Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Siva Maha Puranam-3    Chapters   

అథ ద్వావింశో%ధ్యాయః

సముద్ర మథనము

నందీశ్వర ఉవాచ |

శృణు బ్రహ్మసుత ప్రాజ్ఞ వృషేశాఖ్యం మునీశ్వర | శివావతారం సల్లీలం హరిగర్వహరం వరమ్‌ || 1

పురా దేవాసురాస్సర్వే జరామృత్యు భయార్దితాః | పరస్పరం చ సంధాయ రత్నా న్యా దిత్సవే%భవన్‌ || 2

తతస్సురాసురాస్సర్వే క్షీరోదం సాగరోత్తమమ్‌ | ఉద్యతా మథితుం తం చ బభూవుర్మునినందన || 3

ఆసన్‌ శుచిస్మితాస్సర్వే కేనేదం మంథనం భ##వేత్‌ | స్వకార్యసిద్ధయే తస్య బ్రహ్మన్నితి సురాసురాః || 4

తదా నభోగతా వాణీ మేఘ గంభీరనిస్స్వనా | ఉవాచ దేవాన్‌ దైత్యాం శ్చా శ్వాసయంతీశ్వరాజ్ఞయా || 5

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ బ్రహ్మపుత్రా ! బుద్ధి శాలియగు మహర్షీ ! శివుని వృషేశ్వరావతారమును గూర్చి వినుము. శ్రేష్ఠమగు ఈ అవతారములో శివుడు విష్ణుని గర్వమును పోగొట్టి మంచి లీలలను ప్రదర్శించినాడు (1). పూర్వము దేవాసురులందరు జరామరణముల భయముచే పీడింపబడిన వారై పరస్పరము సంప్రదించుకొని రత్నములను సంపాదించవలెనని నిర్ణయించిరి (2). ఓ మహర్షీ ! తరువాత రాక్షసులు, దేవతలు అందరు కలిసి సముద్రములలో ఉత్తమమగు క్షీరసముద్రమును మధించుటకు సిద్ధమైరి (3). ఓ మహర్షీ! తాము కోరు శ్రేష్ఠవస్తువులు లభించుట కొరకై ఈ సముద్రమును దేనితో మధించవలెనో? యని దేవతలు, రాక్షసులు అందరు పరస్పర మైత్రీ భావనతో ఆలోచించ మొదలిడిరి (4).

అపుడు ఈశ్వరాజ్ఞచే మేఘము వలె గంభీరముగా ధ్వనించే ఆకాశవాణి దేవతలను, రాక్షసులను ఓదార్చుచూ ఇట్లు పలికెను (5).

నభోవాణ్యువాచ |

హే దేవా అసురాశ్చైవ మంథధ్వం క్షీరసాగరమ్‌ | భవతాం బలబుద్ధిర్హి భవిష్యతి న సంశయః || 6

మందరం చైవ మంథానం రజ్జుం కురుత వాసుకిమ్‌ | మిథస్సర్వే మిలిత్వా తు మథనం కురుతాదరాత్‌ || 7

ఆకాశవాణి ఇట్లు పలికెను-

ఓ దేవతలారా! మరియు రాక్షసులారా! క్షీరసముద్రమును మథించుడు. మీ బలము, బుద్ది సఫలము కాగలవు. సందేహము లేదు (6). మందర పర్వతమును కవ్వముగా, వాసుకిని త్రాడుగా చేసి, మీరందరు పరస్పర సహకారముతో శ్రద్ధా పూర్వకముగా మథించుడు (7).

నందీశ్వర ఉవాచ |

నభోగతాం తదా వాణీం నిశమ్యాథ సురాసురాః | ఉద్యోగం చక్రిరే సర్వే తత్కర్తుం మునిసత్తమ || 8

సుసంధాయాఖిలాస్తే వై మందరం పర్వతోత్తమమ్‌ | కనకాభం చ సరలం నానాశోభార్చితం యయుః || 9

సుప్రసాద్య గిరీశం తం తదాజ్ఞప్తాస్సురాసురాః | బలాదుత్పాటయామాసుర్నేతుకామాః పయో%ర్ణవమ్‌ || 10

భుజైరుత్పాట్య తే సర్వే జగ్ముః క్షీరార్ణవం మునే | అశక్తా అభవంస్తత్ర తమానేతుం హతౌజసః || 11

