Siva Maha Puranam-3    Chapters   

అథ ద్విపంచాశత్తమో%ధ్యాయః

ఉషా- అనిరుద్ధుల సమాగమము

సనత్కుమార ఉవాచ |

శృణుష్వాన్యచ్చరిత్రం చ శివస్య పరమాత్మనః | భక్తవాత్సల్యసంగర్భి పరమానందదాయకమ్‌ || 1

పురా బాణాసురో నామ దైవదోషాచ్చ గర్వితః | కృత్వా తాండవనృత్యం చ తోషయామాస శంకరమ్‌ || 2

జ్ఞాత్వా సంతుష్టమనసం పార్వతీవల్లభం శివమ్‌ | ఉవాచ చాసురో బాణో నతస్కంధః కృతాంజలిః || 3

సనత్కుమారుడిట్లు పలికెను -

భక్తులయందు భగవానునకు గల వాత్సల్యముతో నిండియున్నదై మహానందమును కలిగించే శివపరమాత్మ యొక్క మరియొక చరిత్రమును కూడ వినుము (1). పూర్వము బాణుడను రాక్షసుడు తాండవనృత్యమును చేసి శంకరుని సంతోషపెట్టెను. కాని ఆతడు దైవముయొక్క దోషముచే గర్వము కలవాడాయెను (2). పార్వతీపతియగు శివుని మనస్సు సంతోషమును పొందియున్నదని గ్రహించి ఆ బాణాసురుడు శిరసును వంచి చేతులను జోడించి ఇట్లు పలికెను (3).

బాణ ఉవాచ |

దేవదేవ మహాదేవ సర్వదేవశిరోమణ | త్వత్ర్పసాద్బలీ చాహం శృణు మే పరమం వచః || 4

దోస్సహస్రం త్వయా దత్తం వరం భారాయ మే%భవత్‌ | త్రిలోక్యాం ప్రతియోద్ధారం న లభే త్వదృతే సమమ్‌ || 5

హే దేవ కిమనేనానపి సహస్రేణ కరోమ్యహమ్‌ | బాహూనాం గిరితుల్యానాం వినా యుద్ధం వృషధ్వజ || 6

కండూత్యా నిభృతైర్దోర్భిర్యుయుత్సుర్దిగ్గజానహమ్‌ | పురాణ్యాచూర్ణయన్నద్రీన్‌ భీతాస్తే%పి ప్రదుద్రువుః || 7

మయా యమఃకృతో యోద్ధా వహ్నిశ్చ కృతకో మహాన్‌ | వరుణశ్చాపి గోపాలో గవాం పాలయితా తథా || 8

గజాధ్యక్షః కుబేరస్తు సైరంధ్రీ చాపి నిర్‌ఋతిః | జితశ్చాఖండలో లోకే కరదాయీ సదా కృతః || 9

యుద్ధస్యాగమనం బ్రూహి యత్రైతే బాహవో మమ | శత్రుహస్తప్రయుక్తైశ్చ శస్త్రా సై#్త్రర్జర్జరీకృతాః || 10

పతంతు శత్రుహస్తాద్వా పాతయంతు సహస్రధా | ఏతన్మనోరథం మే హి పూర్ణం కురు మహేశ్వర || 11

