Siva Maha Puranam-3    Chapters   

అథ షట్‌ త్రింశో%ధ్యాయః

అశ్వత్థామావతారము

నందీశ్వర ఉవాచ|

సనత్కుమార సర్వజ్ఞ శివస్య పరమాత్మనః | అవతారం శృణు విభోరశ్వత్థామాహ్వయం పరమ్‌ || 1

బృహస్పతేర్మహా బుద్ధేర్దేవర్షేరంశతో మునే | భరద్వాజాత్సముత్పన్నో ద్రోణో%యోనిజ ఆత్మవాన్‌ || 2

ధనుర్భృతాం వరశ్శూరో విప్రర్షి స్సర్వశాస్త్రవిత్‌ | బృహత్కీర్తిర్మహాతేజా యస్సర్వాస్త్ర విదుత్తమః || 3

ధనుర్వేదే చ వేదే చ నిష్ణాతం యం విదుర్బుధాః | వరిష్ఠం చిత్రకర్మాణం ద్రోణం స్వకులవర్ధనమ్‌ || 4

కౌరవాణాం స ఆచార్య ఆసీత్స్వబలతో ద్విజ | మహారథిషు విఖ్యాతః షట్‌ సు కౌరవమధ్యతః || 5

సాహాయ్యార్థం కౌరవాణాం స తేపే విపులం తపః | శివముద్దిశ్య పుత్రార్థీ ద్రోణాచార్యో ద్విజోత్తమః || 6

తతః ప్రసన్నో భగవాన్‌ శంకరో భక్తవత్సలః | ఆవిర్బ భూవ పురతో ద్రోణస్య మునిసత్తమ || 7

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ సనత్కుమార! నీవు సర్వజ్ఞుడవు. విభుడు, పరమాత్మయగు శివుని అశ్వత్థామ యను గొప్ప అవతారమును గూర్చి వినుము (1). ఓ మునీ! మహాబుద్ధిశాలి, దేవర్షియగు బృహస్పతి అంశవలన భరద్వాజునకు ద్రోణుడను అయోనిజుడగు కుమారుడు కలిగెను. ఆయన స్వాభిమానము గలవాడు (2), ధనుర్ధారులలో శ్రేష్ఠుడు, శూరుడు, వేదాధ్యయనమును చేసిన ఋషి, అస్త్రవేత్తలందరిలో శ్రేష్ఠుడు (3). ధనుర్వేదమునందు మరియు వేదమునందు ఆయన నిష్ణాతుడని పండితులు అంగీకరించెదరు. శ్రేష్ఠుడగు ద్రోణుడు చిత్రమగు కర్మలనాచరించి తన కులమును వృద్ధికి తీసుకొనివచ్చెను (4). ఓ బ్రాహ్మణా! ఆతడు తన బలప్రభావముచే కౌరవులకు ఆచార్యుడాయెను. కౌరవులలోని ఆర్గురు మహారథులలో ఆయన ఒకడని ప్రసిద్ధిని గాంచెను (5). బ్రాహ్మణశ్రేష్ఠుడగు ఆ ద్రోణాచార్యుడు కౌరవుల సాహాయ్యము కొరకై పుత్రుని గోరి శివుని ఉద్దేశించి కఠినమగు తపస్సును చేసెను (6). ఓ మహర్షీ! అపుడు భక్తవత్సలుడగు శంకరభగవానుడు ప్రసన్నుడై ద్రోణుని యెదుట ఆవిర్భవించెను (7).

తం దృష్ట్వా స ద్విజో ద్రోణస్తుష్టావాశు ప్రణమ్య తమ్‌ | మహాప్రసన్నహృదయో నతకస్సుకృతాంజలిః || 8

తస్య స్తుత్యా చ తపసా సంతుష్టశ్శంకరః ప్రభుః | వరం బ్రూ హీతి చోవాచ ద్రోణం తం భక్తవత్సలః || 9

తచ్ఛ్రుత్వా శంభువచనం ద్రోణః ప్రాహాథ సన్నతః | స్వాంశజం తనయం దేహి సర్వాజేయం మహాబలమ్‌ || 10

తచ్ఛ్రుత్వా ద్రోణవచనం శంభుః ప్రోచే తథాస్త్వితి | అభూదంతర్హితస్తాత కౌతుకీ సుఖకృన్మునే || 11

ద్రోణో%ప్యగచ్ఛత్స్వం ధామ మహాహృష్టో గతభ్రమః | స్వపత్న్యై కథయామాస తద్వృత్తం సకలం ముదా || 12

