Siva Maha Puranam-3    Chapters   

అథ పంచవింశో%ధ్యాయః

గౌతముని ప్రాయశ్చిత్తము

సూత ఉవాచ|

కదాచిద్గౌతమేనైన జలార్థం ప్రేషితా నిజాః | శిష్యాస్తత్ర గతా భక్త్వా కమండలుకరా ద్విజాః || 1

శిష్యాన్‌ జలసమీపే తు గతాన్‌ దృష్ట్వా న్య షేధయన్‌ | జలార్థమాగతాంస్తత్ర చర్షిపత్న్యో ప్యనేకశః ||

ఋషిపత్న్యో వయం పూర్వం గ్రహీష్యాయో విదూరతః | పశ్చాచ్చైవ జలం గ్రాహ్యమిత్యేవం పర్య భర్త్సయన్‌ || 3

పరావృత్య తదా తైశ్చ ఋషిపత్న్యై నివేదితమ్‌ | సా చాపి తాన్‌ సమాదాయ సమాశ్వాస్య చ తైస్స్వయమ్‌ || 4

జలం నీత్వా దదౌ తసై#్మ గౌతమాయ తపస్వినీ | నిత్యం నిర్వాహయామాస జలేన ఋషిసత్తమః || 5

తాశ్చైవమృషిపత్న్యస్తు క్రుద్ధాస్తాం పర్యభర్త్సయన్‌ | పరావృత్య గతాస్పర్వాస్తూటజాన్‌ కుటిలాశయాః || 6

స్యామ్యగ్రే విపరీతం చ తద్వృత్తం నిఖిలం తతః | దుష్టాశయా భిః స్త్రీ భిశ్చ తాభిర్వై విని వేదితమ్‌ ||

అథ తాసాం వచశ్శ్రత్వా భావికర్మవశాత్తదా| గౌతమాయ చ సంక్రుద్ధాశ్చాసంస్తే పరమర్షయః ||

విఘ్నార్థం గౌతమసై#్యవ నానా పుజోపహారకైః | గణశం పూజయామా సుస్సంక్రుద్ధాస్తే కుబుద్ధయః || 9

అవిర్భభూవ చ తదా ప్రసన్నో హి గణశ్వరః ఉవాచ వచనం తత్ర భక్తాధీనః ఫలప్రదః || 10

సూతుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా! ఒకనాడు గౌతముడు నీటికొరకై తన శిష్యులను అచటకు పంపించెను. వారు కమండలమును చేతబట్టి భక్తితో వెళ్లిరి(1). నీటికొరకై అచట జలాశయసమీపమునకు వెళ్లిన శిష్యులను చూచి ఋషుల భార్యలు అనేక విధములు గా నిషేధించిరి (2) ఋషిభార్యలమగు మేము ముందుగా నీటిని తీసుకొనెదము. మీరు దూరముగా నుండుడు. మీరు తరవాత తీసుకొనుడు అని ఈ విధముగా వారిని బెదిరించిరి (3). వారు వెనుకకు తిరిగి వచ్చి ఋషిభార్యయగు అహల్యకు విన్నవించిరి. ఆమె వారిని ఓదార్చి వారిని దొడ్కొని తాను అచటకు వెళ్ళెను (4). ఆ తపశ్శాలి ని నీటిని తెచ్చి గౌతమునకు ఈయగా, ఆమహర్షి తన నిత్యకర్మను పూర్తిచేసెను (5). వక్రబుద్ధిగల ఇతర ఋషిపత్నులందరు కోపించి ఆమెను బెదరించి తమ కుటీరులకు మరలివెళ్ళిరి (6). దుర్బద్ధి గల ఆ స్త్రీలు తరువాత తమ భర్తలయొదుట ఆ వృత్తాంతమునంతనూ సత్యవిరుద్ధముగా విన్నవించిరి(7). అప్పుడు ఆ మహర్షులు వారి మాటలను విని దైవవశముచే గౌతమునిపై మిక్కిలి కోపించిరి (8). అధికకోపముచే చెడిన బుద్ధిగల ఆ ఋషులు గౌతమునకు విఘ్నమును కలిగించుటకై వివిధోపచారములతో విఘ్నేశ్వరుని పూజించిరి (9). అపుడు భక్తులకు వశుడై ఫలములనిచ్చే విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై అచట సాక్షాత్కరించి ఇట్లు పలికెను (10).

