Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Siva Maha Puranam-3    Chapters   

అథ త్రింశో%ధ్యాయః

అవధూతేశ్వరావతారము

నందీశ్వర ఉవాచ |

శృణు త్వం బ్రహ్మపుత్రాద్యావతారం పరమేశితుః | అవధూతేశ్వరాహ్వం వై శక్రగర్వాపహారకమ్‌ || 1

శక్రః పురా హి సగురుస్సర్వదేవసమన్వితః | దర్శనం కర్తుమీశస్య కైలాసమగమన్మునే || 2

అథ గుర్వింద్రయోర్‌ జ్ఞాత్వా గమనం శంకరస్తయోః | పరీక్షితుం చ తద్భావం స్వదర్శన రతాత్మనోః || 3

అవధూతస్వరూపో% భూన్నానాలీలాకరః ప్రభుః | దిగంబరో మహాభీమో జ్వలదగ్ని సమప్రభః || 4

సో%వధూతస్వరూపో హి మార్గమారుధ్య సద్గతిః | లంబమానపటశ్శంభురతిష్ఠచ్ఛోభితాకృతిః || 5

అథ తౌ గురు శక్రౌ చ గచ్ఛంతౌ శివసన్నిధిమ్‌ | అద్రాష్టాం పురుషం భీమం మార్గమధ్యేయ% ద్భుతాకృతిమ్‌ || 6

అథ శక్రో మునే %పృచ్ఛత్‌ స్వాధికారేణ దుర్మదః | పురుషం తం స్వమార్గాంత స్థ్సి తమజ్ఞాయ శంకరమ్‌ || 7

నందీశ్వరుడు ఇట్లు పలికెను-

బ్రహ్మపుత్రుడవగు ఓ సనత్కుమారా ! నీవు ఇపుడు పరమేశ్వరుని అవధూతేశ్వరుడు అను పేరుతో ప్రసిద్ధిని గాంచిన అవతారమును గురించి వినుము. ఈ అవతారములో శివుడు ఇంద్రుని గర్వమును అణచినాడు (1). ఓ మహర్షీ! పూర్వము ఇంద్రుడు సకలదేవతలతో మరియు బృహస్పతితో గూడి శివుని దర్శనము కొరకై కైలాసమునకు వెళ్లెను (2). అపుడు అనేకలీలలను చేసే శంకరుడు, ఆ ఇంద్రబృహస్పతులు ఇద్దరు తన దర్శనమునందు ప్రీతితో నిండిన మనస్సులు గలవారై బయలు దేరినారని తెలిసి వారి భక్తిని పరీక్షించుట కొరకై అవధూతరూపమును దాల్చెను. దిగంబరుడగు ఆ అవధూత జ్వలించే అగ్ని వలె ప్రకాశిస్తూ గొప్ప భయమును గొల్పుచుండెను (3-2). సత్పురుషులకు శరణు అగు శంభుడు ఆ అవధూత రూపములో ప్రకాశించువాడై మార్గమునకు అడ్డుగా నిలిచెను. ఆయన భుజమునుండి ఉత్తరీయము వ్రేలాడుచుండెను (5). అపుడు శివుని సన్నిధికి వెళ్లుచున్న ఆ ఇంద్రబృహస్పతులు మార్గమధ్యములో ఆశ్చర్యమును కలిగించే ఆకారముతో భయమును గొల్పుచున్న ఒక పురుషుని చూచిరి (6). అపుడు తన అధికారముచే గర్వించియున్న ఇంద్రుడు తన దారికి అడ్డుగా నిలబడియున్న పురుషుడు శంకరుడేనని తెలియక, ఆయనను ఇట్లు ప్రశ్నించెను (7).

శక్ర ఉవాచ |

కస్త్వం దిగంబరాకారావధూతః కుత ఆగతః | కిం నామ తవ విఖ్యాతం తత్త్వతో వదమే%చిరమ్‌ || 8

స్వస్థానే సంస్థితశ్శంభుః కిం వాన్యత్ర గతో%ధునా | దర్శనార్థం హి తస్యాహం గచ్ఛామి సగురుస్సురైః || 9

శుక్రుడు ఇట్లు పలికెను-

దిగంబరాకారుకడవగు ఓయీ అవధూతా! నీవెవరివి? ఎక్కడనుండి వచ్చితివి? నీప్రసిద్ధమైన పేరు ఏది? నాకు వెంటనే ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము (8). శంభుడు తన స్థానములోనున్నాడా? లేక ఇప్పుడు ఎక్కడికైన వెళ్లినాడా? నేను దేవతలతో మరియు బృహస్పతితో గూడి ఆయన దర్శనము కొరకై వెళ్లుచున్నాను (9).

