి భటో నాలం కశ్చిదభూత్తదా || 75

ఇత్యేతచ్చ సమాఖ్యాతం వైద్యనాథేశ్వరస్య చ | మాహాత్మ్యం శృణ్వతాం పాపం నృణాం భవతి భస్మసాత్‌ || 76

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్యవర్ణనం నామ అష్టావింశో%ధ్యాయః (28).

సూతుడు ఇట్లు పలికెను-

ఈ విధముగా అక్కడ జరిగిన వృత్తాంతమును అపుడు నారదుడు వినెను. రావణుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై వచ్చిన దారిన తన నివాసమునకు వెళ్లెను (73). బలశాలి, శత్రువుల దర్పమును అడంచువారు అగు ఆ రావణుడు తన బలమును గురించి దృఢమగు నిశ్చయమును పొందినవాడై ఆ బలముచే వ్యామోహమును పొంది జగత్తును తన ఆధీనము చేసుకొనెను (74). మహాతేజశ్శాలియగు రావణుడు శివుని ఆజ్ఞచే దివ్యమగు అస్త్రమును సంపాదించుటచే, ఆ కాలములో ఆతనితో పోటీ పడగలవాడు ఒక్కడైననూ లేకుండెను (75). ఈ విధముగా వైద్యనాథేశ్వరుని మాహాత్మ్యమును చక్కగా చెప్పితిని. దీనిని విన్న మానవుల పాపము భస్మమగును (76).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్రసంహితయందు వైద్యనాథ జ్యోతిర్లింగ మాహాత్మ్యవర్ణనమనే ఇరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (28).

Siva Maha Puranam-3    Chapters