Siva Maha Puranam-3    Chapters   

అథ షడ్వింశో%ధ్యాయః

వైశ్యనాథ అవతారము

నందీశ్వర ఉవాచ |

శృణు తాత ప్రవక్ష్యామి శివస్య పరమాత్మనః | అవతారం పరానందం వైశ్యనాథహ్వయం మునే || 1

నందిగ్రామే పురా కాచిన్మహానందేతి విశ్రుతా | బభూవ వారవనితా శివభక్తా సుసుందరీ || 2

మహావిభవసంపన్నా సుధనాఢ్యా మహోజ్వలా | నానారత్న పరిచ్ఛిన్న శృంగార రసనిర్భరా || 3

సర్వసంగీత విద్వాసు నిపుణాతి మనోహరా | తస్యా గేయేన హృష్యంతి రాజ్ఞ్యో రాజాన ఏవ చ || 4

సమానర్చ సదా సాంబం సా వేశ్యా శంకరం ముదా | శివనామ జపాసక్తా భస్మరుద్రాక్ష భూషణా || 5

శివం సంపూజ్య సా నిత్యం సేవంతీ జగదీశ్వరమ్‌ | ననర్త పరయా భక్త్యా గాయంతీ శివసద్యశ || 6

రుద్రాక్షై ర్భూషయిత్వైకం మర్కటం చైవ కుక్కుటమ్‌ | కరతాలైశ్చ గీతైశ్చ సదా నర్తయతి స్మ సా || 7

నృత్యమానౌ చ తౌ దృష్ట్వా శివభక్తి రతా చ సా | వేశ్యా స్మ విహసత్యుచ్చైః ప్రేవ్ణూ సర్వసఖీయుతా || 8

నందీశ్వరుడిట్లు పలికెను-

వత్సా! మునీ! శివపరమాత్మ యొక్క పరమానందఘనమగు వైశ్యనాథావతారమును గూర్చి చెప్పెదను. వినుము (1). పూర్వము నంది గ్రామములో మహానందయను వారవనిత ఒకతె ఉండెడిది. ఆమె గొప్ప సుందరి, మరియు శివభక్తురాలు (2). ఆమె చాల ధనముతో, మరియు గొప్ప వైభవముతో గూడి అద్భుతముగా ప్రకాశించెడిది. అనేకరకముల రత్నములను పొదిగిన ఆభరణములను దాల్చి ఆమె మూర్తీభవించిన శృంగారమువలె నుండెను (3). అతి మనోహారిణియగు ఆమె సంగీత విద్యలన్నిటియందు సమర్థురాలు. ఆమె పాడినచో రాజులు, రాణీలు కూడ హర్షించెడివారు (4). ఆ వేశ్య సర్వదా పార్వతీ సమేతుడగు శంకరుని ఆనందముతో కొలిచెడిది. ఆమె భస్మను, రుద్రాక్షలను ఆభరణములుగా దాల్చి శివనామమును జపించుటయందు ఆసక్తి కలిగి యుండెడిది (5). ఆమె నిత్యము జగదీశ్వరుడగు శివుని పూజించి సేవించి శివుని పవిత్రకీర్తిని పరమ భక్తితో గానము చేయుచూ నాట్యము చేసెడిది (6), ఆమె ఒక కోతిని, కోడిని రుద్రాక్షలతో అలంకరించి చప్పట్లతో మరియు పాటలతో ఎల్లవేళలా వాటిచే నాట్యము చేయించెడిది (7). శివభక్తి పరాయణురాలగు ఆ వేశ్య సఖురాండ్రందరితో గూడి వాటి నాట్యమును చూచి ప్రేమతో బిగ్గరగా నవ్వెడిది (8).