తద్భుజైస్స పరిభ్రష్టః పతితో మందరో గిరిః | సహసాతిగురుస్సద్యో దేవదైత్యోపరి ధ్రువమ్‌ || 12

ఏవం భగ్నోద్యమా భగ్నస్సంబభూవుస్సురాసురాః | చేతనాః ప్రాప్య చ తతస్తుష్టువుర్జగదీశ్వరమ్‌ || 13

తదిచ్ఛయోద్యతాస్సర్వే పునరుత్థాప్య తం గిరిమ్‌ | నిచిక్షిపుర్జలే నీత్వా క్షీరోదస్యో త్తరే తటే || 14

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ మహర్షీ! అపుడా దేవతలు, రాక్షసులు ఆకాశవాణిని విని అందరు కలిసి మథించుటకు ప్రయత్నముల నారంభించిరి (8). వారు అందరు చక్కగా నిర్ణయించుకొని, బంగారము వలె ప్రకాశించునది, అనేక శోభలతో నలరారునది, పర్వతములలో గొప్పది యగు మందర పర్వతము వద్దకు తేలికగా చేరుకొనిరి (9). దేవతలు, రాక్షసులు ఆ పర్వతరాజును ప్రసన్నము చేసుకొని ఆయన అనుమతిని పొంది క్షీరసముద్రమునకు గొని పోవుట కొరకై బలాత్కారముగా ఊడ బెరికిరి (10). ఓ మహర్షీ! వారు అందరు ఆ పర్వతమును ఊడబెరికి భుజములపై క్షీరసముద్రమునకు గొనిపోవుటకు ఉద్యమించిరి. కాని సన్నగిల్లిన బలముగల వారు ఆ పర్వతమును సముద్రము వరకు గొని రాలేకపోయిరి (11). మిక్కిలి అధికమగు భారము గల ఆ మందర పర్వతము వారి భుజములనుండి జారి వెంటనే దేవదానవులపై నిశ్చయముగా పడెను (12). ఈ విధముగా దేవదానవుల ఉద్యమము విఫలమాయెను. వారు తెలివిని దెచ్చుకొని, తరువాత జగదీశ్వరుని స్తుతించిరి (13). ఆ పరమేశ్యరుని ఇచ్ఛచే వారందరు మరల ఉద్యమించి ఆ పర్వతమును పైకి ఎత్తి క్షీరసముద్రము ఉత్తరతీరము వరుకు తీసుకువచ్చి నీటిలో బడవేసిరి (14).

తతస్సురాసురగణా రజ్జుం కృత్వా చ వాసుకిమ్‌ | రత్నా న్యాదాతు కామాస్తే మమంథుః క్షీరసాగరమ్‌ || 15

క్షీరోదే మథ్య మానే తుశ్రీ స్స్వర్లోకమహేశ్వరీ | సముద్భూతా సముద్రచ్చ భృగుపుత్రీ హరిప్రియా || 16

ధన్వంతరిశ్శశాంకశ్చ పారిజాతో మహాద్రుమః | ఉచ్చైశ్శ్రవాశ్చ తురగో గజ ఐరావతస్తథా || 17

సురా హరిధనుశ్శంఖో గావః కామదుఘాస్తతః | కౌస్తుభాఖ్యో మణిశ్చైవ తథా పీయూషమేవ చ || 18

పునశ్చ మథ్యమానే తు కాలకూటం మహావిషమ్‌ | యుగాంతానలభం జాతం సురాసురభయావహమ్‌ || 19

పీయూష జన్మకాలే తు బిందవో యే బహిర్గతాః | తేభ్యః కాంతా స్సముద్భూతా బహ్వ్యో హ్యద్భుతదర్శనాః || 20

శరత్పూర్ణేందువదనాస్తడిత్సూర్యానల ప్రభాః | హారకేయూరకటకైర్దివ్యరత్నైరలం కృతాః || 21