నందీశ్వర ఉవాచ |

శ##క్రేణత్థం స పృష్టశ్చ కించిన్నో వాచ పూరుషః | లీలా గృహీత దేహస్స శంకరో మదహా ప్రభుః || 10

శక్రః పునరపృచ్ఛత్తం నోవాచ స దిగంబరః | అవిజ్ఞాతగతి శ్శంభుర్మహా కౌతుక కారకః || 11

పునః పురందరో%పృచ్ఛత్త్రైలోక్యాధిపతిస్స్వరాట్‌ | తూష్ణీమాస మహాయోగీ మహాలీలా కరస్సవై || 12

ఇత్థం పునః పునః పృష్టశ్శక్రేణ స దిగంబరః | నోవాచ కించి ద్భగవాన్‌ శక్ర దర్పజిఘాంసయా || 13

అథ చుక్రోధ దేవేశ##సై#్త్ర లోక్యై శ్వర్య గర్వితః | ఉవాచ వచనం క్రోధాత్తం నిర్భర్త్స్య జటాధరమ్‌ || 14

నందీశ్వరుడు ఇట్లు పలికెను -

లీలా కొరకై ఆ అవధూతవేషమును దాల్చియున్న ఆ శంకరప్రభుడు ఇంద్రుని గర్వమును అణచవలెనని తలచెను. ఇంద్రుడు ఈ విధముగా ప్రశ్నించగా, ఆయన బదులు చెప్పలేదు (10). ఎవ్వరి చేతనైననూ తెలియబడని స్వరూపము గలవాడు, గొప్ప ఉత్కంఠను రేకెత్తించే లీలలను ప్రదర్శించువాడు నగు శంభుడు దిగంబరాకారములోనున్నవాడై, ఇంద్రుడు మరల ప్రశ్నంచిననూ సమాధానము చెప్పలేదు (11). ముల్లోకములకు అధిపతి, స్వర్గలోకాధ్యక్షుడు అగు ఇంద్రుడు మరల ప్రశ్నించెను. కాని గొప్ప లీలలను ప్రదర్శించే ఆ మహాయోగి మిన్నకుండెను (12). ఈవిధముగా ఇంద్రుడు ఆ దిగంబరుని పలు మార్లు ప్రశ్నించిననూ, ఇంద్రుని గర్వమును అణచవలెనని తలపోసిన భగవానుడు ఏమియు సమాధానమును చెప్పలేదు (13). అపుడు తన ఐశ్వర్యమును చూచి గర్వించియున్న, ముల్లోకములకు అదిపతియగు ఇంద్రుడు కోపించి జటాధారియగు ఆ అవధూతను భయపెడుతూ ఇట్లు పలికెను (14).

ఇంద్ర ఉవాచ |

పృచ్ఛ్యమానో%పి రే మూఢ నోత్తరం దత్తవానసి | అతస్త్వాం హన్మి వజ్రేణ కస్తే త్రాతాస్తి దుర్మతే || 15

ఇత్యుదీర్య తతో వజ్రీ సంనిరీక్ష్య క్రుధా హితమ్‌ | హంతుం దిగంబరం వజ్రముద్యతం స చకారహ || 16

వజ్రహస్తం చ తం దృష్ట్వా శక్రం శీఘ్రం సదాశివః | చకార స్తంభనం తస్య వజ్రపాతస్య శంకరః || 17

తతస్స పురుషః క్రుధ్ధః కరాలాక్షో భయంకరః | ద్రుతమేవ ప్రజజ్వాల తేజసా ప్రదహన్నివ || 18

బాహు ప్రతిష్టంభ భువా మన్యునాంతశ్శచీ పతిః | సమదహ్యత భోగీవ మంత్రరుద్ధపరాక్రమః || 19

దృష్ట్వా బృహస్పతిస్త్వేనం ప్రజ్వలంతం స్వతేజసా | పురుషం తం ధియామాస ప్రణనామ హరం ద్రుతమ్‌ || 20

కృతాంజలిపుటో భూత్వా తతో గురురుదారధీః | దండవత్కౌ పునర్నత్వా ప్రభుం తుష్టావ భక్తితః || 21