గణశ ఉవాచ|

ప్రసన్నో%స్మి వరం బ్రూత యూయం కిం కరవాణ్యహమ్‌ | తదీయం తద్వచశ్శ్రు త్వా ఋషయస్తే %బ్రువంస్తదా|| 11

గణశుడు ఇట్లు పలికెను-

నేను ప్రసన్నుడనైతిని, మీరు వరమును కోరుకొనుడు. నేను చేయదగిన పనియేది? ఆయన యొక్క ఆ మాటలను విని అపుడా ఋషులు ఇట్లు పలికిరి (11)

ఋషయ ఊచుః |

త్వయా యది వరో దేయో గౌతమస్స్వా శ్రమాద్భహిః | నిష్కాస్యనో ఋషిభిః పరిభర్త్సతథా కురు|| 12

ఋషులు ఇట్లు పలికిరి-

నీవు వరమును ఈయదలచినచో, గౌతముని మా ఋషులు నిందించి ఆతని ఆశ్రమమునుండి వెళ్ల గొట్టునట్లు చేయుము (12).

స ఏవం ప్రార్థితసై#్తస్తు విహస్య వచనం పునః | ప్రావాచేభముఖః ప్రీత్యా బోధయంస్తాన్‌ సతాం గతిః || 13

సూతుడు ఇట్లు పలికెను-

వారు ఇట్లుకోరగా, సత్పురుషులకు శరణ్యుడగు గణశుడు నవ్వి వారికి ప్రేమతో భోదిస్తూ మరల ఇట్లు పలికెను(13).

గణశ ఉవాచ|

శ్రూయతామృషయస్సర్వే యుక్తం న క్రియతే% ధునా | అపరాధం వినా తసై#్మ క్రుధ్యతాం హనిరేవ చ || 14

ఉపస్కృతం పురా యస్తుతేభ్యో దుఃఖం హితం నహి | యదా చదీయతే దుఃఖం తదా నాశో భ##వేదిహ || 15

ఈదృశం చ తపః కృత్వా సాధ్యతే ఫలముత్తమమ్‌ | శుభం ఫలం స్వయం హిత్వా సాధ్యతే నాహితంపునః || 16

గణశుడు ఇట్లు పలికెను-

ఓ ఋషులారా! మీరు అందరు వినుడు. మీరు చేయబూనిన పని యోగ్యమైనదికాదు. అపరాధము లేకుండగనే ఇతరులపై కోపించువారికి నిశ్చయముగా హాని కలుగును (14). పూర్వమునందు ఉపకారము చేసిన వారికి దుఃఖమును కలిగించుట క్షేమకరము కాదు. అట్టివారికి దుఃఖమును కలిగించు వారు ఈ జన్మలోననే వినాశమును పొందెదరు(15). ఇంతటి తపస్సును చేసి మీరు ఉత్తమమగు ఫలమును సాధించవలెను. తమంత తాముగా శుభఫలమును విడిచిపెట్టి అహితమును వివేకులు కోరుకొనరు (16).

సూత ఉవాచ|

ఇత్యేవం వచనం శ్రుత్వా తస్యతే మునిసత్తమాః| బుద్ధిమోహం తదా ప్రాప్తా ఇదమేవ వచో% బ్రువన్‌ || 17

సూతుడు ఇట్లు పలికెను-

ఆ మహర్షులుఆయన యొక్క ఈ మాటను వినియు బుద్ధియందు మోహమును పొందియున్నవారు అగుటచే మరల అదే విధముగానిట్లు పలికిరి (17)

ఋషయ ఊచుః |

కర్తవ్యం హి త్వయా స్వామిన్నిదమేవ నవ చాన్యథా | ఇత్యుక్తస్తు తదా దేవో గణశో వాక్యమబ్రవీత్‌ || 18

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ ప్రభూ! నీవు మాకు చేసి పెట్టవలసిన పని ఇదియే. మరియొకటి లేదు. వారు ఇట్లు పలుకగా అప్పుడు గణశ##దేవుడు ఇట్లు పలికెను(18).

