Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Siva Maha Puranam-3    Chapters   

అథ ఏకత్రింశోధ్యాయః

భిక్షు వర్యావతారము

నందీశ్వర ఉవాచ |

అథ వక్ష్యే ముని శ్రేష్ఠ శంభో శ్శృణ్వవతారకమ్‌ | స్వభక్తదయయా విప్రనారీ సందేహభంజకమ్‌ || 1

ఆసీత్సత్యరథో నామ్నా విదర్భ విషయే నృపః | ధర్మాత్మా సత్యశీలశ్చ మహాశైవ జనప్రియః || 2

తస్య రాజ్ఞ స్సుధర్మేణ మహీం పాలయతో మునే | మహాన్‌ కాలో వ్యతీయాయ సుఖేన శివధర్మతః || 3

కదాచిత్తస్య రాజ్ఞస్తు శాల్వైశ్చ పురరోధిభిః | మహాన్‌ రణో బభూవాథ బహుసైన్యైర్బలో ద్ధతైః || 4

స విదర్భనృపః కృత్వా సార్ధం తైర్దారుణం రణమ్‌ | ప్రనష్టోరు బలశ్శాల్వైర్నిహతో దైవయోగతః || 5

తస్మిన్‌ నృపే హతే యుద్ధే శాల్వైస్తు భయవిహ్వలాః | సైనికా హతశేషాశ్చ మంత్రిభిస్సహ దుద్రువుః || 6

అథ తస్య మహారాజ్ఞీ రాత్రౌ స్వపురతో మునే | సంరుద్ధా రిపుభిర్యత్నా దంతర్వత్నీ బహిర్య¸° || 7

నందీశ్వరు డిట్లు పలికెను-

ఓ మహర్షీ! విప్రా! శంభుడు తన భక్తునిపై గల దయతో స్త్రీ సందేహములను పోగొట్టే అవతారమును స్వీకరించి యుండెను. ఆ గాథను చెప్పెదను వినుము (1). సత్యరథుడనే విదర్భదేశపు రాజు ఉండెను. ఆయన ధర్మాత్ముడు, సత్యస్వభావము గలవాడు, శివభక్తులయందు గొప్ప ప్రీతి గలవాడు (2). ఓ మునీ! చక్కని శివధర్మములతో నగరమును ముట్టడించిన ఆ రాజు భూమిని పాలించుచుండగా చాల కాలము గడిచెను (3). ఒకనాడు బలముతో గర్వించి పెద్ద సైన్యములతో నగరమును ముట్టడించిన శాల్వరాజులతో ఆ రాజునకు గొప్ప యుద్ధము జరిగెను (4). ఆ విదర్భ మహారాజు ఆ శాల్వులతో దారుణమగు యుద్ధమును చేసెను. ఆతని పెద్ద సైన్యము ఆ యుద్ధములో నశించగా దైవవైపరీత్యము చే ఆతడు సంహరించబడెను (5). యుద్ధములో ఆ రాజు మరణించగానే, మరణించగా మిగిలిన సైనికులు శాల్వుల వలని భయముచే పీడింపబడినవారై మంత్రులతో కలిసి పారిపోయిరి (6). ఓ మునీ! ఆ రాజుయొక్క పట్టపురాణి గర్భవతియై యుండెను. శత్రువులచే ముట్టడించబడిన తన నగరమునుండి ఆమె రాత్రి యందు మిక్కిలి శ్రమతో బయట పడెను (7).

నిర్గతా శోక సంతప్తా సా రాజమహిషీ శ##నైః | ప్రాచీం దిశం య¸° దూరం స్మరంతీశపదాంబుజమ్‌ || 8

అథ ప్రభాతే సా రాజ్ఞీ దదర్శ విమలం సరః | అతీతా దూరమధ్వానం దయయా శంకరస్య హి || 9

తత్రాగత్య ప్రియా రాజ్ఞ స్సంతప్తా సుకుమారిణీ | నివాసార్థం సరస్తీరే ఛాయావృక్షము పాశ్రయత్‌ || 10

తత్ర దైవవశా ద్రాజ్ఞీ ముహూర్తే సద్గుణాన్వితే | అసూత తనయం దివ్యం సర్వలక్షణలక్షితమ్‌ || 11

అథ తజ్జననీ దైవాత్తృషితాతి నృపాంగనా | సరో%వతీర్ణా పానార్థం గ్రస్తా గ్రాహేణ పాథసి || 12

స సుతో జాతమాత్రస్తు క్షుత్పిపాసార్దితో భృశమ్‌ | రురోద చ సరస్తీరే వినష్ట పితృ మాతృకః || 13

తస్మిన్‌ వనే క్రందమానే జాతమాత్రే సుతే మునే | కృపాన్వితో మహేశో%భూదంతర్యామీ స రక్షకః || 14