అథావసరమాసాద్య రుద్రస్సర్వాంతకః ప్రభుః | స్వాంశేన తనయో జజ్ఞే ద్రోణస్య స మహాబలః || 13

అశ్వత్థామేతి విఖ్యాతస్స బభూవ క్షితౌ మునే | ప్రవీరః కంజపత్రాక్షశ్శత్రు పక్షక్షయం కరః || 14

బ్రాహ్మణుడగు ఆ ద్రోణుడు ఆ శివుని గాంచి మిక్కలి ప్రసన్నమగు హృదయము గలవాడై వెంటనే చేతులు జోడించి మోకరిల్లి ఆయనను స్తుతించెను (8). భక్తవత్సలుడగు శంకరప్రభుడు ఆతని స్తుతికి, తపస్సునకు సంతసిల్లి ఆ ద్రోణునితో వరమును కోరుకొమ్మని పలికెను (9). శంభుని ఆ వచనమును విని ద్రోణుడు నమస్కరించి, 'సర్వులకు జయింప శక్యము కానివాడు, నీ అంశ##చే జన్మించువాడు, మహాబలశాలి యగు పుత్రుని ఇమ్ము' అని కోరెను (10). ఓమహర్షీ! శివుడు ద్రోణుని ఆ మాటను విని, 'అటులనే అగుగాక!' అని పలికి అచటనే అంతర్హితుడాయెను. ఓ కుమారా! సుఖకరుడగు శివుని లీల ఉత్కంఠను కలిగించును (11). భ్రమలు తొలగిన ద్రోణుడు మహానందముతో తన ఇంటికి వెళ్లి జరిగిన వృత్తాంతమునంతనూ ఆనందముతో తన భార్యకు చెప్పెను (12). అటుపిమ్మట సరియగు సమయమునందు, సర్వవినాశకరుడగు శంకరప్రభుడు తన అంశ##చే మహాబలశాలియగు ద్రోణపుత్రుడై జన్మించెను (13). ఓ మహర్షీ! ఆతడు లోకములో అశ్వత్థామయను పేర ప్రసిద్ధిని గాంచెను. మహావీరుడు, పద్మ పత్రముల వంటి నేత్రములు గలవాడు అగు అశ్వత్థామ శత్రుపక్షమును నాశనము చేయగల సమర్థుడు (14).

యో భారతే రణ ఖ్యాతః పితురాజ్ఞామవాప్య చ | సహాయకృద్బభూవాథ కౌరవాణాం మహాబలః || 15

యమాశ్రిత్య మహావీరం కౌరవాస్సుమహాబలాః | భీష్మాదయో బభూవుస్తే%జేయా అపి దివౌకసామ్‌ || 16

యద్భయాత్పాండవాస్సర్వే కౌరవాన్‌ జేతుమక్షమాః | ఆసన్నష్టా మహావీరా అపి సర్వే చ కోవిదాః || 17

కృష్ణోపదేశతశ్శంభోస్తవః కృత్వాతిదారుణమ్‌ | ప్రాప్య చాస్త్రం శంభువరాజ్జిగ్యే తానర్జునస్తతః || 18

అశ్వత్థామా మహావీరో మహాదేవాంశజో మునే | తథాపి తద్భక్తి వశస్స్వప్రతాప మదర్శయత్‌ || 19

వినాశ్య పాండవసుతాన్‌ శిక్షితానపి యత్నతః | కృష్ణాదిభిర్మహావీరైరని వార్య బలః పరైః || 20

పుత్ర శోకేన వికల మాపతంతం తమర్జునమ్‌ | రథేనాచ్యుతవంతం హి దృష్ట్వా స చ పరాద్రవత్‌ || 21

అస్త్రం బ్రహ్మశిరో నామ తదుపర్యసృజత్స హి | తతః ప్రాదురభూత్తేజః ప్రచండం సర్వతో దిశమ్‌ || 22

ప్రాణాపద మ భిప్రేక్ష్య సో%ర్జునః క్లేశసంయుతః | ఉవాచ కృష్ణం విక్లాంతో నష్టతేజా మహాభయః || 23

