Siva Maha Puranam-3    Chapters   

అథ ఏకోన త్రింశోధ్యాయః

కృష్ణ దర్శనావతారము

నందీశ్వర ఉవాచ|

సనత్కుమార శంభోస్త్వ వతారం పరమం శృణు | నభగజ్ఞానదం కృష్ణ దర్శనాహ్వయముత్తమమ్‌ || 1

ఇక్ష్వాకు ప్రముఖా ఆసన్‌ శ్రాద్ధదేవసుతాశ్చ యే | నభగస్తత్ర నవమో నాభగస్తత్సుత స్స్మృతః || 2

అంబరీషస్సుతస్తస్య విష్ణుభక్తో బభూవ సః | యస్యోపరి ప్రసన్నో%భూద్దుర్వాసా బ్రహ్మభక్తితః || 3

పితామహోంబరీషస్య నభగో యః ప్రకీర్తితః | తచ్చరిత్రం శృణు మునే యసై#్మ జ్ఞానమదాచ్ఛివః || 4

నభగో మనుపుత్రస్తు పఠనార్ధం సుబుద్ధిమాన్‌ | చక్రే గురుకులే వాసం బహుకాలం జితేంద్రియః || 5

ఏతస్మిన్‌ సమయే తే వా ఇక్ష్వాకు ప్రముఖాస్సుతాః | తసై#్మ భాగమకల్ప్యైవ భేజుర్భాగాన్నిజాన్‌ క్రమాత్‌ || 6

స్వం స్వం భాగం గృహీత్వా తే బుభుజూ రాజ్యముత్తమమ్‌ | అవిషాదం మహాభాగా పిత్రాదేశాత్సుబుద్ధయః || 7

స పశ్చాదాగతస్తత్ర బ్రహ్మచారీ గురుస్థలాత్‌ | నభగో%ధీత్య సర్వాశ్చ సాంగోపాంగాశ్శ్రుతీః క్రమాత్‌ || 8

భ్రాతౄన్‌ విలోక్య నభగో విభక్తాన్‌ సకలాన్నిజాన్‌ | దాయార్ధీ ప్రాహ తాన్‌ స్నేహాదిక్ష్వాకు ప్రముఖాన్మునే || 9

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ సనత్కుమారా! నభగునకు జ్ఞానమునొసంగిన, కృష్ణ దర్శనమను పేరుగల శంభుని పరమోత్తమావతారమును గూర్చి వినుము (1). శ్రాద్ధదేవుడను మనువునకు ఇక్ష్వాకువు మొదలగు పుత్రులు గలరు. వారిలో నభగుడు తొమ్మిదవవాడు. ఆతని కుమారుడు నాభగుడు (2). విష్ణుభక్తుడగు అంబరీషుడు నాభగుని కుమారుడు. ఆతని బ్రాహ్మణ భక్తిని గాంచి దుర్వాసుడాతనిపై మిక్కిలి ప్రసన్నుడాయెను (3). ఓ మునీ! అంబరీషుని పితామహుడగు నభగునకు శివుడు జ్ఞానమునిచ్చి యుండెను. ఆ వృత్తాంతమును వినుము (4). మనువు యొక్క పుత్రుడగు నభగుడు చాల బుద్ధిమంతుడు. ఆతడు విద్యాభ్యాసము కొరకై చిరకాలము జితేంద్రియుడై గురుకులమునందు నివసించెను (5). ఆ సమయములో ఇక్ష్వాకుడు మొదలగు మిగిలిన సోదరులు ఆతనికి వాటాను ఈయకుండగనే తమ తమ భాగములను పంచుకొనిరి (6). మంచి బుద్ధిమంతులు, మహాత్ములు అగు వారు తండ్రి ఆదేశముచే తమ తమ భాగములను స్వీకరించి దుఃఖము నెరుంగక ఉత్తమమగు రాజ్యముననుభవించిరి (7). బ్రహ్మచారియగు నభగుడు అంగములతో, ఉపాంగములతో గూడిన వేదములనన్నిటినీ క్రమముగా అధ్యయనము చేసి, తరువాత గురుకులమునుండి ఇంటికి విచ్చేసెను (8). ఓ మునీ! నభగుడు తమ తమ భాగముల ననుభవించుచున్న ఇక్ష్వాకువు మొదలగు తన సోదరులను గాంచి, తన వాటాను గోరి వారితో ప్రేమపూర్వకముగా నిట్లు పలికెను (9).