శోకముతో మిక్కిలి బాధపడుచున్న ఆ పట్టపురాణి మెల్లగా బయటపడి ఈశ్వరుని పాదపద్మములను స్మరిస్తూ తూర్పు దిక్కువైపునకు కొంతదూరము వెళ్లెను (8). తెల్లవారుసరికి ఆమె శంకరుని దయచే చాల దూరము వెళ్లి స్వచ్ఛమగు సరస్సునొకదానిని పొడగనెను (9). సుకుమారిణి, దుఃఖితురాలు అగు ఆ రాణి అచటకు చేరి సరస్సు ఒడ్డున ఉన్న ఒక చెట్టు యొక్క నీడలో విశ్రాంతి కొరకు కూర్చుండెను (10). ఆ రాణి దైవానుగ్రహముచే అచట మంచి లక్షణములతో గూడిన ముహూర్తమునందు సర్వలక్షణ సంపన్నుడు, ప్రకాశించువాడు నగు పుత్రుని గనెను (11). అపుడా తల్లియగు మహారాణి దాహమునకు తాళ##లేక నీరు త్రాగుటకై సరస్సులోనికి దిగగా, దైవవశముచే ఒక మొసలి ఆమెను పట్టుకొని చంపివేసెను (12). ఆ బాలుడు పుట్టుటతోడనే తల్లి దండ్రులను గోల్పోయి ఆ సరస్సు ఒడ్డున ఆకలి దప్పికలచే మిక్కిలి పీడింపబడినవాడై ఏడ్చుచుండెను (13). ఓ మహర్షీ! ఆ కుర్రవాడు ఆ అడవిలో జన్మించి ఏడ్చుచుండగా అంతర్యామి, రక్షకుడు అగు ఆ మహేశ్వరునకు జాలి కలిగెను (14).

ప్రేరితా మనసా కాచి దీశేన త్రాసహారిణా | అకస్మాదాగతా తత్ర భ్రమంతీ భైక్ష్య జీవినీ || 15

సా ఏకహాయనం బాలం వహంతీ విధవా నిజమ్‌ | అనాథమేకం క్రందంతం శిశుం తత్ర దదర్శ హ || 16

సా దృష్ట్వా తత్ర తం బాలం వనే నిర్మనుజే మునే | విస్మితాతి ద్విజస్త్రీ సా చిచింత హృదయే బహు || 17

అహో సుమహదాశ్చర్యమిదం దృష్టం మయాధునా | అసంభావ్యమకథ్యం చ సర్వథా మనసా గిరా || 18

అచ్ఛిన్న నాభినాలో%యం రసాయాం కేవలం శిశుః | శేతే మాతృవిహీనశ్చ క్రందంస్తేజస్వినాం వరః || 19

అస్య పిత్రాదయః కే%పి న సంతీహ సహాయినః . కారణం కిం బభూవాథ హ్యహో దైవబలం మహత్‌ || 20

న జానే కస్య పుత్రో%యమస్య జ్ఞాతాత్ర కో%పి న | యతః పృచ్ఛా మ్యస్య జన్మ జాతా చ కరుణా మయి || 21

ఇచ్ఛామ్యేనం పోషితుం హి బాలమౌరసపుత్రవత్‌ | సంప్రష్టుం నోత్సహే%జ్ఞాత్వా కులజన్మాది చాస్య వై || 22

ఇతి సంచింత్యమానాయాం తస్యాం విప్రవరస్త్రి యామ్‌| కృపాం చకార మహతీం శంకరో భక్తవత్సలః|| 23

దధ్రే భిక్షుస్వరూపం హి మహాలీలో మహేశ్వరః | సర్వథా భక్తసుఖదో నిరుపాధిస్స్వయం సదా || 24

తత్రాజగామ సహసా స భిక్షుః పరమేశ్వరః | యత్రాస్తి సందేహవతీ ద్విజస్త్రీ జ్ఞాతుమిచ్ఛతీ || 25

భిక్షు వర్య స్వరూపో%సా వవిజ్ఞాతగతిః ప్రభుః | తామాహ విప్రవనితాం విహస్య కరుణానిధిః || 26

