Siva Maha Puranam-3    Chapters   

అథ షష్ఠో%ధ్యాయః

బ్రాహ్మణస్త్రీ స్వర్గతిని పొందుట

సూత ఉవాచ|

గౌశ్చైవకాప్యభవత్తత్ర హ్యంగణ బంధితా శుభా | తదైవ బ్రాహ్మణో రాత్రావాజగామ బహిర్గతః || 1

స ఉవాచ ప్రియాం స్వీయాం దృష్ట్వా గామంగణ స్థితామ్‌ | అదుగ్ధాం ఖేద నిర్విణ్ణో దోగ్ధుకామో మునీశ్వరాః || 2

గౌః ప్రియే నైవ దుగ్ధాతే సేత్యుక్తా వత్సమానయత్‌ | దోహానార్థం సమాహూయ స్త్రియం శీఘ్రతరం తదా || 3

వత్సం కీలే స్వయం బద్ధుం యత్నం చైవాకరోత్తదా | బ్రాహ్మణస్స గృహస్వామీ మునయో దుగ్ధలాలసః || 4

వత్సో%పి కర్షమాణశ్చ పాదే వై పాదపీడనమ్‌ | చకార బ్రాహ్మణశ్చైవ కష్టం ప్రాప్తశ్చ సువ్రతాః || 5

తేన పాద ప్రహరేణ స ద్విజః క్రోధమూర్ఛితః | వత్సం చ తాడయామాస కూపైర్దృఢతరం తదా || 6

వత్సో%పి పీడితస్తేన శ్రాంతశ్చైవాభవత్తదా| దుగ్ధా గౌర్మోచితో వత్సో నక్రోధేన ద్విజన్మనా || 7

గౌర్దోగ్ధుం చ మహత్ర్పీత్యా రోదనం చాకరోత్తదా | దృష్ట్వా చ రోదనం తస్యా వత్సో వాక్యమథాబ్రవీత్‌ || 8

సూతుడిట్లు పలికెను-

అచట వాకిట్లో ఒక శుభకరమగు ఆవు కట్టివేయబడి యుండెను. అదే సమయములో గ్రామాంతరమునకు వెళ్లిన గృహయజమానియగు బ్రాహ్మణుడు రాత్రియందు మరలి వచ్చెను (1). వాకిట్లోనున్న ఆవుని గాంచి ఆ బ్రాహ్మణుడు తన ప్రియురాలితో ఒక మాటను చెప్పెను. ఓ మహర్షులారా! ఆ ఆవునకు పాలను పితుకకుండుటచే ఆ యజమాని దుఃఖితుడాయెను (2). ఓ ప్రియురాలా! ఆవు పాలను పితుకనే లేదు, అని చెప్పగా ఆమె పాలను పితుకుటకొరకై దూడను తీసుకొని వచ్చెను. ఆ యజమాని తన భార్యను కంగారు పెట్టుచుండెను (3). అపుడాయన ఆ దూడను రాటకు కట్టుటకు ప్రయత్నము చేయుచుండెను. ఓ మునులారా! గృహయజమాని యగు ఆ బ్రాహ్మణుడు పాలయందు లోభమును కలిగియుండెను (4). ఓ గొప్ప నిష్ఠగల మహర్షులారా! ఆయన దూడను లాగుచుండగా అది ఆయన కాలిపై తొక్కెను. దానితో ఆ బ్రాహ్మణునకు చాల నొప్పి కలిగెను (5). దూడ కాలిని తొక్కగానే ఆ బ్రాహ్మణుడు కోపమును పట్టజాలక దానిని కట్టురాటతో గట్టిగా కొట్టెను (6). అపుడా దూడ ఆ దెబ్బలను తిని చాల అలసి పోయెను. ఆ బ్రాహ్మణుడు కోపమును పొంది పాలను పితికిన తరువాతనైనూ దూడను విడువలేదు (7). ఆవు ప్రేమతో దూడకు పాలను ఈయగోరెను. కాని అది కుదరకపోవుటచే అది చాల దుఃఖించెను. దాని రోదనమును గాంచిన దూడ ఆవుతో నిట్లు పలికెను (8).

