Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Siva Maha Puranam-3    Chapters   

అథ సప్తత్రింశో%ధ్యాయః

కిరాతావతారము - వ్యాసోపదేశము

నందీశ్వర ఉవాచ |

శృణు ప్రాజ్ఞ కిరాతాఖ్యమవతారం పినాకినః | మూకం చ హతవాన్‌ ప్రీతో యో%ర్జునాయం వరం దదౌ || 1

సుయోధన జితాస్తేవై పాండవాః ప్రవరాశ్చ తే | ద్రౌపద్యా చ తయా సాధ్వ్యా ద్వైతాఖ్యం వనమాయయుః || 2

తత్రైవ సూర్యదత్తాంవై స్థాలీమాశ్రిత్య తే తదా | కాలంచ వాహయామాసుస్సుఖేన కిల పాండవాః || 3

ఛలార్థం ప్రేరితస్తేన దుర్వాసా మునిపుంగవః | సుయోధనేన విప్రేంద్ర పాండవాంతికమాదరాత్‌ || 4

ఛాత్రైసై#్స్వర్వాయుతైస్సార్ధం యయాచే తత్ర తాన్ముదా | భోజ్యం చిత్తేప్సితం వై స తేభ్యశ్చైవ సమాగతః || 5

స్వీకృత్య పాండవైసై#్తసై#్త స్స్నానార్థం ప్రేషితాస్తదా | దుర్వాసః ప్రముఖాశ్చైవ మునయశ్చ తపస్వినః || 6

అథ తే పాండవాస్సర్వే అన్నాభావాన్మునీశ్వర | దుఃఖితాశ్చ తదా ప్రాణాంస్త్యక్తుం చిత్తే సమాదధుః || 7

ద్రౌపద్యా చ స్మృతః కృష్ణ ఆగతస్తత్‌ క్షణాదపి | శాకం చ భక్షయిత్వా తు తేషాం తృప్తిం సమాదధత్‌ || 8

దుర్వాసాశ్చ తదా శిష్యాంస్తృప్తాన్‌ జ్ఞాత్వా య¸° పునః | పాండవాః కృచ్ఛ్ర నిర్ముక్తాః కృష్ణస్య కృపయా తదా || 9

అథ తే పాండవా కృష్ణం పప్రచ్ఛుః కిం భవిష్యతి | బలవాన్‌ శత్రురుత్పన్నః కిం కార్యం తద్వద ప్రభో || 10

ఇతి పృష్టస్తదాత్తె స్తు శ్రీకృష్ణః పాండవైర్మునే | స్మృత్వా శివపదాంభోజౌ పాండవానిదమబ్రవీత్‌ || 11

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓయీ ప్రాజ్ఞా! పినాకధారియగు శివుడు కిరాతావతారమును దాల్చి మూకుని సంహరించి అర్జునునకు ప్రేమతో వరమునిచ్చిన గాథను వినుము (1). పాండవవీరులు సుయోధనునిచే ఓడింపబడి పతివ్రతయగు ద్రౌపదితో గూడి ద్వైతవనమునకు వెళ్లిరి (2). పాండవులపుడు అచటనే సూర్యునిచే ఈయబడిన అక్షయపాత్రను ఆధారముగా చేసుకొని సుఖముగా కాలమును గడుపుచుండిరి (3). ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! సుయోధనుడు మోసబుద్ధితో ప్రేరేపించగా దుర్వాసమహర్షి పాండవుల వద్దకు సాదరముగా విచ్చేసెను (4). ఆతడు తన పదివేలమంది శిష్యులతో గూడి అచటకు ఆనందముగా వచ్చి వారిని కలిసి తమ మనస్సునకు నచ్చిన భోజనమునిమ్మని కోరెను (5). పాండవులాతని కోర్కెను స్వీకరించి స్నానము కొరకు పంపెను. అపుడు దుర్వాసుడు, మునీశ్వరులు తపశ్శాలురు అగు ఆతని శిష్యులు స్నానమునకు వెళ్లిరి (6). ఓ మహర్షీ! అపుడు ఆ పాండవులందరు అన్నము లేకుండుటచే దుఃఖితులై ప్రాణములను వీడుటకు మనస్సులో నిర్ణయించుకొనిరి (7). అపుడు ద్రౌపది స్మరించగా శ్రీకృష్ణుడు తత్‌క్షణమే అచటకు వచ్చి కూరను తిని వారందరికీ తృప్తిని కలిగించెను (8). తన శిష్యులందరు తృప్తులైనారని ఎరింగి దుర్వాస మహర్షి మరలిపోయెను. అపుడా విధముగా కృష్ణుని దయచే పాండవులు కష్టమునుండి గట్టెక్కిరి (9). అపుడా పాండవులు శ్రీ కృష్ణుని 'ఏమి జరుగనున్నది? బలవంతుడగు శత్రువు సంప్రాప్తమైనాడు. ఏమి చేయవలెను? ప్రభూ! ఆ విషయమును చెప్పుము' అని ప్రశ్నించిరి (10). ఓ మునీ! ఆ పాండవులిట్లు ప్రశ్నించగా అపుడు శ్రీ కృష్ణుడు శివునిపాదపద్మములను స్మరించి పాండవులతో నిట్లు పలికెను(11).

