Sri Koorma Mahapuranam    Chapters   

అథఏకోన పఞ్చాశోధ్యాయః

అధభువన విన్యాసవర్ణనమ్‌

సూత ఉవాచ :-

జమ్బూద్వీపస్య విస్తారా ద్ద్విగుణన సమన్తతః | సంవేష్టయిత్వా క్షీరోదం ప్లక్షద్వీపో వ్యవస్థితః || || 1 ||

ప్లక్షద్వీపే చ విప్రేన్ద్రాః సప్తా స న్కులపర్వతాః | సిద్ధాయుతాః సుపర్వాణః సిద్ధసఙ్ఘనిషేవితాః || || 2 ||

గోమేదః ప్రథమ స్తేషాం ద్వితీయ శ్చన్ద్ర ఉచ్యతే | నారదో దున్దుభి శ్చైవ మణిమా న్మేఘనిఃస్వనః || || 3 ||

వైభ్రాజః సప్తమ స్తేషాం బ్రహ్మణోత్యన్త వల్లభః | తత్ర దేవర్షిగన్థర్వైః సిద్ధైశ్చ భగవా నజః || || 4 ||

ఉపాస్యతే స విశ్వాత్మా సాక్షీ సర్వస్య విశ్వదృక్‌ | తేషు పుణ్యా జనపదా ఆధయో వ్యాధయో న చ || || 5 ||

నలుబది తొమ్మిదవ అధ్యాయము

భువన విన్యాసవర్ణనము

సూతుడిట్లు చెప్పెను.

క్షీరసముద్రమునుచుట్టి వ్యాపించి, జంబూద్వీపపువైశాల్యమునకు రెట్టింపుగా ప్లక్షద్వీపము నెలకొని ఉన్నది. (1)

బ్రాహ్మణోత్తములారా! ప్లక్షద్వీపమునందు ఏడుకులపర్వతములు కలవు. సిద్ధుల సమూహముచేత సేవింపబడుచు దేవతలు అచ్చట వేలకొలదిగా నుందురు. (2)

ఆ పర్వతములలో మొదటిది గోమేదము, రెండవది చంద్రపర్వతము. నారదము, దుందుభి, మణిమంతము, మేఘనిః స్వనము అని మరియు నాలుగు పర్వతములు. (3)

వానిలో ఏడవది వైభ్రాజపర్వతము. అది బ్రహ్మకు మిక్కిలి ప్రియమైనది. అక్కడ భగవంతుడైన బ్రహ్మదేవుడు, దేవతల, ఋషుల, గంధర్వుల సిద్ధుల సమూహముచేత; (4)

సేవింపబడుచుండును. ఆయన విశ్వస్వరూపుడు, సమస్తమునకు సాక్షి, విశ్వదర్శనుడు. అక్కడి జనపదములు పుణ్యములు. అధి వ్యాధులుండవు. (5)

న తత్ర పాపకర్తారః పురుషా వై కథఞ్చన | తేషాం నద్యశ్చ సపై#్తవ వర్షాణాం తు సముద్రగాః || || 6 ||

తాసు బ్రహ్మర్షయో నిత్యం పితామహ ముపాసతే | అనుతప్తా శిఖా చైవ విపాపా త్రిదివా కృతా || || 7 ||

అమృతా సుకృతా చైవ నామతః పరికీర్తితాః | క్షుద్రనద్య స్తు విఖ్యాతాః సరాంసి చ హూ న్యపి || || 8 ||

న చైతేషు యుగావస్థా పురుషా వై చిరాయుషః | ఆర్యకాః కురురాశ్చైవ విదేహా భావినస్తధా || || 9 ||

బ్రహ్మక్షత్రియవిట్ఛూద్రా స్తస్మిన్‌ ద్వీపే ప్రకీర్తితాః | ఇజ్యతే భగవా నీశో వర్ణై స్తత్ర నివాసిభిః || || 10 ||

తేషాం చ సోమసామ్రాజ్యం సారూప్యం మునిపుఙ్గవాః | సర్వే ధర్మరతా నిత్యం సర్వే ముదితమానసాః || || 11 ||

అక్కడ పాపమును చేయు పురుషులు ఏరూపములోను లేరు. ఆ వర్షములకు సముద్రమును చేరుకొను నదులు కూడ ఏడు మాత్రము కలవు. (6)

