Siva Maha Puranam-3    Chapters   

అథ ఏకోన షష్టితమో%ధ్యాయః

విదలోత్పలదైత్యవధ

సనత్కుమార ఉవాచ |

శృణు వ్యాస సుసంప్రీత్యా చరితం పరమేశితుః | యథావధీత్స్వప్రియయా దైత్యముధ్దిశ్య సంజ్ఞయా || 1

ఆస్తాం పురా మహాదైత్యౌ విదలోత్పలసంజ్ఞకౌ | అపంవధ్యౌ మహావీరౌ సదృప్తౌ వరతో విధేః || 2

తృణీకృతత్రిజగతీ పురుషాభ్యాం స్వదోర్బలాత్‌ | తాభ్యాం సర్వే సురా బ్రహ్మన్‌ దైత్యాభ్యాం నిర్జితా రణ || 3

తాభ్యాం పరాజితా దేవా విధేస్తే శరణం గతాః | నత్వా తే విధివత్సర్వే కథయామాసురాదరాత్‌ || 4

ఇతి బ్రహ్మా హ్యవోచత్తాన్‌ దేవ్యా వధ్యౌ చ తౌ ధ్రువమ్‌ | ధైర్యం కురుత సంస్మృత్య సశివం శివమాదరాత్‌ || 5

భక్తవత్సలనామాసౌ సశివశ్శంకరశ్శివః | శం కరిష్యత్యదీర్ఘేణ కాలేన పరమేశ్వరః || 6

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

ఓ వ్యాసా! పరమేశ్వరుడు ఒక రాక్షసుని పేరుతో సూచించి తన ప్రియురాలిచే సంహరింపజేసన వృత్తాంతమును మిక్కిలి ప్రీతితో వినుము (1). పూర్వము విదలుడు, ఉత్పలుడు అను పేరు గల మహావీరులగు ఇద్దరు గొప్ప రాక్షసులు ఉండెడివారు. వారు బ్రహ్మనుండి పురుషునిచే వధ లేని విధముగా వరమును పొంది మిక్కిలి గర్వించియుండిరి (2). ఓ మహర్షీ! జగత్తును గడ్డిపోచవలె చూచే ఆ రాక్షసులు ఇద్దరు తమ భుజబలముచే యుద్ధములో దేవతలనందరినీ జయించిరి (3). వారి చేతిలో పరాజయమును పొందిన దేవతలు అందరు బ్రహ్మను శరణుజొచ్చి యథావిధిగా నమస్కరించి శ్రద్ధతో విన్నవించుకొనిరి (4). అపుడు బ్రహ్మ వారితో ఇట్లు చెప్పెను: వారు దేవిచే నిశ్చయముగా సంహరింపబడెదరు. మీరు పార్వతీపరమేశ్వరులను భక్తితో స్మరించి ధైర్యమును అవలంబించుడు (5). భక్తవత్సలుడను పేరు గలవాడు, పార్వతీసమేతుడు, మంగళకరుడు, మంగళ స్వరూపుడు అగు పరమేశ్వరుడు అల్పకాలములోననే శుభమును చేయగలడు (6).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్త్వా తాంస్తతో బ్రహ్మా తుష్ణీమాసీచ్ఛివం స్మరన్‌ | తే%పి దేవా ముదం ప్రాప్య స్వం స్వం ధామ యయుస్తదా || 7

అథ నారదదేవర్షిశ్శివప్రేరణయా తదా | గత్వా తదీయభవనం శివాసౌందర్యమాజగౌ || 8

శ్రుత్వా తద్వచనం దైత్యావాస్తాం మాయావిమోహితౌ | దేవీం పరిజిహీర్షంతౌ విషమేషుప్రపీడితౌ || 9

విచారయామాసతుస్తౌ కదా కుత్ర శివా చ సా | భవిష్యతి విధేః ప్రాప్తో దయాన్నావితి సర్వదా || 10

