Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Siva Maha Puranam-3    Chapters   

అథ అష్టాదశో%ధ్యాయః

సప్త ద్వీప వర్ణనము

సనత్కుమార ఉవాచ |

వక్ష్యే%హం భారతం వర్షం హిమాద్రేశ్చైవ దక్షిణ | ఉత్తరే తు సముద్రస్య భారతీ యత్ర సంస్కృతిః || 1

నవయోజనసాహస్రో విస్తారో%స్య మహామునే | స్వర్గాపవర్గయోః కర్మభూమిరేషా స్మృతా బుధైః || 2

యతస్సంప్రాప్యతే పుంభిస్స్వర్గో నరక ఏవ చ | భారతస్యాపి వర్షస్య నవ భేదాన్‌ బ్రవీమి తే || 3

ఇంద్రద్యుమ్నః కసేరుశ్చ తామ్రవర్ణో గభస్తిమాన్‌ | నాగద్వీపస్తథా సౌమ్యో గంధర్వస్త్వథ వారుణః || 4

అయం తు నవమస్తేషాం ద్వీపస్సాగరసంభృతః | యోజనానాం సహస్రం తు ద్వీపో%యం దక్షిణోత్తరః || 5

పూర్వే కిరాతా యస్య స్యుర్దక్షిణ యవనాః స్థితాః | పశ్చిమే చ తథా జ్ఞేయా ఉత్తరే హి తపస్వినః || 6

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా మధ్యే శూద్రాశ్చ భూయశః | ఇజ్యాయుద్ధపణాసేవా వర్తయంతో వ్యవస్థితాః || 7

మహేంద్రో మలయస్సహ్యస్సుదామా చర్‌క్షపర్వతః | వింధ్యశ్చ పారియాత్రశ్చ సప్తాత్ర కులపర్వతాః || 8

వేదస్మృతిపురాణాద్యాః పారియాత్రోద్భవా మునే | సర్వపాపహరా జ్ఞేయా దర్శనాత్స్పర్శనాదపి || 9

నర్మదాసురసాద్యాశ్చ సప్తాన్యాశ్చ సహస్రశః | వింధ్యోద్భవా మహానద్యస్సర్వపాపహరాశ్శుభాః || 10

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

ఇప్పుడు నేను భారతదేశమును గూర్చి చెప్పగలను. హిమవత్పర్వతమునకు దక్షిణముగా మరియు సముద్రమునకు ఉత్తరముగా వ్యాపించియున్న భూభాగములోని సమాజము భారతీయసమాజము. ఇచటి జీవనశైలి భారతీయసంస్కృతికి సంబంధించినది (1). ఓ మహర్షీ! ఈ భూభాగము తొమ్మిది వేల యోజనములు విస్తీర్ణమును కలిగియున్నది. ఇది జనులకు స్వర్గమును మరియు మోక్షమును ఇచ్చే కర్మభూమి అని పండితులు చెప్పుచున్నారు (2). ఏలయనగా,ఈ భూమిలో కర్మను చేయు జనులు స్వర్గనరకములు పొందెదరు. ఈ భారతభూభాగములోని తొమ్మిది విభాగములను గురించి నీకు చెప్పెదను (3). ఇంద్రద్యుమ్నము, కసేరువు, తామ్రవర్ణము, గభస్తిమాన్‌, నాగద్వీపము, సౌమ్యము, గంధర్వము, వారుణము మరియు సాగరసంభృతము అను విభాగములు గలవు. వీటిలో తొమ్మిదవ భూభాగము దక్షిణమునుండి ఉత్తరము వరకు వేయి యోజనములు వ్యాపించియున్న ద్వీపము (4, 5). భారతవర్షమునకు తూర్పునందు కిరాతులు, దక్షిణమునందు మరియు పశ్చిమమమునందు యవనులు, ఉత్తరమునందు తపశ్శాలురు గలరు (6). మధ్యభాగమునందు బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులు అధికముగా గలరు. వారు క్రమముగా యజ్ఞములను, యుద్ధముల ద్వారా దేశరక్షణను, వ్యాపారమును మరియు సేవాకార్యములను చేసి జీవించెదరు (7). భారతవర్షములో మహేంద్రము, మలయము, సహ్యము, సుదామ, ఋక్షపర్వతము, వింధ్యము, పారియాత్రము అను ఏడు కులపర్వతములు గలవు (8). ఓ మహర్షీ! పారియాత్ర పర్వతమునుండి పుట్టిన నదులను దర్శించి, స్పృశించి నంత మాత్రాన సకల పాపములు నశించునని తెలియదగునని వేదములు, స్మృతులు, పురాణములు మొదలగు గ్రంథములు చెప్పు చున్నవి (9). వింధ్యపర్వతము నుండి నర్మద, సురస మొదలగు ఏడు మహానదులు మరియు వేల సంఖ్యలో ఇతరనదులు పుట్టుచున్నవి. ఈ శుభనదులు సర్వపాపములను పోగొట్టును (10).