గణశ ఉవాచ|

అసాధుస్సాధుతాం చైవ సాధుశ్చాసాధుతాం తథా | కదాచిదపి నాప్నోతి బ్రహ్మోక్తమితి నిశ్చితమ్‌|| 19

యదా చ భవతాం దుఃఖం జాతం చానశనాత్పురా| తదా సుఖం ప్రదత్తం వై గౌతమేన మహర్షిణా || 20

ఇదానీం వై భవద్భిశ్చ తసై#్మ దుఃఖం ప్రదీయతే| నైతద్యుక్తతమం లోకే సర్వథా సువిచార్యతామ్‌ ||21

స్త్రీ బలాన్మోహితా యూయం నమే వాక్యం కరిష్యథ | ఏతద్ధితతమం తస్య భవిష్యతి న సంశయః || 22

పునశ్చాయమృషిశ్రేష్ఠో దాస్యతే వస్సుఖం ధ్రువమ్‌ | తారణం న చ యుక్తం స్యాద్వరమన్యం వృణీతవై || 23

గణశుడు ఇట్లు పలికెను-

అసాధువు సాధువుగను, సాధువు అసాధువుగను ఎన్నటికీ మారడని బ్రహ్మచెప్పిన మాట యథార్థము(19). పూర్వము మీకు తిండి లేక దుఃఖము కలిగినప్పుడు గౌతమమహర్షి మీకు సుఖమును కలిగించినాడు(20). ఇపుడు మీరు ఆయనకు దుఃఖమును ఇచ్చుచున్నారు. ఈ లోకములో ఇది ఏ విధముగనైననూ తగని పని. బాగుగా ఆలోచించుకొనుడు(21). మీరు స్త్రీలకు లొంగిపోయి మోహమును పొందినవారై నామాటను లెక్క చేయకున్నారు. ఇది నిస్సందేహముగా ఆయనకు మరింత హితమును కలిగించును(22). ఈ మహర్షి మరల మీకు సుఖమును మాత్రమే ఈయగలడు. ఇది నిశ్చయము. ఇట్టి మోసము తగదు. మరియొక వరమును కోరుకొనుడు(23).

సూత ఉవాచ!

ఇత్యేవం వచనం తేన గణశేన మహాత్మనా | యద్యప్యుక్తమృషిభ్యశ్‌ తదప్యేతే న మేనిరే || 24

భక్తాధీనతయా సో%థ శివపుత్రో%బ్రవీత్తదా | ఉదాసీనేన మనసా తానృషీన్‌ దుష్టశేముషీన్‌|| 25

సూతుడు ఇట్లు పలికెను-

మహాత్ముడగు ఆ గణశుడు ఈ విధముగా ఎంత చెప్పిననూ ఆ ఋషులు ఆయన మాటను లెక్క చేయలేదు(24). అప్పుడు శివపుత్రుడగు గణశుడు భక్తులకు వశుడైనవాడు అగుటచే ఉదాసీనమగు మనస్సు గలవాడై దుర్బుద్ధిగల ఆ ఋషులతో నిట్లనెను(25).

గణశ ఉవాచ|

భవద్భిఃప్రార్థ్యతే యచ్చ కరిష్యే%హం తథా ఖలు | పశ్చాద్భావి భ##వేదేవ ఇత్యుక్త్వాంతర్దధే పునః || 26

గౌతమస్స న జానాతి మునీనాం వై దురాశయమ్‌ | ఆనందమనసా నిత్యం పత్న్యా కర్మ చకార తత్‌ || 27

తదంతరే చ యజ్జాతం చరితం వరయోగతః | తద్దుష్టర్షి ప్రభావాత్తు శ్రూయతాం తన్మునీశ్వరాః || 28

గౌతమస్య చ కేదారే తత్రాసన్‌ వ్రీహయో యవాః | గణశస్తత్ర గౌర్భుత్వా జగామ కిల దుర్బలా|| 29

కంపమానా చ సా గత్వా తత్ర తద్వరయోగతః | వ్రీహీన్‌ సంభక్షయామాస యవాంశ్చ మునిసత్తమాః || 30

ఏతస్మిన్నంతరే దైవాద్గౌతమస్తత్ర చాగతః | సదయాలుస్తృణస్తంబైర్వారయామాస తాం తదా|| 31

తృణస్తంబేన సా స్పృష్టా పపాత పృథివీతలే | మృతా చ తత్‌క్షణాదేవ తదృషేః పశ్యతస్తదా||32

ఋషయశ్ఛన్నరూపాస్తే ఋషిపత్న్యస్తథాశుభాః | ఊచుస్తత్ర తదా సర్వే కిం కృతం గౌతమేన చ || 33