శ్రీకృష్ణ ఉవాచ|

శ్రూయతాం పాండవాశ్శ్రేష్ఠాశ్శ్రుత్వా కర్తవ్యమేవ హి | మద్వృత్తాంతం విశేషేణ శివసేవాసమన్వితమ్‌ || 12

ద్వారకాం చ మయా గత్వా శత్రూణాం విజిగీషయా | విచార్య చోపదేశాంశ్చ ఉపమన్యోర్మహాత్మనః 13

మయా హ్యారాధితశ్శంభుః ప్రసన్నః పరమేశ్వరః | బటుకే పర్వత శ్రేష్ఠే సప్తమాసం సుసేవితః || 14

ఇష్టాన్‌ కామానదాన్మహ్యం విశ్వేశశ్చ స్వయం స్థితః | తత్ర్పభావాన్మయా సర్వసామర్థ్యం లబ్ధముత్తమమ్‌ || 15

ఇదానీం సేవ్యతే దేవో భుక్తి ముక్తి ఫలప్రదః | యూయం సేవత తం శంభుమపి సర్వ సుఖావహమ్‌ || 16

శ్రీకృష్ణుడిట్లు పలికెను-

శ్రేష్ఠులగు పాండవులారా! శివుని సేవతో నిండియున్న నా గాథను శ్రద్ధగా విని చెప్పిన విధముగా ఆచరించుడు (12). నేను శత్రువులను జయించే కోరికతో ద్వారకకు వెళ్లి, మహాత్ముడగు ఉపమన్యుని ఉపదేశములను విచారించి (13), పర్వతరాజమగు బటుకమునందు ఏడు మాసములు పరమేశ్వరుడగు శంభుని చక్కగా ఆరాధించి ప్రసన్నుని చేసుకొంటిని (14). విశ్వేశ్వరుడు స్వయముగా సాక్షాత్కరించి నాకు నచ్చిన కోర్కెల నిచ్చెను. వాటి ప్రభావము చేతనే నేను ఉత్తమమైన సర్వసామర్థ్యమును పొందియున్నాను (15). భుక్తి మరియు ముక్తి అను ఫలములనిచ్చు ఆ దేవుని నేను ఇప్పుడు కూడా సేవించుచున్నాను. మీరు కూడ సర్వసుఖములనిచ్చే ఆ శంభుని సేవించుడు (16).