గోదావరీ భీమరథీ తాపీ ప్రముఖనిమ్నగాః | గిరేర్వినిర్గతా ఋక్షాత్సద్యః పాపభయాపహాః || 11

సహ్యపాదోద్భవా నద్యః కృష్ణా వేణ్యాదికాస్తథా | కృతమాలా తామ్రపర్ణీ ప్రముఖా మలయోద్భవాః || 12

త్రియామా చర్షికుల్యాద్యా మహేంద్రప్రభవాః స్మృతాః | ఋషికుల్యా కుమారాద్యాశ్శుక్తిమత్పాదసంభవాః || 13

నానాజనపదాస్తేషు మండలేషు వసంతి వై | ఆసాం పిబంతి పానీయం సరస్సు వివిధేషు చ || 14

చత్వారి భారతే వర్షే యుగాన్యాసన్మహామునే | కృతాదీని న చాన్యేషు ద్వీపేషు ప్రభవంతి హి || 15

దానాని చాత్ర దీయంతే సుకృతైశ్చాత్ర యాజ్ఞికైః | తపస్తపంతి యతయః పరలోకార్థమాదరాత్‌ || 16

యతో హి కర్మభూరేషా జంబూద్వీపే మహామునే | అత్రాపి భారతం శ్రేష్ఠమతో%న్యా భోగభూమయః || 17

కదాచిల్లభ##తే మర్త్యస్సహసై#్ర ర్మునిసత్తమ | అత్ర జన్మ సహస్రాణాం మానుష్యం పుణ్యసంచయైః || 18

స్వర్గాపవర్గాస్పదమార్గభూతే ధన్యాస్తు తే భారతభూమిభాగే |

గాయంతి దేవాః కిల గీతకాని భవంతి భూయః పురుషాస్సురాస్తే || 19

అవాప్య మానుష్యమయం కదాచిద్విహృత్య శంభోః పరమాత్మరూపే |

ఫలాని సర్వాణి తు కర్మజాని యాస్యామ్యహం తత్తనుతాం హి తస్య || 20

ఋక్షపర్వతమునుండి పుట్టిన నదులలో గోదావరి, భీమరథి మరియు తాపి అనునవి ప్రముఖమైనవి. అవి స్నానము చేసిన వెంటనే పాపభయమును పోగొట్టును (11). సహ్యపర్వతసానువుల నుండి కృష్ణ, వేణి మొదలగు నదులు ఉద్భవించినవి. మలయపర్వతము నుండి కృతమాల, తామ్రపర్ణి మొదలైన నదులు పుట్టినవి (12). త్రియామ, ఋషికుల్య మొదలైన నదులు మహేంద్రపర్వతమునుండి పుట్టినవి. మరియొక ఋషికుల్య మరియు కుమారి మొదలగు నదులు శుక్తిమత్పర్యతసానువులనుండియు పుట్టినవి (13). ఆయా మండలములలోని వివిధగ్రామములలోనివసించు జనులు ఈ నదుల జలమును మరియు వివిధసరస్సులలోని జలమును త్రాగుచున్నారు (14). ఓ మహర్షీ! భారతదేశములో కృతయుగముతో మొదలయ్యే నాలుగు యుగములు గలవు. ఈ యుగములు ఇతరద్వీపములలో లేవు (15). ఇచట యజ్ఞమును చేసిన పుణ్యాత్ములు దానములనిచ్చెదరు. యతులు పరలోకప్రాప్తి కొరకై శ్రద్ధతో ఇచట తపస్సును చేయుదురు (16). ఓ మహర్షీ! జంబూద్వీపములోని ఈ భారతదేశము కర్మభూమి యగుటచే శ్రేష్ఠము. ఇతరభూభాగములు భోగము కొరకు ఉద్దేశించబడినవి (17). ఓ మహర్షీ! జీవుడు వేలాది జన్మలలో సంపాదించిన పుణ్యముయొక్క ప్రభావముచే ఒకసారి ఇచట మనుష్యుడై పుట్టును (18). పుణ్యాత్ములగు దేవతలు స్వర్గమును మరియు మోక్షమును పొందుటకు ద్వారభూతమైన భారతభూమియందు పురుషులై జన్మించి ధన్యులగుదురని దేవతలు గానము చేయుచుందురు (19). నేను యాదృచ్ఛికముగా ఇచట మనుష్యుడనై జన్మించితిని. నేను ధ్యానమార్గములో శంభుని పరమాత్మ రూపమునందు విహరించి కర్మలు ఈయదగిన ఫలములను అన్నింటినీ పొంది తరువాత శివునిలో ఐక్యమును పొందెదను (20).