రుద్రాక్షైః కృతకేయూర కర్ణా భరణమండనః | మర్కట శ్శిక్షయా తస్యాః పురోనృత్యతి బాలవత్‌ || 9

శిఖాసంబద్ధరుద్రాక్షః కుక్కుటః కపినా సహ | నిత్యం న నర్త నృత్యజ్ఞః పశ్యతాం హితమావహన్‌ || 10

ఏవం సా కుర్వతీ వేశ్యా కౌతుకం పరమాదరాత్‌ | శివభక్తిరతా నిత్యం మహానందభరా%భవత్‌ || 11

శివభక్తిం ప్రకుర్వంత్యా వేశ్యాయా ముని సత్తమ | బహుకాలో వ్యతీయాయ తస్యాః పరమసౌఖ్యతః ||12

ఏకదా చ గృహే తస్యావైశ్యో భూత్వా శివస్స్వయమ్‌ | పరీక్షితుం చ తద్భావమాజగామ శుభో వ్రతీ || 13

త్రిపుండ్రవిలసద్భాలో రుద్రాక్షాభరణః కృతీ | శివనామజపాసక్తో జటిలశ్శైవవేషభృత్‌ || 14

స బిభ్రద్భస్మ నిచయం ప్రకోష్ఠే వరకంకణమ్‌ | మహారత్న పరిస్తీర్ణం రాజతే పరకౌతుకీ || 15

తమాగతం సుసంపూజ్య సా వేశ్యా పరయా ముదా | స్వస్థానే సాదరం వైశ్యం సుందరీ హి న్యవేశయత్‌ || 16

తత్ర్పకోష్ఠే వరం వీక్ష్య కంకణం సుమనోహరమ్‌ | తస్మిన్‌ జాతస్సృహా సా చ తం ప్రోవాచ సువిస్మితా || 17

రుద్రాక్షలచే చేయబడిన కేయూరము, కర్ణాభరణము ఇత్యాది ఆభరణములను దాల్చి ఆ కోతి ఆమె ఎదుట శిక్షణను పొంది బాలుని వలె నాట్యమాడెడిది (9). శిఖపై కట్టబడిన రుద్రాక్షగల కోడి కూడా కోతితో గలసి నృత్యము నెరింగిన దానివలె ప్రతిదినము చూచువారలకు ఉల్లాసమును కలిగిస్తూ నాట్యమును చేసెడిది (10). ఆ వేశ్య ఈ విధముగా అధికమగు ఉత్సాహముతో ఆదరముతో ప్రతిదినము శివభక్తి పరాయణురాలై మహానందముననుభవించెడిది (11). ఓ మహర్షీ! శివభక్తి యందు లగ్నురాలై ఆ వేశ్య ఉండగా చాల కాలము ఆమెకు చాల సుఖముగా గడిచిపోయెను ((12). ఒకనాడుశివుడు ఆమె భక్తిని స్వయముగా పరీక్షించుటకై శుభకరమగు వ్రతమును పాటించే ఒక వైశ్యుని రూపమును దాల్చి విచ్చేసెను (13). ఆయన త్రిపుండ్రముతో ప్రకాశించే లలాటము గలవాడై, రుద్రాక్షలే ఆభరణములుగా గలవాడై, జటాజుటధారియై, శివనామమును జపించుటయందు ఆసక్తి గలవాడై, కృతార్థుడగు శివభక్తుని వేషమును దాల్చి యుండెను (14). ఆతడు దేహమంతయు భస్మను దాల్చి, మిక్కిలి ఉత్కంఠను రేకెత్తిస్తూ ప్రకాశించెను (15). సుందరియగు ఆ వేశ్య తన ఇంటికి విచ్చేసిన ఆ వైశ్యుని పరమానందముతో సాదరముగా చక్కగా పూజించి కూర్చుండ బెట్టెను (16). ఆతని ముంజేతియందు శ్రేష్ఠమైన మనోహరమగు కంకణమును గాంచి ఆమె మిక్కిలి విస్మయమును పొంది దానియందు ఉదయించిన కోరిక గలదై ఆయనతో నిట్లనెను (17).

మహానందోవాచ |

మహారత్నమయశ్చాయం కంకణస్త్వత్కరే స్థితః | మనో హరతి మే సద్యో దివ్యస్త్రీ భూషణోచితః || 18

మహానంద ఇట్లు పలికెను-

గొప్ప రత్నములు పొదిగినది, దివ్యస్త్రీలు అలంకరించుకొన దగినది అగు ఈ నీ చేతి యందు గల కంకణము నా మనస్సును వెనువెంటనే లాగి వేయుచున్నది (18).

