Siva Maha Puranam-3    Chapters   

అథ త్రయోవింశో%ధ్యాయః

కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్యము

ఋషయ ఊచుః |

ఏవం వారాణసీ పుణ్యా యది సూత మహాపురీ | తత్ర్ప భావం వదాస్మాకమవిముక్తస్య చ ప్రభో || 1

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ సూతా! ప్రభూ! వారాణసీమహానగరము ఇంతటి పుణ్యప్రదమైనది గదా! దాని ప్రభావమును మరియు అవిముక్తుని మహిమను మాకు చెప్పుము (1).

సూత ఉవాచ |

వక్ష్యేసంక్షేపతస్సమ్యగ్వారాణస్యాస్సుశోభనమ్‌ | విశ్వేశ్వరస్య మాహాత్మ్యం శ్రూయతాం చ మునీశ్వరాః || 2

కదాచిత్పార్వతీ దేవీ శంకరం పరయా ముదా | లోకకామనయాపృచ్ఛన్మాహాత్మ్యమవిముక్తయోః || 3

సూతుడు ఇట్లు పలికెను-

ఓ మునీశ్వరులారా! వారాణసియొక్క పరమసుందరమగు వైభవమును మరియు విశ్వేశ్వరుని మహిమను సంక్షేపముగా చెప్పగలను. వినుడు (2). ఒకనాడు పార్వతీదేవి లోకహితమును గోరి పరమానందముతో అవిముక్త క్షేత్రము మరియు విశ్వేశ్వరుల మాహాత్మ్యమును గురించి శంకరుని ప్రశ్నించెను (3).

పార్వత్యువాచ |

అస్య క్షేత్రస్య మాహాత్మ్యం వక్తుమర్హస్య శేషతః | మమోపరి కృపాం కృత్వా లోకానాం హితకామ్యయా || 4

పార్వతి ఇట్లు పలికెను-

లోకముల హితమును గోరి నాయందు దయను చూపి ఈ క్షేత్రముయొక్క మాహాత్మ్యమును పూర్తిగా చెప్పదగును (4).

సూత ఉవాచ |

దేవ్యాస్తద్వచనం శ్రుత్వా దేవదేవో జగత్ర్పభుః | ప్రత్యువాచ భవానీం తాం జీవానాం ప్రియ హేతవే || 5

సూతుడు ఇట్లు పలికెను-

జగన్నాథుడు మరియు దేవదేవుడు అగు శివుడు భవానీదేవియొక్క ఆ మాటను విని ప్రాణుల హితమును చేయగోరి ఆమెకు ఇట్లు బదులిడెను (5).

పరమేశ్వర ఉవాచ |

సాధు పృష్టం త్వయా భ##ద్రే లోకానాం సుఖదం శుభమ్‌ | కథయామి యథార్థం వై మాహాత్మ్యమవిముక్తయోః || 6

ఇదం గుహ్యతమం క్షేత్రం సదా వారాణసీ మమ | సర్వేషామేవ జంతూనాం హేతుర్మోక్షస్య సర్వథా || 7

ఆస్మిన్‌ సిద్ధాస్సదా క్షేత్రే మదీయం వ్రతమాశ్రితాః | నానాలింగధరా నిత్యం మమ లోకాభికాంక్షిణః || 8

అభ్యస్యంతి మహాయోగం జితాత్మానో జితేంద్రియాః | పరం పాశుపతం శ్రౌతం భుక్తిముక్తిఫలప్రదమ్‌ || 9

రోచతే మే సదా వాసో వారాణస్యాం మహేశ్వరి | హేతునా యేన సర్వాణి విహాయ శృణు తద్ధ్రు వమ్‌ || 10

యో మే భక్తశ్చ విజ్ఞానీ తావుభౌ ముక్తిభాగినౌ | తీర్థాపేక్షా చ న తయోర్విహితావిహితే సమౌ || 11