బాణుడిట్లు పలికెను -

ఓ దేవదేవా! మహాదేవా! నీవు దేవతలందరిలో తలమానికము వంటివాడవు. నీ అనుగ్రహముచే నేను బలవంతుడనైనాను. నా శ్రేష్ఠమగు ఈ వచనమును వినుము (4). నీవు అనుగ్రహించిన ఈ వేయి చేతులు నాకు బరువు అగుచున్నవి. ముల్లోకములలో నీవు తక్క సమానమగు ప్రతిద్వంద్విని మరియొకరిని కానరాకున్నాను (5). ఓ దేవా ! వృషభధ్వజా ! యుద్ధము లేనిదే కొండవలె కఠినమైన ఈ వేయి బాహువులతో నేను ఏమి చేయవలెనుయ? (6) ఈ బాహువులకు తీట పుట్టినప్పుడు నేను నగరములను కొండలను పిండి చేయుచూ, దిగ్గజములతో యుద్ధమును చేయబోగా, అవి భయపడి పారిపోయినవి (7). నేను యమునితో మరియు అగ్నితో యుద్ధమును చేసితిని. వరుణుని నా ఆవులను కాసే గోపాలుని చేసితిని (8). కుబేరుని ఏనుగులపై కాపలాదారునిగను, నిర్‌ఋతిని సంరక్షకునిగా చేసితిని. ఇంద్రు నిజయించి స్వర్గలోకములో సర్వదా పన్ను కట్టునట్లు చేసితిని (9). యుద్ధములో నా ఈ బాహువులు శత్రువుల చేతులనుండి ప్రయోగించబడిన శస్త్రములచే శిథిలము కావలెను. అట్టి యుద్ధము యొక్క రాకను గురించి నాకు చెప్పుము (10). ఈ బాహువులు శత్రువుల చేతిలో వేయి ముక్కలు కావలెను. లేదా, శత్రువును పడగొట్టవలెను. ఓ మహేశ్వరా! నా ఈ కోర్కెను తీర్చుము (11).

సనత్కుమార ఉవాచ |

తచ్ఛ్రుత్వా కుపితో రుద్రస్త్వట్టహాసం మహాద్భుతమ్‌ | కృత్వా బ్రవీన్మహామన్యుర్భక్తబా ధాపహారకః || 12

సనత్కుమారుడిట్లు పలికెను -

భక్తుల బాధలను పోగొట్టే రుద్రుడు ఆ మాటను విని కోపించి మిక్కిలి అద్భుతమగు అట్టహాసమును చేసి గొప్ప కోపము గలవాడై ఇట్లు పలికెను (12).

రుద్ర ఉవాచ |

ధిక్‌ ధిక్‌ త్వాం సర్వతో గర్విన్‌ సర్వదైత్యుకులాధమ | బలిపుత్రస్య భక్తస్య నోచితం వచ ఈదృశమ్‌ || 13

దర్పస్యాస్య ప్రశమనం లప్స్యసే చాశు దారుణమ్‌ | మహాయుద్ధమకస్మాద్వై బలినా మత్సమేన హి || 14

తత్ర తే గిరిసంకాశా బాహవో% నలకాష్ఠవత్‌ | ఛిన్నా భూమౌ పతిష్యంతి శస్త్రాసై#్త్రః కదలీకృతాః || 15

యదేష మానుషశిరో మయూరసహితో ధ్వజః | వర్తతే తవ దుష్టాత్మంస్తస్య స్యాత్పాతనం యదా || 16

స్ధాపితస్యాయుధాగారే వినా వాతకృతం భయమ్‌ | తదా యుద్ధం మహాఘేరం సంప్రాప్తమితి చేతసి || 17

నిధాయ ఘోరం సంగ్రామం గచ్ఛే థాస్సర్వసైన్యవాన్‌ | సాంప్రతం గచ్ఛ తద్వేశ్మ యతస్తద్విద్యతే శివః || 18

తథా తాన్‌ స్వమహోత్పాతాంస్తత్ర ద్రష్టాసి దుర్మతే | ఇత్యుక్త్వా విరరామాథ గర్వహృద్భక్తవత్సలః || 19