నందీశ్వర ఉవాచ |

ఇత్యుక్త్వాంతర్దధే కృష్ణ ఆశ్వాస్యాథ చ పాండవాన్‌ | ద్వారకామగమచ్ఛీఘ్రం స్మరన్‌ శివపదాంబుజమ్‌ || 17

పాండవా అథ భిల్లం చ ప్రేషయామాసురోజసా | గుణానాం చ పరీక్షార్థం తస్య దుర్యోధనస్య చ || 18

సో%పి సర్వం చ తత్రత్యం దుర్యోధన గుణోదయమ్‌ | సమీచీనం చ తద్‌ జ్ఞాత్వా పునః ప్రాప ప్రభూన్‌ ప్రతి || 19

తదుక్తం తే నిశ##మ్యైవం దుఃఖం ప్రాపుర్మునీశ్వర | పరస్పరం సమూచుస్తే పాండవా అతిదుఃఖితాః || 20

కిం కర్తవ్యం క్వం గంతవ్యమస్మాభిరధునా యుధి | సమర్థా అపి వై సర్వే సత్యపాశేన యంత్రితాః || 21

ఏతస్మిన్‌ సమయే వ్యాసో భస్మ భూషితమస్తకః | రుద్రాక్షాభరణశ్చాయాజ్జటాజూట విభూషితః || 22

పంచాక్షరం జపన్మంత్రం శివప్రేమసమాకులః | తేజసాం చ స్వయం రాశిస్సాక్షాద్ధర్మ ఇవాపరః || 23

నందీశ్వరుడిట్లు పలికెను-

శ్రీకృష్ణుడిట్లు పలికి పాండవులనోదార్చి అంతర్ధానమును జెంది శివుని పాదపద్మములను స్మరిస్తూ వెంటనే ద్వారకకు చేరెను (17). తరువాత వెంటనే పాండవులు ఆ దుర్యోధునుని గుణములను పరీక్షించుటకొరకై ఒక భిల్లుని పంపించిరి (18). ఆ భిల్లుడు ఆ రాజ్యములో దుర్యోధనుని గుణముల వికాసమును బాగుగానెరింగి అచటి వృత్తాంతమునంతనూ చక్కగా సేకరించి మరల పాండవుల వద్దకు తిరిగివచ్చెను (19). ఓ మహర్షీ! ఆతడు చెప్పిన వార్తను విని పాండవులు మిక్కిలి దుఃఖమును పొందిన వారై పరస్పరము సంప్రదించుకొనిరి (20). ఎచటకు పోవలెను? యుద్ధము విషయములో మనమిపుడు ఏమి చేయవలెను? మనమందరము సమర్థులమే అయిననూ, సత్యమనే పాశముచే బంధింపబడి యున్నాము (21). ఇదే సమయములో అచటకు విభూతితో అలంకరింప బడిన లలాటము గలవాడు, రుద్రాక్షలే ఆభరణములుగా గలవాడు, జటాజూటముతో ప్రకాశించువాడు, శివుని యందలి ప్రేమతో నిండిన హృదయము గలవాడు, తేజోమూర్తి, ధర్మమే స్వయముగా రూపుదాల్చినదా యన్నట్టు ఉన్నవాడు నగు వ్యాసుడు విచ్చేసెను (22, 23).

తం దృష్ట్వా తే తదా ప్రీతా ఉత్థాయ పురతః స్థితాః | దత్త్వాసనం తదా తసై#్మ కుశాజిన సుశోభితమ్‌ || 24

తత్రోపవిష్టం తం వ్యాసం పూజయంతి స్మ హర్షితాః | స్తుతిం చ వివిధాం కృత్వా ధన్యాస్స్మ ఇతి వాదినః || 25

తపశ్చైవ సుసంతప్తం దానాని వివిధాని చ | తత్సర్వం సఫలం జాతం తృప్తాస్తే దర్శనాత్ర్పభో || 26

దుఃఖం చ దూరతో జాతం దర్శనాత్తే పితామహ | దుష్టైశ్చైవ మహాదుఃఖం దత్తం నః క్రూరకర్మభిః || 27

శ్రీమతాం దర్శనే జాతే దుఃఖం చైవ గమిష్యతి | కదాచిన్న గతం తత్ర నిశ్చయో%యం విచారితః || 28

మహతామాశ్రమే ప్రాప్తే సమర్థే సర్వకర్మణి | యది దుఃఖం న గచ్ఛేత్తు దైవమేవాత్ర కారణమ్‌ || 29