ఆప్స్యంతి ధన్యాః ఖలు తే మనుష్యాస్సుఖైర్యుతాః కర్మణి సన్నివిష్టాః |

జనుర్హి యేషాం ఖలు భారతే%స్తి తే స్వర్గమోక్షోభయలాభవంతః || 21

లక్షయోజనవిస్తారస్సమస్తపరిమండలః | జంబూద్వీపో మయా ఖ్యాతః క్షారోదధిసు సంవృతః || 22

సంవేష్ట్య క్షారముదధిం శతసాహస్రసమ్మితమ్‌ | తతో హి ద్విగుణో బ్రహ్మన్‌ ప్లక్షద్వీపః ప్రకీర్తితః || 23

గోమంతశ్చైవ చంద్రశ్చ నారదో దర్దురస్తథా | సోమకస్సుమనాశ్శైలో వైభ్రాజశ్చైవ సత్తమః || 24

వర్షాచలేషు రమ్యేషు సహితాస్సతతం ప్రజాః | వసంతి దేవగంధర్వా వర్షేష్వేతేషు నిత్యశః || 25

నాధయో వ్యాధయో వాపి జనానాం తత్ర కుత్రచిత్‌ | దశ వర్షసహస్రాణి తత్ర జీవంతి మానవాః || 26

అనుతప్తా శిఖీ చైవ పాపఘ్నీం త్రిదివా కృపా | అమృతా సుకృతా చైవ సపై#్తవాత్ర చ నిన్నుగాః || 27

క్షుద్రనద్యస్తథా శైలాస్తత్ర సంతి సహస్రశః | తాః పిబంతి సుసంహృష్టా నదీర్జనపదాస్తు తే || 28

న తత్రాపి యుగావస్థా యథా స్థానేషు సప్తసు | త్రేతాయుగసమః కాలస్సర్వదైవ మహామునే || 29

విప్రక్షత్రియవైశ్యాస్తే శూద్రాశ్చ మునిసత్తమ | కల్పవృక్షసమానస్తు తన్మధ్యే సుమహాతరుః || 30

ఏ మానవులైతే భారతదేశములో జన్మించి కర్మలను చేయుచూ సుఖములననుభవిస్తూ జీవించెదరో, వారు ధన్యులు. వారికి స్వర్గము మరియు మోక్షము అనే రెండు లాభములు కలుగును (21). లక్ష యోజనముల వైశాల్యము కలిగి ఉప్పునీటి సముద్రముతో చుట్టువారబడియున్న జంబూద్వీపము అనేకములగు అవాంతరభూభాగములతో కూడియున్నది. నేను దానిని గురించి చెప్పితిని (22). ఓ మహర్షీ! లక్షయోజనముల విస్తారము గల ఉప్పునీటి సముద్రమును చుట్టువారి దానికి రెట్టింపు వైశాల్యము గల ప్లక్ష ద్వీపము గలదని కీర్తించబడినది (23) గోమంతము, చంద్రము, నారదము, దర్దురము, సోమకము, సుమనస్సు, మరియు వైభ్రాజము అనే ఏడు శ్రేష్ఠమగు వర్షపర్వతములు గలవు. సుందరమగు ఆ పర్వతములలో జనులు, దేవతలు, గంధర్వులు సర్వకాలములలో కలిసి జీవించెదరు (24, 25). అచట ఎక్కడైననూ జనులకు శారీరకవ్యాధులుగాని, మానసిక వ్యాధులు గాని లేవు. అచట మానవులు పదివేల సంవత్సరములు జీవించెదరు (26). అచట అనుతప్త, శిఖి, పాపఘ్ని, త్రిదివ, కృప, అమృత, సుకృత అనే ఏడు నదులు గలవు (27). అచట చిన్న నదులు మరియు పర్వతములు వేల సంఖ్యలో గలవు. అచటి జనపదములలోని జనులు ఆ జలములను మహానందముతో త్రాగుచుందురు (28). దానిలో ఏడుఅవాంతరభూభాగములు గలవు. వాటిలో ఎక్కడైననూ యుగవ్యవస్థ లేదు. ఓ మహామునీ! అచట కాలము సర్వదా త్రేతాయుగములో వలె ధర్మపూర్ణమైయుండును (29). ఓ మహర్షీ! అక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు గలరు. దానికి మధ్యభాగములో కల్పవృక్షముతో సమానమైన మిక్కిలి పెద్ద వృక్షము గలదు (30).

