Siva Maha Puranam-3    Chapters   

అథ ద్వాత్రింశో%ధ్యాయః

సురేశ్వరావతారము

శృణు తాత ప్రవక్ష్యామి శివస్య పరమాత్మనః | సురేశ్వరావతారస్తే ధౌమ్యాగ్రజహితావహమ్‌ || 1

వ్యాఘ్రపాదసుతో ధీమానుపమన్యుస్సతాం ప్రియః | జన్మాంతరేణ సంసిద్ధః ప్రాప్తో మునికుమారతామ్‌ || 2

ఉవాస మాతులగృహే సమాత్రా శిశురేవ హి | ఉపమన్యుర్వ్యాఘ్రపాది స్స్యాద్దరిద్రశ్చ దైవతః || 3

కదాచిత్‌ క్షీర మత్యల్పం పీతవాన్మాతులాశ్రమే | యయాచే మాతరం ప్రీత్యా బహుశో దుగ్ధలాలసః || 4

తచ్ఛ్రుత్వా పుత్ర వచనం తన్మాతా చ తపస్వినీ | సాంతః ప్రవిశ్యాథ తదా శుభోపాయమరీరచత్‌ || 5

ఉంఛవృత్త్యర్జితాన్‌ బీజాన్‌ పిష్ట్వా లోడ్య జలేన తాన్‌| ఉపలాల్య సుతం తసై#్మ సా దదౌ కృత్రిమం పయః || 6

పీత్వా చ కృత్రిమం దుగ్ధం మాత్రా దత్తం స బాలకః | నేతత్‌ క్షీరమితి ప్రాహ మాతరం చారుదత్‌ పునః || 7

శ్రుత్వా సుతస్య రుదితం ప్రాహ సా దుఃఖితా సుతమ్‌ | సంమార్జ్యనేత్రే పుత్రస్య కరాభ్యాం కమలాకృతిః || 8

వత్సా! పరమాత్ముడగు శివుని సురేశ్వరావతారమును గూర్చి చెప్పెదను వినుము. ఈ అవతారములో శివుడు ధౌమ్యుని అన్నకు హితమును కలిగించెను (1). వ్యాఘ్రపాదుని కుమారుడగు ఉపమన్యుడు బుద్ధిశాలి మరియు సత్పురుషులకు ప్రియమైనవాడు. ఆతడు పూర్వ జన్మయందు సిద్ధిని పొందియుండి ఈ జన్మలో ముని కుమారుడైనాడు (2). వ్యాఘ్రపాద పుత్రుడగు ఉపమన్యుడు దైవవశముచే దరిద్రుడగుటచే చిన్న వయసులో నుండగనే తల్లితో గూడి మేనమామ ఇంటిలో నివసించెడివాడు (3). ఒకనాడు మేనమామ ఇంటిలో ఆతనికి అతి తక్కువ పాలు లభించెను. అపుడాతడు పాలపై మిక్కుటమగు మక్కువ గలవాడై తల్లిని ప్రేమతో యాచించెను (4). పుత్రుని ఆ వచనములను విని తపస్విని యగు వాని తల్లి లోపలకు వెళ్లి ఒక చక్కటి ఉపాయమును చేసెను (5). ఆమె ఉంఛవృత్తి ద్వారా సంపాదించిన గింజలను పిండిచేసి నీటిలో కలిపి ఆ పిండి పాలను పుత్రునకు లాలించి ఇచ్చెను (6). తల్లి ఇచ్చిన ఆ పిండి పాలను త్రాగి ఆ బాలకుడు తల్లితో 'ఇవి పాలు కావు' అని పలికి మరల ఏడ్వజొచ్చెను (7). లక్ష్మివంటి రూపుగల ఆ తల్లి పుత్రుని ఏడ్పును విని మిక్కిలి ధుఃఖించి, పుత్రుని కన్నీటిని చేతులతో తుడిచి ఇట్లు పలికెను (8).

మాతోవాచ |

క్షీరమత్ర కుతో%స్మాకం వనే నివసతాం సదా | ప్రసాదేన వినా శంభోఃపయః ప్రాప్తిర్భవేన్న హి || 9

పూర్వజన్మని యత్‌ కృత్యం శివముద్దిశ్య హే సుత | తదేవ లభ్యతేనూనం నాత్ర కార్యా విచారణా || 10

ఇతి మాతృవచ శ్శ్రుత్వా వ్యాఘ్రపాదిస్స బాలకః | ప్రత్యువాచ విశోకాత్మా మాతరం మాతృవత్సలః || 11

శోకేనాలమిమం మాత శ్శంభుర్యద్యస్తి శంకరః | త్యజ శోకం మహాభాగే సర్వం భద్రం భవిష్యతి || 12

