Siva Maha Puranam-3    Chapters   

అథ అష్టావింశో%ధ్యాయః

ఛాయా పురుష వర్ణనము

దేవ్యువాచ|

దేవదేవ మహాదేవ కథితం కాలవంచనమ్‌ | శబ్దబ్రహ్మస్వరూపం చ యోగలక్షణముత్తమ్‌||1

కథితం తే సమాసేన చ్ఛాయికం జ్ఞానముత్తమమ్‌7 విస్తరేణ సమాఖ్యాహి యోగినాం హితకామ్యయా|| 2

పార్వతి దేవి ఇట్లు పలికెను-

ఓ దేవదేవా! మహాదేవా! నీవు మృత్యువును జయించు విధమును, శబ్దబ్రహ్మస్వరూపమును మరియు ఉత్తమమగు యోగము యొక్క లక్షణమును చెప్పితిని (1). నీవు ఉత్తమమగు ఛాయాపురుషజ్ఞానమును గురించి సంగ్రహముగా ప్రస్తావించితివి. యోగుల హితమును గోరి దానిని వివరముగా చక్కగా చెప్పుము (2).

శంకర ఉవాచ

శృణు దేవి ప్రవక్ష్యామి చ్ఛాయాపురుషలక్షణమ్‌| యజ్‌జ్ఞాత్వా పురుషస్సమ్యక్సర్వపాపైః ప్రముచ్యతే||3

సూర్యం హి పృష్ఠతః కృత్వా సోమం వా వరవర్ణిని | శుక్లాంబరధరస్స్రగ్వీ గంధధూపాదివాసితః|| 4

సంస్మరేన్మే మహామంత్రం సర్వకామఫలప్రదమ్‌ | నవాత్మకం పిండభూతం స్వాం ఛాయం సంనిరీక్షయేత్‌ః || 5

దృష్ట్వా తాం పురాకాశే శ్వేతవర్ణస్వరూపిణీమ్‌ | న పశ్యత్యేకభావస్తు శివం పరమకారణమ్‌|| 6

బ్రహ్మప్రాప్తిర్భవేత్తస్య కాలవిద్భిరితీరితమ్‌| బ్రహ్మహత్యాదికైః పాపైర్ముచ్యతే నాత్ర సంశయః|| 7

శిరోహీనం యదా పశ్యేత్‌ షడ్భిర్మాసైర్భవేత్‌ క్షయః| సమస్తం వాఙ్మయం తస్య యోగినస్తు యథా తథా|| 8

శుక్లే ధర్మం విజానీయాత్కృష్ణే పాపం వినిర్ధిశేత్‌| రక్తే బంధం విజానీయాత్పీతే విద్విషమాదిశేత్‌|| 9

విబాహౌ బంధునాశస్స్యాద్వితుండే చైవ క్షుద్భయమ్‌ | వికటౌ నశ్యతే భార్య విజంఘే ధనమేవ హి ||10

పాదాభావే విదేశస్స్యాదిత్యేతత్కథితం మయా | తద్విచార్య ప్రయత్నేన పురుషేణ మహేశ్వరి|| 11

సమ్యక్తం పురుషం దృష్ట్యా సన్నివేశ్యాత్మనాత్మని | జపేన్నవాత్మకం మంత్రం హృదయం మే మహేశ్వరి|| 12