నందీశ్వర ఉవాచ |

ఇతి తాం నవరత్నాఢ్యే సస్పృహాం కరభూషణ | వీక్ష్యోదారమతిర్వైశ్యస్సస్మితం సమభాషత || 19

నందీశ్వరుడిట్లు పలికెను-

నవరత్నములు పొదిగిన ఆ హస్త భూషణమునందు కోరిక గల ఆమెను గాంచి ఆ వైశ్యుడు పెద్ద మనస్సు గలవాడై చిరునవ్వుతో నిట్లు పలికెను (19).

వైశ్యనాథ ఉవాచ|

అస్మిన్‌ రత్నవరే దివ్యే యది తే సస్సృహం మనః | త్వమేవాధత్స్వ సుప్రీత్యా మౌల్యమస్య దదాసి కిమ్‌ || 20

వైశ్యనాథుడు పలికెను-

రత్నములు పొదిగిన ఈ దివ్యాభరణముపై నీ మనస్సునందు కోరిక యున్నచో, నీవే దీనిని ప్రీతితో ధరించుము. దీనికి నీవు ఏమి వెలను ఇచ్చెదవు? (20)

వేశ్యోవాచ |

వయం హి సై#్వరచారిణ్యో వేశ్యాస్తు న పతి వ్రతాః | అస్మత్కులోచితో ధర్మో వ్యభిచారో న సంశయః || 21

యద్యేతదఖిలం చిత్తం గృహ్ణాతి కరభూషణమ్‌ | దినత్రయమహోరాత్రం పత్నీ తవ భవామ్యహమ్‌ || 22

వేశ్య ఇట్లు పలికెను-

మేము స్వేచ్ఛా సంచారులమగు వేశ్యలమే గాని, పతివ్రతలము గాము. వ్యభిచారము మా కులమునకు అనురూపమైన ధర్మమనుటలో సందేహము లేదు (21). ఇది నీకు అంగీకారమై నామనస్సునకు నచ్చిన ఈ హస్త భూషణమున నాకు ఇచ్చినచో, నేను నీకు మూడు రాత్రులు, మూడు పగళ్లు భార్యను కాగలను (22).

వైశ్య ఉవాచ |

తథాస్తు యది తే సత్యం వచనం వీరవల్లభే | దదామి రత్నవలయం త్రిరాత్రం భవ మే వధూః || 23

ఏతస్మిన్‌ వ్యవహారే తు ప్రమాణం శశిభాస్కరౌ | త్రివారం సత్యమిత్యుక్త్వా హృదయం మే స్పృశ ప్రియే || 24

వైశ్యుడిట్లు పలికెను-

వీరులచే ప్రేమించబడే ఓ సుందరీ! అటులనే యగుగాక! నీ మాట సత్యమైనచో రత్నకంకణమును నీకిచ్చెదను. మూడు రాత్రులు నాకు భార్యవు అగుము (23). ఈ ఒప్పందమునకు సూర్యచంద్రులు సాక్షులు. 'సత్యమే' అని ముమ్మారు పలుకుము. ఓ ప్రియురాలా! తరువాత నా హృదయమును స్పృశించుము (24).

వేశ్యోవాచ |

దినత్రయ మహోరాత్రం పత్నీ భూత్వా తవ ప్రభో | సహధర్మం చరామీతి సత్యం సత్యం న సంశయః || 25

వేశ్య ఇట్లు పలికెను-

ఓ ప్రభూ! నేను మూడు రోజులు రాత్రింబగళ్లు నీకు భార్యనై సహధర్మ చారిణిని అగుదును. ఇది ముమ్మాటికి సత్యము. సంశయము లేదు (25).