జీవన్ముక్తౌ తు తౌ జ్ఞే¸° యత్ర కుత్రాపి వై మృతౌ | ప్రాప్నుతో మోక్షమాశ్వేవ మయోక్తం నిశ్చితం వచః || 12

పరమేశ్వరుడు ఇట్లు పలికెను-

ఓ మంగళస్వరూపురాలా! లోకములకు సుఖమును కలిగించే శుభకరమగు ప్రశ్నను చక్కగా అడిగితివి. అవిముక్తమాహాత్మ్యమును మరియు విశ్వేశ్వరుని మహిమను నేను యథాతథముగా చెప్పుచున్నాను (6). ఈ వారాణసి సర్వదా నా రహస్య క్షేత్రము. ఇది సర్వప్రాణులకు అన్ని విధములుగా మోక్షమునకు హేతువు అగుచున్నది (7). ఈ క్షేత్రమునందు సిద్ధులు సర్వదా నా లోకమును పొందగోరి నిత్యము అనేకలింగములను ధరించి నా వ్రతమును స్వీకరించెదరు (8). వారు ఇంద్రియములను మరియు మనస్సును జయించి భుక్తిని, ముక్తిని మరియు ఇతరఫలములను ఇచ్చునది, వేదోక్తమైనది, సర్వోత్కృష్టమైనది అగు పాశుపతమహాయోగమును అభ్యసించెదరు (9). ఓ మహేశ్వరీ! నాకు సర్వదా వారాణసియందు నివాసము ప్రీతికరమైనది. నీవు సర్వకార్యములను ప్రక్కన బెట్టి దీనికి గల కారణమును నిశ్చయముగా వినుము (10). నా భక్తుడు మరియు జ్ఞాని అనే ఇద్దరు ముక్తికి అర్హులు. వారికి తీర్థములతో పని లేదు. వారికి విధినిషేధములు రెండు సమానమే (11). వారిద్దరు జీవన్ముక్తులని తెలియవలెను. వారు ఎక్కడ మరణించిననూ వెనువెంటనే మోక్షమును పొందెదరు. నేనీ విషయమును ఖచ్చితముగా చెప్పుచున్నాను (12).

అత్ర తీర్థే విశేషోస్త్యవిముక్తాఖ్యే పరోత్తమే | శ్రూయతాం తత్త్వయా దేవి పరశ##క్తే సుచిత్తయా || 13

సర్వే వర్ణా ఆశ్రమాశ్చ బాల¸°వనవార్ధకాః | అస్యాం పుర్యాం మృతాశ్చేత్స్యుర్ముక్తా ఏవ న సంశయః || 14

అశుచిశ్చ శుచిర్వాపి కన్యా పరిణతా తథా | విధవా వాథ వా వంధ్యా రజోదోషయుతాపి వా || 15

ప్రసూతా సంస్కృతా కాపి యాదృశీ తాదృశీ ద్విజాః | అత్ర క్షేత్రే మృతా చేత్స్యాన్మోక్షభాక్‌ నాత్ర సంశయః || 16

స్వేదజశ్చాండజో వాపి హ్యుద్భిజ్జో%థ జరాయుజః | మృతో మోక్షమవాప్నోతి యథాత్ర న తథా క్వచిత్‌ || 17

జ్ఞానాపేక్షా న చాత్రైవ భక్త్యపేక్షా న వై పునః | కర్మాపేక్షా న దేవ్యత్ర దానాపేక్షా న చైవ హి || 18

సంస్కృత్యపేక్షా నైవాత్ర ధ్యానాపేక్షా న కర్హిచిత్‌ | నామాపేక్షారచనాపేక్షా సుజాతీనాం తథాత్ర న || 19

మమ క్షేత్రే మోక్షదే హి యో వా వసతి మానవః | యథా తథా మృతస్స్యాచ్చేన్మోక్షమాప్నోతి నిశ్చితమ్‌ || 20