రుద్రుడిట్లు పలికెను-

ఓ గర్విష్ఠీ! రాక్షసవంశమునకంతకూ అధముడవగు నీకు అన్ని విధములుగా నింద యగుగాక! బలిచక్కవర్తియొక్క కుమారుడవు మరియు భక్తుడవు అగు నీవు ఇట్టి వచనములను పలుకుట తగదు (13). నీవు ఈ దర్పమునకు తగిన భయంకరమగు ఫలితమును తొందరలోనే పొందగలవు. నీకు హఠాత్తుగా నాతో సముడగు బలశాలితో గొప్ప యుద్ధము సంప్రాప్తము కాగలదు (14). ఆ యుద్ధములో కొండలవంటి నీ బాహువులు శస్త్రాస్త్రముల ప్రభావముచే కాలిన కట్టెలవలె, అరటి బోదెలవలె నేలగూలును (15). ఓరీ దురాత్మా! మనిషి తలతో గూడిన నెమలి చిహ్మముగా గల నీ ఈ ధ్వజము ఆయుధాగారములో భద్రపరుచబడి యుండగా ఏ నాడైతే గాలియొక్క ఉపద్రవము లేకున్ననూ నేలగూలునో, ఆనాడు మిక్కిలి భయంకరమగు యుద్ధము మీద బడినదని మనస్సులో నిశ్చయించుకొని సైన్యములన్నిటినీ వెంటనిడుకొని ఆ భయంకర యుద్ధమునకు వెడలుము. ప్రస్తుతము శివుడు నివసించియున్న నీ నివాసమునకు వెళ్ళుము (16-18). ఓరీ దుర్బుద్ధీ! అపుడు నీవచట నీకు విపత్తును సూచించే దుష్టశకునములను గాంచెదవు. ఇట్లు పలికి భక్తవత్సలుడు, గర్వమును పోగొట్టువాడునగు శివుడు అపుడు మిన్నకుండెను (19).

సనత్కుమార ఉవాచ |

తచ్ఛ్రుత్వా రుద్రమభ్యర్చ్య దివ్యైరంజలికుడ్మలైః | ప్రణమ్య చ మహాదేవం బాణశ్చ స్వగృహం గతః || 20

కుంభాండాయ యధావృత్తం పృష్టః ప్రోవాచ హర్షితః | పర్యైక్షిష్టాసురో బాణస్తం యోగం హ్యుత్సుకస్తదా || 21

అథ దైవాత్క దాచిత్స స్వయం భగ్నం ధ్వజం చ తమ్‌ | దృష్ట్వా తత్రాసురో బాణో హృష్టో యుద్ధయ నిర్య¸° || 22

స స్వసైన్యం సమాహూయ సంయుక్తస్సాష్టభిర్గణౖః | ఇష్టిం సాంగ్రామికాం కృత్వా దృష్ట్వా సాంగ్రామికం మధు || 23

కకుభాం మంగలం సర్వం సంప్రేక్ష్య ప్రస్థితో%భవత్‌ | మహోత్సాహో మహావీరో బలిపుత్రో మహారథః || 24

ఇతి హృత్కమలే కృత్వా కః కస్మాదా గమిష్యతి | యోద్ధా రణప్రియో యస్తు నానాశస్త్రాస్త్రపారగః || 25

యస్తు బాహుసహస్రం మే ఛినత్త్వనలకాష్టవత్‌ | తథా శ##సై#్త్రర్మహాతీక్‌ష్ణేశ్ఛినద్మి శతశస్త్విహ || 26