నభగ ఉవాచ|

భ్రాతరో%భక్తకం మహ్యం దాయం కృత్వా యథాతథమ్‌ | సర్వే విభక్తాస్సుప్రీత్యాస్వదాయార్థా గతాయ చ || 10

తదా విస్మృతమస్మాభిరిదానీం పితరం తవ | విభజామో వయం భాగం తం గృహాణ న సంశయః || 11

తచ్ఛ్రుత్వా భ్రాతృవచనం నభగః పరవిస్మృతః | తదోపకంఠ మాగత్య పితరం సమభాషత || 12

హే తాత భ్రాతరస్సర్వే త్యక్త్వా మాం వ్యభజంశ్చ తే | పఠనార్థం గతశ్చాహం బ్రహ్మచారీ గురోః కులే || 13

తత ఆ గత్య మే పృష్టా దాయదానార్థ మాదరాత్‌ | తే త్వామూచుర్విభాగం మే తదర్థ మహామాగతః || 14

నభగుడిట్లు పలికెను-

సోదరులారా! నాకు వాటాను పంచి యివ్వకుండగనే మీరు అందరు ఆనందముగా సర్వమును పంచుకొనినారు. నేను నా వాటాకొరకు వచ్చితిని (10). అపుడు నీకు వాటాను ఇచ్చుట మాచే విస్మరింపబడినది. ఇపుడు నీవు తండ్రిని నీ భాగముగా స్వీకరింపుము. సందేహము వలదు (11). సోదరుల ఆ మాటను విని నభగుడు మిక్కిలి ఆశ్చర్యమును పొంది తండ్రి వద్దకు వచ్చి ఇట్లు పలికెను (12). ఓ తండ్రీ! బ్రహ్మచారినగు నేను విద్యాభ్యాసముకొరకు గురుకులమునకు వెళ్లియుండగా, సోదరులందరు నన్నువిడిచిపెట్టి వాటాలను పంచుకొనిరి (13). నేను మరలి వచ్చి నా వాటాను ఇమ్మని ప్రేమపూర్వకముగా కోరితిని. నీవు నా వాటాయని వారు చెప్పితిరి. అందుకొరకై నేను నీవద్దకు వచ్చితిని (14).

నందీశ్వర ఉవాచ|

తదాకర్ణ్య వచస్తస్య పితాం త ప్రాహ విస్మితః | ఆశ్వాస్య శ్రాద్ధదేవస్స సత్యధర్మరతం మునే || 15

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆతని మాటలను ఆతని తండ్రియగు శ్రాద్ధదేవుడు విని ఆశ్చర్యపడెను. ఓ మునీ! ఆయన సత్యమునందు ధర్మమునందు నిష్ఠగల తన కుమారుని ఓదార్చి ఇట్లు పలికెను (15).

మనురువాచ |

తదుక్తం మాదృథాస్తాత ప్రతారణకరం హి తత్‌ | న హ్యహం పరమం దాయం సర్వథా భోగసాధనమ్‌ || 16

తథాపి దాయభావేన దత్తో%హం తైః ప్రతారిభిః | తవ వై జీవనోపాయం వదామి శృణు తత్త్వతః || 17

సత్రమాంగిరసా విప్రాః కుర్వంత్యద్య సుమేధసః | తత్ర కర్మణి ముహ్యంతి షష్ఠం షష్ఠమహః ప్రతి || 18

తత్ర త్వం గచ్ఛ నభగ తాన్‌ సుశంస మహాకవే | సూక్తే ద్వేవైశ్వదేవే హి సత్రం శుద్ధం హి తద్భవేత్‌ || 19

తత్కర్మణి సమాప్తే హి స్వర్యాంతో బ్రాహ్మణాశ్చ తే | ధనం దాస్యంతి తే తుష్టాస్స్వసత్రపరిశేషితామ్‌ || 20