ఆనదుల యందు బ్రహ్మర్షులు ఎల్లప్పుడు బ్రహ్మదేవుని పూజింతురు. ఆ నదులు - అనుతప్త, శిఖ, విపాప, త్రిదివ, కృత అనియుణ; (7) అమృత, సుకృత అనుపేర్లతో ఏడుగాచెప్పబడినవి. అల్పములైన నదులు సరస్సులు కూడ ఇంకను చాల ప్రసిద్ధములుగా అక్కడ కలవు. (7, 8)

ఈ వర్షముల యందు యుగవ్యవస్థలేదు. అక్కడి పురుషులు దీర్ఘకాలము జీవింతురు. ఆర్యకులు, కురురులు, విదేహులు, భావులు అని వారు పిలువబడుదురు. (9)

ఆ ద్వీపమునందు బ్రాహ్మణ క్షత్రియవైశ్య శూద్రజాతులకు చెందినవారు పైన తెలిపిన విధముగా పిలువబడుదురు. అక్కడ నివసించు వర్ణముల జనులచేత భగవంతుడైన ఈశ్వరుడు పూజింపబడును. (10)

మునివర్యులారా! అక్కడి వారికి సోముని సారూప్యము, సామ్రాజ్యము లభించును. అందరు ధర్మమునందు శ్రద్ధకలవారు, సంతోషించిన మనస్సుల కలవారుగా నుందురు. (11)

పఞ్చ వర్షసహస్రాణి జీవన్తి చ నిరావయాః | ప్లక్షద్వీప ప్రమాణం తు ద్విగుణన సమన్తతః || || 12 ||

సంవేష్ట్యేక్షురసామ్భోధిం శాల్మలిః సంవ్యవస్థితః | సప్త వర్షాణి తత్రాపి సపై#్తవ కులపర్వతాః || || 13 ||

ఋజ్వాయతాః సుపర్వాణః సప్త నద్యశ్చ సువ్రతాః | కుముద శ్చాన్నద శ్చైవ తృతీయశ్చ బలాహకః || || 14 ||

ద్రోణః కంసస్తు మహిష కకుద్మాన్‌ సప్తమ స్తథా | యోనీ తోయా వితృష్ణా చ చన్ద్రా శుక్లా విమోచనీ || || 15 ||

నివృత్తి శ్చేతి తా నద్యః స్మృతా పాపహరా నృణామ్‌ | న తేషు విద్యతే లోభః క్రోధో వా ద్విజసత్తమాః || || 16 ||

న చైవాస్తి యుగావస్థా జనా జీవ న్త్యనామయాః | యజన్తి సతతం తత్ర వర్ణా వాయుం సనాతనమ్‌ || || 17 ||

అక్కడి జనులు రోగరహితులై అయిదువేల సంవత్సరాల పాటు జీవింతురు. ప్లక్షద్వీపమునకు చుట్టు ప్రక్కల దాని పరిమాణమునకు రెండింతల పరిమాణము కలిగి; (12)

ఇక్షురస సముద్రమును పరివేష్టించి శాల్మలిద్వీపము నెలకొని ఉన్నది. దానియందుకూడ ఏడువర్షములు, ఏడుకులపర్వతములే కలవు. (13)

అక్కడ దేవతలు పొడవు కలిగి, ఋజు వర్తనలుగా నుందురు. ఏడునదులు కూడ కలవు. ఆ పర్వతముల పేర్లు వరుసగా - కుముదము, అన్నదము, బలాహకము; (14)

ద్రోణము, కంసము, మహిషము, కకుద్మంతము అని కులపర్వతములున్నవి. యోని, తోయ, వితృష్ణ, చంద్ర, శుక్ల, విమోచని నివృత్తి అని ఆ నదుల పేర్లు. అవి మనుష్యుల పాపములను నశింపజేయునవి. బ్రాహ్మణోత్తములారా! అక్కడి జనుల యందు లోభము కాని, క్రోధము కాని ఉండవు. (15, 16)

అక్కడ యుగవ్యవస్థలేదు. ప్రజలు రోగబాధలేనివారుగా జీవింతురు. అచట వర్ణముల జనులు ఎల్లప్పుడు సనాతనుడైన వాయుదేవుని పూజింతురు. (17)

తేషాం తత్సాధనం యుక్తం సారూప్యం చ సలోకతా | కపిలా బ్రాహ్మణాః ప్రోక్తా రాజాన శ్చారుణా స్తథా || || 18 ||