సనత్కుమారుడిట్లు పలికెను-

బాణుడు ఆ మాటను విని దివ్యములగు మొగ్గలవంటి దోసిళ్లను ఒగ్గి మహాదేవుడగు శివుని పూజించి, ప్రణమిల్లి తన గృహమునకు వెళ్లెను (20). బాణాసురుడు జరిగిన వృత్తాంతమును కుంభాడుడు ప్రశ్నించగా వివరించి చెప్పెను. అతడు సర్వకాలములయందు ఉత్సాహముతో మరియు ఆనందముతో ఆ యుద్ధమనే యోగము కొరకు ఎదురు చూచుచుండెను (21). అపుడు ఒకనాడు దైవవశముచే అచట ధ్వజము తనంత తానుగా విరిగియుండగా గాంచి ఆ బాణాసురుడు ఆనందముతో యుద్ధమునకు బయులుదేరెను (22). అతడు తన సైన్యమును యుద్దమునకు సిద్దము చేసెను. ఎనిమిది మంది గణాధ్యక్షులు అతనికి తోడుగా వచ్చిరి. అతడు యుద్దములో విజయము కొరకై ఇష్టిని నిర్వహించి, యుద్ధములో వినియోగించే మధువును స్వయముగా పర్యవేక్షించెను (23). గొప్ప ఉత్సాహము గలవాడు, మహావీరుడు, మహారథుడు అగు ఆ బలి పుత్రుడు దిక్కులలో మంగళచిహ్నములను పరికించి ప్రయాణమాయెను (24). అతడు తన హృదయపద్మములోనిట్లు తలపోసెను: అనేకశస్త్రాస్త్రములలో దిట్ట, రణమునందు ప్రీతిగలవాడు అగు ఏ యుద్ధవీరుడు ఎక్కడనుండి రాగలడు? అతడు నా బాహువులను మిక్కిలి వాడియైన తన ఆయుధములతో చొప్పదంటులవలె ఛేదించవలెను. లేదా, నేనాతనిని ఈ యుద్ధరంగములో వంద ముక్కలు చేసెదను (25, 26).

ఏతస్మిన్నంతరే కామస్సం ప్రాప్తశ్శంకరేణ హి | యత్ర సా బాణదుహితా సుజాతా కృతమంగలా || 27

మాధవం మాధవే మాసి పూజయిత్వా మహానిశి | సుప్తా చాంతఃపురే గుప్తే స్త్రీ భావముపలంభితా || 28

గౌర్యా సంప్రేషితేనాపి వ్యాకృష్టా దివ్యమాయయా | కృష్ణాత్మజాత్మజేనాథ రుదంతీ సాహ్యనాథవత్‌ || 29

స చాపి తాం బలాద్భుక్త్వా పార్వత్యాస్సఖిభిః పునః | నీతస్తు దివ్యయోగేన ద్వారకాం నిమిషాంతరాత్‌ || 30

మృదితా సా తదోత్థాయ రుదంతీ వివిధా గిరః | సఖీభ్యః కథయిత్వా తు దేహత్యాగే కృతక్షణా || 31

సఖ్యా కృతాత్మనో దోషం సా వ్యాస స్మారితా పునః | సర్వం తత్పూర్వవృత్తాంతతో దృష్ట్వా చ సా భవత్‌ || 32

అబ్రవీచ్చి త్రలేఖాం చ తతో మధురయా గిరా | ఉషా బాణస్య తనయా కుంభాండతనయాం మునే || 33

ఇంతలో బాణుని కుమార్తె మంగళస్నానము నాచరించి చక్కగా అలంగకరించుకొనెను. ఆమె వైశాఖమాసములో మాధవుని పూజించి రక్షణ కలిగిన అంతఃపురమునందు రాత్రియందు స్త్రీ ధర్మమును పొంది యున్నదై నిద్రించెను. ఆ సమయములో అచటకు శంకరునితోగూడి కాముడు విచ్చేసెను (27, 28). దివ్యమాయయగు పార్వతిచే పంపబడిన శ్రీకృష్ణుని మనుమడు ఆమెను గట్టిగా లాగెను. ఆమె అనాథవలె రోదించెను (29). ఆతడు ఆమెను బలాత్కారముగా భోగించెను. అపుడు పార్వతియొక్క అనుచరులు ఆతనిని తమ దివ్యశక్తిచే క్షణకాలములో ద్వారకకు చేర్చిరి (30). ఈ విధముగా పీడకు గురిచేయబడిన ఆమె అపుడు నిద్ర లేచి ఏడ్చుచున్నదై సఖురాండ్రతో వివిధములగు మాటలను పలుకుతూ ఆత్మహత్యకు పూనుకొనెను (31). ఓ వ్యాసా! ఆమె పూర్వమునందు ఆచరించిన దోషమును ఆమెకు చెలికత్తె గుర్తుచేయగా, అపుడామె ఆ పూర్వవృత్తాంతమునంతనూ తన మదిలో తెలుసుకొనెను (32). ఓ మునీ! అపుడు బాణుని పుత్రికయగు ఉష కుంభాండుని కుమార్తె యగు చిత్రలేఖతో మధురమగు వచనమును ఇట్లు పలికెను (33).