ప్లక్షస్తన్నామ సంజ్ఞోవై ప్లక్షద్వీపో ద్విజోత్తమ | ఇజ్యతే తత్ర భగవాన్‌ శంకరో లోకశంకరః || 31

హరిశ్చ భగవాన్‌ బ్రహ్మా యంత్రైర్మంత్రై శ్చ వైదికైః | సంక్షేపణ తథా భూయశ్శాల్మలిం త్వం నిశామయ || 32

సప్తవర్షాణి తత్రైవ తేషాం నామాని మే శృణు | శ్వేతో%థ హరితశ్చైవ జీమూతో రోహితస్తథా|| 33

వైకలో మానసశ్చైవ సుప్రభస్సప్తమో మునే | శాల్మలేన తు వృక్షేణ ద్వీపశ్శాల్మలిసంజ్ఞకః || 34

ద్విగుణన సముద్రేణ సతతం సంవృతః స్థితః | వర్షాభివ్యంజకా నద్యస్తాసాం నామాని మే శృణు || 35

శుక్లా రక్తా హిరణ్యా చ చంద్రా శుభ్రా విమోచనా | నివృత్తిస్సప్తమీం తాసాం పుణ్యతోయాః సుశీలతాః || 36

సపై#్తవ తాని వర్షాణి చతుర్వర్ణయుతాని చ | భగవంతం సదా శంభుం యజంతే వివిధైర్మఖైః || 37

దేవానాం తత్ర సాన్నిధ్యమతీవ సుమనోరమే | ఏష ద్వీపస్సముద్రేణ సురోదేన సమావృతః || 38

ద్విగుణన కుశద్వీపస్సమంతాద్బాహ్యతః స్థితః | వసంతి తత్ర దైతేయా మనుజైస్సహ దానవాః || 39

తథైవ దేవగంధర్వా యక్షాః కింపురుషాదయః | వర్ణాస్తత్రైవ చత్వారో నిజానుష్ఠానతత్పరాః || 40

తత్రైవ చ కుశద్వీపే బ్రహ్మాణం చ జనార్దనమ్‌ | యజంతి చ తథేశానం సర్వకామఫలప్రదమ్‌ || 41

కుశేశయో హరిశ్చైవ ద్యుతిమాన్‌ పుష్పవాంస్తథా | మణిద్రుమో హేమశైలస్సప్తమో మందరాచలః || 42

