Siva Maha Puranam-3    Chapters   

అథ తృతీయో%ధ్యాయః

అర్ధనారీశ్వరుడు

నందీశ్వర ఉవాచ |

శృణు తాత మహాప్రాజ్ఞ విధికామప్రపూరకమ్‌ | అర్ధనారీ నరాఖ్యం హి శివరూపమనుత్తమమ్‌ || 1

యదా సృష్టాః ప్రజాస్సర్వా న వ్యవర్ధంత వేధసా | తదా చింతాకులో%భూత్స తేన దుఃఖేన దుఃఖిత || 2

నభోవాణీ తదాభూద్వై సృష్టిం మిథునజాం కురు | తచ్ఛ్రుత్వా మైథునీం సృష్టిం బ్రహ్మా కర్తుమమన్యత || 3

నారీణాం కులమీశానాత్‌ నిర్గతం న పురా యతః | తతోమైథునజాం సృష్టిం కర్తుం శేకే న పద్మభూః || 4

ప్రభావేణ వినా శంభోర్న జాయేరన్నిమాః ప్రజాః | ఏవం సంచింతయన్‌ బ్రహ్మా తపః కర్తుం ప్రచక్రమే || 5

శివయా పరయా శక్త్యా సంయుక్తం పరమేశ్వరమ్‌ | సంచింత్య హృదయే ప్రీత్యా తేపే స పరమం తపః || 6

తీవ్రేణ తపసా తస్య సంయుక్తస్య స్వయం భువః | అచిరేణౖవ కాలేన తుతోష స శివో ద్రుతమ్‌ || 7

నందీశ్వరుడిట్లు పలికెను -

వత్సా! నీవు మహాబుద్ధిశాలివి. బ్రహ్మయొక్క ఆకాంక్షను పరిపూర్తి చేసినది, సర్వశ్రేష్ఠమైనది, సగము పురుషుడు సగము స్త్రీ గలది అగు శివావతారమును గూర్చి వినుము (1). బ్రహ్మచే సృష్టింపబడిన ప్రజలు వృద్ధి చెందకుండిరి. అపుడు బ్రహ్మ ఆ దుఃఖముచే పీడింపబడి మిక్కిలి చింతిల్లెను (2). స్త్రీ పురుష సమాగమము వలన కలిగే సృష్టిని చేయుము అని అపుడు ఆకాశావాణి చెప్పగా ఆ మాటను విని బ్రహ్మ మిథున సంభవమగు సృష్టిని చేయ సంకల్పించెను (3). కాని స్త్రీల సమూహము పూర్వము ఈశానుని నుండి ప్రకటము కాలేదు. కావున పద్మసంభవుడగు బ్రహ్మ స్త్రీపురుష సంయోగ పూర్వక సృష్టిని చేయలేకపోయెను (4). శంభుని అనుగ్రహము లేనిదే ఈ సృష్టి జరుగదని భావించి బ్రహ్మ తపస్సును చేయుట మొదలిడెను (5). పరాశక్తియగు ఈశ్వరితో గూడియున్న పరమేశ్వరుని హృదయములో ప్రేమ పూర్వకముగా ధ్యానించి బ్రహ్మ ఘోరమగు తపస్సును చేసెను (6). బ్రహ్మ కఠినమగు తపస్సును చేయగా, శివుడు కొద్దికాలములోననే ప్రసన్నుడాయెను (7).

తతః పూర్ణచిదీశస్య మూర్తి మావిశ్య కామదామ్‌ | అర్ధనారీనరో భూత్వా తతో బ్రహ్మాంతికం హరః || 8

తం దృష్ట్వా శంకరం దేవం శక్త్యా పరమయాన్వితమ్‌ | ప్రణమ్య దండవద్ర్బహ్మా స తుష్టావ కృతాంజలిః || 9

అథ దేవో మహాదేవో వాచా మేఘ గభీరయా | సంభవాయ సుసంప్రీతో విశ్వకర్తా మహేశ్వరః || 10

అపుడు హరుడు పూర్ణ చిత్స్వరూపుడగు ఈశుని కామములనీడేర్చు రూపములో ప్రవేశించి సగము పురుషుడు, సగము స్త్రీ గల రూపమును దాల్చి బ్రహ్మవద్దకు విచ్చేసెను (8). పరమశక్తితో గూడియున్న ఆ శంకరదేవుని చూచి ఆ బ్రహ్మ సాష్టాంగ నమస్కారమును చేసి చేతులు జోడించి స్తుతించెను (9). అపుడు మహాదేవుడు, జగత్కర్తయగు మహేశ్వరదేవుడు బ్రహ్మయందు మిక్కిలి ప్రీతి గలవాడై మేఘగర్జనవలె గంభీరమగు స్వరముతో నిట్లనెను (10).

