Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Siva Maha Puranam-3    Chapters   

ఏకోన వింశో%ధ్యాయః

కేదారేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్యము

సూత ఉవాచ |

నరనారాయణాఖ్యౌ యావవతారౌ హరేర్ద్విజాః | తేపాతే భారతే ఖండే బదర్యాశ్రమ ఏవ హి || 1

తాభ్యాం సంప్రార్థితశ్శంభుః పార్థివే పూజనాయ వై | ఆయాతి నిత్యం తల్లింగే భక్తాధీనతయా శివః || 2

ఏవం పూజయతోశ్శంభుం తయోర్విష్ణ్వవతారయోః | చిరకాలో వ్యతీయాయ శైవయోర్ధర్మపుత్రయోః || 3

ఏకస్మిన్‌ సమయే తత్ర ప్రసన్నః పరమేశ్వరః | ప్రత్యువాచ ప్రసన్నో%స్మి వరో మే వ్రియతామితి || 4

ఇత్యుక్తే చ తదా తేన నరో నారాయణస్స్వయమ్‌ | ఊచతుర్వచనం తత్ర లోకానాం హితకామ్యయా || 5

సూతుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా! విష్ణువుయొక్క అవతారములగు నరనారాయణులు భారతఖండములో బదరి కాశ్రమములో తపస్సును చేసిరి (1). పార్థివలింగమునందు పూజించుటకొరకై వారు ప్రార్థించగా భక్తవశుడగు శివుడు ప్రతిదినము ఆ లింగమునందు ఉపస్థితుడగుచుండెను (2). విష్ణువుయొక్క ధర్మావతారములు, శివభక్తులు అగు వారిద్దరు శంభుని పూజించుచుండగా చిరకాలము గడచెను (3). ఒకానొక సమయములో పరమేశ్వరుడు ప్రసన్నుడై అచట ప్రత్యక్షమై 'నేను మీయందు ప్రసన్నుడనైతిని; నానుండి వరమును కోరుకొనుడు'అని పలికెను (4). ఆయన ఇట్లు పలుకగా, అపుడు నరనారాయణులు లోకముల హితమును గోరి స్వయముగా ఆ సమయములోనిట్లు పలికిరి (5).

నరనారాయణవూచతుః |

యది ప్రసన్నో దేవేశ యది దేయో వరస్త్వయా | స్థీయతాం స్వేన రూపేణ పూజార్థం శంకర స్వయమ్‌ || 6

నరనారాయణులు ఇట్లు పలికిరి-

ఓ దేవదేవా! శంకరా! నీవు ప్రసన్నుడవై వరమునీయ సంకల్పించినచో, నీ రూపముతో పూజ కొరకై ఇచట స్థిరముగా నుండుము (6).

సూత ఉవాచ |

ఇత్యుక్తస్తు తదా తాభ్యాం కేదారే హిమసంశ్రయే | స్వయం చ శంకరస్తస్థౌ జ్యోతీరూపో మహేశ్వరః || 7

తాభ్యాం చ పూజితశ్చైవ సర్వదుఃఖభయావహః | లోకానాముపకారార్థం భక్తానాం దర్శనాయవై || 8

స్వయం స్థితస్తదా శంభుః కేదారేశ్వరసంజ్ఞకః | భక్తాభీష్టప్రదో నిత్యం దర్శనాదర్చనాదపి || 9

దేవాశ్చ పూజయంతీహ ఋషయశ్చ పురాతనాః | మనోభీష్టం ఫలం తే తే సుప్రసన్నాన్మ హేశ్వరాత్‌ || 10

భవస్య పూజనాన్నిత్యం బదర్యాశ్రమవాసినః | ప్రాప్నువంతి యతస్సో%సౌ భక్తాభీష్టప్రదస్సదా || 11

తద్దినం హి సమారభ్య కేదారేశ్వర ఏవ చ | పూజితో యేన భక్త్యా వై దుఃఖం స్వప్నే%తిదుర్లభమ్‌ || 12

