Siva Maha Puranam-3    Chapters   

అథ దశమో%ధ్యాయః

నృసింహావతారము

నందీశ్వర ఉవాచ |

విధ్వంసీ దక్షయజ్ఞస్య వీర భద్రాహ్వయః ప్రభోః | అవతారశ్చ విజ్ఞేయ శ్శివస్య పరమాత్మనః || 1

సతీచరిత్రే కథితం చరితం తస్య కృత్న్సశః | శ్రుతం త్వయాపి బహుధా నాతః ప్రోక్తం సువిస్తరాత్‌ || 2

అతః పరం మునిశ్రేష్ఠ భవత్స్నేహాద్ర్బవీమి తత్‌ | శార్దూలాఖ్యావతారం చ శంకరస్య ప్రభోః శృణు || 3

సదాశివేన దేవానాం హితార్థం రూపమద్భుతమ్‌ | శారభం చ ధృతం దివ్యం జ్వలజ్జ్వాలాసమప్రభమ్‌ || 4

శివావతార అమితాస్సద్భక్తిహితకారకాః | సంఖ్యా నశక్యతే కర్తుం తేషాం చ మునిసత్తమాః || 5

ఆకాశస్య చ తారాణాం రేణుకానాం క్షితేస్తథా | ఆసారాణాం చ వృద్ధేన బహుకల్పైః కదాపి హి || 6

సంఖ్యా విశక్యతే కర్తుం సుప్రాజ్ఞైర్బహుజన్మభిః | శివావతారాణాం నైవ సత్యం జానీహి మద్వచః || 7

నందీశ్వరుడిట్లు పలికెను-

దక్షయజ్ఞమున వినాశమొనర్చిన వీరభద్రుడనువాడు పరమాత్మయగు శివప్రభుని అవతారమే యని తెలియదగును (1). ఆతని వృత్తాంతమంతయూ సతీ చరిత్రములో వర్ణింపబడినది. నీవు కూడా ఆ చరిత్రమును అనేకవిధములుగా వినియుందువు. కావుననే నేను విస్తరముగా చెప్పుట లేదు (2). ఓ మహర్షీ! నీ యందలి ప్రేమచే నేనీపైన శంకరప్రభుని ప్రసిద్ధమగు శార్దూలావతారమును చెప్పెదను వినుము (3). మరియు సదాశివుడు దేవతల హితమును గోరి మండే అగ్ని వలె ప్రకాశించే అద్భుతమైన దివ్యమగు శరభరూపమును ధరించెను (4). ఓ మహర్షులారా! శివావతారములు అనంతములు. అవి గొప్ప భక్తిని, హితమును కలిగించును. వాటి సంఖ్యను నిర్ణయించుట సంభవము కాదు (5). ఆకాశములోని తారలను, భూమియందలి ఇసుక రేణువులను, కుంభవృష్టి లోని జలబిందువులను లెక్కించుట సంభవమగునేమో గాని, గొప్ప ప్రజ్ఞావంతులైననూ అనేక కల్పములలో బహుజన్మలను స్వీకరించి లెక్కించిననూ, శివావతారముల సంఖ్యను నిర్ణయించుట సంభవము కాదు. నా వచనము సత్యమని యెరుంగుము (6, 7).

తథాపి చ యథా బుద్ధ్యా కథయామి యథాశ్రుతమ్‌ | చరిత్రం శారభం దివ్యం సరమైశ్వర్యసూచకమ్‌ || 8

జయశ్చ విజయశ్చైవ భవద్భి శ్శాపితౌ యదా | తదా దితి సుతౌ ద్వౌ తావభూతాం కశ్యపాన్మునే || 9

హిరణ్యకశిపుశ్చాద్యో హిరణ్యాక్షో%నుజో బలీ | దేవర్షిపార్షదౌ జాతౌ తౌ ద్వావపి దితేస్సుతౌ || 10

పృథ్వ్యుద్ధారే విధాత్రా వై ప్రార్థితో హి పురా ప్రభుః | హిరణ్యాక్షం జఘానాసౌ విష్ణుర్వారాహరూపధృక్‌ || 11

తం శ్రుత్వా భ్రాతరం వీరం నిహతం ప్రాణసన్నిభమ్‌ | చుకోప హరయే%తీవ హిరణ్యకశిపుర్మునే || 12

వర్షాణామయుతం తప్త్వా బ్రహ్మణో వరమాప సః | న కశ్చి న్మారయేన్మాం వైత్వత్సృష్టావితి తుష్టతః || 13

శోణితాఖ్యపురం గత్వా దేవానాహూయ సర్వతః | త్రిలోకీం స్వవశే కృత్వా చక్రే9 రాజ్యమకంటకమ్‌ || 14