ఇంద్రుడు ఇట్లు పలికెను-

ఓ మూర్ఖా! దుర్బుద్ధీ! నేను అడుగుచున్ననూ నీవు సమాధానము చెప్పకుంటివి. కావున, నేను నిన్ను వజ్రముతో సంహరించెదను. నిన్ను రక్షించువాడు ఎవడు గలడు? (15) వజ్రధారియగు ఇంద్రుడు ఇట్లు పలికి, ఆ దిగంబరుని కోపముతో చూచి వజ్రమును సన్నద్ధము చేసెను (16). నిత్వమంగళస్వరూపుడగు శంకరుడు వజ్రమును చేతబట్టియున్న ఆఇంద్రుని చూచి వెంటనే ఆ వజ్రపు దెబ్బ తనపై పడని విధముగా స్తంభింప జేసెను (17). అపుడు భయంకరమగు ఆకారము గల ఆ పురుషుడు క్రోధముతో వికటముగా నున్న కన్నులు గలవాడై, తన తేజస్సుతో వెనువెంటనే తగులబెట్టనున్నాడా యన్నట్లు మండిపడెను (18). చేయి స్తంభించుటచే కలిగిన కోపము గల శచీపతియగు ఇంద్రుడు మంత్రముతో అడ్డుకొనబడిన పరాక్రమము గల పాము వలె లోలోపల మండి పడెను (19). బృహస్పతి మాత్రము, తన తేజస్సుతో గొప్పగా ప్రకాశించుచున్న ఆ పురుషుని చూచి వెంటనే ఆయన శివుడేనని గుర్తు పట్టి నమస్కరించెను (20). అపుడు గొప్ప బుద్ధిమంతుడగు బృహస్పతి చేతులను జోడించి ఆ ప్రభునకు సాష్టాంగనమస్కారమును చేసి, భక్తితో స్తుతించెను (21).

గురు రువాచ |

దేవదేవ మహా దేవ శరణా గతవత్సల | ప్రసన్నో భవ గౌరీశ సర్వేశ్వర నమో%స్తు తే || 22

మాయయా మోహితాస్సర్వే బ్రహ్మవిష్ణ్వాదయో%పి తే | త్వాం న జానంతి తత్త్వేన జానంతి త్వదను గ్రహాత్‌ || 23

బృహస్పతి ఇట్లు పలికెను-

ఓ దేవదేవా! మహాదేవా! శరణు పొందినవారియందు వాత్సల్యము గలవాడా! ఓ గౌరీపతీ! సర్వేశ్వరా! నీకు నమస్కారము. ప్రసన్నుడవు కమ్ము (22). బ్రహ్మ, విష్ణువు మొదలగు వారు అందరు కూడా నీ మాయచే మోహమును పొందుచుందురు. నీ స్వరూపమును వారు యథార్థముగా తెలియకున్నారు. ఒక వేళ తెలిసిననూ, అది నీ అనుగ్రహాము మాత్రమే (23).

నందీశ్వర ఉవాచ |

బృహస్పతిరితి స్తుత్వా స తదా శంకరం ప్రభుమ్‌ | పాదయోః పాతయామాస తస్యేశస్య పురందరమ్‌ || 24

తతస్తాత సురాచార్యః కృతాంజలి రుదారధీః | బృహస్పతి రువాచేదం ప్రశ్రయావనతస్సుధీః || 25

నందీశ్వరుడిట్లు పలికెను-

అపుడా బృహస్పతి శంకరప్రభుని ఈ విధముగా స్తుతించి, ఇంద్రుడు ఆ ఈశ్వరుని కాళ్లపై పడునట్లు చేసెను (24). ఓయీ కుమారా! తరువాత గొప్ప బుద్ధిమంతుడు, దేవతలకు ఆచార్యుడు, జ్ఞాని అగు బృహస్పతి చేతులను జోడించి వినయముతో వంగి ఇట్లు పలికెను (25).

బృహస్పతి రువాచ |

దీననాథ మహాదేవ ప్రణతం తవ పాదయోః | సముద్ధర చ మాం తత్త్వం క్రోధం న ప్రణయం కురు || 26

తుష్టో భవ మహాదోవ పాహీంద్రం శరణాగతమ్‌ | వహ్నిరేష సమాయాతి భాలనేత్ర సముద్భవః || 27

బృహస్పతి ఇట్లు పలికెను-

ఓ దీనప్రభూ! మహాదేవా! నీ పాదములను నమస్కరించే నన్ను ఉద్ధరించుము. కావున, నీవు కోపమును చేయకుము. ప్రేమను చూపుము (26). ఓ మహాదేవా! తుష్టుడవు కమ్ము. శరణు పొందిన ఇంద్రుని రక్షింపుము. ఇదిగో! నీ లలాటమునందలి నేత్రమునుండి అగ్ని పుట్టి మా వైపు వచ్చుచున్నది (27).