యో వై హి పాండవాన్‌ దృష్ట్వా మాహిషం రూపమాస్థితః | మాయామాస్థాయ తత్రైవ పలాయనపరో%భవత్‌ || 13

సూతుడు ఇట్లు పలికెను-

వారిద్దరు అపుడు అట్లు పలుకగా, మంచునకు నిలయమగు కేదారమునందు మంగళకరుడగు మహేశ్వరుడు స్వయముగా జ్యోతిర్లింగరూపములో నుండెను (7). సకలదుఃఖములను మరియు భయములను పోగొట్టువాడగు శంభుడు వారిద్దరిచే పూజింపబడినవాడై లోకములకు ఉపకారమును చేయగోరి, భక్తులకు దర్శనమునిచ్చుటకొరకై అచట స్వయముగా కేదారేశ్వరుడను పేరుతో వెలసెను. దర్శించి అర్చించు భక్తులకు ఆయన అభీష్టములనిచ్చును (8, 9). దేవతలు మరియు ప్రాచీనులగు ఋషులు అచట మహేశ్వరుని పూజించి ప్రసన్నుని చేసుకొని మనోభీష్టములగు ఆయా ఫలములను పొందుచున్నారు (10). బదరికాశ్రమమునందు నివసించు జనులు నిత్యము శివుని పూజించి కామనలను పొందెదరు. కావుననే ఆయనకు భక్తాభీష్టప్రదుడు అను ఖ్యాతి కలిగెను (11). ఆ నాటినుండియు ఎవడైతే భక్తితో కేదారేశ్వరుని పూజించునో, వానికి దుఃఖము స్వప్నములోనైననూ మృగ్యమగుచున్నది (12). అచట పాండవులను చూచి, మాయాప్రభావముచే మహిషరూపమును దాల్చి పారిపోయినవాడు ఆయనయే (13).

ధృతశ్చ పాండవైస్తత్ర హ్యవాఙ్ముఖతయా స్థితః | పుచ్ఛం చైవ ధృతం తైస్తు ప్రార్థితశ్చ పునః పునః || 14

తద్రూపేణ స్థితస్తత్ర భక్తవత్సలనామభాక్‌ | నయపాలే శిరోభాగో గతస్తద్రూపతః స్థితః || 15

స వై వ పూజానాన్నిత్యమాజ్ఞాం చైవాస్యదాత్తథా | పూజితశ్చ స్వయం శంభుస్తత్ర తస్థౌ వరానదాత్‌ || 16

పూజయిత్వా గతాస్తే తు పాండవా ముదితాస్తదా | లబ్ధ్వా చిత్తేప్సితం సర్వం విముక్తాస్సర్వదుఃఖతః || 17

తత్ర నిత్యం హరస్సాక్షాత్‌ క్షేత్రే కేదారసంజ్ఞకే | భారతీభిః ప్రజాభిశ్చ తథైవ పరిపూజ్యతే || 18

తత్రత్య వలయం యో వై దదాతి హరవల్లభః | హరరూపాంతికం తచ్చ హరరూపసమన్వితమ్‌ || 19

తథైవ రూపం దృష్ట్వా చ సర్వపాపైః ప్రముచ్యతే | జీవన్ముక్తో భ##వేత్సో%పి యో గతో బదరీవనే || 20