శృణు మాతర్వచో మే %ద్య మహాదేవో%స్తి చేత్‌ క్వచిత్‌ | చిరాద్వా హ్యచిరాద్వాపి క్షీరోదం సాధయామ్యహమ్‌ || 13

తల్లి ఇట్లు పలికెను-

సర్వదా వనములో నివసించు మనకు పాలు ఎక్కడివి? శంభుని అనుగ్రహము లేనిదే పాలు లభించవు (9). ఓ పుత్రా! పూర్వజన్మలో శివుని ఉద్దేశించి ఎంత ఆరాధన చేసి యుంటిమో, అంత మాత్రమే లభించును. ఇది నిశ్చయము. దీనిలో శంకకు అవకాశము లేదు (10). వ్యాఘ్రపాదుని కుమారుడు, తల్లియందు ప్రేమ గలవాడునగు ఆ బాలకుడు తల్లియొక్క ఈ మాటలను విని శోకముతో నిండిన హృదయము గలవాడై తల్లికి ఇట్లు బదులిడెను (11). ఓ తల్లీ! శోకమును వీడుము. ఓ పుణ్యాత్మురాలా! మంగళకరుడగు శంభుడు ఉన్నచో సర్వము సుసంపన్నము కాగలదు (12). అమ్మా! ఇపుడు నా మాటను వినుము. మహాదేవుడు ఎక్కడ ఉన్ననూ, శీఘ్రముగా గాని, చిరకాలమునకు గాని, నేను క్షీరసముద్రమును సాధించెదను (13).

నందీశ్వర ఉవాచ |

ఇత్యుక్త్వా స శిశుః ప్రీత్యా శివం మే %స్త్వి త్యుదీర్య చ| విసృజ్య తాం సుప్రణమ్య తపః కర్తుం ప్రచక్రమే || 14

హిమవత్పర్వతగతః వాయుభక్షస్సమాహితః | అష్టేష్టకాభిః ప్రాసాదం కృత్వా లింగం చ మృన్మయమ్‌ || 15

తత్రావాహ్య శివం సాంబం భక్త్యా పంచాక్షరేణ హ | పత్ర పుష్పాదిభిర్వన్యైస్సమానర్చ శిశుస్సవై || 16

ధ్యాత్యా శివం చ తం సాంబం జపన్‌ పంచాక్షరం మనుమ్‌ | సమబ్యర్చ్య చిరం కాలం చచార పరమం తపః || 17

తపసా తస్య బాలస్య హ్యుప మన్యోర్మహాత్మనః | చరాచరం చ భువనం ప్రదీపితమభూన్మునే || 18

ఏతస్మిన్నంతరే శంభుర్విష్ణ్వాద్యైః ప్రార్థితః ప్రభుః | పరీక్షితుం చ తద్భక్తిం శక్రరూపో%భవత్తదా || 19

శివా శచీ స్వరూపాభూద్గణాః సర్వే%భవన్‌ సురాః | ఐరావతగజో నందీ సర్వమేవ చ తన్మయమ్‌ || 20

తతస్సాంబశివశ్శక్ర స్వరూపస్సగణో ద్రుతమ్‌ | జగామానుగ్రహం కర్తుముపమన్యోస్తదాశ్రమమ్‌ || 21

పరీక్షింతుం చ తద్భక్తిం శక్రరూపధరో హరః | ప్రాహ గంభీరయా వాచా బాలకం తం మునీశ్వర || 22

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆ బాలుడు ప్రీతి పూర్వకముగా నిట్లు పలికి 'నాకు మంగళమగుగాక!' అని పలికి ఆమెకు చక్కగా ప్రణమిల్లి ఆమెను విడచి తపస్సును చేయునారంభించెను (14). ఆతడు హిమాలయములకు పోయి ఎనిమిది ఇటుకలతో ఒక మందిరమును మట్టితో లింగమును చేసి వాయువు మాత్రమే ఆహారముగా గలవాడై ఏకాగ్రమైన మనస్సుతో (15) ఆ లింగమునందు పార్వతీ సమేతుడగు శివుని ఆహ్వానించి భక్తితో ఆరాధించెను. ఆ బాలకుడు పంచాక్షరమంత్రమును పఠిస్తూ వనమునందు లభించే పత్రపుష్పాదులతో చక్కగా ఆరాధించెను (16). ఆతడు పంచాక్షర మంత్రమును జపిస్తూ పార్వతీ సమేతుడగు శివుని ధ్యానిస్తూ చిరకాలము శివుని ఆరాధిస్తూగొప్ప తపస్సును చేసెను (17). ఓ మహర్షీ! బాలకుడు, మహాత్ముడు అగు ఆ ఉపమన్యుని తపస్సుచే స్థావరజంగమాత్మకమగు జగత్తు అంతయూ తేజోమయమయ్యెను (18). ఇదే కాలములో విష్ణువుమొదలగు వారిచే ప్రార్థింపబడిన శంభుప్రభుడు ఆతని భక్తిని పరీక్షించుటకై ఇంద్రరూపమును దాల్చెను (19). పార్వతీదేవి శచీరూపమును దాల్చెను. గణములందరూ దేవతలైరి. నందీశ్వరుడు ఐరావతగజము ఆయెను. ఇతరము సర్వము ఇంద్రలోక సంబంధిరూపమున దాల్చెను (20). అపుడు పార్వతీసమేతుడగు శివుడు ఇంద్రరూపములో గణములతో గూడి వెంటనే ఉపమన్యుని అనుగ్రహించుటకై ఆతని ఆశ్రమమునకు విచ్చేసెను (21). ఓ మహర్షీ! ఆ బాలకుని భక్తిని పరీక్షించుటకై ఇంద్రుని రూపమును దాల్చిన శివుడు గంభీరమగు వాక్కుతో ఆతనిని ఉద్దేశించి ఇట్లు పలికెను (22).