మహాబలుడగు అశ్వత్థామ తండ్రి అనుజ్ఞను పొంది భారతయుద్ధములో కౌరవులకు సాహాయ్యమొనర్చి విఖ్యాతిని గాంచెను (15). మహావీరుడగు అశ్వత్థామను ఆశ్రయించుటచే మిక్కిలి బలశాలురగు భీష్మాది కౌరవులు దేవతలకు అజేయులై నిలచిరి (16). పాండవులందరు మహావీరులు, యుద్ధవిశారదులు అయిననూ ఆతని భయము వలన కౌరవులను జయించు శక్తి లేనివారై నాశమును పొందిరి (17). అపుడు అర్జునుడు కృష్ణుని ఉపదేశము ననుసరించి శంభుని కొరకై మిక్కిలి తీవ్రమగు తపము నాచరించి శంభుని వరము వలన అస్త్రము పొంది వారిని జయించెను (18). ఓ మునీ! మహావీరుడగు అశ్వత్థామ మహాదేవుని అంశ##చే జన్మించిన వాడైననూ మహాదేవుని యందలి భక్తికి వశుడై తన ప్రతాపమును ప్రదర్శించెను (19). ప్రయత్నపూర్వకముగా శిక్షణను పొందియున్న పాండవపుత్రులనాతడు సంహరించెను. శత్రు పక్షములోని మహావీరులగు కృష్ణాదులు ఆతని బలమను నిలువరించ లేకపోయిరి (20). పుత్రశోకముతో పీడితుడై అచ్యుతునితో గూడి రథముపై దండెత్తి వచ్చుచున్న అర్జునుని గాంచి ఆతడు పారిపోయెను (21). అపుడాతడు ఆతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రమును ప్రయోగించెను. దాని నుండి ఉద్భవించిన ప్రచండమగు తేజస్సు దిక్కులన్నిటియందు వ్యాపించెను (22). మిక్కిలి అలసి, తేజస్సును నష్టపోయి, మహాభయమును పొంది, ఆపదలోనున్న ఆ అర్జునుడు ప్రాణములకు రానున్న ముప్పును గాంచి శ్రీకృష్ణునితో నిట్లనెను (23).

అర్జున ఉవాచ|

కిమిదం స్విత్కుతో వేతి కృష్ణ కృష్ణ న వేద్మ్యహమ్‌ | సర్వతో ముఖమాయాతి తేజశ్చేదం సుదుస్సహమ్‌ || 24

అర్జునుడిట్లు పలికెను-

ఓ కృష్ణా! కృష్ణా! ఇదియేమి? ఎచటనుండి వచ్చుచున్నది?నాకు తెలియకున్నది. సహింప శక్యము కాని ఈ గొప్ప తేజస్సు అన్నివైపులనుండి వచ్చుచున్నది (24)

నందీశ్వర ఉవాచ|

శ్రుత్వార్జునవచశ్చేదం స కృష్ణశ్శైవసత్తమః | దధ్యౌ శివం సదారం చ ప్రత్యాహార్జున మాదరాత్‌ || 25

నందీశ్వరుడిట్లు పలికెను-

అర్జునుని ఈ మాటను విని శివభక్తులలో అగ్రగణ్యుడగు ఆ కృష్ణుడు పార్వతీ పరమేశ్వరులను ధ్యానించి అర్జునుని ఉద్దేశించి సాదరముగా నిట్లు పలికెను (25).

కృష్ణ ఉవాచ |

వేత్థేదం ద్రోణపుత్రస్య బ్రాహ్మమస్త్రం మహోల్బణమ్‌ | నహ్యస్యాన్యతమం కించి దస్త్రం ప్రత్యవ కర్శనమ్‌ || 26

శివం స్మర ద్రుతం శంభుం స్వప్రభుం భక్తరక్షకమ్‌ | యేన దత్తం హి తే స్వాస్త్రం సర్వకార్యకరం పరమ్‌ || 27

జహ్యస్త్రతేజ ఉన్నద్ధం త్వంతచ్ఛై వాస్త్ర తేజసా | ఇత్యుక్త్వా చ స్వయం కృష్ణ శ్శివం దధ్యౌ తదర్థకః || 28

తచ్ఛ్రుత్వా కృష్ణవచనం పార్థః స్మృత్వా శివం హృది | స్పృష్ట్వా పస్తం ప్రణమ్యాశు చిక్షేపాస్త్రం తతో మునే || 29

యద్యప్యస్త్రం బ్రహ్మ శిరస్త్వమోఘం చాప్రతిక్రియమ్‌ | శైవాస్త్ర తేజసా సద్యస్సమశామ్యన్మహామునే || 30