నందీశ్వర ఉవాచ|

ఇత్యుక్త్వా హి మహానందా త్రివారం శశి భాస్కరౌ | ప్రమాణీకృత్య సుప్రీత్యా సా తద్ధృదయమస్పృశత్‌ || 26

అథ తసై#్య స వైశ్యస్తు ప్రదత్వా రత్న కంకణమ్‌ | లింగం రత్నమయం తస్యా హస్తే దత్వేదమబ్రవీత్‌ || 27

నందీశ్వరుడిట్లు పలికెను-

మహానంది ఇట్లు పలికి సూర్య చంద్రులు సాక్షిగా మూడు మార్లు ప్రతిజ్ఞను చేసి, మిక్కిలి ప్రీతితో ఆతని హృదయమును స్పృశించెను (26). అపుడు ఆ వైశ్యుడు ఆమెకు రత్నకంకణమునిచ్చి ఒక రత్న లింగమును ఆమె చేతికి ఇచ్చి ఇట్లు పలికెను (27).

వైశ్యనాథ ఉవాచ |

ఇదం రత్నమయం లింగంశైవం మత్ర్పాణవల్లభమ్‌ | రక్షణీయం త్వయా కాంతే గోపనీయం ప్రయత్నతః || 28

వైశ్యనాథుడిట్లు పలికెను-

ఓ సుందరీ! ఈ రత్నమయమగు శివలింగము నాకు ప్రాణప్రియమైనది. నీవు దీనిని శ్రద్ధగా దాచి రక్షించుము (28).

నందీశ్వర ఉవాచ|

ఏవమస్త్వితి సా ప్రోచ్య లింగమాదాయ రత్నజమ్‌ | నాట్య మండపికామధ్యే నిధాయ ప్రావిశద్గృహమ్‌ ||29

సా తేన సంగతా రాత్రౌ వైశ్యేన విటధర్మిణా | సుఖం సుష్వాప పర్యంకే మృదుతల్పో పశోభితే || 30

తతో నిశీథ సమయే మునే వైశ్య పతీచ్ఛయా | అకస్మాదుత్థితా వాణీ నృత్యమండపికాంతరే || 31

మహాప్రజ్వలితో వహ్ని స్సుసమీర సహాయవాన్‌ | నాట్యమండపికాం తాత తామేవ సహసావృణోత్‌ || 32

మండపే దహ్యమానే తు సహసోత్థాయ సంభ్రమాత్‌ | మర్కటం మోచయామాస సా వేశ్యా తత్ర బంధనాత్‌ || 33

స మర్కటో ముక్త బంధః కుక్కుటేన సహామునా | భియా దూరం హి దుద్రావ విధూయాగ్నికణాన్‌ బహూన్‌ || 34

స్తంభేన సహ నిర్దగ్ధం తల్లింగం శకలీకృతమ్‌ | దృష్ట్వా వేశ్యా సవైశ్యశ్చ దురంతం దుఃఖమాపతుః || 35

దృష్ట్వా హ్యాత్మసమం లింగం దగ్ధం వైశ్యపతిస్తదా | జ్ఞాతుం తద్భావమంతస్థ్సం మరణాయ మతిం దధౌ || 36

నివిశ్యేతితరాం ఖేదా ద్వైశ్యస్తామాహ దుఃఖితామ్‌ | నానాలీలో మహేశానః కౌతుకాన్నర దేహవాన్‌ || 37

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆమె 'అటులనే' అని పలికి ఆ రత్నలింగమును తీసుకొని నాట్యమండపమధ్యములో నుంచి తాను ఇంటిలోనికివెళ్లెను (29). ఆమె రాత్రి యందు విట స్వభావముతో వచ్చి యున్న ఆ వైశ్యునితో గూడి మెత్తని పరుపులతో శోభిల్లే మంచముపై సుఖముగా నిద్రించెను (30). ఓ మహర్షీ! అపుడు అర్ధరాత్ర సమయమునందు ఆ వైశ్యప్రభుని సంకల్పముచే నృత్యమండపము లోపలనుండి అకస్మాత్తుగా శబ్దము బయల్వెడలెను (31). వత్సా ! పెద్ద జ్వాలలతో గూడిన అగ్ని పెద్ద గాలి తోడు కాగా ఆ నాట్యమండపము నంతనూ శీఘ్రముగా ఆవరించి వేసెను (32). మండపము తగులబడుచుండగా ఆ వేశ్య తొందరపాటుతో నిద్రలేచి శీఘ్రమే అచట ఉన్న కోతిని బంధమునుండి విడిపించెను (33). బంధమునుండి విడిపింపబడిన ఆ కోతి కోడితో కలిసి మీద పడుచున్న అగ్ని కణములను దులుపుకొనుచూ భయముతో దూరముగా పారిపోయెను (34). ఆ లింగము పానువట్టముతో సహా నిప్పులలో కాలి ముక్కలయ్యెను.. దానిని చూచి ఆ వైశ్యుడు మరియు వేశ్య పట్టరాని దుఃఖముననుభవించిరి (35). ప్రాణప్రియమగు లింగము కాలిపోవుటను గాంచిన ఆ వైశ్యప్రభువు అపుడు ఆమె హృదయములోని భావమును తెలియగోరి మరణించుటకు నిశ్చయించుకొనెను (36). అతిశయించిన దుఃఖముతో ఆ వైశ్యుడు కూర్చుండి పోయెను. అనేక లీలలు గలవాడు, కుతూహలముచే మానవదేహమును దాల్చినవాడు అగు మహేశ్వరుడు దుఃఖితురాలైయున్న ఆమెతో నిట్లనెను (37).

వైశ్యపతిరువాచ|

శివలింగే తు నిర్భిన్నే దగ్ధే మత్ర్పాణ వల్ల భే | సత్యం వచ్మి న సందేహో నాహం జీవితుముత్సహే || 38

చితాం కారయ మే భ##ద్రే స్వభృత్యైస్త్వం వరైర్లఘు | శివే మనస్సమావేశ్య ప్రవేక్ష్యామి హుతాశనమ్‌ || 39

యది బ్రహ్మేంద్రవిష్ణ్వాద్యా వారయేయుస్సమేత్య మామ్‌ | తథాప్యస్మిన్‌ క్షణ భ##ద్రే ప్రవిశామి త్యజామ్యసూన్‌ || 40

వైశ్యునాథుడిట్లనెను-

నాకు ప్రాణప్రియమగు శివలింగము దగ్ధమై పగిలినది. నాకు జీవించవలెననే ఉత్సాహము లేదు. దీనిలో సందియము లేదు. నేను సత్యమును పలుకుచున్నాను (38). ఓ పుణ్యాత్మురాలా! నీవు నీ భృత్యులలో శ్రేష్ఠమైన వారిని నియోగించి శీఘ్రముగా చితిని ఏర్పాటు చేయించుము. నేను శివునియందు మనస్సును నిలిపి అగ్నిలో ప్రవేశించెదను (39). ఓ పుణ్యాత్మురాలా! బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువు మొదలగు వారందరు గూడి వచ్చి నన్ను వారించిననూ, నేను ఇదే క్షణములో అగ్నిని ప్రవేశించి ప్రాణములను విడిచెదను (40).

నందీశ్వర ఉవాచ|

తమేవం దృఢనిర్బంధం సా విజ్ఞాయ సుదుఃఖితా | స్వభృత్యైః కారయామాస చితాం స్వభవనాద్బహిః || 41

తతస్సవైశ్య శ్శివ ఏక ఏవ ప్రదక్షిణీకృత్య సమిద్ధమగ్నిమ్‌ |

వివేశ పశ్యత్సు నరేషు ధీర స్సు కౌతుకీ సంగతి భావమిచ్ఛుః || 42

దృష్ట్వా సా తద్గతిం వేశ్యా మహానందాతి విస్మితా | అనుతాపం చ యువతీ ప్రపేదే మునిసత్తమ || 43

అథ సా దుఃఖితా వేశ్యా స్మృత్వా ధర్మం సునిర్మలమ్‌ | సర్వాన్‌ బంధుజనాన్‌ వీక్ష్య బభాషే కరుణం వచః || 44