వత్స ఉవాచ|

కథం చ రుద్యతే మాతః కిం తే దుఃఖముపస్థితమ్‌ | తన్నివేదయ మే ప్రీత్యా తచ్ఛ్రుత్వా గౌరవోచత || 9

శ్రూయతాం పుత్రమే దుఃఖం వక్తుం శక్నోమ్యహం నహి | దుష్టేన తాడితస్త్వం చ తేన దుఃఖం మమాప్యభూత్‌ || 10

దూడ ఇట్లు పలికెను-

తల్లీ! ఏల ఏడ్చుచున్నావు? నీకు వచ్చిన కష్టమేమి? నాతో ప్రేమపూర్వకముగా చెప్పుము. ఈ మాటను విని ఆవు ఇట్లు పలికెను (9). ఓ కుమారా! వినుము. నాకు కలిగిన దుఃఖమును గురించి చెప్పలేకున్నాను. ఆ దుష్టుడు నిన్ను కొట్టినాడు. అందువలననే నాకు దుఃఖము కలిగినది (10).

సూత ఉవాచ |

స్వమాతుర్వచనం శ్రుత్వా స వత్సః ప్రత్యచోదయత్‌ | ప్రత్యువాచ స్వజననీం ప్రారబ్ధ పరినిష్ఠితః || 11

కిం కర్తవ్యం క్వ గంతవ్యం కర్మబద్ధా వయం యతః | కృతం చైవ యథా పూర్వం భుజ్యతే చ తథాధునా || 12

హసతా క్రియతే కర్మ రుదతా పరిభుజ్యతే | దుఃఖదాతా న కో%ప్యస్తి సుఖదాత న కశ్చన || 13

సుఖదుఃఖే పరో దత్త ఇత్యేషా కుమతిర్మతా | అహం చాపి కరోమ్యత్ర మిథ్యాజ్ఞానం తదోచ్యతే || 14

స్వకర్మణా భ##వేద్దుఃఖం సుఖం తేనైవ కర్మణా | తస్మాచ్చ పూజ్యతే కర్మ సర్వం కర్మణి సంస్థితమ్‌ || 15

త్వం చైవాహం చ జనని ఇమే జీవాదయశ్చ యే | తే సర్వే కర్మణా బద్ధా న శోచ్యాః కర్హిచిత్త్వయా || 16

సూతుడిట్లు పలికెను-

తల్లియొక్క ఆ మాటను విని దూడ ప్రారబ్ధమునందు దృఢమగు నిష్ఠగలదై తన తల్లికి ఇట్లు బోధించెను (11). ఏమి చేయవలెను? ఎచటకు పోవలెను? మనము కర్మచే బంధింపబడి యున్నాము గదా! గతములో మనము చేసిన కర్మలకు అనురూపమైన ఫలమును ఇపుడు అనుభవించుచున్నాము (12). జీవుడు నవ్వుతూ కర్మలను చేసి ఏడుస్తూ వాటి ఫలముల ననుభవించును. జీవునకు సుఖము గాని దుఃఖమునుగాని ఇచ్చువారు ఇతరులు ఎవ్వరూ లేరు (13). సుఖదుఃఖములను ఇతరులిచ్చెదరను భావన తప్పు. నేను కర్తను అను ధారణ కూడ అజ్ఞానమేనని పెద్దలు చెప్పెదరు (14). జీవుడు తాను చేసిన కర్మల కనురూపముగా సుఖదుఃఖములను పొందును. కావున కర్మ పూజింపబడుచున్నది. సర్వము కర్మయందు ప్రతిష్ఠితమై యున్నది (15). ఓ తల్లీ! నీవు, నేను మరియు ఈ ఇతర సర్వ జీవులు కర్మచే బంధింపబడి యున్నారు. కావున నీవు ఏకాలమునందైననూ ఇతరుల గురించి దుఃఖించ తగదు (16).