ఏకస్మిన్‌ సమయే శంభుర్విజహార సులీలయా | కౌతుకేనైవ చిక్రీడే శివా కందుకలీలయా || 11

సఖీభిస్సహ సుప్రీత్యా కౌతుకాచ్ఛివసన్నిధౌ || 12

ఉదంచంత్యంచదంగానాం లాఘవం పరతన్వతీ | నిశ్శ్వాసామోదముదిత భ్రమరాకులితేక్షణా || 13

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

బ్రహ్మ వారితో నిట్లు పలికి శివుని స్మరించి మిన్నకుండెను. అపుడు ఆ దేవతలు కూడ ఆనందమును పొంది తమ తమ ధామములకు వెళ్లిరి (7). అపుడు దేవర్షియగు నారదుడు శివుని ప్రేరణచే వారి భవనమునకు వెళ్లి పార్వతియొక్క సౌందర్యమును వర్ణించెను (8). ఆయన మాటలను వినిన ఆ రాక్షసులు మాయచే మోహితులై కామబాణములచే పీడితులై ఆ దేవిని అపహరించగోరిరి (9). పార్వతి ఎప్పుడు ఎక్కడ లభించునో ! మన భాగ్యము ఎపుడు ఉదయించునో ! అని వారిద్దరు సర్వదా చింతించుచుండిరి (10). ఒకనాడు శివుడు లీలచే విహరించుచుండెను. పార్వతి ఉత్సాహముతో సఖురాండ్రతో గూడి శివుని సన్నిధిలో బంతి ఆటను లీలగా ఆడుచుండెను. (11, 12). ఆమె పైకి చూచుచూ శరీరావయవములలోని లాఘవమును ప్రదర్శించుచూ, నిశ్శ్వాససుగంధముచే ఆకర్షితములైన భ్రమరములు కన్నులకు ఇబ్బందిని కలిగించుచుండగా క్రీడించెను (13).

భ్రశ్యద్ధమ్మిల్లసన్మాల్యస్వపురీకృతభూమికా | స్విద్యత్క పోలపత్రాలీస్రవదంబుకణోజ్జ్వలా || 14

స్ఫుటచ్చోలాంశుకపథతిర్యదంగప్రభావృతా | ఉల్లసత్కందుకాస్ఫాలాతిశ్రోణితకరాంబుజా || 15

కందుకానుగసద్దృష్టినర్తితభ్రూలతాంచలా | మృడానీ కిల ఖేలంతీ దదృశే జగదంబికా || 16

అంతరిక్షచరాభ్యాం చ దితిజాభ్యాం కటాక్షితా | క్రోడీకృతాభ్యామివ వై సముపస్థితమృత్యునా || 17

దివ ఉత్తేరతుః క్షిప్రం మాయాం స్వీకృత్య శాంబరీమ్‌ || 18

ధృత్వా పారిషదీం మాయామాయాతావంబికాంతికమ్‌ | తావత్యంతం సుదుర్వృత్తావతిచంచలమానసౌ || 19

అథ దుష్టనిహంత్రా వై సావజ్ఞేన హరేణ తౌ | విజ్ఞాతౌ చ క్షణాదాస్తాం చాంచల్యాల్లోచనోద్భవాత్‌ || 20

ఆమె కేశములనుండి జారిన పుష్పములు ఆమె యెదుటనే నేలపై బడుచుండెను. చెమట బిందువులు ఆమె చెక్కిళ్ల మీదనున్న అలంకారరేఖలను చెరపివేసి క్రిందకు జారినవి (14). రవికెయొక్క ఆచ్ఛాదన లేని భాగములనుండి ఆమె దేహకాంతులు సర్వత్ర వ్యాపించుచుండెను. బంతిని కొట్టుటలో పద్మమువంటి ఆమె హస్తము మరింత రక్తవర్ణమును పొందెను (15). ఆమె చూపు బంతితో బాటు తిరుగుచుండగా లతలవంటి కనుబొమలు నాట్యమును చేయుచుండెను. ఈ విధముగా క్రీడలోనున్న ఆ జగన్మాతయగు భవానిని (16) అంతరిక్షములోసంచరించుచున్న ఆరాక్షసులిద్దరు చూచిరి. వారిని దగ్గర పడిన మృత్యువు తన ఒడిలోనికి తీసుకొనుచున్నదా యన్నట్లు ఉండెను (17). వారు శంబరమాయా ప్రభావముచే వెంటనే ఆకాశమునుండి క్రిందకు దిగిరి (18). మిక్కిలి దురాచారులు, అతి చంచలమగు మనస్సు గలవారు అగు ఆ రాక్షసులిద్దరు శివకింకరుల వేషములో పార్వతి సమీపమునకు వచ్చిరి. (19). దుష్టశిక్షకుడగు శివుడు వారి కన్నులలోని అతిశయించిన చపలత్వమునుబట్టి వారిని క్షణములో గుర్తు పట్టెను (20).