పీతా వైశ్యాః స్మృతాః కృష్ణా ద్వీపేస్మిన్‌ వృషలా ద్విజాః | శాల్మలస్య తు విస్తారా ద్ద్విగుణన సమన్తతః || || 19 ||

సంవేష్ట్యతు సురోదాబ్ధిం కుశద్వీపో వ్యవస్థితః | విద్రుమ శ్చైవ హోమశ్చ ద్యుతిమా న్పుష్పవాం స్తథా || || 20 ||

కుశేశయో హరి శ్చైవ మన్దరః సప్త పర్వతాః | ధూతపాపా శివా చైవ పవిత్రా సమ్మితా తథా || || 21 ||

తథా విద్యుత్ప్రభా రామా మహానద్యశ్చ సప్త వై | అన్యాశ్చ శతశో విప్రా నద్యో మణిజలాః శుభాః || || 22 ||

తాస్తు బ్రహ్మాణ మీశానం దేవాద్యాః పర్యుపాసతే | బ్రాహ్మణా ద్రవిణా విప్రాః క్షత్రియా శుష్మిణ స్తథా || || 23 ||

వారికి వాయుదేవుని సారూప్యము, సలోకత్వము తగినటువంటి సాధనము వలన లభించును. అక్కడి బ్రాహ్మణులు కపిలవర్ణము కలవారుగా, క్షత్రియులు ఎరుపు రంగుకలవారుగా నుందురు. (18)

ఆద్వీపమునందు వైశ్యులు పసుపుపచ్చని రంగుకలవారుగాను, శూద్రులు నల్లనివారుగాను ఉందరు. ఓ విప్రులారా! శాల్మల ద్వీపము యొక్క విస్తారమునకు రెండురెట్లుగా దానికిచుట్టుగా సురాసముద్రమును పరివేష్టించి కుశద్వీపము నిలిచియున్నది. అక్కడ విద్రుమము, హూమము, ద్యుతిమంతము మరియు పుష్పవంతము కుశేశయము, హరి, మందరము అను ఏడు పర్వతములు కలవు. మరియు ధూతపాప, శివ, పవిత్ర, సమ్మిత అనియును; విద్యుత్ప్రభ, రామ, మహానది అనుపేర్లుగల ఏడు నదులు కలవు. ద్విజులారా! ఇవికాక ఇతరములైన, నిర్మల జలములు కలిగిన వందలకొలది నదులు కూడ శుభములైనవి కలవు. (19, 20, 21, 22)

అక్కడ దేవతలు మొదలగు వారందరు ప్రభువైన బ్రహ్మదేవుని సేవింతురు. అక్కడి బ్రాహ్మణులు ద్రవిణులని, క్షత్రియులు శుష్ములు అనియును; (23)

వైశ్యా స్తోభాస్తు మన్దేహాః శూద్రా స్తత్ర ప్రకీర్తితాః | నరోపి జ్ఞానసమ్పన్నా మైత్ర్యాదిగుణసంయుతాః || || 24 ||

యథోక్తకారిణః సర్వే సర్వే భూతహితే రతాః | యజన్తి యజ్ఞై ర్వివిధై ర్బ్రహ్మాణం పరమేష్ఠితమ్‌ || || 25 ||

తేషాం చ బ్రహ్మసాయుజ్యం సారూప్య ఞ్చ సలోకతా | కుశద్వీపస్య విస్తారా ద్ద్విగుణన సమన్తతః || || 26 ||

క్రౌఞ్చద్వీపః స్థితో విప్రా వేష్టయిత్వా ఘృతోదధిమ్‌ | క్రౌఞ్చో వామనక శ్చైవ తృతీయ శ్చాధికారికః || || 27 ||

దేవాబ్ద శ్చ వివేదశ్చ పుణ్డరీక స్తథైవ చ | నామ్నా చ సప్తమః ప్రోక్తః పర్వతో దున్దుభిస్వనః || || 28 ||

గౌరీ కుముద్వతీ చైవ సన్ధ్యా రాత్రి ర్మనోజవా | కోభిశ్చ పుణ్డరీకాక్షా నద్యః ప్రాధాన్యతః స్మృతాః || || 29 ||

వైశ్యులు స్తోభులని, శూద్రులు మందేహులని పేర్కొనబడుచున్నారు. మనుష్యులందరు జ్ఞానముతో కూడినవారు, మైత్రి మొదలగు మంచి గుణములు కలవారై యుందురు. (24)