ఉషోవాచ |

సఖి యద్యేష మే భర్తా పార్వత్యా విహితః పురా | కేనోపాయేన తే గుప్తః ప్రాప్యతే విధివన్మయా || 34

కస్మిన్‌ కులే స వా జాతో మమ యేన హృతం మనః | ఇత్యూషావచనం శ్రుత్వా సఖీ ప్రోవాచ తాం తదా || 35

ఉష ఇట్లు పలికెను -

ఓ సఖీ! పూర్వము పార్వతి ఈ రహస్యపురుషుని నాకు భర్తగా విధించియున్నచో, వానిని నేను యథావిధిగా వివాహమాడుటకై నీవు ఏమి ఉపాయమును చేసెదవు? (34) నా మనస్సును దోచిన ఆ పురుషుడు జన్మించిన వంశము ఏదియో? ఉషయొక్క ఈ మాటను విని ఆ చెలికత్తె అప్పుడు ఆమెతోనిట్లనెను (35).

చిత్రలేఖోవాచ |

త్వయా స్వప్నే చ యో దృష్టః పురుషో దేవి తం కథమ్‌ | అహం సమానయిష్యామి న విజ్ఞాతస్తు యో మమ || 36

దైత్యకన్యా తదుక్తే తు రాగాంధా మరణోత్సుకా | రక్షితా చ తయా సఖ్యా ప్రథమే దివసే తతః || 37

పునః ప్రోవాచ సోషాం వై చిత్రలేఖా మహామతిః | కుంభాండస్య సుతా బాణతనయాం మునిసత్తమ || 38

చిత్రలేఖ ఇట్లు పలికెను -

ఓ దేవీ! స్వప్నములో నీవు చూచిన పురుషుడు ఎవరో నాకు తెలియదు. నేను అతనిని ఎట్లు తీసుకొని రాగలను? (36) ఆ మాటను విని ఆ బాణాసురుని పుత్రిక గుడ్డి ప్రేమలో పడి ఆత్మహత్యకు పూనుకొనగా, ఆ చెలికత్తె మొదటి రోజున ఆమెను రక్షించెను (37). కుంభాండుని పుత్రికయగు చిత్రలేఖ గొప్ప బుద్ధిమంతురాలు. ఓమహర్షీ ! ఆమె బాణుని పుత్రికయగు ఉషతో మరల నిట్లనెను (38).

చిత్రలేఖోవాచ |

వ్యసనం తే%పకర్షామి త్రిలోక్యాం యది భాష్యతే | సమానేష్యే నరం యస్తే మనోహర్తా తమాదిశ || 39

చిత్రలేఖ ఇట్లు పలికెను -

నీ మనస్సును దోచిన పురుషుని గురించి నీవు వివరించి చెప్పినచో, అతడు ముల్లోకములలో ఎక్కడనున్ననూ తీసుకువచ్చి నీ దుఃఖమును పోగొట్టగలను. కాన వానిని గురించి చెప్పుము (39).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్త్వా వస్త్రపుటకే దేవాన్‌ దైత్యాంశ్చ దానవాన్‌ | గంధర్వసిద్ధనాగాంశ్చ యక్షాదీంశ్చ తదాలిఖత్‌ || 40

తథా నరాంస్తేఘు వృష్ణీన్‌ శూరమానకదుందుభిమ్‌ | వ్యలిఖద్రామకృష్ణౌ చ ప్రద్యుమ్నం నరసత్తమమ్‌ || 41