సురేశ్వర ఉవాచ|

తుష్టో%స్మితే తే వరం బ్రూహి తపసానేన సువ్రత | దదామి చేచ్ఛితాన్‌ కామాన్‌ సర్వాన్నాత్రాస్తి సంశయః || 23

ఏవముక్తస్స వై తేన శక్రరపేణ శంభునా | వరయామి శివే భక్తి మిత్యువాచ కృతాంజలిః || 24

తన్నిశమ్య హరిః ప్రాహ మాం న జానాసి లేఖపమ్‌ | త్రైలోక్యాధిపతిం శక్రం సర్వదేవనమస్కృతమ్‌ || 25

మద్భక్తో భవ విప్రర్షే మామేవార్చయ సర్వదా | దదామి సర్వం భద్రం తే త్యజ రుద్రం చ నిర్గుణమ్‌ || 26

రుద్రేణ నిర్గుణ నాలం కిం తే కార్యం భవిష్యతి | దేవజాతి బహిర్భూతో యః పిశాచత్వమాగతః || 27

సురేశ్వరుడిట్లు పలికెను-

ఓ యీ మహాతపస్వీ! నీ ఈ తపస్సుచే నేను సంతసించితిని. వరమును కోరుకొనుము. నీవు కోరిన కోర్కెలనన్నింటినీ తీర్చెదను. సందేహము వలదు (23). ఇంద్రరూపములో నున్న శంభుడు ఇట్లు పలుకగా ఆతడు చేతులను జోడించి 'శివునియందు భక్తిని గోరుచున్నాను' అని పలికెను (24). ఆ మాటను విని ఇంద్రుడిట్లు పలికెను. నీవు నన్ను ఎరుంగవు. దేవతలను రక్షించువాడను నేనే. ముల్లోకములకు ప్రభువు, దేవతలందరిచే నమస్కరింపబడువాడు అగు ఇంద్రుడను నేనే (25). హే విప్రర్షీ! నీవు నా భక్తుడవై సర్వదా నన్ను ఆరాధించుము. నీకు సర్వమునిచ్చెదను. నీకు మంగళమగు గాక! నిర్గుణుడగు రుద్రుని విడిచిపెట్టుము (26). నిర్గుణుడగు రుద్రుని ఆరాధించి ప్రయోజనమేమున్నది? ఈ ఆరాధనను చాలించుము. రుద్రుడు దేవ జాతినుండి బహిష్కరింపబడి పిశాచమైనాడు (27).

నందీశ్వర ఉవాచ|

తచ్ఛ్రుత్వా స మునేః పుత్రో జపన్‌ పంచాక్షరం మనుమ్‌ | మన్యమానో ధర్మవిఘ్నం ప్రాహ తం కర్తుమాగతమ్‌ || 28

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆ మాటలను విని ఆ మునిపుత్రుడు ఇంద్రుని తన ధర్మమునకు విఘ్నమునకు కలిగించుటకై వచ్చిన వానినిగా లెక్కగట్టి పంచాక్షరమంత్రమును జపిస్తూ ఇట్లు పలికెను (28).

ఉపమన్యురువాచ |

త్వయైవ కథితం సర్వం భవనిందారతేన వై | ప్రసంగాద్దేవదేవస్య నిర్గుణత్వం పిశాచతా || 29

త్వం న జానాసి వై రుద్రం సర్వదేవేశ్వరేశ్వరమ్‌ | బ్రహ్మ విష్ణుమహేశానాం జనకం ప్రకృతేః పరమ్‌ || 30

సదసద్వ్యక్త మవ్యక్తం యమాహుర్బ్రహ్మవాదినః | నిత్యమేకమనేకం చ వరం తస్మాద్వృణోమ్యహమ్‌ || 31