భిక్షాటనచే జీవించే ఒకానొక స్త్రీ భయమును పోగొట్టే ఈశ్వరునిచే మనస్సునందు ప్రేరేపింపబడినదై హఠాత్తుగా అచటకు వచ్చెను (15). ఆమె విధవరాలు. ఆమెకు ఒక సంవత్సరము వయస్సుగల బిడ్డ గలదు. ఆచట ఆమె ఏడ్చుచున్న అనాథ శిశువును గాంచెను (16). ఓ మునీ! నిర్జనమగు ఆ వనమునందు అచట ఆ బాలుని గాంచి ఆ బ్రాహ్మణస్త్రీ మిక్కిలి చకితురాలై హృదయములో పరి పరి విధముల తలపోసెను (17). అహో! నేను ఈ నాడు గొప్ప ఆశ్చర్యము నిచట గాంచితిని. ఇది మనస్సునకు ఎట్లైననూ ఊహింప శక్యము కానిది, మాటలకు అందనిది (18). నాభినాళ##మైననూ ఛేదిపబడని ఈ శిశువు నేలపై పడియున్నాడు. తేజశ్శాలురలో శ్రేష్ఠుడగు ఈ బాలుడు తల్లిలేక ఏడ్చుచూ పరుండి యున్నాడు (19). ఈ బాలునకు సాహాయ్యమును చేయుటకు తండ్రి మొదలగు వారెవ్వరూ ఇచట లేరు. కారణమేమై యుండును? అహో! దైవబలము గొప్పది (20). ఈ శిశువు ఎవరి పుత్రుడో నాకు తెలియదు. ఈ శిశువుయొక్క జన్మ గురించి ఎవరిని ప్రశ్నించవలెను? తెలిసినవారు ఇచట ఒకరైననూ లేరు. నాకీ బాలునిపై దయ కలుగుచున్నది (21). నేనీ బాలుని స్వంత బిడ్డ వలె పెంచవలెనని కోరుచున్నాను. కాని ఈ బాలుని కులము, జన్మ ఇత్యాదులు తెలియక పోవుటచే సమీపించుటకు ఉత్సాహము కలుగటలేదు (22). ఆ బ్రాహ్మణ స్త్రీ ఇట్లు తలపోయుచుండగా, భక్తవత్సలుగడు శంకరుడు గొప్ప దయను చేసెను (23). సర్వ విధములుగా భక్తునకు సుఖములనిచ్చువాడు, తాను సర్వదా దేహోపాధిలేని నిర్గుణుడు, కాని గొప్ప లీలలను నెరపువాడు అగు మహేశ్వరుడు భిక్షుకరూపమును దాల్చెను (24). ఆ బాలుని గురించి వివరములను తెలియగోరి తటపటాయించుచూ అచటనే ఉన్న బ్రాహ్మణస్త్రీ వద్దకు పరమేశ్వరుడు ఆ భిక్షుకరూపముతో విచ్చేసెను (25). ఎవని చేష్టలను తెలియ శక్యము గాదో అట్టి దయానిధి యగు శివప్రభుడు శ్రేష్ఠుడగు భిక్షుకరూపములో విచ్చేసి ఆ బ్రాహ్మణస్త్రీతో నిట్లు పలికెను (26).

భిక్షువర్య ఉవాచ |

సందేహం కురు నో చిత్తే విప్రభామిని మా ఖిద | రక్షైనం బాలకం ప్రీత్యా సుపవిత్రం స్వపుత్రకమ్‌ || 27

అనేన శిశునా శ్రేయః ప్రాప్స్యసే న చిరాత్పరమ్‌ | పుష్ణీహి సర్వథా హ్యేనం మహాతేజస్వినం శిశుమ్‌ || 28

శ్రేష్ఠుడగు ఆ భిక్షువు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణయువతీ! మనస్సులో సందేహించకుము. దుఃఖించకుము. మిక్కిలి పవిత్రుడగు ఈ బాలకుని ప్రేమతో స్వంత పుత్రుని వలె రక్షించుము (27). నీవు ఈ శిశువు నిమిత్తముగా శీఘ్రముగనే పరమ శ్రేయస్సును పొందగలవు. మహాతేజశ్శాలి యగు ఈ శిశువును అన్ని విధములుగా పోషించుము (28).

నందీశ్వర ఉవాచ |

ఇత్యుక్తవంతం తం భిక్షు స్వరూపం కరుణానిధిమ్‌ | సా విప్రవనితా శంభుం ప్రీత్యా పప్రచ్ఛ సాదరమ్‌ | 29

నందీశ్వరుడిట్లు పలికెను-

భిక్షురూపములో నున్న కరుణాసముద్రుడగు శంభుడు ఇట్లు పలుకగా, ఆ బ్రాహ్మణస్త్రీ శంభునకు ప్రీతితో ఆదరముతో ఇట్లు బదులిడెను (29).