ఓ బ్రాహ్మణశ్రేష్ఠా ! ఆ వృక్షమునకు ప్లక్షము అని పేరు. అందువలననే ఆ ద్వీపమునకు ప్లక్షద్వీపము అనే పేరు వచ్చినది. అచట ప్రాణులకు మంగళములనిచ్చు శంకరుడు యజ్ఞములలో ఆరాధించబడును (31). విష్ణుభగవానుడు, బ్రహ్మ వైదికమంత్రములతో మరియు యంత్రములతో అచట ఆరాధించ బడెదరు. ఇప్పుడు శాల్మలి ద్వీపమును గురించి సంక్షేపముగా వినుము (32). దానియందు ఏడు భూభాగములు గలవు. వాటి పేర్లను వినుము. శ్వేతము, హరితము, జీమూతము, రోహితము, వైకలము, మానసము, సుప్రభము అనునవి వాటి పేర్లు. ఓ మునీ! శాల్మలి (బూరుగ) వృక్షము ఉండుటచే దానికి శాల్మలి ద్వీపము అను పేరు వచ్చినది (33, 34). అది రెట్టింపు విస్తారముగల సముద్రముచే సర్వదా చుట్టువారబడి యుండును. ఆయా భూభాగములను సూచించే నదుల పేర్లను చెప్పెదను. వినుము (35). శుక్ల, రక్త, హిరణ్య, చంద్ర, శుభ్ర విమోచన, నివృత్తి అనే ఈ నదులలోని పవిత్రజలములు మిక్కిలి చల్లగా నుండును (36). ఈ ఏడు భూభాగములలో నాలుగు వర్ణముల ప్రజలు గలరు. వారు సర్వదా శంభుభగవానుని వివిధయజ్ఞములచే ఆరాధించెదరు (37). మిక్కిలి మనోహరమగు ఈ ద్వీపములో దేవతలు తరచుగా సంచరించెదరు. ఇది రెట్టింపు వైశాల్యము గల రససముద్రముచే చుట్టువారబడి యుండును. దానికి బయట అన్ని వైపులయందు కుశద్వీపము గలదు. అచట మానవులతో బాటు దైత్యులు మరియు దానవులు కూడ నివసించెదరు (38, 39). ఇంతేగాక, అచట దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు మొదలగు వారు నివసించెదరు. అచటి నాలుగు వర్ణముల ప్రజలు తమ తమ కర్మలను చేయుటయందు అభిరుచిని కలిగియుందురు (40). ఆ కుశద్వీపమునందు బ్రహ్మను, జనార్దనుడగు విష్ణువును, మరియు కోరికలను అన్నింటినీ తీర్చే శివుని ఆరాధించెదరు (41). అచట కుశేశయము, హరి, ద్యుతిమాన్‌, పుష్పవాన్‌, మణిద్రుమము, హేమశైలము మరియు మందరము అనే ఏడు పర్వతములు గలవు (42).

నద్యశ్చ సప్త తాసాం తు నామాని శృణు తత్త్వతః | ధూతపాపా శివా చైవ పవిత్రా సంమితిస్తథా || 43

విద్యా దంభా మహీ చాన్యా సర్వపాపహరాస్త్విమాః | అన్యాస్సహస్రశస్సంతి శుభాపో హేమవాలుకాః || 44

కుశద్వీపే కుశస్తంబో ఘృతోదేన సమావృతః | క్రౌంచద్వీపే మహాభాగ శ్రూయతాం చాపరో మహాన్‌ || 45

ద్విగుణన సముద్రేణ దధిమండేన చావృతః | వర్షాచలా మహాబుద్ధే తేషాం నామాని మే శృణు || 46

క్రౌంచశ్చ వానమశ్చైవ తృతీయశ్చాంధకారకః | దివావృతిర్మనశ్చైవ పుండరీకశ్చ దుందుభిః || 47

నివసంతి నిరాతంకా వర్షశైలేషు తేషు వై | సర్వసౌవర్ణరమ్యేషు సుహృద్దేవగణౖః ప్రజాః || 48

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాశ్శూద్రాశ్చానుక్రమోదితాః | సంతి తత్ర మహానద్యస్సప్తాన్యాస్తు సహస్రశః || 49

గౌరీ కుముద్వతీ చైవ సంధ్యా రాత్రిర్మనోజవా | శాంతిశ్చ పుండరీకా చ యాః పిబంతి పయశ్శుభమ్‌ || 50

భగవాన్‌ పూజ్యతే తత్ర యోగరుద్రస్వరూపవాన్‌ | దధిమండోదకశ్చాపి శాకద్వీపేన సంవృతః || 51

ద్విగుణనాద్రయస్సప్త తేషాం నామాని మే శృణు | పూర్వే తత్రోదయగిరిర్జలధారః పరే యతః || 52

పృష్ఠతో%స్తగిరిశ్చైవ హ్యవికేశశ్చ కేసరీ| శాకస్తత్ర మహావృక్షస్సిద్ధగంధర్వసేవితః || 53

తత్ర పుణ్యా జనపదాశ్చాతుర్వర్ణ్యసమన్వితాః | నద్యశ్చాత్ర మహాపుణ్యాస్సర్వపాపభయావహాః || 54

సుకుమారీ కుమారీ చ నలినీ వేణుకా తథా | ఇక్షుశ్చ రేణుకా చైవ గభస్తిస్సప్తమీ తథా || 55