అవిముక్తమనే సర్వశ్రేష్ఠమగు ఈ తీర్థమునందు విశేషము గలదు. ఓ దేవీ! పరాశక్తీ! దానిని నీవు సావధానముగా వినుము (13). అన్ని వర్ణములవారు, ఆశ్రమములవారు, బాలురు, యువకులు, మరియు వృద్ధులు ఈ నగరములో మరణించినచో నిస్సందేహముగా మోక్షమును పొందెదరు (14). ఓ బ్రాహ్మణులారా! శౌచము గలవాడు గాని, లేనివాడు గాని, కన్య గాని, వివాహిత గాని, భర్తృహీన గాని, సంతానము లేని స్త్రీ గాని, రజోదోషముగల స్త్రీ గాని (15), శిశువును ప్రసవించియున్న స్త్రీ గాని, సంసారవంతురాలు గాని ఎటువంటి స్త్రీ యైననూ ఈ క్షేత్రములో మరణించినచో నిస్సందేహముగా మోక్షమును పొందును (16). చెమటనుండి, లేదా గ్రుడ్డునుండి, లేదా విత్తనమునుండి, లేదా తల్లి గర్భమునుండి పుట్టిన ఏ ప్రాణియైననూ ఇచట మరణించి మోక్షమును పొందును. ఈ క్షేత్రమునకు గల ఈ మహిమ ఇతరక్షేత్రమునకు దేనికైననూ లేదు (17). ఓ దేవీ! ఈ క్షేత్రములో మరణించి మోక్షమును పొందుటకు జ్ఞానము, భక్తి, కర్మ, దానము, సంస్కారము, ధ్యానము, నామసంకీర్తనము, అర్చన, గొప్ప వంశము అను వాటి ఆపేక్ష లేనే లేదు (18, 19). ముక్తిని ఇచ్చే ఈ నా క్షేత్రములో ఏ మానవుడు నివసించునో, లేదా ఏ విధముగానైననూ మరణించునో, అట్టివాడు నిశ్చతముగా మోక్షమును పొందును (20).

ఏతన్మమ పురం దివ్యం గుహ్యాద్గుహ్యతరం ప్రియే | బ్రహ్మాదయో%పి జానంతి మాహాత్మ్యం నాస్య పార్వతి || 21

మహత్‌ క్షేత్రమిదం తస్మాదవిముక్తమితి స్మృతమ్‌ | సర్వేభ్యో నైమిషాదిభ్యః పరం మోక్షప్రదం మృతే || 22

ధర్మస్యోపనిషత్సత్యం మోక్షస్యోపనిషత్సమమ్‌ | క్షేత్రతీర్థోపనిషదమవిముక్తం విదుర్బుధాః || 23

కామం భుఞ్జన్‌ స్వపన్‌ క్రీడన్‌ కుర్వన్‌ హి వివిధాః క్రియాః | ఆవిముక్తే త్యజన్‌ ప్రాణాన్‌ జంతుర్మోక్షాయ కల్పతే || 24

కృత్వా పాపసహస్రాణి పిశాచత్వం వరం నృణామ్‌ | న చ క్రతుసహస్రత్వం స్వర్గే కాశీం పురం వినా || 25

తస్మాత్సర్వప్రయత్నేన సేవ్యతే కాశికా పురీ | అవ్యక్తలింగం మునిభిర్ధ్యాయతే చ సదాశివః || 26

యద్యత్ఫలం సముద్దిశ్య తపన్‌ యత్ర నరః ప్రియే | తేభ్యశ్చాహం ప్రయచ్ఛామి సమ్యక్‌ తత్తత్ఫలం ధ్రువమ్‌ || 27