ప్రజలందరు చెప్పిన విధముగా చేయువారు, ప్రాణులకు మేలు చేయుట యందాసక్తి కలవారుగానుందురు. పరమేష్ఠియగు బ్రహ్మను నానా విధములైన యజ్ఞములతో పూజింతురు. (25)

అక్కడి జనులకు బ్రహ్మదేవుని సాయుజ్యము, సమానరూపము, సలోకత్వము సిద్ధించును. కుశద్వీపముయొక్క విస్తారమునకు రెండు రెట్ల పరిమాణముతో దానికి చుట్టు అన్నివైపుల; (26)

క్రౌంచద్వీపము, నేతి సముద్రమును పరివేష్టించి నెలకొనియున్నది. ఓ బ్రాహ్మణులారా! క్రౌంచము, వామనకము, ఆధికారికము అను పేర్లు కలవి; (27)

మరియు దేవాబ్దము, వివదేము, పుండరీకము, దుందుభిస్వనము అనుపేర్లతో ఏడుకుల పర్వతములు కలవు; (28)

గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, కోభి, పుండరీకాక్ష అను ఏడు నదులు ఆద్వీపములో ప్రధానముగా ప్రవహించుచున్నవి. (29)

పుష్కలాః పుష్కరా ధన్యా స్తిష్యా వర్ణాః క్రమేణవై | బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా శ్చైవ ద్విజోత్తమాః || || 30 ||

అర్చయన్తి మహాదేవం యజ్ఞదానశమాదిభిః | వ్రతోపవాసై ర్వివిధై ర్హోమైశ్చ పితృతర్పణౖః || || 31 ||

తేషాం వై రుద్రసాయుజ్యం సారూప్య ఞ్చాతిదుర్లభమ్‌ | సలోకతా చ సామీప్యం జాయతే తత్ర్పసాదతః || || 32 ||

క్రౌఞ్చద్వీపస్య విస్తారా ద్ద్విగుణన సమన్తతః | శాకద్వీపః స్థితో విప్రా ఆవేష్ట్య దధిసాగరమ్‌ || || 33 ||

ఉదయో రైవత శ్చైవ శ్యామఃకాష్ఠగిరిస్తథా | ఆమ్బికేయ స్తధా రమ్యః కేసరీ చేతి పర్వతాః || || 34 ||

సుకుమారీ కుమారీ చ నలినీ వేణుకా తథా | ఇక్షుకా ధేనుకా చైవ గభస్తి శ్చేతి నిమ్నగాః || || 35 ||

అక్కడి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనునాలుగు వర్ణములవారు క్రమముగా పుష్కలులు, పుష్కరులు, ధన్యులు, తిష్యులు అనుపేర్లతో వ్యవహరింపబడుదరు (30)

వారు యజ్ఞములచేత, దానముశమము మొదలగువానిచేత, వివిధములైన వ్రతములతో, ఉపవాసములతో, హోమములతో, పితృతర్పణములతో మహాదేవుని పూజింతురు. (31)

అక్కడివారికి, మిక్కిలి దుర్లభములైన శివసాయుజ్యము, సారూప్యము, సలోకత్వము, సమీపగమనము ఆదేవుని అనుగ్రహము వలన కలుగును. (32)

క్రౌంచద్వీపమునకు రెండు రెట్ల విస్తారముతో దానికి అన్నివైపుల దధిసముద్రమును పరివేష్టించి శాకద్వీపము నిలిచియున్నది. (33)

అక్కడ ఉదయము, రైవతము, శ్యామము, కాష్ఠము, ఆంబికేయము, రమ్యము,కేసరి అను పేర్లు గల పర్వతములుండును. (34)

సుకుమారి, కుమారి, నలిని, వేణుక, ఇక్షుక, ధేనుక, గభస్తి అనుపేర్లతో ఏడునదులు ప్రవహించుచుండును. (35)

ఆసాం పిబన్తః సలిలం జీవన్తే తత్ర మానవాః | అనామయా శ్చాశోకా శ్చ రాగద్వేషవివర్జితాః || || 36 ||

మృగాశ్చ మగధా శ్చైవ మానసా మన్దగా స్తథా | బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా శ్చాత్ర క్రమేణ తు || || 37 ||

యజన్తి సతతం దేవం సర్వలోకైకసాక్షిణమ్‌ | వ్రతోపవాసై ర్వివిధై ర్దేవదేవం దివాకరమ్‌ || || 38 ||