అయిననూ నేను విన్నంతవరకు నా బుద్ధిశక్తిని అనుసరించి శరభావతారమనే దివ్యగాథను చెప్పెదను. ఈ గాథ పరమైశ్వర్యమునిచ్చును (8). ఓ మహర్షీ! మీరు జయవిజయులను శపించగా వారు దితికశ్యపులకు పుత్రులై జన్మించిరి (9). మొదటివాడు హిరణ్యకశిపుడు. ఆతడి తమ్ముడగు హిరణ్యాక్షుడు బలశాలి. ఓ దేవర్షీ ! ఈ తీరున విష్ణుసేవకులగు వారిద్దరు దైత్యులై జన్మించిరి (10). పూర్వము విష్ణుప్రభుడు బ్రహ్మ ప్రార్థించగా భూమిని వరాహరూపముతో పైకి లేవదీసెను. ఆ సమయములో ఆయన హిరణ్యాక్షుని సంహరించెను (11). వీరుడు, ప్రాణ ప్రియుడు అగు తమ్ముడు సంహరింపబడుటచే హిరణ్యకశిపునకు విష్ణువుపై అత్యధికమగు కోపము కలిగెను. ఓ మునీ! (12) ఆతడు పది వేల సంవత్సరములు తపమునాచరించి బ్రహ్మను సంతోషపెట్టి, నీ సృష్టిలోని ఏ ప్రాణియైననూ నన్ను సంహరించకుండుగాక! అను వరమును పొందెను (13). ఆతడు శోణిత నగరమునకు వెళ్లి, దేవతలనందరినీ జయించి ముల్లోకములను వశమొనర్చుకొని నిష్కంటకముగా రాజ్యమునేలెను (14).

దేవర్షి కదనం చక్రే సర్వధర్మ విలోపకః | ద్విజపీడాకరః పాపీ హిరణ్యకశిపుర్మునే || 15

ప్రహ్రాదేన స్వపుత్రేణ హరిభ##క్తేన దైత్యరాట్‌ | యదా విద్వేషమకరోద్ధరివైరీ విశేషతః || 16

సభాస్తంభాత్తదా విష్ణురభూరావిర్ద్రుతం మునే | సంధ్యాయాం క్రోధమాపన్నో నృసింహవపుషా తతః || 17

సర్వథా మునిశార్దూల కరాలం నృహరేర్వపుః ప్రజజ్వాలాతి భయదం త్రాసయన్‌ దైత్యసత్తమాన్‌ || 18

నృసింహేన తదా దైత్యా నిహతాశ్చైవ తత్‌క్షణమ్‌ | హిరణ్యకశిపుశ్చాథ యుద్ధం చక్రే సుదారుణమ్‌ || 19

మహాయుద్ధం తయోరాసీన్ముహూర్తం మునిసత్తమాః | వికరాలం చ భయదం సర్వేషాం రోమహర్షణమ్‌ || 20

సాయం చకర్ష దేవేశో దేహల్యాం దైత్యపుంగవమ్‌ | వ్యోమ్ని దేవేషు పశ్యత్సు నృసింహశ్చ రమేశ్వరః || 21

ధర్మములన్నిటినీ నశింపజేసి బ్రాహ్మణులకు పీడ కలుగజేసిన పాపియగు హిరణ్యకశిపుడు దేవతలతో యుద్ధమును చేసెను. ఋషులను హింసించెను. ఓ మునీ! (15) తీవ్రమగు విష్ణుద్వేషముగల ఆ రాక్షసరాజు హరి భక్తుడు, తన పుత్రుడు అగు ప్రహ్లాదునిపై కత్తిగట్టెను (16). ఓ మునీ ! అపుడు కోపించిన విష్ణువు సంధ్యాకాలమునందు నృసింహరూపముతో సభలోని స్తంభము మధ్యనుండి శీఘ్రమే ఆవిర్భవించెను(17). ఓ మహర్షీ! మిక్కిలి భయంకరమైనది, అత్యంతక్రూరమైనది అగు ఆ నృసింహశరీరము రాక్షసులకు భయమును గొల్పుచూ తీక్షణముగా ప్రకాశించెను (18). అపుడా నృసింహుడు వెంటనే రాక్షసులను సంహరించెను. అపుడు హిరణ్యకశిపుడాయనతో దారుణమగు యుద్ధమును చేసెను (19). ఓ మహర్షులారా! వారిద్దరి మధ్య కొంతకాలము మిక్కిలి క్రూరమైనది, భయమును గొల్పునది, అందరికి గగుర్పాటును కలిగించునది అగు మహాయుద్ధము జరిగెను (20). ఆకాశమునందు దేవతలు గాంచుచుండగా దేవదేవుడు, లక్ష్మీపతి అగు నృసింహుడు ఆ రాక్షసరాజును సాయంకాల సమయమునందు సింహద్వారపు గడప వద్దకు లాగుకొని వెళ్లెను (21).