గౌతమో%పి తదాహల్యా మాహూయాసీత్సువిస్మితః | ఉవాచ దుఃఖతోవిప్రా దూయమానేన చేతసా || 34

గణశుడు ఇట్లు పలికెను-

మీరు కోరిన విధముగనే నేను చేసెదను. ఆపైన జరుగవలసినది జరుగును అని పలికి ఆయన అంతర్థానమును చెందెను (26). ఆ మునుల దుర్భుద్ధిని గురించి తెలియని గౌతముడు ఆనందముగా భార్యతోగూడి నిత్య కర్మలను చేయుచుండెను (27) ఓ మహర్షులారా ! ఇంతలో ఆ దుష్టులగు ఋషులు తపస్సును చేసి పొందిన వరము యొక్క ప్రభావము చే జరిగిన వృత్తాంతమును వినుడు (28). గౌతముని పంటపొలములో వరి, యవలు అను ధాన్యముల పంటలు ఉండెను. గణశుడు బక్కచిక్కిన ఆవు రూపములో ఆచటకు వచ్చెను (29). ఓ మహర్షులారా! గణశుని వరప్రభావముచే ఆ ఆవు అచట వణికిపోతూ తినుచుండెను (30). ఇంతలో దైవశమున దయాహృదయుడగు గౌతముడు అచటకు వచ్చి అపుడు దానిని గడ్డిపోచలతో తోలివేయుటకు యత్నించెను (31). ఆ ఆవు గడ్డిపోచ తగలగానే నేలపై బడి ఆ ఋషి చూచుచుండగనే ఆదే క్షణములో మరణించెను (32). అచటనే దాగియున్న ఋషులు, మరియుఅశుభబుద్ధిగల వారి భార్యలు అందరు, గౌతముడు ఎట్టి పనిని చేసినాడు? అని పలికిరి(33). ఓ బ్రాహ్మణులారా! గౌతముడు కూడ మిక్కిలి ఆశ్చర్యమునుపొంది అహల్యను పిలిచి కలుషితమైన మనస్సు గలవాడై దుఃఖముతోనిట్లు పలికెను(34)

గౌతమ ఉవాచ|

కిం జాతం చ కథం దేవి కుపితః పరమేశ్వరః | కిం కర్తవ్యం క్వ గంతవ్యం హత్యా చ సముపస్థితా|| 35

గౌతముడు ఇట్లు పలికెను-

ఓ దేవి! ఏమి జరిగింది?ఎట్లు జరిగినది?పరమేశ్వరుడు కోపించినాడు ఏమి చేయవలెను? ఎచటకు పోవలెను? గోహత్య సంప్రాప్తమైనది(35).

సూత ఉవాచ|

ఎతస్మిన్నంతరే విప్రా గౌతమం పర్యభర్త్సయన్‌ | విప్రపత్న్యస్తథాహల్యాం దుర్వచోభిర్వ్యథాం దదుః || 36

దుర్బుద్ధయశ్చ తచ్ఛిష్యాస్సుతాస్తేషాం తథైవ చ | గౌతమం పరిభ##ర్త్స్యైవ ప్రత్యూచుర్ధిగ్వచో ముహుః || 37

సూతుడు ఇట్లు పలికెను-

ఇంతలో ఆ బ్రాహ్మణులు గౌతముని నిందించి పీడించిరి. వారి భార్యలు కూడ అహల్యకు చెడు మాటలతో దుఃఖమును కలిగించిరి(36). దుష్టబుద్ధులగు వారి శిష్యులు మరియు పుత్రులు కూడ గౌతముని పలుమార్లు బెదిరిస్తూ నిందావచనములను పలికిరి(37).

ఋషయ ఊచుః

ముఖం న దర్శనీయం తే గమ్యతాం గమ్యతామితి | దృష్ట్వా గోఘ్నముఖం సద్యస్సచైలం స్నామాచరేత్‌ || 38

యావదేవా శ్రమమధ్యే త్వం తావదేవ హవిర్భుజః | పితరశ్చ న గృహ్ణంతి హ్యస్మద్దత్తం హి కించన|| 39

తస్మాద్గచ్ఛాన్యతస్త్వం చ పరివారసమన్వితః | విలంబం కురునైవ త్వం ధేనుహన్‌ పాపకారక|| 40

ఋషులు ఇట్లు పలికిరి-

నీ ముఖమును చూడరాదు. పొమ్ము, పొమ్ము. గోహంతుకుని ముఖమును చూచినచో కట్టుబట్టలతో స్నానమును చేయవలెను( 38). నీవు ఆశ్రమమునకు మధ్యలో ఉన్నంతవరకు దేవతలు మరియు పితృదేవతలు మేము ఇచ్చే హవిస్సులను వేటినీ స్వీకరించరు(39). కావున నీవు కుటుంబముతో సహా మరియొక చోటికి వెళ్లిపొమ్ము. గోవును సంహరించిన ఓపాపీ! ఏ మాత్రమైన ఆలస్యమును చేయకుము(40).