ఈశ్వర ఉవాచ |

వత్స వత్స మహాభాగ మమ పుత్ర పితా మహ | జ్ఞాతవానస్మి సర్వం తత్తత్త్వతస్తే మనోరథమ్‌ || 11

ప్రజనామేవ వృద్ధ్యర్థం తపస్తప్తం త్వయాధునా | తపసా తేన తుష్టో%స్మి దదామి చ తవేప్సితమ్‌ || 12

ఇత్యుక్త్వా పరమోదారం స్వభావమధురం వచః | పృథక్‌ చకార వపుషో భాగాద్దేవీం శివాం శివః || 13

తాం దృష్ట్వా పరమాం శక్తిం పృథగ్భూతాం శివాగతామ్‌ | ప్రణిపత్య వినీతాత్మా ప్రార్థయామాస తాం విధిః || 14

ఈశ్వరుడిట్లు పలికెను -

వత్సా! కుమారా ! మహాత్మా! పితామహా! నీవు నా పుత్రుడవు. నీ మనోరథము యొక్క స్వరూపమును నేను పూర్తిగా తెలుసుకొంటిని (11). నీవిపుడు ప్రజావృద్ధి కొరకు మాత్రమే తపమునాచరించితివి. నీ తపస్సుచే నేను సంతుష్టుడనైతిని. నీ కోర్కెను నేను తీర్చెదను (12). శివుడు స్వభావముచే మధురమైన, మిక్కిలి దయాగుణముతో నిండియున్న ఈ పలుకులను పలికి, శరీరపార్శ్వమునుండి ఉమాదేవిని వేరుచేసెను (13). శివుని నుండి విడివడి బయటకు వచ్చిన ఆ పరమశక్తిని గాంచి బ్రహ్మ వినయముతో నిండిన మనస్సుతో ప్రణమిల్లి ఆమెను ప్రార్థించెను (14).

బ్రహ్మోవాచ |

దేవ దేవేన సృష్టో%హమాదౌ త్వత్పతినా శివే | ప్రజాస్సర్వా నియుక్తాశ్చ శంభునా పరమాత్మనా || 15

మనసా నిర్మితాస్సర్వే శివే దేవాదయో మయా | న వృద్ధి ముపగచ్ఛంతి సృజ్యమానాః పునః పునః || 16

మిథున ప్రభవామేవ కృత్యా సృష్టిమతః పరమ్‌ | సంవర్ధయితు మిచ్ఛామి సర్వా ఏవ మమ ప్రజాః || 17

న నిర్గతం పురా త్వత్తో నారీణాం కులమవ్యయమ్‌ | తేన నారీకులం స్రష్టుం మమ శక్తిర్న విద్యతే || 18

సర్వాసామేవ శక్తీనాం త్వత్తః ఖలు సముద్భవః | తస్మాత్త్వాం పరమాం శక్తిం ప్రార్థయామ్య ఖిలేశ్వరీమ్‌ || 19

శివే నారీకులం స్రష్టుం శక్తిం దేహి నమో%స్తుతే | చరాచరం జగద్విద్ధి హేతోర్మాత శ్శివ ప్రియే || 20

అన్యం త్వత్తః ప్రార్థయామి వరం చ వరదేశ్వరి | దేహి మే తం కృపాం కృత్వా జగన్మాతర్నమో%స్తుతే || 21

చరాచర వివృద్ధ్యర్థ మీశేనైకేన సర్వగే | దక్షస్య మమ పుత్రస్య పుత్రీ భవ భవాంబికే || 22

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ భవానీ! సృష్ట్యాదియందు నీ భర్త నన్ను సృష్టించెను. దేవదేవుడగు శంభు పరమాత్మయే ప్రజలనందరినీ శాసించుచున్నాడు (15). ఓ పార్వతీ ! నేను దేవతలు మొదలగు వారినందరినీ మనస్సుచే సృజించితిని. నేను ఎన్ని పర్యాయములు సృష్టించిననూ వారు వృద్ధిని పొందుట లేదు (16). ఈ పైన స్త్రీపురుషసంయోగ పూర్వకమైన సృష్టిని మాత్రమే చేసి, నా ప్రజలందరినీ వృద్ధి చేయ గోరుచున్నాను (17). పూర్వము నీనుండి వినాశములేని స్త్రీ సమూహము ఉద్భవించలేదు. అట్టి స్త్రీ సమూహమును సృష్టించే సామర్ధ్యము నాకు లేదు (18). శక్తులన్నియు నీ నుండియే ఉద్భవించును గదా ! కావున పరమశక్తివి, సర్వమునకు ఈశ్వరివి అగు నిన్ను ప్రార్థించుచున్నాను (19) ఓ పార్వతీ! స్త్రీ సమూహమును సృష్టించు శక్తిని ఇమ్ము. నీకు నమస్కారమగు గాక! ఓ తల్లీ ! శివప్రియే! స్థావరజంగమాత్మకమగు జగత్తునకు కారణము స్త్రీయని ఎరుంగుము (20). వరములనిచ్చు ఓ ఈశ్వరీ! నీ నుండి మరియొక వరమును గోరుచున్నాను. ఓ జగన్మాతా! నీవు దయచేసి నాకు ఆ వరమును ఇమ్ము. నీకు నమస్కారమగు గాక ! (21) సర్వవ్యాపినీ! జగన్మాతా! స్థావరజంగ మాత్మకమగు సృష్టి యొక్క వృద్ధి కొరకై నీవు సర్వసమర్థమగు ఒక రూపమును గ్రహించవలెను. నా పుత్రుడగు దక్షునకు కుమార్తెవై జన్మించుము (22).