విప్రవనితోవాచ |

త్వదాజ్ఞయైనం బాలం హి రక్షిష్యామి స్వపుత్రవత్‌ | పోక్ష్యామి నాత్ర సందేహో మద్భాగ్యాత్త్వ మిహాగతః || 30

తథాపి జ్ఢాతుమిచ్ఛామి విశేషేణ తు తత్త్వతః | కో%యం కస్య సుతశ్చాయం కస్త్వమత్ర సమాగతః || 31

ముహుర్మమ సమాయాతి జ్ఞానం భిక్షువర ప్రభో | త్యం శివః కరుణాసింధు స్త్వద్భక్తో%యం శిశుఃపురా || 32

కేన చిత్కర్మదోషేణ సంప్రాప్తో%యం దశామిమామ్‌ | తద్భు క్త్వా పరమం శ్రేయః ప్రాప్స్యతే త్వదనుగ్రహాత్‌ || 33

త్వన్మాయయైవ సాహం వై మార్గభ్రష్టా విమోహితా | ఆగతా ప్రేషితా త్వత్తో హ్యస్య రక్షణహేతుతః || 34

బ్రాహ్మణ యువతి ఇట్లు పలికెను-

నీ ఆజ్ఞచే నేనీ బాలుని నా పుత్రుని వలె రక్షించి నిస్సందేహముగా పోషించెదను| నీవు నా భాగ్యముచే ఇచటకు వచ్చితివి (30). అయిననూ నేను వివరములను యథాతథముగా తెలియగోరుచున్నాను. ఈ బాలుడు ఎవరి కుమారుడు? ఇచటకు విచ్చేసిన నీవు ఎవరివి? (31) ఓ భిక్షుకశ్రేష్ఠా! ప్రభూ! నాకు మరల జ్ఞానము కలుగుచున్నది. నీవు దయాసముద్రుడవగు శివుడవు. ఈ బాలకుడు పూర్వజన్మలో నీ భక్తుడు (32). ఒకానొక దుష్టకర్మను చేయుటచే ఈ దుర్దశను పొందియున్నాడు. దానిని అనుభవించి నీ అనుగ్రహముచే పరమేశ్రేయస్సును పొందగలడు (33). నేను నీ మాయచే మోహితురాలనై దారి తప్పితిని. నీవే నన్ను ఈ బాలుని రక్షించుటకు ఇచటకు పంపగా నేను వచ్చియుంటిని (34).

నందీశ్వర ఉవాచ |

ఇతి తద్దర్శన ప్రాప్త విజ్ఞానాం విప్రకామినీమ్‌ | జ్ఞాతుకామాం విశేషేణ ప్రోచే భిక్షుతనుశ్శివః || 35

నందీశ్వరుడిట్లు పలికెను-

ఈ విధముగా శివుని దర్శనముచే ఆమెకు జ్ఞానము కలిగెను. అయిననూ ఆ బ్రాహ్మణ పత్ని వివరములను తెలియగోరెను. భిక్షుకరూపములోనున్న శివుడు ఆమెతో నిట్లనెను (35).

భిక్షువర్య ఉవాచ |

శృణు ప్రీత్యా విప్రపత్ని బాలస్యాస్య పురోహితమ్‌ | సర్వమన్యస్య సుప్రీత్యా వక్ష్యతే తత్త్వతో%నఘే || 36

సుతో విదర్భరాజస్య శివభక్తస్య ధీమతః | అయం సత్యరథసై#్యవ స్వధర్మ నిరతస్య హి || 37

శృణు సత్యరథో రాజా హతశ్శాల్వై రణ పరైః | తత్పత్నీ నిశి సువ్యగ్రా నిర్య¸° స్వగృహాద్ద్రుతమ్‌ || 38

అసూత తనయం చైనం సమాయాతా ప్రగే%త్ర హి | సరో%వతీర్ణా తృషయా గ్రస్తా గ్రాహేణ దైవతః || 39

మహాత్ముడగు భిక్షుకుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణ పత్నీ ! పుణ్యాత్మురాలా! ఈ బాలకుని పూర్వవృత్తాంతమును, ఆతని బంధువుల వివరములను సర్వమును యథార్థముగా చెప్పెదను. మిక్కిలి ప్రీతితో వినుము (36). శివభక్తుడు, బుద్ధిమంతుడు, స్వధర్మమునందు నిష్ఠ గలవాడు, విదర్భదేశాధీశ్వరుడు అగు సత్యరథుని పుత్రుడే ఈ బాలకుడు (37). వినుము. సత్యరథమహారాజు యుద్ధములో బలవత్తరులగు శాల్వులచే సంహరింపబడగా, ఆతని భార్య మిక్కిలి కంగారు పడుతూ రాత్రియందు తన గృహమునండి శీఘ్రమే బయల్వెడలెను (38). ఆమె తెల్లవారుసరికి ఇచటకు చేరి ఈ బాలుని గనెను. ఆమె దప్పిక తీర్చుకొనుటకై సరస్సులో దిగానే దైవవశముచే మొసలి ఆమెను భక్షించెను (39).