శంకరుడు ఇట్లుపలికెను-

ఓ దేవీ! ఛాయాపురుషలక్షణమును చెప్పెదను. వినుము. దీనిని బాగుగా తెలుసుకున్న పురుషుడు పాపములన్నింటినుండి విముక్తుడగును (3). ఓ సుందరీ! సూర్యుడు లేదా చంద్రుడు వెనుకవైపు ఉండునట్లు కూర్చుండవలెను. వ్యక్తి తెల్లని వస్త్రములను, మాలను ధరించి గంధమును, ఇతరసుగంధద్రవ్యములను పూసుకొనవలెను. ధూపము కూడ ఉండవలెను (4). నాయొక్క తొమ్మిది అంశములు ముద్దగా అయి ఏర్పడిన, కోరికలను అన్నింటినీ తీర్చే నవాత్మకమహామంత్రమును జపిస్తూ తన నీడను నిశితముగా పరిశీలించవలెను (5). ఆ నీడను చూచి మరల ఆకాశములో దానిని తెల్లని మెరిసే రూపమలో చూచి సర్వజగత్కారణమగు శివుని ఏకాగ్రమగు మనస్సుతో చూచినచో (6). వానికి మోక్షప్రాప్తి కలుగునవి కాలవేత్తలు చెప్పుచున్నారు. ఆతడు బ్రహ్మహత్య మొదలగు పాపములనుండి విముక్తుడుగుననుటలో సందేహము లేదు (7). నీడ తలలేని విధముగా కనబడినచో, ఆ యోగియొక్క వాగ్రూపమగు శక్తి అంతయు యథాతథముగా ఆరు మాసములలో వినష్టమగును (8). ఆ ఛాయాపురుషుడు తెల్లగా నున్నచో ధర్మమును, నల్లగా నున్నచో పాపమును, ఎర్రగా నున్నచో బంధమును మరియు పచ్చగా నున్నచో విద్వేషమును నిర్దేశించును (9). ఆ నీడకు చేతులు లేనిచో బంధునాశమును, నోరు లేనిచో ఆకలిభయమును, పృష్ఠబాగము లేనిచో భార్యానాశమును, పిక్కలు లేనిచో ధననాశమును, పాదములు లేనిచో విదేశబహిస్కారమును (ఆస్తి నష్టము) సూచించును ఓ మహేశ్వరీ! నేనీ విషయములను చెప్పితిని. మానవుడు ప్రయత్నపూర్వకముగా ఛాయాపురుషుని పరశీలించి నిర్ధారించవలెను (10,11). ఓ మహేశ్వరీ! ఆ పురుషుని సరిగా దర్శించి మనస్సును ఆత్మయందు లగ్నము చేసి, నాహృదయమనదగిన నవాత్మకమంత్రమును జపించవలెను (12).

వత్సరే విగతే మంత్రీ తన్నాస్తి యన్న సాధయేత్‌| అణిమాదిగుణానష్టౌ ఖేచరత్వం ప్రపద్యతే||13

పురన్యత్ప్రవక్ష్యామి శక్తిం జ్ఞాతుం దురాసదమ్‌ | ప్రత్యక్షం దృశ్యతే లోకే జ్ఞానినామగ్రతః స్థితమ్‌|| 14

అజ్ఞేయా లిఖ్యతే లోకే యా సర్పీకృతకుండలీ | సా మాత్రా యానసంస్థాపి దృశ్యతే న చ పఠ్యతే (? ) || 15

బ్రహ్మాండమూర్థ్నిగా యా చ స్తుతా వేదైస్తు నిత్యశః| జననీ సర్వవిద్యానాం గుప్తవిద్యేతి గీయతే||16

ఖేచరా వినిర్దిష్టా సర్వప్రాణాషు సంష్థితా | దృశ్యాదృశ్యాచలా నిత్యా వ్యక్తావ్యక్తా సనాతనీ||17

అవర్ణా వర్ణసంయుక్తా ప్రోచ్యతే బిందుమాలినీ | తాం పశ్యన్‌ సర్వాదా యోగి కృతకృత్యో% భిజాయతే||18

సర్వతీర్థకృస్నానాద్భవేద్దానస్య యత్ఫలమ్‌| సర్వయజ్ఞఫలం యచ్చ మాలిన్యా దర్శనాత్తదా||19

ప్రాప్నోత్యత్ర న సందేహస్సత్యం వై కథితం మయా | సర్వతీర్థేషు యత్‌ స్నాత్వా దత్త్వా దానాని సర్వశః||20

సర్వేషాం దేవి యజ్ఞానాం యత్ఫలం తల్లభేత్పుమాన్‌ | కిం బహుక్త్వా మహేశాని సర్వాన్‌ కామాన్‌ సమశ్నుతే||21

తస్మత్‌ జ్ఞానం యథాయోగమభ్యసేత్సతతం బుదః | అభ్యాసాజ్ఞాయతే సిధ్ధిర్యోగో% భ్యాసా త్ప్రవర్థతే||22