ఓ ప్రియురాలా! ఈ నా దివ్యమగు నగరము రహస్యములలోకెల్లా రహస్యమైనది. ఓ పార్వతీ! బ్రహ్మాదులు కూడ దీని మాహాత్మ్యమును తెలియకున్నారు (21). ఇందువలననే ఈ గొప్ప క్షేత్రమునకు అవిముక్తమని పేరు వచ్చినది. మరణించువారికి ఇది నైమిషాదిసర్వక్షేత్రములకంటే గొప్పగా మోక్షమును ఇచ్చును (22). ధర్మములోకెల్లా సారభూతరహస్యము సత్యము. మోక్షము యొక్క రహస్యము సమత్వము. క్షేత్రములు మరియు తీర్థములలో సారభూతరహస్యము అవిముక్త క్షేత్రమని పండితులు చెప్పుచున్నారు (23). యథేచ్చగా భుజిస్తూ, నిద్రిస్తూ, క్రీడిస్తూ, వివిధకర్మలను చేస్తూ అవిముక్తమునందు ప్రాణములను వీడు జీవుడు మోక్షమునకు అర్హుడగును (24). మానవులకు వేయి క్రతువులను చేసి స్వర్గమును పొందుటకంటె వేయి పాపములను చేసి కాశీనగరములో పిశాచమగుట మేలు (25). కావున ప్రాణులు సర్వవిధముల ప్రయత్నమును చేసి కాశీనగరమును సేవించుచున్నారు. మునులు సదాశివుని ఆకృతివిశేషములు లేని లింగమునందు ధ్యానించుచున్నారు (26). ఓ ప్రియురాలా! మానవుడు ఏయే ఫలమునపేక్షించి ఏయే స్థానములో తపస్సును చేయునో, వారికి చక్కగా ఆయా ఫలములను నేను ఇచ్చుచున్నాను (27).

సాయుజ్యమాత్మనః పశ్చాదీప్సితం స్థానమేవ చ | న కుతశ్చిత్కర్మబంధ స్త్యజతామత్ర వై తనుమ్‌ || 28

బ్రహ్మ దేవర్షిభిస్సార్ధం విష్ణుర్వాపి దివాకరః | ఉపాసతే మహాత్మానస్సర్వే మామిహ చాపరే || 29

విషయాసక్తచిత్తో%పి త్యక్తధర్మరుచిర్నరః | ఇహ క్షేత్రే మృతో యో వై సంసారం న పునర్విశేత్‌ || 30

కిం పునర్నిర్మమా ధీరాస్తత్త్వస్థా దంభవర్జితాః | కృతినశ్చ నిరారంభాస్సర్వే తే మయి భావితాః || 31

జన్మాంతరసహస్రేషు జన్మ యోగీ సమాప్నుయాత్‌ | తదిహైవ పరం మోక్షం మరణాదధిగచ్ఛతి || 32

అత్ర లింగాన్యనేకాని భ##క్తైస్సంస్థాపితాని హి | సర్వకామప్రదానీహ మోక్షదాని చ పార్వతి || 33

పంచక్రోశం చతుర్దిక్షు క్షేత్రమేతత్ర్ప కీర్తితమ్‌ | సమంతాచ్చ తథా జంతోర్మృతికాలే%మృతప్రదమ్‌ || 34