సూత ఉవాచ |

ఏవం శ్రుత్వా స్వపుత్రస్య వచనం జ్ఞానగర్భితమ్‌ | పుత్రశోకాన్వితా దీనా సా చ గౌరబ్రవీదిదమ్‌ || 17

సూతుడు ఇట్లు పలికెను-

పుత్రశోకముతో గూడి దీనురాలైయున్న ఆ గోవు జ్ఞానముతో నిండియున్న తన పుత్రుని ఈ మాటలను విని ఇట్లు పలికెను (17).

గౌరువాచ |

వత్స సర్వం విజానామి కర్మాధీనాః ప్రజా ఇతి | తథా%పి మాయయా గ్రస్తా దుఃఖం ప్రాప్నోమ్యహం పునః || 18

రోదనంచ కృతం భూరి దుఃఖశాంతిర్భవేన్న హి | ఇత్యేతద్వచనం శ్రుత్వా ప్రసూంవత్సో%బ్రవీదిదమ్‌ || 19

ఆవు ఇట్లు పలికెను-

ఓ కుమారా! జీవులు కర్మకు వశులై యందురును విషయమునంతనూ నేను ఎరుంగుదును. అయిననూ, జీవులు మాయకు లోబడి యుందురు. కావుననే నాకు దుఃఖము కలుగుచున్నది (18). చాలసేపు రోదించితిని. అయిననూ, దుఃఖము తగ్గుటలేదు. తల్లియొక్క ఈ మాటలను విని దూడ ఇట్లు పలికెను (19).

వత్స ఉవాచ |

యద్యేవం చ విజానాసి పునశ్చ రుదనం కుతః | కృత్వా చ సాధ్యతే కించిత్తస్మాద్దుఃఖం త్యజాధునా || 20

దూడ ఇట్లు పలికెను-

నీకీ సత్యము తెలిసియున్నచో, మరల రోదించుటకు కారణమేమి? ఏడ్చి సాధించునది ఏమి గలదు? కావున ఇపుడు వెంటనే దుఃఖమును విడిచిపెట్టుము (20).

సూతఉవాచ |

ఏవం పుత్ర వచశ్ర్శుత్వా తన్మాతా దుఃఖసంయుతా | నిశ్శ్వస్యాతి తదా ధేనుర్వత్సం వచన మబ్రవీత్‌ || 21

సూతుడు ఇట్లు పలికెను-

పుత్రుని ఈ మాటను విని ఆ గోమాత దుఃఖముతో నిండిన మనస్సుగలదై నిట్టూర్పులను విడచి అపుడు ఇట్లు పలికెను (21).

గౌరువాచ |

మమ దుఃఖం తదా గచ్ఛేద్యథా దుఃఖం తథా విధమ్‌ | భ##వేద్ధి బ్రాహ్మణస్యాపి సత్యమేతద్ర్బ వీమ్యహమ్‌ || 22

ప్రాతశ్చైవ మయా పుత్ర శృంగాభ్యాం హి హనిష్యతే | హతశ్చ జీవితం సద్యో యాస్యత్యస్య న సంశయః || 23

గోవు ఇట్లు పలికెను-

నాకు కలిగిన దుఃఖము వంటి దుఃఖము ఈ బ్రాహ్మణునకు కూడ కలుగవలెను. అప్పుడు మాత్రమే నా దుఃఖము ఉపశమించును. నేను సత్యమును పలుకుచున్నాను (22). ఓ పుత్రా! ఉదయమే నేను వీని పుత్రుని కొమ్ములతో పొడిచెదను. అపుడు బాలకుడు నిస్సందేహముగా ప్రాణములను గోల్పోవును (23).