సంవిత్తిర్లభ్యతే%భ్యాసాదభ్యాసాన్మోక్షమశ్నుతే | అభ్యాసస్సతతం కార్యో ధీమతా మోక్షకారణమ్‌||23

ఇత్యేతత్కథితం దేవి భుక్తిముక్తిఫలప్రదమ్‌| కిమన్యత్పృతచ్ఛ్యతే తత్త్వం వద సత్యం బ్రవీమి తే|| 24

సంవత్సరకాలము ఈ మంత్రమును జపించిన వ్యక్తి సాధించలేనిది ఉండబోదు. అణిమ మోదలగు ఎనిమిది సిద్ధులను మరియు ఆకాశమందు సంచరించే శక్తిని అతడు పొందును(13). తెలియుటకు చాల కఠినమైనది, కాని జ్ఞానులకు కరతలామలకము వంటిది అగు మరియొక శక్తిని గురించి చెప్పదను. ఈ శక్తి లోకములో ప్రత్యక్షముగా కనబడుచున్నది(14). లోకమునందు జనులకు తెలియని ఒక రూపమును లిఖించవలెను. ఆ బొమ్మ చుట్టవలెనున్న పామును బోలియుండును. దానిని వాహమునందు ఉంచవలెను. అది ఇతరులకు కనబడిననూ, దాని అర్థము వారికి తెలియదు అది ఇతరగ్రంథములలో వర్ణించబడలేదు(15). ఆ విద్య బ్రహ్మాండములో అన్నింటికంటె గొప్పది. వేదములు ఆ విద్యను నిత్యము స్తుతించుచున్నవి. విద్యలు అన్నింటికి తల్లి అనదగిన ఆ విద్య గుప్త విద్య లని కీర్తించబడుచున్నది(16). అదిఖేచరీవిద్య అని నిర్దేశించబడినది. అది సర్వప్రాణులయందు గలదు. అది కనబడుచున్ననూ కానరాదు. అది చలనము లేనిది, నిత్యము, వ్యక్తము, అవ్యక్తము మరియు సనాతనము(17). అది రంగు కలదియే అయినూ, రంగు లేనిది దానికి బిందుమాలిని అనిపేరు. సర్వకాలములలో దానిని దర్శించు యోగి కృతార్థుడగును (18). తీర్థములన్నింటిలో స్నానము చేయుట వలన ఏ ఫలము లభించునో, దానము వలన ఏ ఫలము కలుగునో, యజ్ఞములను అన్నింటినీ అనుష్ఠించుట వలన ఏ ఫలము కలుగునో, ఆ ఫలము బిందుమాలినీ దర్శనము వలన కలుగును. దీనిలో సందేహము లేదు. నేను సత్యమును పలుకుచున్నాను.ఓ దేవీ! తీర్థములన్నింటిలో స్నానము చేసి సర్వదానములను చేసి సర్వయజ్ఞములను చేయుట వలన మానవుడు ఏ ఫలమును పొందునో, దీనివలన మానవుడు ఆ ఫలమును పొందును. ఇన్నిమాటలేల? ఓ మహేశ్వరీ! ఆతనికి కోరికలు అన్నియు ఈడేరును(19-21). కావున వివేకి యోగమును మరియు ఈ జ్ఞానమును అభ్యసించవలెను. అభ్యాసము వలన సిద్ధి కలుగును. అభ్యాసనము వలన యోగము వర్ధిల్లును(22). అభ్యాసము వలన సమ్యగ్దర్శనము కలుగును. అభ్యాసము వలన మోక్షములభించును. కావున, వివేకి మోక్షహేతువు అగు అభ్యాసము ను సర్వకాలములలో చేయవలెను(23).ఓ దేవీ! భుక్తిని మరియు ముక్తిని ఇచ్చే ఈ విషయములను నేను నీకు ఈ విధముగా చెప్పితిని. నీవు ఇంకను ఏతత్త్వమును తెలియగోరుచున్నావు? చెప్పుము. నేను నీకు సత్యమును చెప్పగలను(24).