హేతువాద వినిర్ముక్తం సాంఖ్యయో గార్థదం పరమ్‌ | యముశంతి హి తత్త్వజ్ఞా వరం తస్మా ద్వృణోమ్యహమ్‌ || 32

నాస్తి శంభోః పరం తత్త్వం సర్వకారణకారణమ్‌ | బ్రహ్మ విష్ణ్వాది దేవానాం శ్రేష్ఠో గుణపరాద్విభోః || 33

నాహం వృణ వరం త్వత్తో న విష్ణోర్బ్రహ్మణో%పి వా | నాన్యస్మాదమరాద్వాపి శంకరో వరదోస్తు మే || 34

బహునాత్ర కిముక్తేన వచ్మి తత్త్వం మతం స్వకమ్‌ | న ప్రార్థయే పశుపతేరన్యం దేవాదికం స్ఫుటమ్‌ || 35

మద్భావం శృణు గోత్రారే మయాద్యానుమితం త్విదమ్‌ | భవాంతరే కృతం పాపం శ్రుతా నిందా భవస్య చేత్‌ || 36

శ్రుత్వా నిందాం భవస్యాథ తత్‌క్షణాదేవ సంత్యజేత్‌ | స్వదేహం తన్నిహత్యాశు శివలోకం స గచ్ఛతి || 37

ఆస్తాం తావన్మ మేచ్ఛేయం క్షీరం ప్రతి సురాధమ | నిహత్య త్వాం శివాస్త్రేణ త్యజామ్యేతత్కలేవరమ్‌ || 38

ఉపమన్యువు ఇట్లు పలికెను-

దేవదేవుడగు శివుని ప్రసంగమును మొదలిడి శివనిందయందు అభిరుచి గల నీవు నిర్గుణత్వము, పిశాచత్వము మొదలగు గుణములనన్నిటినీ ఈ విధముగా చెప్పియుంటివి (29). దేవప్రభువులందరికీ ప్రభువు, బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు తండ్రి, ప్రకృతికంటే అతీతుడగు అగు రుద్రుని నీవు ఎరుంగవు (30). రుద్రుడు కార్యకారణ స్వరూపుడనియు, వ్యక్తమగు జగత్తు అవ్యక్తమగు ప్రకృతి ఆయన స్వరూపమేననియు, నిత్యుడనియు, అద్వితీయుడనియు, అనేక రూపుడనియు బ్రహ్మవేత్తలు చెప్పుచున్నారు. నేను అట్టి రుద్రుని నుండి వరమును కోరెదను (31). రుద్రుడు హేతువాదమునకు దొరకడనియు, జ్ఞానయోగఫలము అగు మోక్షమును ఇచ్చువాడనియు, పరమాత్ముడనియు తత్త్వవేత్తలు చెప్పు చున్నారు. నేను అట్టి రుద్రుని నుండి వరమును కోరెదను (32). శంభుని మించిన తత్త్వము లేదు. శంభుడే సర్వకారణకారణుడు, బ్రహ్మ విష్ణువు మొదలగు దేవతలందరి కంటే శ్రేష్ఠుడు, గుణాతీతుడు మరియు సర్వవ్యాపి (33). నేను నీనుండి గాని, బ్రహ్మ విష్ణువులనుండి గాని, ఇతర దేవతలనుండి గాని వరమును గోరుట లేదు. నాకు శివుడు వరమునిచ్చుగాక! (34) ఇన్ని మాటలేల? నా నిశ్చయమును యథార్థముగా చెప్పుచున్నాను. శివుని తక్క ఇతర దేవతలనుండి వరమును నిశ్చయముగా కోరుట లేదు (35). ఓ ఇంద్రా! నా అభిప్రాయమును వినుము. నేనీనాడు ఇట్లు ఊహించితిని. పూర్వజన్మలో పాపముచేసి యుండుటచే ఇపుడు శివనిందను వినవలసి వచ్చినది (36). శివనిందను విన్న వ్యక్తి వెంటనే ఆ దేహమును విడువవలెను. అట్లు చేసినచో వెంటనే శివలోకమును పొందును (37). ఓ దేవతాధమా! పాలను గురించి నాకు గల ఇచ్ఛను ప్రక్కకు బెట్టి శివాస్త్రముచే నిన్ను సంహరించి నేనీ దేహమును పరిత్యజించెదను (38).