నిశ్చయేనైవ గచ్ఛేత్తుదారిద్ర్యం దుఃఖకారణమ్‌ | మహతాం చ స్వభావో%యం కల్పవృక్షసమో మతః || 30

అపుడు వారు ఆయనను గాంచి ఆనందముతో లేచి ఆయన యెదుట నిలబడి దర్భలు మరియు లేడి చర్మముతో శోభిల్లే ఆసనమును ఆయనకు సమకూర్చిరి (24). దానియందు కూర్చున్న వ్యాసుని వారు ఆనందముతో పూజించి వివిధ స్తోత్రములను గావించి 'మేము ధన్యులమైతిమి' అని పలికిరి (25). ఓ ప్రభూ! మేము చేసిన గొప్ప తపస్సు మరియు వివిధ దానములు ఈ సర్వము నీ దర్శనముచే సఫలమైనవి. మేము తృప్తిని చెందితిమి (26) ఓ పితామహా! నీ దర్శనముచే మా దుఃఖము దూరమైనది. దుష్టులు క్రూరమగు కర్మలు నాచరించి మాకు మహాదుఃఖమును కలిగించిరి (27). మహాత్ముల దర్శనముచే దుఃఖము దూరమగును. ఒకచో అప్పుడు కూడా దుఃఖము దూరము కానిచో, ఈ విధముగా విచారణ చేసి నిశ్చయించవలెను (28). మహాత్ముల సన్నిధి సర్వకర్మలను సిద్ధింపజేయును. అట్టి సన్నిధిలో కూడ దుఃఖము దూరము కానిచో, ఆ దుఃఖమునకు దైవమే కారణమని నిశ్చయించవలెను (29). దారిద్ర్యము దుఃఖమునకు హేతువు అయినచో, అది తప్పక తొలగిపోవును. మహాత్ములు కల్పవృక్షము వంటి వారు. దారిద్ర్యమును తొలగించి వేయుట వారికి అతిసహజమగు పని (30).

తద్గుణానేవ గణయన్మహతో వస్తుమాత్రతః | ఆశ్రయస్య వశాదేవ పుంసో వై జాయతే ప్రభో || 31

లఘుత్వం చ మహత్త్వం చ నాత్ర కార్యా విచారణా | ఉత్తమానాం స్వభావో%యం యద్దీన ప్రతిపాలనమ్‌ || 32

రంకస్య లక్షణం లోకే హ్యతి శ్రేయస్కరం మతమ్‌ | పురో%స్య పరయత్నో వై సుజనానాం చ సేవనమ్‌ || 33

అతః పరం చ భాగ్యం వై దోషశ్చైవ న దీయతామ్‌ | ఏతస్మాత్కారణాత్స్వామింస్త్వయి దృష్టే శుభం తదా || 34

త్వదాగమన మాత్రేణ సంతుష్టాని మనాంసి నః | దిశోపదేశం యేనాశు దుఃఖం నష్టం భ##వేచ్చ నః || 35

ఇత్యేతద్వచనం శ్రుత్వా పాండవానాం మహామునిః | ప్రసన్నమానసో భూత్వా వ్యాసశ్చైవా బ్రవీదిదమ్‌ || 36

హే పాండవాశ్చ యూయంవై న కష్టం కర్తుమర్హథ | ధన్యాస్థ్స కృతకృత్యాస్థ్స సత్యంనైవ విలోపితమ్‌ || 37