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆయన ఇట్లు గట్టిగా పట్టు పట్టగా ఆమె ఆతని దృఢనిశ్చయము నెరింగి మిక్కిలి దుఃఖించి తన భవనమునకు బయట తన సేవకులచేత చితిని ఏర్పాటు చేయించెను (41). ఆ వైశ్యరూపములో ఉన్న శివుడు మిక్కిలి కుతూహలముతో పుణ్యగతిని కోరువాడై ధైర్యముతో తాను ఒక్కడే ప్రజ్వరిల్లుచున్న ఆ అగ్నికి ప్రదక్షిణము చేసి, తరువాత జనులు చూచుచుండగా దానిలోప్రవేశించెను (42). వేశ్య యగు మహానంద ఆతని అగ్ని ప్రవేశమును గాంచి మిక్కిలి ఆశ్చర్యమును పొందెను. ఓ మహర్షీ! ఆ యువతి తరువాత మహాదుఃఖమును పొందెను (43). అపుడా వేశ్య దుఃఖితురాలై పరమపవిత్రమగు ధర్మమును స్మరించి బంధుజనుల నందరినీ చూచి కరుణతో నిండిన ఈ వచనమును పలికెను (44).

మహానందోవాచ|

రత్నకంకణమాదాయ మయా సత్యముదాహృతమ్‌ | దినత్రయమహం పత్నీ వైశ్యస్యాముష్య సంమతా || 45

కర్మణా మత్కృతేనాయం మృతో వైశ్యశ్శివవ్రతీ | తస్మాదహం ప్రవేక్ష్యామి సహనేన హుతాశనమ్‌ || 46

స్వధర్మచారిణీత్యుక్త మాచార్యై స్సత్యవాదిభిః | ఏవం కృతే మమ ప్రీత్యా సత్యం మయి న నశ్యతు || 47

సత్యాశ్రయః పరో ధర్మ స్సత్యేన పరమా గతిః | సత్యేన స్వర్గమోక్షౌ చ సత్యే సర్వం ప్రతిష్ఠితమ్‌ || 48

మహానంద ఇట్లు పలికెను-

నేను రత్నకంకణమును స్వీకరించి సత్యమును పలికి యుంటిని. నేను మూడు రోజులు ఈ వైశ్యునకు పత్ని యగుటకు అంగీకరించితిని (45). నేను చేసిన పని వలన శివభక్తవరుడగు ఈ వైశ్యుడు మరణించినాడు. కావున అతని వెనుకనే నేను కూడ అగ్నిలో ప్రవేశించెదను (46). నేను అట్లు చేసినచో, సత్యవాదులగు ఆచార్యులు నా గురించి 'ఈమె స్వధర్మమును ఆచరించినది' అని ప్రేమతో పలికెదరు. నాయందు సత్యము నశించకుండు గాక! (47) శ్రేష్ఠమగు ధర్మము సత్యము నాశ్రయించి యుండును. సత్యముచే మానవుడు పరమపదమును పొందును. సత్యముచే స్వర్గమోక్షములు లభించును. సర్వము సత్యమునందు ప్రతిష్ఠితమై యున్నది (48).

నందీశ్వర ఉవాచ|

ఇతి సా దృఢ నిర్బంధా వార్యమాణాపి బంధుభిః | సత్యలోకపరా నీరా ప్రాణాంస్త్యక్తుం మనో దధే || 49

సర్వస్వం ద్విజముఖ్యేభ్యో దత్తా ధ్యాత్వా సదాశివమ్‌ | తమగ్నిం త్రిః పరిక్రమ్య ప్రవేశాభిముఖీ హ్యభూత్‌ || 50

తాం పతంతీం సమిద్ధే%గ్నౌ స్వపదార్పితమానసామ్‌ | వారయామాస విశ్వాత్వా ప్రాదుర్భూతస్స వై శివః || 51

సా తం విలో క్యాఖిల దేవదేవం త్రిలోచనం చంద్రకలావతంసమ్‌ |

శశాంక సూర్యానల కోటి భాసం స్తబ్ధేవ భీతేవ తథైవ తస్థౌ || 52

తాం విహ్వలాం సువిత్రస్తాం వేపమానాం జడీకృతామ్‌ | సమాశ్వాస్య గలద్బాష్పాం కరౌ ధృత్వా% బ్రవీద్వచః || 53