అన్యాస్సహస్రశస్తత్ర క్షుద్రనద్యో మహామునే | మహీధరాస్తథా సంతి శతథో%థ సహస్రశః || 56

అచట ఏడు నదులు గలవు. వాటి నామములను యథార్థముగా విని తెలుసుకొనుము. ధూతపాప, శివ, పవిత్ర, సమ్మితి, విద్య, దంభ మరియు మహి అనే ఆ నదులు పాపములన్నింటినీ హరించును. ఇవియే గాక, స్వచ్ఛమగు జలములు మరియు బంగరు ఇసుకతిన్నెలు గల నదులు వేల సంఖ్యలో గలవు (43, 44). కుశద్వీపములో దర్భగడ్డి నేయి సముద్రముతో చుట్టవారబడి యున్నది. ఓ మహాత్మా! క్రౌంచము అనే మరియొక పెద్ద ద్వీపమును గురించి వినుము (45). అది రెట్టింపు వైశాల్యము గల పెరుగు-వెన్నల సముద్రముచే చుట్టువారబడి యున్నది. ఓ గొప్ప బుద్ధిశాలీ ! అచట నున్న వర్షపర్వతముల పేర్లను నానుండి వినుము (46). క్రౌంచము, వామనము, అంధకారకము, దివావృతి, మనస్సు, పుండరీకము, దుందుభి అనునవి వాటి పేర్లు (47) అంతటా బంగరు వన్నెలతో ప్రకాశించే ఆ వర్షపర్వతములయందు జనులు మిత్రులైన దేవతలతో కలిసి భయము లేకుండగా నివసించెదరు (48). అచట బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులు క్రమవికాసము గలవారై నివసించెదరు. అచట ఏడుమహానదులు మాత్రమే గాక, ఇతరనదులుకూడ వేలసంఖ్యలో గలవు (49). గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, శాంతి, పుండరీక అనే పేర్లుగల ఆ నదుల శుభజలమును జనులు త్రాగెదరు (50). యోగరుద్రరూపములో నున్న భగవానుని వారు పూజించెదరు. పెరుగు-వెన్న-సముద్రమును చుట్టి రెట్టింపు వైశాల్యము గల శాకద్వీపము గలదు. దానియందు ఏడు పర్వతములు గలవు. వాటి పేర్లను చెప్పెదను. వినుము. తూర్పు దిక్కునందుఉదయగిరి గలదు. దాని తరువాత జలధారపర్వతము గలదు (51, 52). దాని వెనుక అస్తపర్వతము, అవికేశము, కేసరి గలవు. అచట శాకము (టేకు) మహావృక్షము. ఆ ద్వీపమును సిద్ధులు, గంధర్వులు సేవించెదరు (53). దానియందు పవిత్రమగు పల్లెలు గలవు. వాటియందు నాలుగు వర్ణములు జనులు నివసించెదరు. అచటి పరమపవిత్రమగు నదులు సకలపాపభయములను పోగొట్టునవి (54). సుకుమారి, కుమారి, నలిని, వేణుక, ఇక్షువు, రేణుక మరియు గభస్తి అనునవి ఆ ఏడు నదులు పేర్లు (55). ఓ మహర్షీ! అచట చిన్న నదులు వేల సంఖ్యలో గలవు. మరియు పర్వతములు అసంఖ్యాకముగా గలవు (56).

ధర్మహానిర్న తేష్వస్తి స్వర్గాదాగత్య మావనాః | వర్షేషు తేషు పృథీవీం విహరంతి పరస్పరమ్‌ || 57

శాకద్వీపే తు వై సూర్యః ప్రీత్యా జనపదైస్సదా | యథోక్తైరిజ్యతే సమ్యక్కర్మభిర్నియతాత్మభిః || 58

క్షీరోదేనావృతస్సో%పి ద్విగుణన సమంతతః| క్షీరాబ్ధిస్సర్వతో వ్యాస పుష్కరాఖ్యేన సంవృతః || 59

ద్విగుణన మహావర్షస్తత్ర ఖ్యాతో%త్ర మానసః | యోజనానాం సహస్రాణి పంచైవోర్ధ్వసముచ్ఛ్రితః || 60

తాని చైవ తు లక్షాణి సర్వతో వలయాకృతి | పుష్కరద్వీపవలయో మధ్యేన విభజంతి చ || 61

తేనైవ వలయాకారా ద్వీపవర్షసమాకృతిః | దశవర్షసహస్రాణి తత్ర జీవంతి మానవాః || 62

నిరామయా వీతశోకా రాగద్వేషవివర్జితాః | అధర్మో న మతస్తేషాం న బంధవధకౌ మునే || 63

సత్యానృతే న తస్యాస్తాం సదైవ వసతిస్సదా | తుల్యవేషాస్తు మనుజా హేమవర్ణైకరూపిణః || 64