వత్స ఉవాచ |

ప్రథమం యత్కృతం కర్మ తత్ఫలం భుజ్యతే%ధునా | అస్యాశ్చ బ్రహ్మహత్యాయా మాతః కిం ఫలమాప్స్యసే || 24

సమాభ్యాం పుణ్య పాపాభ్యాం భ##వేజ్జన్మ చ భారతే | తయోః క్షయే చ భోగేన మాతర్ముక్తిరవాప్యతే || 25

కదాపి కర్మణో నాశః కదా భోగః ప్రజాయతే | తస్మాచ్చ పునరేవం త్వం కర్మ మా కర్తుముద్యతా ||26

అహం కుతస్తే పుత్రో%ద్య త్వం మాతా కుత ఏవ చ | వృథాభిమానః పుత్రత్వే మాతృత్వే చ విచార్యతామ్‌ || 27

క్వ మాతా క్వ పితా విద్ధి క్వ స్వామీ క్వ కలత్రకమ్‌ | న కో%పి కస్య చాస్తీహ సర్వే%పి స్వకృతం భుజః || 28

ఏవం జ్ఞాత్వా త్వయా మాతర్దుః ఖం త్యాజ్యం సుయత్నతః | సుభగాచరణం కార్యం పరలోక సుఖేప్సయా || 29

దూడ ఇట్లు పలికెను-

పూర్వమునందు చేయబడిన కర్మల ఫలము ఇప్పుడు మనచే అనుభవింపబడుచున్నది. ఓ తల్లీ! నీవు ఈ బ్రహ్మహత్యను చేసి ఎట్టి ఫలమును పొందెదవో గదా! (24)పుణ్యపాపములు సమానముగా నున్న జీవుడు భారతదేశములో జన్మించును. ఓ తల్లీ! వాటిని అనుభవించినచో, అవి క్షయమై తరువాత ముక్తి లభించును (25). ఒకప్పుడ కర్మ ఫలమునీయకుండగా నశించిననూ, మరియొకప్పుడు కర్మఫలము లభించును. కావున నీవు మరల ఇట్టి కర్మను చేయుటకు పూనుకొనరాదు (26). విచారించి చూచినచో నేను నీకు పుత్రుడనగుట యెట్లు? నీవు తల్లివి అగుట యెట్లు? పుత్రుడు అనియు, తల్లి అనియు ఈ అభిమానము వ్యర్థము (27). తండ్రి ఎక్కడ? తల్లి ఎక్కడ? భర్త ఎక్కడ? భార్య ఎక్కడ? ఈ లోకములో ఎవరూ ఎవరికీ ఏమీకారని తెలుసుకో. సర్వప్రాణులు తమ కర్మఫలమును అనుభవించుచుందురు (28). ఓ తల్లీ! నీవీ సత్యమునెరింగి దుఃఖమును ప్రయత్నపూర్వకముగా ప్రక్కన బెట్టుము. పరలోకమునందు సుఖమును గోరు జీవుడు పుణ్యకార్యములను చేయవలెను (29).

గౌరువాచ|

ఏవం జానామ్యహం పుత్ర మాయా మాం న జహాత్య సౌ | త్వద్దుఃఖేన స దుఃఖం మే తసై#్మ దాస్యే తదేవ హి || 30

పునశ్చ బ్రహ్మహత్యాయా నాశో యత్ర భ##వేదిహ | తత్‌స్థలం చ మయా దృష్టం హత్యా మే హి గమిష్యతి || 31

ఆవు ఇట్లు పలికెను-

ఓ పుత్రా! ఈ విషయమును నేనెరుంగుదును. కాని ఈ మాయ నన్ను విడిచిపెట్టుట లేదు. నీ దుఃఖమును గాంచిన నాకు చాలదుఃఖము కలిగినది. కావున అదే దుఃఖమును వానికి కూడ కలిగించెదను (30). ఇంతే గాక బ్రహ్మహత్యను పోగొట్టే స్థలమును నేను చూచియుంటిని. కావున నా బ్రహ్మ హత్యాదోషము నివారింపబడగలదు (31).