అథోత్సంగే చ తం కృత్వా నఖైస్తదుదరం ద్రుతమ్‌ | విదార్య మారయామాస పశ్యతాం త్రిదివౌకసామ్‌ || 22

హతే హిరణ్యకశిపౌ నృసింహేనైవ విష్ణునా | జగత్‌ స్వాస్థ్యం తదా లేభే న వై దేవా విశేషతః || 23

దేవదుందుభయో నేదుః ప్రహ్రాదో విస్మయం గతః | లక్ష్మీశ్చ విస్మయం ప్రాప్తా రూపం దృష్ట్వాద్భుతం హరేః || 24

హతో యద్యపి దైత్యేంద్ర స్తథాపి న పరం సుఖమ్‌ | యయుర్దేవా నృసింహస్య జ్వాలా సా న నివర్తితా || 25

తయా చ వ్యాకులం జాతం సర్వం చైవ జగత్పునః | దేవాశ్చ దుఃఖమాపన్నాః కిం భవిష్యతి వా పునః || 26

ఇత్యేవం చ వదంతస్తే భయాద్దూరము పస్థితాః | నృసింహక్రోధజజ్వాలావ్యాకులాః పద్మభూముభాః || 27

ప్రహ్రాదం ప్రేషయామాసుస్తచ్ఛాంత్యై నికటం హరేః | సర్వాన్మిలిత్వా ప్రహ్రాదః ప్రార్థితో గతవాంస్తదా || 28

ఉరసా లింగయామాస తం నృసింహః కృపానిధిః హృదయం శీతలం జాతం రుడ్‌ జ్వాలా న నివర్తితాః || 29

దుఃఖం ప్రాప్తాస్తతో దేవాశ్శంకరం శరణం యయుః || 30

తత్ర గత్వా సురాస్సర్వే బ్రహ్మాద్యా మునయస్తథా | శంకరం స్తవయామాసుర్లోకానాం సుఖహేతవే || 31

అపుడాయన వానిని తన ఒడిలో కూర్చుండ బెట్టుకుని వెంటనే గోళ్లతో వాని పొట్టను చీల్చి దేవతలు చూచుచుండగా సంహరించెను (22). నృసింహరూపుడగు విష్ణువు హిరణ్యకశిపుని సంహరించగా జగత్తు స్వస్థతను పొందెను. కాని దేవతలు విశేషసుఖమును పొందలేకపోయిరి (23). దేవదుందుభులు మ్రోగినవి. విష్ణువు యొక్క ఆ అద్భుత రూపమును గాంచి ప్రహ్లాదుడు, మరియు లక్ష్మీదేవి ఆశ్చర్యచకితులైరి (24). రాక్షసరాజు సంహరింపబడిననూ, దేవతలు పూర్ణసుఖమును పొందలేకపోయిరి. ఏలయన, నృసింహుని క్రోధాగ్ని ఇంకనూ చల్లారలేదు (25). మరల జగత్తు అంతయూ దానిచే కంగారు పడజొచ్చెను. ఏమి కానున్న దోయని దేవతలు దుఃఖమును పొందిరి (26). నృసింహుని కోపమునుండి పుట్టిన జ్వాలలకు భయపడి బ్రహ్మ మొదలగు వారు ఏమి ముప్పురానున్నదో అని పలుకుచూ భయముతో దూరముగా తప్పుకొనిరి (27). అపుడు వారందరు ఆ కోపమును శాంతింప జేయుట కొరకై ప్రహ్లాదుని ప్రార్థించి నృసింహుని వద్దకు పంపగా ఆతడు వెళ్లెను (28). దయానిధియగు నృసింహుడు ప్రహ్లాదుని గుండెలకు హత్తుకొనెను. అపుడాయన హృదయము చల్లబడెను. కాని క్రోధ జ్వాల చల్లారలేదు (29). అపుడు దేవతలు దుఃఖితులై శంకరుని శరణు జొచ్చిరి (30). బ్రహ్మ మొదలగు దేవతలు మరియు మహర్షులు అందరు కలిసి శంకరుని వద్దకు వెళ్లి లోకములకు సుఖమును కలిగించుట కొరకై శంకరుని ప్రార్థించిరి (31).