మంస్థా మా హ్యేతదాశ్చర్యం సర్వచిత్ర మయే శివే | యస్స్వశక్త్వా ఖిలం విశ్వం సృజత్త్యవతి హంత్యజః || 31

అశ్వత్థా మా తతో జ్ఞాత్వా వృత్తమేతచ్ఛివాంశజః | శైవం న వివ్యథే కించిచ్ఛివేచ్ఛా తుష్టధీర్మునే | 32

కృష్ణుడిట్లు పలికెను-

ద్రోణపుత్రుడు మహాశక్తి యుతమగు బ్రహ్మ శిరోనామకాస్త్రమును ప్రయోగించినాడని ఎరుంగుము. అదియే ఇది. దీనికి ప్రతీకారమును చేయగల అస్త్రము మరియొకటి లేదు (26). మంగళస్వరూపుడు, నీకు ప్రభువు, భక్తులను రక్షించువాడు అగు శివుని వెంటనే స్మరించుము. శివుడు కార్యములనన్నిటినీ సాధించే తన పరమాస్త్రమును నీకు ఇచ్చియున్నాడు (27). నీవు ఆ శివుని అస్త్రముయొక్క తేజస్సుచే ప్రజ్వరిల్లుచున్న ఈ అస్త్రతేజస్సును శాంతింపజేయుము. ఇట్లు పలికి కృష్ణుడు అదే ప్రయోజనమును గోరి తాను స్వయముగా శివుని ధ్యానించెను (28). శ్రీ కృష్ణుని ఆ మాటలను విని అర్జునుడు హృదయములో శివుని స్మరించెను. ఓ మునీ! అపుడాతడు నీటిని స్పృశించి శివునకు ప్రణమిల్లి వెంటనే అస్త్రమును విడిచిపెట్టెను (29). బ్రహ్మశిరోనామకాస్త్రము అమోఘము, ప్రతిక్రియ లేనిది అయిననూ, ఓ మహర్షీ! అది శివుని అస్త్రము యొక్క తేజస్సుచే వెంటనే శాంతించెను (30). సర్వాశ్చర్యములకు నిధానమగు శివుని విషయములో ఇది ఆశ్చర్యమని తలంచకుము. పుట్టుక లేని ఆ శివుడు తన శక్తిచే జగత్తునంతనూ సృజించి, రక్షించి, ఉపసంహరించు చున్నాడు (31). ఓ మునీ! శివుని అంశవలన జన్మించిన అశ్వత్థామ అపుడీ వృత్తాంతమునెరింగి శివుని ఇచ్ఛచే సంతసిల్లిన బుద్ధి గలవాడై శివ భక్తునకు ఏమియూ హానిని కలిగించ లేదు (32).

అథ ద్రౌణి రిదం విశ్వం కృత్స్నం కర్తుమపాండవమ్‌ | ఉత్తరాగర్భగం బాలం నాశితుం మన ఆదధే || 33

బ్రహ్మాస్త్ర మనివార్యం తదన్యెరసై#్త్రర్మహాప్రభమ్‌ | ఉత్తరాగర్భముద్దిశ్య చిక్షేప స మహాప్రభుః || 34

తతశ్చ సోత్తరా జిష్ణువధూర్వికలమానసా | కృష్ణం తుష్టావ లక్ష్మీశం దహ్యమానా తదస్త్రతః || 35

తతః కృష్ణశ్శివం ధ్యాత్యాం హృదా నుత్వా ప్రణమ్య చ | అపాండవమిదం కర్తుం ద్రౌణరస్త్రమబుధ్యత || 36

స్వరక్షార్థేంద్రదత్తేన తదస్త్రేణ సువర్చసా | సుదర్శనేన తస్యాశ్చ వ్యధాద్రక్షాం శివాజ్ఞయా || 37

స్వరూపం శంకరాదేశాత్కృతంశైవవరేణ హ | కృష్ణేన చరితం జ్ఞాత్వా విమనస్కశ్శనైరభూత్‌ || 38

తతస్స కృష్ణః ప్రీతాత్మా పాండవాన్‌ సకలానపి | అపాతయత్తదంఘ్య్రోస్తు తుష్టయే తస్య శైవరాట్‌ || 39

అపుడు అశ్వత్థామ సమస్త జగత్తులో పాండవులు లేకుండగా చేయుటకొరకై ఉత్తరాగర్భమునందున్న బాలుని సంహరించుటకు నిశ్చయించెను (33). ఇతరాస్త్రములచే నివారింప శక్యము కానిది, గొప్ప కాంతి గలది అగు బ్రహ్మాస్త్రమును గొప్ప సమర్థుడగు ఆ అశ్వత్థామ ఉత్తరాగర్భమునుద్దేశించి ప్రయోగించెను (34). విజయియగు అభిమన్యుని పత్నియగు ఉత్తర అపుడు వికలమైన మనస్సు గలదై, ఆ అస్త్రముచే పీడను పొందినదై లక్ష్మీపతియగు కృష్ణుని స్తుతించెను (35). అపుడు శ్రీ కృష్ణుడు హృదయములో శివుని ధ్యానించి స్తుతించి ప్రణమిల్లి, ఈ జగత్తులో పాండవులు లేకుండగా చేయుటకొరకై అశ్వత్థామ అస్త్రమును ప్రయోగించినాడని, తెలుసుకొనెను (36). అపుడు ఆయన శివుని ఆజ్ఞను పొంది తన రక్షణ కొరకు శివునిచే ఈయబడిన, గొప్ప తేజస్సుగల సుదర్శనాస్త్రముతో ఆ గర్భమును రక్షించెను (37). శివభక్తాగ్రగణ్యుడగు కృష్ణుడు శంకరుని ఆదేశముచే తన అస్త్రమును వ్యర్థము చేసినాడని ఎరింగి అశ్వత్థామ మెల్గగా తన మనస్సులోని వైమనస్యమును తొలగించెను. (38). అపుడు శివభక్తాగ్రగణ్యుడగు శ్రీ కృష్ణుడు సంతోషముతో నిండిన హృదయము గలవాడై ఆతనిని సంతోషపెట్టుటకై పాండవులనందరినీ ఆతని కాళ్లపై పడవేసెను (39).

అథద్రౌణిః ప్రసన్నాత్మా పాండవాన్‌ కృష్ణమేవ చ | నానావరాన్‌ దదౌ ప్రీత్యా సో % శ్వత్థామానుగృహ్య చ || 40

ఇత్థం మహేశ్వరస్తాత చక్రే లీలాం పరం ప్రభుః | అవతీర్య క్షితౌ ద్రౌణి రూపేణ మునిసత్తమ || 41

శివావతారో%శ్వత్థామా మహాబలపరాక్రమః | త్రైలోక్యసుఖదో%ద్యాపి వర్తతే జాహ్నవీతటే || 42

అశ్వత్థామావతారస్తే వర్ణితశ్శంకరప్రభోః | సర్వసిద్ధి కరశ్చాపి భక్తా భీష్టఫలప్రదః || 43

య ఇదం శృణు యాద్భక్త్యా కీర్తయేద్వా సమాహితః | స సిద్ధిం ప్రాప్నుయాదిష్టామంతే శివపురం వ్రజేత్‌ || 44

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్ర సంహితాయాం అశ్వత్థామావతార వర్ణనం నామ షట్‌ త్రింశో%ధ్యాయః (36).

అపుడు ద్రోణపుత్రుడగు అశ్వత్థామ ప్రసన్నమగు మనస్సు గలవాడై పాండవులను శ్రీ కృష్ణుని అనుగ్రహించి ప్రేమతో అనేకవరములనిచ్చెను (40). వత్సా! మహర్షీ! ఈ తీరున మహేశ్వర ప్రభుడు భూమిపై అశ్వత్థామ రూపములో అవతరించి గొప్ప లీలను చేసెను (41). మహాబలపరాక్రమములు గలవాడు, శివావతారుడు, ముల్లోకములకు సుఖమునిచ్చువాడు అగు అశ్వత్థామ ఈ నాటికీ గంగాతీరమున నున్నాడు (42). సర్వసిద్ధులనిచ్చునది, భక్తులకు అభీష్టఫలములనిచ్చునది అగు శంకర ప్రభుని అశ్వత్థామావతారమును నీకు వర్ణించితిని (43). ఎవడైతే దీనిని భక్తితో వినునో, లేదా సమాహితచిత్తుడై కీర్తించునో, వాడు ఇష్టసిద్ధిని పొంది, దేహమును వీడిన తరువాత శివుని ధామను పొందును (44).

శ్రీ శివ మహాపురాణములోని శతరుద్రసంహితయందు అశ్వత్థామా వతారవర్ణనమనే ముప్పది ఆరవ అధ్యాయము ముగిసినది (36).

Siva Maha Puranam-3    Chapters