సూత ఉవాచ|

ఇతి శ్రుత్వా బ్రహ్మపుత్రవచనం పరమార్థదమ్‌| ప్రసన్నో%భూదతి వ్యాసః పారాశర్యో మునీశ్వరాః ||25

సనత్కుమారం సర్వజ్ఞం బ్రహ్మపుత్రం కృపానిధిమ్‌| వ్యాసః పరమసంతుష్టఃప్రణనామ ముహుర్ముహః||26

తతస్తుష్టావ తం వ్యాసః కాలేయస్సమునీశ్వరః | సనత్కుమారం

మునయస్సురవివజ్ఞానసాగరమ్‌||27

సూతుడిట్లు పలికెను-

ఓ మహర్షులారా! పరాశరపుత్రుడగు వ్యాసుడు బ్రహ్మపుత్రుడగు సనత్కుమారుని ఈ మోక్షమును ఇచ్చే వచనములను విని మిక్కిలి ప్రసన్నుడాయెను(25). సర్వజ్ఞుడు, బ్రహ్మపుత్రుడు, దయాసముద్రుడు అగు సనత్కుమారునకు పరమసంతోషమును పొందియున్న వ్యాసుడు పలు పర్యాయములు నమస్కరించెను(26). ఓ మహర్షులారా! ఆ కాలీనందనుడగు వ్యాసమహర్షి తరవాత దేవతావిజ్ఞానమునకు సముద్రము వంటివాడగు సనత్కుమారుని స్తుతించెను(27).

వ్యాస ఉవాచ|

కృతార్థో%హం మునిశ్రేష్ట బ్రహ్మత్వం మే త్వయా కృతమ్‌ | నమస్తే%స్తు నమస్తే%స్తు ధన్యస్త్వం బ్రహ్మవిత్తమః|| 28

వ్యాసుడు ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! నీవు నాయందు బ్రహ్మత్వమును కలిగించితివి. నీకు అనేకనమస్కారములు అగుగాక ! బ్రహ్మవేత్తలలో శ్రేష్టుడవగు నీవు ధన్యుడవు(28).

సూత ఉవాచ-

ఇతి స్తుత్వా స కాలేయే బ్రహ్మపుత్రం మహామునిమ్‌| తూష్ణీం బభూవ సుప్రీతః పరమానందనిర్భరః || 29

బ్రహ్మపుత్రస్తమామంత్ర్య పూజితస్తేన శౌనక| య¸° స్వధామ సుప్రీతో వ్యాపో% పి ప్రీతమానసః||30

ఇతిమే వర్ణితో విప్రాః సుఖదః పరమార్థయుక్‌| సనత్కుమారకాలేయసంవాదో జ్ఞానవర్థనః|| 31

ఇతి శ్రీ శివమహాపురాణ ఉమాసంహితాయాం ఛాయాపురుషవర్ణనం నామ అష్టావింశో%ధ్యాయః(28).

సూతుడు ఇట్లు పలికెను-

ఆ కాలీనందనుడగు వ్యాసుడు ఈ విధముగా బ్రహ్మపుత్రుడు, మహర్షియగు సనత్కుమారుని స్తుతించి మిక్కిలి ప్రీతిని పొందినవాడై పరమానందముతో నిండిపోయిన మనస్సుగలవాడై మిన్నకుండెను(29). ఓ శౌనకా! బ్రహ్మపుత్రుడగు సనత్కుమారుడు ఆ వ్యాసునిచే పూజించపబడినవాడై అతని వద్ద సెలవు తీసుకొని తన స్థానమునకు వెళ్ళెను. వ్యాసుడు కూడ గొప్ప ప్రీతితో నిండిన మనస్సు గలవాడై తన స్థానమునకు వెళ్లెను(30). ఓ బ్రహ్మణులారా! ఈ విధముగా పరమపురుషార్థమగు మోక్షమునిచ్చే జ్ఞానమును పెంపొందిపజేసే సనత్కుమారవ్యాససంవాదమును నేను వర్ణించితిని(31).

శ్రీ శివమహాపురాణములో ఉమాసంహితయందు ఛాయాపురుషవర్ణనమనే

ఇరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (28).

Siva Maha Puranam-3    Chapters