నందీశ్వర ఉవాచ|

ఏవముక్త్వో పమన్యుస్తం మర్తుం వ్యవసితస్స్వయమ్‌ | క్షీరే వాంఛామపి త్యక్త్వా నిహంతుం శక్ర ముద్యతః || 39

భస్మాదాయ తదా ధారాదఘోరాస్త్రాభిమంత్రితమ్‌ | విసృజ్య శక్రముద్దిశ్య ననాద స మునిస్తదా || 40

స్మృత్వా స్వేష్టపదద్వంద్వం స్వదేహం దగ్ధు ముద్యతః | ఆగ్నేయీం ధారణాం బిభ్రదుపమన్యురవస్థితః ||41

ఏవం వ్యవసితే విప్రే భగవాన్‌ శక్రరూపవాన్‌ | వారయామాస సౌమ్యేన ధారణాం తస్య యోగినః || 42

తద్విసృష్టమ ఘోరాస్త్రం నందీశ్వర నియోగతః | జగృహే మధ్యతః క్షిప్తం నందీ శంకరవల్లభమ్‌ || 43

స్వరూపమేవ భగవానాస్థాయ పరమేశ్వరః | దర్శయామాస విప్రాయ బాలేందుకృతశేఖరమ్‌ || 44

క్షీరార్ణవసహస్రం చ దధ్యాచే రర్ణవం తథా | భక్ష్య భోజ్యార్ణవం తసై#్మ దర్శయామాస స ప్రభుః || 45

ఏవం స దదృశే శంభుర్దేవ్యా సార్ధం వృషోపరి | గణశ్వరై స్త్రి శూలాద్యై ర్దివ్యాసై#్త్రరపి సంవృతః || 46

దివి దుందు భయో నేదుః పుష్పవృష్టిః పపాత హ | విష్ణుబ్రహ్మేంద్ర ప్రముఖైర్దేవైశ్ఛన్నా దిశో దశ || 47

అథోపమన్యురానంద సముద్రోర్మిభిరావృతః | పపాత దండవద్భూమౌ భక్తి నమ్రేణ చేతసా || 48

ఏతస్మిన్‌ సమయే తత్ర సుస్మితో భగవాన్‌ భవః | ఏహ్యే హీతి సమాహూయ మూర్థ్న్యాఘ్రాయ దదౌ వరాన్‌ || 49

నందీశ్వరుడిట్లు పలికెను-

ఉపమన్యుడు ఇట్లు పలికి పాలయందలి కోర్కెను కూడ విడిచిపెట్టి స్వయముగా ఇంద్రుని సంహరించుటకు పూనుకొనెను (39). ఆ మహర్షి అపుడు శివలింగము యొక్క పీఠమునుండి భస్మను తీసుకొని అఘోరాస్త్రముతో అభిసంధించి దానిని ఇంద్రునిపైకి విడిచిపెట్టి సింహనాదమును చేసెను (40). ఆ ఉపమన్యుడు తన ఇష్టదైవము యొక్క పాదపద్మములను స్మరించి ఆగ్నేయాస్త్రమును ధారణచేసి తన దేహమును తగుల బెట్టుటకు సంసిద్ధుడాయెను (41). ఆ బ్రాహ్మణుడిట్లు సంసిద్ధుడు కాగా, ఇంద్ర రూపములో నున్న శివుడు సౌమ్యమగు రూపమును దాల్చి ఆ యోగియొక్క అగ్నిధారణను శమింపజేసెను (42). ఆతనిచే విడువబడిన, శంకరునకు ప్రియమైన అఘోరాస్త్రమును నందీశ్వరుని ఆదేశముచే నంది మధ్యలో పట్టుకొని ఆవల పారవేసెను (43). పరమేశ్వరుడు నిజరూపమును దాల్చెను. ఆ బ్రాహ్మణుడు చంద్రవంకచే అలంకరింపబడిన శిరస్సు గల భగవానుని దర్శించెను (44). ఆ ప్రభుడు ఆ బాలకునకు పాలు,పెరుగు, భక్ష్యములు, భోజ్యములు మొదలగు వాటి సముద్రములను చూపించెను (45). పార్వతీదేవితో గూడి నందీశ్వరుని అధిష్ఠించి గణాధ్యక్షులచే సేవింపబడుతూ త్రిశూలాది దివ్యాస్త్రములను ధరించియున్న శంభుని ఆ బాలకుడు ఈ తీరున గాంచెను (46). ద్యులోకము నందు దుందుభులు మ్రోగినవి. పుష్పవృష్టి గురిసెను. విష్ణువు, బ్రహ్మ మొదలగు దేవతలచే పది దిక్కులు నిండి పోయెను (47). అపుడు ఉపమన్యుని హృదయములో ఆనంద సముద్రముయొక్క తరంగములు ఉద్భవించెను. ఆతడు భక్తితో వినయముతో గూడిన మనస్సు గలవాడై సాష్టాంగ ప్రణామము నాచరించెను (48). అదే సమయములో అచట చిరునవ్వుతో ప్రకాశించే శివభగవానుడు 'రమ్ము, రమ్ము' అని ఆ బాలకుని దగ్గరకు పిలిచి లలాటముపై ముద్దిడి వరములనిచ్చెను (49).