సూత ఉవాచ |

ఇత్యేతద్వచనం శ్రుత్వా స్వమాతుర్గోర్ద్విజోత్తమాః | మౌనత్వం స్వీకృతం తత్ర వత్సేనోక్తం న కించన || 32

తయోస్తదద్భుతం వృత్తం శ్రుత్వా పాంథో ద్విజస్తదా | హృదా విచారయామాస విస్మితో హి మునీశ్వరాః || 33

ఇదమత్యద్భుతం వృత్తం దృష్ట్వా ప్రాతర్మయా ఖలు | గంతవ్యం పునరేవాతో గంతవ్యం తత్‌స్థలం పునః || 34

సూతుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ఆ దూడ అపుడు తన తల్లియగు గోవు యొక్క ఆ వచనములను విని మౌనముగా నుండిపోయెను (32). ఓ మహర్షులారా! వారి ఆ అద్భుత సంవాదమును విని బాటసారియగు బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి తన మనస్సులో నిట్లు తలపోసెను (33). ఉదయము ఈ అత్యద్భుతమగు వృత్తాంతమును చూచి తరువాతనే నేను నా గమ్యస్థానమునకు బయలుదేరవలెను (34).

విచార్యేతి హృదా విప్రస్స ద్విజాస్సేవకేన చ | సుష్వాప తత్ర జననీ భక్తః పరమవిస్మితః || 35

ప్రాతః కాలే తదా జాతే గృహస్వామీ సముత్థితః | బోధయామాస తం పాంథం వచనం చేదమబ్రవీత్‌ || 36

ఓ బ్రాహ్మణులారా! తల్లియందు భక్తి గల ఆ బాటసారి బ్రాహ్మణుడు మిక్కిలి విస్మయమును పొంది ఈ విధముగా తన మనస్సులో తలపోసి అచట సేవకునితో గూడి నిద్రించెను (35). తెల్ల వారగానే ఆ గృహయజమాని నిద్రలేచి ఆ బాటసారిని నిద్రలేపి ఇట్లు పలికెను (36).

ద్విజ ఉవాచ |

స్వపిషి త్వం కిమర్థం హి పాత్రః కాలో భవత్వలమ్‌ | స్వయాత్రాం కురు తం దేశం గమనేచ్ఛా చ యత్ర హ || 37

తేనోక్తం శ్రూయతాం బ్రహ్మన్‌ శరీరే సేవకస్య మే | వర్తతే హి వ్యథా స్థిత్వా ముహూర్తం గమ్యతే తతః || 38

బ్రాహ్మణుడిట్లు పలికెను-

నీవింకనూ ఏల నిద్రించుచున్నావు? తెల్లవారినది. నిద్ర చాలును. నీవు పొందగోరే స్థలమునకు యాత్రను చేపట్టుము (37). అపుడాయన ఇట్లు బదులిడెను. ఓ బ్రాహ్మణా! నా సేవకుని శరీరములో నొప్పి ఉన్నది. కొద్దిసేపు ఉండి తరువాత వెళ్లెదము (38).

సూత ఉవాచ |

ఇత్యేవం చ మిషం కృత్వా సుష్వాప పురుషస్తదా | తద్వృత్త మఖిలం జ్ఞాతుమద్భుతం విస్మయావహమ్‌ ||39

దోహనస్య తదా కాలే బ్రాహ్మణ స్స్వసుతం ప్రతి | ఉవాచ గంతుకామాశ్చ కార్యార్థం కుత్రచిచ్ఛ సః || 40

సూతుడిట్లు పలికెను-

అపుడా బ్రాహ్మణుడు ఆశ్చర్యమును గొల్పు ఆ అద్భుత వృత్తాంతమునంతనూ తెలియగోరి ఈ విధమగు వంకపెట్టి మరల నిద్రించెను (39). ఇంతలో పాలను పితికే వేళ ఆయెను. ఆ బ్రాహ్మణుడు పని మీద బయటకు వెళ్లగోరి తన కుమారునితో నిట్లు పలికెను (40).

పితోవాచ |

మయా తు గమ్యతే పుత్ర కార్యార్థం కుత్రచిత్పునః | ధేనుర్దోహ్యా త్వయా వత్స సావధానాదియం నిజా || 41

తండ్రి ఇట్లు పలికెను-

ఓ పుత్రా! నేను ఒక పనిమీద ఒక చోటకు వెళ్లుచుంటిని. కుమారా! మన ఈ ఆవును నీవు జాగ్రత్తగా పాలను పితుకుము (41).