ఓ ప్రభూ! మహాత్ముడగు వ్యక్తి సర్వప్రాణులకు ఆశ్రయమగు ఆత్మవస్తువును మాత్రమే దర్శించును. దాని ప్రభావముచే ఆతడు ఇతరులలోని గుణములను మాత్రమే పరిగణనలోనికి తీసుకొనును (31). మహాత్ములు ఇతరుల లోని చిన్న పెద్ద తేడాలను విచారించరు. దీనులను రక్షించుట మహాత్ములకు స్వభావమై యున్నది (32). దారిద్ర్యము కూడ లోకములో మానవునకు గొప్ప శ్రేయస్సునిచ్చునని చెప్పబడినది. అట్టివాడు తన వద్ద నున్న అవకాశమును వినియోగించుకొని సత్పురుషులను సేవించవలెను (33). ఆ పైన భాగ్యముపై నాధారపడును. దాని విషయమై దోషమును పట్టుట కుదరదు. ఈ కారణముచే నీ దర్శనము శుభకరమని చెప్పవచ్చును. ఓ స్వామీ! (34). నీ రాక మాత్రముచే మా మనస్సులు సంతోషముతో నిండియున్నవి. మా దుఃఖమును శీఘ్రముగా పొగొట్టే ఉపదేశమును మాకు చెప్పుము (35?). పాండవుల ఈ మాటలను విని వ్యాసమహాముని ప్రసన్నమగు మనస్సు గలవాడై ఇట్లు పలికెను (36). ఓ పాండవులారా! మీరు ఇట్లు కష్టముల పాలగుటకు తగరు. అయిననూ మీయందు సత్యము లోపించలేదు. మీరు ధన్యులు, కృతార్థులు (37).

సుజనానాం స్వభావో%యం ప్రాణాంతే%పి సుశోభనః | ధర్మం త్యజంతి నైవాత్ర సత్యం సఫలభాజనమ్‌ || 38

అస్మాకం చైవ యూయం చ తే చాపి సమతాం గతాః | తథాపి పక్షపాతో వై ధర్మిష్ఠానాం మతో బుధైః || 39

ధృతరాష్ట్రే దుష్టేన ప్రథమం చ హ్యచక్షుషా | ధర్మస్త్యక్తస్స్వయం లోభాద్యుష్మాకం రాజ్యమాహృతమ్‌ || 40

తస్య యూయం చ తే చాపి పుత్రా ఏవ న సంశయః | పితర్యుపరతే బాలా అనుకంప్యా మహాత్మానః || 41

పశ్చాత్పుత్రశ్చ తేనైవ వారితో న కదాచన | అనర్థోనైవ జాయేత యచ్చైవం చ కృతం తదా || 42

అతః పరం చ యజ్జాతే తజ్జాతం నాన్యథా భ##వేత్‌ | అయం దుష్టో భవంతశ్చ ధర్మిష్ఠాస్సత్యవాదినః ||43

తస్మాదంతే చ తసై#్మవాశుభం హి భవితా ధ్రువమ్‌ | యచ్చైవ వాపితం బీజం తత్ర్పరోహో భ##వేది హ || 44

తస్మాద్దుఃఖం న కర్తవ్యం భవద్భిస్సర్వథా ధ్రువమ్‌ | భవిష్యతి శుభం వో హి నాత్రా కార్యా విచారణా || 45

ఇత్యుక్త్వా పాండవాస్సర్వే తేన వ్యాసేన ప్రీణితాః | యుధిష్ఠరముఖాస్తే చ పునరేవాబ్రువన్‌ వచః || 46

జీవితమునకు సార్థక్యమును కలిగించే ధర్మమును సత్యమును ప్రాణాపాయస్థితిలో నైననూ విడనాడక పోవుట సత్పురుషుల సుశోభనమగు స్వభావమై యున్నది. (38). మాకు పాండవులయందు, కౌరవులయందు సమానమగు భావము గలదు. అయిననూ ధర్మాత్ములయందు పక్షపాతమును కలిగియుండుట విద్వాంసులకు సమ్మతము (39). ధృతరాష్ట్రుడు దుష్టుడు, ఆదినుండియు అంధుడు. ఆతడు ధర్మమును విడనాడి లోభముచే స్వయముగా మీరాజ్యమునపహరించినాడు (40). వానికి మీరు, వారు కూడ పుత్రులే యగుదురనుటలో సందేహము లేదు. మీ తండ్రి స్వర్గస్థుడైన పిదప మహాత్ములగు మీపై ప్రేమను చూపవలసియుండును (41). ఆ తరువాత ఆతడు తన పుత్రుని ఏనాడైనను దురాగతముల నుండి వారించలేదు. ఆనాడు అట్లు వారించి యున్నచో ఈ అనర్థము కలిగియుండెడిది గాదు (42). ఈ పైన విధి ఎట్లున్నదో అట్లు జరుగగలదు. దుర్యోధనుడు దుష్టుడు. మీరు ధర్మాత్ములు, సత్యవాదులు (43). అంతములో వానికి వినాశము తప్పదు. ఎట్టి బీజమును నాటెదమో, అట్టి అంకురమే వచ్చును గదా! (44) కావున మీరు ఎట్టి పరిస్థితులలో నైనూ దుఃఖించవలదు. మీకు శుభము కలుగగలదు. దీనిలో సందేహము లేదు (45). వ్యాసుడిట్లు పలుకగా యుధిష్ఠిరుడు మొదలుగా గల పాండవులందరు సంతసించి మరల ఇట్లు పలికిరి (46).