తేషాం వై సూర్యసాయుజ్యం సామీప్య ఞ్చ సరూపతా | సలోకతా చ విప్రేన్ద్రా జాయతే తత్ప్రసాదతః || || 39 ||

శాక ద్వీపం సమావృత్య క్షీరోదః సాగరః స్థితః | శ్వేతద్వీపం చ తన్మధ్యే నారాయణపరాయణాః || || 40 ||

తత్ర పుణ్యా జనపదా నానాశ్చర్యసమన్వితాః | శ్వేతా స్తత్ర నరా నిత్యం జాయన్తే విష్ణుతత్పరాః || || 41 ||

అక్కడ వసించు మనుష్యులు ఈనదులయొక్క నీటిని త్రాగుచు జీవింతురు. వారు రోగములులేక, దుఃఖములేక, రాగద్వేషములు విడిచిన వారెయుందురు. (36)

అక్కడి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు క్రమముగా మృగ, మగధ, మానస, మందగులు అనుపేర్లతో వ్యవహరింప బడుదురు. (37)

వారు సర్వలోకములకు ఏకమాత్రసాక్షియగు దేవుడైన సూర్యభగవానుని వివిధములైన వ్రతములతో, ఉపవాసములతో, ఎల్లప్పుడు పూజింతురు. (38)

ఓ బ్రాహ్మణులారా! వారికి సూర్యుని సాయుజ్యము, సామీప్యము, సమానరూపత్వము, సలోకత అనునవి ఆదేవుని అనుగ్రహము వలన లభించును. (39)

శాకద్వీపమును పరివేష్టించి క్షీరసముద్రము నెలకొనియున్నది. దానిమధ్యలో శ్వేతద్వీపమున్నది. అక్కడ నారాయణునియందు శ్రద్ధకలవి, (40) అనే కాశ్చర్యములతో కూడుకున్నవి, పుణ్యకరములైన జనపదములు కలవు. వానిలో తెల్లని నరులు విష్ణువునందు ఎల్లప్పుడు భక్తి కలవారై యుందురు. (41)

నాధయో వ్యాధయ స్తత్ర జరామృత్యుభయం న చ | క్రోధలోభవినిర్ముక్తా మాయామాత్సర్యవర్జితాః || || 42 ||

నిత్యపుష్టా నిరాతఙ్కా నిత్యానన్దా శ్చ భోగినః | నారాయణసమాః సర్వే నారాయణపరాయణాః || || 43 ||

కేచి ద్ధ్యానపరా నిత్యం యోగినః సంయతేన్ద్రియాః | కేచి జ్జపన్తి తప్యన్తి కేచి ద్విజ్ఞానినోపరే || || 44 ||

అన్యే నిర్బీజయోగేన బ్రహ్మభావేన భావితాః | ధ్యాయన్తి త త్పరం బ్రహ్మ వాసుదేవం సనాతనమ్‌ || || 45 ||

ఏకాన్తినో నిరాలమ్బా మహాభాగవతాః పరే | పశ్యన్తి తత్పరే బ్రహ్మ విష్ణ్వాఖ్యం తమసః పరమ్‌ || || 46 ||

అక్కడ రోగములు కాని, మనోబాధలుకాని ఉండవు. ముసలితనము, మరణము వలన భయములేదు. అచటి జనులు కోపము, లోభము లేనివారుగా, మాయలు, అసూయలు లేనివారుగా నుందురు. (42)

ఆ ద్వీపములోనివారు ఎల్లప్పుడు దృఢముగా, భయములేని వారుగా, నిత్యానందముకలవారై, సుఖపరులైయుందురు. అందరు నారాయణుని యందు ఆసక్తికలవారై, అతనితో సమానరూపులై యందురు. (43)

కొందరు ఇంద్రియములను నిగ్రహించి, యోగులుగా, ఎల్లప్పుడు ధ్యానపరులైయుందురు. మరికొందరు జపము, తపము చేయుదురు, ఇతరులు కొందరు విజ్ఞానవంతులైయుందురు. (44)

మరికొందరు బీజరహితమైన బ్రహ్మభావముతో తన్మయులై పరబ్రహ్మరూపుడైన, సనాతనుడగు వాసుదేవుని ధ్యానము చేయుచుందురు. (45)

కొందరు ఏకాంతవాసులై, ఆధారరహితులై, గొప్పభగవద్భక్తి పరిపూర్ణులై, తమస్సుకు అతీతమైన విష్ణువను పేరుకల ఆపరబ్రహ్మ స్వరూపమును దర్శింతురు. (46)