నందీశ్వర ఉవాచ |

ఇతి తస్య సముత్పత్తిం తత్పితుస్సంగరే మృతిమ్‌ | తన్మాతృమరణం గ్రాహాత్సర్వం తసై#్య న్యవేదయత్‌ || 40

అథ సా బ్రాహ్మణీ సా హి విస్మితాతి మునీశ్వర | పునః పప్రచ్ఛ తం భిక్షుం జ్ఞానినం సిద్ధరూపకమ్‌ || 41

నంద్వీరుడిట్లు పలికెను-

ఈ విధముగా, ఆ పిల్లవాని పుట్టుక, ఆ బాలుని తండ్రి యుద్ధములో మరణించుట, మొసలికి చిక్కి ఆ బాలుని తల్లి మరణించుట అను వివరములనన్నిటినీ ఆమెకు చెప్పెను (40). ఓ మహర్షీ! అపుడా బ్రాహ్మణస్త్రీ మిక్కిలి ఆశ్చర్యమును పొందినదై, జ్ఞాని సిద్ధుడు అగు ఆ భిక్షుకుని మరల ఇట్లు ప్రశ్నించెను (41).

బ్రాహ్మణ్యువాచ |

స రాజాస్య పితా భిక్షో వరభోగాంతరైవ హి | కస్మాచ్ఛాల్వై స్స్వరిపుభిస్స్వల్పే హైశ్చ విఘాతితః || 42

కస్మాదస్య శిశోర్మాతా గ్రాహేణాశు సుభక్షితా | యస్మాద నా థో%యం జాతో విబంధుశ్చైవ జన్మతః || 43

కస్మాత్సుతో మమాపీహ సుదరిద్రో హి భిక్షు కః | భ##వేత్కథం సుఖం భిక్షో పుత్రయోరనయోర్వద|| 44

ఆ బ్రాహ్మణస్త్రీ ఇట్లు పలికెను-

ఓ భిక్షూ! ఈ బాలుని తండ్రియగు ఆ రాజు గొప్ప భోగముల ననుభవించు చుండగా మధ్యలో, ఆతని శత్రువులు అల్పప్రజ్ఞగల వారు అగు శాల్వులు ఆతనిని సంహరించుటకు కారణమేమి? (42) ఈ బాలుని తల్లిని మొసలి శీఘ్రమే భక్షించుటకు కారణమేమి? ఈ బాలుడు పుట్టుటతోడనే బంధువులను గోల్పోయి అనాథ యగుటకు కారణమేమి? (43) నా ఈ కుమారుడు కూడ అత్యంత దరిద్రుడు, ముష్టివాడు అగుటకు కారణమేమి? హే భిక్షో! ఈ ఇద్దరు బాలకులు ఇపుడు నా పుత్రులు. వీరికి సుఖము కలుగు ఉపాయమేది? చెప్పుము (44).

నందీశ్వర ఉవాచ |

ఇతి తస్యా వచశ్శ్రుత్వా స భిక్షుః పరమేశ్వరః | విప్రపత్న్యాః ప్రసన్నాత్మా ప్రోవాచ విహసంశ్చతామ్‌ || 45

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆమె యెక్క ఈ మాటలను విని భిక్షుకరూపములో నున్న పరమేశ్వరుడు నవ్వి ప్రసన్నమగు మనస్సు గలవాడై ఆ బ్రాహ్మణ పత్నిని ఉద్దేశించి ఇట్లు పలికెను (45).

భిక్షువర్య ఉవాచ |

విప్రపత్ని విశేషేణ సర్వప్రశ్నాన్‌ వదామి తే | శృణు త్వం సావధానేన చరిత్రమిదముత్తమమ్‌ || 46

అముష్య బాలస్య పితా న విదర్భ మహీపతిః | పూర్వ జన్మని పాండ్యో%సౌ బభూవ నృపసత్తమః || 47

స శైవ నృపతిర్ధర్మాత్పాలయన్నిఖిలాం మహీమ్‌ | స్వప్రజా రంజయామాస సర్వోపద్రవనాశనః || 48

కదాచిత్స హి సర్వేశం ప్రదోషే పర్యపూజయత్‌ | త్రయోదశ్యాం నిరాహారో దివానక్తవ్రతీ శివమ్‌ || 49

తస్య పూజయతశ్శంభుం ప్రదోషే గిరిశం రతే | మహాన్‌ శబ్దో బభూవాథ వికటస్సర్వథా పురే || 50

తమాకర్ణ్య రవం సో%థ రాజా త్యక్త శివార్చనః | రిప్వాగమనశంకాతో నిర్య¸° భవనాద్బహిః || 51