సూత ఉవాచ |

ఇత్యుక్త్వా బ్రాహ్మణ వరస్స జగామ చ కుత్ర చిత్‌ | పుత్రస్సముత్థితస్తత్ర వత్సం చ ముక్తవాంస్తదా || 42

మాతా చ తస్య దోహార్థమాజగామ స్వయం తదా | ద్విజపుత్రస్తదా వత్సం ఖిన్నం కీలేన తాడి తమ్‌ || 43

బంధనార్థం హి గోపార్శ్వమనయద్దు గ్ధ లాలసః | పునర్గౌశ్చ తదా క్రుద్ధా శృంగేనాతాడయచ్చ తమ్‌ || 44

పపాత మూర్ఛాం సంప్రాప్య సో%పి మర్మణి తాడితః | లోకాశ్చ మిలితాస్తత్ర గహ బాలో విహింసితః || 45

జలం జలం వదంతస్తే పిత్రాద్యా యత్ర సంస్థితాః | యత్నశ్చ క్రియతే యావత్తావద్బాలో మృతస్తదా || 46

మృతే చ బాలకే తత్ర హాహాకారో మహానభూత్‌ | తన్మాతా దుఃఖితా హ్యాసీద్రురోద చ పునః పునః || 47

కిం కరోమి క్వ గచ్ఛామి కో మే దుఃఖం వ్యపోహతి | రుదిత్వేతి తదా గాం చ తాడయిత్వా వ్యమోచయత్‌ || 48

సూతుడు ఇట్లు పలికెను-

ఆ బ్రాహ్మణుశ్రేష్ఠుడు ఇట్లు పలికి ఎచ్చటికో వెళ్లెను. అపుడాయన పుత్రుడు లేచి దూడను విడిచిపెట్టెను (42). అపుడు వాని తల్లి పాలను పితుకుటకై స్వయముగా వచ్చెను. రాటచే కొట్టబడుటచే దూడ భేదమును పొంది యుండెను (43). పాలయందు లోభము గల ఆ బాలకుడు దూడను ఆవు సమీపమునకు తీసుకొని వెళ్లెను. అపుడా ఆవు కోపించి వానిని కొమ్ములతో పొడిచెను (44). ఆ దెబ్బ మర్మ స్నానమునందు తగులుటచే ఆ బాలకుడు క్రిందపడి మూర్ఛిల్లెను. బాలుని ఆవు చంపివేసినది అని పలుకుచూ జనులు గుమిగూడిరి (45). నీటిని తెండు, నీటిని తెండు అని పలుకుతూ తండ్రి మొదలగు వారు ఆ బాలకుని రక్షించే ప్రయత్నమును చేయుచుండగనే ఆతడు మరణించెను (46). ఆ బాలకుడు మరణించగనే పెద్ద హాహాకారము చెలరేగెను. ఆతని తల్లి దుఃఖితురాలై పలుమార్లు ఏడ్చెను (47) నేనేమి చేయుదును? ఎచటకు పోయెదను? నా దుఃఖమును ఎవరు పోగొట్టెదరు? ఆమె ఇట్లు ఏడ్చి ఆవును కొట్టి బంధమును విడదీసెను (48).

శ్వేతవర్ణా తదా సా గౌర్ద్రుతం శ్యామా వ్యదృశ్యత | అహో చ దృశ్యతాం లోకాశ్చుక్రుశుశ్చ పరస్పరమ్‌ || 49

బ్రాహ్మణశ్చ తదా పాంథో దృష్ట్వా శ్చర్యం వినిర్గతః | యత్ర గౌశ్చ గతస్తత్ర తామను బ్రాహ్మణో గతః || 50

ఊర్ధ్వం పుచ్ఛం తదా కృత్వా శీఘ్రం గౌర్నర్మదాం ప్రతి | ఆగత్య నంది కస్యాస్య సమీపే నర్మదాజలే || 51

సన్నిమజ్య త్రివారం తు శ్వేతత్వం చ గతా హి సా | యథాగతం గతా సా చ బ్రాహ్మణో విస్మయం గతః || 52