మనువు ఇట్లు పలికెను-

కుమారా! వారు పలికిన మోసపు మాటలను లెక్క చేయకుము. అన్ని విధములుగా అనుభవింపదగిన ఉత్తమమగు దాయభాగము నేను గాను (16). అయిననూ ఆ మోసగాండ్రు నన్ను నీకు దాయభాగరూపములో అప్పజెప్పిరి. నేను నీకు జీవనోపాయమును చెప్పెదను. శ్రద్ధగా వినుము (17). అంగిరోవంశమునందు జన్మించిన ప్రజ్ఞాశాలురగు బ్రాహ్మణులు ఇపుడు సత్రయాగముననుష్ఠించుచున్నారు. వారు ప్రతి షష్ఠాహస్సు (ఆరవ రోజు) నందు చేయదగిన కర్మ విషయములో మోహమును పొందుచున్నారు (18). ఓ నభగా! నీవు అచటకు వెళ్లుము. ఆ మహాయజ్ఞములో వారిని సమీపించి రెండు వైశ్వదేవసూక్తములను చక్కగా పఠించుము. దానివలన ఆ సత్రయాగము సుసంపన్నమగును (19). ఆ కర్మ పూర్తి కాగానే ఆ బ్రాహ్మణులు స్వర్గమునకు వెళ్లబోవుచూ చాల సంతసించిన వారై తమ సత్రయాగములో మిగిలిన ధనమును నీకు ఈయగలరు (20).

నందశ్వీర ఉవాచ |

తదాకర్ణ్య పితుర్వాక్యం నభగస్సత్యసారవాన్‌ | జగామ తత్ర సుప్రీత్యా యత్ర తత్సత్ర ముత్తమమ్‌ || 21

తదాహః కర్మణి మునే సత్రే తస్మిన్‌ స మానవః | సూక్తే ద్వే వైశ్వదేవే హి ప్రోవాచ స్పష్టతస్సుధీః || 22

సమాప్తే కర్మణీ తతో విప్రా ఆంగిరసాశ్చతే | తసై#్మ దత్త్వా యయుస్స్వర్గం స్యం స్వం సత్రావశేషితమ్‌ || 23

తత్తదా స్వీకరిష్యంతం సుసత్రపరిశేషితమ్‌ | విజ్ఞాయ గిరిశస్సద్య ఆవిర్భూతస్సదూతికృత్‌ || 24

సర్వాంగసుందరశ్శ్రీమాన్‌ పురుషః కృష్ణదర్శనః | భావం సమీక్షితుం భాగం దాతుం జ్ఞానం పరం చ తత్‌ || 25

అథో స శంకరశ్శంభుః పరీక్షాకర ఈశ్వరః | ఉవాచోత్తరతో%భ్యేత్య నభగం తం హి మానవమ్‌ || 26

నందీశ్వరుడిట్లు పలికెను-

సత్యముయొక్క సారమునెరింగిన నభగుడు తండ్రియొక్క ఆ మాటను విని, ఉత్తమమగు ఆ సత్రయాగము జరుగుచున్న స్థలమునకు మహానందముతో వెళ్లెను (21). విద్వాంసుడగు ఆ మను పుత్రుడు ఆ దినముయొక్క కర్మ జరుగుచుండగా ఆ సత్రయాగములో రెండు వైశ్వదేవసూక్తములను స్పష్టముగా చెప్పెను (22). ఆ యాగము సమాప్తము కాగానే, ఆ ఆంగిరస బ్రాహ్మణులు సత్రములో మిగిలిపోయిన తమ సంపదను ఆతనికి ఇచ్చి స్వర్గమునకు వెళ్లిరి (23). ఆ గొప్ప సత్రములో మిగిలిపోయిన సంపదనాతడు స్వీకరించుచుండగా, అపుడా విషయమునెరింగి, చక్కని లీలలను ప్రకటించే శివుడు నభాగుని నిష్ఠను పరీక్షించి ఆతనికి ఉత్తమ జ్ఞానము నొసంగుటకై ఆవిర్భవించెను (25). మంగళకరుడు, పరీక్షలను చేయువాడు, ఈశ్వరుడునగు ఆ శంభుడు అపుడు ఉత్తరమునుండి సమీపించి మనుపుత్రుడగు ఆ నభగునితో నిట్లనెను (26).

