Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Siva Maha Puranam-3    Chapters   

అథ త్రయోవింశోధ్యాయః

దేహము అశుచి-జరాది దోష గ్రస్తము

సనత్కుమార ఉవాచ |

శృణు వ్యాస మహాబుద్ధే దేహస్యాశుచితం మునే | మహత్త్వం చ స్వభావస్య సమాసాత్కథయామ్యహమ్‌ || 1

శుక్రశోణితసంయోగాద్దేహస్సంజాయతే యతః | నిత్యం విణ్మూత్రసంపూర్ణస్తేనాయమశుచిస్స్మృతః || 2

యథాంతర్విష్ఠయా పూర్ణశ్శుచిమాన్న బహిర్ఘటః | శోధ్యమానో హి దేహో%యం తేనాయమశుచితస్తతః || 3

సంప్రాప్యాతి పవిత్రాణి పంచగవ్యం హవీంషి చ | అశుచిత్వం క్షణాద్యాంతి కిమన్యదశుచిస్తతః || 4

హృద్యాన్నప్యన్నపానాని యం ప్రాప్య సురభీణి చ | అశుచిత్వం ప్రయాంత్యాశు కిమన్యదశుచిస్తతః || 5

హే జనాః కిం న పశ్యంతి యన్నిర్యాతి దినే దినే | స్వదేహాత్కశ్మలం పూతిస్తదాధారః కథం శుచిః || 6

దేహస్సంశోధ్యమానో%పి పంచగవ్యకుశాంబుభిః | ఘృష్యమాణ ఇవాంగారో నిర్మలత్వం న గచ్ఛతి || 7

స్రోతాంసి యస్య సతతం ప్రభవంతి గిరేరివ | కఫమూత్రపురీషాద్యైస్య దేహశ్శుధ్యతే కథమ్‌ || 8

సర్వాశుచినిధానస్య శరీరస్య న విద్యతే | శుచిరేకః ప్రదేశో%పి విణ్మూత్రస్య దృతేరివ || 9

స్పృష్ట్వాత్మదేహస్రోతాంసి మృత్తోయైశ్శోధ్యతే కరః | తథాప్యశుచిభండస్య న విభ్రశ్యతి కింకరః || 10

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

ఓ వ్యాసా! నీవు మహాబుద్ధిశాలివి. ఓ మునీ! దేహముయొక్క అశుచిని గురించి, స్వభావముయొక్క గొప్పదనమును గురించి సంగ్రహముగా చెప్పెదను. వినుము (1). దేహము శుక్రోశోణితముల కలయికచే పుట్టినదగుటచే, సర్వకాలములలో మలమూత్రములతో నిండియుండును. కావుననే, దేహము అశుచి యని చెప్పబడినది (2). లోపల మలముతో కూడియున్న కుండ బయట శుభ్రముగా నుండజాలదు. అదే విధముగా, ఈ దేహమును శుభ్రము చేయుచున్ననూ, మరల మలినమగుచుండును. కావుననే ఇది అశుచి యని చెప్పబడినది (3). పరమపవిత్రమగు పంచగవ్యము (పాలు, పెరుగు, వెన్న మొదలగు వాటి మిశ్రమము)ను మరియు యజ్ఞప్రసాదమును భక్షించిన తరువాత కూడ క్షణకాలములో ఈ దేహము మరల అశుచి యగును. దీనికంటే అధికమగు అశుచి మరియేది గలదు? (4) ఉల్లాసకరము, పరిమళభరితము అగు అన్నము మరియు పానీయములు ఈ దేహమును పొంది శీఘ్రముగా అశుచి యగుచున్నవి. దీనికంటే అధికమగు అశుచి మరియేది గలదు ? (5) ఓ జనులారా! ప్రతిదినము మనము దేహమునుండి వెలువడే మాలిన్యమును, కుళ్లును చూచుట లేదా? వాటికి ఆశ్రయమగు దేహము శుచి యెట్లగును? (6) బొగ్గును ఉతికి ఆరవేసిననూ తెల్లబడదు. అటులనే పంచగవ్యము మరియు దర్భజలము అను వాటిచే పవిత్రము చేయబడుచున్నప్పటికీ దేహము శుచి కాదు (7). కొండనుండి జలము కొండకాలువల రూపములో ప్రవహించు విధముగా, దేహము నుండి శ్లేష్మము మరియు మలమూత్రముల రూపములో మాలిన్యము నిరంతరముగా ప్రవహించుచునే యుండును. అట్టి దేహము శుచి యగుట ఎట్లు సంభవమగును? (8). సకలమాలిన్యములకు నిలయమగు శరీరము మలమూత్రములతో నిండియున్న తోలుతిత్తి వంటిది. దానిలో శుచియగు భాగము లేశ##మైననూ లేదు (9). దేహమునుండి స్రవించే మాలిన్యమును ముట్టుకున్న వెంటనే మనము చేతిని మట్టితో తోమి నీటితో శుభ్రము చేసుకొనవలెను. అయిననూ, మాలిన్యమునకు ఆశ్రయమైన దేహమునకు బానిసయైన మానవుడు భ్రష్టుడు కాడా యేమి? (10)