అహోధన్యతమం తీర్థం బ్రహ్మహత్యానివారణమ్‌ | స్వయం చ మజ్జితస్తత్ర బ్రాహ్మణస్సేవకస్తథా || 53

నిమజ్య హి గతౌ తౌ చ ప్రశంసంతౌ నదీం చ తామ్‌ | మార్గే చ మిలితా కాచిత్సుందరీ భూషణాన్వితా || 54

తయోక్తం తం చ భోః పాంథ కుతో యాసి సువిస్మితః | సత్యం బ్రూహి చ్ఛలం త్యక్త్వా విప్రవర్య మమాగ్రతః || 55

తెల్లని ఆ గోవు వెనువెంటనే నల్లని రంగును పొందినట్లు కానవచ్చెను. ఆశ్చర్యము! చూడుడు అని జనులు ఒకరితో మరియొకరు బిగ్గరగా చెప్పిరి (49). బాటసారియగు ఆ బ్రాహ్మణుడు ఆ అద్భుతమును చూసి బయలుదేరెను. ఆవు వెళ్లిన వైపునకు ఆ బ్రాహ్మణుడు అనుసరించి వెళ్లెను (50). ఆ గోవు తోకను ఎత్తి పెట్టి వేగముగా నర్మద వైపునకు వెళ్లెను. అది ఈ నందికేశ్వరుని సమీపమునకు వచ్చి నర్మదా జలములో (51) మూడు సార్లు మునకవేసి తెల్లదనమును పొందెను. తరువాత ఆ గోవు వచ్చిన దారిలో వెళ్లెను. ఆ బ్రాహ్మణుడు చకితుడాయెను (52). ఆశ్చర్యము! బ్రహ్మ హత్యను తొలగించే ఈ తీర్థము మిక్కిలి ధన్యమైనది అని పలికి ఆ బ్రాహ్మణుడు సేవకునితో గూడి దానియందు స్నానమును చేసెను (53). వారిద్దరు స్నానమాడి ఆ తీర్థమును కొనియాడుతూ వెళ్లుచుండగా, దారిలో అలంకారములతో గూడియున్న ఒక సుందరి వారిని కలిసెను (54). ఆమె ఇట్లు పలికెను. ఓయీ! బాటసారీ! మిక్కిలి ఆశ్చర్యముతో గూడియున్న నీవు ఎచటనుండి వచ్చుచున్నావు? ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! మోసమును విడనాడి నా యెదుట సత్యమును పలుకుము (55).

ఏవం వచస్తదా శ్రుత్వా ద్విజేనోక్తం యథాతథమ్‌ | పునశ్చాయం ద్విజస్తత్రస్త్రి యోక్త స్థ్సీ యతాం త్వయా || 56

తయోక్తం చ సమాకర్ణ్య స్థితస్స బ్రాహ్మణస్తతః | ప్రత్యువాచ వినీతాత్మా కథ్యతే కిం వదేతి చ || 57

సా చాహ పునరేవాత్ర త్వయా దృష్టం స్థలం చ యత్‌ | తత్రాధునా క్షిపాస్థీని మాతుః కిం గమ్యతే%న్యతః || 58

తవ మాతా పాంథవర్య సాక్షాద్దివ్యమయం వరమ్‌ | దేహం ధృత్వా ద్రుతం సాక్షాచ్ఛంభోర్యాస్యతి సద్గతిమ్‌ || 59

వైశాఖే చైవ సంప్రాప్తే సప్తమ్యాం చ దినే శుభే | సితే పక్షే సదా గంగా హ్యా యాతి ద్విజసత్తమ || 60

అద్యైవ సప్తమీ యా సా గంగా రూపాస్తి తత్రవై | ఇత్యుక్త్వాంతర్దధే దేవీ గంగా మునిసత్తమాః || 61

నివృత్తశ్చ ద్విజస్సో%పి మాత్ర స్థ్యర్ధం స్వవస్త్రతః | క్షిపేద్యావత్తత్ర తీర్థే తావచ్చిత్ర మ భూత్తదా || 62