అనిరుద్ధం విలిఖితం ప్రాద్యుమ్మిం వీక్ష్య లజ్జితా | ఆసీదవాఙ్ముఖీ చోషా హృదయే హర్షపూరితా || 42

ఉషా ప్రోవాచ చోరో%సౌ మయా ప్రాప్తస్తు యో నిశి | పురుషస్సఖి యేనాశు చేతోరత్నం హృతం మమ || 43

యస్య సంస్పర్శనాదేవ మోహి తాహం తథాభవమ్‌ | తమహం జ్ఞాతుమిచ్ఛామి వద సర్వం చ భామిని || 44

కస్యాయమన్వయే జాతో నామ కిం చాస్య విద్యతే | ఇత్యుక్తా సాబ్రవీన్నామ యోగినీ తస్య చాన్వయమ్‌ || 45

సర్వమాకర్ణ్య సా తస్య కులాది మునిసత్తమ | ఉత్సుకా బాణతనయా బభాషే సా తు కామినీ || 46

సనత్కుమారుడిట్లు పలికెను-

ఇట్లు పలికి ఆమె వస్త్ర శకలముపై దేవతలను, దానవులను దైత్యులను, గంధర్వులను, సిద్ధులను, నాగులను మరియు యక్షులు మొదలగు వారిని చిత్రించెను (40). ఇంతేగాక ఆమె మానవులను, వారిలో వృష్ణి వంశీయులను, శూరుడగు వసుదేవుని, బలరాముని, శ్రీకృష్ణుని, నరోత్తముడగు ప్రద్యుమ్నుని, ఆతని కుమారుడగు అనిరుద్ధుని కూడా చిత్రించెను. ఉషా అనిరుద్ధుని గాంచి సిగ్గుతో తల వంచుకొనెను. ఆమె హృదయము ఆనందముతో నిండిపోయెను (41, 42). రాత్రియందు నన్ను పొందిన చోరుడు ఈ పురుషుడే. నా శ్రేష్ఠమగు మనస్సును వెంటనే దొంగిలించిన వాడు వీడే. ఓ సఖీ! (43) వీని స్పర్శ మాత్రముచే నేను మోహమును పొందితిని. ఓ భామినీ ! ఆతనిని గురించి సర్వవృత్తాంతమును నేను తెలియగోరుచున్నాను, చెప్పుము అని ఉష పలికెను (44). ఈతడు జన్మించిన వంశము ఏది? వీని పేరు ఏమి? ఉష ఇట్లు ప్రశ్నంచగా యోగవిద్యలలో నిష్ణాతురాలగు ఆమె ఆతని వంశమును మరియు పేరును చెప్పెను (45). ఓ మహర్షీ! బాణుని కుమార్తెయగు ఆ ఉష వాని కులము మొదలగు వివరముల నన్నిటినీ విని ప్రేమ, ఉత్సాహము పెల్లుబుకుచుండగా ఇట్లు పలికెను (46).

ఉషోవాచ |

ఉపాయం రచయ ప్రీత్యా తత్ప్రాపై#్త్య సఖి తత్‌క్షణాత్‌ | యేనోపాయేన తం కాంతం లభేయ ప్రాణవల్లభమ్‌ || 47

éయం వినాహం క్షణం నైకం సఖి జీవితుముత్సహే | తమానయేహ సద్యత్నాత్సుఖినీం కురు మాం సఖి || 48

ఉష ఇట్లు పలికెను -

ఓ సఖీ! వెటనే నేను వానిని పొందే ఉపాయమును ప్రేమతో అనుష్ఠించుము. ప్రాణప్రియుడగు ఆ సుందరుని నేను పొందే ఉపాయమేమి? (47) ఓ సఖీ! అతడు లేనిదే క్షణమైననూ జీవించుటకు నాకు ఉత్సాహము లేదు. ఓ సఖీ! నీవు మంచి ప్రయత్నమును చేసి వానిని ఇచటకు గొని వచ్చి నాకు సుఖమును కలిగించుము (48).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్తా సా తథా బాణాత్మజయా మంత్రికన్యకా | విస్మితా భూన్మునిశ్రేష్ఠ సువిచారపరా%భవత్‌ || 49