కాయస్సుగంధధూపాద్యైర్యత్నేనాపి సుసంస్కృతః | న జహాతి స్వభావం స శ్వపుచ్ఛమిమ నామితమ్‌ || 11

యథా జాత్యైవ కృష్ణోర్థశ్శుక్లస్స్యాన్న హ్యుపాయతః | సంశోధ్యమానాపి తథా భ##వేన్మూర్తిర్న నిర్మలా || 12

జిఘ్రన్నపి స్వదుర్గంధం పశ్యన్నపి స్వకం మలమ్‌ | న విరజ్యేత లోకో%యం పీడయన్నపి నాసికామ్‌ || 13

అహో మోహస్య మాహాత్మ్యం యేనేదం ఛాదితం జగత్‌ | శీఘ్రం పశ్యన్‌ స్వకం దోషం కాయస్య న విరజ్యతే || 14

స్వదేహస్య విగంధేన న విరజ్యేత యో నరః | విరాగకారణం తస్య కిమేతదుపదిశ్యతే || 15

సర్వసై#్యవ జగన్మధ్యే దేహ ఏవాశుచిర్భవేత్‌ | తన్మలావయవస్పర్శాచ్ఛుచిరప్యశుచిర్భవేత్‌ || 16

గంధలేపాపనోదార్ధం శౌచం దేహస్య కీర్తితమ్‌ | ద్వయస్యాపగమాచ్ఛుద్ధిశ్శుద్ధస్పర్శాద్విశుధ్యతి || 17

గంగాతోయేన సర్వేణ మృద్భారైః పర్వతోపమైః | ఆమృత్యోరాచరేచ్ఛౌచం భావదుష్టోన శుధ్యతి || 18

తీర్థస్నానైస్తపోభిర్వా దుష్టాత్మా నైవ శుధ్యతి | శ్వదృతిః క్షాలితా తీర్థే కిం శుద్ధిమధిగచ్ఛతి || 19

అంతర్భావప్రదుష్టస్య విశతో%పి హుతాశనమ్‌ | న స్వర్గో నాపవర్గశ్చ దేహనిర్దహనం పరమ్‌ || 20