శివ ఉవాచ|

వత్సోపమన్యో తుష్టో%స్మి త్వదాచరణతో వరాత్‌ | దృఢభక్తో%సి విప్రర్షే మయా జిజ్ఞాసితో%ధునా || 50

భక్ష్యభోగ్యాన్‌ యథాకామం బాంధవైర్భుంక్ష్వ సర్వదా | సుఖీ భవ సదా దుఃఖనిర్ముక్తో భక్తి మాన్మమ || 51

ఉపమన్యో మహాభాగ తవాంబైషా హి పార్వతీ | మయా పుత్రీకృతో హ్యద్య కుమారస్త్వం సనాతనమ్‌ || 52

దుగ్ధదధ్యాజ్యమధునామర్ణ వాశ్చ సహస్రశః | భక్ష్య భోజ్యాది వస్తూ నా మర్ణవా శ్శాఖిలాస్తథా || 53

తుభ్యం దత్తం మయా ప్రీత్యా త్వం గృహ్ణీష్వ మహామునే | అమరత్వం తథా దక్ష గాణపత్యం చ శాశ్వతమ్‌ || 54

పితా%హం తే మహాదేవో మాతా తే జగదంబికా | వరాన్‌ వరయ సుప్రీత్యా మనో%భిలషితాన్‌ పరాన్‌ || 55

అజరశ్చామరశ్చైవ భవ త్వం దుఃఖవర్జితః | యశస్వీ వరతేజస్వీ దివ్యజ్ఞానీ మహాప్రభుః || 56

శివుడిట్లు పలికెను-

ఓ వత్సా! ఉపమన్యా! నీ శ్రేష్ఠమగు ఆచరణము వలన నేను సంతసించితిని. ఓ విప్రర్షీ! నీవు దృఢమగు భక్తి గలవాడవు. నేను నిన్ను ఈనాడు పరీక్షించిగోరితిని (50). నీవు సర్వకాలములలో యథేచ్ఛగా బంధువులతో గూడి భక్ష్యములను భుజించి భోగములననుభవించుము. నీవు సర్వదా దుఃఖమునుండి విముక్తిని పొంది నాకు భక్తుడవై సుఖమును పొందుము (51). ఓ మహాత్మా! ఉపమన్యూ! ఈమె నీ తల్లియగు పార్వతి. నేను నిన్ను ఈనాడు శాశ్వతముగా నా కుమారునిగా స్వీకరించు చున్నాను (52). పాలు, పెరుగు, తేనె నేయి, ఇత్యాది సర్వ భక్ష్య వస్తువుల సముద్రములను అసంఖ్యాకముగా (53) నేను నీకు ప్రీతితో ఇచ్చు చున్నాను. ఓ మహర్షీ! స్వీకరించుము. ఓయీ! నీవు సమర్థుడవు. నీకు నేను అమరత్వమును, శాశ్వతమగు గణాధ్యక్షత్వమును ఇచ్చుచున్నాను (54). మహాదేవుడనగు నేను నీకు తండ్రిని. జగన్మాత నీ తల్లి. నీవు నీ మనస్సునకు నచ్చిన శ్రేష్ఠమగు వరములను ఆనందముతో కోరుకొనుము (55). నీవు దుఃఖమును విడనాడి జరామరణములు లేని వాడవై, యశస్సును పొంది, గొప్ప తేజశ్శాలివై, దివ్యజ్ఞానమును పొంది మహాప్రభుడవు కమ్ము (56).

అథ శంభుః ప్రసన్నాత్మా స్మృత్వా తస్య తపో మహత్‌ | పునర్దశ వరాన్‌ దివ్యాన్‌ మునయే హ్యుపమన్య వే || 57

వ్రతం పాశుపతం జ్ఞానం వ్రతయోగం చ తత్త్వతః | దదౌ తసై#్మ ప్రవక్తృత్వం పాటవం చ నిజం పదమ్‌ || 58

ఏవం దత్త్వా మహాదేవః కరాభ్యాముపగృహ్య తమ్‌ | మూర్ధ్న్యాఘ్రాయ సుతస్తే %యమితి దేవ్యై న్యవేదయత్‌ || 59

దేవీ చ శృణ్వతీ ప్రీత్యా మూర్ధ్ని దేశే కరాంబుజమ్‌ | విన్యస్య ప్రదదౌ తసై#్మ కుమారపదమక్షయమ్‌ || 60

క్షీరాబ్ధిమపి సాకారం క్షీరస్వాదుకరోదధిః | ఉపాస్థాయ దదౌ తసై#్మ పిండీభూతమనశ్వరమ్‌ || 61

యోగైశ్వర్యం సదా తుష్టం బ్రహ్మ విద్యామనశ్వరామ్‌ | సమృద్ధిం పరమాం తసై#్మ దదౌ సంతుష్టమానసః || 62