వర్షశ్చాయం తు కాలేయ భౌమస్వర్గోపమో మతః | సర్వస్య సుఖదః కాలే జరారోగవివర్జితః || 65

పుష్కరే ధాతకీఖండే మహావీతే మహామునే | న్యగ్రోధం పుష్కరద్వీపే బ్రహ్మణః స్థానముత్తమమ్‌ || 66

ఈ భూఖండములలో ధర్మమునకు హాని కలుగదు. అచట మానవులు స్వర్గమునుండి భూమికి దిగి వచ్చిన దేవతలతో కలిసి మెలిసి విహరించెదరు (57). శాకద్వీపమునందలి ప్రజలు మనోనిగ్రహము గలవారై యథావిధిగా కర్మలను అనుష్ఠించి ప్రీతితో సూర్యుని సర్వకాలములలోచక్కగా ఆరాధించెదరు (58). ఆ ద్వీపము రెట్టింపు వైశాల్యము గల పాల సముద్రముచే చుట్టువారబడి యున్నది. ఓ వ్యాసా! ఆ పాల సముద్రమును అన్నివైపులా చుట్టి రెట్టింపు వైశాల్యము గల పుష్కరమనే పెద్ద ద్వీపము గలదు. అచట ఐదు వేల యోజనముల ఎత్తు గల మానసమనే పర్వతము గలదు (59, 60). దాని చుట్టు అయిదు లక్షల యోజనముల నిడివిగల పుష్కరద్వీపము గలదు. అది వలయాకారములో మధ్యలో జనపదములచే విభజింపబడి యుండును (61). ద్వీపము మరియు వర్షములు సమానమైన వలయాకారమును కలిగియున్నవి. అచటి మానవులు పది వేల సంవత్సరముల వరకు జీవించెదరు (62). వారియందు రోగములు, శోకము, మరియు రాగద్వేషములు లేవు. వారికి అధర్మము తెలియదు. అచట కారాగారము మరియు మరణశిక్ష అనునవి లేవు (63). వారికి సత్యము మరియు అసత్యము అనునవి తెలియవు. అచట సర్వదా రాత్రి ఉండును. అచటి మానవులు బంగరు రంగు గలవారై సమానమగు దేహసంస్థానమును మరియు వేషమును కలిగి యుందురు (64). ఓ మహర్షీ! ఈ వర్షము భూలోక స్వర్గమని చెప్పెదరు. అచట సర్వకాలములలో సర్వమానవులు రోగము, వృద్ధాప్యము లేనివారై సుఖముగా నుండెదరు (65). ఓ మహర్షీ! పుష్కరద్వీపమునందలి ధాతకీఖండములో మహావీతమునందు గల మర్రి చెట్టు బ్రహ్మయొక్క ఉత్తమమగు స్థానము (66).

తస్మిన్నివసతే బ్రహ్మా పూజ్యమానస్సురాసురైః | స్వాదూదకేనాంబుధినా పుష్కరః పరివేష్ఠితః || 67

ఏవం ద్వీపాస్సముద్రైస్తు సప్త సప్తభిరావృతాః | ద్వీపాశ్చైవ సముద్రాశ్చ సమానా ద్విగుణౖః పరైః || 68

ఉక్తాతిరిక్తతా తేషాం సముద్రేషు సమానివై | పయాంసి సర్వదా%ల్పత్వం జాయతే న కదాచన || 69

స్థాలీస్థమగ్నిసంయోగాదధః స్థం మునిసత్తమ | తథేందువృద్ధౌ సలిలమూర్ధ్వగం భవతి ధ్రువమ్‌ || 70

ఉదయాస్తమనే త్విందోర్వర్ధంత్యాపో హ్రసంతి చ | అతో న్యూనాతిరిక్తాశ్చ పక్షయోశ్శుక్లకృష్ణయోః || 71

అపాం వృద్ధిక్ష¸° దృష్టౌ శతశస్తు దశోత్తరమ్‌ | సముద్రాణాం మునిశ్రేష్ఠ సర్వేషాం కథితం తవ || 72

భోజనం పుష్కరద్వీపే ప్రజాస్సర్వాస్సదైవ హి | ఖండస్య కుర్వతే విప్ర తత్ర స్వయముపస్థితమ్‌ || 73