ఈశ్వర ఉవాచ |

కస్త్వం గృహ్ణాసి పురుష మమేదం వాస్తుకం వసు | ప్రేషితః కేన తత్సర్వం సత్యం వద మమాగ్రతః || 27

ఈశ్వరుడిట్లు పలికెను-

ఓయీ! పురుషా! నీవెవరివి? నీవు నా ఈ వస్తురూపమగు సంపదను ఏల గొని పోవుచుంటివి? నిన్ను పంపినవారెవరు? నా ఎదుట సర్వమును యథార్థముగా చెప్పుము (27).

నందీశ్వర ఉవాచ|

తచ్ఛ్రుత్వా తద్వచస్తాత మానవో నభగః కవిః | ప్రత్యువాచ వినీతాత్మా పురుషం కృష్ణదర్శనమ్‌ || 28

నందీశ్వరుడిట్లు పలికెను-

మనుపుత్రుడు, జ్ఞానియగు నభగుడు ఆ మాటను వినెను. వత్సా! ఆతడు వినయముతో గూడిన మనస్సు గలవాడై కృష్ణదర్శనుడు అనే ఆ పురుషునికి ఇట్లు బదులిడెను (28).

నభగ ఉవాచ |

మమేద మృషిభిర్దత్తం వసు యజ్ఞగతం ఖలు | కథం వారయసే మాం త్వం గృహ్ణంతం కృష్ణదర్శన || 29

నభగుడిట్లు పలికెను-

ఓయీ కృష్ణదర్శనా (నల్లని కన్నులు గలవాడా)! యజ్ఞములో మిగిలిన ఈ సంపదను నాకు ఋషులు ఇచ్చి యున్నారు. నేను తీసుకొనుచుండగా నీవు నన్నేల వారించుచుంటివి? (29)

నందీశ్వర ఉవాచ |

ఆ కర్ణ్య నాభగం వాక్యమిదం సత్యముదీరితమ్‌ | ప్రత్యువాచ ప్రసన్నాత్మా పురుషః కృష్ణదర్శనః || 30

నందీశ్వరుడిట్లు పలికెను-

నభగుడు పలికిన ఈ సత్యవాక్యమును విని కృష్ణదర్శనుడను ఆ పురుషుడు ప్రసన్నమగు అంతఃకరణము గలవాడై ఇట్లు బదులిడెను (30).

కృష్ణ దర్శన ఉవాచ |

వివాదే %స్మిన్‌ హి నౌ తాత ప్రమాణం జనకస్తవ | యాహి తం పృచ్ఛ స బ్రూయాత్తత్ర్పమాణం తు సత్యతః || 31

కృష్ణదర్శనుడిట్లు పలికెను-

వత్సా! మన ఇద్దరి ఈ వివాదమును తీర్చగల యోగ్యుడు నీ తండ్రి. నీవు ఆతని వద్దకు వెళ్లి అడుగుము. ఆతడు ధర్మమును యథాతథముగా చెప్పును (31).

నందీశ్వర ఉవాచ|

తదాకర్ణ్య వచస్తస్య నభగో మానవః కవిః | ఆగచ్ఛత్పితరం ప్రీత్యా తదుక్తం పృష్టవాన్‌ మునే || 32

పుత్రోదితం సమాకర్ణ్య శ్రాద్ధదేవస్స వై మనుః | స్మృత్వా శివపదాం భోజం ప్రాప్తస్మృతిరువాచ తమ్‌ || 33

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ మునీ! ఆతని ఆ మాటను విని మనుపుత్రుడు, జ్ఞాని యగు నభగుడు ఆనందముతో తండ్రి వద్దకు వెళ్ళి కృష్ణదర్శనుడు చెప్పిన విధముగా చెప్పెను (32). ఆ శ్రాద్ధదేవమనువు పుత్రుని వచనములను విని శివుని పాదపద్మములను స్మరించి గుర్తునకు తెచ్చుకొని అతనితో నిట్లనెను (33).

మనురువాచ |

హే తాత శృణు మద్వాక్యం స దేవః పురుషశ్శివః | తసై#్యవ సకలం వస్తు యజ్ఞప్రాప్తం విశేషతః || 34

అధ్వరోర్వరితం వస్తు రుద్రభాగః ప్రకీర్తితః | ఇత్యపి ప్రాజ్ఞవాదో హి క్వచి జ్ఞాతస్తదిచ్ఛయా|| 35

స దేవ ఈశ్వరస్సర్వం వస్త్వర్హతి న సంశయః | యజ్ఞావశిష్టం కిముత పరే తస్యేచ్ఛయా విభోః || 36

అనుగ్రహార్థ మాయాతస్తవ తద్రూపతః ప్రభుః | తత్ర త్వం గచ్ఛ నభగ ప్రసన్నం కురు సత్యతః || 37

క్షమాపయ స్వాపరాధం సుప్రణమ్య స్తుతిం కురు | సర్వప్రభుస్స ఏవేశో యజ్ఞాధీశో%ఖిలేశ్వరః || 38

విష్ణుబ్రహ్మాదయో దేవాస్సిద్ధాస్సర్వర్షయో%పి హి | తదనుగ్రహతస్తాత సమర్థాస్సర్వకర్మణీ || 39

కిం బహూక్త్యాత్మజశ్రేష్ఠ గచ్ఛ తత్రాశు మా చిరమ్‌ | ప్రసాదయ మహాదేవం సర్వథా సకలేశ్వరమ్‌ || 40

మనువు ఇట్లు పలికెను-

ఓ కుమారా! నా మాటను వినుము. ఆ పురుషుడు శివదేవుడే. జగత్తులోని సర్వవస్తువులు ఆయనకు మాత్రమే చెందును. యజ్ఞమునకు సంబంధించిన వస్తువులు విశేషించి ఆయనకు చెందును (34). యజ్ఞము తరువాత మిగిలిన వస్తువులన్నియు రుద్రభాగములని చెప్పబడును. ఇట్టి పండితుల వచనములు ఆ శివుని సంకల్పము చేతనే అక్కడక్కడ ప్రచారములోనికి వచ్చినవి (35). ఆ ఈశ్వర దేవుడే వస్తువులన్నింటికీ అధికారి యనుటలో సందేహము లేదు. యజ్ఞములో మిగిలిన వాటిని గురించి చెప్పునదేమున్నది? ఆయన యొక్క ఇచ్ఛ చేతనే ఇతర దేవతలు తమ భాగములను పొందుచున్నారు (36). ఆ ప్రభుడు నిన్ను అనుగ్రహించుటకై అచటకు ఆ రూపములో వచ్చియున్నాడు. ఓ నభగా! నీవు అచటకు వెళ్లి నీ సత్యవచనముతో ఆయనను ప్రసన్నుని చేసుకొనుము (37). అపరాధమును మన్నించుమని వేడుకొనుము. చక్కగా ప్రణమిల్లి స్తుతించుము. ఆ అఖిలేశ్వరుడే యజ్ఞమునకు ప్రభువు, మరియు సర్వమునకు ప్రభువు (38). వత్సా! విష్ణుబ్రహ్మాది దేవతలు, సిద్ధులు, సకలమహర్షులు ఆయన అనుగ్రహము చేతనే కర్మలన్నింటియందు సమర్థులగుచున్నారు (39). నీవు నా పుత్రులలో శ్రేష్ఠుడవు. ఇన్ని మాటలేల? నీవు వెంటనే అచటకు వెళ్లుము. సకలప్రభుడగు ఆ మహాదేవుని అన్ని విధములుగా ప్రసన్నుని చేయుము (40).

నందీశ్వర ఉవాచ |

ఇత్యుక్త్వా స మను శ్శ్రాద్ధదేవశ్చ తనయం ద్రుతమ్‌ | ప్రేషయామాస నికటం శంభోస్సో%సి సమేత్య తమ్‌ || 41

నభగశ్చ ప్రణమ్యాశు సాంజలిర్నతమస్తకః | ప్రోవాచ సుప్రసన్నాత్మా వినయేన మహామతిః || 42

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆ శ్రాద్ధదేవమనువు ఇట్లు పలికి వెంటనే కుమారుని శంభుని వద్దకు పంపెను.ఆ నభగుడు శంభుని వద్దకు వచ్చి (41), వెంటనే చేతులను జోడించి తలవంచి నమస్కరించెను. గొప్ప బుద్ధిశాలియగు ఆ నభగుడు మిక్కిలి ప్రసన్నమగు మనస్సు గలవాడై వినయముతో నిట్లనెను (42).

నభగ ఉవాచ |

ఇదం తవేశ సర్వం హి వస్తు త్రిభవనే హి యత్‌ | ఇత్యాహ మే పితా నూనం కిముతాధ్వరశేషితమ్‌ || 43

అజానతా మయా నాథ యదుక్తం తద్వచో భ్రమాత్‌ | అపరాథం త్వం క్షమస్వ శిరసా త్వాం ప్రసాదయే || 44

ఇత్యక్త్వా నభగస్సో%తి దీనధీస్తు కృతాంజలిః | తుష్టావ తం మహేశానం కృష్ణ దర్శనమానతః || 45

శ్రాద్ధదేవో%పి శుద్ధాత్మా నతకస్సాంజలి స్సుధీః | తుష్టావ తం ప్రభుం నత్వా స్వాపరాధం క్షమాపయత్‌ || 46

ఏతస్మిన్నంతరే తత్ర విష్ణుర్ర్బహ్మా ఖిలస్సుధీః | వాసవాద్యాస్సమాజగ్ముస్సిద్ధాశ్చ మునయో%పి హి || 47

మహోత్సవం ప్రకుర్వంతస్సుకృతాంజలయో%ఖిలాః | తుష్టువుర్నతకా భక్త్యా సుప్రణమ్య పృథక్‌ పృథక్‌ || 48

అథ రుద్రః ప్రసన్నాత్మా కృపాదృష్ట్యా విలోక్య తాన్‌ | ఉవాచ నభగం ప్రీత్యా సస్మితం కృష్ణదర్శనః || 49

నభగుడిట్లు పలికెను-

ఓ ఈశ్వరా! ముల్లోకములలో గల వస్తువులన్నియూ నీవేనని నా తండ్రి చెప్పినాడు. యజ్ఞములో మిగిలినది నీదేనని వేరుగా చెప్పవలెనా? (43). ఓ నాథా! నేను అజ్ఞానముచే పలికిన మాటలు భ్రమపూర్ణములు. నా అపరాధమును మన్నించుము. నేను తలవంచి ప్రణమిల్లి నిన్ను ప్రసన్నుని చేయుచున్నాను (44). మిక్కిలి దీనమగు బుద్ధిగల నభగుడు తలవంచి చేతులు జోడించి ఇట్లు పలికి కృష్ణ దర్శన రూపములోనున్న ఆ మహేశ్వరుని స్తుతించెను (45). శుద్ధమగు అంతఃకరణము గలవాడు, విద్వాంసుడునగు శ్రాద్ధదేవుడు కూడ చేతులు జోడించి నమస్కరించి, తన అపరాధమునుమన్నించుమని ఆ ప్రభువును స్తుతించెను (46). అదే సమయములో అచటకు సర్వస్వరూపుడగు విష్ణువు, జ్ఞానియగు బ్రహ్మ, ఇంద్రాది దేవతలు, సిద్ధులు మరియు మునులు విచ్చేసిరి (47). వారందరు చక్కగా చేతులు జోడించి వేర్వేరుగా సాష్టాంగప్రణామములనాచరించి మహోత్సవమును చేయుచూ భక్తితో స్తుతించిరి (48). అపుడు కృష్ణదర్శన రూపములో నున్న రుద్రుడు ప్రసన్నమగు అంతఃకరణము గలవాడై వారిని దయాదృష్టితో వీక్షించి చిరునవ్వుతో ప్రేమతో ఉద్దేశించి ఇట్లు పలికెను (49).

కృష్ణ దర్శన ఉవాచ |

యత్తే పితావదద్ధర్మ్యం వాక్యం తత్తు తథైవహి | త్వయా%పి సత్యముక్తం తత్సా ధుస్త్వం నాత్ర సంశయః || 50

అతో%హం సుప్రసన్నో%స్మి సర్వథా సువ్రతేన తే | దదామి కృపయా తే హి జ్ఞానం బ్రహ్మ సనాతనమ్‌ || 51

మహాజ్ఞానీ భవ త్వం హి సవిప్రో నభగ ద్రుతమ్‌ | గృహాణ వస్త్విదం సర్వం మద్దత్తం కృపయాధునా || 52

ఇహ సర్వసుఖం భుంక్ష్వ నిర్వికారం మహామతే | సుగతిం ప్రాప్స్యసి త్వం హి సవిప్రః కృపయా మమ || 53

కృష్ణదర్శనుడిట్లు పలికెను-

నీ తండ్రి ధర్మమునకు అనురూపముగా పలికిన వచనము యథార్థము. నీవు కూడ సత్యమును పలికితివి. కావున నీవు సాధుపురుషుడవనుటలో సందేహము లేదు (50). కావున నేను నీ సత్యవ్రతముచే చాల ప్రసన్నుడనైతిని. నేను దయతో నీకు సనాతనమగు బ్రహ్మజ్ఞానమునిచ్చెదను (51). ఓ నభగా! నీవు మహాజ్ఞానివి అగుదువు. నేను దయతో ఇప్పుడీ సర్వ వస్తువులను ఇచ్చుచున్నాను. బ్రహ్మణులతో గూడి నీవు వెంటనే స్వీకరింపుము (52). ఓ మహాబుద్ధిశాలీ! ఇహలోకములో నిర్వికారముగా సర్వసుఖములనను భవించుము. నాదయచే నీవు బ్రాహ్మణ ధర్మములతో గూడి ఉత్తమ గతిని పొందగలవు (53).

నందీశ్వర ఉవాచ |

ఇత్యుక్త్వా తాత భగవాన్‌ స రుద్ర స్సత్యవత్సలః | సర్వేషాం పశ్యతా తేషాం తత్రైవాంతర్దధే హరః || 54

విష్ణుర్బ్రహ్మాపి దేవద్యాస్సర్వే తే మునిసత్తమ | స్వం స్వం ధామ యయుః తసై#్య నత్వా దిశే ముదా || 55

స పుత్రశ్శ్రాద్ధదేవో%పి స్వస్థానమగమన్ముదా | భుక్త్వా భోగాన్‌ సువిపులాన్‌ సోంతే శివపురం య¸° || 56

ఇత్థం తే కీర్తితో బ్రతహ్మన్నవతారశ్శివస్య హి | కృష్ణదర్శననామావై నభగా నందదాయకః || 57

ఇద మాఖ్యానమనఘం భుక్తిముక్తిప్రదం సతామ్‌ | పఠతాం శృణ్వతాం వాపి సర్వకామ ఫలప్రదమ్‌ || 58

య ఏతచ్చరితం ప్రాతస్సాయం చ స్మరతే సుధీః | కవిర్భవతి మంత్రజ్ఞో గతిమంతే లభేత్పరామ్‌ || 59

ఇతి శ్రీ శివమహాపురపాణ శతరుద్రసంహితాయాం కృష్ణదర్శనావతార వర్ణనం నామ ఏకోనత్రింశో%ధ్యాయః (29).

నందీశ్వరుడిట్లు పలికెను-

వత్సా! సత్యమునందు ప్రేమ గలవాడు, పాపములను హరించువాడు నగు ఆ రుద్ర భగవానుడు ఇట్లు పలికి వారందరు చూచుచుండగా అచటనే అంతర్ధానమాయెను (54). ఓ మహర్షీ! విష్ణువు, బ్రహ్మ, దేవతలు మొదలగు వారందరు ఆ దిక్కునకు ఆనందముతో నమస్కరించి తమ తమ స్థానములకు వెళ్లిరి (55). శ్రాద్ధదేవుడు కూడా పుత్రునితో గూడి ఆనందముతో తన స్థానమునకు వెళ్లెను. ఆతడు విస్తారమగు భోగముల ననుభవించి, దేహమును వీడిన పిదప శివుని పదమును చేరెను (56). ఓ సనత్కుమారా! నభగునకు ఆనందమును కలిగించిన శివుని కృష్ణదర్శనావతారమును నీకు ఈ తీరున వివరించి యుంటిని (57). ఈ గాథ పవిత్రమైనది, సత్పురుషులకు భుక్తిని, ముక్తిని ఇచ్చునది. దీనిని చదువు వారికి వినువారికి కూడా సర్వకామనలు, ఫలములు సిద్ధించును (58). ఏ బుద్ధిమంతుడు ఈ వృత్తాంతమును ఉదయము మరియు సాయంకాలమునందు స్మరించునో, ఆతడు కవి, మంత్రవేత్తయగుటయే గాక, దేహత్యాగానంతరము పరమగతిని పొందును (59).

శ్రీ శివ మహాపురాణములోని శతరుద్రసంహితయందు కృష్ణ దర్శనావతారవర్ణనమనే ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29).

Siva Maha Puranam-3    Chapters