కటాక్షితాథ దేవేన దుర్గా దుర్గతిఘాతినీ | దైత్యావిమావితి గణౌ నేతి సర్వస్వరూపిణా || 21

అథ సా నేత్రసంజ్ఞాం స్వస్వామినస్తాం బుబోధహ | మహాకౌతుకినస్తాత శంకరస్య పరేశితుః || 22

తతో విజ్ఞాయ సంజ్ఞాం తాం సర్వజ్ఞార్ధశరీరిణీ | తేనైవ కందుకేనాథ యుగపన్నిర్జఘాన తౌ || 23

మహాబలౌ మహాదేవ్యా కందుకేన సమాహతౌ | పరిభ్రమ్య పరిభ్రమ్య తౌ దుష్టౌ వినిపేతతుః|| 24

వృంతాదివ ఫలే పక్వే తాలేనానిలలోలితే | దంభోలినా పరిహతే శృంగే ఇవ మహాగిరేః || 25

తౌ నిపాత్య మహాదైత్యావ కార్య కరణోద్యతౌ | తతః పరిణతిం యాతో లింగరూపేణ కందుకః|| 26

అపుడు సర్వస్వరూపుడగు ఆ దేవుడు వీరు రాక్షసులే గాని గణములు కాదని సాభిప్రాయముగ భక్తుల దుర్గతిని పోగొట్టే ఆ దుర్గవైపునకు చూచెను (21). ఓ వత్సా ! అపుడు మహోత్సాహము గలవాడు, మరమేశ్వరుడు, తన భర్త అగు శంకరుని ఆ కన్నుల సంజ్ఞను ఆ దేవి తెలుసుకొనెను (22). తరువాత సర్వజ్ఞురాలు, శివుని అర్థాంగి అగు ఆ దుర్గ శివుని నేత్రసంజ్ఞను తెలుసుకొని, అదే బంతితో వారినిద్దరినీ ఒకేసారి కొట్టెను (23). మహాబలశాలురగు ఆ దుష్టులిద్దరు మహాదేవిచే బంతిచే కొట్టబడినవారై గిరగిర తిరిగి క్రింద పడిరి (24). గాలికి ఊగిన తాటి చెట్టుయొక్క తొడిమనుండి రాలిన ముగ్గిన పండ్లవలె, వజ్రముచే కొట్టబడిన పెద్ద పర్వతశిఖరములవలె (25), తప్పు పనిని చేయబూనిన ఆ మహా దైత్యులిద్దరు నేలగూల్చబడగా, ఆ బంతి లింగరూపములోనికి మారిపోయెను (26).

కందుకేశ్వరసంజ్ఞం చ తల్లింగమభవత్తదా | జ్యేష్ఠేశ్వరసమీపే తు సర్వదుష్టనివారణమ్‌ || 27

ఏతస్మిన్నేవ సమయే హరిబ్రహ్మాదయస్సురాః | శివావిర్భావమాజ్ఞాయ ఋషయశ్చ సమాయయుః || 28

అథ సర్వే సురాశ్శంభోర్వరాన్‌ ప్రాప్య తదాజ్ఞయా | స్వధామాని యయుః ప్రీతాస్తథా కాశీనివాసినః || 29

సాంబికం శంకరం దృష్ట్వా కృతాంజలిపుటాశ్చ తే | ప్రణమ్య తుష్టుపుర్భక్త్యా వాగ్భిరిష్టాభిరాదరాత్‌ || 30

సాంబికో%పి శివో వ్యాస క్రీడిత్వా సువిహారవిత్‌ | జగామ స్వాలయం ప్రీతస్సగణో భక్తవత్సలః || 31

కందుకేశ్వరలింగం చ కాశ్యాం దుష్టనిబర్హణమ్‌ | భుక్తిముక్తిప్రదం సర్వకామదం సర్వదా సతామ్‌ || 32

ఇదమాఖ్యానమతులం శృణుయాద్యో ముదాన్వితః | శ్రావయేద్వా పఠేద్యశ్చ తస్య దుఃఖభయం కుతః || 33

ఇహ సర్వసుఖం భుక్త్వా నానావిధమనుత్తమమ్‌ | పరత్ర లభ##తే దివ్యాం గతిం వై దేవదుర్లభామ్‌ || 34

అపుడా లింగము కందుకేశ్వరమను పేరిట ప్రసిద్ధిని గాంచెను. జ్యేష్ఠేశ్వరలింగమునకు సమీపములోనున్న ఈ లింగము దోషములనన్నిటినీ పోగొట్టును (27). ఇదే సమయములో శివుడు ఆవిర్భవించిన వార్త తెలిసి విష్ణువు, బ్రహ్మ మొదలగు దేవతలు మరియు ఋషులు విచ్చేసిరి (28). తరువాత సర్వదేవతలు మరియు కాశీనివాసులు శంభునినుండి వరములను పొంది సంతసించి ఆయన అనుమతిని పొంది తమ తమ స్థానములకు వెళ్లిరి (29). వారు పార్వతీపరమేశ్వరులను గాంచి చేతులను జోడించి ప్రణమిల్లి శ్రద్ధాభక్తిపూర్వకముగా అభీష్టములగు వచనములతో స్తుతించిరి (30). ఓ వ్యాసా! భక్తవత్సలుడు, లీలావిహారవేత్త అగు శివుడు పార్వతీసమేతుడై విహరించి గణములతో కూడినవాడై తన ధామమునకు వెళ్లెను (31). కాశీలోని కందుకేశ్వరలింగము దుష్టులను నశింపజేసి సత్పురుషులకు సర్వకాలములలో భుక్తిని, ముక్తిని ఇచ్చి కోర్కెలనన్నిటినీ ఈడేర్చును (32). సాటి లేని ఈ ఉపాఖ్యానమును ఎవరైతే ఆనందముతో గూడి వినిపించునో, లేదా పఠించునో, వానికి దుఃఖభయము ఎక్కడిది? (33) అట్టివాడు ఇహలోకములో నానావిధములైన సర్వోత్కృష్టములగు సకలసుఖములను అనుభవించి పరలోకములో దేవతలకైననూ దుర్లభ##మైన దివ్యగతిని పొందును (34).