నందీశ్వర ఉవాచ |

ఇత్యాకర్ణ్య గురోర్వాక్యమవధూతాకృతిః ప్రభుః | ఉవాచ కరుణా సింధుర్విహనమ్‌ స సదూతికృత్‌ || 28

నందీశ్వరుడిట్లు పలికెను-

కరుణాసముద్రుడగు శంకరప్రభుడు మంచి లీలలను చేయుచుండును. అవధూతరూపములో నున్న ఆయన బృహస్పతియొక్క ఈ మాటను విని నవ్వుతూ ఇట్లు పలికెను (28).

అవధూత ఉవాచ |

క్రోధాచ్చ నిస్పృతం తేజో ధారయామి స్వనేత్రతః | కథం హి కంచుకీం సర్పస్సంధత్తే చో జ్ఘితాం పునః || 29

అవదూత ఇట్లు పలికెను-

కోపము వలన నా కంటినుండి బయటకు వచ్చియున్న తేజస్సును మరల ముందుకు రాకుండా నిలబెట్టుట ఎట్లు సంభవమగును? పాము విడిచిపెట్టిన కుబుసమును మరల ఎట్లు ధరించగల్గును? (29)

నందీశ్వర ఉవాచ |

ఇతి శ్రుత్వా వచస్త స్య శంకరస్య బృహస్పతిః | ఉవాచ సాంజలిర్భూయో భయవ్యాకులమానసః || 30

నందీశ్వరుడిట్లు పలికెను-

బృహస్పతి ఆ శంకరుని ఆ మాటను విని, భయముతో ఆందోళనను చెందియున్న మసస్సు గలవాడై, మరల చేతులను జోడించి, ఇట్లు పలికెను (30).

బృహస్పతిరువాచ |

హే దేవ భగవన్‌ భక్తా అనుకంప్యాస్సదైవ హి | భక్తవత్సలనామేతి త్వం సత్యం కురు శంకర || 31

క్షేప్తుమన్యత్ర దేవేశ స్వతేజో%త్యుగ్రమర్హసి | ఉద్ధర్తా సర్వభక్తానాం సముద్ధర పురందరమ్‌ || 32

బృహస్పతి ఇట్లు పలికెను-

ఓ దేవా! భగవన్‌! నీవు ఎల్లవేళలా భక్తులపై దయను చూపదగును గదా ! ఓ శంకరా ! నీకు భక్తవత్సలుడను పేరు గలదు. దానిని నీవు సార్థకము చేయుము (31). ఓ దేవదేవా! మిక్కిలి భయంకరమగు నీ తేజస్సును మరియొక చోట పారవేయుము. భక్తులందరినీ ఉద్ధరించే నీవు ఇంద్రుని ఉద్ధరించుము (32).

నందీశ్వర ఉవాచ |

ఇత్యక్తో గురుణా రుద్రో భక్తవత్సల నామ భాక్‌ | ప్రత్యువాచ ప్రసన్నాత్మా సురేజ్యం ప్రణతార్తిహా || 33

నందీశ్వరుడిట్లు పలికెను-

బృహస్పతి ఇట్లు పలుకగా, భక్తవత్సలుడు అని ప్రసిద్ధిని గాంచినవాడు, నమస్కరించువారి కష్టములను పారద్రోలువాడు అగు రుద్రుడు దేవగురువుతో నిట్లనెను (33).

రుద్ర ఉవాచ |

ప్రీతస్తే%హం సురాచార్య దదామి వరముత్తమమ్‌ | ఇంద్రస్యజీవదానేన జీవేతి త్వం ప్రథాం వ్రజ || 34

సముద్భూతో%నలో యో%యం భాలనేత్రాత్సురాసహః | ఏనం త్యక్ష్యామ్యహం దూరే యథేంద్రం నైవ పీడయేత్‌ || 35

రుద్రుడు ఇట్లు పలికెను-

ఓ దేవగురూ! నీపై నాకు ప్రీతి కలిగినది. నీకు ఉత్తమమగు వరమునిచ్చెదను. నీవు ఇంద్రుని జీవితమును కాపాడితివి. కావున, నీకు జీవుడు అను పేరు ప్రసిద్ధిని పొందగలదు (34). నా లలాటనేత్రమునుండి పుట్టిన ఈ అగ్నిని దేవతలు సహించలేరు. ఇది ఇంద్రుని ఏ మాత్రము పీడించని విధముగా, దీనిని నేను దూరముగా విడిచి పెట్టెదను (35).