పాండవులు ఆయనను పట్టుకోగా, ఆయన తలను వంచుకొని నిలబడెను. వారు తోకను పట్టుకొని పలమార్లు ప్రార్థించిరి (14). ఆయన అచట అదే రూపములో నుండి భక్తవత్సలుడను పేరును గాంచెను. ఆయనయొక్క శిరోభాగము నేపాలమునకు వెళ్లెను. ఆయన అచట ఆ రూపములోనుండెను (15). అదే రూపములో తనను పూజించవలెనని ఆయన అప్పుడు ఆజ్ఞను ఇచ్చెను. వారు పూజించగా శంభుడు అచటనే స్థిరముగానుండి వరములనొసంగెను (16). ఆ పాండవులు అపుడు ఆయనను పూజించి ఆనందముతో ముందునకు సాగిరి. వారు తమ మనస్సులోని కామనలనన్నిటినీ పొంది సకలదుఃఖములనుండి విముక్తులైరి (17). కేదారమను పేరు గల ఆ క్షేత్రము నందు శివుడు స్వయముగా నిత్యనివాసము చేసి భారతదేశవాసులగు ప్రజలచే అటులనే పూజింపబడుచున్నాడు (18). అచటకు వెళ్లి శివుని రూపముతో కూడియున్న కంకణమును దానము చేయువాడు శివునకు ప్రీతిపాత్రుడు అగును. అట్టి కంకణమును దానము చేయు వ్యక్తి శివుని ధామమును చేరి శివుని రూపమును పొందును (19). ఎవడైతే బదరీవనమునకు వెళ్లి శివుని అటువంటి రూపమును చూచునో, వాడు నిశ్చయముగా సర్వపాపములనుండి విముక్తుడై జీవన్ముక్తుడగును (20).

దృష్ట్వా రూపం నరసై#్యవ తథా నారాయణస్య హి | కేదారేశ్వరశంభోశ్చ ముక్తిభాగీ న సంశయః || 21

కేదారేశస్య భక్తా యే మార్గస్థాస్తస్య వై మృతాః | తే%పి ముక్తా భవంత్యేవ నాత్ర కార్యా విచారణా || 22

గత్వా తత్ర ప్రీతియుక్తః కేదారేశం ప్రపూజ్య చ | తత్రత్యముదకం పీత్వా పునర్జన్మ న విందంతి || 23

ఖండే%స్మిన్‌ భారతే విప్రా నరనారాయణశ్వరః | కేదారేశః ప్రపూజ్యశ్చ సర్వైర్జీవైస్సుభక్తితః || 24

అస్య ఖండస్య స స్వామీ సర్వేశో%పి విశేషతః | సర్వకామప్రదశ్శంభుః కేదారాఖ్యో న సంశయః || 25

ఏతద్వచస్సమాఖ్యాతం యత్పృష్టమృషిసత్తమాః | శ్రుత్వా పాపం హరేత్సర్వం నాత్ర కార్యా విచారణా || 26

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం కేదారేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్యవర్ణనమనే నామ ఏకోన వింశో%ధ్యాయః (20).

నరనారాయణులయొక్క మరియు కేదారేశ్వరుని యొక్క రూపములను చూచు వ్యక్తి ముక్తుడగు ననుటలో సందేహము లేదు (21). కేదారేశ్వరుని దర్శనమునకు వెళ్లుచూ మార్గమధ్యములో మరణించువారు కూడ నిస్సందేహముగా మోక్షమును పొందెదరు (22). అచటకు వెళ్లి ప్రేమతో కేదారేశ్వరుని పూజించి అచటి నీటిని త్రాగిన వానికి పునర్జన్మ లేదు (23). ఓ బ్రాహ్మణులారా! భారతఖండములోని జనులందరు నరనారాయణులకు ప్రభువగు కేదారేశ్వరుని మహాభక్తితో చక్కగా పూజించవలెను (24). ఆయన సర్వేశ్వరుడే అయిననూ ఈ ఖండమునకు ఆయన విశేషించి ప్రభువు అగుచున్నాడు. కేదారేశ్వరుడు కామములనన్నిటినీ ఇచ్చుననుటలో సందియము లేదు (25). ఓ మహర్షులారా! మీరు అడిగిన ప్రశ్నకు సమాధానమును చెప్పితిని. ఈ వృత్తాంతమును విన్న వారు సర్వపాపవినిర్ముక్తులగుదురనుటలో సందేహము లేదు (26).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్రసంహితయందు కేదారేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్యవర్ణనమనే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది (20).

Siva Maha Puranam-3    Chapters