సో%పి లబ్ధ్వా వరాన్‌ దివ్యాన్‌ కుమారత్వం చ సర్వదా | తస్మాచ్ఛివాచ్చ తస్యాశ్చ శివాయా ముదితో%భవత్‌ || 63

తతః ప్రసన్నచేతస్క స్సుప్రణమ్య కృతాంజలిః | యయాచే స వరం ప్రీత్యా దేవదేవాన్మహేశ్వరాత్‌ || 64

అపుడు శంభుడు ప్రసన్నమగు అంతఃకరణము గలవాడై ఉపమన్యు మహర్షి యొక్క గొప్ప తపస్సును గుర్తు చేసుకొని మరల ఆతనికి పది దివ్యములగు వరముల నిచ్చెను (57). పాశుపతవ్రతమును, వ్రతముతో ఈశ్వరుని పొందగలిగే జ్ఞానయోగమను, ప్రవచన శక్తిని మరియు తన ధామను ఆతనికి ఇచ్చెను (58). మహాదేవుడు ఇట్లు ఆతనికి వరములనిచ్చి రెండుచేతులతో ఆతనిని దగ్గరకు తీసుకొని లలాటముపై ముద్దిడి, 'ఈతడు నీ కుమారుడు' అని పార్వతీదేవికి విన్నవించెను (59). ఆ మాటను విని పార్వతిదేవి ప్రేమతో పద్మము వంటి హస్తమును శిరస్సుపై నుంచి ఆతనికి అక్షయమగు కుమారపదమునిచ్చెను (60). క్షీరమువలె మాధుర్యముతో నిండిన హృదయముగల దయాసముద్రుడగు శివుడు అవినాశియగు క్షీరసముద్రమను పిండముగా చేసి ఆకృతిని కలిగియున్న ఆ సముద్రమునాతనికి ఇచ్చెను (61). సంతసించిన మనస్సు గల శివుడు ఆతనికి యోగశక్తిని, నిత్యానందమును, అవినాశియగు బ్రహ్మవిద్యను మరియు పరమ సమృద్ధిని ఇచ్చెను (62). ఆతడు కూడా ఆ శివపార్వతులనుండి దివ్యవరములను, శాశ్వతమగు కుమారత్వమును పొంది ఆనందించెను (63). అపుడాతడు ప్రసన్నమగు మనస్సు గలవాడై దేవదేవుడగు మహేశ్వరునకు ప్రణమిల్లి ప్రేమతో చేతులు జోడించి వరమును కోరెను (64).

ఉపమన్యురువాచ |

ప్రసీద దేవదేవేశ ప్రసీద పరమేశ్వర | స్వభక్తిం దేహి పరమాం దివ్యామ వ్యభిచారిణీమ్‌ || 65

శ్రద్ధా దేహి మహాదేవ స్వ సంబంధిషు మే సదా | స్వదాస్యం పరమం స్నేహం స్వసాన్నిధ్యం చ సర్వదా || 66

ఉపమన్యువు ఇట్లు పలికెను-

ఓ దేవదేవా! ప్రసన్నుడవు కమ్ము. పరమేశ్వరా! ప్రసన్నుడవు కమ్ము. నీయందు హెచ్చుతగ్గులులేని పరమదివ్యభక్తిని నాకు ఇమ్ము (65). ఓ మహాదేవా! సర్వదా నీకు భక్తుల యందు శ్రద్ధను, నీ దాస్యమును, పవిత్రమగు నీ స్నేహమును, నీ సాన్నిధ్యమును నాకు ఇమ్ము (66).

నందీశ్వర ఉవాచ |

ఏవముక్త్వా ప్రసన్నాత్మా హర్షగద్గదయా గిరా | తుష్టావ స మహా దేవముపన్యుర్ద్విజోత్తమః || 67

ఏవముక్త శ్శివస్తేన సర్వేషాం శృణ్వతాం ప్రభుః | ప్రత్యువాచ ప్రసన్నాత్మో పమన్యుం సకలేశ్వరః || 68

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడగు ఉపమన్యుడు ఇట్లు పలికి ప్రసన్నమగు అంతఃకరణము గలవాడై హర్షముతో బొంగురు వోయిన కంఠముతో మహాదేవుని స్తుతించెను (67). ఉపమన్యుడు ఇట్లు స్తుతించగా సర్వేశ్వరుడగు శివప్రభుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై అందరు వినుచుండగా ఇట్లు బదులిడెను (68).