నందీశ్వర ఉవాచ |

ఇత్యుక్త్వా స కరే ధృత్వా స్వతేజో%నల మద్భుతమ్‌ | భాలనేత్ర సముద్భూతం ప్రాక్షిపల్ల వణాంభసి || 36

అథో శివస్య తత్తేజో భాలనేత్రసముద్భవమ్‌ | క్షిప్తం చ లవణాంభోధౌ సద్యో బాలో బభూవ హ || 37

స జలంధరనామాభూత్సింధుపుత్రో%సురేశ్వరః | తం జఘాన మహేశానో దేవప్రార్థనయా ప్రభుః|| 38

ఇత్థం కృత్వా సుచరితం శంకరో లోకశంకరః | అవధూతస్వరూపేణ తతశ్చాంతర్హితో%భవత్‌ || 39

బభూవుస్సకలా దేవాస్సుఖినశ్చాతినిర్భయాః | గురుశక్రౌ భయాన్ముక్తౌ జగ్మతుస్సుఖముత్తమమ్‌ || 40

యదర్థే గమనోద్యుక్తా దర్శనం ప్రాప్య తస్య తౌ | కృతార్థౌ గురుశక్రౌ హి స్వస్థానం జగ్మతుర్ముదా || 41

అవధూతే శ్వరాహ్వో%వతారస్తే కథితో మయా | పరమేశస్య పరమానందదః ఖలదండదః || 42

ఇద మాఖ్యానమనఘం యశస్యం స్వర్గ్యమేవ చ | భుక్తి ముక్తి ప్రదం దివ్య సర్వకామ ఫలప్రదమ్‌ || 43

య ఇదం శృణుయాన్నిత్యం శ్రావయేద్వా సమాహితః | ఇహ సర్వసుఖం భుక్త్వా సో%న్తే శివగతిం లభేత్‌ || 44

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్ర సంహితాయాం అవధూతేశ్వరావతార వర్ణనం నామ త్రింశో%ధ్యాయః (30)

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆ శంకరుడు ఇట్లు పలికి, లలాటమునందలి నేత్రమునుండి పుట్టిన తన తేజోరూపమగు అగ్నిని చేతితో పట్టుకొని ఉప్పుసముద్రమునందు పారవైచెను (36). శివుని లలాటమునందలి నేత్రమునుండి పుట్టి ఉప్పు సముద్రములో పారవేయబడిన ఆ శివుని తేజస్సు వెంటనే పిల్లవాడుగా మారెను (37). రాక్షసనాయకుడగు ఆ సముద్రపుత్రునకు జలంధరుడు అను పేరు ప్రసిద్ధిని గాంచెను. దేవతలు పార్థించగా మహేశ్వరప్రభుడు ఆతనిని సంహరించెను (38). లోకములకు మంగళములను కలిగించే శంకరుడు ఈ విధముగా అవధూతరూపమును దాల్చి చక్కని లీలను ప్రకటించి, తరువాత అంతర్ధానమయ్యెను (39). దేవతలు అందరు పూర్తిగా భయమును విడనాడి సుఖమును పొందిరి. ఇంద్రబృహస్పతులు భయమునుండి విముక్తిని పొందినవారై, ఉత్తమమగు సుఖమును అనుభువించిరి (40). ఆ ఇంద్రబృహస్పతులు ఏ ఈశ్వరుని దర్శనము కొరకు బయలు దేరిరో, అట్టి ఈశ్వరుని దర్శించుకొని కృతార్థులై ఆనందముతో తమ స్థానములకు వెడలిరి (41). పరమానందస్వరూపుడగు పరమేశ్వరుడు దుష్టులను శిక్షించును. ఆయనయొక్క అవధూతేశ్వరావతారమును నేను నీకు చెప్పితిని (42). పవిత్రమైనది, కీర్తిని స్వర్గమును భుక్తిని మరియు ముక్తిని ఇచ్చునది, కోరికలనన్నిటిని ఈడేర్చునది అగు ఈ దివ్యమగు గాథను (43) ఎవడైతే నిత్యము వినునో, లేదా ఏకాగ్రమగు మనస్సుతో వినిపించునో, అట్టివాడు ఇహలోకములో సకలసుఖములను అనుభవించి, మరణించిన పిదప శివుని సాయుజ్యమును పొందును (44).

శ్రీ శివమహాపురాణములోని శతరుద్రసంహితయందు అవధూతేశ్వరావతారమును వర్ణించే ముప్పదియవ అధ్యాయము ముగిసినది (30).

Siva Maha Puranam-3    Chapters