సర్వేణ గాంగేన జలేన సమ్యఙ్‌ మృత్పర్వతేనాప్యథ భావదుష్టః |

ఆజన్మనస్స్నానపరో మనుష్యో న శుధ్యతీత్యేవ వయం వదామః || 21

కుక్క తోకను ఎంత లాగి కట్టినా, అది వంకరగనే యుండును. అదే విధముగా, సుగంధము, ధూపము మొదలగు ద్రవ్యములతో దేహమును ప్రయత్నపూర్వకముగా శుద్ధి చేసిననూ, అది తన అశుచిస్వభావమును విడనాడదు (11). సహజసిద్ధముగా నల్లగా నుండే వస్తువును వివిధోపాయములచే చక్కగా శుద్ధిచేసిననూ, అది తెల్లబడదు. అదే విధముగా చక్కగా శుద్ధి చేసిననూ దేహము మాలిన్యములు లేనిదిగా కాదు (12). మానవుడు తన దేహము యొక్క దుర్గంధమును భరించలేక ముక్కును మూసుకొనును. ఈ మానవుడు తన మాలిన్యమును తాను చూచుచున్ననూ, విరక్తిని పొందకున్నాడు (13). ఆశ్చర్యము ! మోహము ఎంత గొప్పదియో ! ఈ జగత్తు మోహముచే కప్పివేయబడి యున్నది. మానవుడు తన దేహముయొక్క దోషములను చూచుచున్ననూ, శీఘ్రముగా విరక్తిని పొందుట లేదు (14). తన దేహముయొక్క దుర్గంధముచే విరక్తిని పొందని వ్యక్తికి వైరాగ్యమును కలిగించే ఉపదేశమున బోధించి ప్రయోజనమేమున్నది? (15). ఈ సర్వజగత్తులో దేహము మాత్రమే అతిశయించిన మాలిన్యములను కలిగియున్నది. మాలిన్యములతో కూడిన దేహావయవములను స్పృశించినంత మాత్రాన శుద్ధమైన వస్తువు కూడ అశుచియగును (16). దేహమునుండి స్రవించే ద్రవములను, మరియు గంధమును తొలగించుట కొరకై దానికి శౌచము విధించబడినది. ఈ రెండు దోషములు తొలగినచో, అది శుద్ధమగును. మరియు శుద్ధవస్తువుయొక్క స్పర్శచేత కూడ దేహము శుద్ధమగును (17). దుష్టములగు భావములు గల వ్యక్తి గంగాజలమునంతనూ పోసి కడిగిననూ, పర్వతముల పరిమాణము గల మట్టితో రుద్దిననూ, మరణించు వరకు శుద్ధికర్మలను చేసిననూ శుద్ధిని పొందడు (18). దుష్టమగు బుద్ధిగల వ్యక్తి తీర్థములయందు స్నానములను చేయుట చేత, తపస్సుల చేత శుద్ధిని పొందే ప్రసక్తి లేదు. కుక్కతోలును తీర్థజలముతో కడిగినచో, అది శుద్ధమగునా యేమి? (19) అంతఃకరణములో దుష్టుడైన వ్యక్తి నిప్పులలో దుమికిననూ, ఒళ్లు కాలుట తప్ప స్వర్గము గాని, మోక్షము గాని లభించబోదు (20). దుష్టమైన అంతఃకరణము గల వ్యక్తి బ్రతికి ఉన్నంతకాలము సకలమగు గంగాజలముతో స్నానమును చేయుచూ గడిపిననూ, పర్వతమంతటి మట్టితో శరీరమును రుద్దిననూ, లేశ##మైననూ శుద్ధిని పొందలేడని మేము చెప్పుచున్నాము (21).

ప్రజ్వాల్య వహ్నిం ఘృతతైలసిక్తం ప్రదక్షిణావర్తశిఖం మహాంతమ్‌ |

ప్రవిశ్య దగ్ధస్త్వపి భావదుష్టో న ధర్మమాప్నోతి ఫలం న చాన్యత్‌ || 22

గంగాదితీర్థేషు వసంతి మత్స్యా దేవాలయే పక్షిగణాశ్చ నిత్యమ్‌ |

భావోజ్ఘితాస్తే న ఫలం లభంతే తీర్థావగాహాచ్చ తథైవ దానాత్‌ || 23

భావశుద్ధిః పరం శౌచం ప్రమాణ సర్వకర్మసు | అన్యథా%%లింగ్యతే కాంతా భావేన దుహితాన్యథా || 24

మనసో భిద్యతే వృత్తిరభిన్నేష్వపి వస్తుషు | అన్యథైవ సుతం నారీ చింతయత్యన్యథా పతిమ్‌ || 25

పశ్యధ్వమస్య భావస్య మహాభాగ్యమశేషతః | పరిష్వక్తో%పి యన్నార్యా భావహీనాం న కామయేత్‌ || 26

నాద్యాద్వివిధమన్నాద్యం భక్ష్యాణి సురభీణి చ | యది చింతాం సమాధత్తే చిత్తే కామాదిషు త్రిషు || 27

గృహ్యతే తేన భావేన నరో భావాద్విముచ్యతే | భావతశ్శుచిశుద్ధాత్మా స్వర్గం మోక్షం చ విందతి || 28

భావేనైకాత్మశుద్ధాత్మా దహన్‌ జుహ్వన్‌ స్తువన్‌ మృతః | జ్ఞానావాప్తేరవాప్యాశు లోకాన్‌ సుబహుయాజినామ్‌ || 29

జ్ఞానామలాంభసా పుంసాం సద్వైరాగ్యమృదా పునః | అవిద్యారాగవిణ్మూత్రలేపగంధవిశోధనమ్‌|| 30