నందీశ్వరుడిట్లు పలికెను-

సత్యమును మాత్రమే దర్శించుటయందు నిమగ్నురాలైన ఆ యువతి ఇట్లు దృఢముగా నిశ్చయించుకున్నదై, బంధువులు వారించుచున్ననూ, ప్రాణములను విడిచి పెట్టుటకు నిర్ణయించుకొనెను (49). ఆమె తన సర్వ సంపదలను శ్రేష్ఠులగు బ్రాహ్మణులకు దానము చేసి సదాశివుని ధ్యానించి ఆ అగ్నికి ముమ్మారు ప్రదక్షిణము చేసి దానిలో ప్రవేశించుటకు సంసిద్ధురాలయ్యెను (50). తనయందు మనస్సును అర్పించి ప్రజ్వరిల్లే అగ్నియందు పడబోవుచున్న ఆమెను, విశ్వస్వరూపుడగు ఆ శివుడు ఆవిర్భవించి నివారించెను (51). దేవతలందరికీ దేవుడు, ముక్కంటి, చంద్రకళ శిరోభూషణముగా గలవాడు, కోట్లాది చంద్రుల, సూర్యుల మరియు అగ్నుల కాంతి గలవాడు నగు ఆ శివుని గాంచి ఆమె స్తంభించినదా యన్నట్లు, భయపడినదా యన్నట్లు అటులనే నిలబడి యుండెను (52). దుఃఖముతో మరియు భయముతో వణికి పోతూ స్తబ్ధురాలై నిలబడి కళ్లవెంబడి బాష్పములను కార్చుచున్న ఆమెను ఓదార్చి చేతులను పట్టుకొని శివుడిట్లు పలికెను (53).

శివ ఉవాచ |

సత్యం ధర్మం చ ధైర్యం చ భక్తిం చ మయి నిశ్చలామ్‌ | పరీక్షితుం త్వత్సకాశం వైశ్యీభూత్వా% హమాగతః || 54

మాయయాగ్నిం సముద్దీప్య దగ్ధం తే నాట్యమండపమ్‌ | దగ్ధం కృత్వా రత్నలింగం ప్రవిష్టో%హ హుతాశనమ్‌ || 55

సా త్వం సత్యమనుస్మృత్య ప్రవిష్టా గ్నిం మయా సహ | అతస్తే సంప్రదాస్యామి భోగాంస్త్రి దశదుర్లభాన్‌ || 56

యద్యదిచ్ఛ సి సుశ్రోణి తదేవ హి దదామి తే | త్వద్భక్త్యా%హం ప్రసన్నో%స్మి తవాదేయం న విద్యతే || 57

శివుడిట్లు పలికెను-

నేను నీయందు సత్యమును, ధర్మమును, నాపై గల నిశ్చల భక్తిని పరీక్షించగోరి వైశ్యరూపములో నీవద్దకు వచ్చితిని (54). నేను మాయచే అగ్నిని ప్రజ్వరిల్ల జేసి నీ నాట్యమండపమును తగులబెట్టితిని. ఆ రత్నలింగమును దహించి, అగ్నిలో ప్రవేశించితిని (55). నీవు సత్య వచనమును స్మరించి నా వెనుక అగ్నిలో ప్రవేశింప బోతివి. కావున నేను నీకు దేవతలకైననూ లభింప శక్యము కాని భోగముల నిచ్చెదను (56). ఓ సుందరీ! నీవు దేనిని కోరిననూ నేను ఇచ్చెదను. నేను నీ భక్తికి మిక్కిలి ప్రసన్నుడనైతిని. నీకు ఈ యరానిది లేదు (57).