తరువాత దేవదానవ సమూహములు రత్నములను సంపాదించవలెననే కోరిక గలవారై వాసుకిని త్రాడుగా చేసి క్షీరసముద్రమును మథించిరి (15). క్షీరసముద్రమును మథించుచుండగా స్వర్గలోక మహేశ్వరియగు లక్ష్మీదేవి సముద్రమునుండి పుట్టి భృగుమహర్షి పుత్రికయై విష్ణువునకు పత్నియైనది (16). ధన్వంతరి, చంద్రుడు, పారిజాతమనే మహావృక్షము, ఉచ్చైశ్శ్రవమనే గుర్రము, తరువాత కోర్కెలను వర్షించే గోవులు, ఐరావతమనే ఏనుగు, వరుణి, విష్ణువు యొక్క ధనస్సు మరియు శంఖము, కౌస్తుభమనే మణి, ఆ తరువాత అమృతము కూడ పుట్టినవి (17, 18). మరల మథించుచుండగా ప్రలయాకాలాగ్నిని బోలి దేవరాక్షసులకు భీతిని గొల్పిన కాలకూట మహావిషము పుట్టినది (19). అమృతము పుట్టిన సమయములో బయట పడిన బిందువులనుండి సుందరమగు ఆకారముగల యువతులు అనేకమంది జన్మించిరి (20). వారు శరత్కాలము నందలి పూర్ణిమాచంద్రుని వంటి ముఖములు గలవారై, మెరుపు సూర్యుడు మరియు అగ్నిని బోలిన కాంతులు గలవారై, హారములు కేయూరములు కటకములు మరియు దివ్యరత్నములతో అలంకరింపబడినవారై శోభిల్లిరి (21).

లావణ్యామృతతోయేన తాస్సించంత్యో దిశో దశ | జగదున్మాదయంత్యేవ భ్రూభంగాయత వీక్షణాః || 22

కోటిశస్తా స్సముత్పన్నా స్త్వమృతాత్కామనిస్సృతాః | తతో%మృతం సముత్పన్నం జరామృత్యు నివారణమ్‌ || 23

లక్ష్మీం శంఖం కౌస్తు భం చ ఖడ్గం జగ్రాహ కేశవః | జగ్రాహార్కో హయం దివ్య ముచ్చైశ్శ్ర వసమాదరాత్‌ || 24

పారిజాతం తరువర మైరావతమిభేశ్వరమ్‌ | శచీపతిశ్చ జగ్రాహ నిర్జరేశో మహాదరాత్‌ || 25

కాలకూటం శశాంకం చ దేవత్రాణాయ శంకరః | స్వకంఠే ధృతవాన్‌ శంభుస్స్వేచ్ఛయా భక్తవత్సలః || 26

దైత్యా స్సురాభ్యాం రమణీ మీశ్వరాజావిమోహితాః | జగృహుస్సకలా వ్యాస సర్వే ధన్వంతరిం జనాః || 27

జగృహుర్మునయస్సర్వే కామధేనుం మునీశ్వరాః | సామాన్యతస్త్ర్సియస్తాశ్చ స్థితా ఆసన్‌ విమోహికాః || 28

వారు తమ సౌందర్యకాంతులలో పదిదిక్కులను నింపుతూ, కనుబొమల విరుపులతో విశాలమగు నేత్రములతో జగత్తునకు ఉన్మాదమును కలిగించుచుండిరి (22). బయటపడిన అమృత బిందువుల నుండి వీరు కోట్ల సంఖ్యలో జన్మించిరి. ఆ తరువాత జరామరణములను నివారించే అమృతము పుట్టెను (23). విష్ణువు లక్ష్మిని, శంఖమును, కౌస్తుభమును మరియు ఖడ్గమును స్వీకరించెను. సూర్యుడు ఉచ్చైశ్శ్రవసమనే దివ్యాశ్వమును ఆదరముతో స్వీకరించెను (24). దేవతలకు ప్రభువు, శచీపతి అగు ఇంద్రుడు పారిజాత మహావృక్షమును, మరియు ఐరావతమనే గొప్ప ఏనుగును మహాదరముతో స్వీకరించెను (25). శంకరుడు చంద్రుని స్వీకరించెను. మరియు భక్తవత్సలుడగు ఆ శంభుడు దేవతలను రక్షించవలెననే ఆకాంక్షతో కాలకూటమును గ్రహించి తన కంఠములో ధరించెను (26). ఓ వ్యాసా! ఈశ్వరుని మాయచే విమోహితులైన రాక్షసులు అందరు సురను స్వీకరించిరి. సామాన్యజనులందరు ధన్వంతరిని స్వీకరించిరి (27). ఓ మహర్షులారా! మునులందరు కామధేనువును స్వీకరించిరి. మోహమును కలిగించు ఆ స్త్రీలు సామాన్య రూపములో నిలచి యుండిరి (28).