ఇచ్చట దేహమును త్యజించువారలకు కర్మబంధము నశించి, తరువాత వారు కోరుకొనే నా సాయుజ్యము లభించును (28). బ్రహ్మ, దేవర్షులు, విష్ణువు, సూర్యుడు, మరియు ఇతరమహాత్ములు అందరు నన్ను ఇచట ఉపాసించెదరు (29). విషయభోగములయందు ఆసక్తి గలవాడై ధర్మమునందు అభిరుచి లేని మానవుడైననూ ఈ క్షేత్రములో మరణించినచో మరల సంసారములోనికి ప్రవేశించుడు (30). మమకారము లేనివారు, పండితులు, సత్త్వగుణప్రధానులు, దంభము లేనివారు, సర్వకర్మసన్న్యాసులగు కృతార్థులు, నాయందు భక్తిగలవారు అగు సర్వుల గురించి చెప్పునదేమున్నది? (31) వేయి జన్మల తరువాత యోగి ఇచట జన్మించి ఇచటనే మరణించి పరమపురుషార్థమగు మోక్షమును పొందును (32). ఓ పార్వతీ! భక్తులచే స్థాపించబడినవి, ఇహలోకములో సర్వకామనల నిచ్చి మోక్షమును కూడ ఇచ్చునవి అగు లింగములు ఇచట అనేకములు గలవు (33). ఈ క్షేత్రము నాలుగు దిక్కులయందు అయిదు క్రోసుల దూరము వ్యాపించియున్నది. ఈ విశాలదేశములో ఎక్కడనైననూ మానవునకు మరణించు సమయములో అమృతము (ఆనందము) లభించును (34).

అపాపశ్చ మృతో యో వై సద్యో మోక్షం సమశ్నుతే | సపాపశ్చ మృతో యస్స్యాత్కాయవ్యూహాన్‌ సమశ్నుతే || 35

యాతనాం సో%నుభూయైవ పశ్చాన్మోక్షమవాప్నుయాత్‌ | పాతకం యో%విముక్తాఖ్యే క్షేత్రే%స్మిన్‌ కురుతే ధ్రువమ్‌ || 36

భైరవీం యాతనాం ప్రాప్య వర్షాణామయుతే పునః | తతో మోక్షమవాప్నోతి భుక్త్వా పాపం చ సుందరి || 37

ఇతి తే చ సమాఖ్యాతా పాపాచారే చ యా గతిః | ఏవం జ్ఞాత్వా నరస్సమ్యక్‌ సేవయేదవిముక్తకమ్‌ || 38

కృతకర్మక్షయో నాస్తి కల్పకోటిశ##తైరపి | అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌ || 39

కేవలం చాశుభం కర్మ నరకాయ భ##వేదిహ | శుభం స్వర్గాయ జాయేత ద్వాభ్యాం మానుష్యమీరితమ్‌ || 40

జన్మ సమ్యగసమ్యక్‌ చ న్యూనాధిక్యే భ##వేదిహ | ఉభయోశ్చ క్షయో ముక్తిర్భవేత్సత్యం హి పార్వతి || 41

పాపములను చేయనివాడు మరణించిన వెంటనే మోక్షమును పొందును. పాపాత్ముడు మరణించిన పిదప వివిధ దేహములను ధరించును (35). అట్టివాడు కూడ యాతనను తప్పనిసరిగా అనుభవించి తరువాత మోక్షమును పొందును. ఓ సుందరీ! ఎవడైతే ఈ అవిముక్తమనబడే క్షేత్రములో పాపమును చేయునో, వాడు పదివేల సంవత్సరములు భైరవుని చేతిలో పాపఫలరూపములగు యాతనలననుభవించి తరువాత మోక్షమును పొందును (36, 37). ఈ విధముగా పాపములనాచరించువారు పొందు గతిని నీకు చెప్పితిని. మానవుడు ఈ విషయమును చక్కగానెరింగి అవిముక్తమును సేవించవలెను (38). చేసిన కర్మ వంద కోట్ల కల్పముల తరువాతనైననూ నశించదు. మంచిగాని, చెడుగాని చేసిన కర్మ యొక్క ఫలమును అనుభవించక తప్పదు (39). ఈ లోకములో చేయబడే కేవలపాపకర్మ నరకమును, శుభకర్మ స్వర్గమును, పుణ్యపాపముల మిశ్రమము మనుష్యజన్మను ఇచ్చునని చెప్పబడినది (40). పుణ్యపాపముల హెచ్చుతగ్గులను బట్టి మంచి లేక చెడు జన్మలు కలుగును. పుణ్యపాపములు రెండు క్షయమైనచో మోక్షము కలుగును. ఓ పార్వతీ! ఇది సత్యము (41).