సర్వే చతుర్భుజాకారాః శంఖచక్రగదాధరాః | సుపీతవాససః సర్వే శ్రీవత్సాఙ్కితవక్షసః || || 47 ||

అన్యే మహేశ్వరపరా స్త్రిపుణ్ద్రాఙ్కితమస్తకాః | సుయోగా ద్భూతికరణా మహాగరుడవాహనాః || || 48 ||

సర్వే శక్తిసమాయుక్తా నిత్యానన్దాశ్చ నిర్మలాః | వసన్తి తత్ర పురుషా విష్ణో రన్తరచారిణః || || 49 ||

తత్ర నారాయణ స్యాన్య ద్దుర్గమం దురతిక్రమమ్‌ | నారాయణం నామ పురం ప్రాసాదై రుపశోభితమ్‌ || || 50 ||

హేమప్రాకారసంయుక్తం స్ఫాటికై ర్మణ్డపై ర్యుతమ్‌ | ప్రభాసహస్రకలిలం దురాధర్షం సుశోభనమ్‌ || || 51 ||

హర్మ్యప్రాసాదసంయుక్తం మహాట్టాలసమాకులమ్‌ | హేమగోపురసాహసై#్ర ర్నానా రత్నోపశోభితైః || || 52 ||

అందరు నాలుగు భుజములు ఆకారము కలవారు, శంఖము, చక్రము, గద అను ఆయుధాలను ధరించినవారు, మంచి పసుపు పచ్చని వస్త్రమును ధరించినవారు, శ్రీవత్సచిహ్నముతో కూడిన వక్షము కలవారుగానుందురు. (47)

ఇతరులు కొందరు మహేశ్వురుని యందుభక్తి కలవారై, మూడు పుండ్రములను తల యందు ధరించినవారై, మంచియోగ సంబంధము వలన భూతిని ధరించినవారుగా, గొప్ప గరుడుని వాహనముగా కలవారై యుందురు. (48)

అందరును శక్తితో కూడినవారు, ఎల్లప్పుడు ఆనందుముకలవారు, నిర్మలస్వభావులై, విష్ణువుయొక్క ఆంతరంగిక సంచారులుగా అక్కడ నివసింతురు. (49)

అక్కడ నారాయణుని యొక్క మరియొక పట్టణము, నారాయణనామధేయము కలది కలదు. అది ఇతరులకు పొందరానిది. శత్రువులచే దాటరానిది, ప్రాసాదములతో ప్రకాశించునదిగా ఉండును. (50)

ఆ పట్టణము బంగారు ప్రాకారములతో కూడినది, స్ఫటికమణుల మండపములు కలిగినది, వేలకొలది కాంతికిరణ శోభితము, ఇతరులకు ఎదుర్కొనరానిది, మిక్కిలి అందమైనది, మేడలు, భవనాలతో కూడినది, పెద్దవైన పైభాగపు గదులు కలది, వేలసంఖ్యలో గోపురములు కలది అనేకమణులతో ప్రకాశించునదిగా ఉండును. (51, 52)

శుభ్రాస్తరణసంయుక్తై ర్విచిత్రైః సమలంకృతమ్‌ | నన్దనై ర్వివిధాకారైః స్రవన్తీభి శ్చ శోభితమ్‌ || || 53 ||

సరోభిః సర్వతోయుక్తం వీణావేణునినాదితమ్‌ | పతాకాభి ర్విచిత్రాభి రనేకాభి శ్చ శోభితమ్‌ || || 54 ||

వీధిభిః సర్వతోయుక్తం సోపానై రత్నభూషితైః | నదీశతసహస్రాఢ్యం దివ్యగాననినాదితమ్‌ || || 55 ||

హంసకారణ్డవాకీర్ణం చక్రవాకోపశోభితమ్‌ | చాతుర్ద్వార మనౌపమ్య మగమ్యం దేవవిద్విషామ్‌ || || 56 ||

తత్ర తత్రాప్సరఃసంఘై ర్నృత్యద్భి రుపశోభితమ్‌ | నానాగీతవిధానజ్ఞై ర్దేవానా మపి దుర్లభైః || || 57 ||

నానావిలాససమ్పన్నైః కాముకై రతికోమలైః | ప్రభూతచన్ద్రవదనై ర్నూపురారావసంయుతైః || || 58 ||