తతస్సఖీం సమాభాష్య చిత్రలేఖా మనోజవా | బుద్ధ్వాతం కృష్ణపౌత్రం సా ద్వారకాం గంతుముద్యతా || 50

జ్యేష్ఠకృష్ణచతుర్దశ్యాం తృతీయే తు గతే%హని | ఆ ప్రభాతాన్ముహూర్తే తు సంప్రాప్తా ద్వారకాం పురీమ్‌ || 51

ఏకేన క్షణమాత్రేణ నభసా దివ్యయోగినీ | తతశ్చాంతః పురోద్యానే ప్రాద్యుమ్నిర్దదృశే తయా || 52

క్రీడన్నారీజనై స్సార్ధం ప్రపిబన్‌ మాధవీమధు | సర్వాంగసుందరశ్శ్యామ స్సుస్మితో నవ¸°వనః || 53

తతః ఖట్వాం సమారూఢ మంధకారపటేన సా | ఆచ్ఛాదయిత్వా యోగేన తామసేన చ మాధవమ్‌ || 54

తతస్సా మూర్థ్ని తాం ఖట్వాం గృహీత్వా నిమిషాంతరాత్‌ | సంప్రాప్తా శోణితపురం యత్ర సా బాణనందినీ || 55

సనత్కుమారుడిట్లు పలికెను -

ఓ మహర్షీ ! బాణుని కుమారైయగు ఉష ఇట్లు పలుకగా మంత్రిపుత్రికయగు ఆ చిత్రలేఖ ఆశ్చర్యమును పొంది లోతుగా ఆలోచించ మొదలిడెను. (49). ఆ యువకుడు శ్రీకృష్ణుని మనుమడు అని తెలిసిన చిత్రలేఖ తన సఖి వద్ద సెలవు తీసుకొని ద్వారకకు వెళ్లుటకు సిద్ధమాయెను (50). ఆమె జేష్ఠ కృష్ణ చతుర్దశి నుండి మూడవనాడు సూర్యోదయమునకు ముందు మంచి ముహూర్తములో ద్వారకకు చేరెను (51). దివ్యములగు యోగశక్తులు గల ఆమె ఒక క్షణకాలములో ఆకాశమార్గముగుండా అచటకు చేరి అచట అంతఃపురోద్యానవనములో అనిరుద్ధుని గాంచెను (52). ఆతడు స్త్రీజనముతో గూడి విహరించి మధువును సేవించి తరువాత మంచముపై శయనించెను. సర్వావయవసుందరుడు, శ్యామలవర్ణము గలవాడు, చక్కని చిరునవ్వు గలవాడు, నూతన ¸°వనములో నున్నవాడు అగు ఆ అనిరుద్ధుని ఆమె తామస యోగ ప్రభావముచే అంధకారముతో కప్పివేసి (53, 54), ఆ మంచమును శిరముపై నిడుకొని ఒక నిముషములో శోణితపురమునకు వచ్చెను. అచట బాణుని పుత్రిక వేచి యుండెను (55).

కామార్తా వివిధాన్‌ భావాన్‌ చకారోన్మత్త మానసా | ఆనీతమథ తం దృష్ట్వా తదా భీతా చ సాభవత్‌ || 56

అంతఃపురే సుగుప్తే చ నవే తస్మిన్‌ సమాగమే | యావత్‌ క్రీడి తుమారబ్ధం తావత్‌ జ్ఞాతం చ తత్‌ క్షణాత్‌ || 57

అంతః పురద్వారగతై ర్వేత్ర జర్జర పాణి భిః | ఇంగితై రనుమానైశ్చ కన్యా దౌశ్శీల్యమాచరన్‌ || 58

స చాపి దృష్టసై#్తస్తత్ర నరో దివ్యవపుర్ధరః | తరుణో దర్శనీయస్తు సాహసీ సమరప్రియః || 59

తం దృష్ట్వా సర్వమాచఖ్యుర్బాణాయ బలిసూనవే | పురుషాస్తే మహావీరాః కన్యాంతః పురరక్షాకాః || 60

కామపీడితురాలైన ఆమె పిచ్చిదాని వలె అనేక భావప్రకటనలను చేసెను. అచటకు గొనిరాబడిన ఆ అనిరుద్ధుని గాంచి ఆమె అపుడు భయపడెను (56). దృఢమగు రక్షణ కలిగిన ఆ అంతఃపురములో ఆ ప్రేమికులిద్దరు మొదటి సమాగమములో విహరించుట నారంభించగానే ఆ విషయము బయటకు పొక్కెను (57). బెత్తములను ధరించుటచే శిథిలమైన చేతులు గల అంతఃపురద్వారపాలకులు కన్యతో దుర్వ్యవహారమును నడుపుచున్న పురుషుని గురించి ఆయా చిహ్నములను బట్టి ఊహించిరి (58). దివ్యమగు దేహమును ధరించియున్నవాడు, మానవుడు, యువకుడు, సుందరుడు, సాహసి, యుద్ధమునందు ప్రీతిగలవాడు అగు అనిరుద్ధుని వారు అచట కళ్లారా గాంచిరి (59). మహావీరులు, కన్యాంతఃపురమును రక్షించువారు అగు ఆ పురుషులు వానిని చూచి ఆ వృత్తాంతమునంతనూ బలిపుత్రుడగు బాణునకు విన్నవించిరి (60).

ద్వారపాలా ఊచుః |

దేవ కశ్చిన్న జానీతే గుప్తశ్చాంతఃపురే బలాత్‌ | స కస్తు తవ కన్యాం వై స్వయంగ్రాహాదధర్షయత్‌ || 61

దానవేంద్ర మహాబాహో పశ్య పశ్యైనమత్ర చ | యద్యుక్తం స్యాత్తత్కురుష్వ న దుష్టా వయమిత్యుత || 62

ద్వారపాలకులిట్లు పలికిరి-

ఓ మహారాజా ! ఇది ఎట్లు జరిగినదో ఎవ్వరికీ తెలియదు. ఒకానొక పురుషుడు రహస్యముగా అంతఃపురములో ప్రవేశించి నీ కుమార్తెను బలాత్కారముగా తన వశము చేసుకొనినాడు (61). ఓ రాక్షస రాజా! గొప్ప బాహువులు గలవాడా! వానిని అచట నీవు స్వయముగా చూచి నీకు ఏది యోగ్యమని తోచునో, అట్లు చేయుము. మా దోషమేమియు లేదు (62).

సనత్కుమార ఉవాచ |

తేషాం తద్వచనం శ్రుత్వా దానవేంద్రో మహాబలః | విస్మితో%భూ న్మునిశ్రేష్ఠ కన్యాయా శ్శ్రుతదూషణః || 63

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్ర సంహితాయాం యుద్ధఖండే ఉషాచరిత్రవర్ణనం నామ ద్విపంచాశత్తమో%ధ్యాయః (52)

సనత్కుమారుడిట్లు పలికెను-

ఓ మహర్షీ ! వారి ఆ మాటలను విని మహాబల శాలియగు ఆ రాక్షసరాజు తన కుమార్తెయొక్క శీలము చెడినందులకు ఆశ్చర్యమును పొందెను (63).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో ఉషాచరిత్రవర్ణనమనే ఏబది రెండవ అధ్యాయము ముగిసినది. (52)

Siva Maha Puranam-3    Chapters