ఏతస్మిన్నేవ కాలే తు తస్యామాత్యో మహాబలీ | గృహీతశత్రుసామంతో రాజాంతికముపాయ¸° || 52

ఆ భిక్షువర్యుడిట్లు పలికెను-

ఓ బ్రాహ్మణపత్నీ! నీ ప్రశ్నలన్నింటికీ వివరముగా సమాధానములను చెప్పగలను. నీవు ఈ ఉత్తమమగు చరిత్రను శ్రద్ధగా వినుము (46). ఈ బాలకుని తండ్రియగు విదర్భమహారాజు పూర్వజన్మలో పాండ్య మహారాజై ఉండెను (47). శివభక్తుడు, ధర్మాత్ముడు అగు ఆ రాజు భూమి నంతనూ పాలించి ఉపద్రవములనన్నిటినీ నశింపజేసి తన ప్రజలను రంజిల్ల జేసెను (48). ఒకప్పుడు ఆయన త్రయోదశినాడు ఉపవసించి రాత్రి యందు పగటియందు కూడ వ్రతనియమమును పాటించి ప్రదోషకాలమునందు సర్వేశ్వరుడగు శివుని పూజించెను (49). ఆయన ప్రదోష కాలమునందు శ్రద్ధతో కైలాసవాసి యగు శివుని పూజించుచుండగా, నగరములో అన్నివైపులనుండియు కర్కశమగు పెద్ద శబ్దము బయలుదేరెను (50). అపుడా రాజు ఆ శబ్దమును విని శత్రువులు దండెత్తి వచ్చినారేమో యను శంకతో శివపూజను విడిచిపెట్టి భవనము బయటకు వచ్చెను (51). అదే సమయములో మహాబలశాలి యగు ఆతని మంత్రి శత్రువు అగు సామంతరాజును చెరబట్టి రాజువద్దకు తీసుకొని వచ్చెను (52).

తం ద్వష్ట్వా శత్రు సామంతం మహాక్రోధేన విహ్వలః | అవిచార్య వృషం తస్య శిరశ్ఛే దమకారయత్‌ || 53

అసమాప్యేశపూజాం తామశుచిర్నష్టధీర్నృపః | రాత్రౌ చకార సుప్రీత్యా భోజనం నష్టమంగలః || 54

విదర్భే సో%భవద్రాజా జన్మనీహ శివవ్రతీ | శివార్చనాంతరాయేణ పరైర్బోగాంతరే హతః || 55

తత్పుత్రో యః పూర్వభ##వే సో%స్మిన్‌ జన్మని తత్సుతః | అయమేవ హతైశ్వర్య శ్శివపూజావ్యతి క్రమాత్‌ || 56

అస్య మాతా పూర్వభ##వే సపత్నీం ఛద్మనాహరత్‌ | భక్షితా తేన పాపేన గ్రాహేణాస్మిన్‌ భ##వే హి సా || 57

ఏషా ప్రవృత్తిరేతేషాం భవత్యై పరికీర్తితా | అనర్చితా శివా భక్త్వా ప్రాప్నువంతి దరిద్రతామ్‌ || 58

ఏషతే తనయః పూర్వజన్మని బ్రాహ్మణోత్తమః | ప్రతి గ్రహైర్వయో నిన్యే న యజ్ఞాద్యైస్సుకర్మభిః || 59

అతో దారిద్ర్యమాపన్నః పుత్రస్తే ద్విజభామిని | తద్దోషపరిహారార్థం శంకరం శరణం వ్రజ || 60

ఏతాభ్యాం ఖలు బాలాభ్యాం శివపూజా విధీయతామ్‌ | ఉపవీతానంతరం హి శివశ్శ్రేయః కరిష్యతి || 61