సూత ఉవాచ|

ఇత్యుక్త్వా తే చ తం సర్వే పాషాణౖస్సమతాడయన్‌ | వ్యథాం దదురతీవాసై#్మ త్వహల్యాంచ దురుక్తిభిః 41

తాడితో భర్త్సితో దుష్టైర్గౌతమో గిరిమబ్రవీత్‌ | ఇతో గచ్ఛామి మునయో హ్యన్యత్ర నివసామ్యహమ్‌ || 42

ఇత్యుక్త్వా గౌతమస్తస్మాత్‌ స్థానాచ్చ నిర్గతస్తదా | గత్వా క్రోశం తదా చక్రే హ్యాశ్రమం తదనుజ్ఞయా|| 43

యావచ్చైవాభిశాపో వై తావత్కార్యం న కించన | న కర్మణ్య ధికారో%స్తి దైవే ప్రిత్ర్యే% థ వైదికే || 44

మాసార్థం చ తతో నీత్వా మునీన్‌ సంప్రార్థయత్తదా | గౌతమో మునివర్యస్స తేన దుఃఖేన దుఃఖితః || 45

సూతుడు ఇట్లు పలికెను-

వారందరు ఇట్లు పలికి ఆయనను రాళ్లతో కొట్టి చాల దుఃఖమును కలిగించిరి. అహల్యకు కూడ నిందావచనములతో వ్యథను కలిగించిరి(41). దుష్టులగు వారిచే కొట్టబడి పీడించబడిన గౌతముడు '' ఓమునులారా! నేను ఇక్కడనుండి వెళ్లిపోయెదను. మరియొకచోట నివసించెదను'' అని పలికెను (42). గౌతముడు ఇట్లు పలికి అపుడా స్థానమునుండి బయటపడి వారి అనుమతితో క్రోసు దూరములో ఆశ్రమమును కట్టుకొనెను(43). ఆ గోహత్యపాపము ఉన్నంతవరకు నీవు ఏ కర్మలనైనను చేయరాదు. దేవతలకు లేక పితరులకు సంబంధించిన వైదికకర్మలో నీకు అధికారము లేదు (44).గౌతమ మహర్షి ఈ విధముగా పదిహేను రోజులు గడిపి ఆ దుఃఖముచే పీడించబడినవాడై ఆ ఋషులను ఇట్లు ప్రార్థించెను(45).

గౌతమ ఉవాచ|

అనుకంప్యో భవద్భిశ్చ కథ్యతాం క్రియతే మయా| యథా మదీయం పాపం చ గచ్ఛత్వితి నివేద్యతామ్‌ || 46

గౌతముడు ఇట్లు పలికెను-

మీరు నాయందు దయను చూపుడు. నేను మీరు చెప్పినట్లు చేసెదను. నాపాపము తొలగిపోవు ఉపాయమును చెప్పుడు(46).

సూత ఉవాచ|

ఇత్యూక్తాస్తే తదా విప్రా నోచుశ్చైవ పరస్పరమ్‌ | అత్యంతం సేవయా పృష్టా మిలితా హ్యేకతః స్థితాః|| 47

గౌతమో దూరతః స్థిత్వా నత్వా తానృషిసత్తమాన్‌ | పప్రచ్ఛ వినయావిష్టః కిం కార్యం హి మయా ధువా|| 48

ఇత్యుక్తే మునినా తేన గౌతమేన మహాత్మనా| మిలితాస్సకలాస్తేవై మునయో వాక్యమబ్రువన్‌ || 49

సూతుడు ఇట్లు పలికెను-

గౌతముడు ఇట్లు పలుకగా, ఆ బ్రాహ్మణులు మిన్నకుండిరి. అప్పుడు గౌతముడు అతిశయించిన వినయముతో ప్రశ్నించగా, వారు ఒకరితోనొకరు కూడబలుకుకొని ఒకచోట గుమిగూడి నిలబడిరి (47). గౌతముడు దూరముగా నిలబడి అత్యంతవినయముతో ఆమహర్షులను, ఇప్పుడు నేను ఏమి చేయవలెను? అని ప్రశ్నించెను(48). మహాత్ముడగు ఆగౌతమహర్షి ఇట్లు పలుకగా, ఆ ఋషులందరు ఏకమై ఇట్లు పలికిరి(49).