ఏవమేతచ్ఛరీరం హి నిసర్గాదశుచి స్మృతమ్‌ | త్వఙ్మత్రసారం నిస్సారం కదలీసారసన్నిభమ్‌ || 31

జ్ఞాత్వైవం దోషవద్దేహం యః ప్రాజ్ఞశ్శిథిలో భ##వేత్‌ | దేహభోగోద్భవాద్భావాచ్ఛమచిత్తః ప్రసన్నధీః || 32

సో%తిక్రామతి సంసారం జీవన్ముక్తః ప్రజాయతే | సంసారం కదలీసారదృఢగ్రాహ్యవతిష్ఠతే || 33

దుష్టమైన అంతఃకరణము గల వ్యక్తి అగ్నిని వ్రేల్చి దానిని నేయిని మరియు నూనెను పోసి ప్రజ్వరిల్ల జేసి, పెద్ద జ్వాలలతో సుడులు తిరుగుచున్న ఆ అగ్నికి ప్రదక్షిణము చేసి, దానియందు దుమికి దహింపబడిననూ, వానికి ధర్మము గాని, మరియొక ఫలము గాని దక్కదు (22). గంగ మొదలగు పవిత్రనదీజలములలో చేపలు బ్రతుకుచున్నవి. పక్షులు గుంపులు నిత్యము దేవాలయములో నివసించుచున్నవి. కాని వాటికి భగవద్భావము లేకుండుటచే, పుణ్యఫలము లభించదు. అదే విధముగా, భావములో దుష్టుడైన వ్యక్తి పుణ్యనదులలో మునిగిననూ, దానము చేసినూ, ఫలము నున్న (23). కర్మలన్నింటియొక్క పవిత్రత పూర్తిగా అంతఃకరణశుద్ధిపై ఆధారపడియున్నది. మానవుడు తన భార్యను కౌగిలించుకున్నప్పుడు, మరియు కుమార్తెను కౌగిలించుకున్నప్పుడు భావము వేరుగా నుండును (24). వస్తువులలో భేదము లేకున్ననూ, మనస్సులోని భావములలో భేదము ఉండును. స్త్రీ కుమారునియందు ఒక భావమును, భర్తయందు మరియొక భావమును కలిగియుండును (25). ఈ మనోభావముయొక్క మహాభాగ్యమును గాంచుడు. పురుషుడు ఒక స్త్రీచే కౌగిలించుకొన బడిననూ, ఆమెయందు ప్రేమ లేనిచో, ఆమెను కామించడు (26). మనస్సు కామక్రోధలోభములనే భావములచే చింతను గొని యున్నచో, అట్టి మానవుడు సుగంధయుక్తములగు వివిధభక్ష్యములను మరియు రుచ్యమగు అన్నమును భుజించలేడు. (27). మానవుడు మనోభావములచే బంధింపబడును. కాని శుద్ధమగు మనోభావములు గల వ్యక్తి భావములనుండి విముక్తుడై స్వర్గమును మరియు మోక్షమును కూడ పొందును (28). శుద్ధమగు భావములచే ఏకాగ్రము మరియు పవిత్రము అగు అంతఃకరణము గల మానవుడు దహింపబడిన మాలిన్యము గలవాడై, హోమములను చేసి, భగవానుని స్తుతించి, శీఘ్రముగా జ్ఞానమును పొందినవాడై, దాని ప్రభావముచే మరణించిన తరువాత, అనేకములగు గొప్ప యజ్ఞములను చేయువారు పొందే లోకములను పొందును (29). మానవులు మలమూత్రములవంటి అజ్ఞానకామముల వలన కలిగే మాలిన్యమును మరియు దుర్గంధమును, జ్ఞానము అనే పవిత్రమగు జలమును ఉపయోగించి చక్కని వైరాగ్యము అనే మట్టితో తోముట వలన పోగొట్టుకొనవచ్చును (30). ఈ విధమగుఆ ఈ శరీరము సహజముగనే అశుచి యిని చెప్పబడినది. అరటి బోదె వలె నిస్సారమైన ఈ శరీరముయొక్క పస, పైన కప్పియున్న చర్మము మాత్రమే (31). ఏ వివేకి ఈ విధముగా దేహము దోషములతో కూడియున్నదని గ్రహించి శాంతమగు మనస్సు,ప్రసన్నమగు బుద్ధిగలవాడై దేహభోగములయందలి ఆసక్తిని బలహీనము చేసుకొని యుండునో (32). అట్టి మానవుడు సంసారమును అతిక్రమించి జీవించియుండగనే ముక్తుడగును. అరటి బోదె వలె నిస్సారమైన సంసారమును గట్టిగా పట్టుకున్న వ్యక్తి సంసారములో స్థిరముగా నుండును (33).