ఆతడు శత్రువగు ఆ సామంతుని పెద్ద క్రోధమువలన వివేకమును గోల్పోయి ధర్మమును విచారించకుండా, ఆతని తలను తీయించెను (53). అమంగళకరమగు ఆలోచనలచే వినష్టమైన వివేకము, పుణ్యము గల ఆ రాజు ఈశ్వరుని పూజను పూర్తి చేయకుండగనే రాత్రియందు మిక్కిలి ప్రీతితో భుజించెను (54). శివవ్రతము గల ఆతడు ఈ జన్మలో విదర్భాధిపతి ఆయెను. శివార్చనలో అంతరాయమును చేయుటచే ఆతడు భోగములనను భవించుచుండగా శత్రువులచే సంహరింపబడినాడు (55). పూర్వ జన్మలో ఆతని పుత్రుడే ఈ జన్మలో కూడ మరల పుత్రుడైనాడు. శివపూజలో లోపమును చేయుట వలన ఈ బాలుడు ఐశ్వర్యమును కోల్పోయినాడు (56). ఈతని తల్లి పూర్వజన్మలో సవతిని మోసముచే చంపించెను. ఆ పాపముచే ఆమె ఈ జన్మలో మొసలిచే భక్షింపబడినది (57). వీరి అందరి ప్రవృత్తులను నీకు చెప్పితిని. పార్వతీ దేవిని భక్తితో ఆరాధించనివారు దరిద్రులగుదురు (58). ఈ నీ కుమారుడు పూర్వజన్మలో గొప్ప బ్రాహ్మణుడే యైననూ యజ్ఞాది పుణ్యకర్మలను విడనాడి దానములను పట్టుచూ జీవితమును గడిపెను (59). ఓ బ్రాహ్మణయువతీ! అందువలననే ఈ నీ పుత్రుడు దరిద్రుడైనాడు. ఆ దోషమును పోగొట్టు కొనుటకై శంకరుని శరణు పొందుము (60). ఈ ఇద్దరు బాలురతో కలిసి ఉపనయనము తరువాత శివ పూజను చేయుము. శివుడు శ్రేయస్సును కలిగించగలడు (61).

నందీశ్వర ఉవాచ |

ఇతి తాముపదిశ్యాథ భిక్షు వర్యతను శ్శివః | స్వరూపం దర్శయామాస పరమం భక్తవత్సలః || 62

అథ సా విప్రవనితా జ్ఞాత్వా తం శంకరం ప్రభుమ్‌ | సుప్రణమ్య హి తుష్టావ ప్రేవ్ణూ గద్గదయా గిరా || 63

తతస్స భగవాన్‌ శంభుర్ధృత భిక్షుతనుర్ద్రుతమ్‌ | పశ్యంత్యా విప్రపత్న్యాస్తు తత్రైవాంతరధీయత || 64

అథ తస్మిన్‌ గతే భిక్షౌ విశ్రబ్దా బ్రాహ్మణీ చ సా | తమర్భకం సమాదాయ సస్వపుత్రా గృహం య¸° || 65

ఏక చక్రాహ్వయే రమ్యే గ్రామే కృతనికేతనా | స్వపుత్రం రాజపుత్రం చ వరాన్నైశ్చ వ్యవర్ధయత్‌ || 66

బ్రాహ్మణౖః కృత సంస్కారౌ కృతోపనయనౌ చ తౌ | వవృధాతే స్వగేహే చ శివపూజనతత్పరౌ || 67

తౌ శాండిల్యమునేస్తాత నిదేశాన్నియమస్థితౌ| ప్రదోషం చక్రతుశ్శంభోః పూజాం కృత్వా వ్రతం శుభమ్‌ || 68

నందీశ్వరుడిట్లు పలికెను-

భక్తవత్సలుడు, గొప్ప భిక్షుకుని రూపములో నున్నవాడునగు శివుడు ఈ విధముగా ఆమెకు ఉపదేశించి, పిదప శ్రేష్ఠమగు తన రూపమును చూపించెను (62). అపుడాబ్రాహ్మణ స్త్రీ ఆ శంకరప్రభుని గుర్తించి చక్కగా ప్రణమిల్లి ప్రేమతో గద్గగమగు వాక్కుతో స్తుతించెను (63). భిక్షురూపమును స్వీకరించి యున్న ఆ శంభుభగవానుడు ఆ బ్రాహ్మణ పత్ని చూచుచుండగనే శీఘ్రముగా అచటనే అంతర్ధానమయ్యెను (64). అపుడా భిక్షువు అంతర్ధానము కాగానే, ఆ బ్రాహ్మణస్త్రీ విశ్వాసమును పొంది ఆ పిల్లవానిని తీసుకొని తన కుమారినితో సహా ఇంటికి వెళ్లెను (65). ఆమె ఏకచక్రమనే సుందరమగు గ్రామములో మకాము చేసి తన పుత్రుని మరియు రాజపుత్రుని శ్రేష్ఠమగు ఆహారములనిచ్చి పెంచెను (66). వారిద్దరు బ్రాహ్మణులచే చేయబడిన సంస్కారములు మరియు ఉపనయనము గలవారై తమ గృహములో శివపూజయందు నిష్ఠగలవారై పెరుగుచుండిరి (67). వత్సా! వారు శాండిల్యమహర్షియొక్క ఆదేశముననుసరించి నియమములను పాటిస్తూ శుభవ్రతమును చేబట్టి ప్రదోషములో శంభుని పూజను చేయుచుండిరి (68).