ఋషయ ఊచుః|

నిష్కృతిర్హి వినా శుద్ధిర్జాయతే న కదాచన | తస్మాత్త్వం దేహశుద్ధ్యర్థం ప్రాయశ్చిత్తం సమాచర||50

త్రివారం పృథివీం సర్వాం క్రమ పాపం ప్రకాశయన్‌ | పునరాగత్య చాత్రై వ చర మాసవ్రతం తథా || 51

శతమే కోత్తరం చైవ బ్రహ్మణో%స్య గిరేస్తథా | ప్రక్రమణం విధాయైవం శుద్ధిస్తే చ భవిష్యతి || 52

అథవా త్వం సమానీయ గంగాస్నానం సమాచర | పార్థివానాం తథా కోటిం కృత్వా దేవం నిషేవయ|| 53

గంగాయాంచ తతస్న్యాత్వా పునశ్చైవ భవిష్యతి | పురా దశ తథా చైకం గిరేస్త్వం క్రమణం కురు|| 54

శతకుంభైస్తథా స్నాత్వా పార్థివం నిష్కృతిర్భవేత్‌ | ఇతి తైర్‌ ఋషిభిః ప్రాక్తస్తథేత్యోమితి తద్వచః || 55

పార్థివానాం తథా పూజా గిరేః ప్రక్రమణం తథా| కరిష్యామి మునిశ్రేష్ఠా ఆజ్ఞాయా శ్రీమతామిహ|| 56

ఇత్యుక్త్వా సర్షివర్యశ్చ కృత్వా ప్రక్రమణం గిరేః | పూజయామాస నిర్మాయ పార్థివాన్మునిసత్తమః || 57

అహల్యా చ తతస్సాధ్వీ తచ్చసర్వం చకారసా | శిష్యాశ్చ ప్రతిశిష్యాశ్చ చక్రుస్సేవాం తయోస్తదా|| 58

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయాం గౌతమ ప్రాయశ్చిత్తవర్ణనం నామ పంచవింశో%ధ్యాయః (25) .

ఋషులు ఇట్లు పలికిరి-

ఎప్పుడైననూ ప్రాయశ్చిత్తము లేనిదే పాపనిష్కృతి లేదు. కావున నీవు శరీరశుద్ధి కొరకై ప్రాయశ్చిత్తమును చేయుము(50). మూడు సార్లు భూమండలమునంతనూ పరిక్రమణము చేస్తూ నీ పాపమునుప్రకటించుము. ఆ తరువాత ఇచటకు మరలి వచ్చి నెలరోజుల వ్రతమును కూడ చేయుము(51). ఈ బ్రహ్మగిరికి నూట ఒక్క సార్లు ప్రదక్షిణము చేయుము. అపుడు నీకు శుద్ధి లభించగలదు(52). లేదా గంగనీటిని తెచ్చి స్నానము చేసి కోటి పార్థివశిలింగములను చేసి సేవించుము (53). తరువాత గంగలో స్నానము చేసి ఈ పర్వతమును పదకొండు సార్లు ప్రదక్షిణము చేసి (54), తరువాత పార్థివ లింగమునకు వంద కడవలతో అభిషేకించినచో నీకు పాపనిష్కృతి లభించును. ఆఋషులు ఇట్లు నిర్థేశించగా గౌతముడు సరేనని అంగీకరించెను(55). ఓ మహర్షులారా! శోభాయుక్తులగు మీ అనుమతితో పార్థివపూజను మరియు గిరిప్రదక్షిణమును చేయగలను(56). ఆ మహర్షి ఇట్లు పలికి గిరిప్రదక్షిణమును చేసి పార్థివలింగమును నిర్మించిపూజించెను(57). సాధ్వియగు అహల్య కూడ ఆ కార్యమునంతనూ చేసెను. వారి శిష్యులు తమ శిష్యులతో గూడి వారిద్దరినీ సేవించిరి(58).

శ్రీ శివమహాపురాణములోని కోటిరుద్రసంహితయందు గౌతమపాపనిష్కృతివర్ణనమనే ఇరువదియైదవ అధ్యాయము ముగిసినది(25).

Siva Maha Puranam-3    Chapters