అమృతార్థం మహాయుద్ధం సంబభూవ జయైషిణామ్‌ | సురాణామసురాణాం చ మిథస్సంక్షుబ్ధ చేతసామ్‌ || 29

హృతం సోమం చ దైతేయైర్బలా ద్దేవాన్‌ విజిత్య చ | బలప్రభృతిభిర్వ్యాస యుగాంతాగ్న్యర్క సుప్రభైః || 30

దేవాశ్సంకరమాపన్నా విహ్వలాశ్శివమాయయా | సర్వే శక్రాదయస్తాత దైతేయైరర్దితా బలాత్‌ || 31

తతస్తదమృతం యత్నాత్‌ స్త్రీస్వరూపేణ మాయయా | శివాజ్ఞయా రమేశేన దైత్యేభ్యశ్చ హృతం మునే || 32

ఆపాయయత్సురాంస్తాంశ్చ మోహినీ స్త్రీస్వరూపధృక్‌ | మోహయిత్వా%సురాన్‌ సర్వాన్‌ హరిర్మాయావినాం వరః || 33

గత్వా నికట మేతస్యా ఊచిరే దైత్యపుంగవాః | పాయయస్వ సుధామేతాం మా భూద్భేదో%త్ర పంక్తిషు || 34

ఏతదుక్త్వా దదుస్తసై#్మ విష్ణవే ఛలరూపిణ | తే దైత్యా దానవా స్సర్వే శివమాయావి మోహితాః || 35

ఏతస్మిన్నంతరే దృష్ట్వాస్త్రియో దానవపుంగవాః | అనయన్నమృతోద్భూతా యథాస్థానం యథాసుఖమ్‌ || 36

దేవదానవులు మిక్కిలి క్షోభిల్లిన మనస్సు గలవారై అమృతము కొరకై ఒకరినొకరు జయించవలెననే ఆకాంక్షతో గొప్ప యుద్ధమును చేసిరి(29). ఓ వ్యాసా! కల్పాంతమందలి అగ్ని వలె, మరియు సూర్యుని వలె ప్రకాశించే బలుడు మొదలగు రాక్షసులు తమ బలముచే దేవతలను జయించి అమృతమును లాగుకొనిరి (30). వత్సా! శివమాయచే దుఃఖితులైనవారు, రాక్షసులచే బలముగా పీడింపబడిన వారునగు ఇంద్రాది దేవతలందరు శంకరుని శరణు వేడిరి (31). ఓ మునీ! అపుడు శివుని ఆజ్ఞచే విష్ణువు తన మాయా ప్రభావముచే స్త్రీరూపమును దాల్చి ఆ అమృతమును జాగ్రత్తగా రాక్షసుల వద్దనుండి తీసుకొని వచ్చెను (32). మాయావులలో శ్రేష్ఠుడగు విష్ణువు మోహిని యను స్త్రీ రూపమును దాల్చి రాక్షసులనందరినీ మోహింపజేసి దేవతలచే అమృతమును త్రాగించెను (33). ఆమె వద్దకు వెళ్లి రాక్షసవీరులు ఇట్లు పలికిరి. ఈ అమృతమును పంక్తిభేదము లేని విధముగా పంచిపెట్టుము (34). శివమాయచే మిక్కిలి మోహితులై యున్న ఆ దైత్యదానవులందరు ఇట్లు పలికి మాయారూపమును దాల్చి యున్న ఆ విష్ణువునకు అప్పజెప్పిరి (35). ఇంతలో ఆ రాక్షసవీరులకు అమృతమునుండి పుట్టిన స్త్రీలు కానవచ్చిరి. వారు వారిని సుఖముగా తమతమ స్థానములకు దోడ్కొని పోయిరి (36).