దేవా ఊచుః |

దేవదేవ మహాదేవ శరణాగతవత్సల | పాహి నశ్శరణాపన్నాన్‌ సర్వాన్‌ దేవాన్‌ జగంతి చ || 32

నమస్తే%స్తు నమస్తే%స్తు నమస్తే%స్తు సదాశివ | పూర్వం దుఃఖం యదా జాతం తదా తే రక్షితా వయమ్‌ || 33

సముద్రో మథితశ్చైవ రత్నానాం చ విభాగశః | కృతే దేవైస్తదా శంభో గృహీతం గరలం త్వయా || 34

రక్షితాస్స్మ తదా నాథ నీలకంఠ ఇతి శ్రుతః | విషం పాస్యసి నో చేత్త్వం భస్మీభూతాస్తదాఖిలాః || 35

ప్రసిద్ధం చ యదా యస్య దుఃఖం చ జాయతే ప్రభో | తదా త్వన్నామమాత్రేణ సర్వదుఃఖం విలీయతే || 36

ఇదానీం నృహరి జ్వాలా పీడితాన్నస్సదాశివ | తాం త్వం శమయితుం దేవ శక్తో%సీతి సునిశ్చితమ్‌ || 37

దేవతలిట్లు పలికిరి-

దేవదేవా! మహాదేవా! శరణు జొచ్చిన వారిని ప్రేమించువాడా! మేము దేవతలము అందరము మరియు జగత్తులు నిన్ను శరణు జొచ్చుచున్నవి. మమ్ములను కాపాడుము (32). హే సదాశివా ! నీకు అనేక నమస్కారములు. పూర్వము మాకు ఆపద కలిగినపుడు నీవే రక్షించితివి (33). దేవతలు రత్నములను వరుసగా పొందుట కొరకై సముద్రమును మథించినప్పుడు విషమును నీవే స్వీకరించితివి. హే శంభో! (34) నాథా! మమ్ములనప్పుడు అట్లు రక్షించి నీవు నీలకంఠుడను పేర ఖ్యాతిని గాంచితివి. నీవు అప్పుడు విషమును త్రాగి యుండనిచో సర్వులు భస్మ మైయుండెడివారు (35). హే ప్రభూ! ఎపుడు ఎవరికి ఏ దుఃఖము కలిగిననూ, నీ నామమును స్మరించినచో తన్మాత్రము చేతనే దుఃఖములన్నియు తొలగి పోవుననే విషయము లోకప్రసిద్ధము (36). ఓ సదాశివా! మేము ఇపుడు నృసింహుని క్రోధజ్వాలచే పీడితులమై యున్నాము. ఓ దేవా! దానిని చల్లార్చుటకు నీవు సమర్థుడవనుటలో సందేహము లేదు (37).

నందీశ్వర ఉవాచ|

ఇతి స్తుతస్తదా దేవైశ్శంకరో భక్త వత్సలః | ప్రత్యువాచ ప్రసన్నాత్మా%భయం దత్వా పరం ప్రభుః || 38

నందీశ్వరుడిట్లు పలికెను-

దేవతలిట్లు ప్రార్థించగా అపుడు భక్తవత్సలుడగు శంకరప్రభుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై గొప్పఅభయమునిచ్చి ఇట్లు బదులిడెను (38).

శంకర ఉవాచ|

స్వస్థానం గచ్ఛత సురాస్సర్వే బ్రహ్మాదయో%భయాః | శమయిష్యామి యద్దుఃఖం సర్వథా హి వ్రతం మమ || 39

గతో మచ్ఛరణం యస్తు తస్య దుఃఖం క్షయం గతమ్‌ | మత్ర్పియశ్శరణాపన్నః ప్రాణభ్యో%పి న సంశయః || 40

శంకరుడిట్లు పలికెను-

బ్రహ్మాది దేవతలారా! మీరందరు నిర్భయముగా మీ స్థానములకు వెళ్లుడు. నేను మీ దుఃఖమును శాంతింపజేసెదను. ఏలయన, అట్లు చేయుట నాకు దృఢవ్రతమై యున్నది (39). ఎవరు నన్ను శరణు వేడెదరో, వారి దుఃఖము నశించును. నన్ను శరణు పొందినవాడు నాకు ప్రాణములకంటె ఎక్కువ ప్రియుడనుటలో సందేహము లేదు (40).

నందీశ్వర ఉవాచ |

ఇతి శ్రుత్వ తదా దేవా హ్యానందం పరమం గతాః | యథాగతం తథా జగ్ముస్స్మరంత శ్శంకరం ముదా || 41

ఇతి శ్రీశివమహాపురాణ శతరుద్ర సంహితాయాం నృసింహ చరిత వర్ణనం నామ దశమో%ధ్యాయః(10).

నందీశ్వరుడిట్లు పలికెను-

అపుడు దేవతలీమాటను విని పరమానందమును పొంది శంకరుని భక్తి పూర్వముగా స్మరిస్తూ తమ స్థానములకు వెళ్ళిరి(41).

శ్రీ శివమహాపురాణములోని శతురుద్రసంహితయందు నృసింహచరిత వర్ణనమనే పదియవ అద్యాయము ముగిసినది(10).

Siva Maha Puranam-3    Chapters