స్వచ్ఛములైన పరచబడిన ఆసనములతోకూడిన, విచిత్రములైన గోపురములచే అలంకరించబడినది, వివిధములైన ఆకారములు గల నందనవనములతో, నదులతోగూడ ప్రకాశించునదిగా ఉండును. (53)

కొలనులతో అంతట కూడియున్నది, వీణ, వేణువు అనువాద్యములతో ప్రతిధ్వనించునది, అనేకములైన విచిత్రములైన పతాకములతో శోభించుచుండును. (54)

మణులచే అలంకరించబడిన సోపానములతో ఇండ్లవరుసలతో అంత కూడియున్నది, వందల, వేల, నదులతో కూడి, దివ్యమైనగానముతో ధ్వనించునదిగా అది ఒప్పుచుండును. (55)

హంసలు, కన్నెలేడిపిట్టలతో నిండియున్నది, చక్రవాక పక్షులతో ఒప్పుచున్నది, నాలుగు ద్వారములు కలది, సాటిలేనిది, రాక్షసులకు చేరశక్యము కానిదిగా ఆ పట్టణముండును. (56)

అచ్చటచ్చట నృత్యము చేయుచున్న అప్సరసలతో కూడినది, అనేకములైన గీత విధానములు తెలిసిన, దేవతలకు గూడ పొందుటకు శక్యముకానివి, అనేక విలాసములతో నిండినవి, మిక్కిలి సుకుమారులైన కాముకులతో, చంద్రునివంటి ముఖము కలిగిన, నూపురములయొక్క ధ్వనులతో కూడిన అప్సరసల సమూహము నృత్యము చేయుచుండును. (57, 58)

ఈషత్స్మితైః సుబిమ్బోష్ఠై ర్బాలముగ్ధమృగేక్షణౖః | అశేషవిభవోపేతై స్తనుమధ్యవిభూతైః || || 59 ||

సురాజహంసచలనైః సువేషై ర్మధురస్వనైః | సంలాపాలాపకుశ##లై ర్దివ్యారణభూషితైః || || 60 ||

స్తనభారవినమ్రై శ్చ మదుఘూర్ణితలోచనైః | నానావర్ణ విచిత్రాంగై ర్ననాభోగరతిప్రియైః || || 61 ||

ఉత్ఫుల్లకుసుమోద్యానై స్తద్భూత శతశోభితమ్‌ | అసంఖ్యేయగుణం శుద్ధ మంసఖ్యై స్త్రిదశై రపి || || 62 ||

శ్రీమ త్పవిత్రం దేవస్య శ్రీపతే రమితౌజసః | తస్య మధ్యేతి తేజస్క ముద్యత్ర్పాకారతోరణమ్‌ || || 63 ||

స్థానం త ద్వైష్ణవం దివ్యం యోగినాం సిద్ధిదాయకమ్‌ | తన్మధ్యే భగవా నేకః పుణ్డరీకదలద్యుతిః || || 64 ||

చిరునవ్వుకలవారు, చక్కనిదొండపండు వంటి పెదవులుకలవారు, అమాయకమైన లేడిపిల్లల కన్నులవంటి చూపులుకలవారు, సంపూర్ణ వైభవముతో కూడినవారు, సన్ననినడుముతో అలంకరించబడినవారు, మంచిరాజహంసలనడకవంటి నడకగలవారు, చక్కనివేషము ధరించినవారు, కమ్మని కంఠస్వరముకలవారు, చమత్కార సంభాషణ యందు నేర్పరులు, శ్రేష్ఠమైన ఆభరణములచేత అలంకరింపబడినవారు ఆ అప్సరసలు. (59, 60)

కుచములబరువుచేత వంగినవారు, మద్యపానముచేత మత్తెక్కి తిరుగుచున్న కన్నులుకలవారు, అనేక వర్ణములతో చిత్రములైన అవయవములు కలవారు, అనేక సుఖములయందు, రతిక్రీడల యందు ప్రీతి కలవారు అగు అప్సరసల గుంపుతో కూడియుండును ఆనారాయణపురము (61)

వికసించినపూలుగల తోటలతో, ఆపురము వందలకొలది భూతగణముతోకూడినది, లెక్కపెట్టరాని గుణములు కలది, నిర్మలమైనది, లెక్కలేనంతమంది దేవతలతోకూడినది, సంపదకలది, అమితమైన బలముకల లక్ష్మీపతియగు నారాయణదేవుని పవిత్రమైనది ఆ పట్టణము దానిమధ్యలో, మిక్కిలి తేజస్సుకలది, ఎత్తైన ప్రాకారములు, తోరణములుకలది, యోగులకు సిద్ధిని కలిగించునది అగు దివ్యమైన శ్రీవిష్ణువు యొక్క స్థానమున్నది. దాని మధ్యబాగమున తామరరేకుల వంటి కాంతిగలభగవంతుడు ఒంటరిగా, (62, 63, 64)