కర్మ చ త్రివిధం ప్రోక్తం కర్మకాండే మహేశ్వరి | సంచితం క్రియమాణం చ ప్రారబ్ధం చేతి బంధకృత్‌ || 42

పూర్వజన్మసముద్భూతం సంచితం సముదాహృతమ్‌ | భుజ్యతే చ శరీరేణ ప్రారబ్ధం పరికీర్తితమ్‌ || 43

అనేన జన్మనా యచ్చ క్రియతే కర్మ సాంప్రతమ్‌ | శుభాశుభం చ దేవేశి క్రియమాణం విదుర్బుధాః || 44

ప్రారబ్ధకర్మణో భోగాత్‌ క్షయశ్చైవ న చాన్యథా | ఉపాయేన ద్వయోర్నాశః కర్మణోః పూజానాదినా || 45

సర్వేషాం కర్మణాం నాశో నాస్తి కాశీం పురీం వినా | సర్వం చ సులభం తీర్థం దుర్లభా కాశికా పురీ || 46

పూర్వజన్మకృతం చేద్వై కాశీదర్శనమాదరాత్‌ | తదా కాశీం చ సంప్రాప్య లభేన్మృత్యుం న చాన్యథా || 47

కాశీం ప్రాప్య నరో యస్తు గంగాయాం స్నానమాచరేత్‌ | తదా చ క్రియమాణస్య సంచితస్యాపి సంక్షయః || 48

ఓ మహేశ్వరీ! కర్మకాండలో కర్మ సంచితము, క్రియమాణము మరియు ప్రారబ్ధము అను మూడు విధములుగానుండి బంధించునని చెప్పబడినది (42). పూర్వజన్మలో చేయబడిన కర్మ సంచితమనబడును. శరీరముచే అనుభవింపబడుచున్నది ప్రారబ్ధమనబడును (43). ఓ దేవ దేవీ! ఈ జన్మలో ఇప్పుడు చేయబడుచున్న పుణ్యపాపకర్మ క్రియమాణమనబడునని పండితులు చెప్పుచున్నారు (44). ప్రారబ్ధకర్మ భోగముచే మాత్రమే క్షయమగును. అది నశించుటకు మరియొక మార్గము లేదు. మిగిలిన రెండు కర్మలు పూజ మొదలగు ఉపాయములచే నశించును (45). కాశీనగరము లేనిదే సర్వకర్మ వినాశము సంభవము కాదు. సర్వ తీర్థములు తేలికగా లభించునవియే. కాని కాశీతీర్థము మాత్రము దుర్లభము (46). పూర్వజన్మలో పుణ్యమును చేసుకున్న వారికి మాత్రమే కాశీనగరమును చేరి శ్రద్ధతో దానిని దర్శించుట మరియు అచట మరణించుట అనునవి సిద్ధించును. పూర్వపుణ్యము లేనిచో ఇవి సంభవము కావు (47). కాశీనగరమును చేరి గంగలో స్నానమును చేసినవానికి అప్పుడే సంచితముతో బాటు క్రియమాణము కూడ నశించును (48).

ప్రారబ్ధం న వినా భోగో నశ్యతీతి సునిశ్చితమ్‌ | మృతిశ్చ తస్య సంజాతా తదా తస్య క్షయో భ##వేత్‌ || 49

పూర్వం చైవ కృతా కాశీ పశ్చాత్పాపం సమాచరేత్‌ | తద్బీజేన బలవతా నీయతే కాశికా పునః || 50

తదా సర్వాణి పాపాని భస్మాసాచ్చ భవంతి హి | తస్మాత్కాశీం నరస్సేవేత్కర్మనిర్మూలనీం ధ్రువమ్‌ || 51

ఏకో%పి బ్రాహ్మణో యేన కాశ్యాం సంవాసితః ప్రియే | కాశీవాసమవాపై#్యవ తతో ముక్తిం స విందతి || 52

కాశ్యాం యో వై మృతశ్చైవ తస్య జన్మ పునర్న హి | సముద్దిశ్య ప్రయాగే చ మృతస్య కామనాఫలే || 53

సంయోగశ్చ తయోశ్చేత్స్యాత్కాశీజన్యం ఫలం వృథా | యది న స్యాత్తయోర్యోగస్తీర్థరాజఫలం వృథా || 54

తస్మాన్మచ్ఛాసనాద్విష్ణుస్సృష్టిం సాక్షాద్ధి నూతనామ్‌ | విధాయ మనసోద్దిష్టాం తత్సిద్ధిం యచ్ఛతి ధ్రువమ్‌ || 55

భోగించనిదే ప్రారబ్ధకర్మ నశించదని దృఢముగా నిశ్చయించబడిన విషయము. కాని ఆ వ్యక్తి కాశీలో మరణించినచో అదే సమయములో ప్రారబ్ధము కూడ నశించును (49). మానవుడు ముందుగా కాశీకి వెళ్లి వచ్చి తరువాత పాపమును ఆచరించినచో, ఆతడు ఆ సంస్కారబలముచే మరల కాశీకి చేరును (50). అప్పుడు పాపములన్నియు భస్మము అగును. కావున కర్మబంధమును నిర్మూలించు కాశీని మానవుడు నిశ్చయముగా సేవించవలెను (51). ఓ ప్రియురాలా! ఎవడైతే ఒకే ఒక బ్రాహ్మణుని యైననూ కాశీలో నివసింపజేయునో, వాడు తాను కూడ తరువాత కాశీవాసమును పొంది ముక్తిని బడయును (52). కాశీలో మరణించినవారికి పునర్జన్మ లేదు. కామనలు గల వ్యక్తి ప్రయాగలో మరణించినచో, ఆ కామనలు తీరుటయే గాక మోక్షము కూడ లభించును (53). ప్రయాగలో ఈ రెండు ఫలములు లభించును గనుక, ఆ రెండింటినీ కోరువానికి కాశీవాసఫలము వ్యర్థము. రెండు ఫలములు గాక, కేవలమోక్షఫలమును కోరువానికి తీర్థశ్రేష్ఠమగు ప్రయాగను సేవించిన ఫలము వ్యర్థమగును (54). కావున, నా శాసనముచే విష్ణువు ఈ పుణ్యములను మనస్సులో నిర్ధారించి వినూత్నమగు సృష్టిని చేసి ఆయా ఫలములను సాధకులకు ఇచ్చును. ఇది నిశ్చయము. (55).

సూత ఉవాచ |

ఇత్యాది బహు మాహాత్మ్యం కాశ్యాం వై మునిసత్తమాః | తథా విశ్వేశ్వరస్యాపి భుక్తిముక్తిప్రదం సతామ్‌|| 56

అతః పరం ప్రవక్ష్యామి మాహాత్మ్యం త్ర్యంబకస్య చ | యచ్ఛ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే మానవః క్షణాత్‌ || 57

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం కాశీవిశ్వేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్య వర్ణనం నామ త్రయోవింశో%ధ్యాయః (23).

సూతుడు ఇట్లు పలికెను-

ఓ మహర్షులారా! ఈ విధముగా కాశీలో చాల మహిమ గలదు. మరియు సత్పురుషులకు భుక్తిని, ముక్తిని ఇచ్చే విశ్వేశ్వరునకు చాల మహిమ గలదు (56). ఈ పైన త్ర్యంబకేశ్వరమాహాత్మ్యమును వర్ణించెదను. దీనిని విన్న మానవుడు క్షణములో సకలపాపములనుండి విముక్తిని పొందును (57).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్రసంహితయందు కాశీవిశ్వేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్య వర్ణనమనే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23).

Siva Maha Puranam-3    Chapters