తాసాం పురాణి దివ్యాని స్వర్గాచ్ఛ తగుణాన్యపి | ఘోరైర్యం త్రైస్సుగుప్తాని మయమాయాకృతాని చ || 37

సురక్షితాని సర్వాణి కృత్వా యుద్ధాయ నిర్యయుః | ఆస్పృష్టవక్షసో దైత్యాః కృత్వా సమయమేవ హి || 38

నస్పృశామః స్త్రియశ్చేమా యది దేవైర్వినిర్జితాః | ఇత్యుక్త్వాతే మహావీరా దైత్యా స్సర్వే యుయుత్సవః || 39

సింహనాదం తతశ్చక్రుశ్శంఖాన్‌ దధ్ముఃపృథక్‌ పృథక్‌ | పూరయంత ఇవాకాశం తర్పయంతో వలాహకాన్‌ || 40

యుద్ధం బభూవ దేవానా మసురైస్సహ భీకరమ్‌ | దేవాసురాఖ్యమతులం ప్రసిద్ధం భువనత్రయే || 41

జయం ప్రాపుస్సురాస్సర్వే విష్ణునా పరిరక్షితాః | దైత్యాః పలాయితాస్తత్ర హతాస్సామరవిష్ణునా || 42

దైత్యా స్సంమోహితా దేవైర్విష్ణునా చ మహాత్మనా | హతావశిష్టాః పాతాలం వివిశుర్వివరాణి చ || 43

మయుని మాయచే నిర్మింపబడి భయంకరమగు యంత్రములచే గొప్పగా రక్షింపబడియున్న వారి స్వర్గముకంటె వందరెట్లు దివ్యముగా నుండెను (37). రాక్షసులు తమ నగరములన్నిటికి రక్షణవ్యవస్థను చక్కగా చేసి, గుండెలపై చేతులతో ప్రతిజ్ఞను చేసి యుద్ధమునకు బయలుదేరిరి (38). మేము దేవతల చేతిలో ఓడిపోయినచో ఈ స్త్రీలను స్పృశించము అని పలికి మహావీరులగు ఆ రాక్షసులందరు యుద్ధోత్సాహముతో (39). సింహనాదమును చేసి తరువాత వేర్వేరుగా శంఖములనూదిరి. వారి శంఖధ్వని ఆకాశము నిండునట్లు సర్వత్రా వ్యాపించెను. వారు వర్షముకొరకు మేఘములను ప్రార్థించుచున్నారా అన్నట్లు ఉండిరి (40). దేవతలకు రాక్షసులతో భీకరమగు పోరు జరిగెను. ఆ పోరు దేవాసురయుద్ధమను పేర ముల్లోకములలో ఖ్యాతిని గాంచెను (41). విష్ణువుచే పరిరక్షింపబడిన దేవతలందరు విజయము పొందిరి. దేవతలతో గూడియున్న విష్ణువుచే కొట్టబడినవారై రాక్షసులచటనుండి పలయనమును చిత్తగించిరి (42). మహాత్ముడగు విష్ణువు, మరియు దేవతలు రాక్షసులను సమ్మోహితులను చేసిరి. చావగా మిగిలిన వారు గుహలలో దాగిరి. కొందరు పాతాళమును ప్రవేశించిరి (43).

అను వవ్రాజ తాన్‌ విష్ణుశ్చక్రపాణిర్మహాబలః | పాతాలం పరమం గత్వా సంస్థితాన్‌ భీతభీతవత్‌ || 44

ఏతస్మిన్నంతరే విష్ణుర్దదర్శామృత సంభవాః | కాంతాః పూర్ణేందువదనా దివ్య లావణ్య గర్వితాః || 45

సమ్మోహితః కమ బాణౖర్లేభే తత్రైవ నిర్వృతిమ్‌ | తాభిశ్చ వరనారీభిః క్రీడమానో బభూవ హ || 46

తాభ్యః పుత్రా నజనయ ద్విష్ణుర్వర పరాక్రమాన్‌ | మహీం సర్వాం కంపయతో నానాయుద్ధ విశారదాన్‌ || 47

తతో వై హరిపుత్రాస్తే మహాబలపరాక్రమాః | మహోపద్రవమాచేరుస్స్వర్గే భువి చ దుఃఖదమ్‌ || 48

లోకోపద్రవమాలక్ష్య నిర్జరా మునయో%థవా| చక్రుర్నివేదనం తేషాం బ్రహ్మణ ప్రణి పత్య చ || 49

తచ్ఛ్రుత్వాదాయ తాన్‌ బ్రహ్మ య¸° కైలాసపర్వతమ్‌ | తత్ర దృష్ట్వా శివం దేవైః పుణనామ పునః పునః || 50