శేతే శేషజగత్సూతిః శేషాహిశయనే హరిః | విచిన్త్యమానో యోగీన్ద్రైః సనన్దనపురోగమైః || || 65 ||

స్వాత్మానన్దామృతం పీత్వా పురస్తా త్తమసః పరః | పీతవాసా విశాలాక్షో మహామాయో మహాభుజః || || 66 ||

క్షీరోదకన్యయా నిత్యం గృహీతచరణద్వయః | సా చ దేవీ జగద్వన్ద్యా పాదమూలే హరిప్రియా || || 67 ||

సమాస్తే తన్మనా నిత్యం పీత్వా నారాయణామృతమ్‌ | న తత్రా ధార్మికా యాన్తి నచ దేవాన్తరాలయాః || || 68 ||

వైకుణ్ఠం నామ తత్‌ స్థానం త్రిదశై రపి వన్దితమ్‌ | న మే ప్రభవతి ప్రజ్ఞా కృత్స్నశాస్త్రనిరూపణ || || 69 ||

శయనించి యుండును. సమస్తలోకములకు కారణభూతుడైన ఆ విష్ణువు, సనందనుడు మొదలుగా కల యోగీంద్రులచేత ధ్యానింపబడు చున్నవాడై శేషశయ్యమీద నిద్రించును. (65)

తనయొక్క ఆత్మానందమను అమృతమును పానముచేసి, తమస్సుకు అతీతుడుగా, పచ్చని వస్త్రము ధరించి, విశాలమైన వక్షము కలవాడుగా, గొప్పమాయలు, గొప్పభుజములు కలవాడై ఎదురుగా కన్పించును. (66)

ఆహరి క్షీరసముద్రుని పుత్రికయగు లక్ష్మిచేత ఎల్లప్పుడు గ్రహించబడిన పాదద్వయముకలవాడై యుండును. లోకములచే పూజింపబడు ఆదేవికూడ, హరికి ప్రియురాలై పాదమూల ప్రదేశములో వసించును. ఎల్లప్పుడు హరియందే మనస్సుకలదై, నారాయణనామమను అమృతమును ఆస్వాదించుచు ఆశ్రయించి యుండును. అక్కడికి అధర్మవర్తనులు చేరలేదు. అక్కడ ఇతరదేవతల మందిరములు లేవు (67, 68)

ఆస్థానము వైకుంఠమనుపేరుకలది, అది దేవతలచేత నమస్కరింపబడినది. శాస్త్రములయందు వర్ణింపబడిన దాని మహత్త్వమును సంపూర్ణముగా ప్రతిపాదించుటకు నాబుద్ధి చాలదు. (69)

ఏతావ చ్ఛక్యతే వక్తుం నారాయణపురం హి తత్‌ | స ఏవ పరమం బ్రహ్మ వాసుదేవః సనాతనః || || 70 ||

శేతే నారాయణః శ్రీమాన్మాయయా మోహయ ఞ్జగత్‌ | నారాయణా దిదం జాతం తస్మి న్నేవ వ్యవస్థితమ్‌ || || 71 ||

త మాశ్రయతి కాలాన్తే స ఏవ పరమా గతిః ||

ఇతి శ్రీకూర్మపురాణ భువనవిన్యాసోనామైకోన పఞ్చాశోధ్యాయః

అదినారాయణుని పురము అని ఇంతవరకు మాత్రము చెప్పుటకు శక్తుడను. ఆనారాయణుడే పరబ్రహ్మరూపుడైన సనాతన పురుషుడగు వాసుదేవుడు. (70)

శ్రీమంతుడగు ఆనారాయణుడు తనమాయచేత లోకమును మోహింపజేయుచు శయనించి యుండును. ఈ విశ్వమంతయు నారాయణుని వలన పుట్టినది. అతనియందేనిలిచియున్నది. ప్రళయకాలములో మరల అతనినే ఆశ్రయించును. ఆనారాయణుడే పరమగమ్యము. (71)

శ్రీ కూర్మపురాణములో భువనవిన్యాసమనబడు నలుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters