Siva Maha Puranam-3    Chapters   

అథ సప్త వింశోధ్యాయః

ద్విజేశ్వరావతారము

నందీశ్వర ఉవాచ|

శృణు తాత ప్రవక్ష్యామి శివస్య పరమాత్మనః | ద్విజేశ్వరావతారం చ సశివం సుఖదం సతామ్‌ || 1

యః పూర్వం వర్ణితస్తాత భద్రాయుర్నృపసత్తమః | యస్మిన్నృషభరూపేణానుగ్రహం కృతవాన్‌ శివః || 2

తద్ధర్మస్య పరీక్షార్థః పునరావిర్బభూవ సః | ద్విజేశ్వరస్వరూపేణ తదేవ కథయామ్యహమ్‌ || 3

ఋషభస్య ప్రభావేణ శత్రూన్‌ జిత్వా రణ ప్రభుః | ప్రాప్తసింహాసనస్తాత భద్రాయుస్సంబభూవ హ || 4

చంద్రాంగదస్య తనయా సీమంతిన్యాశ్శుభాంగజా | పత్నీ తస్యాభవద్ర్బహ్మన్‌ సుసాధ్వీ కీర్తి మాలినీ || 5

స భద్రాయుః కదాచిత్స్వ ప్రియయా గహనం వనమ్‌ | ప్రావిశత్సంవిహారార్థం వసంతసమయే మునే || 6

అథ తస్మిన్‌ వనే రమ్యే విజహార స భూపతిః | శరణా గత పాలిన్యా తయా స్వప్రియయా సహ || 7

నందీశ్వరుడిట్లు పలికెను-

వత్సా! వినుము. పరమాత్మయగు శివుడు పార్వతితో గూడి, సత్పురుషులకు సుఖమునొసంగు ద్విజేశ్వరావతారమును దాల్చిన గాథను చెప్పెదను (1). వత్సా! భద్రాయుడను నృపశ్రేష్ఠుని గూర్చి, శివుడు ఆయనపై ఋషభరూపముతో అనుగ్రహమును చూపిన వృత్తాంతమును పూర్వము వర్ణించి యుంటిని (2). ఆయన ఆతని ధర్మమును పరీక్షించుటకై మరల ద్విజేశ్వరరూపముతో అవతరించెను. ఆ వృత్తాంతమును నేను నీకు చెప్పుచున్నాను (3). వత్సా! భద్రాయు మహారాజు ఋషభుని ప్రభావముచే యుద్ధములో శత్రువులను జయించి సింహాసనము నధిష్టించెను (4). సీమంతినీ చంద్రాంగదుల కుమార్తె, శుభలక్షణములు గలది, గొప్ప సాధ్వి యగు కీర్తిమాలిని ఆతనికి భార్య ఆయెను. ఓయీ బ్రహ్మన్‌ ! (5) మహర్షీ! ఒకనాడు ఆ భద్రాయుడు తన ప్రియురాలితో గూడి వసంత కాలములో విహారముకొరకై దట్టమగు అడవిలో ప్రవేశించెను (6). శరణు జొచ్చినవారిని రక్షించే స్వభావము గల ఆ తన ప్రియురాలితో గూడి ఆ రాజు ఆ సుందరమగు వనములో విహరించెను (7).

అథ తద్ధర్మదృఢతాం ప్రతీక్షన్‌ పరమేశ్వరః | లీలాం చకార తత్రైవ శివయా సహ శంకరః || 8

శివా శివశ్చ భూత్వోభౌ తద్వనే ద్విజదంపతీ | వ్యాఘ్రం మాయామయం కృత్వా % విర్భూతౌ నిజలీలయా || 9

అథా విదూరే తసై#్యవ ద్రవంతౌ భయవిహ్వలౌ | అన్వీయమానౌ వ్యాఘ్రేణ రుదంతౌ తౌ బభూవతుః || 10

అథ విద్ధౌ చ తౌ తాత భద్రాయుస్స మహీపతిః | దదర్శ క్రందమానౌ హి శరణ్యః క్షత్రియర్షభః || 11

అథ తౌ మునిశార్దూల స్వమాయాద్విజదంపతీ | భద్రాయుషం మహారాజమూచతుర్భయవిహ్వలౌ || 12

అపుడు రాజుయొక్క ధర్మదృఢత్వమును చూడగోరి పరమేశ్వరుడగు శంకరుడు పార్వతీ దేవితో గూడి అచటనే ఒక లీలను నెరపెను (8). పార్వతీ పరమేశ్వరులు బ్రాహ్మణ దంపతులుగా మారి ఆ వనములో ఆవిర్భవించిరి. వారు తమ లీలచే మాయారూపమగు పెద్దపులిని సృష్టించిరి (9). వారు ఆ పులికి కొద్ది దూరములో మాత్రమే ఉండి దానిచే తరుమబడుచున్నవారై భయముతో కంగారుపడుతూ దుఃఖిస్తూ పరుగెత్తుచుండిరి (10). పెద్దపులి వారిని సంహరించుటకై తరుముచుండగా వారు బిగ్గరగా అరచుచుండిరి. శరణు జొచ్చిన వారిని రక్షించే వీరక్షత్రియుడగు ఆ భద్రాయు మహారాజు వారిని గాంచెను. ఓ వత్సా! (11) మహర్షీ! అపుడు తమ మాయచే బ్రాహ్మణ దంపతుల రూపములో నున్న వారిద్దరు భయముచే దుఃఖించుచున్నవారై భద్రాయు మహారాజుతో నిట్లనిరి (12).

ద్విజదంపతీ ఊచతుః |

పాహి పాహి మహారాజ నావు భౌ ధర్మవిత్తమ | ఏష ఆయాతి శార్దూలో జగ్ధుమావాం మహాప్రభో || 13

ఏష హింస్రః కాలసమః సర్వప్రాణి భయంకరః | యావన్న ఖాదతి ప్రాప్య తావన్నౌ రక్ష ధర్మవిత్‌ || 14

బ్రాహ్మణ దంపతులిట్లు పలికిరి-

మహారాజా! మమ్ములనిద్దరినీ రక్షింపుము. నీవు ధర్మవేత్తలలో శ్రేష్ఠుడవు. ఓ మహాప్రభూ! ఈ పెద్దపులి మమ్ములనిద్దరినీ తినివేయుటకై మీదకు వచ్చుచున్నది (13). యమునితో సమముగా సర్వప్రాణులకు భయమును గొల్పు ఈ క్రూరమృగము మమ్ములను తినివేయు లోపులో, ధర్మవేత్తవగు నీవు వచ్చి మమ్ములనిద్దరినీ రక్షింపుము (14).

నందీశ్వర ఉవాచ |

ఇత్థమాక్రందితం శ్రుత్వా తయోశ్చ నృపతీశ్వరః | అతిశీఘ్రం మహావీరస్స యావద్ధనురాదదే || 15

తావదభ్యేత్య శార్దూలస్త్వరమాణో%తిమాయికః | స తస్య ద్విజవర్యస్య మధ్యే జగ్రాహ తాం వధూమ్‌ || 16

హే నాథ నాథ హే కాంత హా శంభో హా జగద్గురో | ఇతి రోరూయమానాం తా వ్యాఘ్రో జగ్రాస భీషణః || 17

తావత్స రాజా నిశితైర్భల్లై ర్వ్యాఘ్ర మతాడయత్‌ | న స తైర్వివ్యధే కించిత్‌ గిరీంద్ర ఇవ వృష్టిభిః || 18

స శార్దూలో మహాసత్వో రాజ్ఞసై#్స్వరకృత వ్యథః | బలాదాకృప్య తాం నారీ మపాక్రామత సత్వరః || 19

వ్యాఘ్రేణాపహృతాం నారీం వీక్ష్య విప్రో%తి విస్మితః | లౌకికీం గతిమాశ్రిత్య రురోదాతి ముహుర్ముహుః || 20

రుదిత్వా చిరకాలం చ స విప్రో మాయయే శ్వరః | భద్రాయుషం మహీపాలం ప్రోవాచ మదహారకః || 21

నందీశ్వరుడిట్లు పలికెను-

వారిద్దరి ఈ ఆర్తనాదమును విని మహావీరుడగు ఆ మహారాజు మహావేగముతో ధనస్సును తీసుకొనెను (15). కాని ఇంతలోనే మాయామయమగు ఆ పెద్దపులి వేగముగా వచ్చి మహారాజునకు, బ్రాహ్మణోత్తమునకు మధ్యలోనున్న ఆతని భార్యను ఎత్తుకొని పోయెను (16). హే నాథా! నాథా ! ప్రియా! హే శంభూ! హే జగద్గురూ! అని కేకలు పెడుతూ ఏడ్చుచున్న ఆమెను ఆ భయంకరమగు పెద్దపులి భక్షించివేసెను (17). అదే సమయములో ఆ రాజు వాడి బాణములతో పులిని కొట్టెను. కాని వర్షధారలు పర్వతమునకు వలె, ఆ బాణములు పెద్ద పులికి లేశ##మైననూ వ్యథను కలిగించలేదు (18). మహాబలము గల ఆ పెద్దపులి రాజుయొక్క బాణములను లెక్క చేయకుండగా శీఘ్రముగా ఆ యువతిని బలాత్కారముగా లాగుకొనుచూ, అక్కడనుండి వెడలెను (19). పెద్దపులి తన భార్యను అపహరించుచుండగా గాంచి, ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆశ్చర్యమును పొందెను. ఆ శివుడు లోకపు పోగడ ననుసరించి అనేక పర్యాయములు బిగ్గరగా రోదిల్లెను (20). గర్వమునడంచువాడగు శివుడు మాయచే ఆ బ్రాహ్మణరూపములో నున్నవాడై చిరకాలము దుఃఖించి భద్రాయుష మహారాజుతో నిట్లనెను (21).

ద్విజేశ్వర ఉవాచ |

రాజన్‌ క్వ తే మహాస్త్రాణి క్వ తే త్రాణం మహద్ధనుః | క్వ తే ద్వాదశ సాహస్రమహానాగాయుతం బలమ్‌ || 22ఔ

కిం తే ఖడ్గేన శంఖేన కిం తే మంత్రాస్త్ర విద్యయా | కిం సత్త్వేన మహాస్త్రాణాం కిం ప్రభావేణ భూయసా || 23

తత్సర్వం విఫలం జాతం యచ్చాన్యత్త్వయి తిష్ఠతి | యస్త్వం వనౌకసాం ఘాతం న నివారయితుం క్షమః || 24

క్షత్త్రస్యాయం పరోధర్మో క్షతాచ్చ పరిరక్షణమ్‌ | తస్మిన్‌ కులోచితే ధర్మే నష్టే త్వ జ్జీవితేన కిమ్‌ || 25

ఆర్తానాం శరణాప్తానాం త్రాణం కుర్వంతి పార్థివాః | ప్రాణౖరర్థైశ్చ ధర్మజ్ఞాస్తద్వినా చ మృతో పమాః || 26

ఆర్తత్రాణ విహీనానాం జీవితాన్మరణం వరమ్‌ | ధనినాం దానహీనానాం గార్హ స్థ్యాద్భిక్షుతా వరమ్‌ || 27

వరం విషాశనం ప్రాజ్ఞైర్వరమగ్ని ప్రవేశనమ్‌ | కృపణానామనాథానాం దీనానామపరక్షణాత్‌ || 28

ద్విజేశ్వరుడిట్లు పలికెను-

ఓ రాజా! నీ గొప్ప అస్త్రములు ఎక్కడనున్నవి? ఇతరులను రక్షించే నీ గొప్ప ధనస్సు ఏది? పన్నెండు వేల పెద్ద ఏనుగులతో సమానమగు నీ బలము ఎక్కడ? (22) నీ వద్దనున్న ఖడ్గముతో గాని, శంఖముతో గాని, మంత్రములతోగాని, అస్త్రవిద్యతో గాని, అస్త్రముల ప్రభావముతో గాని గొప్ప మహిమతో గాని ప్రయోజనమేమి గలదు? (23) అది అంతయూ వ్యర్థమైనది. ఇవి గాక ఇంకనూ నీవద్ద విద్యలు ఉన్నచో అవి కూడ వ్యర్థమైనవి. ఏలయన, నీవు వనములో నివసించువారిని ఆపదనుండి రక్షించలేకపోతివి (24). ఆపదలో నున్న వారిని రక్షించుట క్షత్రియులకు శ్రేష్ఠమగు ధర్మము. కులోచితమగు ఆ ధర్మము నశించిన తరువాత నీవు జీవించి ఉపయోగమేమున్నది? (25) ఆపదలోనుండి శరణు జొచ్చినవారిని ధర్మమునెరింగిన రాజులు తమ ప్రాణములను మరియు సంపదలను బలిపెట్టియైననూ రక్షించెదరు. అట్లు రక్షించనివారు మరణించిన వారితో సమానమగుదురు (26). కష్టములో నున్న వారిని రక్షించలేని జీవితము కంటే మరణము శ్రేష్ఠము. ధనము ఉండియు దానము చేయని గృహస్థాశ్రమము కంటే బిచ్చమెత్తుకొనుట మేలు (27). దీనులను, అనాథలను రక్షించలేక పోయినచో, ప్రాజ్ఞుడగు రాజు విషమును మ్రింగి లేక అగ్నిలో ప్రవేశించి మరణించుట మేలు అగును (28).

నందీశ్వర ఉవాచ|

ఇత్థం విలపితం తస్య స్వవీర్యస్య చ గర్హణమ్‌ | నిశమ్య నృపతి శ్శోకాదాత్మన్యేవ మచింతయత్‌ || 29

అహో మే పౌరుషం నష్టమద్య దైవవిపర్యయాత్‌ | అద్య కీర్తిశ్చ మే నష్టా పాతకం ప్రాప్తముత్కటమ్‌ || 30

ధర్మః కులోచితో నష్టో మందభాగ్యస్య దుర్మతేః | నూనం మే సంపదో రాజ్యమాయుష్యం క్షయమేష్యతి || 31

అద్య చైనం ద్విజన్మానం హతదారం శు చార్దితమ్‌ | హతశోకం కరిష్యామి దత్త్వా ప్రాణానతి ప్రియాన్‌ || 32

ఇతి నిశ్చిత్య మనసా స భద్రాయుర్నృపోత్తమః | పతిత్వా పాదయోస్తస్య బభాషే పరి సాంత్వయన్‌ || 33

నందీశ్వరుడిట్లు పలికెను-

తన పరాక్రమమును నిందిస్తూ ఆ బ్రాహ్మణుడు దుఃఖించుటను గాంచి ఆతని మాటలను విని ఆ రాజు శోకముతో తన మనస్సులో నిట్లు తలంచెను (29). అయ్యో! దైవము ప్రతికూలించుటచే ఈనాడు నా పౌరుషము, కీర్తి నశించి, ఘోరమగు పాపము చుట్టుకున్నది (30). దురదృష్టవంతుడను, దుర్బుద్ధిని అగు నా క్షత్రియకులోచితమగు ధర్మము నశించినది. నా సంపదలు, రాజ్యము, ఆయుర్దాయము నిశ్చయముగా క్షీణించి పోవును (31). ఈనాడు భార్యను పోగొట్టుకొని దుఃఖ పీడితుడైయున్న ఈ బ్రాహ్మణుని నేను మిక్కిలి ప్రియమగు ప్రాణములనర్పించి యైననూ శోకవిముక్తిని చేసెదను (32). ఆ భద్రాయు మహారాజు మనస్సులో నిట్లు నిశ్చయించుకొని ఆ బ్రాహ్మణుని పాదములపై బడి ఓదార్చుతూ నిట్లు పలికెను (33).

భద్రాయురువాచ |

కృపాం కృత్వా మయి బ్రహ్మన్‌ క్షత్రబంధౌ హతౌజసి | శోకం త్యజ మహాప్రాజ్ఞ దాస్యామ్యద్య తు వాంఛితమ్‌ || 34

ఇదం రాజ్యమియం రాజ్ఞీ మమేదం చ కలేవరమ్‌ | త్వదధీనమిదం సర్వం కిం తే%భిలషితం వరమ్‌ || 35

భద్రాయువు ఇట్లు పలికెను-

ఓ బ్రహ్మా! భగ్నమైన పరాక్రమము గల క్షత్రియాధముడనగు నాయందు దయను చూపుము. ఓ మహాబుద్ధిశాలీ ! శోకమును విడిచిపెట్టుము. నీవు కోరిన దానిని ఇపుడే ఇచ్చెదును (34). ఈ రాజ్యము, ఈ మహారాణి, ఈ నా దేహము అన్నీ నీ ఆధీనములో నున్నవి. నీవు ఏమి వరమును కోరుచున్నావు? (35).

బ్రాహ్మణ ఉవాచ|

కిమాదర్శేన చాంధస్య కిం గృహైర్భైక్ష్యజీవినః | కిం పుస్తకేన మూఢస్య నిస్త్స్రీ కస్య ధనేన కిమ్‌ || 36

అతో%హం హతపత్నీకో భుక్తభోగో న కర్హిచిత్‌ | ఇమాం తవాగ్రమహిషీం కామయే దీయతామితి || 37

బ్రాహ్మణుడిట్లు పలికెను-

గ్రుడ్డివానికి అద్దముతో పనియేమి? భిక్షాటనముతో జీవించు వానికి ఇంటితో పని యేమి? మూర్ఖునకు పుస్తకముతో పనియేమి? భార్యలేని వానికి ధనముతో పనియేమి? (36) నాభార్య అపహరింపబడినది. నేను ఎన్నడైననూ భోగముల ననుభవించలేదు. నేను ఈ నీ పట్టమహిషిని కామించుచున్నాను. ఆమెను నాకు ఇమ్ము (37).

భద్రాయురావాచ |

దాతా రసాంతవిత్తస్య రాజ్యస్య గజవాజినామ్‌ | ఆత్మదేహస్య కస్యాపి కలత్రస్య న కర్హిచిత్‌ || 38

పరదారోపభోగేన యత్పాపం సముపార్జితమ్‌ | న తత్‌ క్షాలయితుం శక్యం ప్రాయశ్చిత్త శ##తైరపి || 39

భద్రాయువు ఇట్లు పలికెను-

రాజ్యమును, ఏనుగులను, గుర్రములను, నా దేహమును కూడా ఇచ్చెదను. కాని ఎట్టి పరిస్థితులలోనైననూ, ఎవనికైననూ భార్యను ఈయను (38). పరభార్యా సంభోగమువలన లభించే పాపమును వందప్రాయశ్చిత్తములైననూ క్షాళన చేయజాలవు (39).

బ్రాహ్మణ ఉవాచ |

ఆస్తాం బ్రహ్మవధం ఘోరమపి మద్య నిషేవణమ్‌ | తపసా విధమిష్యామి కిం పునః పారదారికమ్‌ || 40

తస్మాత్ర్పయచ్ఛ భార్యాం స్వామిమాం కామో న మే %పరః | అరక్షణాద్భయార్తానాం గంతాసి నిరయం ధ్రువమ్‌ || 41

బ్రాహ్మణుడిట్లు పలికెను-

ఆ విషయమును అట్లు ఉండనిమ్ము. భయంకరమగు బ్రహ్మహత్యాపాపమును, మద్యపాన పాపమును నేను తపశ్శక్తిచే నశింపచేయగలను. పరదారా భిగమనము గురించి చెప్పునది యేమున్నది? (40) కావున, నీ ఈ భార్యను నాకు ఇమ్ము. నాకు మరియొక కోరిక లేదు. భయపీడితులైన వారిని రక్షించని నీవు నరకమును పొందుట నిశ్చయము (41).

నందీశ్వర ఉవాచ |

ఇతి విప్రగిరా భీతశ్చింతయామాస పార్థివః | అరక్షణాన్మహాపాపం పత్నీదానం తతో వరమ్‌ || 42

అతః పత్నీం ద్విజాగ్ర్యాయ దత్త్వా నిర్ముక్తకిల్బిషః | సద్యో వహ్నిం ప్రవేక్ష్యామి కీర్తిశ్చ విదితా భ##వేత్‌ || 43

ఇతి నిశ్చత్య మనసా సముజ్జ్వాల్య హుతాశనమ్‌ | తమాహూయ ద్విజం చక్రే పత్నీదానం సహోదకమ్‌ || 44

స్వయం స్నాతశ్శుచిర్భూత్వా ప్రణమ్య విబుధేశ్వరాన్‌ | తమగ్నిం త్రిః పరిక్రమ్య శివం దధ్యౌ సమాహితః || 45

తమథాగ్నిం పతిష్యంతం స్వపదాసక్త చేతసమ్‌ | ప్రత్యషేధత విశ్వేశః ప్రాదుర్భూతో ద్విజేశ్వరః || 46

తమీశ్వరం పంచముఖం త్రినేత్రం పినాకినం చంద్రకలావతంసమ్‌ |

ప్రలంబపింగాసు జటాకలాపం మధ్యాహ్న సద్భాస్కర కోటి తేజసమ్‌ || 47

మృణాల గౌరం గజచర్మవాససం గంగా తరంగోక్షిత మౌలి దేశకమ్‌ |

నాగేంద్రహారావళి కంఠభూషణం కిరీట కాంచ్యంగద కంకణోజ్జ్వలమ్‌ || 48

శూలాసిఖట్వాంగ కుఠారచర్మమృగాభయాష్టాంగ పినాకహస్తమ్‌ |

వృషోపరిస్థం శితికంఠ భూషణం ప్రోద్భూతమగ్రే నృపతి ర్దదర్శ || 49

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆ బ్రాహ్మణుని ఈ వచనములకు భయపడిన మహారాజు ఇట్లు తలపోసెను: ఆమెను రక్షించలేకపోవుట మహాపాపము. కావున భార్యను సమర్పించుటయే మేలు (42). కావున భార్యను ఈ బ్రాహ్మణశ్రేష్ఠునకు సమర్పించి, నేను పాపము నుండి విముక్తిని పొంది, వెనువెంటనే అగ్నిలో ప్రవేశించెదను. నా కీర్తి నలుదెసలయందు వ్యాపించగలదు (43). అతడిట్లు మనస్సులో నిశ్చయించుకొని, అగ్నిని ప్రజ్వరిల్ల జేసి, ఆ బ్రాహ్మణుని పిలిచి, నీటిని వదలి భార్యను సమర్పించెను (44). ఆయన అపుడు తాను స్నానము చేసి శుచియై శ్రేష్ఠులగు విద్వాంసులకు ప్రణమిల్లి మనస్సును శివునిపై ఏకాగ్రము చేసి అగ్నికి ముమ్మారు ప్రదక్షిణము చేసెను (45). తన పాదములయందు మనస్సును లగ్నము చేసి అగ్నిలో పడబోవుచున్న ఆ మహారాజును, బ్రాహ్మణ శ్రేష్ఠుని రూపములో నున్న విశ్వేశ్వరుడు ఆ విర్భవించి పట్టుకొని నిలిపివేసెను (46). అయిదు మోములవాడు, మూడు కన్నులవాడు, పినాకమనే ధనస్సును ధరించినవాడు, చంద్రవంకయే శిరోభూషణముగా గలవాడు, వ్రేలాడే పింగవర్ణముగల సుందరమైన జటా జూటము గలవాడు, కోటి ప్రచండ మధ్యాహ్న సూర్యులతో సమమగు కాంతి గలవాడు (47). తామరతూడువలె గౌరవర్ణము గలవాడు, గజ చర్మమును వస్త్రముగా దాల్చినవాడు, గంగా తరంగములతో తడుపబడుచున్న శిరోభాగము గలవాడు, అనేక సర్పములను కంఠహారములుగా దాల్చినవాడు, కిరీటము కాంచి అంగదములు మరియు కంకణములతో వెలిగి పోవుచున్నవాడు (48). శూలము ఖడ్గము ఖట్వాంగము గొడ్డలి డాలు మృగము అభయముద్ర వరదముద్ర మరియు పినాకము అనువాటిని చేతులతో దాల్చినవాడు, వృషభమునధిష్ఠించి యున్నవాడు, తెల్లని కంఠాభరణములు గలవాడు అగు ఈశ్వరుడు తన ఎదుట ఆవిర్భవించగా ఆ మహారాజు గనెను (49).

తతోంబరాద్ద్రుతం పేతుర్దివ్యాః కుసుమవృష్టయః | ప్రణదుర్దేవతూర్యాణి దేవ్యశ్చ ననృతుర్జగుః || 50

తత్రాజగ్ముస్త్సూ యమానా హరిర్బ్రహ్మా తథా సురాః | ఇంద్రాదయో నారదాద్యా మునయశ్చాపరే%పి చ || 51

తదోత్సవో మహానాసీత్తత్ర భక్తి ప్రవర్ధనః | సతి పశ్యతి భూపాలే భక్తి నమ్రీకృతాంజలౌ || 52

తద్దర్శనానందవిజృంభితాశయః ప్రవృద్ధబాష్పాంబువిలిప్తగాత్రః |

ప్రహృష్టరోమా స హి గద్గదాక్షరస్త్సు ష్టావ గీర్భిర్ముకులీకృతాంజలిః || 53

తతస్స భగవాన్‌ రాజ్ఞా సంస్తుతః పరమేశ్వరః | ప్రసన్నస్సహ పార్వత్యా తమువాచ దయానిధిః || 54

రాజంస్తే పరితుష్టో%హం భక్త్యా త్వద్ధర్మతో%ధికమ్‌ | వరం బ్రూహి సపత్నీకం ప్రయచ్ఛామి న సంశయః || 55

తవ భావ పరీక్షార్థం ద్విజో భూత్వాహమాగతః | వ్యాఘ్రేణ యా పరిగ్రస్తా సాక్షాద్దేవీ శివా హి సా || 56

వ్యాఘ్రో మాయామయో యస్తే శ##రైరక్షతవిగ్రహః | ధీరతాం ద్రష్టుకామస్తే పత్నీం యాచితవానహమ్‌ || 57

ఇత్యాకర్ణ్య ప్రభోర్వాక్యం స భద్రాయుర్మహీపతిః | పునః ప్రణమ్య సంస్తూయ స్వామినం నతకో%బ్రవీత్‌ || 58

అపుడు ఆకాశమునుండి దివ్యమగు పుష్పవృష్టి కురిసినది. దేవదుందుభులు మ్రోగినవి. దేవతాస్త్రీలు గానము చేసి నాట్యమాడిరి (50). విష్ణువు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు, నారదదాది మహర్షులు మరియు ఇతరులు కూడ స్తోత్రములను చేయుచూ అచటకు విచ్చేసిరి (51). అపుడు భక్తితో వినయముతో చేతులను జోడించి మహారాజు చూచుచుండగా అచట భక్తిని పెంపొందింప చేయు గొప్ప ఉత్సవము జరిగెను (52). శివుని దర్శనమువలన కలిగిన ఆనందముతో నిండియున్న హృదయము గలవాడు, కళ్లవెంబడి జారిన ఆనందబాష్పములతో తడిసిన అవయవములు గలవాడు, రోమాంచము గద్గదమగు కంఠము గలవాడునగు ఆ రాజు చేతులను జోడించి వాక్కులతో భగవానుని స్తుతించెను (53). పార్వతీ సమేతుడు, దయాసముద్రుడు, పరమేశ్వరుడునగు శివభగవానుడు రాజుయొక్క స్తోత్రముచే మిక్కిలి ప్రసన్నుడై అపుడాతనితో నిట్లనెను (54). ఓ రాజా! నీ భక్తికి, నీ ధర్మబుద్ధికి నేను చాల సంతసించితిని. భార్యతో గూడి వరమును కోరుకొనుము. నిస్సందేహముగా నిచ్చెదను (55). నేను నీ హృదయమును పరీక్షించుట కొరకై బ్రాహ్మణవేషములో వచ్చితిని. పెద్దపులిచే అపహరింపబడిన యువతి సాక్షాత్తుగా పార్వతియే (56). ఆ పెద్దపులి మాయచే సృష్టింపబడినది. అందువలననే, నీ బాణములు దానికి హానిని చేయలేక పోయినవి. నేను నీ ధైర్యమును పరీక్షింపగోరి, నీ భార్యను ఇమ్మని అడిగితిని (57). ఆ భద్రాయు మహారాజు శివప్రభుని ఈ మాటలను విని, మరల ఆ ప్రభునికి ప్రణమిల్లి చక్కగా స్తుతించి ఇట్లు పలికెను (58).

భద్రాయురువాచ |

ఏక ఏవ వరో నాథ యద్భవాన్‌ పరమేశ్వరః | భవతాపప్రతప్తస్య మమ ప్రత్యక్షతాం గతః || 59

యద్దదాసి పునర్నాథ వరం స్వకృపయా ప్రభో | వృణ%హం పరమం త్యక్తో వరం హి వరదర్షభాత్‌ || 60

వజ్రబాహుః పితా మే హి సపత్నీకో మహేశ్వర | సపత్నీకస్త్వహం నాథ సదా త్వత్పాదసేవకః || 61

వైశ్యః పద్మాకరో నామ తత్పుత్రస్సునయాభిధః | సర్వానేతాన్మహేశాన సదా త్వం పార్శ్వగాన్‌ కురు || 62

భద్రాయువు ఇట్లు పలికెను-

ఓ నాథా! సంసార తాపముచే పీడితుడనై యున్న నా యెదుట పరమేశ్వరుడవగు నీవు ప్రత్యక్షమైతివి. ఇదియే శ్రేష్ఠమగు వరము (59). ఓ ప్రభూ! కాని, వరములనిచ్చు వారిలో శ్రేష్ఠుడవగు నీవు నీ కృపతో వరమును ఇచ్చుచున్నావు గాన, నేను నిన్ను ఒకే వరమును కోరెదను (60). ఓ మహేశ్వరా! నా తండ్రియగు వజ్రబాహుడు, నా తల్లి, సర్వదా నీ పాదములను సేవించే నేను, నా భార్య (61), పద్మాకరుడను వైశ్యుడు, సునయుడను ఆతని కుమారుడు అనే ఈ ఆర్గురినీ సర్వదా నీ ప్రక్కన ఉండు వారినిగా అనుగ్రహించుము (62).

నందీశ్వర ఉవాచ |

అథ రాజ్ఞీ చ తత్పత్నీ ప్రమత్తా కీర్తి మాలినీ | భక్త్యా ప్రసాద్య గిరిశం యయాచే వరముత్తమమ్‌ || 63

నందీశ్వరుడిట్లు పలికెను-

తరువాత ఆతని భార్య, మహారాణియగు కీర్తిమాలిని మిక్కిలి ఆనందించినదై భక్తితో శివుని ప్రసన్నము చేసుకొని ఉత్తమమగు వరమును కోరెను (63).

రాజ్ఞ్యువాచ |

చంద్రాంగదో మమ పితా మాతా సీమంతినీ చ మే | తయోర్యాచే మహాదేవ త్వత్పార్శ్వే సన్నిధిం ముదా || 64

రాణి ఇట్లు పలికెను-

ఓ మహాదేవా! నా తండ్రియగు చంద్రాంగదునకు, తల్లియగు సీమంతినికి నీ సన్నిధిలో నీ ప్రక్కన ఆనందముగా ఉండే వరమును ఇమ్మని కోరుచున్నాను (64).

నందీశ్వర ఉవాచ |

ఏవమస్త్వితి గౌరీశః ప్రసన్నో భక్తవత్సలః | తయోః కామవరం దత్త్వా క్షణాదంతర్హితో%భవత్‌ || 65

భద్రాయురపి సుప్రీత్యా ప్రసాదం ప్రాప్య శూలినః | సహితః కీర్తి మాలిన్యా ఋభుజే విషయాన్‌ బహూన్‌ || 66

కృత్వా వర్షాయుతం రాజ్యమవ్యాహతపరాక్రమః | రాజ్యం విక్షిప్య తనయే జగామ శివసన్నిధిమ్‌ || 67

చంద్రాంగదో%పి రాజేంద్రో రాజ్ఞీ సీమంతినీ చ సా | భక్త్యా సంపూజ్య గిరిశం జగ్మతుశ్శాంభవం పదమ్‌ || 68

ద్విజేశ్వరావతారస్తే వర్ణితః పరమో మయా | మహేశ్వరస్య భద్రాయు పరమానందదః ప్రభో || 69

ఇదం చరిత్రం పరమం పవిత్రం శివావతారస్య పవిత్రకీర్తేః |

ద్విజేశసంజ్ఞస్య మహాద్భుతం హి శృణ్వన్‌ పఠన్‌ శంభుపదం ప్రయాతి || 70

య ఇదం శృణుయాన్నిత్యం శ్రావయేద్వా సమాహితః | న శ్చోతతి స్వధర్మాత్స పరత్ర లభ##తే గతిమ్‌ || 71

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్రసంహితాయాం ద్విజే శ్వరావతార వర్ణనం నామ సప్తవింశో%ధ్యాయః (27).

నందీశ్వరుడిట్లు పలికెను-

భక్తవత్సలుడగు పార్వతీపతి ప్రసన్నుడై 'అటులనే యగుగాక!' అని పలికి, వారు కోరిన వరములనిచ్చి క్షణములో అంతర్థానమును చెందెను (65). భద్రాయువు పరమేశ్వరుని అనుగ్రహమును పొంది, కీర్తిమాలినితో కలిసి అనేక భోగములను మిక్కిలి ప్రీతితో అనుభవించెను (66). ఎదురులేని పరాక్రమముగల ఆ మహారాజు పదివేల సంవత్సరముల కాలము రాజ్యమేలి, రాజ్యమును కుమారునకు అప్పచెప్పి, శివుని సన్నిధిని చేరుకొనెను (67). చంద్రాంగద మహారాజు మరియు మహారాణి యగు సీమంతిని భక్తితో శివుని పూజించి శంభుని పదమును చేరుకొనిరి (68). ఓ ప్రభూ! భద్రాయువునకు పరమానందమునను గ్రహించిన మహేశ్వరుని శ్రేష్ఠమగు ద్విజేశ్వరావతారమును నేను నీకు వర్ణించితిని (69). పవిత్రమగు కీర్తిగల శివుని ఈ ద్విజేశ్వరావతార గాథ మిక్కిలి పావనము, గొప్ప అద్భుతము. దీనిని విన్నవారు, చదివిన వారు శంభుపదమును పొందెదరు (70). ఎవడైతే దీనిని నిత్యము వినునో, శ్రద్ధతో ఇతరులకు వినిపించునో, అట్టివాడు ధర్మమునుండి పతితుడు గాడు. ఆతడు దేహ త్యాగము తరువాత పరమ గతిని పొందును (71).

శ్రీ శివ మహాపురాణములోని శతరుద్రసంహితయందు ద్విజేశ్వరావతారమనే ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది (27).

Siva Maha Puranam-3    Chapters