తుష్టావ వివిధై స్‌స్తో త్రై ర్నతన్కంధః కృతాంజలిః | జయదేవ మహాదేవ సర్వస్వామిన్నితి బ్రువన్‌ || 51

పాతాళపు కోనలలోనికి పోయి మహాభయముతో దాగియున్న ఆ రాక్షసుల వెనుక మహాబలుడగు విష్ణువు చక్కమును చేతబట్టి అనుసరించెను (44). ఇంతలో అమృతమునుండి పుట్టినట్టియు, పూర్ణచంద్రుని వంటి ముఖములు కలిగి దివ్యమగు సౌందర్యముతో గర్వించియున్న యువతులను విష్ణువు గాంచెను (45). ఆతడు మన్మథుని బాణములచే సమ్మోహితుడై ఆ సుందరయువతులతో క్రీడిస్తూ ఆచటనే ఆనందముగా నుండజొచ్చెను (46). విష్ణువు వారితో గూడి గొప్ప పరాక్రమము గల పుత్రులను గనెను. వివిధ యుద్ధములలో దక్షులగు వారు భూమినంతనూ వణికింప జొచ్చిరి (47). వారు స్వర్గమునందు మరియు భూలోకమునందు దుఃఖమును, గొప్ప ఉపద్రవమును కలిగించిరి. ఆ విష్ణు పుత్రులు గొప్ప బలమును పరాక్రమమును కలిగియుండిరి (48). దేవతలు మరియు మునులు లోకములకు సంప్రాప్తమైన ఉపద్రవమును గాంచి బ్రహ్మకు ప్రణమిల్లి వారి గురించి ఆయనకు నివేదించిరి (49). వారి మాటలను విని బ్రహ్మ వారిని దోడ్కొని కైలాస పర్వతమునకు వెళ్లి అచట శివుని గాంచి దేవతలతో సహా పలుమార్లు ప్రణమిల్లెను (50). తలను వంచి చేతులను జోడించి దేవా! మహాదేవా! సర్వప్రభూ! జయమగుగాక! అని పలుకుచూ వివిధస్తోత్రములతో స్తుతించెను (51).

బ్రహ్మవాచ |

దేవదేవ మహాదేవ లోకాన్‌ రక్షాఖిలాన్‌ ప్రభో | ఉపద్రుతాన్‌ విష్ణుపుత్రైః పాతాలస్థైర్వికారిభిః || 52

నారీష్వమృతభూతాసు సంసక్తాత్మా హరిర్విభో | పాతాలే తిష్ఠతీదానీం రమతే హి వికారవాన్‌ || 53

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ దేవ దేవా! మహాదేవా! పాతాలమునందు నివసించి గర్వాది మనో వికారములు గలవారై విష్ణు పుత్రులు లోకములన్నింటికి

ఉపద్రవమును కలిగించుచున్నారు. ఈ ఉపద్రవమునుండి రక్షింపుము (52). ఓ విభూ! అమృతము నుండి జన్మించిన యువతులయందు లగ్నమైన మనస్సు గల విష్ణువు ఇపుడు కామ వికారము గలవాడై పాతాళములో నివసించి రమించుచున్నాడు (53).

నందీశ్వర ఉవాచ |

ఇత్థం బహుస్తతశ్శంభుర్బ్రహ్మణా సర్షి నిర్ఘరైః | లోక సంరక్షణార్థాయ విష్ణోరానయనాయ చ || 54

తతస్స భగవాన్‌ శంభుః కృపాసింధుర్మహేశ్వరః | తదుపద్రవమాజ్ఞాయ వృషరూపో బభూవ హ || 55

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్ర సంహితాయాం వృషావతార వర్ణనం నామ ద్వావింశో%ధ్యయః (22)

నందీశ్వరుడిట్లు పలికెను-

బ్రహ్మ, ఋషులు మరియు దేవతలు శంభుని లోకములను సంరక్షించు మనియు, విష్ణువును వెనుకకు తీసుకుని రమ్మనియు పరిపరి విధముల ప్రార్థించిరి (54). అపుడు దయానిధి, మహేశ్వరుడు అగు ఆ శంభుభగవానుడు ఆ ఉపద్రవమును గుర్తించి వృషభావతారమును దాల్చెను (55).

శ్రీ శివమహాపురాణములోని శతరుద్రసంహితయందు వృషావతారవర్ణనమనే ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది (22).

Siva Maha Puranam-3    Chapters