పాండవా ఊచుః |

సత్యముక్తం త్వయా నాథ దుష్టైర్దుఃఖం నిరంతరమ్‌ | దుష్టాత్మభిర్వనే చాపి దీయతే హి ముహుర్ముహుః || 47

తన్నాశయాశుభం తే%ద్య కించిద్దేయం శుభం విభో | కృష్ణే కథితం పూర్వమారాధ్యశ్శంకరస్సదా || 48

ప్రమాదశ్చ కృతో%స్మాభిస్తద్వచ శ్శిథిలీకృతమ్‌ | స దేవ మార్గస్తు పునరిదానీముపదిశ్యతామ్‌ || 49

పాండవులిట్లు పలికిరి-

ప్రభూ! మీరు సత్యమును పలికితిరి. ఆ దుర్మార్గులు నిరంతరముగా వనములో కూడా దుఃఖమును కలిగించుచునే యున్నారు (47). ఓ విభూ! కావున నీవు అశుభమును నశింపజేయుము. శుభమార్గమునుపదేశింపుము. సర్వదా శంకరుని ఆరాధిదంచవలెనని పూర్వము కృష్ణుడు చెప్పియున్నాడు (48). మేము పొరపాటు చేసితిమి. ఆ మాటను సరిగా పాటించలేదు. ఓ దేవా! అదే మార్గమును మరల ఇపుడు ఉపదేశించుడు (49).

నందీశ్వర ఉవాచ|

ఇత్యేతద్వచనం శ్రుత్వా వ్యాసో హర్షసమన్వితః | ఉవాచ పాండవాన్‌ ప్రీత్యా స్మృత్వా శివపదాంబుజమ్‌ || 50

నందీశ్వరుడిట్లు పలికెను-

ఈ మాటలను విని వ్యాసుడు మిక్కిలి ఆనందించి శివుడు పాదపద్మములను స్మరించి ప్రీతితో పాండవుల నుద్దేశించి ఇట్లు పలికెను (50).

వ్యాస ఉవాచ|

శ్రూయతాం వచనం మే %ద్య పాండవా ధర్మబుద్ధయః | సత్యముక్తం తు కృష్ణేన మయా సంసేవ్యతే శివః || 51

భవద్భిస్సేవ్యతాం ప్రీత్యా సుఖం స్యాదతులం సదా |సర్వదుఃఖం భవత్యేవ శివా%సేవాత ఏవ హి || 52

వ్యాసుడిట్లు పలికెను-

ధర్మ బుద్ధిగల పాండవులారా! ఇపుడు నా మాటను వినుడు. శ్రీ కృష్ణుడు సత్యమును పలికినాడు. నేను కూడ శివుని చక్కగా సేవించుచున్నాను (51). మీరు ప్రీతితో సేవించుడు. మీకు సర్వదా సాటిలేని సుఖము కలుగును. శివుని సేవించక పోవుటచేతనే దుఃఖములన్నియు కలుగును సుమా! (52)

నందీశ్వర ఉవాచ|

అథ పంచసు తేష్వేవ విచార్య శివపూజనే | అర్జునం యోగ్యముచ్చార్య వ్యాసో మునివరస్తథా || 53