శివ ఉవాచ|

వత్సో పమన్యో ధన్యస్త్వం మమ భక్తో విశేషతః | సర్వం దత్తం మయా తే హి యద్వృతం భవతానఘ || 69

అజరశ్చామరశ్చ త్వం సర్వదా దుఃఖవర్జితః | సర్వపూజ్యో నిర్వికారీ భక్తానాం ప్రవరో భవ || 70

అక్షయా బాంధవాశ్చైవ కులం గోత్రం చ తే సదా | భవిష్యతి ద్విజశ్రేష్ఠ మయి భక్తిశ్చ శాశ్వతీ || 71

సాన్నిధ్యం చాశ్రమే నిత్యం కరిష్యామి మునే తవ | తిష్ఠ వత్స యథాకామం నోత్కంఠాం చ కరిష్యసి || 72

శివుడిట్లు పలికెను-

ఓ వత్సా! ఉపమన్యూ! నీవు ధన్యుడవు, విశేషించి నా భక్తుడవు. ఓ పుణ్యాత్మా! నీవు కోరిన వరములన్నిటినీ నీకు ఇచ్చియుంటిని (69). నీవు జరామరణములు లేని వాడవు. సర్వకాలములలో దుఃఖహితుడవు, సర్వులచే పూజింపబడువాడవు, వికారములు లేనివాడవు, మరియు భక్తులలో శ్రేష్ఠుడవు కమ్ము (70). ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! నీ బంధువులు, కులము మరియు గోత్రము వినాశము లేనివి కాగలవు. నీకు నాయందలి భక్తి శాశ్వతమగును (71). ఓ మహర్షీ! నేను నీ ఆశ్రమములో నిత్యము నివసించెదను. వత్సా! ఆనందముగా జీవించుము. బెంగ పెట్టుకొనకుము (72).

నందీశ్వర ఉవాచ |

ఏవముక్త్వా స భగవాంస్తసై#్మ దత్త్వా వరాన్‌ వరాన్‌ | సాంబశ్చ సగణస్సద్య స్తత్రైవాంతర్దధే ప్రభుః || 73

ఉపమన్యుః ప్రసన్నాత్మా ప్రాప్య శంభోర్వరాన్‌ వరాన్‌ | జగామ జననీస్థానం మాత్రే సర్వమవర్ణయత్‌ || 74

తచ్ఛ్రుత్వా తస్య జననీ మహాహర్షమవాప సా | సర్వపూజ్యో%భవత్సో%పి సుఖం ప్రాపాధికం సదా || 75

ఇత్థం తే వర్ణితస్తాత శివస్య పరమాత్మనః | సురేశ్వరావతారో హి సర్వదా సుఖదస్సతామ్‌ || 76

ఇదమాఖ్యానమనఘం సర్వకామఫలప్రదమ్‌ | స్వర్గ్యం యశస్య మాయుష్యం భక్తి ముక్తి ప్రదం సతామ్‌ || 77

య ఏత చ్ఛృణు యాద్భక్త్యా శ్రావయేద్వా సమాహితః | ఇహ సర్వసుఖం భుక్త్వా సోంతే శివగతిం లభేత్‌ || 78

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్రసంహితాయాం సురేశ్వరావతార వర్ణనం నామ ద్వాత్రింశో%ధ్యాయః (32).

నందీశ్వరుడిట్లు పలికెను-

ఇట్లు పలికి జగన్నాథుడగు ఆ భగవానుడు ఆతనికి శ్రేష్ఠమగు వరములనిచ్చిన పిదప పార్వతితో మరియు గణములతో గూడి అచటనే అంతర్ధానమాయెను (73). ఉపమన్యుడు శంభుని నుండి శ్రేష్ఠమగు వరములను పొంది ప్రసన్నమగు మనస్సు గలవాడై తల్లి ఉన్న స్థానమునకు వెళ్లి సర్వమును తల్లికి వర్ణించి చెప్పెను (74). ఆ వృత్తాంతమును విని ఆతని తల్లి మహానందమును పొందెను. ఆతడు అందరిచే పూజింపబడినవాడై నిత్యము అధికసుఖమును పొందెను (75). వత్సా! సత్పురుషులకు సర్వదా సుఖమునిచ్చే, శివుని సురేశ్వరావతారమును నీకు ఈ తీరున వర్ణించి చెప్పితిని. పరమాత్మయగు శివుని ఈ గాథ పవిత్రమైనది, కోర్కెల నన్నిటినీ ఈడేర్చునది, స్వర్గమును యశస్సును ఆయుర్దాయమును ఇచ్చునది. ఈ గాథ సత్పురుషులకు భుక్తిని ముక్తిని కూడ ఇచ్చును (76, 77). ఎవడైతే దీనిని భక్తితో వినునో, లేదా ఏకాగ్రచిత్తముతో వినిపించునో, అట్టివాడు ఇహలోకములో సర్వసుఖముల ననుభవించి మరణించిన పిదప శివపదమును పొందును (78).

శ్రీ శివ మహాపురాణములోని శతరుద్రసంహితయందు సురేశ్వరావతారవర్ణనమనే ముప్పదిరెండవ అధ్యాయము ముగిసినది (32).

Siva Maha Puranam-3    Chapters