స్వాంగదో యస్య పరతో నాస్తి లోకస్య సంస్థితిః | ద్విగుణా హిరణ్మయీ భూమిస్సర్వజంతువివర్జితా || 74

లోకాలోకస్తతశ్శైలస్సహస్రాణ్యచలో హి సః | ఉచ్ఛ్రాయేణ హి తావంతి యోజనాయుతవిస్తృతః || 75

తమశ్చాండకటాహేన సేయముర్వీ మహామునే | పంచాశత్కోటివిస్తారా సద్వీపా సమహీధరా || 76

ఆధారభూతా సర్వేషాం సర్వభూతగుణాధికా |సేయం ధాత్రీ చ కాలేయ సర్వేషాం జగతామిలా || 77

ఇతి శ్రీ శివమహాపురాణ ఉమాసంహితాయాం సప్తద్వీపవర్ణనం నామ అష్టాదశో%ధ్యాయః (18).

దేవతలచే మరియు రాక్షసులచే పూజింపబడే బ్రహ్మ ఆ ద్వీపమునందు నివసించును. పుష్కరద్వీపము మంచినీటి సముద్రముచే చుట్టువారబడి యున్నది (67). ఈ విధముగా ఏడు ద్వీపములు ఏడు సముద్రములచే చుట్టవారబడి యున్నవి. ద్వీపములు మరియు సముద్రములు క్రమముగా తరువాతిది ముందు దానికంటే వైశాల్యములో రెట్టింపు ఉండును (68). వాటి మాహాత్యము చెప్పబడినది. ఆ సముద్రములో నీరు సమానమగు పరిమాణములో నుండును. ఆ నీరు ఎన్నడైననూ తగ్గే ప్రసక్తి లేదు (69). ఓ మహర్షీ! గిన్నెలో నీరు పోసి నిప్పులపై పెట్టినచో ఆ నీరు పైకి పోవుట నిశ్చయము. అదే విధముగా చంద్రుని కళలు పెరిగినప్పుడు సముద్రములోని నీరు కూడపైకి నిశ్చయముగా ఎగిరి పడును (70). చంద్రుడు ఉదయించే సమయములో సముద్రము ఉప్పొంగును. కాని చంద్రుడు అస్తమించినప్పుడు సముద్రజలములు శాంతముగా నుండి వెనుకకు తగ్గును. ఈ విధముగా శుక్లకృష్ణపక్షములలో సముద్రమునకు ఆటుపోటులు వచ్చుచుండును (71). ఓ మహర్షీ! ఈ సముద్రములలో నీటియొక్క పరిమాణము నూటపది శాతము వరకు పెరిగి, మరల తగ్గు చుండును. ఈ వివరములను అన్నింటినీ నేను నీకు చెప్పియుంటిని (72). ఓ బ్రాహ్మణా! పుష్కరద్వీపములో పటిక బెల్లము దానంతట అదియే ఉత్పన్నమగును. అచటి ప్రజలు సర్వదా దానినే భక్షించెదరు (73). దాని తరువాత నుండే భూభాగములో హిరణ్యగర్భదేహమునుండి పుట్టిన ప్రాణిసముదాయము లేదు. ఏ ఒక్క ప్రాణియైననూ కంటికి కానరాని అట్టి భూభాగము బంగారముచే కప్పబడి పుష్కరద్వీపమునకు రెండు రెట్లు వైశాల్యమును కలిగియుండును (74). దాని తరువాత లోకాలోకపర్వతము గలదు. ఆ పర్వతము వేయి యోజనములు ఎత్తు. అంతే కైవారము కలిగియున్నది. అది ఆ పైని బ్రహ్మాండముతో సహా చీకటితో నిండియుండును. ఓ మహర్షీ! ద్వీపములతో మరియు పర్వతములతో కూడియున్న ఈ భూమండలము ఏబది కోట్ల యోజనముల వైశాల్యమును కలిగియున్నది (75, 76). ఓ కాలీనందనా! సర్వప్రాణులకు ఆధారమైన ఈ భూమి ఇతరభూతములన్నింటికంటే అధికగుణములను కలిగియున్నది. సర్వప్రాణులను ఈ భూమియే తల్లివలె పోషించుచున్నది (77).

శ్రీశివమహాపురాణములోని ఉమాసంహితయందు సప్తద్వీపవర్ణనమనే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (18).

Siva Maha Puranam-3    Chapters