ఏవమేతన్మహాకష్టం జన్మ దుఃఖం ప్రకీర్తితమ్‌ | పుంసామజ్ఞానదోషేణ నానాకర్మవశేన చ || 34

శ్లోకార్ధేన తు వక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః | మమేతి పరమం దుఃఖం న మమేతి పరం సుఖమ్‌ || 35

బహవోపీహ రాజానః పరం లోకమితో గతాః | నిర్మమత్వసమేతాస్తు బద్ధాశ్శతసహస్రశః || 36

గర్భస్థస్య స్మృతిర్యాసీత్సా చ తస్య ప్రణశ్యతి | సంమూర్ఛితేన దుఃఖేన యోనియంత్రనిపీడనాత్‌ || 37

బాహ్యేన వాయునా వాస్య మోహసంగేన దేహినః | స్సృష్టమాత్రేణ ఘోరేణ జ్వరస్సముపజాయతే || 38

తేన జ్వరేణ మహతా సమ్మోహశ్చ ప్రజాయతే | సమ్మూఢస్య స్మృతి భ్రంశశ్శీఘ్రం సంజాయతే పునః || 39

స్మృతిభ్రంశాత్తతస్తస్య స్మృతిర్నో పూర్వకర్మణః | రతిస్సంజాయతే తూర్ణం జంతోస్తత్రైవ జన్మని || 40

రక్తో మూఢశ్చ లోకో%యం న కార్యే సంప్రవర్తతే | న చాత్మానం విజనాతి న పరం న చ దైవతమ్‌ || 41

న శృణోతి పరం శ్రేయస్సతి కర్ణేపి సన్మునే | న పశ్యతి పరం శ్రేయస్సతి చక్షుషి తత్‌క్షమే || 42

సమే పథి శ##నైర్గచ్ఛన్‌ స్థలతీవ పదే పదే | సత్యాం బుద్ధౌ న జానాతి బోధ్యమానో బుధైరపి || 43

సంసారే క్లిశ్యతే తేన గర్భలోభవశానుగః | గర్భస్మృతేన పాపేన సముజ్ఝి తమతిః పుమాన్‌ || 44

ఈ విధముగా జీవులు అజ్ఞానమనే దోషముచే వివిధకర్మలకు వశులై మిక్కిలి క్లేశకరమైన జన్మదుఃఖమును పొందెదరని చెప్పబడినది (34). కోటి గ్రంథములలో చెప్పబడిన జ్ఞానముయొక్క సారమును సగము శ్లోకములో చెప్పెదను. నాది అను బుద్ధి మహా దుఃఖహేతువు. నాది కాదు అనే బుద్ధి మహాసుఖమును ఇచ్చును (35). లక్షలు సంఖ్యలో రాజులు ఈ లోకములో సంసారమునందు బద్ధులై యున్ననూ మమకారమును విడిచిపెట్టి శ్రేష్ఠమగు లోకములను పొందిరి (36). జీవునకు గర్భములోనుండగా కొద్ది వివేకము ఉండును. కాని జన్మసమయములో కలిగే నలుగుడు వలన దుఃఖము వలన జీవుడు ఆ స్మృతిని గోల్పోవును (37). జీవుడు పుట్టుటతోడనే ఘోరమగు మోహమును పొందును. బయటనుండే గాలి తగులుట తోడనే ఆ శిశువును అజ్ఞానమనే జ్వరము వచ్చును (38). ఆ గోప్ప జ్వరముచే జీవునకు గొప్ప వ్యామోహము కలుగును. ఆ వ్యామోహము కలిగిన వెంటనే జీవుడు స్మృతిని గోల్పోవును (39). స్మృతిని గోల్పోవుటచే ఆ జీవునకు పూర్వములో చేసిన కర్మలు గుర్తులో నుండవు. వెంటనే జీవునకు ఆ జన్మయందు మాత్రమే ఆసక్తి దృఢమగును (40). మూర్ఖుడగు ఈ జీవుడు దేహమునందు అనురాగము గలవాడై కర్తవ్యకర్మలను విడిచిపెట్టును. ఆతడు ఆత్మస్వరూపమునుగాని, పరమేశ్వరతత్త్వమును గాని తెలియజాలడు (41). ఓ మహర్షీ! మానవుడు చెవి ఉన్ననూ మోక్షమునిచ్చే జ్ఞానమును శ్రవణము చేయడు. పరమపురుషార్థమును చూడగలిగే జ్ఞాననేత్రము ఉన్ననూ, మానవుడు దానిని చూడడు (42). చదునైన నేలపై మెల్లగా నడుచుచున్ననూ, మానవుడు ప్రతి అడుగులో తూలుచున్నాడా యన్నట్లు ప్రవర్తించును. బుద్ధి ఉన్ననూ, మానవుడు పండితుల ఉపదేశమును తెలుసుకొనడు (43). మానవుడు లోభమునకు వశవర్తియై సంసారములో కష్టములననుభవించుచుండును. ఆతడు గర్భములో నుండగా తాను చేసిన పాపములను స్మరించెడివాడు. కాని ఇప్పుడు వానికి ఆ స్మృతి కరువైనది (44).