నందీశ్వర ఉవాచ |

ఇతి బ్రువతి గౌరీశే శంకరే భక్త వత్సలే | మహానందా చ సా వేశ్యా శంకరం ప్రత్యభాషత || 58

నందీశ్వరుడిట్లు పలికెను-

భక్తి వత్సలుడు, గౌరీపతియగు శంకరుడిట్లు పలుకగా వేశ్యయగు ఆ మహానంద శంకరుని ఉద్దేశించి ఇట్లు బదులిడెను (58).

వేశ్యోవాచ |

న మే వాంఛాస్తి భోగేషు భూమౌ స్వర్గే రసాతలే | తవ పాదాంబుజస్సర్శాదన్యత్‌ కించిన్న కామయే || 59

యే మే భృత్యాశ్చ దాస్యశ్చ యే వాన్యే మమ బాంధవాః | సర్వే త్వద్దర్శనపరాస్త్వయి సన్న్యస్తవృత్తయః || 60

సర్వానేతాన్మయా సార్ధం నినీయాత్మపరం పదమ్‌ | పునర్జన్మభయం ఘోరం విమోచయ నమో%స్తుతే || 61

వేశ్య ఇట్లు పలికెను-

నాకు భూలోక, స్వర్గలోక, పాతాళలోకములలోని భోగములయందు కోరిక లేదు. నీ పాదపద్మములను స్పృశించుట కంటె మరియొకదానిని నేను కోరుటలేదు (59). నా సేవకులు, దాసీలు మరియు నా ఇతరబంధువులు అందరూ కూడా నీ యందు లగ్నమైన మనస్సు గలవారై నీ దర్శనము కొరకు తహతహలాడుచున్నారు (60). నాతో సహా వీరినందరినీ నీ పరమపదమునకు గొనిపోయి ఘోరమగు పునర్జన్మ భయమునుండి విముక్తిని కలిగించుము. నీకు నమస్కారమగుగాక! (61)

నందీశ్వర ఉవాచ|

తతస్స తస్యా వచనం ప్రతినంద్య మహేశ్వరః | తాస్సర్వాశ్చ తయా సార్ధం నినాయ స్వం పరం పదమ్‌ || 62

వైశ్యనాథావతారస్తే వర్ణితః పరమో మయా | మహానందాసుఖకరో భక్తానందప్రదస్సదా || 63

ఇదం చరిత్రం పరమం పవిత్రం సతాం చ సర్వప్రదమాశా దివ్యమ్‌ |

శివావతారస్య విశాంపతేర్మహానందామహాసౌఖ్యకరం విచిత్రమ్‌ || 64

ఇదం యశ్శృణుయాద్భక్త్యా శ్రావయేద్వా సమాహితః | చ్యవతే న స్వధర్మాత్స పరత్ర లభ##తే గతిమ్‌ || 65

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్రసంహితాయాం వైశ్యనాథా వతారవర్ణనం నామ షడ్వింశో%ధ్యాయః (26).

నందీశ్వరుడిట్లు పలికెను-

తరువాత ఆ మహేశ్వరుడు ఆమె పలుకులనభినందించి ఆమెతో బాటు వారినందరినీ కూడ తన పరమపదమునకు గొనిపోయెను (62). మహానందకు సుఖమును కలిగించినది, భక్తులకు సదా ఆనందమునిచ్చునది, శ్రేష్ఠమైనది అగు వైశ్యనాథావతారమును నేను నీకు వర్ణించితిని (63). ఈ దివ్య చరిత్రము పరమపవిత్రమైనది, మరియు సత్పురుషులకు శీఘ్రముగా సర్వమును ఇచ్చునది. శివుని ఈ విచిత్రమగు వైశ్యనాథావతారము మహానందకు మహాసౌఖ్యముననుగ్రహించినది (64). ఎవడైతే దీనిని భక్తితో వినునో, లేదా మనస్సును లగ్నము చేసి వినిపించునో, వాడు తన ధర్మమునుండి పతితుడు కాడు. మరియు దేహత్యాగానంతరము ఉత్తమగతిని పొందును (65).

శ్రీ శివ మహాపురాణములోని శతరుద్రసంహితయందు వైశ్య నాథావతారవర్ణనమనే ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది (26).

Siva Maha Puranam-3    Chapters