తపస్థ్సానం విచార్యైవం తతస్స మునిసత్తమః | పాండవాన్‌ ధర్మ సన్నిష్ఠాన్‌ పునరేవాబ్రవీదిదమ్‌ || 54

నందీశ్వరుడిట్లు పలికెను-

వ్యాసమహర్షి విచారణ చేసి ఆ అయిదుగురిలో శివపూజయందు అర్జునుడు యోగ్యుడని నిర్ధారించెను (53). తరువాత ఆ మహర్షి తపస్సు చేయదగిన స్థానమును నిర్ణయించి ధర్మనిష్ఠులగు పాండవులతో మరల నిట్లు పలికెను (54).

వ్యాస ఉవాచ|

శ్రూయతాం పాండవాస్సర్వే కథయామి హితం సదా | శివ సర్వం పరం దృష్ట్వా పరం బ్రహ్మ సతాం గతిమ్‌ || 55

బ్రహ్మాది త్రిపరార్ధాంతం యత్‌ కించి ద్దృశ్యతే జగత్‌ | తత్సర్వం శివరూపం చ పూజ్యం ధ్యేయం చ తత్పునః || 56

సర్వేషాం చైవ సేవ్య%సౌ శంకరస్సర్వదుఃఖహో | శివస్స్వల్పేన కాలేన సంప్రసీదతి భక్తితః || 57

సుప్రసన్నో మహేశో హి భ##క్తేభ్యస్సకలప్రదః | భుక్తిం ముక్తి మిహాముత్ర యచ్ఛతీతి సునిశ్చితమ్‌ || 58

తస్మాత్సేవ్యస్సదా శంభుర్భుక్తి ముక్తి ఫలేప్సుభిః | పురుషశ్శంకరస్సాక్షాద్దుష్టహంతా సతాం గతిః || 59

పరం తు ప్రథమం శక్రవిద్యాం దృఢమనా జపేత్‌ | క్షత్రియస్య పరాఖ్యస్య చేదమేవ సమాహితమ్‌ || 60

అతో%ర్జునశ్చ ప్రథమం శక్రవిద్యాం జపేద్దృఢః | కరిష్యతి పరీక్షాం ప్రాక్‌ సంతుష్టస్తద్భవిష్యతి || 61

సుప్రసన్నశ్చ విఘ్నాని సంహరిష్యతి సర్వదా | పునశ్చైవం శివసై#్యవ వరం మంత్రం ప్రదాస్యతి || 62

వ్యాసుడిట్లు పలికెను-

పాండవులారా! మీరందరు వినుడు. నేను సర్వదా హితమును పలికెదను. సర్వము శివుడే. పరబ్రహ్మ, సత్పురుషులకు శరణ్యుడు అగు శివుని దర్శించుటయే పరమగతి (55). బ్రహ్మతో మొదలిడి అనంతము వరకు ఏ జగత్తు కానవచ్చూచుననదో, ఆ సర్వము శివస్వరూపమేయని ఎరింగి పూజించి ధ్యానించవలెను (56). సర్వదుఃఖములను పొగొట్టు శివుడు సర్వులకు సేవనీయుడు. మంగళకరుడగు శివుడు భక్తిచే స్వల్పకాలములో ప్రసన్నుడగును (57). మహేశ్వరుడు ప్రసన్నుడై భక్తులకు ఇహలోకములో భుక్తిని, దేహత్యాగము తరువాత ముక్తిని మరియు సర్వఫలములను ఇచ్చుననుట సునిశ్చితము (58). కావున భుక్తి ముక్తి ఫలములన గోరువారు సత్పురుషులకు శరణ్యుడు, దుష్టశిక్షకుడు, సాక్షాత్తు పురుషుడు అగు శంకరుని సర్వదా సేవించవలెను (59). కాని క్షత్రియుడు ముందుగా దృఢమగు మనస్సుతో ఇంద్రవిద్యను జపించవలెను. గొప్ప కీర్తి గల క్షత్రియునకు ఇదియే గొప్ప హితమును చేగూర్చును (60). కావున అర్జునుడు ముందుగా ఇంద్రవిద్యను దృఢమనస్కుడై జపించవలెను. ఇంద్రుడు ముందుగా పరీక్ష చేయును. దానిలో నెగ్గినచో, ఆయన సంతోషమును పొందును (61). ఇంద్రుడు ప్రసన్నుడై సర్వదా విఘ్నములను తొలగించి, మరియు శివుని యొక్క శ్రేష్ఠమగు మంత్రమును ఈయగలడు (62).