కదాచిద్ద్విజపుత్రేణ వినా%సౌ ద్విజనందనః | నద్యాం స్నాతుం గతః ప్రాప నిధానకలశం వరమ్‌ | 69

ఏవం పూజతయతోశ్శంభుం రాజద్విజకుమారయోః | సుఖేనైవ వ్యతీయాయ త యోర్మాస చతుష్టయమ్‌ || 70

ఏవమర్చయతోశ్శంభుం భూయో%పి పరయా ముదా | సంవత్సరో వ్యతీయాయ తస్మిన్నేవ తయోర్గృహే || 71

సంవత్సరే వ్యతిక్రాంతే స రాజతనయో మునే | గత్వా వనాంతే విప్రేణ శివస్యాను గ్రహాద్విభోః || 72

అకస్మాదాగతాం తత్ర దత్తాం తజ్జనకేన హ | వివాహ్య గంధర్వసుతాం చక్రే రాజ్యమకంటకమ్‌ || 73

యా విప్రవనితా పూర్వం తమపుష్ణాత్స్వపుత్రవత్‌ | సైవ మాతా భవత్తస్య సభ్రాతా ద్విజనందనః || 74

ఇత్థ మారధ్య దేవేశం ధర్మగుప్తా హ్వయస్సవై | విదర్భవిషయే రాజ్ఞ్యాతయా భోగం చకార హ || 75

భిక్షువర్యావతారస్తే వర్ణితశ్చ మయాధునా | శివస్య ధర్మగుప్తాహ్వ నృపబాల సుఖప్రదః || 76

ఏతదాఖ్యానమనఘం పవిత్రం పావనం మహత్‌ | ధర్మార్థకామమోక్షాణాం సాధనం సర్వకామదమ్‌ || 77

య ఏతచ్ఛృణుయాన్నిత్యం శ్రావయేద్వా సమాహితః | స భుక్త్వేహాఖిలాన్‌ కామాన్‌ సోంతే శివపురం వ్రజేత్‌ || 78

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్రసంహితాయాం భిక్షు వర్యావతారవర్ణనం నామ ఏకత్రింశో%ధ్యాయః (31).

ఒకనాడు బ్రాహ్మణ బాలకుడు రాజకుమారుడు లేకుండగనే నదీస్నానమునకు వెళ్లగా, అచట ధనముతో నిండియున్న ఒక గొప్ప కలశము లభించెను (69). ఇట్లు శంభుని పూజించుచుండగా, ఆ బ్రాహ్మణ రాజబాలకులకు నాల్గు మాసములు సుఖముగా గడిచెను (70). మరల అదే స్వగృహములో పరమభక్తితో శంభుని అర్చించుచుండగా సంవత్సరము గడిచెను (71). ఓ మహర్షీ! సంవత్సరము గడచిన పిదప ఆ రాజకుమారుడు బ్రాహ్మణు బాలకునితో కలిసి అడవిలోనికి వెళ్లెను. అచట సర్వవ్యాపకుడగు శివుని అనుగ్రహముచే (72) అకస్మాత్తుగా గంధర్వకన్య ఒకామె వచ్చెను. ఆ రాజకుమారునకు ఆమె తండ్రి ఆమెను ఇచ్చి వివాహము చేసెను. ఆమెను వివాహమాడి ఆతడు నిష్కంటకముగా రాజ్యమునేలెను (73). ఏ బ్రాహ్మణయువతి పూర్వము ఆతనిని తన పుత్రుని వలె పెంచెనో, ఆమెయే ఆతనికి తల్లి ఆయెను. ఆ బ్రాహ్మణ బాలకుడు సోదరుడాయెను (74). ధర్మగుర్తుడను పేరుగల ఆ క్షత్రియుడు ఈ విధముగా దేవదేవుడగు శివుని ఆరాధించి విదర్భరాజ్యమును పాలిస్తూ ఆ రాణితో కలిసి భోగములననుభవించెను (75). ధర్మగుప్తుడను రాజకుమారునకు సుఖమునొసంగిన శివుని శ్రేష్ఠమగు భిక్షుకావతారమును నేను నీకు ఇపుడు వర్ణించియుంటిని (76) . ఈ గాథ పాపములను పోగొట్టి పావనము చేయునది, ధర్మార్థకామమోక్షములకు గొప్ప సాధనము మరియు కోర్కెల నన్నిటినీ ఈడేర్చునది (77). ఎవడైతే నిత్యము దీనిని వినునో, ఏకాగ్ర చిత్తముతో వినిపించునో, వాడు ఇహలోకములో కోర్కెలనన్నిటినీ అనుభవించి, దేహము నశించిన పిదప శివపదమును పొందును (78).

శ్రీ శివమహాపురాణములోని శతరుద్రసింహితయందు భిక్షువర్యావతారవర్ణనమనే ముప్పది ఒకటవ అద్యాయము ముగిసినది (31).

Siva Maha Puranam-3    Chapters