ఆ బ్రాహ్మణుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన వృత్తాంతమును విని ఆ స్త్రీ ఆతనితో 'నీవిచటనే ఉండుము' అని పలికెను (56). ఆమె మాటను విని ఆ బ్రాహ్మణుడు అటులనే చేసెను. వినయముతో గూడిన మనస్సు గల ఆతడు ''ఏమి చెప్పదలచితివో దానిని చెప్పుము'' అని బదులిడెను (57). అపుడామె ఇట్లు పలికెను: నీవు చూసిన స్థలము ఏది గలదో దానియందు నీవు ఇపుడు నీ తల్లి యొక్క అస్థికలను కలుపుము. మరియొక చోటికి పోనేల? (58) ఓ గొప్ప బాట సారీ! నీ తల్లి దివ్యమగు శ్రేష్ఠ దేహమును దాల్చి శీఘ్రముగా సాక్షాత్తు శంభుని పవిత్రధామమును పొందగలదు (59). ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! వైశాఖ శుక్ల సప్తమి పవిత్రమగు దినము. ఆనాడు ప్రతి సంవత్సరము గంగ ఇచటకు వచ్చును (60). ఆ సప్తమి ఈనాడే. ఆ గంగయే ఇపుడీ నదిలో గలదు అని పలికి ఆమె అంతర్ధానము చెందెను. ఓ మహర్షులారా! గంగయే ఆ స్త్రీ రూపములో వచ్చెను (61). ఆ బ్రాహ్మణుడు ప్రయాణమును మాని తన వద్ద నున్న మూటలో నుండి తల్లి అస్థికలలో సగ భాగమును తీసి అచట తీర్థములో కలుపునంతలో అచట ఒక చిత్రము జరిగెను (62).

దివ్యదేహత్వమాపన్నా స్వమాతా చ వ్యదృశ్యత | ధన్యో%సి కృతకృత్యో%సి పవిత్రం చ కులం త్వయా || 63

ధనం ధాన్యం తథా చాయుర్వంశో వై వర్ధతాం తవ | ఇత్యాశిషం ముహుర్దత్త్వా స్వపుత్రాయ దివం గతా || 64

తత్ర భుక్త్వా సుఖం భూరి చిరకాలం మహోత్తమమ్‌ | శంకరస్య ప్రసాదేన గతా సా హ్యుత్తమాం గతిమ్‌ || 65

బ్రాహ్మణశ్చ సుతస్తస్యాః క్షిప్త్వాస్థీని పునస్తతః | ప్రసన్నమానసో%భూత్స శుద్ధాత్మా స్వగృహం గతః || 66

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం బ్రాహ్మణస్త్రీ స్వర్గతివర్ణనం నామ షష్ఠ్యో%ధ్యాయః (6).

అతడు దివ్య దేహమును దాల్చిన తన తల్లిని గాంచెను. 'నీవు ధన్యుడవు; కృతార్థుడవు. నీ చే కులము పవిత్రమైనది (63). నీకు ధనధాన్యములు, ఆయుర్దాయము, వంశము అభివృద్ధిని చెందుగాక!' అని ఆమె తన పుత్రునకు పలుమార్లు ఆశీర్వచనములను పలికి స్వర్గమునకు వెళ్లెను (64). ఆమె అచట చిరకాలము మహోత్కృష్ట సుఖముననుభవించి శంకరుని అనుగ్రహముచే ఉత్తమగతిని పొందెను. (65). శుద్ధమగు అంతఃకరణము గల ఆమె పుత్రుడైన ఆ బ్రాహ్మణుడు ఆ అస్థులను మరల నదిలో కలిపి ప్రసన్నమగు మనస్సు గలవాడై తన ఇంటికి వెళ్లెను (66).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్ర సంహితయందు బ్రాహ్మణస్త్రీ స్వర్గమును పొందుట అనే ఆరవ అధ్యాయము ముగిసినది (6).

Siva Maha Puranam-3    Chapters