నందీశ్వర ఉవాచ|

ఇత్యుక్త్యార్జున మాహూయోపేంద్రవిద్యాముపాదిశత్‌ | స్నాత్వాచ చ ప్రాఙ్‌ముఖో భూత్వా జగ్రాహార్జున ఉగ్రధీః || 63

పార్థివస్య విధానం చ తసై#్మ మునివరో దదౌ | ప్రత్యువాచ చ తం వ్యాసో ధనంజయముదాదధీః || 64

నందీశ్వరుడిట్లు పలికెను-

వ్యాసుడిట్లు పలికి అర్జునుని తన వద్దకు పిలిచి ఇంద్రవిద్యను ఉపదేశించెను. అర్జునుడు దృఢనిశ్చయము గలవాడై స్నానము చేసి తూర్పువైపు కూర్చుండి స్వీకరించెను (63). విశాలహృదయుడగు వ్యాసమహర్షి ధనంజయునకు పార్థివలింగ పూజావిధానమును కూడ ఉపదేశించి ఇట్లు పలికెను (64).

వ్యాస ఉవాచ|

ఇతో గచ్ఛాధునా పార్థ ఇంద్రకీలే సుశోభ##నే | జాహ్నవ్యాశ్చ సమీపే వై స్థిత్వా సమ్యక్తపః కురు || 65

అదృశ్యా చైవ విద్యా స్యాత్‌ సదా తే హితకారిణీ | ఇత్యాశిషం దదౌ తసై#్మ తతః ప్రోవాచ తాన్మునిః || 66

ధర్మ్యమాస్థాయ సర్వే వై తిష్ఠంతు నృపసత్తమాః | సిద్ధిస్స్యాత్సర్వథా శ్రేష్ఠా నాత్ర కార్యా విచారణా || 67

వ్యాసుడిట్లు పలికెను-

ఓ అర్జునా! ఇచట నుండి ఇపుడు అతి సుందరమగు ఇంద్రకీల పర్వతమునకు వెళ్లుము. గంగానదికి సమీపములో నుండి చక్కగా తపస్సును చేయుము (65). ఈ విద్య కంటికి కానరానిదై సదా నీవెంట ఉండి హితమును చేయును. ఆ మహర్షి ఇట్లాతనిని ఆశీర్వదించి తరువాత ఆ పాండవులతో నిట్లనెను (66). ఓ రాజశ్రేష్టులారా! మీరందరు ధర్మమార్గములో స్థిరముగా నడుపుడు. మీకు సర్వవిధములుగా శ్రేష్ఠమగు సిద్ధి కలుగును. ఈ విషయములో సందేహము లేదు (67).

నందీశ్వర ఉవాచ|

ఇతి దత్త్వాశిషం తేభ్యః పాండవేభ్యో మునీశ్వరః | స్మృత్వా శివపదాంభోజం వ్యాసశ్చాంతర్దధే క్షణాత్‌ || 68

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్రసంహితాయాం కిరాతావతారే వ్యాసోపదేశవర్ణనం నామ సప్తత్రింశో%ధ్యాయః (37).

నందీశ్వరుడిట్లు పలికెను-

వ్యాసమహర్షి ఆ పాండవులకు ఇట్లు ఆశీస్సులనొసంగి శివపాదపద్మములను స్మరించి క్షణములో అంతర్ధానమాయెను (68).

శ్రీ శివ మహాపురాణములోని శతరుద్రసంహితయందు కిరాతావతారములో వ్యాసోపదేశ వర్ణనమనే ముప్పది ఏడవ అధ్యాయము ముగిసినది (37).

Siva Maha Puranam-3    Chapters