ఇత్థం మహత్పరం దివ్యం శాస్త్రముక్తం శివేన తు | తపసః కథానార్థాయ స్వర్గమోక్షప్రసాధనమ్‌ || 45

యే సత్యస్మిన్‌ శివే జ్ఞానే సర్వకామార్థసాధనే | న కుర్వంత్యాత్మనః శ్రేయస్తదత్ర మహదద్భుతమ్‌ || 46

అవ్యక్తేంద్రియవృత్తిత్వాద్బాల్యే దుఃఖం మహత్పునః | ఇచ్ఛన్నపి న శక్నోతి వక్తుం కర్తుం ప్రతిక్రియామ్‌ || 47

దంతోత్థానే మహద్దుఃఖమల్పేన వ్యాధినా తథా | బాలారోగైశ్చ వివిధైః పీడా బాలగ్రహైరపి || 48

క్వచిత్‌ క్షుత్తృట్‌ పరీతాంగః క్వచిత్తిష్ఠతి సంరటన్‌ | విణ్మూత్రభక్షణాద్యం చ మోహాద్బాలస్సమాచరేత్‌ || 49

కౌమారే కర్ణపీడాయాం మాతాపిత్రోశ్చ సాధనైః | అక్షరాధ్యయనాద్యైశ్చ నానాదుఃఖం ప్రవర్తతే || 50

బాల్యే దుఃఖమతీత్యైవ పశ్యన్నపి విమూఢధీః | న కుర్వీతాత్మనః శ్రేయస్తదత్ర మహదద్భుతమ్‌ || 51

ప్రవృత్తేంద్రియవృత్తిత్వాత్కామరోగప్రపీడనాత్‌ | తదప్రాప్తే తు సతతం కుతస్సౌఖ్యం తు ¸°వనే || 52

ఈర్ష్యయా చ మహద్దుఃఖం మోహాద్రక్తస్య తస్య చ | నేత్రస్య కుపితస్యేవ త్యాగీ దుఃఖాయ కేవలమ్‌ || 53

న రాత్రౌ విందతే నిద్రాం కామాగ్నిపరివేదితః | దివాపి చ కుతస్సౌఖ్యమర్థోపార్జనచింతయా || 54

స్త్రీష్వధ్యాసితచిత్తస్య యే పుంసశ్శుక్రబిందవః | తే సుఖాయ న మన్యంతే స్వేదజా ఇవ తే తథా || 55

స్వర్గమును మరియు మోక్షమును సంపాదించి పెట్టే గొప్ప పరమదివ్యశాస్త్రమును శివుడు తపస్సును వర్ణించే సందర్భములో ఈ విధముగా చెప్పినాడు (45). కోరికల నన్నింటినీ ఈడేర్చే ఈ శివజ్ఞానము ఉపలభ్యముగా నున్ననూ జనులు ఆత్మశ్రయస్సును సాధించుకొనక పోవుట గొప్ప ఆశ్చర్యము (46). జీవునకు బాల్యములో ఇంద్రియవ్యాపారములు స్పష్టముగా వృద్ధి చెంది యుండకపోవుటచే పదే పదే మహాదుఃఖము కలుగుచుండును. బాలుడు కోరిక ఉన్ననూ పైకి చెప్పలేడు. తనకు ఇబ్బంది కలుగుచున్ననూ, ప్రతిక్రియను చేసుకొనలేడు (47). శిశువునకు పళ్లు వచ్చినప్పుడు చాల నొప్పి కలుగును. ఇంతే గాక, వివిధరకములైన చిన్నపిల్లల వ్యాధులచేత మరియు బాలగ్రహములచేత శిశువు పీడింపబడును (48). ఒకప్పుడు శిశువు ఆకలిదప్పికలచే పీడింపబడిన అవయవములను కలిగియుండును. మరియొకప్పుడు ఏడ్చుచూ నిలబడియుండును. బాలుడు అజ్ఞానముచే మలమూత్రములను కూడ నోటిలో పెట్టుకొనును (49). చిన్న వయస్సులో జీవునకు చెవులను కుట్టించుట వలన చాల నొప్పి కలుగును. తల్లిదండ్రులు వానిని శిక్షించుచుందురు. అక్షరములను నేర్చుకొనుట మొదలగు అనేకదుఃఖములు బాలునకు కలుగుచుండును (50). ఈ విధముగా బాల్యదుఃఖము గడిచిననూ, జీవుడు అతిశయించిన మోహము గలవాడగుటచే, చూపు ఉండియు చూడజాలక, తనకు హితమగు పనిని చేయడు. మానవజీవితములోని పెద్ద ఆశ్చర్యము ఇదియే (51). ¸°వనములో ఇంద్రియవ్యాపారములు ఆరంభమగును. కామము అనే రోగము వ్యక్తిని పీడించుచుండును. ఆ కామము ఏ కాలమునందైననూ తీరే ప్రసక్తి లేదు. అట్టి ¸°వనములో సుఖము ఎక్కడిది? (52) యువకుడు ఈర్ష్యచే మహాదుఃఖమును పొందును. మోహముచే ఆతని కన్నులు ఎర్రబడి కోపించినవాని కన్నులను బోలియుండును. శక్తి లేక కోరికలను వదిలి పెట్టినచో, అది కేవలము దుఃఖమునకు మాత్రమే కారణమగును (53). మానవుడు రాత్రియందు కామము అనే అగ్నిచే తపింపజేయబడినవాడై నిద్ర పోలేడు. ఆతడు పగలు కూడ డబ్బు సంపాదన అనే చింతలోనుండును. ఆతనికి సౌఖ్యము ఎక్కడిది? (54). స్త్రీలయందు లగ్నమైన మనస్సు గల పురుషునకు స్థలితమైన శుక్రబిందువులు చెమట వలె మాలిన్యహేతువులే గాని, సుఖహేతువులుగా పరిగణింపబడవు (55).

కృమిభిస్తుద్యమానస్య కుష్ఠినో వానరస్య చ | కండూయనాభితేపేన యద్భవేత్‌ స్త్రిషు తద్విదః || 56

యాదృశం మన్యతే సౌఖ్యం గండే పూతివినిర్గమాత్‌ | తాదృశం స్త్రీషు మంతవ్యం నాధికం తాసు విద్యతే || 57

విణ్మూత్రస్య సముత్సర్గాత్సుఖం భవతి యాదృశమ్‌ | తాదృశం స్త్రీషు విజ్ఞేయం మూఢైః కల్పితమన్యథా || 58

నారీష్వవస్తుభూతాసు సర్వదోషాశ్రయాసు చ| నాణుమాత్రం సుఖం తాసు కథితం పంచచూడయా || 59

సమ్మాననావమానాభ్యాం వియోగేనేష్టసంగమాత్‌ | ¸°వనం జరయా గ్రస్తం క్వ సౌఖ్యమనుపద్రవమ్‌|| 60

వలీపలితఖాలిత్యైశ్శిథిలీకృతవిగ్రహమ్‌ | సర్వక్రియాస్వశక్తిం చ జరయా జర్జరీకృతమ్‌ || 61

స్త్రీపుంస¸°వనం హృద్యమన్యోన్యస్య ప్రియం పురా | తదేవ జరయా గ్రస్తమనయోరపి న ప్రియమ్‌ || 62

అపూర్వవత్స్వమాత్మానం జరయా పరివర్తితమ్‌ | యః పశ్యన్నపి రజ్యేత కో%న్యస్తస్మాదచేతనః || 63

జరాభిభూతః పురుషః పుత్రీపుత్రాదిబాంధవైః | అసక్తత్వాద్దురాధర్షైర్భృత్యైశ్చ పరిభూయతే || 64

ధర్మమర్థం చ కామం వా మోక్షం వాతిజరాతురః | అశక్తస్సాధితుం తస్మాద్యువా ధర్మం సమాచరేత్‌ || 65

ఇతి శ్రీశివమహాపురాణ ఉమాసంహితాయాం దేహాశుచిత్వదుఃఖహేతుత్వాది వర్ణనం నామ త్రయోవింశో%ధ్యాయః (23)

కుష్ఠు రోగముతో బాధపడుచున్న కోతి క్రిములచే పీడింపబడుచున్న తన దేహమును గోకుకొని కొంత సుఖమును పొంది తరువాత తాపమును పొందును. మానవుడు పొందే కామసుఖము కూడ అట్టిది మాత్రమేనని అభిజ్ఞులు చెప్పెదరు (56). కురుపు నుండి చీము బయట పడినప్పుడు ఎట్టి సౌఖ్యము కలుగునో, కామభోగములయందలి సుఖము అట్టిది మాత్రమే. అంతకు మించిన సుఖము కామభోగములయందు లేదు (57). మలమూత్రములను విసర్జించుట వలన ఎట్టి సుఖము కలుగునో, కామభోగములయందలి కూడ సుఖము అట్టిదియేనని తెలియవలెను. కాని, మూర్ఖులు వాటియందు అధికసౌఖ్యము గలదని భ్రమించెదరు (58). కామభోగములు సర్వదోషములకు ఆశ్రయమనియు, అవి యథార్థములు కావనియు, వాటియందు సుఖము లేశమాత్రమైననూ లేదనియు పంచచూడ చెప్పియున్నది (59). సమ్మానమును వెన్నంటి అవమానము గలదు. ప్రియసమాగమము వెంటనే వియోగము కలుగుచున్నది. ¸°వనమును వృద్ధాప్యము మ్రింగివేయుచున్నది. దుఃఖముయొక్క బెడద లేని సుఖము ఎక్కడనున్నది? (60) వృద్ధాప్యములో తల పండి, చర్మము ముడతలు పడియుండును. తల బట్టతల యగును. శరీరము పెద్ద వయస్సుచే శిథిలమై యుండుటచే ఏ పనిని చేయుటకైననూ శక్తి ఉండదు (61). ముసలితనములోనున్న స్త్రీ పురుషులే పూర్వమునందు ¸°వనములో నున్నప్పుడు మనోహరమగు దేహములు గలవారై అన్యోన్యానురాగమును కలిగియుండెడివారు. ఆ దేహములు ఇప్పుడు వృద్ధాప్యముచే కబళించి వేయబడి యున్నప్పుడు ఆ ప్రీతి దూరమగును (62). వృద్ధాప్యముయొక్క ప్రభావముచే గుర్తు పట్టలేనంతటి మార్పులకు గురియై యున్న స్వీయదేహమును చూచుచున్ననూ, ఇంకనూ దానియందు రాగమును కలిగియుండే వ్యక్తి కంటే మూర్ఖుడు మరియొకడు ఎవడు గలడు? (63) వృద్ధాప్యముచే పరాజితుడై యున్న వ్యక్తియందు పుత్రుడు, పుత్రిక మొదలగు బంధువులకు అనురాగము ఉండదు. కావున, ఆతడు వారిని అదుపులో పెట్టజాలడు. అట్టి వానిని సేవకులు కూడ అవమానించెదరు (64). ముసలితనముచే పీడింపబడుచున్న వ్యక్తి ధర్మమునుగాని, అర్థమును గాని, కామమునుగాని, మోక్షమును గాని సాధించలేడు. కావున, మానవుడు యువకుడై ఉండగనే ధర్మమును ఆచరించవలెను (65).

శ్రీ శివమహాపురాణములో ఉమాసంహితయందు దేహముయొక్క అశుచిత్వమును జరాదిదోషములను వర్ణించే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23).

Siva Maha Puranam-3    Chapters