ఇతి తే వర్ణితం తాత చరితం పరమాద్భుతమ్‌ | శివయోర్భక్తవాత్సల్య సూచకం శివదం సతామ్‌ || 35

ఓ వత్సా ! ఈ విధముగా పార్వతీపరమేశ్వరుల భక్తవాత్సల్యమును సూచించునది, సత్పురుషులకు మంగళముల నొసంగునది, పరమాద్భుతమైనది అగు వృత్తాంతమును నీకు వర్ణించి చెప్పితిని (35).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వామంత్య్ర తం వ్యాసం తన్నుతో మద్వరాత్మజః | య¸° విహాయసా కాశీం చరితం శశిమౌలినః || 36

యుద్ధఖండమిదం ప్రోక్తం మయా తే మునిసత్తమ | రౌద్రీయసంహితామధ్యే సర్వకామఫలప్రదమ్‌ || 37

ఇయం హి సంహితా రౌద్రీ సంపూర్ణా వర్ణితా మయా |సదాశివప్రియతారా భుక్తిముక్తిఫలప్రదా || 38

ఇమాం యశ్చ పఠేన్నిత్యం శత్రుబాధానివారకమ్‌ | సర్వాన్‌ కామానవాప్నోతి తతో ముక్తిం లఖేత నా || 39

బ్రహ్మ ఇట్లు పలికెను -

నా పుత్రులలో శ్రేష్ఠుడగు సనత్కుమారుడు ఇట్లు చంద్రశేఖరుని వృత్తాంతమును వర్ణించి వ్యాసునిచే స్తుతింపబడినవాడై ఆయనవద్ద సెలవు తీసుకొని ఆకాశమార్గములో కాశీ నగరమునకు వెళ్లెను (36). ఓ మహర్షీ! రుద్రసంహితలో అంతర్భాగమైన ఈ యుద్దఖండను నీకు చెప్పియుంటిని. ఇది సకలకామనలను, ఫలములను ఇచ్చును (37). సదాశివునకు మిక్కిలి ప్రియమైనది, భుక్తి మరియు ముక్తి అను ఫలములను ఇచ్చునది అగు ఈ రుద్రసంహితను నేను పూర్తిగా చెప్పితిని (38). శత్రుబాధను పోగొట్టే దీనిని ఏ మానవుడైతే నిత్యము పఠించునో, వాడు కోర్కెలనన్నిటినీ అనుభవించి, దేహత్యాగానంతరము మోక్షమును పొందును (39).

సూత ఉవాచ |

ఇతి బ్రహ్మసుతః శ్రుత్వా పిత్రా శివయశః పరమ్‌ | శతనామాపి శంభోశ్చ కృతార్థో%భూచ్ఛివానుగః|| 40

బ్రహ్మనారదసంవాదస్సంపూర్ణః కథితో మయా | శివస్సర్వప్రధానో హి కిం రభూయశ్శ్రోతుమిచ్ఛసి || 41

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే విదలోత్పలదైత్యవధవర్ణనం నామ ఏకోనషష్టితమో%ధ్యాయః (59).

సూతుడు ఇట్లు పలికెను-

బ్రహ్మపుత్రుడగు నారదుడు ఈ విధముగా తండ్రి చెప్పగా శివుని కీర్తిని మరియు శివుని శతనామములను విని శివభక్తుడై కృతార్థుడాయెను (40). నేను బ్రహ్మనారదసంవాదమునంతనూ చెప్పియుంటిని. శివుడు సర్వులలో ప్రధానుడు. ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? (41)

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందలి యుద్ధఖండలో విదలోత్పలదైత్య వధను వర్ణించే ఏబది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (59).

యుద్ధఖండ ముగిసినది.

రుద్రసంహిత ముగిసినది.

శ్రీకృష్ణార్పణమస్తు.

000

Siva Maha Puranam-3    Chapters