ఏవం సంయాచితా దేవీ బ్రహ్మణా పరమేశ్వరీ | తథాస్త్వితి వచః ప్రోచ్య తచ్ఛక్తిం విధయే దదౌ || 23

తస్మాద్ధి సా శివా దేవీ శివశక్తిర్జగన్మయీ | శక్తిమేకాం భ్రువోర్మధ్యాత్స సర్జాత్మ సమప్రభామ్‌ || 24

తామాహ ప్రహసన్‌ ప్రేక్ష్య శక్తిం దేవవరో హరః | కృపాసింధుర్మహేశానో లీలాకారీ భవాంబికామ్‌ || 25

పరమేశ్వరియగు ఆ దేవి బ్రహ్మచే ఈ తీరున ప్రార్థించబడి 'అటులనే అగుగాక!' అని పలికి అట్టి శక్తిని బ్రహ్మకు ఇచ్చెను (23). శివుని శక్తి, జగత్స్వరూపిణి అగు ఆ భవానీ దేవి కనుబొమల మధ్యనుండి తనతో సమానమగు కాంతులు గల ఒక శక్తిని సృష్టించెను (24). దేవశ్రేష్ఠుడు, దయాసముద్రుడు, మహేశ్వరుడు, లీలలను ప్రదర్శించువాడు అగు హరుడు ఆ శక్తిని చూచి జగన్మాతతో నిట్లనెను (25).

శివ ఉవాచ |

తపసారాధితా దేవి బ్రహ్మణా పరమేష్ఠినా | ప్రసన్నా భవ సుప్రీత్యా కురు తస్యాఖిలేప్సితమ్‌ || 26

తామాజ్ఞాం పరమేశస్య శిరసా ప్రతిగృహ్య సా | బ్రహ్మణో వచనాద్దేవీ దక్షస్య దుహితా భవత్‌ || 27

దత్త్వేవమతులాం శక్తిం బ్రహ్మణ సా శివా మునే | వివేశ దేహం శంభోర్హి శంభుశ్చాంతర్దధే ప్రభుః || 28

తదాప్రభృతి లోకే%స్మిన్‌ స్త్రియో భాగః ప్రకల్పితః | ఆనందం ప్రాప స విధి స్సృష్టిర్జాతా చ మైథునీ || 29

ఏతత్తే కథితం తాత విశ్వరూపం మహోత్తమమ్‌ | అర్ధనారీ నరార్ధం హి మహామంగలదం సతామ్‌ || 30

ఏతదాఖ్యాన మనఘం యః పఠేచ్ఛృణుయాదపి | స భుక్త్వా సకలాన్‌ భోగాన్‌ ప్రయాతి పరమాం గతిమ్‌ || 31

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్రసంహితాయాం అర్ధ నారీశ్వరావతారవర్ణనం నామ

తృతీయో%ధ్యాయః (3)

శివుడిట్లు పలికెను -

ఓ దేవీ ! పరమేష్ఠియగు బ్రహ్మ తపస్సు చేసి నిన్ను ఆరాధించినాడు. నీవు ప్రసన్నురాలవై ఆతని కోర్కెలనన్నిటినీ మిక్కిలి ప్రీతితో నెరవేర్చుము (26). పరమేశ్వరుని ఆ యాజ్ఞను ఆమె శిరసా వహించెను. బ్రహ్మ కోరిన విధముగా ఆ దేవి దక్షుని కుమార్తెయై జన్మించెను (27). ఓ మునీ ! ఈ తీరున పార్వతి బ్రహ్మకు సాటిలేని శక్తి నిచ్చి శంభుని దేహములో ప్రవేశించగానే, ఆ శంభు ప్రభుడు అంతర్ధానమును చెందెను (28). అప్పటినుండి ఈ లోకములో నారీ విభాగము కల్పించబడెను. ఆ బ్రహ్మ ఆనందించెను. స్త్రీ పురుష సమాగమ రూపమగు సృష్టి ప్రవర్తిల్లెను (29). వత్సా! ఈ తీరున నేను నీకు సర్వోత్తమమైనది, సత్పురుషులకు మహామంగళములనిచ్చునది, సగము పురుషుడు సగము స్త్రీ అనే జగత్స్వరూపమును చెప్పియుంటిని (30). పవిత్రమగు ఈ గాథను ఎవరు పఠించెదరో, మరియు వినెదరో, అట్టివాడు సమస్తభోగములనను భవించి పరంగతిని పొందును (31).

శ్రీ శివమహాపురాణములోని శతరుద్రసంహితయందలి అర్ధనారీశ్వరావతార వర్ణనమనే మూడవ అధ్యాయము ముగిసినది (3).

Siva Maha Puranam-3    Chapters